‘పూలపరిమళం’లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన అణచివేతకు, పీడనకు గురవుతున్న బాల్యాన్ని, యవ్వనాన్ని చవిచూసాడు. ఆయనకు బతుకు చేదుఫలమే. అందుకే ఆయన ఉద్యమజీవి అయ్యాడు. ఈ ఉద్యమ జీవికి ఒక రెండు మూడు వందల సంవత్సరాల జీవిత వారసత్వం ఉన్నది. ఆయనే రాసుకున్న ‘కవి పరిచయం’ ఒక విధంగా ఆయన కవిత్వానికి జీవిత, ఉద్యమమే నేపథ్యం. ఈ దేశంలో ఈస్టిండియా కంపెనీరాక, మిల్లు బట్టలరాకతో దాడికి, విధ్వంసానికి గురయినవి మగ్గాలు. చేనేత జీవితాలు తెలంగాణలో అప్పటి అవిభక్త నల్లగొండ జిల్లా ఇప్పటి జనగామ జిల్లాలో పుట్టిన తండ్రి సోమనాథంకు పదెకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ వ్యవసాయం తాత కాలానికే అంతరించింది. చేనేత మగ్గం బతుకు కొన్నాళ్లు, టైలరింగు మరికొన్నాళ్లు చిన్నచితకా వ్యాపారాలన్నీ బతుకు మరింత చితికిపోవడానికి సహకరించాయి. తల్లి బీడీ కార్మికురాలుగా పడరాని పాట్లు పడింది. అంతెందుకు కవి ‘ఇంటి పాడి బర్లకు స్వయంగా పాలబుగ్గల పసుల కాపరయ్యాడు.

నిజానికి నిజాం రాష్ట్రం ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనలో లేదు. కానీ నిజాము దేశంలోకెల్లా పెద్ద బ్రిటిష్ తొత్తుగా పాలించాడు. చేనేత కార్మికులు డిబిఆర్ మిల్లు (హైదరాబాద్), అజంజాహి మిల్లు, సిర్పూర్ (కాగజ్ నగర్) వంటి మిల్లుల్లో ఉపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. అంతేకాదు మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, బొంబాయిలకు వలసపోవాల్సి వచ్చింది. వ్యవసాయం, వ్యవసాయ వృత్తులు ధ్వంసం చేయడంతో ప్రారంభమైన కంపెనీ విధ్వంసపూర్వక అభివృద్ధి నమూన 1941లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో తన గతితార్కిక చారిత్రక గమ్యానికి చేరుకున్నది. ‘ప్రతిభాశాలి’ కవితలో కవి చారిత్రక పరిణామాన్నంతా ఎంతో ప్రతిభాత్మకంగా, కవితాత్మకంగా చిత్రించాడు.

“గాలి తిని గంగ తీర్థమయిన అలివేలు మంగ తమ్ముడు” పద్మశాలీ జీవితం. “నీ జెండాకు బట్టిచ్చి గద్దెనెక్కించి బతికుండగానే బొందల వడ్డడు.

‘పద్మశాలీ కాదయా ప్రతిభాశాలి’ (అంటే పద్మశాలి అయితే ప్రతిభాశాలి కాగలడనే కఠోర కుల దృష్టి ఉంది ఇందులో) అని బ్యాండుకొట్టి నా ఫోటువకు దండెస్తివిరా’ అని చాలా నిష్ఠూర సత్యం రాస్తాడు. కుమారస్వామి మూలాల్లో ఈ చీకటి బతుకుల చిత్రమే కాదు ఉజ్వలమైన జనగామ ప్రజల వీరోచిత పోరాట గాథలు కూడ ఉన్నాయి. అవి ఆయన చైతన్యంలో భాగం కావడానికన్నా ముందే తల్లిదండ్రుల ద్వారా ఆయన ఉద్యమ జీవియై మొదట తెలంగాణ విద్యావంతుల వేదికలో పదేళ్లు పని చేసాడు. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడినాక ప్రభుత్వం ప్రజల దగ్గరికి పాలన పేరుతో, ప్రజాస్వామికీకరణ పేరుతో, ప్రజల మీద నిఘా కోసం, నియంత్రణ కోసం రాజ్యంగ యంత్రాన్ని విస్తరించే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించడానికి పూనుకున్నపుడు, న్యాయంగానే జనగామ జిల్లా చేయాలనే ప్రజల చిరకాల వాంఛ ముందుకు వచ్చింది.

