ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్‌) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్‌ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడానికి కారణాలను డొంక తిరగుడుగా చెప్పాయి. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ దేశాల ఆరాచక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను 2002లో పరిశీలించిన అమెరికాకు చెందిన ఆర్థికవేత్త డేవిడ్‌ సి కాంగ్‌ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కారణంగా ఇదంతా జరిగిందని మొదటిసారిగా చెప్పాడు. అప్పటి నుంచి సోవియట్‌ రష్యా, ఇతర వర్ధమాన దేశాల్లో క్రోనీకాపిటలిజం ఎలా బలపడుతుందో తెలిపే అధ్యయనాలు చాల వచ్చాయి. పరిశీలకులందరు  క్రోనీ కాపిటలిజం అంటే ప్రభుత్వాల ఆశ్రిత పక్షపాతం, అవినీతి ప్రధానాంశాలుగా ఎత్తిచూపాడు. 

ఫిలిప్పీన్స్‌లో ఫెర్డినాండ్‌ మార్కోస్‌ అధ్యక్షుడిగా ఉండగా ఆయన భార్య, అతని బంధువులు, ఆశ్రితులు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను తమ కనుగుణంగా మార్చుకుని నాశనం చేశారనీ, డేవిడ్‌ సి కాంగ్‌ తెలిపాడు. ఆశ్రిత పెట్టుబడి విధానం ఫిలిప్పీన్స్‌ పరిపాలకుడుగా ఉన్న మార్కోస్‌ హయాంలోనే మొదలైంది. 1997-98లో ఆసియా దేశాలు ద్రవ్య సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని నాయకులు వ్యాపారంలో ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూర్చే అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వ్యాపారంలో ఉన్నవాళ్లు అంతా వారి బంధువులుగానే ఉన్నారు. అంటే మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వాలు రాజకీయ మార్కెట్‌ను కూడా సృష్టించి తమకు  అనుకూలంగా మార్చుకున్నాయి. థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, సింగపూర్‌లలో ప్రభుత్వ జోక్యం వ్యాపారాలలో తీవ్రంగా పెరిగింది. సోవియట్‌ రష్యా పడిపోయిన తర్వాత అధికారంలో ఉన్న 1991లో బోరిస్‌ మెల్ట్సిన్‌ పెట్టుబడిదారుల కలయికతోనే ప్రభుత్వాన్ని నడిపారు. రాజకీయాలు, వ్యాపారాలు కలగలసి పోతాయి. వ్యాపారాలు రాజకీయ నైతికతను దెబ్బతీస్తాయి. 

