ఒడిశాలోని రాయగడ మరియు కలహండి జిల్లాల్లోని తిజిమాలి, ఇతర గ్రామాల నివాసులు ఒక కొత్త బాక్సైట్ గని ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులలో చాలామందిని అరెస్టు చేసి, వారి బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లను శుభ్రం చేసేలా బలవంతం చేశారు.
ఒడిశాలో గనుల తవ్వకం వ్యతిరేక నిరసనలు:
ఒడిశాలోని దక్షిణాది జిల్లా అయిన రాయగడలో గనుల తవ్వకం వ్యతిరేక నిరసనలను నేరపూరితం చేయడం 2023లో ప్రారంభమైంది. వేదాంత ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న దళిత, ఆదివాసీ గ్రామస్తులను అరెస్టు చేసినప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. అప్పటి నుండి, కనీసం 40 మందిని అరెస్టు చేయగా, బెయిల్ షరతుగా కనీసం ఎనిమిది మంది నిరసనకారులు పోలీస్ స్టేషన్లను శుభ్రం చేయాలని కోర్టులు ఆదేశించాయి. మేము ఇటువంటి ఏడు ఆదేశాలను సమీక్షించాము; ఇద్దరు బాధితులతో మాట్లాడాము. అగ్రవర్ణ, ఒబిసి కులాలకు చెందిన న్యాయమూర్తులు జారీ చేసిన ఈ తీర్పులు కుల వివక్షతో కూడుకున్నవని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
తిజిమాలి, ఒడిశా: “పిటిషనర్ ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి 9:00 గంటల మధ్య కాశీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి.” 2025 మే 28 నాడు దక్షిణ ఒడిశాలోని రాయగడ జిల్లాకు చెందిన 26 ఏళ్ల దళిత గనుల తవ్వకం వ్యతిరేక నిరసనకారుడు కుమేశ్వర్ నాయక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఒరిస్సా హైకోర్టు విధించిన బెయిల్ షరతుల్లో ఇది ఒకటి.
2025 మే – జనవరి 2026 మధ్య కాలంలో జారీ చేసిన ఎనిమిది అటువంటి ఆదేశాలలో ఇది ఒకటి—వీటిని ‘ఆర్టికల్ 14’ పరిశీలించింది. వీటిలో ఏడు ఆదేశాలను రాయగడ జిల్లాలో ఇద్దరు న్యాయమూర్తులు (ఒకరు అగ్రవర్ణానికి చెందినవారు, మరొకరు ఓబీసీకి చెందినవారు) జారీ చేయగా, ఒక ఆదేశాన్ని హైకోర్టుకు చెందిన అగ్రవర్ణ న్యాయమూర్తి జారీ చేశారు.
దళిత, ఆదివాసీ నిరసనకారులు కులవివక్షగా భావిస్తున్న ఇటువంటి షరతులపైన బెయిల్ పొందిన ఎనిమిది మందిలో, ఆరుగురు దళితులు, ఇద్దరు ఆదివాసీలు ఉన్నారు.
చిన్న కిరాణా దుకాణం నడుపుకునే నాయక్, రాయగడ జిల్లాలోని ఇతర దళిత, ఆదివాసీ నివాసితులు ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులవుతున్నారు. వీరు 2023లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ ప్రభుత్వం, ముంబైకి చెందిన 50 ఏళ్ల బహుళజాతి గనుల తవ్వకం సంస్థ ‘వేదాంత లిమిటెడ్’కు బాక్సైట్ గనుల తవ్వకం కాంట్రాక్టును కేటాయించడాన్ని నిరసిస్తున్నారు. వేదాంత సంస్థకు గోవా, కర్ణాటక, ఒడిశా, ఐర్లాండ్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కార్యకలాపాలు ఉన్నాయి.
2024 జూన్ లో ఒడిశాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది, దీనితో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన ముగిసింది.