జనగామ, నల్లగొండ జిల్లాలో భాగంగా ఉన్నపుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సూర్యపేటతో పాటు గుండెకాయగా ఉన్నది. నిండు చూపునిచ్చింది. కుందుర్తి ‘తెలంగాణ’ కావ్యానికి సూర్యాపేట కేంద్రంగా చేసుకొని, సూర్యాపేటలో పోరాటం సూర్యాదయమైందంటాడు. ఐనా తెలంగాణలో ప్రతీ ఊరు సూర్యోదయమైన సూర్యాపేటనే అంటాడు. ఐతే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో బోనగరి ‘ఆంధ్రమహాసభ’ (1994) తర్వాత ప్రజ్వరిల్లిన రైతాంగ పోరాటం జనగామ ఫ్యూడల్ భూస్వామ్య శక్తులకు ప్రతీకగా మారిన విస్నూరు రామచంద్రా రెడ్డిపై దండెత్తడంతో ప్రారంభమైంది. ఆ చరిత్రనంతా పోరాట నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘జనగామ ప్రజల వీరోచిత పోరాట చరిత్ర’ గా వెలువరించారు. మనకు ఇతని సన్నిహితుడిగా కడవెండిలో పుట్టి పెరిగి, అక్కడ పోరాటాన్ని నిర్మించి, రెండు ఉరిశిక్షలు పడి, జైలు నుంచి తప్పించుకొని షోలాపూర్ వెళ్లి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ చర్య తర్వాత తిరిగి వచ్చిన నల్లా నర్సింహులు తన ఆత్మకథలో వర్ణించాడు. కవి ‘మాయిముంత’లో అవన్నీ గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. ‘విసునూరు దొర చెరపట్టిన భూదేవిని విముక్తి చేసిన బందగీ బాత్ కర్నొ, మట్టంటే మనుషులు, పోరువసంతంలో వానకోయిల మీద కుట్రేలరా భూవేటగాడా? కేవలం ఇది భౌగోళిక జనగామ జిల్లా కోసమే కాదు, రియల్ ఎస్టేటు దృష్టి కూడా జిల్లాల నిర్మాణంలో (యాదాద్రి జిల్లాలో వలె) ఉందని చెప్పడానికి భూవేటగాడు వానకోయిల మీద కుట్ర చేస్తున్నదంటాడు.

జనగామ జిల్లా కోసం ఉద్యమమే అనే ఎరుక కవికి ఉన్నది. దాని పోరాట అంశాన్ని అందులో యిమిడి ఉన్న పోరాట చైతన్యాన్ని పదును పెట్టాలనేది కవి ఆకాంక్ష. ‘పోరుకు చనుబాలు తాపి సచ్చి బతికిన వాణ్ణి, చాకలి ఐలమ్మ గుండె అస్తిత్వం బొండిగ పిసుకుడేంది, సవుడు రాసి మైలపోలు దీత్తం’ అని చరిత్ర వివరాల్లోకి పోతాడు. జానమ్మను ఎదరించిన గుతుపను అన్నచోట విసునూరి దొర తల్లి తనను దొరసాని అనికాదు, దొర అని పిలవాలని పితృస్వామ్యం మూర్తిభవించిన జానమ్మ ప్రస్తావన ఉంది. అమెను, అటువంటి దోపిడీదార్లను ప్రతిఘటించడానికి ఏర్పడిన గుతుపల సంఘం కనిపిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ భూమి లేని పేదలను, వ్యవసాయ కూలీలను సంఘటితపరిచి పోరాటానికి సిద్ధపరిచిన రోజుల్లో వారిని ఆ పేరుతో పిలిచేవాళ్లు. తెలంగాణ రైతాంగ పోరాటపు పిలుపుకీ కారణమైన దొడ్డి కొమరయ్య అమరత్వం స్టాలిన్ నే కదిలించిదంటారు 2016లో రాసిన ఈ కవితలో ‘త్యాగాలను కడువలో నింపుకున్న కడవెండిని కాలరాస్తే మట్టి కప్పుతాం’ అన్న పంక్తుల్లో కవి దొడ్డి కొమరయ్య మొదలు నల్లా నర్సింహులు దాకా మాత్రమే కాదు ఆ పోరాటాన్ని నక్సల్బరీ వెలుగులో జనతన రాజ్యాల వైపు మరలించిన ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఇది నేనేదో ఊహించి చెపుతున్నది కాదు ఆయన మొట్టమొదటి కవిత కారటు(సెప్టెంబరు, 2000)లో అమ్మను సంబోధిస్తూ క్యాంపస్లో తన చదువు గురించి చెప్తాడు. అది ఎంతో శక్తివంతమైన కవిత. క్యాంపస్లో మానవ మృగాలు సంచరిస్తున్నాయని చెప్తాడు. తన సోపతిగాళ్లు వాళ్లను ప్రతిఘటించడానికే గంపకింది కోడి పిల్లల్లా ఏ రాత్రో, ఏ ఉదయమో అదృశ్యమవుతున్నారని అంటాడు. ‘అక్కడ శ్రీను, స్వామి ఊరొదిలినట్లే ఇక్కడ రమణ, ఎల్లయ్య, రాము ఎందుకెళ్లిపోయిన్రో మొన్ననే తెలిసింది’ అంటాడు.

