ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ‘ఇన్‌ ఇక్వాలిటి కిల్స్‌’ను ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రోజుకు వేలమంది మరణాలకు కారణమైన హింసాత్మక ఆర్థిక విధాన ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. అత్యంత సంపన్నులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. పెరుగుతున్న అసమానత వల్ల మహిళలు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొవిడ్‌ విపత్తుకు ప్రతిస్పందనగా అసమానతలు పెరగడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అంచనాలపై, పరిశోధనలపై ఆధారపడి ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను రూపొందించింది. 

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని పిల్చి పిప్పి చేశాయి. పాలకవర్గాలు ఘనంగా చెప్పుకున్న సరళీకరణ ఆర్థిక విధానాలు సామాన్యుల మూలుగులను పిండేశాయి. ఫలితంగా అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. కరోనా కష్టకాలంలోనూ సంపన్నుల సంపద మరింతగా పెరగడానికి, సామాన్యుడిని మరింత దీనంగా మారడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలే కారణమని ఆక్స్ ఫామ్ తాజా నివేదిక కుండ బద్దలు కొట్టినిది. ‘ఇనీక్వాలిటీ కిల్స్‌ 2022’  పేరుతో ఏప్రిల్‌ 18న విడుదల చేసిన ఈ నివేదికలో ఆక్స్ ఫామ్ దిగ్భ్రాంతికరమైన ఎన్నో విషయాలను వెలుగులోకి వచ్చింది. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ఈ విధానాలపై పునరాలోచించాలని సూచించడంతో పాటు తక్షణ సంపద పన్నును విధించాలని సూచించింది. 

ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఏడాది కాలంలో 84 శాతం మంది ప్రజానీకం ఆదాయం గణనీయంగా తగ్గింది. జీవితాలు కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఏదో రకంగా బతకడానికి నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో శత కోటీశ్వరుల సంఖ్య 102 నుండి 142కు పెరిగింది. 2021 వ సంవత్సరంలో  దేశంలోని వంద మంది సంపన్నుల సంపద 57.3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. కరోనా కష్టకాలంలోనూ (మార్చి 2020 నుండి నవంబర్‌ 2021) వరకు వీరి సంపద 23.14 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందని నివేదిక పేర్కొంది. సామాన్యులు కష్టాలు పడుతుంటే వీరి సంపద ఇంతలా పెరగడానికి మోడీ ప్రభుత్వం అనుసరించిన ప్రైవేటీకరణ విధానాలే కారణమని విశ్లేషించింది. 

ప్రైవేటీకరణ ఫలితంగా భారతీయ కుటుంబాలు చేస్తున్న మొత్తం ఖర్చులో 43 శాతం ఔషధాలకు, 28 శాతం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు ఖర్చు చేయాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. పేదలు, మధ్య తరగతి… ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని కరోనా సంక్షోభం తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక ప్రైవేట్‌ను అనివార్యంగా ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది. ‘మొత్తం  వైద్యరంగాన్ని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ నియంత్రిస్తున్నాయి. అవుట్‌ పేషెంట్‌ వైద్య సేవల్లో 74 శాతం, ఇన్‌ పేషెంట్‌  వైద్య సేవల్లో 65 శాతం ప్రైవేట్‌ వాటాగా ఉంది.  ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వైద్య చికిత్సలపై, అవి వేసే బిల్లులపై పాలకులు ఎలాంటి నియంత్రణా విధించటం లేదు’ అని పేర్కొంది. ‘వైద్యంపై  ప్రపంచ దేశాల సగటు వ్యయం 10 శాతం ఉంటే, భారత్‌లో మాత్రం మొత్తం జిడిపిలో 1 శాతం నిధుల వ్యయం కూడా లేదు’ అని తెలిపింది. 

అలాగే ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించడానికి జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఇపి) కేంద్రం తీసుకొచ్చింది. మరో వైపు స్కూల్‌ ఫీజులు చెల్లించలేక 35 శాతం పిల్లలు పాఠశాలను మానేశారని నివేదిక తెలిపింది. అణగారిన వర్గాల్లో ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, బాలికలు విద్యకు దూరమయ్యారు. విద్యను మార్కెట్‌కు వదిలేయటం వల్ల సామాజికంగా నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ‘సామాజిక పథకాలపై  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గింది. ఫలితంగా పేదల జీవితాలకు భరోసా తగ్గింది. మొత్తం బడ్జెట్‌లో 0.6 శాతం కేటాయింపులను ఈ పథకాలకు కోసం కేంద్రం కేటాయించింది. గత ఏడాదితో పోల్చినా ఈ కేటాయింపు తగ్గింది. మరోవైపు పేదలు, కార్మికులు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొంది. 