అవమానకరమైన షరతులు: కుమేశ్వర్ నాయక్ అనుభవం
రాయగడ జిల్లాలోని కాశీపూర్ జైలులో ఐదు నెలలు గడిపిన కుమేశ్వర్ నాయక్‌కు బెయిల్ లభించిన తర్వాత, 2025 జూన్ నుండి ఆగస్టు వరకు దాదాపు రెండు నెలల పాటు తనను గతంలో నిర్బంధించిన కాశీపూర్ పోలీస్ స్టేషన్‌ను తుడవడం, శుభ్రం చేయడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం పోలీసులు ఇచ్చిన చీపుర్లు, ఫినైల్, ఇతర వస్తువులను ఆయన ఉపయోగించారు.
నెలల తరబడి జైలులో గడిపిన తర్వాత ఉపశమనం లభించాల్సిన ఆ క్షణం, తనను అవమానించడానికి ఉద్దేశించిన ప్రక్రియగా మారిందని ఆయన చెప్పారు.
“మేము ఈ అవమానకరమైన పనిని చేయాల్సి ఉంటుందని తెలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నప్పుడు, ‘ఈ చిన్న ఆదేశం కంటే మన లక్ష్యం చాలా పెద్దది’ అని నా మనస్సుకు చెప్పుకున్నాను,” అని నాయక్ అన్నారు. “అయితే, న్యాయవ్యవస్థే స్వయంగా ఇటువంటి కులవివక్షతో కూడిన ఆదేశాన్ని ఇచ్చిందంటే, అసలు మన పరిస్థితి ఏమిటో అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది.”
రాయగడ జిల్లా కాశీపూర్ బ్లాక్‌లోని కాంటామల్ గ్రామానికి చెందిన నాయక్, కాశీపూర్ పోలీస్ స్టేషన్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. ఆయన్ని 2025 జనవరి 6న అరెస్టు చేశారు.
‘ఆర్టికల్ 14’ పరిశీలించిన ప్రాథమిక సమాచార నివేదిక (FIRఎఫ్‌ఐఆర్) ప్రకారం.. 2024 సెప్టెంబర్ లో పోలీస్ స్టేషన్ వెలుపల జరిగిన నిరసనల సమయంలో నాయక్, మరో వంద మంది వ్యక్తులు అల్లర్లు సృష్టించారని, అధికారులను అడ్డుకున్నారని, ఆస్తిని ధ్వంసం చేశారని, ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.
2025 మే 28 న ఒరిస్సా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పుడు, ఆయన కుటుంబ సభ్యులు, తోటి గ్రామస్తులు వేడుకలు జరుపుకుందామనుకున్నారు. కానీ, ఆ బెయిల్‌లో ఉన్న షరతు వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కులవివక్షతో కూడిన బెయిల్ ఆదేశాలు; అరెస్టుల పరంపర
“ఈ బెయిల్ ఆదేశం ద్వారా, అధికారులు మమ్మల్ని అవమానించాలని చూశారు. ఎందుకంటే మేము గనుల తవ్వకం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నాము. ఈ గనుల తవ్వకం వల్ల మేము నిరాశ్రయులవ్వడమే కాకుండా, మాకు కనీస అవసరాలను కల్పించే ఈ అందమైన కొండలు కూడా నాశనమవుతాయి,” అని నాయక్ అన్నారు.
జైలు నుండి విడుదలైన తొలి రోజులు తనకు స్పష్టంగా గుర్తున్నాయని నాయక్ చెప్పారు. కోర్టు ఆదేశాలను పాటించడానికి ఆయన కాశీపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడి పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు.
“మొదట్లో పోలీసులు ఏమీ అనలేదు,” అని ఆయన చెప్పారు. “వారు నన్ను కేవలం కొన్ని కాగితాలపై సంతకం చేసి వెళ్ళిపొమ్మని కూడా చెప్పారు. వారిలో కొందరు తాము కూడా దళిత, ఆదివాసీ సముదాయాలకు చెందినవారమని, తమకూ ఈ బెయిల్ షరతు నచ్చలేదని అన్నారు.”
కానీ 45 ఏళ్ల దళిత కార్యకర్త, రైతు అయిన హీరామల్ నాయక్ కూడా ఇటువంటి షరతులతోనే విడుదలైనప్పుడు పరిస్థితులు మారాయి. పోలీసులు, నిరసనకారులు ఇద్దరూ కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని రాయగడ జిల్లా కోర్టు పట్టుబట్టింది.