‘అమ్మా! విద్యారణ్యం నుంచి మృగాల్ని వేటాడటానికి నాకు తోడుగా మహేష్ నో, రంగవల్లినో పంపించు. మహేశ్ విప్లవోద్యమంలో ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పేరని ఇప్పుడందరికీ తెలుసు. రంగవల్లి గురించి చెప్పనక్కరలేదు గదా! అస్తిత్వ భావన అస్తిత్వ ఉద్యమాలతోటే కుమారస్వామి పెరిగాడు. అయినా ఆయన 1972లో పుట్టేనాటికి దేశంలో నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు సెట్ బ్యాక్ కు గురయినా నక్సల్బరీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పంథాగానే కాదు ప్రజా జీవన భవిష్యత్ ఆకాంక్షగా నూతన ప్రజాస్వామిక ఆచరణగా కూడా రూపొందింది. 1972 శ్రీకాకుళంలో రాజారాంరెడ్డి ఆఖరి దళం కూడా అమరత్వాన్ని పొందిన సంవత్సరం. కానీ ఈ నక్సల్బరీ శ్రీకాకుళ చరిత్ర రచించడానికీ, గానం చేయడానికీ, తమ సాంస్కృతిక ఆచరణగా మార్చుకోవడానికి విప్లవ రచయితల సంఘం ఏర్పడి అప్పటికి రెండేళ్లయింది. అది విద్యార్థి, యువజనుల మీద ముఖ్యంగా క్యాంపస్ లో బలమైన ప్రభావాన్ని వేసింది. కుమారస్వామి పుట్టడానికి కేవలం రెండు నెలల ముందే 14, ఏప్రిల్ 1972న ఉస్మానియా క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ మెట్లపై ఆయన ‘కారటు’లో ప్రస్తావించిన మృగాళ్లు జార్జిరెడ్డిని చంపేసారు. ఆయన విద్యార్థి, మేధావి, శాస్త్రజ్ఞుడు. అయితే ఆయన అమరత్వం వృధా కాలేదు. ఆయన సంస్మరణ సభలో ఆయన అనుచరుడు శ్రీనాథరెడ్డి చెప్పినట్లు అక్కడ చరిత్ర మొదలయింది. ఇంకా విశ్లేషిస్తే అది 1966 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో వరంగల్ రీజినల్ ఇంజనీరింగు కాలేజీలో ప్రారంభమయింది. ఆ ఉద్యమ విప్లవ మలుపులు రాడికల్ విద్యార్థిగా సూరపనేని జనార్దన్ వచ్చాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు సహచరులను ఎమర్జెన్సీలో గిరాయిపల్లిలో ఎన్ కౌంటర్ చేశారు.