తూర్పు ఆసియా దేశాల్లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చిన సంకటంగా విశ్లేషించటానికి సిద్ధపడని బూర్జువా ఆర్థికశాస్త్రవేత్తలు ఒక కొత్త పదాన్ని 1997లో సృష్టించారు. అదే క్రోనీ కాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఈ ఆర్థిక శాస్త్రవేత్తలే గతంలో దక్షిణకొరియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల ఆర్థిక విధానాలను పొగుడుతూ ఈ ‘ఆసియా పులుల్ని’ అందరూ అనుసరించాలని ఉద్భోధించారు. ఈ దేశాల్లో రాజకీయ, సామాజిక సంక్షోభం వచ్చిన తరువాత దాన్ని వివరించటానికి ఆశ్రిత పెట్టుబడి అనే భావన ప్రవేశపెట్టారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం చెడ్డది. ఇది పెట్టుబడిదారీ విధానానికి భిన్నమయింది అన్నారు. ఇందులో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార గణం తమ ఆశ్రితులకు ప్రభుత్వ విధానంలో, వనరుల కేటాయింపుల్లో, పూర్తిగా అనుకూలంగా వ్యవహరించి వారి ఆశ్రితులు బాగా అభివృద్ధి చెందే విధంగా వ్యవహరించడమే ఒక విధానంగా రూపొందే పద్ధతి యిది. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ సాగించి విస్తరించాలంటే ద్రవ్య లేక ద్రవ్యస్వామ్యంగా మారి ప్రపంచాన్ని కబళిస్తాయి’ అని 1916లో లెనిన్‌ చెప్పిన మాటలు నిజమయ్యాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో కానీ, భూస్వామిక, బానిస వ్యవస్థల్లో కానీ దోపిడీ చేస్తున్న వారికి సహాయకారిగా, వారి దోపిడీకి ఎలాంటి ఆటంకాలు, వారి ఆస్తిపాస్తులకు ఎలాంటి నష్టమూ రాకుండా రాజ్యాలు కాపాడుతాయనే విషయం మన అందరికి తెలిసిన విషయమే. వారి రక్షణ కోసమే రాజ్యవ్యవస్థ ఏర్పడిరదనేది ఒక చారిత్రక సత్యం. అయితే బానిస వ్యవస్థ భూస్వామిక వ్యవస్థల్లోని రాజ్యాలు, రాజులు, సామ్రాజ్యాలు పోయి పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడటంతో స్వేచ్ఛా స్వాతంత్య్రాల భావన ఏర్పడి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తెచ్చి దేశ పౌరుల కోసం, ప్రజా పాలన కోసం ప్రభుత్వాలు ఏర్పడతాయనే భ్రమను కల్పించింది ఈ వ్యవస్థ. కొన్ని ప్రజాతంత్ర హక్కులకు, సౌకర్యాలకు కూడా రాజ్యాంగాలు హామీనిచ్చాయి. పెట్టుబడిదారుల స్వేచ్ఛా మార్కెట్టుకు, వ్యాపార కార్యకలాపాలకు అవకాశమిస్తూనే ఒక స్వతంత్ర వ్యవస్థగా రాజ్యం, రాజకీయాలను నడుపుతున్నట్టు కొంతకాలం భ్రమింపజేసింది. ఇప్పటికీ రాజ్యానికి రాజకీయాలకు, పెట్టుబడిదారులకు దోపిడీకి సంబంధంలేదని చాలామంది ప్రజలు గమనించలేకపోతున్నారు. ఆ భ్రమలను పటాపంచెలు చేసి పెట్టుబడి తన నిజ స్వరూపాన్ని నగ్నంగా బట్టబయలు చేసుకోవడమే  ఈ క్రోనీ క్యాపిటలిజం. 

1870లోనే బ్యాంక్‌ పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడి కలిసి పోయి ద్రవ్య పెట్టుబడిగా రూపొంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను హస్తగతం చేసుకొంది. అనాటి నుంచి ఆర్థిక సామ్రాజ్యవాదంగా రూపొందుతోంది. ఈ సూత్రీకరణకు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి మధ్యగల సంబంధాన్ని అర్థం చేసుకోలేక కొంతకాలం ఉపేక్షించిన ఒక తరం మేధావులు 2008 తరువాత దాని శక్తిని గ్రహించి పెట్టుబడిదారీ రూపాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. నిజానికి విలువ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన అడమ్‌ స్మిత్‌, రికార్డో వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని మార్క్స్‌ పెట్టుబడిదారులకు లాభాలు ఎలా వస్తున్నాయనే అంశాన్ని విపులీకరించే క్రమంలో శ్రామికుని శ్రమను కొల్లగొట్టే అదనపు విలువ సూత్రాన్ని శాస్త్రీయంగా క్యాపిటల్‌ వాల్యూమ్‌4లో విపులంగా చర్చించిన సంగతి అందరికీ తెలిసిందే. అర్థవలస, అర్థభూస్వామ్య వ్యవస్థలో మిగులు విలువ ఎలా వస్తుంది? పెట్టుబడి సంచయం ఎలా జరుగుతుందనే మీమాంసను కొంతవరకు భారతదేశం వంటి దేశాల్లో జరుగుతున్న లావాదేవీల ఆధారంగా వివరించటానికి కొందరు ఆర్థికవేత్తలు ప్రయత్నించారు. పరాంజోయ్‌ గుహ ఠాకుర్తా అనే రచయిత కెజి-డి6 గ్యాస్‌ ప్రాజెక్టుకు సంబందించి అంబానీకి ఏ విధంగా కేటాయించబడిరదో వివరిస్తూ దాన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో భాగంగా చూపిస్తూ పుస్తకం ప్రచురించారు. 

