ఎల్గార్ పరిషత్  కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి  సాయిబాబాతో ‘ప్రత్యక్ష సంబంధం’లో ఉన్నాయని చార్జిషీట్‌లో   పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో   మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్‌చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020 ఆరంభంలో కేసును చేపట్టిన నేషనల్ ఇన్ వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) పూణే పోలీసుల ఛార్జ్ షీట్‌ను యథాతథంగా తీసుకొంది.

బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని అన్ని ఆరోపణల నుంచి (ఒక్కసారి కాదు, రెండుసార్లు) నిర్దోషులుగా ప్రకటించింది. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ నిర్దోషులని యిచ్చిన తీర్పుపై  స్టే తెచ్చుకోవడంలో విఫలమైంది. ఎల్గార్ పరిషత్ కేసులో సాయిబాబాను యిరికించడానికి పోలీసులు చేసిన ప్రయత్నంతో పాటు, సాయిబాబా కేసు విచారణ అధికారి సుహాస్ బావ్చే ఎల్గార్ పరిషద్ కేసు విచారణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

293 పేజీల తీర్పులో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్, డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు వినయ్ జి. జోషి, వాల్మీకి ఎస్. మెనెజెస్ సాంకేతిక లోపాలతో పాటు, విచారణ అధికారి బావ్చే నిర్వహించిన దర్యాప్తుపై ప్రత్యేకంగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో గడ్‌చిరోలి జిల్లాలోని అహెరిలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) గా ఉన్న బావ్చే సాయిబాబా కేసులో దర్యాప్తుకు నాయకత్వం వహించారు. సాయిబాబాతో పాటు, ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రా, పాండు నరోటే, విజయ్ టిక్రీ, మహేష్ టిక్రీ,  అనే మరో ఐదుగురు నిషేధించబడిన సిపిఐ (మావోయిస్టు) గ్రూపుకు చెందిన రివల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్‌లో భాగమని ఆయన పేర్కొన్నారు.

పోలీసు, పంచ్ సాక్షుల ప్రకటనలపై ఆధారపడి ఉన్న, ఇప్పుడు ఆధారం లేనివిగా నిరూపితమైన ఈ ఆరోపణల గురించి హైకోర్టు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ కేసులో పదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఆరుగురు వ్యక్తులలో ఒకరైన మిశ్రాను 2013 ఆగస్టు 22న అరెస్టు చేసినట్లు చూపించారు కానీ  రెండు రోజుల ముందే అరెస్టు చేసినట్లు డిఫెన్స్ న్యాయవాదులు తిరస్కరించారు.

సాయంత్రం 6 గంటల సమయంలో అహెరి బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఒక “నిర్జన ప్రదేశం” నుండి మిశ్రా, టిక్రీ, నరోటేలను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, పంచ్‌లతో కూడిన ప్రాసిక్యూషన్ సాక్షులు బస్ స్టాప్ వద్ద వారిని గుర్తించిన క్షణం నుండి “సాక్ష్యాలను” స్వాధీనం చేసుకోవడం, స్వాధీనం చేసుకున్న సాక్షుల సమక్షంలో పిలవడం వరకు జరిగిన ప్రక్రియ గంటన్నర కన్నా తక్కువ సమయం పట్టిందని పేర్కొన్నారు.

సంతోష్ బానే అనే మొదటి పంచ్ సాక్షి,  ఒక “స్టాక్ (రిజర్వు) సాక్షి”, అతను అనేక కేసుల్లో పోలీసులకు సాక్షిగా పని చేసాడు. ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ఎటువంటి అధికారిక విద్య, జ్ఞానం లేని బానేను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవటానికి సాక్షిగా నిలబడమని బలవంతం చేసారు.  పిలిచిన 5-10 నిమిషాల్లోనే పోలీసు స్టేషన్‌కు చేరుకున్నట్లు బానే పేర్కొన్నారు. ఆయన వేరే ప్రదేశంలో ఉన్నారని భావించిన కోర్టు దీనిపై సందేహాలు వ్యక్తం చేసింది. ఆసక్తికరంగా, పోలీస్ స్టేషన్ డైరీ డ్యూటీ ఇన్ చార్జ్ కానిస్టేబుల్ నరేంద్ర దూబే అనే వ్యక్తి తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడని బానే చెప్పినదాన్ని దూబే నిరాకరించాడు.