ప్రజారోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వాల కర్తవ్యం. 47వ  రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తున్న ఆ బాధ్యతలను నెరవేర్చడంలో పాలకుల వైఫల్యమే ప్రస్తుత దుస్థితికి ప్రథమ కారణం. ఆర్థిక స్తోమతలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందాలని భోర్‌ కమిటీ 1946లోనే సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠపరచాల్సిన అవసరాన్ని మొదలియార్‌ సంఘం 1962లో ప్రస్తావించింది. జాతీయ ఆరోగ్య విధానాలు మొదలు మానవహక్కుల సంఘం ముసాయిదా వరకు ఆపై ఎన్నో ఘన ఆదర్శాలను ప్రకటించాయి. అవేవీ క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణకు నోచుకోలేదు. దాని దుష్ఫలితంగానే దేశవాసులకు సమస్థాయిలో ఆరోగ్య సేవలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. వాటికి తోడు విద్య, ఉపాధి అవకాశాలు, ఆదాయాల్లో తీవ్ర వైరుధ్యాలూ అణగారిన వర్గాల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. భారత సంవిధానం ముఖ్య సూత్రాలైన సమానత్వం, సర్వజన సంక్షేమాలకు అవి తూట్లు పొడుస్తున్నాయి.  

పేదరికం  ఒక సాంఘిక ఆర్థిక సమస్య. ఇందుకు అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలున్నాయి. పేదరిక ప్రభావం ఒక విషవలయం లాంటిది. ఉదాహరణకు నిరుద్యోగం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిరుద్యోగం సంభవిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైన పేదరికం, ఆర్థిక అసమానతలు. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగినవి. ఒక సమస్యకు ఇంకొక సమస్య కారణంగా ఉండి, సమస్య తీవ్రతను పెంచుతుంది. ఉదాహరణకు భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలకు నిరుద్యోగిత కారణంగా పేర్కొనవచ్చు. పేదరికమనేది ఒక సాంఘిక ఆర్థిక లక్షణం. సమాజంలో ఒక వర్గం వారి కనీస జీవన అవసరాలైన ఆహారం, గృహవసతి, వస్త్రం పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. సమాజంలో గణనీయమైన అనుపాతం ప్రజలు కనీస అవసరాలను పొందలేక ప్రాణాలను నిలుపుకోవడానికి అవసరమైన వాటిని మాత్రమే పొందగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ సమాజం యావత్తు పేదరికంలో కూరుకుపోయిందని చెప్పవచ్చు.

ఉన్నత కులాల మహిళలతో పోలిస్తే దళిత మహిళల ఆయుఃప్రమాణం సుమారుగా 15 సంవత్సరాలు తక్కువ. ఉన్నత కులాలకు చెందిన హిందువుల కన్నా ఆదివాసీల జీవిత కాలం 4 సంవత్సరాలు తక్కువగా ఉంటోంది. ముస్లింల ఆయుః ప్రమాణం ఒక సంవత్సరం తక్కువగా ఉంది. దళిత కులాలకు చెందిన వారి ఆయుఃప్రమాణం కనీసం మూడు సంవత్సరాలు తక్కువ! ఆర్థికాంశాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అని నివేదిక పేర్కొంది. దేశంలోని 100 మంది  శత కోటీశ్వరుల కుటుంబాలపై ఒక్క శాతం సంపద పన్ను విధిస్తే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఏడు సంవత్సరాల పాటు దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చు. లేదా ఏడాది పాటు పాఠశాల విద్యను దేశంలోని పిల్లలందరికి ఉచితంగా అందించవచ్చు. అదే 4 శాతం సంపద పన్ను విధిస్తే 2 సంవత్సరాల పాటు కనీసం రెండు సంవత్సరాల పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలన్నింటిని నిర్వహించవచ్చు. 17  సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా మధ్యాహ్నా భోజన పథకాన్ని కొనసాగించవచ్చు. పేదరికం, అవిద్య, అనారోగ్యం, ఆకలి, ఆర్థిక అసమానతలు నివారించాలంటే సంపన్నులపై భారీగా పన్ను విధించడం అవశ్యకంగా నివేదిక నొక్కి చెప్పింది. 

భారతదేశంలో ఒక వర్గీకృత సమాజం. ఇందులో వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు, నివాసం చేస్తున్నవారు. వీరిలో కొంతమంది, ఉదాహరణకు దళితులు, వెనుకబడిన వర్గాలు, అగ్రకులస్తులలో అణగతొక్కబడి సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవనం గడుపుతున్నారు. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని 1950 సంవత్సరంలో మొదలు పెట్టినప్పుడు పంపిణీ కంటే ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తారు. ఆర్థికవృద్ధి ద్వారా పెరిగే జాతీయాదాయం కింది స్థాయికి పాకి (ట్రికిల్‌-డౌన్‌) పేదరికాన్ని నిర్మూలిస్తుందని నమ్మారు. దీన్ని ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం (ట్రికిల్‌ డౌన్‌-థియరీ) అంటారు. కానీ 1970 దశక ప్రారంభంలో ఓజా, ప్రనాబ్‌ బర్‌దాన్‌, దండేకర్‌ అండ్‌ రథ్‌, మిన్‌హాస్‌, అహ్లూవాలియా మొదలైనవారు చేపట్టిన అధ్యయనాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడంలో ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం ఘోరంగా విఫలమైందనే వాస్తవం వెల్లడైంది. 