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేది సాహసంతో, స్వతంత్రంగా అభివృద్ధి చెందే వ్యాపారం కాదు. ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందటానికి వ్యాపార వర్గాలు రాజకీయ వర్గాలతో చాలా దగ్గరి సంబంధాలను కలిగి ఉంటారు. రాజ్యం, రాజకీయాలు, వ్యాపారాలు పెనవేసుకున్న బంధంగా ఈ క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతోంది. అంటే ఒకరి ప్రయోజనాలు ఒకరు నెరవేర్చుకుంటూ నూతనమైన ఆర్థిక, రాజకీయ గుత్తాధిపత్యాన్ని సంపాదిస్తారు. ఆశ్రిత పెట్టుబడి రాజ్యాధికారాలను ఉపయోగించి దానికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లను పొందుతుంది. అంటే పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన భూమిని ఉదారంగా పొందుతుంది. కావలసిన ప్రాథమిక ఏర్పాట్లను పొందుతుంది. అంటే పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అనుమతులు, గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, ఆటంకంగా ఉన్న చట్ట సవరణలు మొదలైనవన్నీ పొందుతుంది. అంతేకాదు, తన ఉత్పత్తులను ప్రభుత్వానికే విక్రయించి దాని లాభాలకు పూచీని కూడా పొందుతుంది. పెట్టుబడిదారులకు, పెట్టుబడికి ఇంతసేవ చేసినందుకు గాను రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సహాయం చేస్తుంది. ప్రభుత్వాధికారులకు, మంత్రులకు వారి లాభాల్లో కమీషన్లు లేదా వాటాలు ఇస్తారు. 

నిజానికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి కావాల్సిన పునాదులు భారత ఆర్థిక వ్యవస్థలో ఎప్పటి నుండో ఉన్నాయి. అసలు ఈస్ట్‌ ఇండియా కంపెనీ లావాదేవీలు మూలంగానే దళారీ పెట్టుబడిదారీ వర్గం పెరిగిందని పరిశీలనలో తేలింది. ముఖ్యంగా వారు ప్రవేశపెట్టిన మేనేజింగ్‌ ఏజెన్సీ సిస్టం బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో వారికి ఏజెంట్లుగా ఆశ్రితులుగా భూములు, వనరులు ఎలా, ఎవరు దోచుకున్నది తెలుసుకుంటే భారత దేశంలో పెట్టుబడిదారీ విధానానికి కావాల్సిన ముడి సరుకు ముందు నుండి ఉన్నట్లు స్పష్టమవుతుంది. కా. సునీత్‌ కుమార్‌ ఘోష్‌ ‘ఇండియా – రాజ్‌’(1919-1947) అనే పుస్తకంలో దళారీ ‘బూర్జువా వర్గం ఏర్పడ్డ క్రమాన్ని సోదాహ‌రణంగా వివరించారు. భారతదేశంలో ‘ప్రణాళికలు: లంపెన్‌ అభివృద్ధి-సామ్రాజ్యవాదం’ అనే పుస్తకంలో పాలకులు సామ్రాజ్యవాదానికి, దళారీ బడా బూర్జువా వర్గాల లాభాలకు, దోపిడీకి ఎలా సహకరిస్తున్నారో వివరించారు. 

50 దశకం నుంచి 80వ దశకం వరకు మనకు ఎక్కువగా టాటా, బిర్లా పేర్లు వినిపించేది. అది ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినబడుతున్నాయి. వీరు స్వల్పకాలంలో సంపన్నులైనారు. అదానీ అనే గుజరాతీ వ్యాపారీ ఏడేళ్ల కాలంలో ఎదిగిన వైనమే మనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 2001లో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అదానీ సంపదలు పెరిగేలా చేసింది. 1980లో కమాడిటీస్‌ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించిన అదానీ ఈ ఏడేళ్ల కాలంలో చైనా కోటీశ్వరుడు జాన్‌ షాంషియాన్‌ తర్వాత ఆసియాలోనే రెండవ సంపన్నుడిగా ఎదిగారు. మొత్తం ప్రపంచంలో ముఖేశ్‌ అంబానీ ధనికుల జాబితాలో 13వ స్థానంలో ఉండగా అదానీ 14వ స్థానానికి ఎదిగారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కార్పొరేట్‌ కేపటలిజంగా రూపొందడానికి, రహస్య ఒప్పందాలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కలుగచేసుకోవడం, పన్నుల ఎగవేత, ప్రభుత్వ పరిశోధన పలితాలను దొంగిలించటం, బ్యాకింగ్‌ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం, విధానాలు రూపొందించే బ్యూరోక్రాట్లను ప్రసన్నం చేసుకోవడం వంటి అనేక పద్ధతులు వాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ మోడీ ప్రభుత్వం చేస్తున్నది.

 ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో విచ్చలవిడిగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం- ఆశ్రితుల మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, విధానాలు ప్రజల కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, నిజాయితీగా ఎటువంటి అవినీతికి తావులేకుండా జరుగుతున్నట్లు నమ్మిస్తున్నారు. అందుకు ఆశ్రిత మేధావి వర్గం, మీడియా, మనీ పవర్‌ తోడ్పడుతుంది. దానికో సిద్ధాంతాన్ని ప్రపంచ బ్యాంక్‌ ముందుగానే తయారుచేసి చిన్న చిన్న దేశాలపై ప్రయోగించి పరిశోధనల సారం అంటూ విపరీతమైన ప్రచారం కల్పించి ప్రజల ముందు ఉంచింది. ఇప్పుడు అంతర్జాతీయ కార్పొరేట్లు చిన్న చిన్న దేశాలనే కాదు భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలను సైతం శాసించే దిశగా ఎదిగారన్నది మనం చూస్తునే ఉన్నాం. ప్రపంచంలో 26 కుటుంబాలు (భారతీయులతో సహా) ప్రపంచ సంపదలో సగభాగం పొందగలిగారంటే మిగులును లాభాలను అనేక రూపాల్లో పిండగలుగుతున్నారని అర్థం. 

క్రోనీ క్యాపిటలిజం నుండి భారీ ప్రయోజనాలను అనుభవిస్తున్న కంపెనీలు గత 7 సంవత్సరాల నుండి భారతదేశంలో భారీ లాభాలను అనుభవిస్తున్నాయి. ఈ కంపెనీలు ఎన్నికల నిధుల పేరిట భారీ ధనాన్ని విరాళంగా ఇస్తున్నాయి. ప్రభుత్వం నుండి అనేక అనుకూలమైన పాలసీలు మరియు టెండర్లను తిరిగి పొందుతున్నాయి. భారతదేశంలోని బిలియనీర్ల జాబితాను చూస్తే, వారిలో కొందరు గత కొన్ని సంవత్సరాలుగా వారి మొత్తం ఆస్తులను అనేక రెట్లు పెంచుకున్నారు. ‘‘పబ్లిక్‌ గుడ్‌ లేదా ప్రైవేట్‌ వెల్త్‌’’ పేరుతో 2019లో వెలుబడిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక భారతదేశంలోని టాప్‌ 10 శాతం ధనవంతులు మొత్తం జాతీయ సంపదలో 77.4 శాతం కలిగి ఉందని వెల్లడిరచింది. మరోవైపు, దిగువ 60 శాతం జనాభా జాతీయ సంపదలో 4.8 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. క్రోనీ క్యాపిటలిజం యొక్క అతి పెద్ద పరిణామం ఏమిటంటే, ఇది ప్రతిరోజూ ప్రపంచంలో ఆదాయ అసమానతను పెంచుతోంది.  కాబట్టి క్రోనీ క్యాపిటలిజం ఉనికి దేశంలోని సంపదను దేశంలో ఉన్న కొద్దిమంది ధనికుల వద్ధ కేంద్రీకరించడంలో సహాయపడుతుందని నిర్ధారించవచ్చు. ధనికులను మరింత ధనికులుగా మరియు పెదలను మరింత పేదలుగా మార్చడానికి ఈ క్రోనీ క్యాపిటలిజం బాధ్యత వహిస్తుంది.  

మనదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెసు మొదలు ప్రాంతీయ పార్టీల వరకు కార్పొరేట్ల నుండి కోట్లాది రూపాయలు విరాళాలు తీసుకుంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలియన వ్యక్తుల నుంచి 3,377 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. ఈ సొమ్ము ఎవరు ఇచ్చారు? అనే ఆధారాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో ఇది దాదాపు 70 శాతంగా ఉందని అంచనా. అంటే కేవలం 30 శాతం విరాళాలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. ఈ సొమ్ములో దాదాపు 75 శాతం ఒక్క బిజెపికి మాత్రమే అందాయట. ఒక్క ఏడాదిలోనే 2,642 కోట్ల రూపాయలు బిజెపికి అందాయని వార్తలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలకు భారీగా డబ్బులు ఎవరు ఇస్తున్నారో బయటకు తెలియట్లేదు. ఇలాంటి సొమ్మంతా బ్లాక్‌ మనీగానే పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. విరాళం ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పొద్దంటున్నాడంటే  అతను దొడ్డిదారిన సంపాదించినట్టే కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి భారీగా విరాళాలు ఇస్తున్నారంటే, అధికారంలోకి వచ్చినప్పుడు తమ అక్రమాన్ని చూసీ చూడనట్టు ఉండాలని కోరుతున్నట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