బస్ స్టాప్ వద్ద సాయంత్రం 6:15 గంటల సమయంలో ప్రారంభమైన ఘటనా క్రమాన్ని కూడా న్యాయమూర్తులు ఎత్తి చూపారు.  “అహేరి బస్ స్టాండ్ సమీపంలో సాయంత్రం 6.15 గంటలకు మొదటిసారిగా నిందితులను అడ్డగించినప్పటినుంచి జరిగిన ఘటనా క్రమాన్ని మేం పరిశీలించాం. వారితో మాట్లాడి,  పోలీస్ స్టేషన్‌కు  తీసుకువెళ్లడానికి మరికొన్ని నిమిషాలు పడుతుంది. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమయిన నిందితుడితో మొదటి పరస్పర చర్య నుండి, అన్ని ప్రాథమిక చర్యలు కేవలం 15 నిమిషాల్లోనే జరిగాయి, ఆపై జప్తు పంచనామా ప్రారంభమైంది, ఇలా జరగడం అసంభవం. గమనించాల్సిన అవసరం ఉంది, “అని తీర్పులో పేర్కొంది.

పోలీసులు తమ కథనానికి అనుగుణంగా తేదీలు, ఇతర వివరాలను తరువాత జోడించారని డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లో ఉపయోగించిన వివిధ రంగుల సిరాపై కోర్టు దృష్టి సారించింది. ఎఫ్ఐఆర్ (ఎక్స్హెచ్. 221) కాపీ కార్బన్ కాపీగా ఉందని, దీనిపై సమయాన్ని నీలిరంగు సిరాతో వ్రాసారని, సమయం, సాధారణ డైరీ సూచన నల్ల సిరాతో ఉందని మేము గుర్తించాం. ఈ సందేహాన్ని తొలగించడానికి ప్రాసిక్యూషన్ నుండి ఈ విషయంలో ఎటువంటి వివరణ రాలేదు” అని న్యాయమూర్తులు రాశారు.

పోలీసుల రికార్డులను తారుమారు చేసి, నిందితులకు సంబంధించిన విషయాలను కల్పిస్తున్నారంటూ బావ్చే, అతని బృందంపై డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపణలు చేశారు. కేసు డైరీ స్థితిని, పోలీసులు వదులుగా ఉన్న కాగితాలపై ఎంట్రీలను రికార్డ్ చేయడాన్ని కోర్టు గమనించింది. కేసు డైరీలు క్రిమినల్ విచారణలలో ముఖ్యమైన సాక్ష్యం. పోలీసులు ప్రతి కదలికను కేసు డైరీలో రికార్డ్ చేయవలసి ఉంటుంది. కేసు డైరీలో చేసిన ఈ ఎంట్రీలను విచారణ సమయంలో కీలకమైన సాక్ష్యంగా పరిగణిస్తారు. అయితే ఈ కేసులో పోలీసులు విచారణ విధానాన్ని పాటించడంలో విఫలమయ్యారు. పోలీసుల కథనానికి అనుగుణంగా వాటిని భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా పత్రాలను విడి కాగితాల రూపంలో ఉంచినట్లు చేసిన డిఫెన్స్ వాదనను కోర్టు అంగీకరించింది.