‘1982లో (అంటే కుమారస్వామి పదోయేట) నవాబుపేట, వడ్డిచర్ల గ్రామాల ఇళ్ల గోడల మీద ‘దున్నేవాడికే భూమి’ నినాదాలతో వేడెక్కుతున్న సంఘటనలు చెవిన పడేవి. దొరలు, పెత్తందార్లను యువకులు ప్రశ్నించడం మొదలయింది.’ అంటే 1974 అక్టోబరులో ఏర్పడిన రాడికల్ విద్యార్థి సంఘం 1975 ఏప్రిల్ లో మహాసభలు జరుపుకుని ఎమర్జెన్సీలతో గ్రామాలలో ప్రజల మధ్య పనిచేసి 1978 ఫిబ్రవరి వరంగల్ రెండో మహాసభల తర్వాత ‘గ్రామాలకు తరలండి’ పిలుపు ఇచ్చిన ప్రభావమది. 1978 మేలో ఏర్పడిన రాడికల్ యువజన సంఘంతో కలిసి గ్రామాలకు వెళ్లి రైతుకూలీ సంఘాలు ఏర్పాటు చేసిగానీ, అప్పటికే ఏర్పడిన రైతుకూలీ సంఘాలతో కలిసిగాని భూస్వాధీన పోరాటాలకు పిలుపు ఇచ్చి పూనుకున్న రోజులు. అప్పటికీ బాలుడే అయిన కుమారస్వామి ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ బాల్యం మీది ప్రభావాలు చాలా గాఢమైనవి. ఒక పక్క ఇవి జరుగుతూవుంటే నెల్లుట్లలో చదువుతూ గ్రామ గ్రంథాలయానికి వెళ్లి వేమన పద్యాలను, శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని తొలిసారిగా చదివాడు. ఆయన 1990లలో జనగామలో తొలిసారిగా ఒక భారీసభ చూశాడు. అది వరంగల్ లో 1990 మే 5,6న జరిగిన రైతు కూలీ సంఘం మహాసభలు 14 లక్షల జనసందోహలో భాగం. ఉద్యమపాటలు, మాటలేకాదు, విజ్ఞప్తులు ఇవ్వడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఆలోచన రగిలించింది. ఊర్లన్నీ ప్రజా ఉద్యమ కేంద్రాలయ్యాయి. ఆయన ప్రవేశం మాత్రం మండల రిజర్వేషన్ అనుకూల ఉద్యమం మద్దతుతో ప్రారంభమయింది. 1997 ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు, మహాసభల నాటికి ఆయన 25 ఏళ్ల నవ యువకుడు. యింకక్కడి నుంచి ప్రత్యేక తెలంగాణ సోయి, ఈ విప్లవ అవగాహనతో ఉపచేతనలో భాగంగా ఆయనను ముప్పిరిగొన్నాయి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రతీ కవీ, రచయితగా రాసినట్లే ఆయన తన ఊరు వడ్డిచర్ల మీద కూడా కవిత రాసాడు. విస్తృతి భయం లేకపోతే యిందులోగానీ, ‘మాయిముంత’లో గానీ యిటువంటి ఊరి మీద, తెలంగాణ మీద రాసిన కవితల్లోగానీ తెలంగాణ భాష, నుడికారాలు, జీవిత చిత్రణ అద్భుతంగా వుంటుంది. “బొడ్డు పేగు మొలిచిన నా ఊరు ఒడ్డుచెర్ల సబ్బండ వర్ణాల ఆదెరువు, తడారిన కాలం గొంతుక దూపతీర్చే పంట నీళ్ల పటువ” ఈ అస్తిత్వ వాస్తవికథ వెనుక ఒక అంతస్సూత్రం వంటి విప్లవ అవగాహన వుంటుంది. విప్లవోద్యమం పట్ల గురి వుంటుంది. “దోస్తుల బతుకుదారుల్లో వీడ్కోలు పలికి శత్రువును కనిపెట్టే చెరువు కట్టకాడి మర్రిమాను అలుపెరగని మహాసెంట్రి”. ఆ వూరు నుంచి దోస్తులు బతుకుదారుల్లో పోయిన వాళ్లు కాదు. పోరాటదారుల్లో పోయినవాళ్లు. మిత్రుడు శ్రీనివాస్ ద్వారా ఓయూ క్యాంపస్లో పీజీ ఎంట్రెన్స్ పరీక్షలు రాసి అరుణతార రెగ్యులర్ గా చదవడం ప్రారంభించిన కుమారస్వామి తండ్రి చనిపోవడంతో మళ్లీ జనగామకు రావాల్సి వచ్చింది. జనగామ ఈనాడు పాత్రికేయుడిగా పనిచేస్తూ సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకున్నాడు. 