రెండు దశాబ్దాల క్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్ నేల పై అడుగుపెట్టిన అమెరికా అవమానకరమైన రీతిలో తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి ఉడాయించింది. రెండేళ్లుగా తనకు ఏ ప్రమాదం తలపెట్టకుండా వెళ్లనీయండoటూ తాలిబాన్ లతో రహాస్యంగా దోహలో మొదలైన చర్చలు పరిపూర్ణం కాకుండానే తానే విధించుకున్న గడువు ముంచుకు రావడంతో వియత్నాం ను విడిచివెళ్లిన చారిత్రక దృశ్యాలను ప్రపంచానికి మరోసారి గుర్తుకు చేస్తూ మరీ నిష్క్రమించింది అమెరికా. ఉగ్రవాదాన్ని అణచడమే మా పని.. జాతి నిర్మాణం కాదని ఇప్పుడు అంటోంది.  1980 తొలినాళ్లలో సోవియట్ సేనలను ఎదుర్కొనేందుకు తానే నాటిన ఛాందస బీజాలు నేడు పెరిగి పెద్దయిన తాలీబాన్ వృక్షాల క్రింద నిలవనీడ లేని స్థితిలో బతుకు జీవుడా అంటూ భయంతో పారిపోయింది. ప్రపంచం ఉహించినదానికంటే వేగంగా, తీవ్రంగా తాలిబాన్ దళాలు ఆఫ్ఘన్ రాజదాని కాబూల్ ని ఆగస్ట్ 15న స్వాధీనం చేసుకోవడంతో తానే విధించుకున్న ఆగస్ట్ 31 గడువు లోపు పులిలా వచ్చిన అమెరికా పిల్లిలా జారుకున్నది. రెండేళ్లు ఒక బూటకపు చర్చల ప్రహసనాన్ని కొనసాగించి తనను తన నిష్క్రమణ కోసం చేసిన తతంగాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఏదో జరుగబోతుందనే దృశ్యాన్ని బయటి ప్రపంచానికి తన కనుసన్నల్లోని మీడియా ద్వారా పదే పదే ప్రచారం చేసింది. అంతర్జాతీయ మీడియా మొదలు కుంటే స్థానిక మీడియా వరకు తాలీబాన్ ల ‘అకృత్యాలు, దూరాగతాల’ దృశ్యాలే తప్ప మరో అంశాన్ని వార్తగా రానివ్వలేదు. అమెరికా భయంతో జారుకున్న దృశ్యాల కంటే విమానం నుండి తాలిబాన్ ల వల్ల ముప్పు ఉందని పారిపోయే ప్రయత్నంలో ఆఫ్ఘ‌న్లు  విమానం నుండి జారిపడి మరణించిన దృశ్యాల‌నే  వేల సార్లు ప్రపంచం కళ్ళ మీద ప్ర‌ద‌ర్శించింది.  తన పాపమనే అంశాన్ని మరిమింప చేయడానికి నానా తంటాలు పడింది. ఆఫ్ఘన్ నేలను తనేదో ఆధునికం చేస్తున్నట్టు, అనాగరిక జాతులను నాగరికులుగా మారుస్తుంటే చాందస తాలీబాన్ లు ఉగ్రచర్యలతో అడ్డుకుంటున్నట్టు అమెరికా ఎంపిక చేసిన కొందరి బాధితులను ప్రదర్శనకు పెట్టింది. మూకుమ్మడిగా హత్యాకాండకు, ఉన్మాద దాడులకు పాల్పడుతున్నట్టు కూడా బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చాలా చేసింది అమెరికా. అమెరికా, ఆఫ్ఘన్  ఆక్రమణలో పాలుపంచుకున్న నాటో దేశాలు ఇతర యూరప్ దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ భయంకరమైన ప్రమాదంలోకి జారుకుంటున్నదని తన ఉనికి ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్ ఆధినికం అవుతుంది,నాగరితను నేర్చుకుంటదన్న  స్థాయిలో పోజులు పెట్టినవి. అమెరికాకు మద్దతు పలికి,ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సమిష్టి సంపద అయిన అపార సహజ వనరులను కొల్లగొట్టే కుట్రలకు ఒడిగట్టిన వారంతా బాధితులుగా ఆర్తనాదాలు చేస్తున్నారు.

