ఏయే విలువల ఆధారంగా ఒక కవిని అంచనా వేయాలన్న ప్రశ్నలు విమర్శకులకు ఎదురవుతాయి. మానవ విలువలకు ప్రతినిధిగా చూడాలా? సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తిగా చూడాలా? వంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ‘‘మానవ  విలువలు’’, ‘‘ఉద్యమం’’ వేర్వేరే కావు. అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో గొప్ప కవితలెన్ని రాసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘‘ఏకైక మహాకవి’’గా  శ్రీశ్రీ గారు గుర్తింపు పొందారు. వివాద రహితమైన అరుదైన కవుల్లో ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ స్థానం సమున్నతమైంది. అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరంలో నిష్కలమైన నిజాయితీ కనిపిస్తుంది. ‘‘బీదరికం  అనారోగ్యం ఒక గొప్ప కవిని మనకు కాకుండా చేశాయి’’. ‘‘ఓడ్‌  టు పోయెట్స్‌’’ అన్న కవితలో మరణించిన కవులను ఉద్దేశించి ‘కీట్స్‌’ ‘‘మీరు మీ ఆత్మల్ని భూమి మీద వదిలే వెళ్లారు’’ అని అంటాడు. ప్రభాకర్‌ కూడా తన ఆత్మను భూమి మీద వదిలి వెళ్లాడు. ‘‘ఆ’’  ఆత్మ అతని కవిత్వం. 

‘‘మరణం నా చివరి చరణం కాదు

మౌనం నా చితా భస్మం కాదు’’ అన్న కవితలోని పాదాలతో ఆయన తాత్వికత ప్రతిబింబించింది. ప్రభాకర్‌ నేల విడిచి సాము చేసేవాడు కాదు. ‘‘జగిత్యాల  జైత్రయాత్ర నేపథ్యంలో, తదనంతరం’’ పరిణామాలు ఆయనపై గాఢమైన ముద్రలేశాయి. ఆయన కవిత్వ భావనను, వ్యక్తీకరణను ఉద్యమమే నిర్దేశించాయి. అందుకే అలిశెట్టి ప్రభాకర్‌ భంగిమ  సాహసికమైందిగా (దీశీశ్రీస)గా కనిపిస్తుంది.

ఆయుధాన్ని అధ్యయనం చెయ్‌ (సంక్షోభ గీతం) కవితలో

‘‘కత్తి అంచు మీద తడితడిగా

నెత్తిటు బొట్టు తచ్చాడుతున్న వేళ

కనుకోలుకుల్లోని అశ్రు బిందువే

అగ్నికణమై కురిసేందుకు సంసిద్ధమౌతున్న సమయం

ఆయుధాన్ని అధ్యయనం చెయ్‌’’ అంటూ ప్రభాకర్‌ కత్తి అంచు మీదకు పోతాడు. పాఠకుణ్ని తనతో తీసుకపోతాడు. ‘‘కన్నీళ్లలో  జ్వాలను’’ సృష్టించడం, గట్స్‌ వున్న కవికే సాధ్యం. 

ప్రతి అణువు (రక్త రేఖ) కవితలో

‘‘నీ పాదాల కింద పరుచుకున్న ప్రతి అణువూ

యుద్ధ భూమే అంటాడు’’

ఇది ఒక కవి సైనికుడి ప్రకటన. అందుకే స్థిరచిత్తంలో నిశ్చయార్ధక వాక్యంలో చెప్పగలిగాడు ప్రభాకర్‌.

ఆత్మవిశ్వాసం మూలధాతువు ‘‘గుండె గుండెకు మధ్య’’ కవితలో

‘‘అనంతకాశ క్షేత్రంలో

అక్షరాన్ని సూర్యబింబంగా నాటగలిగినవాణ్ని

ఒక పోరాట కెరటాన్ని

యుద్ధ నౌకగా తీర్చిదిద్దలేనా’’ అని అనగలిగాడు. 

మొదటి రెండు పాదాలలో ‘‘అక్షరాన్ని సూర్యబింబంగా’’ బదిలీ చేసిన కవి, ఆ తర్వాత పాదాలలో ‘‘ఉవ్వేత్తుగా లేచిన కెరటాన్ని’’ యుద్ధ నౌకగా బొమ్మ కట్టించి, చిత్రకారుడిగా తన భావుకతను వ్యక్తం చేశాడు. భావుకతనే కాదు, భావుక సౌకుమారుడు ప్రదర్శించిన కవితలు ఎన్నో కనిపిస్తాయి. 

‘పోరాట సారం’ అన్న కవితలో

‘‘ఘనీభవించిన నిశ్శబ్దంలో నైనా

కనురెప్పలు తెరుచుకునే చప్పుడు

వినకుంటే ఎలా?’’ అంటాడు.

బహిరంతరాలలో నిశ్శబ్దం గడ్డకట్టిన స్థితి అన్నది చైతన్య రహిత వాతావరణానికి ప్రతీక. ఈ స్థితిలో నిర్ణూద్రతను నిరంతర జాగురుకతను కవి ఆపేక్షిస్తున్నాడు.

‘‘కనురెప్ప  తెరుచుకునే చప్పుడు వినగలగటమన్నది, సూక్ష్మంలో చైతన్యాన్ని కోరుకోవటం’’. కవితా వస్తువు ‘‘ఆపేక్షించే వేవ్‌లెంత్‌’’లో భావాన్ని వ్యక్తం చేయటం. ప్రభాకర్‌ వంటి గొప్ప కవులకే సాధ్యం.