“హీరామల్ బయటకు వచ్చిన తర్వాత, మేము ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు, బెయిల్ షరతుల ప్రకారం పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేయమని మాకు చెప్పారు,” అని నాయక్ తెలిపారు. నాయక్ ఉదంతం ఒక్కటే కాదు, ఇది ఒక పరంపరగా మారుతోంది.

కులవివక్షతో కూడిన బెయిల్ ఆదేశాలు, అరెస్టుల సరళి
తిజిమాలి ప్రాంతంలోని ఆదివాసీ, దళిత సంఘాలు 2023 నుండి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేసే ‘వేదాంత లిమిటెడ్’ ప్రతిపాదించిన బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఒడిశాలోని కలహండి జిల్లాలోని లాంజిగఢ్‌లో ఉన్న తన అల్యూమినా రిఫైనరీకి ముడిసరుకును సరఫరా చేయడం కోసం ఈ కంపెనీకి తిజిమాలి బాక్సైట్ బ్లాక్‌ను కేటాయించారు.
ఈ ప్రాజెక్టులో తూర్పు కనుమలలోని తిజిమాలి కొండ శ్రేణిలో ఉన్న అటవీ భూమిని భారీ స్థాయిలో గనుల తవ్వకం కోసం మళ్లించడం జరుగుతుంది. ప్రతిపాదిత 1560.40 హెక్టార్ల గనుల తవ్వకం లీజు ప్రాంతంలో సుమారు 46.37% అటవీ భూమి ఉంది.
ఈ ప్రాజెక్టు కారణంగా రాయగడ జిల్లాలోని మాలిపదర్, కలహండి జిల్లాలోని తిజిమాలి అనే రెండు గ్రామాలు కనుమరుగవుతాయి. దీనివల్ల 140 కుటుంబాలకు పైగా నిరాశ్రయులవుతారు. సాంప్రదాయకంగా పశువుల కాపరులు లేదా రైతులుగా ఉన్న ఇక్కడి నివాసితులు, ఒకటి నుండి 10 ఎకరాల విస్తీర్ణంలో వరితో పాటు టమోటా, వంకాయ, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వంటి కూరగాయలను పండిస్తారు. ఇప్పుడు వారు తమ ఇళ్లను, సాగుభూమిని కోల్పోయి వేరే చోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తిజిమాలిలోని కాంటామల్ గ్రామానికి చెందిన శుభ సింగ్ మాఝీకి ఐదారు ఎకరాల భూమి ఉంది. పరిహారం గురించి ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన చెప్పారు. భూసేకరణ ప్రక్రియ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. గ్రామస్తులలో చాలామంది ఇతరుల భూముల్లో పని చేసేవారు కావడంతో, భూమిని సేకరించినప్పుడు వారు ఎటువంటి పరిహారానికి అర్హులు కారని తెలుస్తోంది. గ్రామస్తులను దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కట్ట గ్రామానికి తరలిస్తారని తమకు చెప్పినట్లు మాఝీ పేర్కొన్నారు.
అరెస్టయిన నిరసనకారులలో ఒకరైన ఉమాకాంత్ నాయక్ తదితర నిందితుల బంధువుల కథనం ప్రకారం, 2023 నుండి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినందుకు కనీసం 40 మందిని అరెస్టు చేశారు. వీరిలో కనీసం ఎనిమిది మంది దళిత, ఆదివాసీ గ్రామస్తులకు బెయిల్ షరతుగా పోలీస్ స్టేషన్లను శుభ్రం చేయాలని కోర్టులు ఆదేశించాయి.
‘ఆర్టికల్ 14’ ఈ షరతుతో కూడిన ఎనిమిది బెయిల్ ఆదేశాలను పరిశీలించింది. వీటిలో ఒకటి ఒడిశా హైకోర్టు నుండి కాగా, ఏడు ఆదేశాలు రాయగడ జిల్లా కోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల నుండి వచ్చాయి. ఈ ఆదేశాలను పాటించిన ఇద్దరు గ్రామస్తులతో కూడా మేము మాట్లాడాము. సామాజిక కార్యకర్తలు ఈ ఆదేశాలను కుల వివక్షతో కూడుకున్నవిగా భావిస్తున్నారు.