తాలీబాన్ ల దాడుల్లో మరణించిన ఆఫ్ఘన్ ప్రజల కంటే అమెరికా దాని ఆక్రమణలో వెంట నడచిన నాటో  డ్రోన్ దాడుల్లో చంపబడిన అమాయక ప్రజల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉన్నది. అమెరికా రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తున్న దాష్టీకాల మీద నుండి  ప్రపంచం  దృష్టిని మరలించి తాలిబాన్ ను ఒక హంతక ముఠా, మతోన్మాద శక్తిగా చిత్రించి ఆఫ్ఘన్ ప్రజలకు అసలు శత్రువుగా చూపెట్టే ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా నిలబెట్టిన కీలు బొమ్మ ప్రభుత్వాన్ని తాలిబాన్ లు గుర్తించనపుడే, చర్చల్లో ఒక భాగస్వామ్య పక్షంగా అంగీకరించనపుడే అమెరికా ఓటమి ఖాయమైపోయింది. మిగిలిన కాలమంతా స్వచర్మ రక్షణకే వెచ్చించింది. ఏక కాలంలో జరిగిన అమెరికా నిష్క్రమణ, తాలిబాన్ ల కాబూల్ స్వాధీనం రెండింటిని ప్రపంచ దేశాల్లో ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టు వారు భాష్యం చెప్పుకుంటున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని సహించని సోషల్ సామ్రాజ్య వాద దేశాలైన చైనా, రష్యా ఒక కోణంలో, అమెరికాకు వంత పాడే దాని ‘మిత్ర’ దేశాలు మరో రకంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి.

భారతదేశానికి సంబంధించినంత వరకు అమెరికా విధానాన్నే సమర్ధించింది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా నెలకొల్పిన కీలు బొమ్మ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు నెలకొల్పే పేరుతో భారీగానే వ్యయాన్ని వెచ్చించింది. అక్కడి ప్రభుత్వ దళాలకు శిక్షణను, ఇతరేతర సహాయాన్ని అందించింది. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార పోరాటానికి మద్దతును ఇవ్వకుండా, ఆ దేశ భూభాగాన్ని భారత ‘వ్యతిరేక’ చర్యలకు వినియోగించుకోనివ్వకుండా ఉండడం కోసం సహాయమందించింది. పనిలో పనిగా ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ ప్రాబల్యంతో పోటీ పడే ప్రయత్నమూ చేసింది. తాలిబాన్ లు పాకిస్థాన్ శక్తులే అని భారత్ బలంగా విశ్వసిస్తున్నది. స్థానిక రాజకీయార్థిక చిత్ర పటంలో ఆధిపత్యపు క్రీడలే తప్ప ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏ దేశ ఎజెండాలో లేరు. అమెరికా నిష్క్రమణతో నిరాశలో ఉన్న భారత ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించలేక, పాత ప్రాజెక్టులను కొనసాగించలేక కుడితిలో పడ్డ ఎలుకలా ఎదురుచూస్తున్నది.