2000ల్లో మళ్లీ ఓయూ క్యాంపస్లో చేరి తెలుగు ఎం.ఏ పూర్తి చేశాడు. సాహిత్య సభలకు హాజరయ్యేవాడు. తెలుగు విశ్వవిద్యాలయాన్నించి “శ్రీశ్రీ కవిత్వం ప్రాచ్య పాశ్చాత్య ప్రభావాలు” మీద ఎం.ఫిల్ చేశాడు. ఈ ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథంతోనే నాకు కుమారస్వామి పరిచయమయ్యాడు. ఈనాడు పాత్రికేయుడిగా కూడా తెలుసు. ఆయన ఎం.ఫిల్, చేయడమే కాకుండా బీఈడి, ఎం. ఈడీ కూడా చేయడం వల్ల ముఖ్యంగా ఈనాడు పత్రికకు పంపే పొదుపరితనం వల్ల ఆయన కవిత్వ రచనలో కూడా ఒక మెథడ్ వుంటుంది. ఒక పద్దతీ అనండి. విధాపం అనండి, సంవిధానం అనండీ ఏ కవిత ఒక పేజీని మించి వుండదు. ఒకే ఒక్క కవిత రెండు పేజీలు ఉన్నది. ఈ కవిత్వంలో చాలా వైవిధ్యం, తాత్వికత, ఆగ్రహం వున్నది. తెలంగాణ అస్తిత్వ కవిత్వంలో దూకుడు ఒక్కచోట కొంచెం మితిమించిన పరుష భాషా వున్నది. కాని కవి ప్రధానంగా ప్రపంచీకరణ నేపథ్యంలో పూర్తిగా పరాయికరణ పొంది శకలాలయిపోయిన మనిషి కోసం అన్వేషణ వుంటుంది. ‘మనిషి ఒకపాట’ ఒక అద్భుతమైన కవిత పూర్తిగా ఉదహరించాలనిపిస్తున్నది. ఇది నిజానికి ఈ కవితా సంకలనానికి పేరు కాదగిన కవిత.

“రాత్రి ఒక మరణం, ఉదయమొక జననం, పొద్దస్తమానమే ఓ జీవితం. చావుకీ బతుక్కీ మధ్య గీసుకున్న సరిహద్దు గీతను చెరిపేస్తే మనిషోక సజీవ శిలాజం, కనుపాప కదలికకు కనుగుడ్డు ఓడుతున్న తడిధారను తుడిచేస్తే విశ్వమంతా కటిక చీకటి, చీకటి బతుకులో వెన్నెల కోసం కదిలే ఆచరణకు, ఆశయానికి మధ్య నమ్మకమనే అదృశ్య రేఖను కాలరాస్తే జనించేది విద్రోహమే. మనం మనమయి బ్రతికే ఊరికీ శ్మశానానికి బరిగీసిన దింపుడు గళం ఎత్తేస్తే పల్లెబతుకంగా బెగ్గంపాడె. మనిషికి మనిషికీ మనసు, మనస్సుకు కలిపే జనపదాల మాటలను నిషేధిస్తే ప్రపంచమొక కంప్యూటర్ రోబోట్ అని తాత్విక స్థాయిలో రాయగలడు. “కొక్కొరకో… చికెన్ వేపుడయి, కుక్కర్ కూతతో శిశువు మేల్కలుపు, కేబుల్ టివి నుంచి సూర్యోదయం వీక్షణం, అమ్మ ఒడిలోంచి పాలసీసా కోసం పసికన్నుల వేట” (నెలబాలుడు) వంటి ఆధునిక దృక్పథాన్ని కళ్లకు కట్టగలడు. శ్రీశ్రీ “మనుసున మనసై తనువున తనువై, తోడకరున్నా అదే భాగ్యమో అదే స్వర్గమో” అన్నాడు. కాళోజీ “నేను యింకా మేములోకి రాలేదు మనంలోకి ఎప్పుడోస్తాం” అన్నాడు. ఈ కవి మాత్రం తన తొలి కవిత చరణాల్లోనే (కలం కలలు) ‘నేన్నే’ను ధ్వంసమై దగ్ధమయ్యేంత వరకు చీకటిని చీల్చే కిరణాల కోసం రాస్తూనే ఉంటా, కలం కలలకు పహారా కాస్తూనే ఉంటానంటాడు. దండకారణ్యం సుకుమా జిల్లా ఎస్.పి.ని ఒక రిపోర్టర్ ఇక్కడి విప్లవోద్యమాన్నించి ప్రజల్ని దూరం చేయాలంటే అణచివేత కాకుండా ఇంకేం చేయగలరని మీరనుకుంటున్నారు అని అడిగితే, ఆ పదవిలోకి రాకముందు జె.ఎన్.యు విద్యార్థి అయిన ఆ పోలీసు అధికారి వీళ్లకు స్వార్థం నేర్పాలి అన్నాడట.