ప్రశాంత్ రాహి, విజయ్ టిక్రీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ‘నేరారోపక పత్రాలు’ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారన్న విషయంపై కూడా ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. 2013 సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం చిచ్‌గఢ్ టి-పాయింట్ వద్ద రాహి అనే పాత్రికేయుడిని, టిక్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ పంచనామాల్లో సమయం గురించి ప్రస్తావించలేదు. అదేవిధంగా, వారి నుండి సేకరించిన సాక్ష్యాలను ఒక రోజు తరువాత మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. స్పష్టత ఇవ్వకపోవడం, పత్రాలను అస్పష్టంగా ఉంచడంపై కోర్టు బౌచేను నిందించింది.

2014 మే 9న సాయిబాబాను అరెస్టు చేసినప్పటికీ, ఢిల్లీలోని ఆయన ఇంటిపై 2013 సెప్టెంబరు 12న అంటే దాదాపు ఏడు నెలల ముందే దాడులు జరిగాయి. సాయిబాబాను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఆయన పార్టీ సభ్యులు రాజధానిలో ‘శాంతి భద్రతల’ పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించారని బౌచే కోర్టు ముందు చెప్పిన  సాక్ష్యాన్ని హైకోర్టు తిరస్కరించింది.

గడ్‌చిరోలి ప్రాంతంలో అనేక దర్యాప్తులకు నాయకత్వం వహించిన బావ్చే ఇప్పటికే సుప్రసిద్ధుడు. సాయిబాబా కేసులో “విజయవంతమైన దోష నిరూపణ” తరువాత, అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ అతని కృషికి బహిరంగంగా ప్రశంసలు కురిపించాడు.

ముంబైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) గా పనిచేస్తున్న బావ్చే వివాదాలకు కొత్తేమీ కాదు. 2017లో మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ సాయిబాబాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, కోర్టులోనే అతన్ని తీవ్రమైన పరిణామాలకు గురిచేస్తానని బెదిరించాడు. “గడ్లింగ్‌కు సాయిబాబా తర్వాత జైలుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని” గడ్చిరోలి కోర్టులో సాక్ష్యమిచ్చిన బావ్చే అన్నారని అప్పటి గడ్లింగ్ జూనియర్ న్యాయవాది జగదీష్ మెశ్రామ్ సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పారు. ఆ అఫిడవిట్లో ఆ సమయంలో హాజరైన ఇతర న్యాయవాదుల పేర్లు కూడా ఉన్నాయి.

2018లో ఎల్గార్ పరిషత్ కేసులో జరిగిన అరెస్టుల నేపథ్యంలో ఈ ఆరోపణ అర్థవంతంగా ఉంటుంది. ఈ దర్యాప్తులో బావ్చేకు ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికీ, 2018లో భారతదేశం అంతటా జరిపిన దాడులు, అరెస్టుల సమయంలో అతను అక్కడే ఉన్నాడు. నాగ్‌పూర్‌లో గడ్లింగ్ నివాసంపై దాడికి బావ్చే నాయకత్వం వహించాడు. అదేవిధంగా, హైదరాబాద్ లోని తెలుగు కవి వరవరరావ్, ఢిల్లీ లోని విద్యావేత్త, న్యాయవాది సుధా భరద్వాజ్ యిళ్ళపై జరిపిన దాడులకు ముందు బౌచే వివిధ రాష్ట్రాల పోలీసులకు పంపిన లేఖల గురించిన ప్రస్తావన పూణే పోలీసులు దాఖలు చేసిన తొలి చార్జిషీట్‌లో ఉంది.

2018లో ఎల్గార్ పరిషత్ కేసులో మొదటి రౌండ్ అరెస్టులకు వ్యతిరేకంగా చరిత్రకారిణి రోమిలా థాపర్ దాఖలు చేసిన పిటిషన్‌పైన విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టులో బావ్చే హాజరైనట్లు డిఫెన్స్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో మహారాష్ట్రలో ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల బృందం అప్పటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కలిసింది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రానికి తెలియజేయడానికి బావ్చే కూడా హాజరయ్యాడు.

https://thewire.in/government/io-whose-role-bombay-hc-questioned-in-saibaba-case-was-also-part-of-elgar-parishad-probe

Leave a Reply