2025 మే 28న, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. పాణిగ్రాహి ఒక వివాదాస్పద బెయిల్ ఆదేశాన్ని జారీ చేశారు. వేదాంత లిమిటెడ్‌కు వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయడానికి షరతుగా పోలీస్ స్టేషన్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యకర్తలు, కోర్టు రికార్డుల ప్రకారం, ఆగస్టు 2025- జనవరి 2026 మధ్య రాయగడ జిల్లా కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు—రాయగడ అదనపు జిల్లా జడ్జి అల్పనా స్వైన్, కాశీపూర్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ నర్మదా కర్—మరో ఏడు అటువంటి ఆదేశాలను జారీ చేశారు.
కుమేశ్వర్ నాయక్ తదితర నిరసనకారులకు మద్దతు ఇస్తున్న సామాజిక కార్యకర్త శరణ్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎనిమిది ఆదేశాలలో ఐదింటిని అమలు చేశారు.
ఈ రకమైన బెయిల్ ఆదేశాలు పొందిన వారందరూ ‘మా మాటి మాలి సురక్ష మంచ్’ అనే క్షేత్రస్థాయి సంస్థతో సంబంధం ఉన్నవారే. తిజిమాలి కొండల్లో మైనింగ్‌ను వ్యతిరేకించడానికి రాయగడ జిల్లాలోని కుయి భాష మాట్లాడే ఆదివాసీలు, దళిత నివాసితులు ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.
పౌరసమాజ సంస్థలు, న్యాయవాదులు ఈ ఆదేశాలను కులవివక్షతో కూడుకున్నవి, అవమానకరమైనవి అని అన్నారు. చారిత్రక కాలం నుండి అణగారిన కుల వర్గాలపై బలవంతంగా రుద్దబడిన పనులను, ఈ నిబంధనల ద్వారా ఇప్పుడు వ్యక్తిగతంగా చేయిస్తున్నారని వారు వాదిస్తున్నారు.
2020 నుండి మధ్యప్రదేశ్‌లో వెలువడిన ఇటువంటి ఆదేశాలను, ఒడిశాలో వెలువడిన ఈ ఆదేశాలను సెప్టెంబర్ 2025లో ‘ది లీఫ్‌లెట్’ప్రచురించిన ఒక నివేదిక విశ్లేషించింది. నిందితులు విచారణకు హాజరయ్యేలా చూడటం అనే బెయిల్‌కు ఉన్న అసలు ఉద్దేశంతో సంబంధం లేకుండా, ఇటువంటి షరతులు విధించడం న్యాయాధికార పరిధిని మించిపోవడమేనని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఇవి చారిత్రక కుల వివక్ష పాత్రలను మళ్ళీ రుద్దుతున్నాయని వాదించింది.
భారతీయ న్యాయ సంహిత –2023 ప్రకారం, కొన్ని రకాల నేరాలకు శిక్షగా ‘సామాజిక సేవ’ చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో తాగి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం (సెక్షన్ 355), పరువు నష్టం (సెక్షన్ 356(2)) వంటి నేరాలు ఉన్నాయి.
భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 23 ప్రకారం, సామాజిక సేవ అంటే: “నేరస్థుడికి శిక్షా రూపంలో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పనిని చేయాలని కోర్టు ఆదేశించవచ్చు, దీనికి గాను అతనికి ఎటువంటి వేతనమూ పొందే అర్హత ఉండదు.”
అయితే, కుమేశ్వర్ నాయక్ పైన మోపిన ఆరోపణలలో బిఎన్‌ఎస్ సెక్షన్ 109 (హత్యా ప్రయత్నం) బిఎన్‌ఎస్ సెక్షన్ 191 (అల్లర్లు సృష్టించడం) ఉన్నాయి. ఇవి అత్యంత తీవ్రమైనవి, వారెంట్ లేకుండా అరెస్టు చేయగల(కాగ్నిజబుల్); బెయిల్ సులభంగా లభించని(నాన్-బైలబుల్) నేరాలు. ఈ సెక్షన్ల కింద బెయిల్ మంజూరు చేసేటప్పుడు ‘సామాజిక సేవ’ను ఒక షరతుగా విధించే వీలు చట్టంలో లేదు.