“దోస్త్” అనే కవిత బహుశా ఎన్కౌంటర్లో అమరులయిన ఒక సాంస్కృతిక కళాకారుని గురించి అయ్యుంటుంది. “కనుపాప చాటున కదలాడిన నీ తస్వీర్, సాపిన దోసిళ్ల నుంచి కన్నీటి చుక్కవయి జారిపోయ్యావు, రేపటి సూర్యునికి చెప్పడానికి కొన్ని యాదంటే చాలు, కల నీ కాలు గొలుసు గజ్జెలో చేరి మూగ పోలేదా, కరువు దూపతో ఏ పొలమో తాగొచ్చు, మనిషంటే విశ్వవిఫణిలో ఎగరేసిన నాణెం కాదనీ, మానవత్వంతో జీవించాలనే ఆశయమని’ రాజ్యానికి సవాలు విసరమంటాడు. ‘ఒక్కమాట’ ఎంతో అర్ఖంగా వుంటుందో, అంతే విశ్వాసాన్నిచ్చేదిగా వుంటుంది. “పాల తడారని పెదవి నవ్వులతో మాట్లాడాలి, మృత్యువు ఒడి చేరుతూ అలసిన కనుపాపతో మాట్లాడాలి. అసత్యం సత్యమయి ఊరేగుతున్నపుడు మాట్లాడాలి, ప్రేమ కనుల జలపాతంతో మునివేళ్ళు మాట్లాడాలి, మనిషి శ్వాసయై మాట్లాడాలి, మానవీయ ధర్మంగా మాట్లాడాలి, సముద్రం నిశ్శబ్దమైనపుడు చిరుగాలి సంగీతమై మాట్లాడాలి…మనోక్షరమై మాట్లాడాలి, మాట్లాడటం నేరం కాదు, మాట్లాడటం నిషేధమైనపుడు మరోసారి మాట్లాడాలి, చూపును నరికేసిన తావులో చివురించి మాట్లాడాలి, కలవడం తప్పయిన జాగలో కలిసిమెలిసి మాట్లాడాలి, నువ్వు నేనై నేను నువ్వై యుగళ గీతమై మాట్లాడాలి, శబ్దం నిశ్శబ్దమైనపుడు చిరునవ్వు మాట్లాడాలి, గుండె పటువ కన్నీటి నెత్తురు బరువైనపుడు సుట్ట కుదురై మాట్లాడాలి, గుండె దరువుకు దరువేసిన డోలక్ దయాలా మాట్లాడాలి, విచిత్రమేమంటే ఈ కవిత సోదరిసోదర అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండగ రాత్రి రాశాడు. చాలా ప్రతీకలతో దోస్తీ, అశ్రుగీత, ఓ చెమ్మ, వంటి కవితలు ఎన్‌కౌంటర్లో అమరులైన వారి గురించి రాశాడు. ‘చెమటోడ్చని తనువు, చెలించని మనసు, చెమ్మగిల్లని నయనం, చీకటి తాకని జీవితం అసలెక్కడుంది? ఏడుస్తున్నావెందుకని ప్రశ్న, కళ్లు, చెక్కిలిని ఏకం చేసిన అశ్రుధార… కుంభవృష్టి మిగిల్చిన ప్రశాంత మనస్సు ఉషస్సు జనిస్తుందని, ప్రత్యూష ప్రభవిస్తుందని ప్రతీరాత్రి నిరీక్షణ”(ఓ చెమ్మ), ‘కలకందాం’ అనే కవితలో విచిత్రంగా అల్లూరి, ఆజాద్లను మళ్లీ ఇవ్వమని బుద్ధుడితో కలిసి గొప్ప కలకందాం అంటాడు.

