తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా దేశసంపద కొందరి చేతుల్లో పోగు పడుతున్నది. మరోవైపు గట్టిగా మాట్లాడితే ప్రభుత్వానికి భయం, గొంతెత్తి పాడితే భయం, రచయితలంటే మరీ భయం. నిజాలు చెప్పే వారిపై అప్రకటిత నిషేధాలు. స్వేచ్ఛనీ, స్వేచ్ఛాభీవ్యక్తినీ నిరంకుశ ఫాసిస్టు పాలకులు సహించలేరన్న నిజం అడుగడుగునా రుజువవుతోంది.

 ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో మానవాభివృద్ధిలో, మానవ హక్కుల పరిరక్షణలో, సమానత్వ సాధనలో, పేదరిక నిర్మూలనలో, ఉపాధి కల్పనలో ఏ దుస్థితిలో ఉన్నామో పలు విదేశీ పత్రికలు వాస్తవ చిత్రాన్ని మనకందించే ఎన్నో విశ్లేషణలు చేస్తోన్నాయి. భారత్‌కు కలిసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతుందా? అంటూ మార్చి నెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ధి రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ. మార్చి నెల 19వ తేదీ నాడు లండన్‌ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక. ఏడాది కాలంగా గౌతమ్‌ అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60 శాతం పడిపోయిన సంపద అని. జాతీయ వాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోడీ ఏలుబడిలో అచ్చేదిన్‌, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్న వారికి లండన్‌ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.

 ‘‘కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితా 2023లో చూపారు’’ అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నప్పుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.

2022 సెప్టెంబర్‌ చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రూ.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రూ.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రూ.రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడు లక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదు లక్షల కోట్లు సంపాదించాడు. 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బిలియన్‌ డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బిలియన్‌ డాలర్లకు దిగజారారు. హరూన్‌ సంస్థ అంచనా ప్రకారం అదానీ సంపద 53 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

దేశం వృద్ధి చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊటసిద్ధాంతం(ట్రికిల్‌ డౌన్‌) ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చేదిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు. ఇవాళ దేశం చచ్చేదిన్‌, మృతకాల్‌గా మారింది. మన దేశంలో జనవరిలో 7.1 శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45 శాతానికి పెరిగిందన్న సిఎంఇఇ సమాచారాన్ని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్నోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోడీ ప్రచారం చేసుకున్నారు.   సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమయ్యాక ఉత్పత్తి రంగం వృద్ధి చెందలేదు. సేవారంగం మూడు పూలు ఆరుకాయలు అన్నచందంగా వృద్ధి చెందింది. నిజానికి మూడు దశాబ్ధాలుగా జరుగుతున్నది అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు లాభాలు తెచ్చి పెట్టి సేవారంగం వృద్ధి సాధించింది. ఇదంతా ‘ఉపాధి రహితవృద్ధి’ అన్నది యదార్థం. మనలాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో పెట్టుబడి సాంధ్రత గల అభివృద్ధి బదులు, శ్రమ సాంధ్రత గల అభివృద్ధి జరగాలి. కాని అలా జరగడం లేదు. ‘‘మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ధి మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది శ్రామికులను నియమించటం లేదు. ఒకవైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి’’. మేధావులు జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని అకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాల తక్కువ అని ప్రణాళికా సంఘం మాజీ ప్రధాన సలహాదారు ప్రణభ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ‘‘నైపుణ్యులు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి. భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియలెస్టేట్‌, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ధి ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కావు’ అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ప్రొఫెసర్‌ అమిత్‌ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.

 మోడీ పాలనలో దేశ యువత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేసే సమాచారమిది. భారత్‌లో మొత్తం 33 శాతం మంది యువత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి, విద్య, శిక్షణకు నోచుకోవటం లేదు. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కోవకు చెందినవారే. ఇందులో మహిళల సంఖ్య అత్యధికంగా ఉండటం చూస్తున్నాం. ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌ఒ)కు చెందిన మల్టిపుల్‌ ఇండికేటర్‌ సర్వేలో వెల్లడైన నివేదిక సారమిది. ఈ సర్వేలో భాగంగా 2021లో 2.76 లక్షలకు పైగా ఇళ్ల నుంచి సమాచారాన్ని సేకరించి రూపొందించిన  నివేదికను ఇటీవలే విడుదల చేశారు. భారత జనాభాలో మూడోవంతు ఉన్న యువతను మోడీ సర్కారు విస్మరిస్తున్నది. దేశంలోని యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నది 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి. అయితే, తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఆ హామీని కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు నిలబెట్టుకోలేదు. దీంతో దేశ యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నది.

దేశ యువతకు విద్య, ఉద్యోగం, శిక్షణ వంటివి అందకపోతునప్పటికీ… వారిలో ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనే తపన అధికంగానే ఉంది. ఇక్కడ కూడా లింగ అంతరం కనిపిస్తున్నది. 2013 మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి) అధ్యయనాన్ని ఉటంకిస్తూ చక్రవర్తి మాట్లాడుతూ.. భారత్‌లోని మహిళలకు ఆర్థిక సాధికారత కోసం పెళ్లి ఒక సాధనమన్నారు. దీర్ఘకాలంలో.. విద్య, ఉద్యోగం కంటే మహిళకు చక్కగా పెళ్లి చేసి పంపించడమే పెద్ద నిర్ణయంగా తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. పెళ్లి తర్వాత మహిళలు చాలామంది విద్య, ఉద్యోగాన్ని వదిలేస్తున్నారని చెప్పారు. ఇలాంటి కారణాలతో ‘నీట్‌’ అంచనాల్లో నిరుద్యోగ స్త్రీల సంఖ్య పెరుగుతున్నదని చక్రవర్తి వివరించారు. సమాజంలో మార్పు రానంత వరకు ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన అభిప్రాయ పడ్డారు.

భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ది రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ధి రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుతం 7.8 శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఏకానమీ డాట్‌కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3 శాతంతో కతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మనదేశం కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా 68.6 శాతంతో 42వది కాగా మనదేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40 శాతం దిగువకు పడిపోయింది.

 ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని యుబిఎస్‌ సంస్థ ప్రపంచంలో ధరలు, రాబడి గురించి విశ్లేషణ వెల్లడిస్తుంది. న్యూయార్క్‌ నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర నగరాల్లో పరిస్థితిని అది పోలుస్తుంది. దాని తాజా నివేదిక ప్రకారం కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. న్యూయార్క్‌లో వంద డాలర్ల వేతనం ఉంది అనుకుంటే చైనాలోని షాంఘైలో 20.9, బీజింగ్‌లో 17, ముంబైలో 8.5, ఢల్లీిలో ఏడుగా ఉంది. దేశంలో ఉపాధి రహిత వృద్ది ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా మనదేశంలో 40శాతమని (2022) చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030 నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ధి విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు. ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు.

దేశంలో వృద్ధివేగంగా జరుగుతున్నప్పటికీ ఉపాధి తగ్గింది. ఉదా: 1972-73 నుంచి 1983 మధ్య జిడిపి వృద్ధి 4.7 శాతం కాగా ఉపాధి వృద్ధి 2.4 శాతం. 1993-94 నుంచి 2004-05 మధ్య జిడిపి వృద్ధి 6.3 శాతం కాగా ఉపాధి వృద్ధి 1.8 శాతం. 2004-05 నుంచి 2011-12 మధ్య జిడిపి వృద్ధి 8.5 శాతం కాగా ఉపాధి వృద్ధి 0.5 శాతంగా నమోదైంది. అంటే ఉపాధి వ్యాకోచత్వం నిర్మాణ రంగం మినహాయించి మిగతా రంగాల్లో క్షీణిస్తోంది. శ్రమశక్తి అంటే పని కోసం ఎదురుచూసే వర్గం. ఉపాధి పొందిన వర్గాన్ని వర్క్‌ పోర్స్‌ అంటారు. ఉపాధి పొందని వర్గాన్ని నిరుద్యోగిత అంటారు. ఉపాధి కోసం ఎదురు చూడని వారిని నాట్‌ ఇన్‌ ద లేబర్‌ ఫోర్స్‌ అంటారు. మొత్తం ఉపాధిలో ప్రభుత్వ రంగం వాటా 1991 నాటికి పెరిగింది. సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగంలో ఉపాధిని తగ్గించడంతో దీని వాటా 2012 నాటికి 59.6 శాతానికి తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రెండు రంగాలు కలిపి సంస్కరణలకు ముందు 1.20 ఉపాధి వృద్ధి రేటును కలిగి ఉన్నాయి. సంస్కరణల తర్వాత 0.46 శాతానికి పడిపోయింది. అయితే విడివిడిగా పరిశీలిస్తే సంస్కరణలకు ముందు ప్రభుత్వ ఉపాధి వృద్ధి 1.53 శాతం, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగ ఉపాధి వృద్ధి రుణాత్మక(-0.36 శాతం)కు చేరింది. ప్రైవేట్‌రంగ ఉపాధి వృద్ధి సంస్కరణలకు ముందు 0.44 శాతం కాగా సంస్కరణల తర్వాత 2.03 శాతానికి పెరిగింది.  నిరుద్యోగం దేశం ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్ట సమస్యలలో ఒకటిగా ఉందని నీతి ఆయోగ్‌ ఒక దార్శనిక పత్రాన్ని 2018లో ప్రకటించింది. ఆ పత్రం ప్రభుత్వం ముందు రెండు లక్ష్యాలను ఉంచింది. ఒకటి శ్రమసాంధ్రత ఉత్పత్తిని పెంపొందించడం, రెండు శ్రమశక్తి క్రమబద్ధీకరణను ప్రోత్సహించడం. ఆ పత్రం సమర్పించి నాలుగేళ్లు గడచినా, మన మోడీ ప్రభుత్వం అన్ని రంగాలను పట్టుదలతో ప్రైవేటీకరీస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ పెంచడానికి ప్రజలకిచ్చే సబ్సిడీలను తగ్గిస్తూ, నిస్సిగ్గుగా సప్లై సైడ్‌న ఉన్న పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇది ప్రజలను విద్య, వైద్య, ఉపాధికి దూరం చేస్తున్నది. అందువల్లనే ఒక్క శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద పోగుపడితే, అట్టడుగు 50 శాతం ప్రజల వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉందంటే, పాలకులకు ప్రజలంటే ఎంత చులకనో సులభంగా అర్థమవుతున్నది. పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికం, పర్యావరణ కాలుష్యం ప్రజల జీవితాలనే కాదు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా కొనసాగుతున్నాయి. మోడీ పాలనలో అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వ ఆదర్శం బ్రాహ్మణీయ హిందూత్వ  కార్పొరేట్‌ ఫాసిస్టు పాలన కారణంగా బీటలు బారింది. సామాజిక న్యాయం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కొరకు ఫాసిస్టు పాలనను ఓడించాలి.

Leave a Reply