ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది.

మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది. అందుకే ఈ సారి తీర్పు నిర్ణయాత్మకం కానుంది. అయితే, హైకోర్టు నిర్ణయంపై స్టే విధించాలని, సుప్రీంకోర్టులో పునర్విచారణ పిటిషన్‌ను ప్రభుత్వం దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సాయిబాబా విడుదల అవడం  ఖాయమనే అనుమానం ప్రభుత్వానికి ఉంది (సుప్రీంకోర్టు మార్చి 11న వారిని నిర్దోషులుగా విడుదల చేసిన తీర్పును మళ్ళీ చూడాల్సిన అవసరం లేదని అంటూ నిర్దోషులుగా విడుదల చేయాలనే హైకోర్టు తీర్పును ఎత్తిపట్టింది – అను). 2024ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన అన్ని కథనాల మధ్య, ఈ విడుదల ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.

ఈ నిర్ణయానికి రావడానికి దేశ న్యాయస్థానానికి 10 సంవత్సరాలు పట్టింది. దీని కారణంగా 90 శాతం  వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా, ఇతర నలుగురు అమాయక పౌరులు తమ జీవితాల్లోని 3,588 రోజులు కటకటాల వెనుక గడిపారు.

ఈ నేరారోపణలో మొత్తం ఆరుగురిని దోషులుగా నిర్ధారించారు. అయితే ఈ నిందితులలో ఒకరు, కేవలం 33 సంవత్సరాల వయస్సువాడైన, పాండు నరోటే 2022 ఆగస్టులో తీవ్ర అనారోగ్యంపాలై మరణించాడు.

నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో సాయిబాబాతో సహా ఖైదీలందరినీ అత్యంత అమానవీయ పరిస్థితుల్లో ఉంచారని, ఈ కారణంగానే స్వైన్ ఫ్లూ వచ్చిన నరోటేకి సమయానికి వైద్య సదుపాయం అందించకపోవడం వల్ల మరణించారని ఆరోపణ.  సాయిబాబాతో పాటు దోషులుగా నిర్ణయించిన వారిలో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, మహేష్ టిర్కి, విజయ్ టిర్కి, పాండు నరోటే ఉన్నారు. వారిలో నేడు చాలా మంది యవ్వనప్రాంగణాన్ని దాటేసారు.  వారి సహచరులు జీవన యానంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు.

‘సాయిబాబాలాంటి వాళ్లే రాజ్యానికి అతి పెద్ద ప్రమాదం’ అంటోన్న ప్రభుత్వం

2020లో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలు అయిన 74 ఏళ్ల సాయిబాబా తల్లి, ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నప్పుడు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తన కొడుకును చూపించమని చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. చాలా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న సాయిబాబాకు ఈ వార్త తెలియగానే, తన చికిత్స కోసమూ, చివరిసారిగా తన తల్లిని చూడడానికి 45 రోజుల పెరోల్ కోసం చేసిన విజ్ఞప్తిని కూడా జైలు యంత్రాంగం ఆమోదించలేదు.

తల్లి మరణించిన తర్వాత కూడా, కుటుంబంతో వీడియో కాన్ఫరెన్స్ కోసం అతని న్యాయవాది ఆకాష్ సరోదే చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. బాబా గుర్మీత్ రామ్-రహీమ్ లాంటి హత్య, అత్యాచార నేరస్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పెరోల్ యివ్వాలనే ఆదేశాలు జైలు యంత్రాంగానికి ప్రభుత్వం నుండే  అందుతాయనే విషయం అందరికీ తెలిసిందే.  అలా జరగడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొంతవరకు అడ్డుకోడానికి ప్రయత్నించింది.

పదేళ్ళ యుపిఎ ప్రభుత్వం అస్థిరతలో వుండి, 2014 మే లో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ తొలిసారిగా సంపూర్ణ మెజారిటీతో గెలిచి పార్ల‌మెంట్ గుమ్మం ఎక్కే తయారీలో వున్న సమయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాష అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్న సాయిబాబా అరెస్టు జరిగింది.

మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల బాధితుడు

2006 ఏప్రిల్‌లో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన మొదటి పదవీకాలంలోనే  నక్సలిజాన్ని భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా ప్రకటించాడు. 2005లోనే, యుపిఎ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను మావోయిస్టుల నుండి విముక్తి చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో “సల్వాజుడుం” అనే ‘ప్రజా సైన్యాన్ని’ ప్రారంభించింది.  ఇందులో పెద్ద ఎత్తున ఆదివాసీ యువకులను స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా నియమించాక ప్రారంభమైన రక్తసిక్త చరిత్ర మచ్చలు ఆదివాసీ ఆధిపత్య రాష్ట్రంలో ఈనాటికీ లోతుగా ఉన్నాయి.

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 2011లో సల్వాజుడుంను ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చినప్పటికీ, 2013లో కాంగ్రెస్ పార్టీయే ఈ రాజ్య-ప్రాయోజిత హింసకు బలి కావాల్సి వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా 2013, మే 25 నాడు ఆ పార్టీ నిర్వహించిన ‘పరివర్తన్ యాత్ర’ సందర్భంగా సుక్మాలో జరిగిన ఘోర దాడిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విద్యాచరణ్ శుక్లాతో సహా పలువురు కార్యకర్తలు చనిపోయారు.

నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ వల్ల కలిగిన ఆనందాన్ని   గరిష్టంగా  ఆస్వాదించిన క్షణాల   తరువాత, దాని దుష్ప్రభావాల తాకిడి మొదలయ్యాక    దేశం తీవ్రంగా బాధపడుతున్న కాలం అది. 2010 తర్వాత భారతదేశంలో ‘కామన్‌వెల్త్ కుంభకోణం’, 2జి, బొగ్గు కుంభకోణాల గాథలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా గాలిలో తేలియాడాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.

ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, అభివృద్ధి చీకటి గుహలోకి మాయమై  పోయింది. ‘ఇండియా అగెన్స్ట్ కరప్షన్’(అవినీతి వ్యతిరేక భారతదేశం)  పతాకం కింద అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లతో సహా ఆర్ఎస్ఎస్ – బిజెపిలతో  సంబంధం ఉన్న వారందరూ నోయిడా మీడియా సహాయంతో దేశంలో అవినీతిని నిర్మూలించగలమని భావించారు. కానీ మన్మోహన్ ప్రభుత్వ ఉపయోగం ముగిసిన భారతదేశ కార్పొరేట్ ఈ సంక్షోభానికి ఊపిరినిచ్చే,  మార్గనిర్దేశనం చేసే పనిని తన చేతుల్లోకి తీసుకున్నది.

90వ దశకంలో, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సూచనల మేరకు దేశ ఆర్థిక విధానంలో సమగ్ర మార్పు కారణంగా, భారతదేశ సహజ వనరులపై స్థానిక, విదేశీ మూలధనాల సంపూర్ణ ఆధిపత్యం కోసం ఊపందుకున్న డిమాండ్, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న, ఆదివాసీ జనాభా ఆధిపత్య రాష్ట్రాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆదివాసీలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పే పాత్రలో ఇప్పుడు కొద్దిమంది మాత్రమే మిగిలారు. విశ్వవిద్యాలయాల్లో వున్న కొద్దిపాటి మేధావి వర్గం మాత్రమే ఆ అంశాన్ని సమాజం ముందుకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వారిలో ఒకరు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా.

సాయిబాబా ఎవరు?

గోకరకొండ నాగ సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్‌, తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం పట్టణంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడిన సాయిబాబా చిన్నప్పటి నుంచి వీల్‌చైర్‌తోపాటు తన జీవిత సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, 2013లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి చేసారు. ఢిల్లీ యూనివర్శిటీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా సంవత్సరాలు ఆంగ్ల భాష బోధించిన ప్రొఫెసర్‌ను నిషేధిత వామపక్ష మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో 2014 మేనెలలో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. 2017లో సెషన్స్ కోర్టులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. ఫలితంగా, మార్చి 2021లో, కళాశాల అతనిని ప్రొఫెసర్ పదవి నుండి కూడా తొలగించింది.

