అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.    

చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక భిన్న దేశాలలోని అస్తిత్వాలు, అస్తిత్వవాదాలన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. అందుకు మన దేశపు అస్తిత్వాలు, అస్తిత్వవాదాలు కూడా మినహాయింపు కాదు.       

సమాజంలో వర్గాలే ప్రధానమని, సాంఘిక అస్తిత్వాలతో సహా ఇతరేతరమైనవన్నీ అప్రధానమని  ఎవరైనా అంటే, వారు అసలు మానవ జీవితానికున్న నిజమైన విలువను గుర్తించినట్లే అవుతుంది. సామాజిక వాస్తవికతను నిర్దిష్టంగా గాక అమూర్తంగా చూసే వారే పైవిధంగా అనగలరు.మార్క్సిజం దృష్టిలో మానవ జీవితానికుండే నిజమైన విలువ రాజకీయార్థికం కంటే, రాజ్యం కంటే మించినది. కాబట్టి నిజమైన మార్క్సిస్టులెవరూ వర్గాన్ని అనిర్దిష్టంగా చూడరు.వర్గాన్ని మాత్రమే కాదు వారు దేనినైనా నిర్దిష్టంగా,స్థలకాల బద్ధంగా,పరస్పర సంబంధాల సమాహారంలోంచే చూస్తారు.

ఈ పుస్తకంలో 2006-07 నుండి 2013 దాకా మిత్రుడు పాణి రాసిన 12 వ్యాసాలున్నాయి. వీటిని విడివిడిగా చదివినప్పటి కంటే ఇప్పుడిలా ఒక్కచోట చదివినప్పుడు కలిగిన అనుభవం,అవగాహన చాలా సాంద్రమైనవనే చెప్పాలి. ఎందుకంటే విరసంలో 1990 ల్లో చేరిన మా తరం వాళ్ళలో పినాకపాణి చాలా విశిష్టమైన వ్యక్తి.కనుక సహజంగానే 90ల నాటి రాజకీయార్థిక ప్రపంచీకరణ విధానాల ప్రభావం మాపై చాలానే పడింది. అప్పటికే సుమారు పాతికేళ్లుగా కొనసాగిన విప్లవోద్యమ ప్రభావాలు  సమాజం అంతటా పరుచుకుని ఉన్నాయి. గత చరిత్రలో వలెనే ఆ కాలంలో కూడా సమాజం పై(తలాల)నుంచే గాక కింది(తలాల)నుంచి కూడా చలనాలు/పోరాటాలు ప్రారంభమై తీవ్రమయ్యాయి.వివిధ ప్రజా శ్రేణుల్లో వేర్వేరు అసమానతలు,వివక్షలపై స్పృహ లేదని కాదు గాని,ప్రజలందరూ ఒక్క ‘వర్గం’గా ఐక్యమై ఒకే శత్రువు రాజ్యంపై పోరాడడమే విప్లవంగా భావించిన కాలమది.గతంతో పోలిస్తే ఆనాటికి సామ్రాజ్యవాదం మనదేశంపై మరింత బలంగా పట్టు బిగించిన కాలం కూడా అదే.

భారత రాజ్యాంగ అవతరణ తర్వాత ‘ప్రజా ప్రాతినిధ్య స్వభావం’తో రాజ్యమే ప్రజల తరఫున ఒక సామాజిక పరివర్తనా ఏజెన్సీగా పని చేస్తుందని నిజమైన ఆధునికుడిగా అంబేద్కర్ తొలిదశలో నమ్మాడు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం రాజీ లేకుండా నిరంతరం పోరాడుతున్నప్పటికీ, కాలక్రమంలో ఆ నమ్మకం సడలి పోయినందువల్లనే  అంబేద్కర్ భారత పార్లమెంటరీ మార్గం నుంచే బయటికి రావాల్సి వచ్చింది. ఆ తర్వాతి దశాబ్దాలలో భారత పాలకులు తమ స్వతంత్రతకు,కొద్దో గొప్పో ఉన్న ఆదర్శాలకు కూడా దూరమై ఫక్తు దళారీ స్వభావాన్ని సొంతం చేసుకొని నిరంకుశత్వం వైపు అడుగులు వేశారు.

మరోవైపు చూస్తే ఆనాటి యావత్ సమాజంపై సాపేక్షికంగా సాధికారత సాధించిన మార్క్సిస్టులు/పోరాట కమ్యూనిస్టుల భావజాల ప్రభావం పలచన కావడం ప్రారంభమైంది.పోరాట ప్రజాశ్రేణులు  అస్తిత్వవాదాల పేరిట చీలిపోతున్న(ట్లనిపించే) ఒక దృశ్యం ముందుకు వచ్చింది. అలా కనబడ్డ దృశ్యం వెనక ఏం జరిగిందన్న దాన్ని పరిశీలించి ఆనాటి అసలు సామాజిక వాస్తవాన్ని కనుగొనడమే చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. నిజానికి ఆనాటి పోరాట శక్తులన్నీ తీవ్రంగా మథనం చెందిన కాలమది. అస్తిత్వ పోరాటాల్లోంచి  వచ్చిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సైద్ధాంతికంగా జవాబులు చెప్పలేని స్థితిని, నిజంగానే ప్రజా పోరాటాలు చీలిపోతున్నాయా అని వ్యధ చెందిన స్థితిని   కొంతకాలమే అయినా అనుభవించిన కాలమది. విప్లవం పేరిట ప్రజలందరి సమ్మతిని కూడగట్టి వాళ్లను ఏకంచేసి పోరాడిన చరిత్రకు  భిన్నంగా అనేక ప్రశ్నల్ని,అనుమానాల్ని ఎదుర్కొన్న కాలమది.