దేశాల ఆర్థిక అభివృద్ధి కుంటు పడిపోవడానికి ఆయా దేశాల విధానాల రూపకల్పనలో ఏ విధమైన ఉత్పాదకత లేకపోయినా తమకు ఎక్కువ సంపద దక్కేలా చూసుకోవడాన్ని ‘బాడుగ భడవలు’ ప్రవర్తన అని ఒక సిద్ధాంతాన్ని 1970 ప్రాంతంలో కొంతమంది ఆర్థికశాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. దీన్ని గమనించిన ప్రపంచ బ్యాంకు ప్రభుత్వ సంపదను వనరులను వ్యక్తులు దోచుకోవడాన్ని మాత్రమే అవినీతి అని నిర్వచించిన మీదట అవినీతిపై చాలా చర్చ నడిచింది. ఎక్కడైతే ప్రభుత్వం అన్నింటా ప్రవేశించి నిర్ణయాలు చేస్తుందో పాలన కుంటుపడి అదృశ్యపాదం ప్రవేశించి ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుందని కొంతమంది వ్యాపార ఆర్థిక శాస్త్ర‌వేత్తలు, మేధావులు ప్రచారం చేశారు. వీరి భావన ప్రకారం మార్కెట్‌ పైన ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన కొంతమందికి నోబెల్‌ ప్రైజ్‌లు కూడా అందించారు. 

ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఇచ్చే అప్పులకు షరతుల నిబంధనలకు లొంగి మొత్తం ఆర్థిక వ్యవస్థలను ప్రయివేటీకరించే కార్యక్రమాల్ని భారత్‌  చేపట్టింది. భారతదేశం 1990 దశకంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను కావలించుకుంది. దాని పర్యవసానం మనం చూస్తున్నాం. అసమానతలు పెరిగినా, ఆకలి పేదరికం పెరిగినా ప్రభుత్వ సంపద వనరులు ప్రయివేట్‌ వ్యక్తుల ఆధీనంలోకి వెళితే వాటి విలువలను పెంచే దగుల్బాజీ రేటింగ్‌ సంస్థలు ఆర్థిక అభివృద్ధి జిడిపి రూపంలో పెరిగినట్టు చూపించటం జరుగుతోంది. ఇప్పుడు దేశంలో కొవిడ్‌ మూలంగా నిరుద్యోగం, ఆకలి, అసమానతలు పెరిగినా దేశసంపద పెరుగుతోంది. సంపద పెరుగడం అంటే కార్పొరేట్ల సంపద అని అర్థం. విచిత్రంగా భారత్‌ షేర్‌ మార్కెట్‌ అమాంతం కొద్దిరోజుల్లోనే ఎగ బాకింది. ఇదెలా సాధ్యం? 

ఇక్కడే తెలివిగా ప్రభుత్వాన్ని వెనుకకు మళ్ళించి పాలనను పెంచితే అన్నీ సాధ్యమేనని ప్రపంచ బ్యాంక్‌ సూత్రాన్ని దేశ భక్తులు, ‘తక్కువ ప్రభుత్వం… ఎక్కువ పాలన’ (లెస్‌ గవర్నమెంట్‌ మోర్‌ గవర్నెన్స్‌) అన్న నినాదం అందుకున్నారు. దీని మర్మమేమి? రాజ్యాన్ని నిర్వహించేది ప్రభుత్వం, ఆ ప్రభుత్వం లేకపోతే ఎంతటి గొప్ప పాలన అయినా అరాచకత్వం (రాజు లేకపోవటం) క్రిందకు వస్తుంది. ప్రజాస్వామ్య యుగంలో పాలన ప్రజాస్వామ్య యుతంగా ప్రజలకు అనుకూలంగా దగ్గరగా ఉండాలి. అందుకు అనేక వ్యవస్థలు ఉన్నాయి. మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. జవాబుదారీతనం లేదు. కొవిడ్‌ కాలంలో జ్ఞానోదయం అయిన ఓఇసిడి  దేశాలు ప్రభుత్వ రంగాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. అగ్రరాజ్యాలు 1930 సంక్షోభం తర్వాత అనుసరించిన సంక్షేమ విధానాల వైపు మల్లుతుంటే మన దేశంలో అరాచకత్వం పెరిగి ప్రభుత్వంతో సంబంధం లేని ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి. 