గనుల తవ్వకం వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇస్తున్న కార్యకర్త శరణ్య నాయక్ మాట్లాడుతూ, ఈ ఆదేశాలు న్యాయ వ్యవస్థలో పాతుకుపోయిన పక్షపాత వైఖరిని తెలియజేస్తున్నాయని అన్నారు. 2025 జూలై లో, 86 మందికి పైగా పౌరులు, న్యాయవాదులు, కార్యకర్తలు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, ఆ బెయిల్ షరతులను రద్దు చేయాలని వారు కోరారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల ఉన్న వివక్షే ఈ ఆదేశాలకు కారణమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
అయినప్పటికీ, నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. 2026 ఫిబ్రవరి 18నాడు మరో ముగ్గురు నిరసనకారులు—నారింగ్ దేయ్ మాఝీ, రమాకాంత్ నాయక్, సుందర్ సింగ్ మాఝీ—ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలయ్యారు.
కానీ, వారి విడుదలకు కూడా అదే వివాదాస్పద షరతు ఉంది. రాయగడ అదనపు జిల్లా జడ్జి అల్పనా స్వైన్ జారీ చేసిన ఆ ఉత్తర్వులలో, “మిగిలిన నిందితులు ఏ నిబంధనలు, షరతులపై విడుదలయ్యారో, వీరికి కూడా అవే వర్తిస్తాయి” అని పేర్కొన్నారు. ఆ నిబంధనల ప్రకారం, వారు “రెండు నెలల పాటు ఉదయం పూట (6 గంటల నుండి 9 గంటల మధ్య) కాశీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి.”
వారు తమ స్వగ్రామమైన తిజిమాలికి చేరుకున్న మరుసటి రోజే, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. రాయగడ సెషన్స్ కోర్టు విధించిన బెయిల్ షరతులలో భాగంగా రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిని వారు ప్రారంభించారు.
ఉద్యమ ప్రారంభం నుండి పాల్గొంటున్న 24 ఏళ్ల దళిత కార్యకర్త, రైతు ఉమాకాంత్ నాయక్ 2023లో అరెస్టయ్యారు. తన తోటి నిరసనకారులు పాటించాల్సి వచ్చిన బెయిల్ షరతులపై స్పందిస్తూ, అధికారులు తమ సముదాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.
తిజిమాలిలో గాని తవ్వకాలకు ప్రతిఘటన
వేదాంత సంస్థ ఆధ్వర్యంలోని ఈ బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్, తన అల్యూమినా రిఫైనరీల కోసం ఏడాదికి తొమ్మిది మిలియన్ టన్నుల ఖనిజాన్ని వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1,548 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో దాదాపు 700 హెక్టార్లు అటవీ భూమి ఉంది. ఇది ఆ సంస్థకు అత్యంత కీలకమైన ఆస్తి.
ఈ నిరసనలో ప్రధానాంశం ‘సముదాయ అంగీకారం’. భారతీయ చట్టాలైన అటవీ హక్కుల చట్టం, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం-1996 (పెసా) ప్రకారం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అటవీ భూముల్లో గనుల తవ్వకం చేపట్టాలంటే గ్రామసభల ముందస్తు, పూర్తి అంగీకారం తప్పనిసరి.
చట్టాన్ని పాటించకపోవడమే కాకుండా, తప్పుడు అంగీకార పత్రాలను అనుమతి పత్రాలుగా చూపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంగీకారం పొందడానికి అసలు సమావేశాలే జరగలేదని, ఆ పత్రాల్లో మైనర్లు, చనిపోయిన వ్యక్తులు, ఆ ప్రాంతంలో నివసించని వారి పేర్లు ఉన్నాయని గ్రామస్తులు చెప్పినట్లు జనవరి 2026లో ‘ఫ్రంట్‌లైన్’ పత్రిక నివేదించింది.
