ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం బిజెపికి ఉంది. ఏపీలో కొంత కాలంగా దేవాలయాల సెంటిమెంటు రెచ్చగొట్టే విఫల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఎంఐఎం బూచీ ఉండనే ఉంది. ఇటీవల తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎంతగా మతం బురద పూసుకున్నాయో చూశాం.
ఇంతకూ ఈ దాడులకు సంబంధించిన కేసు నేపథ్యం ఏమిటంటే..
రెండు నెలల క్రితం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిజామాబాద్ లో ఒక సభ పెట్టారు. అందులో కరాటే శిక్షణ ఇచ్చారని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు ఎన్. ఐ. ఏ. వాళ్ళు తీసుకున్నారు. ఆ సభ ఏర్పాటు చేసిన వాళ్ళ ఇళ్లపై, అందులో పాల్గొన్నవారి ఇళ్లపై ఇప్పుడు దాడులు చేశారని తెలుస్తోంది. ఏకకాలంలో ముప్పైకి పైగా ఇళ్ల మీదకు వందలాది పోలీసులతో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు వెళ్ళి సోదాలు చేసాయంటే చిన్న విషయం కాదు.
గత రెండేళ్లగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కార్యకర్తలపై కేసులు, అరెస్టులు, సోదాలు, మళ్ళీ అరెస్టులు, ఇప్పటికీ ఎడతెగని విచారణలు ఇదే పద్దతిలో నడుస్తున్నాయి. కాలు కదపనీయకుండా, గొంతు పెగలనీయకుండా నొక్కిపెట్టే హింస. అప్పటి సోదాల వార్త పెద్ద సంచలనం.
ఇప్పుడు ఏమీ జరగనట్టు నిశ్శబ్దం. తేడా ఏమిటి? వాళ్ళు ముస్లింలు కావడమే కదా!
ఆదివారం జరిగిన దాడులపై ఆ సంఘం వాళ్ళు నిన్న (సోమవారం) కర్నూల్లో ప్రెస్ మీట్ జరపబోతుంటే అడ్డుకొని వాళ్ళనూ అరెస్టు చేశారు.
పొద్దున లేచినప్పటినుండీ లక్షలాది సెంటర్లలో కర్రసాములు, హిందూ రాష్ట నినాదాలు, పర మతంపై విద్వేష ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏ దర్యాప్తు సంస్థలకు కనపడరు కాబోలు. లేదా వాళ్ళంతా దేశభక్తుల్లా కనపడతారు కావొచ్చు.
ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ ఉంటుంది. ఆ సభలో ఏం మాట్లాడారో తెలీదు కానీ దాని తర్వాత ఎక్కడా ఎటువంటి ఘటనా జరగలేదు. నిర్వాహకులు ఎవర్ని ఎలా రెచ్చగొట్టారో మరి!
మరి నేరం ఎక్కడ జరిగింది? ఒకవేళ ముస్లింలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి అనడం దేశద్రోహమేమో. అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!
ఈ పరిణామాలపై తెలుగు సమాజంలో ఎంత మౌనం నెలకొని ఉందో చూస్తుంటే ఈ సమాజంలో ముస్లింలను అంతగా ఏకాకుల్ని చేశారా అని భయమేస్తోంది. నిన్నటికి నిన్న నిజాం రాజు గురించి, తెలంగాణ రైతాంగ పోరాటం గురించి ఎంత చర్చ చేశాం! మన సమాజం మరీ ఉత్తరాదిలాగా కాదులే అన్న ఆశ మిగులుతుందో లేదో.
…. … …
ఇంటి చుట్టూ పోలీసులు మోహరించడం, ఇంట్లో సోదాలు చేయడం ఎలా ఉంటుందో తెలుసా? హఠాత్తుగా ఊడిపడి వాళ్ళు మనల్ని మన ఇంట్లోనే బంధిస్తారు. ఫోన్లు లాగేసుకుంటారు. ముసలి తల్లిదండ్రులు, పిల్లలు ఏం జరుగుతోందో అర్థం కాక అలా నిలబడిపోయి ఉంటారు. వాళ్ళ కోసం మనం, మన కోసం వాళ్ళు లోలోపలే ఉద్విగ్నమవుతూ ఉంటాం. ఇల్లంతా చిందరవందర చేసి వెళ్లిపోయాక తుఫాను దెబ్బ తగిలిన పిచ్చుక గూటిలా అయిపోతుంది.
రోజూ మాట్లాడే మనుషులు మనల్ని కొత్త మనుషుల్లా చూస్తారు. మనతో మాట్లాడకుండా వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడుకుంటారు. తుమ్మితే ఊడే ముక్కు లాంటి ప్రైవేటు ఉద్యోగం ఊడిపోతుంది.
ఈ అనుభవం ఒక ముస్లింకైతే ఇంతకన్నా అనేక రెట్లు భీభత్సంగా ఉంటుంది. మావోయిస్టు ఆరోపణకు, ముస్లిం తీవ్రవాది ఆరోపణకు ఆ తేడా ఉంది. నిన్నటి నుండి ఆ అపరిచిత కుటుంబాలు గుండెల్లో మెదులుతున్నాయి.
… … …
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా ముస్లిం తీవ్రవాదుల ఉనికి కనిపెట్టి బిజెపికి కావలసినంత గ్రౌండ్ తయారుచేసి పెట్టాక ఏం జరుతుంది? ఇప్పటికైనా అప్రమత్తమవుదామా, వద్దా? ప్రాంతీయ పాలకులు, ప్రతిపక్షాలు నోరుమూసుకున్నా ఆలోచనాపరులు కనీసం చప్పుడు చేయాలి కదా!
One country -one constitution -rights (hakkulu )are same to everyone —why differences ?? Where is the beef ???