వ్యాపారం తప్పనిసరిగా అధిక లాభాలను సంపాదించేదిగా ఉండాలని భావించినవారు, దాన్ని రాజకీయ అధికారం కోసం ఉపయోగిస్తారని నోమ్‌ చోమ్క్సీ అంటారు. ప్రభుత్వాలను, ఉద్యోగులను వ్యాపారులు అవినీతిపరులుగా మారుస్తారు. లాబీలు  ఏర్పడతాయి. ఆశ్రిత పెట్టుబడి విపరీతమైన అవినీతికి దారి తీస్తుంది. పన్నుల ఎగవేతను, అక్రమ వ్యాపారాన్ని ఇది అనుమతిస్తుంది. అవినీతికర ప్రభుత్వాలు వ్యాపారులతో పూర్తి సంబంధాలు కలిగి ఉంటాయి. ఆశ్రిత పెట్టుబడి ఒక్కోసారి మతానికి, జాతులకు మద్దతుగా మెజారిటేరియన్‌ నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఉదాహరణకు సిరియా, భారతదేశంలో మత విభజన మొదలైనది తీసుకోవచ్చు. ఆశ్రిత పెట్టుబడి వారి మద్దతునూ పొందుతుంది. అయితే అది అవినీతి, సహజ వనరుల దోపిడీతో ఎదుగుతుంది తప్ప దేశాలనూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచలేదు. అందుకే ప్రజలకు తిరుగుబాటు తప్పదు. 

ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన 1991 నుండి దీని ప్రభావ తీవ్రతను మనం గమనించవచ్చు. ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు, భారత మార్కెట్‌ను వశపర్చుకోవడానికి వచ్చాయి. అప్పుడే రాజకీయ వర్గాలకు పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత రాజకీయ నాయకులే వ్యాపారస్తులుగా మారారు. వ్యాపారస్తులు రాజకీయ నాయకులుగా అవతారమెత్తారు. వ్యాపారస్తులు పార్లమెంట్‌లోకి రావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆశ్రిత పెట్టుబడి కనీస నీతిని కూడా కాలరాస్తుంది. అంటే స్వేచ్ఛా మార్కెట్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటుంది. అవినీతిమయమైన ఈ క్రోనిజాన్ని ‘ఫ్లుటోక్రసీ’ అంటారు. అంటే ‘సంపన్నుల పరిపాలన’ లేదా క్లెప్టోక్రసీ అంటే ‘దొంగలచే పరిపాలన’  అని అర్థం. ఈ ఆశ్రిత పెట్టుబడి వ్యవస్థలో పర్యావరణ విధ్వంసం విపరీతంగా జరుగుతుంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. భూమిని, సహజ వనరులను చాలా చౌకగా పరిశ్రమాధితులకు ప్రభుత్వాలు కట్టబెడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ఏర్పాటు చేసిన నాటి ‘కోల్‌గేట్‌ కుంభకోణం’ దీనికి మంచి ఉదాహరణ. ఇందులో గౌతమ్‌ ఆదానీకి సెజ్‌ నిమిత్తం వేల ఎకరాల భూమిని ప్రభుత్వాలు కేటాయించాయి. కాంగ్రెస్‌, బిజెపి రెండు ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.

గుజరాత్‌లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆశ్రిత పెట్టుబడి ఆచరణ వేగంగా పెరిగింది. గౌతమ్‌ ఆదాని ఒక జాతీయ పెట్టుబడిదారునిగా ఎదిగాడు. గత ఐదేండ్లలో రెండు శాతంగా ఉన్న అదాని ఆదాయం పన్నెండు శాతానికి పెరిగింది. అంబానీ సోదరులకు గత యాభై ఏండ్లలో పోగైన సంపదకు రెట్టింపు ఆదాయం ఈ ఐదేండ్లలో పెరిగింది. అంతేకాదు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, వారి చెల్లింపులకు ఏ రకమైన హామీ లేకుండానే బ్యాంకుల ద్వారా అప్పులు అందజేస్తాయి. అట్లా బ్యాంకులకు కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిపడిన పెట్టుబడిదారులు నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా మొదలైన వాళ్లెందరో దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్నారు. అదేవిధంగా పెట్టుబడిదారులకు గత ఏడేండ్లుగా దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ డబ్బంతా దేశ ప్రజలది. ప్రభుత్వాలు అప్పనంగా వారికి దోచి పెట్టాయి. పెడుతున్నాయి. గత 45 ఏండ్లలో కనీ వినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం నేడు యువతను పట్టి పీడిస్తోంటే, లక్షలాదిగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏ చర్యా తీసుకొని, కనీసం మాట్లాడని ప్రభుత్వం, పరిశ్రమాధిపతులు ‘‘మేము నష్టాలలో ఉన్నాం, ఆదుకోవాలి’’ అని కోరగానే పోయిన బడ్జెట్‌లో  సర్‌ చార్జీలను ఎత్తి వేశారు. ఇంకా ఏ రకమైన ఉద్దీపన కార్యక్రమాలు చేపడతారో చూడాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో ఆశ్రిత పెట్టుబడి అనేది ఒక సంస్కృతిగా మారింది. 