ఇక్కడే మార్క్సిస్టుగా పాణి విశిష్టత కనపడుతుంది.ఆయన కూడా అందరిలాగే ఎంతో మథనానికి గురయ్యాడు. అయితే ఆయన మథనమంతా లోతైన అధ్యయనానికి,నూతన అన్వేషణకు,నవనవోన్మేషమైన ఆలోచనలకు దారితీసి 2006-07 ల నాటికి అవి సైద్ధాంతిక రూపం దాల్చుతూ తర్వాతి కాలంలో మరింత పటిష్టం అయ్యాయి. అందుకు ఈ పుస్తకంలోని వ్యాసాలే  ప్రబల నిదర్శనం.

 ఈ వ్యాసాలు ఇచ్చిన అవగాహన వెలుగులో చూస్తే ఆధునిక పూర్వ బంధనాలను విముక్తం చేయాల్సిన ‘ఆధునికత’ ఆ పని చేయనందుకు విమర్శగానే  ఈ అస్తిత్వ ఉద్యమాలు తలెత్తాయని అర్థమవుతుంది. ఈ ఉద్యమాలను  ప్రజల్లో అంతకంతకూ విస్తరిస్తోన్న ఆధునిక చైతన్యపు  ఫలితాలే అని  నిర్ధారించవచ్చు. అలాగే సామాజిక వాస్తవికత వెన్నంటే తత్సంబంధిత భావజాలమూ ఉంటుందన్నది నిజమే. అయితే ఆ భావజాలమే వాస్తవం కాబోదన్న ఎరుక కూడా చాలా ముఖ్యం.ఆ ఎరుక  ఉండడం వల్లనే సామాజిక పరివర్తనా శక్తులైన మార్క్సిస్టులు అట్టి భావజాలంపై విమర్శ ప్రకటించి శాస్త్ర ప్రామాణికంగా ఉండే సరైన భావజాలాన్ని రూపొందించుకుంటారు.దాని ద్వారానే ఆ సామాజిక వాస్తవికతను వివరించి, సరిగ్గా విశ్లేషించగలుగుతారు.

ఇంతకూ పాణి ఈ వ్యాసాల్లో ప్రధానంగా ఏం చెప్పాడో చూద్దాం. ఆధునిక పూర్వకాలం నుంచి ఉనికిలో ఉన్న అస్తిత్వాలను ఆధునికంగా ఎలా చూడాలి అన్న ప్రశ్న వేసుకుని బయల్దేరాడు రచయిత.అప్పుడు ఆధునికత అంటే ఏమిటి అన్న ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది. అంటే గతంలో ఈ ప్రశ్న ముందుకు వచ్చి, దాని గురించి ఆలోచించిన నేపథ్యం,స్థూలంగా ఒక   అవగాహన ఏర్పరచుకున్న చరిత్ర కమ్యూనిస్టు సంప్రదాయంలో లేదని కాదు. కాని కొత్త  సందర్భంలో ఆ ప్రశ్న మళ్ళీ ముందుకు రావడానికి గల నేపథ్యం వేరు.ఒక ప్రశ్న మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తుందంటేనే, అది ఆ సందర్భానికి తగినట్టుగా మరింత నిర్దిష్టమైన,సూక్ష్మమైన,స్పష్టమైన జవాబు కోసం అన్వేషించమని మనల్ని డిమాండ్ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి.

పెట్టుబడి విశ్వరూపం ఎత్తి సామ్రాజ్యవాదం అయింది. ఆ సామ్రాజ్యవాద పెట్టుబడి చొరబాటు వల్ల  మన దేశంలో వికృత ఆధునికత అమలవుతోంది. ఏ రాజకీయార్థిక వ్యవస్థ అయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అసమానతలను సృష్టిస్తూ, వాటికి అనుగుణమైన భావజాలాన్ని విడుదల చేస్తుంది. ఆ భావజాల ఆయుధంతో కూడా ప్రజల సమీకరణను విచ్ఛిన్నం చేస్తూ, ప్రజలను విడగొడుతుంది. ప్రజల చైతన్యాభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తుంది. ఇటువంటి వికృత ఆధునికత నుంచి అసలైన ఆధునికతను పాణి వేరు చేసి చూశాడు. అంతేకాదు, ఆధునికత అంటే నాగరికతా క్రమం అని పేర్కొన్నాడు. చారిత్రకంగా ఉనికిలో ఉన్న వ్యవస్థ ఆహార్యంలోనే ఆధునికత(సారం ఇమిడి)  ఉంటుందని, దాన్ని కనుగొనడమే ముఖ్యమని చెబుతాడు.