అమెరికా నిష్క్రమణ, తాలిబాన్ ల పునరాగమనం లలో రెండు కీలక అంశాలు ఉన్నాయి. తనకు తానే అజేయ శక్తిని అనుకునే సామ్రాజ్యవాద దేశం అయిన అమెరికాను ఆఫ్ఘన్ ప్రజలు తమ ప్రతిఘటనా శక్తితో  తోక ముడిచేలా చేసి వారి అహంకారాన్ని చావు దెబ్బ తీశారు. మరో దేశపు ఆంతరంగిక అంశాల్లో జోక్యం చేసుకోవడానికి, ఇతర దేశాల్లో ‘ప్రజాస్వామ్య’ స్థాపన పేరుతో ‘మానవహక్కుల’ పేరుతోనో తన ఉనికి స్థిరపరుచుకొని మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకునే ప్రయత్నాల పాచికలు ఇక పారవనే ఉత్తేజపూరితమైన సందేశం బయటికి వచ్చింది. అమెరికా పిరికితనం ఏమిటో ఆ కాగితపు పులి కళ్ళల్లో భ‌యమేమిటో బయటపడింది. సామ్రాజ్యవాదమే నాటిన చాందస బీజాలు నేడు అమెరికాను తోక ముడుచేలా చేయడం ఆ దేశానికి ఒక గుణపాఠం కావాలి. పాలకుల మార్పు పేరుతో అనేక దేశాలను తన యుద్ధ క్రీడకు మైదానాలుగా మార్చుకున్నది అమెరికా. తన ఆధిపత్య ప్రయోజనాలే తప్ప ఏనాడు ఏ ప్రజల బాగు కోరింది లేదు. ఆయిల్ నిక్షేపాలు, విలువైన భూగర్భ ఖనిజ వనరులు, మార్కెట్ విస్తరణ , వ్యూహాత్మక స్థావరాల ఏర్పాటుకే తప్ప ఏ ప్రాంత ప్రజల అభివృద్ధి అమెరికా ఎజెండా కాదనేది అమెరికా చేసిన అనేక దుర్మార్గపు యుద్దాలు చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. అనేక దేశాల్లో వీరోచిత ప్రతిఘటన లేకపోలేదు. అది వియత్నాం కావొచ్చు,  తాజాగా తాలిబాన్ చేతిలో చావుదెబ్బ కావొచ్చు.  ఇవ్వాళ ప్రతిఘటన శక్తులకు ప్రేరకంగా నిలిచే వర్తమాన విజయం ఇది. అమెరికా పెత్తనాన్ని ద్వేషించే శక్తులన్నిటికీ  తాలిబన్ పట్ల ప్రేమ  లేకున్నా తక్షణ విముక్తి కోసం తాలిబన్ వెంట నడిచాయి. అయితే ఈ విజేతలంతా ప్రజల మనుషులేనా? ప్రజలను సమస్త బంధనాల నుండి విముక్తి గావించి,పురోభివృద్ధి లో నడిపించే పురోగామి శక్తులేనా అనేది మొత్తంగా ప్రపంచ ప్రజలు సకల పీడనల నుండి విముక్తి కావాలని కోరుకునే శక్తులను తొలిచేస్తున్న ప్రశ్న! ఆఫ్ఘనిస్తాన్ విజయం  అనేక అనుమానాలను, భయాలను వెంట తీసుకొచ్చిన మాట నిజమే! ఏ చారిత్రక అనుభవాలు, ఏ శక్తుల ఉన్మాద చర్యలు ఈ భీతికి కారణమవుతున్నాయి. తాలిబాన్ ల దుష్కృత్యాలుగా చెప్పబడుతున్నవి, చూపెట్టబడుతున్నవన్ని వారికి పూర్తిగా ఆపాదించలేకపోయినా మొత్తంగా అలాంటి చరిత్ర వారికేమి లేదని కొట్టి పడేసే చరిత్ర వారిది కాదనేది చారిత్రక సత్యం. ప్రధానమైన,బలమైన శత్రువైన సామ్రాజ్యవాద, యుద్ధోన్మాద అమెరికాను ఎదిరించడం,తమ నేల మీద నిలవనీడ లేకుండా చేయడం ఒక గొప్ప స్వీయ గౌరవ పతాక రెపరెపలుగానే గుర్తించాలి. కానీ తన సొంత ప్రజలతో ఏ వైఖరిని కలిగి ఉన్నది? తన సొంత సమాజాన్ని ఏ లక్ష్యం వైపుగా నడిపిస్తున్నదన్నది ప్రజా విముక్తి కోరే వాళ్ళు,ప్రగతి శీలతను వాంఛించే వాళ్లు  అడగాల్సి ఉన్నది.