చాలా ప్రమాదకరమైన నేరస్థుడని నమ్మిన ప్రభుత్వం సాయిబాబాను నాగ్‌పూర్‌ జైలులోని అండాసెల్‌లో ఉంచింది. అత్యంత కరడుగట్టిన నేరస్తులను మాత్రమే అండాసెల్‌లో ఉంచుతారనే విషయాన్ని మీకు తెలియజేయాలి. 90% వికలాంగుడైన ఆంగ్ల భాషా ప్రొఫెసర్‌కు దళితులు, ఆదివాసీల పట్ల సానుభూతి చూపినందుకు నేరస్తుణ్ణి చేసి భారత రాజ్యం ఈ శిక్ష విధించిందన్న వాస్తవాలు నేడు దేశం ముందు బహిరంగమవుతున్నాయి. బొంబాయి హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ ఉపా  కింద అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, సుప్రీం కోర్ట్ ఈ ఉత్తర్వును రద్దు చేసి, మెరిట్‌ల ఆధారంగా మరోసారి కేసును పునఃపరిశీలన చేయమని హైకోర్టుకు 2022 అక్టోబర్ 14 న పంపించింది. 2024 మార్చి 5న, బొంబాయి హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ మరోసారి సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ, తన నిర్ణయంలో అనేక ముఖ్యమైన విషయాలు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న అనేక ఇతర కేసుల్లో ఈ నిర్ణయం ఒక పూర్వప్రమాణంగా (ప్రిసిడెంట్) మారవచ్చు.

హైకోర్టు చారిత్రాత్మక తీర్పులోని ముఖ్యాంశాలు

కమ్యూనిస్ట్ లేదా నక్సల్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేయడం లేదా ఆ భావజాలంపట్ల సానుభూతి చూపడం వల్ల ఉపా కింద నేరారోపణ చేయడానికి లేదని హైకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. అటువంటి సాహిత్యంతోపాటు, నేరస్థుడికి హింసాత్మక ఘటనలు, ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు కూడా అవసరమని, అలా వుంటేనే యూఏపీఏలోని సెక్షన్ 13, 40, 39 కింద నేరంగా పరిగణించవచ్చు అని కోర్టు పేర్కొంది.

జిఎన్ సాయిబాబాతో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించిన  న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తమ వ్యాఖ్యలో, “కమ్యూనిస్ట్ లేదా నక్సలైట్ సాహిత్యానికి సంబంధించిన ఏదైనా వెబ్‌సైట్‌ను ఎవరైనా యాక్సెస్ చేయవచ్చనేది ఇప్పుడు సాధారణ వాస్తవం. వాటినుండి సమృద్ధిగా సమాచారాన్ని సేకరించవచ్చు..వారి కార్యకలాపాలు, వీడియోలు, హింసాత్మక స్వభావం ఉన్న వీడియో ఫుటేజీని కూడా సులభంగా సేకరించవచ్చు. కానీ, ఒక పౌరుడు అటువంటి మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేయడం లేదా కమ్యూనిస్ట్ తత్వశాస్త్రం పట్ల సానుభూతితో వుండడాన్ని నేరంగా పరిగణించలేం.” “నిషేధిత సంస్థలో నిష్క్రియ సభ్యత్వం ఉన్నట్లు తేలినప్పటికీ, ఉపాలోని 13, 20, 39 సెక్షన్ల ప్రకారం దానిని నేరంగా పరిగణించలేమని” కూడా  కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది.

ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారి సుహాస్ పౌచే కోర్టు ముందు సమర్పించిన సాక్ష్యంలో, “ఒక వెబ్‌సైట్ నిషేధిత నక్సల్ ఆలోచనలతో పాటు సీపీఐ (మావోయిస్ట్), నక్సలైట్ సాహిత్యం, సమావేశాల వివరాలు, చేసిన తీర్మానాల గురించిన  మొత్తం సమాచారం అందుబాటులో వుంది” అని చెప్పారు.

ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, “ఒకరి తాత్విక విశ్వాసాలను లేదా వారు చదివిన సాహిత్యాన్ని వారికి వ్యతిరేకంగా, అందులోనూ ముఖ్యంగా ఆ విషయాలు ఇంటర్నెట్‌లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడు, సాక్ష్యంగా ఉపయోగిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పరిధిలో ఏదో ఒక  చోట వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లే అవుతుంది” అని వ్యాఖ్యానించింది.

ఏ పరిస్థితులలోనైనా, సాహిత్యంలో ఒక నిర్దిష్ట తత్వశాస్త్రం గురించి ప్రస్తావించినప్పటికీ, ఏ సందర్భంలోనూ అది ఆ నిందితుడు వ్రాసాడని నిరూపించలేదు. లేదా ఒక వ్యక్తి ఇంటర్నెట్‌లోని  కమ్యూనిస్ట్ లేదా మావోయిస్ట్ సాహిత్యం, తత్వశాస్త్ర వెబ్‌సైట్లలో సులభంగా లభించే సాహిత్యాన్ని చదవడాన్ని ఎంచుకున్నందుకు అతనిపై చర్య తీసుకొంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఒక పౌరుడి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది.

నిందితులు అటువంటి చర్యకు పాల్పడ్డారని రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్ ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేదని కోర్టు తన తీర్పులో స్పష్టంగా సూచించింది. ఇంతేకాకుండా, అతను దాని తయారీలో పాల్గొన్నట్లు లేదా దానికి మార్గదర్శకత్వం వహించడం లేదా దాని చర్యలకు మద్దతు ఇవ్వడం గురించి కూడా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.

హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని మనం పూర్వ ప్రమాణంగా  తీసుకుంటే, ఇలాంటి తప్పుడు కేసుల్లో దేశంలోని వివిధ జైళ్లలో బందీలై వున్న వందలాది మంది ప్రముఖ జర్నలిస్టులు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లు కూడా విడుదలయ్యే అవకాశం వుంది.

దేశభద్రత పేరుతో దేశంలోని వివేకాన్ని, కలాన్ని బంధించి, ఒకే సంజ్ఞతో మూకుమ్మడి హింసకు దిగడానికి లేదా మాల్దీవులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి చాలా సులభంగా సిద్ధమయ్యే అంధ భక్తుల, అంధ దేశభక్తుల మతోన్మాదుల సైన్యాన్ని సృష్టిస్తున్నారు. మరోవైపు, లడఖ్,  అరుణాచల్‌లలో చైనా చొరబాటు లేదా కెనడా, దాని 5 ఐస్ స్నేహితులు (ఫైవ్ ఐస్ (కన్నులు)అనేది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌‌లతో కూడిన గూఢచార కూటమి. ఈ భాగస్వామ్య దేశాలు ప్రపంచంలోని అత్యంత ఏకీకృత బహుపాక్షిక ఏర్పాట్లలో ఒకదానితో ఒకటి విస్తృతమైన మేధస్సును పంచుకుంటాయి) భారతదేశ సార్వభౌమత్వాన్ని లొంగిపోయేలా నిరంతరం బలవంతం చేస్తున్నారని వీరు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఎందుకంటే వారిని బ్రెయిన్ డెడ్ స్థితికి (మెదడు మరణించే)తీసుకురావడమే రాజ్యానికి, కార్పొరేట్‌కు అతిపెద్ద విజయం.

(రచయిత జన్ చౌక్ సంపాదకీయ బృందంలో సభ్యుడు)

आखिरकार 3,588 दिनों के बाद प्रोफेसर जी एन साईबाबा दोषमुक्त पाए गये

Leave a Reply