కాలతత్వాన్ని కవులు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు.

అలిశెట్టి ప్రభాకర్‌ (రక్తరేఖ) కవితలో

‘‘కాలం నీకొక చితిలా గోచరిస్తే

నాకొక మంటలా భాసిస్తుంది’’ అని

‘‘నీకైతే ప్రతిరోజు దహన సంస్కాం

నాకదే అనుక్షణం ఒక చైతన్య జ్వాల’’ అంటూ

బింబ ప్రతిబింబంగా వివరిస్తాడు. తాను మృత్యువు వైపు కాక జీవితం వైపు వున్నానని నిరూపించుకుంటాడు.

తాజ్‌మహల్‌ని ఘనీభవించిన కన్నీటి చుక్కగా అభివర్ణించిన కవులున్నారు.

‘‘ఏక్‌ షహెన్‌షానే అప్నె

దౌలత్‌కా సహారా లేకర్‌

హమ్‌ గరీబోంకా మొహబ్బత్‌కా

ఉడాయా హై మజాక్‌’’ అని ఉర్దూ కవి సాహిర్‌ లూథియాన్వీ అంటాడు. 

మరి ప్రభాకర్‌, తాజ్‌మహల్‌ను ‘దోపిడి చిహ్నం’ కవితలో

‘‘చరిత్ర కురిపి చెక్కిలిపైన

తాజ్‌మహల్‌ మెరుస్తుంది

తరతరాలకు తడియారని కన్నీటి బొట్టులా’’ అని వర్ణిస్తాడు. ఇది రాచరిక వ్యవస్థ చేసిన శ్రమ దోపిడీని వ్యాఖ్యానించడం.

కాళోజీ తినలేక అనే శ్లేషతో ‘మిని’ కవిత రాశారు. తినడానికి ఏమి లేక నిరుపేద, ఒక మెతుకూ పట్టనంతగా అని తినలేని స్థితికి చేరుకుని ధనవంతుడు వైరుధ్య శిల్పంతో కనిపిస్తారు. ఇలాంటి శిల్పంతోనే. ఓహెన్రీ ‘థాక్సం గివింగ్‌ జెంటిల్‌మెన్‌’ అన్న అద్భుతమైన కథ రాశాడు. 

ప్రభాకర్‌ ‘రిక్షయాసం’ కవితలో

‘‘బక్కచిక్కిన పేద రిక్షవాడు ఎముకలా వున్నాడు

రిక్షా ఎక్కినవాడు ఏనుగులా వున్నాడు

ఎముకే మాంసం ముద్దను లాక్కువేళ్తున్న వింత’’ అని ముగిస్తాడు.

ఈ పాదంలోనే పిక్చర్‌ ఇమేజ్‌నను పట్టుకోగలిగితే ప్రభాకర్‌ తత్వం బోధపడుతుంది. 

రైతు వస్తువు మారి ఎంతో కవిత్వాన్ని పండిరచి ఇచ్చాడు ‘సంక్షోభ గీతం’ కవితలో..

‘‘ధాన్యపు గింజ వొలిస్తే 

రైతు అస్థిపంజరం రాలిపడే’’

దయనీ దృశ్యాన్ని మాత్రం ప్రభాకర్‌ వర్ణించాడు. ఇక్కడ రాలిపడడం అన్న క్రియ కీలకమైంది. రాలి భూమిలో పడే అస్థిపంజరం నుండి మళ్లీ అస్థిపంజరమే మొలుస్తుంది. అందుకే అది దయనీయ దృశ్యం కాగలిగింది. 

కవికి తన వస్తువు మీద నిర్మాణం శిల్పం మీద పట్టు వున్నప్పుడు వచన కవితనే రాణిస్తుంది. మినీ కవిత రాయం అలవాటైన కవికి వచన కవితను నిర్వహించడం కొంత ఇబ్బందే. మినీ కవిత పాఠకునిలో బీజం వేస్తే సరిపోతుంది. కానీ వచన కవిత భూమి ఎత్తులతో వైశల్యాన్నీ అందించగలగాలి. ఈ రెండు రకాల కవితల్ని సమాన ప్రతిభతో నిర్వహించగలగటం ప్రభాకర్‌ వంటి ప్రతిభావంతులకే సాధ్యమైంది.

‘‘మీకనుపాపలో చితికిపోయిన చూపుల్ని

మీ స్వరపేటికలో చిక్కుకున్న బాధల్ని

మీ గుండె గది మూలల్లో పేరుకున్న శిథిలాల్ని

పరిశోధించేందుకు నాకిక సమయం లేదు’’ అంటూ 

ఎందుకు వీరునితో కరచాలనం చేస్తున్నాంటున్నాడో నిరూపించటానికి కవిగా అలిశెట్టి ప్రభాకర్‌ ఆవిష్కరించిన జీవన దృశ్యాలేమిటో, వైరుధ్యాలేమిటో, విశ్వాసాలేమిటో అధ్యయనం చేయవలసిందే. మన దృష్టి కోణమానిగా మారీ, మన అవగాహన  వివేచనతో కూడి, మన తాత్వికత మానవీయంగా రూపొంది, మన వైఖరి నిబద్ధమైప్పుడే ప్రభాకర్‌ మనకు మరింత బాగా అర్థమవుతాడు.

Leave a Reply