ఈ ఆరోపణలు అటు కంపెనీపైనా, ఇటు ప్రభుత్వ యంత్రాంగంపైనా ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని మరింతగా పెంచాయి. ఆ సముదాయాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఇటీవల కాలంలో, ఏ రకమైన అసమ్మతినైనా నేరంగా పరిగణించే ధోరణి పెరిగింది. న్యాయ వ్యవస్థ కూడా నిరసనకారుల స్వరాలను పట్టించుకోవడం లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో వివిధ రహదారుల, గనుల తవ్వకం ప్రాజెక్టులను అడ్డుకున్నందుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ప్రతిపాదిత ‘అదానీ గనుల తవ్వకం ప్రాజెక్టు’కు వ్యతిరేకంగా 2024 అక్టోబర్ నుండి ఆదివాసీ, దళిత, ముస్లిం, ఓబీసీ సముదాయాలు ఏకమై పోరాడుతున్నాయి. ఇక్కడ కూడా నిరసనకారులను అరెస్టు చేస్తే, వారు నెలల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు.
మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. దీనివల్ల తాము నిరాశ్రయులవుతామని, తమ పూర్వీకుల భూమిని కోల్పోతామని, పర్యావరణం విధ్వంసమవుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వే పనుల కోసం ఉపయోగిస్తున్న భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిరసన తెలుపుతున్న చాలా మంది సామాజిక కార్యకర్తలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఇద్దరిని తమ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు తమను నిరంతరం వేధిస్తున్నారని కూడా అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిరసనను నేరపూరితం చేయడం
స్థానికుల నుండి అంగీకారం పొందడానికి వేదాంత సంస్థ నియమించిన సబ్-కాంట్రాక్ట్ కంపెనీ అధికారులను, పోలీసులను ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నందుకు 2023 ఆగస్టు 13-25 మధ్య 24 మంది నిరసనకారులను అరెస్టు చేశారు.
2024 సెప్టెంబర్ 20న, గనుల తవ్వక వ్యతిరేక ఉద్యమంలో కీలక నాయకుడైన కార్తీక్ నాయక్‌ను కాశీపూర్ పోలీసులు అరెస్టు చేసి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఆయన విడుదలను డిమాండ్ చేస్తూ సుమారు 200 మంది గ్రామస్తులు స్టేషన్ వెలుపల గుమిగూడారు. దీనిపై పోలీసులు 58 మంది వ్యక్తుల పేర్లతో పాటు మరో 140 మంది గుర్తుతెలియని వ్యక్తులపైన కేసు నమోదు చేశారు.
ఈ ఎఫ్ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత కింద అల్లర్లు సృష్టించడం, క్రిమినల్ బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, హత్యా ప్రయత్నం వంటి అనేక సెక్షన్లను చేర్చారు. ఇతర ఆరోపణలలో ‘ప్రజా ఆస్తుల నష్టం నిరోధక చట్టం-1984’; ‘క్రిమినల్ లా (సవరణ) చట్టం’ కింద ఉన్న నిబంధనలను కూడా ప్రయోగించారు.
నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది మంగళ్ మూర్తి బ్యూరియా, సామాజిక కార్యకర్త శరణ్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 సెప్టెంబర్ నుండి నిరసన తెలిపినందుకు వివిధ అభియోగాలతో దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. అసమ్మతిని నేరంగా చిత్రీకరించే పద్ధతిని ఈ ఆరోపణలే ప్రతిఫలిస్తున్నాయని బ్యూరియా అన్నారు.
“ఆదివాసీలు సాంప్రదాయకంగా వేట కోసం లేదా ఆచారాల కోసం గొడ్డళ్లు, విల్లులను ధరిస్తారు” అని బ్యూరియా వివరించారు. “దీనిని కంపెనీ ప్రతినిధులు, పోలీసులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. గ్రామస్తులు తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు, కానీ ఇతరులకు హెచ్చరికగా ఉండాలనే ఉద్దేశంతో వారిపై ఇటువంటి క్రిమినల్ కేసులు పెడుతున్నారు.”