మొదటి ఇద్దరూ విప్లవకారులు సాయుధ పోరాటంలో విశ్వాసం ఉన్నవాళ్లు. రహస్య అజ్ఞాత జీవితంలో, బుద్ధుడు అహింస, ప్రేమ, కరుణ ప్రభోదించినవాడు, కాకపోతే ముగ్గిరి స్వాప్నిక ప్రపంచం పీడన, దు:ఖం లేనిదే. మట్టి స్వభావాన్ని వ్యవసాయ విప్లవంతో అన్వయించి మట్టి అనే కవితలో చెప్తాడు. మట్టిని మట్టి స్పర్శిస్తే గుండెలోంచి పుట్టుకొచ్చే కడివెడు నీళ్ళు, కర్రు కదిలితే కలల్ని పండించే నేల, కలవరపెడితే విస్ఫోటనం చెందే మట్టి, నేలంటే ఉత్త మట్టే కాదు, కష్టజీవుల చెమట చుక్కల కలల్ని పూయించేది, నేను మాట్లాడేది, దు:ఖం వస్తే ఒడి జాపే నేల, ఆరుద్ర పూవులు పూసే త్యాగాల నేల. తమిళ ఈలం పులులు సాహసికంగా పోరాడి త్యాగాలు చేసినది జాతి విముక్తి పోరాటమేకానీ ప్రజాయుద్ధం కాదు. పాలస్తీనా, కాశ్మీర్లను హృదయానికి హత్తుకున్నట్లుగానే ఎల్.టి.టి.ఈ.ని కూడా హత్తుకోవాలి. ఇప్పటికీ ప్రస్తావించినవి కాకుండా ఇందులో తెలంగాణ పై మరో ఎనిమిది కవితలు ఉన్నాయి. గడప గడపను మేల్కొల్పిన జయశంకర్ పై, మాంత్రికుడు కె.సి.ఆర్ దాకా కూలిన గఢీలకు సిమెంటు హంగుల ఆధిపత్య అహం జెండాలు దించాలని పిలుపునిస్తాడు. కాళేశ్వరం బస్సుయాత్ర, ఒపెస్ కాస్టులపై నిరుద్యోగుల ఉద్యమాలపై, రైతుల ఆత్మహత్యలపై, ఆర్టీసీ సమ్మెపై, ప్రపంచ తెలుగు సభల పై కవితలున్నాయి. “ఉగ్గుపాల భాషలో గ్లోబల్ కలీ విషం. గఢీల్లో కవి పలుకులు, ఈ పార్లమెంటరీ విధానంపై, ఈ వ్యవస్థపై శస్త్ర చికిత్స చేయాలని మూడు కవితలు వున్నాయి. మనువు మీద అంబేడ్కర్ అవగాహనతో, విప్లవోద్యమ అవగాహనతో కూడా రెండు కవితలు ఉన్నాయి. రాజకీయ చదరంగంలో పీడిత నల్లపావుల చేతుల్లో మనువు ఆటలు చెల్లవంటాడు. ఆదివాసుల జీవితాలపై ‘ముత్యాలపూలు’ కవిత వాళ్ల జీవితమే కాకుండా గ్రీన్ హంట్ వ్యతిరేక పోరాటానికి కూడా “మిడతల దండు ఆకుపచ్చ వేటను ఎదిరిస్తున్న ఎర్రచీమల గుంపు అంటాడు. దండకారణ్యం కవితలో విప్లవకారులు మళ్లీ వస్తారు అనే ఆశ్వాసాన్ని కూడా ఇస్తాడు.