ఫోర్బ్స్‌ తన నివేదికలో భారతదేశంలో 1 శాతం ప్రజానీకం 48 శాతం దేశ సంపదను కలిగి ఉన్నట్లు, మిగిలిన 99 శాతం మిగతా 52 శాతం కలిగి ఉన్నట్లు తెలిపింది. మొదటి 10 శాతం ధనవంతులు 74 శాతం సంపదను కలిగి ఉండగా మిగతా 90 శాతం ప్రజానీకం 24 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ప్రపంచ పేదరిక జనాభాలో 20 శాతం భారతదేశంలోనే ఉండటం గమనార్హం. దీనిని బట్టి కోట్లాదిమంది భారతీయులకు సరళీకృత ఆర్థిక విధానాల వల్లగాని, ప్రపంచీకరణ విధానాల వలనగాని, ఆర్థిక వృద్ధిరేట్లు, జిడిపి పెరుగుదల, తరుగుదలతో ఏ విధమైన సంబంధం లేదని తేటత్లెలమవుతుంది. పంపిణీ వ్యవస్థలోని వ్యత్యాసాల వలన ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తున్నటువంటి రాయితీల వలన, ఫలితాలు 10 శాతం ధనవంతుల చేతుల్లోకి వెళుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 

2017-21 మధ్య వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించిన సుమారు యాభై వేల కోట్ల రూపాయలు వినియోగానికే నోచుకోలేదని నిరుడు వెల్లడైంది. తరతమ బేధాలతో రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు, ఎస్సీ ఎస్టీ శ్రామిక శక్తిలో అత్యధికులు రోజువారీ కూలీలుగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. అగ్రవర్ణాలతో సరిపోలిస్తే.. ఆయా వర్గాల్లోని విద్యాధికులు సమాన అవకాశాలకు నోచుకోలేకపోతున్నారు. గడిచిన ఏడున్నర దశాబ్దాలు గడిచిన తరవాత ప్రభుత్వోద్యోగాల్లోనూ వారికి తగినంత ప్రాతినిధ్యం కల్పించలేకపోయామని కేంద్రమే ఇటీవల సుప్రీంకోర్టులో అంగీకరించింది. రహదారులు, మంచినీళ్లు, కనీస పారిశుద్ధ్య వసతులకు నోచుకోని వేలాది ఆదివాసీ గూడేలు, గ్రామాల్లో జనారోగ్యం గుల్లబారిపోతోంది. ఆ దుర్భర పరిస్థితులను పరిమార్చడంతో పాటు సమ్మిళితాభివృద్ధికి దోహదపడే విధానాలను రూపొందించి అమలు చేయాలనే చిత్తశుద్ధి లోపించడం గర్హనీయం. 

పెట్టుబడిదారీ వ్యవస్థలో మిగులు విలువ నుంచి అందవలసిన భాగం పరిశ్రమలలో శ్రామికునికి, వ్యవసాయంలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందక పెట్టుబడి కేంద్రీకృతమైన కొనుగోలు శక్తి క్షీణించి, పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడుతుంది. వృద్ధిరేట్లు పడిపోవటానికి ఇదే ఫ్రదాన కారణమని మార్క్సిస్టు సిద్దాంతవేత్తలు తెలియజేస్తున్నారు. ఆర్థిక మాంద్యాలు, అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల్‌మార్క్స్‌ మిగులు విలువకు ప్రాధాన్యత పెరిగింది. పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ శ్రమశక్తిని ఉత్పత్తి క్రమంలో ఖర్చుగా, ముడిసరుకు వలే పరిగణిస్తోంది. చాలీచాలని వేతనాలతో మిగులు విలువను పెంచటం కోసం శ్రమశక్తిని చిన్నచూపు చూస్తూ వస్తూత్పత్తి విలువను పెంచుకుంటోంది. తద్వారా శ్రామిక వర్గాన్ని దోచుకుంటోంది. మరోకవైపు శ్రామికులను రిజర్వులో ఉంచి, నిరుద్యోగులుగా మార్చి, శ్రామికుల మధ్య పోటీతో తక్కువ వేతనాలకు శ్రమను దోచుకుంటూ మిగులు విలువను పెంచుకుంటూ పోతోంది. ఈ విధంగా కేంద్రీకృతమవుతున్న పెట్టుబడి ఒకవైపు పేరుకుపోతుండగా, చాలీచాలని సంపదతో కోల్పోతున్న అశేష ప్రజానీక కొనుగోలు శక్తి లేమి వలన ఆర్థిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఇది పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ నైజం. 

Leave a Reply