నాయకులుగా గుర్తింపు పొందిన వారిపైన తరచుగా మరింత తీవ్రమైన ఆరోపణలు మోపుతున్నారు. అయితే, నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేయడం అనేది కేవలం అరెస్టులకే పరిమితం కాలేదు.
తమను “కంపెనీ గూండాలు అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని” కలహండి జిల్లా తలఆంపదర్ నివాసి, ‘మా మాటి మాలి సురక్ష మంచ్’ యువ నాయకురాలు అయిన 26 ఏళ్ల చంపా మాఝీ ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసనకారులను భయపెట్టడం, గనుల తవ్వకం కోసం బలవంతంగా అంగీకారం పొందడం, నిరసనకారులపైన తప్పుడు కేసులు పెట్టడం వంటి ఆరోపణలపై వివరణ కోసం ఈమెయిల్ ద్వారా ‘ఆర్టికల్ 14’ 2026 ఫిబ్రవరి, మార్చిలలో ‘వేదాంత’ సంస్థను సంప్రదించింది. అయితే వారి నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు.
ఆదివాసీ సముదాయానికి చెందిన నారింగ్ దేయ్ మాఝీకి ఈ అనుభవం మరీ కష్టతరంగా మారింది, ఎందుకంటే నిరసనల్లో పాల్గొన్నందుకు అరెస్టు అయిన మొదటి మహిళ ఆమె. తన కోడలు ప్రసవించిన సమయంలో, రాయగడ జిల్లా ఆసుపత్రిలో ఆమెకు సహాయంగా ఉన్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం దేయ్ మాఝీ ఏడు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల వయసులో ఉన్న ఆమె, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ ముఖంలో పట్టుదల కనిపిస్తుంది. ఆమె మాట మృదువుగా ఉంటుంది. ఆ ఏడు కేసుల్లోనూ అదే వివాదాస్పద షరతులతో బెయిల్ పొంది విడుదలైన తర్వాత ‘ఆర్టికల్ 14’ ఆమెతో మాట్లాడింది. ఆ సమయంలో ఆమె అలసిపోయినట్లు కనిపించినప్పటికీ, దృఢ నిశ్చయంతో ఉన్నది.
కొనసాగుతున్న అణిచివేత
ఈ అరెస్టులు తమలో భయాందోళనలను కలిగించాయని తిజిమాలిలో మేము మాట్లాడిన గ్రామస్తులు చెప్పారు. పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అన్న భయంతో వారు తమ గ్రామాల నుండి బయటకు వెళ్లడం కూడా మానేశారు.
“ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటే, ఐదుగురిపైన కేసులు ఉన్నాయి,” అని నారింగ్ దేయ్ మాఝీ వదిన రుక్దాయ్ మాఝీ అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిలో కనీసం ఆరుగురు ఈ నిరసనలకు సంబంధించిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు ‘ఆర్టికల్ 14’ గుర్తించింది. బెయిల్ పై విడుదలైన కొందరిని ఇతర కేసుల్లో మళ్ళీ అరెస్టు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో, ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
“2024, 2025లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పుడు, మహిళలే గ్రామాలకు రక్షకులుగా మారారు,” అని కుమేశ్వర్ నాయక్ చెప్పారు. ” వారు నిఘా పెడుతూ పోలీసులు వచ్చినప్పుడల్లా పురుషులను హెచ్చరించేవారు.”
చాలా కుటుంబాలకు ఈ అరెస్టులు మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగించాయి. కుమేశ్వర్ నాయక్ జైలులో ఉన్నాడు; అతని భార్య తులాంతి నాయక్, గర్భిణి; ఆ నెలలన్నీ ఆందోళనతో గడిచాయి; “నేను ఒంటరిగా, ఎప్పుడూ ఆందోళనపడుతూ ఉండేదాన్ని” అని అన్నది. కాసేపు ఆగి, మెల్లగా, దృఢంగా: “కానీ మేము వదిలిపెట్టం.”
నికితా జైన్ స్వతంత్ర జర్నలిస్టు; ఢిల్లీ
తెలుగు: పద్మ కొండిపర్తి