‘చెట్టు’ అద్భుతమైన కవిత. “ఆకురాలిన శబ్దానికి ఉలిక్కిపడి చెట్టు ఎండిపోతుందని వాడు సంబరపడ్డాడు, వసంత మేఘగీతానికి చిగుళ్ళు తొడిగి ప్రకృతి పులకరించింది. ఎర్ర మందారం రాలినందుకు వాడు ఎగిరి గంతేశాడు, నేలపై వేల త్యాగాల విత్తులు చల్లిందని తెలిసి వాడు తెల్లబోయాడు”. తండ్రి మీద క్యాన్సర్ వ్యాధితో మరణించినందుకు బాధపడుతూనే “అమాస్య చీకట్లను మాకిచ్చిన మెర్కురీ దీపం” అంటాడు. తల్లి మీద ఎంతో అర్థమైన ‘నెమలి కన్ను’ అనే కవిత రాశాడు. ఆమె దినచర్య అంతా ఎంతో ఆర్ద్రమై సాంద్రమైన అద్భుత కవిత. తండ్రిని కలనేతడుగా చూశాడు. తనపాలిట, తల్లిపాలిట పితృస్వామ్య స్వభావం కలిగినవాడుగా కూడా చూశాడు. కరోనా మీద రాజ్యానికి ఎంతో అనూకూలంగా వచ్చి ఆగిపోయినా దేశమంతా వెలిసిన షాహీన్ బాగ్ పోరాటాల మీద రాశాడు. సంచార యాత్రికులైన లంబాడాలు ముఖ్యంగా వాళ్ల ఆడపిల్లలు ఒకవైపు పేదరికం మరొకవైపు అందమే శత్రువులైనవి. పసిపాపలను అమ్ముకోవడం దగ్గర్నించి ఎస్.టి. హాస్టల్లో చేర్చిన మైనరు బాలికలపై అత్యాచారాలు, హత్యాచారాలపై అదొక విషాదం. ముఖ్యంగా బానోతు భూమిక, ప్రియాంకలపై అత్యాచారం జరిగి హత్య చేసిన సందర్భంలో ములుగులో రాజకీయ పార్టీలు, రాజ్యాంగయంత్రం అంతా ఉన్నది. అంతే కాదు “పెట్టుబడి ముడ్డికి మడికట్టిన మనుపత్రికల్లో లేమొగ్గలు తునాతునకలయినా కనిపించని వార్త, నలిగి రాలిపోయింది ఇప్పపూల చెట్లయినందుకేమో అంటాడు. పాత్రికేయుడిగా పత్రికా స్వాతంత్ర్యం గురించి కూడా సిరాచుక్క అనే కవిత రాశాడు. స్వయంగా అధ్యాపకుడైనందున ‘అభద్రుడు’ అని అధ్యాపక అభద్రత గురించి కూడా రాశాడు. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రైవేటు విద్యాసంస్థల అధ్యాపకుల ఆగచాట్లు చూడలేకనే అనుకుంటాను.

‘అండాసెల్’లో ఉన్న సాయిబాబా, వివి, కాశింల అరెస్టుల గురించి కూడా రాశాడు. విప్లవకారుల గురించి ‘పొలిమేరకు పూసిన తోరణాలు’ అని ఎంతో హృద్యంగా రాశాడు. ఒక మేథావిగా, కవిగా తన స్పందన మేధావి కవి ఉండవలిసిన చోటు తాను రెండువేల పద్దెనిమిది నుంచి విరసంలో చేరిన అవగాహనతో ఎంతో స్పష్టంగా పదిహేను కవితలు రాశాడు. విలుకాడు అనే కవితలో ‘పదవుల పంజరంలో బందీ అయిన మేధావుల మౌనం పోస్టుమాడ్రన్ కుట్ర అంటాడు. ఇంతకూ ఈ కవిని ఎక్కడ పోల్చుకుందాం. చెట్టు చెట్టూ కలిసి చిట్టడవి, మనిషి మనిషీ కలిసి దళమైనట్లు, అడవి అడవి కలిస్తే దండకారణ్యమే, పచ్చని అడవిలో వేటగాళ్ల విధ్వంసంపై ఆదివాసీలు మనకు మార్గదర్శకులు. అడవులన్నీ దండకారణ్యమవ్వాలి, మనిషి ఏ నిర్భందాలు లేని స్వేచ్ఛా ఊపిరి పీల్చాలి, చివరిదయిన ‘పూలపరిమళం’ గొప్ప కవిత్వ ఆశ్వాసంతో ముగుస్తుంది. నిలపకు అడుగుల పయనం, ఉచ్ఛాసనిశ్వాసలే ఉద్యమం. ఓటమి ఎదురైనపుడల్లా సరికొత్త ఆశల విత్తులు చల్లు, చీకటిదారిలో ఆకాంక్షల కంటి దివిటీలు వెలిగించి, మూగ గొంతుల్లో ముక్తకంఠం భేరీ మోగాలి.

Leave a Reply