ఆశ్రిత పెట్టుబడి విధానంలో మనం అనేక లాలూచీ లావాదేవీలను చూస్తున్నాం. మనదేశంలో కూడా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపారంలో పోటీ ఉంటుంది. ఇది ఆ వ్యవస్థ సహజ లక్షణం. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల గుత్త సంస్థల పక్షం వహించి వారికి అనుకూల నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు బహిరంగంగా పోటీపడే వ్యాపారులను నిరోధిస్తాయి.  20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌, ఆరు లక్షల కోట్ల మోనటైజేషన్‌ పేరిట ప్రయివేటీకరించటానికి సిద్ధం చేసి ప్రజల ఆస్తులు కొద్దిమందికే ధారాదత్తం చేసి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. గతంలో 2జి వేలం విషయంలో గగ్గోలుపెట్టిన బిజెపి నాయకులు ఒక సెక్షన్‌ మీడియా ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కొద్దిమందికే చేరిపోతుంటే అదంతా ఆరాచక పాలనలో జరుగుతున్న లావాదేవీలని సరిపెట్టుకుంటున్నారు. నిజానికి విశాఖపట్టణంలో జరుగుతున్న లావాదేవీలు తీసుకుందాం. గంగవరం పోర్ట్‌, స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూమి, ఒక ప్రభుత్వం ప్రయివేటీకరించింది. ఇంకో ప్రభుత్వం వేల కోట్ల విలువైన పోర్టునే కాదు, భూములను ఆదానీకి బదలాయించింది. ఇది అవినీతిగా దేశభక్తులకు అనిపించటం లేదు. ఇది అరాచక పాలనలో జరిగే అవినీతి. దీన్ని క్రోనీకేపటలిజం అంటే ఆశ్రితులకు ముఖ్యంగా గుజరాతీయులకు అప్పజెప్పటంగా పరిగణించవచ్చు. 

భారత రాజ్యాంగం ప్రకారం మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. గణతంత్ర రాజ్యమంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన(ఆత్మనిర్భర్‌) అంటే స్వంత వనరులు, స్వంత పరిజ్ఞానం, స్వంత శ్రమతో ఉత్పత్తి చేసి వినియోగించడంగా ఉంటుంది. దీనికోసం పౌరులకు స్వేచ్ఛ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ రెండూ ప్రమాదంలో ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు ధారాదత్తం చేసేవిధంగా ఉంది. గణతంత్ర దేశంలో ప్రజలే విధాన నిర్ణయ కర్తలు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా  ఉండాలి. సమాజ సంపుష్టితత్వం కోసం ప్రధాన రంగాలైన రక్షణ, రవాణా కమ్యూనికేషన్‌, ఆర్థికానికి నాడీ వ్యవస్థలైన బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, మౌలిక సదుపాయాల కల్పనలతో పాటు, ప్రధాన వనరులైన చమురు, ఇనుము, ఉక్కు విద్యుత్తు వంటి పరిశ్రమలన్నీ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటేనే మానవాభివృద్ధి సాధ్యమని సామాజిక ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ ప్రజలందరికి అభివృద్ధి ఫలాలు పంచదు. ప్రజల బాధలు తీరాలంటే బూర్జువా వ్యవస్థను ప్రజాతంత్ర వ్యవస్థగా మార్చుకుంటేనే ప్రజలందరికి అభివృద్ధి ఫలాలు సమానంగా అందుతాయి. అందుకు వ్యవస్థ మార్పుకోసం పోరాడడమే ప్రజల ముందున్న ఏకైక మార్గం. 

Leave a Reply