ఆఫ్ఘన్ పరిణామాలను ఏ దేశ ప్రయోజనాల కోణం నుండి ఆ దేశం చూస్తున్నది.   మొత్తంగా ఆఫ్ఘన్ ప్రజల కోణంలోంచి వారి భవిష్యత్ ను వారే నిర్మించుకునే, వారి నేల మీద వారే సర్వాధికారులయ్యే, వారి సహజ సంపద ను వారే అనుభవించే,వారి అభివృద్ధి కి వారే బాటలు వేసుకునే సర్వస్వతంత్ర స్థితిని పొందగలరా? అనేది ఎవరికి పట్టడం లేదు. ప్రతి ఆఫ్ఘన్ పౌరుడుకి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించే సామాజిక,భౌతిక స్థితి తాలీబాన్ ల వల్ల సాధ్యమయ్యేనా? చారిత్రకంగా వారి పుట్టుకలోను,ఎదుగుదలలోను,వారి పాలనలోను అలాంటి ఆనవాళ్లు మచ్చుకైనా లేవనేది అందరికి బోదపడిన సత్యమే! తమ దేశాన్ని పరాయి పెత్తనం నుండి బయట వేసే తెగింపు,పోరాటం ఉన్న శక్తులే కానీ తమ ప్రజాలను విముక్తి చేసే ప్రజావిముక్తిపోరాట కారులేమి కాదు. చాందస శక్తులే తప్ప కొత్త చరిత్రను నిర్మించే పురోగామి భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ప్రజాపక్ష శక్తులు కావు. షరియాను పునాదిగా చేసుకున్నవాళ్లే గాని ప్రజాస్వామ్య సూత్రాలను వంటబట్టించుకున్న వాళ్ళైతే కాదు. ఒక సామ్రాజ్యవాద శత్రువును  వదిలించుకుని,మరో సామ్రాజ్య వాద శక్తుల కౌగిలిలోకి ఒరిగిపోతున్నారు.

తాలీబాన్ ల ‘ప్రభుత్వం’  మాత్రం దేశాన్ని సర్వస్వతంత్రణగా ఉండేలా విధాన రూపకల్పన చేస్తున్నట్టు ఏమి కనిపించడం లేదు. కాబూల్ కి తాలీబాన్ దళాలు చేరక ముందే చైనా విదేశాంగ మంత్రితో తాలీబాన్ కీలక నేతలు చర్చలు జరిపారు. రష్యా ఎప్పటి నుండో తాలిబాన్ లతో ‘టచ్’ లోనే ఉన్నది. ఇక ప్రాంతీయంగా ఆధిపత్యం కోసం పోటీ లో అప్పటికే ఉన్న ఇరాన్,సౌదీఅరేబియాలకు తోడు టర్కీ కూడా తోడయ్యింది.పాకిస్తాన్ అయితే మొత్తంగా తాలిబాన్ లను తానే నడిపిస్తున్నాను అనుకుంటుంది. దీంట్లో కొంత వాస్తవం ఉన్నా మొత్తంగా అనేక గ్రూపులతో కూడిన తాలిబాన్ సమూహం పై పూర్తి నియంత్రణ లేదు.  వీళ్లేవరికీ ఆఫ్ఘన్ ప్రజల పట్ల ప్రేమ లేదు. ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక  ప్రాంతాలలో విలువైన ఖనిజ సంపద ఉన్నది. ట్రిలియన్ డాలర్ల విలువైన,అరుదైన ఆ సహజ సంపద పై ప్రదానంగా చైనా ఎప్పటి నుండో దృష్టి సారించింది. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నది అన్న దానితో సంబంధం లేకుండా తన చైనా తన బెల్ట్ అండ్ రోడ్ పథకంలో భాగంగా ఆర్థిక సహకారం పేరుతోనో అభివృద్ధి ప్రణాళికల పేరుతోనో ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాలల్లో తలదూర్చటమే కాదు నిర్ణాయక పాత్ర పోషిస్తున్నది ఇప్పుడైతే తాలిబానే తలను చైనా ఒళ్ళో దూర్చింది. అనేక తెగలతో కూడిన ఆఫ్ఘన్ సమాజంలో భూస్వామ్య, పెత్తందారీ కుటుంబాల నుండి వచ్చిన చాందస శక్తుల కలయికతో ఏర్పడిన తాలిబాన్ లు ఒక ఆధిపత్యం నుండి మరో ఆదిపత్యంలోకి దేశాన్ని నెట్టివేస్తున్నారు. ఒక స్థాయిలో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని అంతమొందిoచినట్టే కనపడినప్పటికిని ఒక స్వేచ్చాయుత,సర్వస్వతంత్ర దేశంగా రూపొందించేకంటే మరిన్ని పరాయి దేశాల పంచన చేరే ప్రణాలికనే కలిగి ఉన్నది. తన ఇస్లాం షరియ చట్టం పేరుతో గతంలోనే ఆటవిక పాలన సాగించింది. ప్రగతిశీల ఆలోచనలేమో గాని కనీస ప్రజాస్వామిక సంస్కృతి కూడా లేని తాలిబాన్ మహిళల పట్ల మరింత అనాగరికంగా వ్యవహరించింది.ఇప్పుడు కూడా అంతకంటే భిన్నంగా ఉండబోతున్నట్టు తన కొత్త కార్యాచరణను ఏమీ ప్రకటించుకోలేదు. మహిళలకు చదువే అవసరం లేదు,ఉద్యోగాలు చేయకూడదు,ఇంటికే పరిమితం కావాలనే దుర్మార్గపూరితమైన ఎజెండానే అమలు చేసే సంకేతాలనే అందిస్తున్నది. గాలి పటాలు ఎగిరెయ్యకూడదు, సంగీత క్లబ్బులు ఉండకూడదనే చిన్న చిన్న అంశాల పైన సైతం తీవ్ర నిర్బంధాన్ని విధించిన చరిత్ర ఎలాగూ ఉన్నది. ఇక ప్రభుత్వాన్ని విమర్శించడం,విధానాలను వ్యతిరేకించడం,అసమ్మతిని వ్యక్తపరచడం ఊహకందని విషయాలేమో. బహిరంగ శిక్షలతో భయానక వాతావరణాన్ని సృష్టించి మొత్తంగా సమాజాన్ని తుపాకీ నీడలోనే నడిపించాలనే చాందసం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తుందనే భయమే ఎక్కువగా ఉన్నది. మైనారిటీలు,వివిధ రకాల తెగల ప్రజలు, శాస్ట్రీయంగా ఆలోచించే బుద్ది జీవుల మనుగడ అత్యంత ప్రమాదంలో పడినట్టే. అయితే ఈ చాందస శక్తులను, తిరోగమనవాదులను ఎదిరించి నిలిచే ఆలోచనలు ఆఫ్ఘన్ సమాజంలో మొత్తంగానే లేవని అనుకోలేము. అక్కడా ప్రజా విముక్తి ఆలోచనలు, విప్లవ కార్యాచరణ ఉన్న  శక్తులు అజ్ఞాతంగా తమ ఉనికి ఎప్పటి నుండో చాటుకుంటూనే ఉన్నారు. మహిళలు అనేక ప్రాంతాల్లో తాలిబాన్ కి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన దృష్టాంతాలు కూడా అనేకం ఉన్నాయి. ఇవ్వాళ ఈ శక్తులు బలహీనంగా ఉండవచ్చు,అజ్ఞాతంగా ఉండవచ్చు  కానీ కొత్త సామ్రాజ్యవాద దేశాలను,అధికారంలో ఉన్న చాందస మూకలను కూల్చేసే తెగువ,సత్తువ త్యాగాల చరిత్ర ఆఫ్ఘన్ సమాజానికున్నది. భవిష్యత్ లో ఆ ప్రజాపక్ష శక్తులే దేశాన్ని అన్ని ఆధిపత్యాల నుండి ప్రజలను విముక్తుల్ని చేసి వారిని స్వేచ్చా జీవులగా ఆఫ్ఘన్ గడ్డపై నిలబెడుతారని కొత్త తరం ఆ వైపుగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

Leave a Reply