పాణి అన్నట్టుగా వలసవాదం, ఆధునికత రెండూ ఒకటి కానట్టే, సామ్రాజ్యవాదం,ఆధునికతలు కూడా ఒకటి కాదని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దేశీయ ఆధునిక క్రమం గురించి, దాని పరిణామాల వికాస దిశ గురించి దృష్టి సారించగలుగుతాం.వ్యవస్థ ఆహార్యమెప్పుడూ ప్రజలను భ్రమకు గురి చేస్తుంటుంది. కానీ ఏ వేర్ల ద్వారా ఏ ఆహారం అంది ఆ ఆహార్యం అలా ఉందో పరిశీలించి,పరిశోధించాల్సిన అవసరం కూడా ప్రజలకు,ముఖ్యంగా ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే పోరాట శక్తులకు తప్పనిసరిగా ఉంటుంది.అందుకు దేశ చరిత్రలోకి వెళ్లి ఆధునికతా(నాగరికత) మూలాల్ని గుర్తించి,వాటి పునాదులపై ఆధారపడి భవిష్యత్ ఆధునికతా క్రమాన్ని రూపొందించుకోవాలి.

సరిగ్గా ఇలాంటి పనే ఇక్కడ పాణి చేశాడు. భారతీయ పునరుజ్జీవనంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి పైనుంచి వచ్చిన సంస్కర్తలచే తిరిగి వైదిక సంప్రదాయాలే పునరుద్ధరణయి, వాటి పునరుద్ధరణే వలసవాదపు ఉద్ధరణగా చరిత్రకెక్కిందని అంటాడు. దీన్ని కొందరు ఆధునిక ఆధునికతలోని లోపంగా భావిస్తారని అంటాడు. కానీ దీన్ని ఆధునికతలోని లోపంగా కాకుండా వలసవాదపు రాజకీయార్థిక పరిణామంగా గుర్తించడం సరైందని అనుకుంటాను.అలాగే, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కులాన్ని నిరసించిన అబ్రాహ్మణ, వైదికేతర దేశీ ప్రత్యామ్నాయ సంప్రదాయాలను ఆశ్రయించకుండా, భావజాలపరంగా, రాజకీయపరంగా ఆధిపత్యానికి ప్రతిరూపాలైన వేదాలను,వలస ప్రభుత్వాన్ని ఆశ్రయించడానికి వెనుక బహుశా ఆనాటి వలసవాదానికి ప్రజానుకూల ముఖం ఒకటి కావాల్సివుండిన రాజకీయ అవసరమే ప్రధాన కారణంగా పనిచేసిందని అనుకోవచ్చు.                                         

గురజాడ అప్పారావు కూడా రామ్మోహన్ రాయ్ లాగే పై కులాల నుంచి వచ్చినప్పటికీ, ఆయన విశిష్టత అసలైన ఆధునికతను వలసవాదం నుంచి వేరుచేసి గుర్తించడంలో ఉంది. అందుకే ఆయన పునరుద్ధరణ,ఆధునిక పూర్వ వాదాల పట్ల చాలా విమర్శనాత్మకంగా వ్యవహరించాడు. అయితే ఆయన వలస పాలన పట్ల ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండానే వలసాధునికతలోని డొల్లతనాన్ని విమర్శించాడు. ప్రజల నాగరికతా స్థాయిని పెంచే ఆధునిక యుగస్పృహను తన సాహిత్య సృజనలో జీవితపర్యంతం వ్యక్తీకరించిన వాడు గురజాడ.

పై ఇద్దరికి భిన్నంగా జ్యోతిరావు ఫూలే కింది(అట్టడుగు కులాల)నుంచి వచ్చిన నిజమైన ఆధునికతా ఉద్యమకారుడు. గురజాడ, అంబేద్కర్ ల కంటే కాలంలో చాలా వెనుకటివాడైనా ఫూలే చూపు అత్యంత పదునైనది.ఆయన విద్యలోని ఆధునికమైన చోదకగుణాన్ని ఆనాడే గుర్తించిన విశిష్టుడు. ముఖ్యంగా శ్రామిక కులాలను,బాలికలను,కార్మికులను సమీకరించి విద్య నందించాడు. ఆనాడే కార్మిక ప్రజల హేతుతర్కాన్ని చారిత్రక కోణంలో అత్యంత ప్రభావవంతంగా పెంచాలని ప్రయత్నించిన ద్రష్ట పూలే.

మొత్తానికి మనదేశంలో పునరుజ్జీవనం,ఆధునికతలు పై కులాలు,కింది కులాల నుండి రెండు భిన్న మార్గాల ద్వారా కొనసాగాయి.అనుకూలంగానో,లేదా ప్రతికూలంగానో ఆధునికతను చూసే ధోరణిలో వలసవాదమే కేంద్ర స్థానంగా ఉన్నది.అంటే,అసలైన ఆధునికతను అర్థం చేసుకోవడంలో వలసవాదమే  అవరోధంగా ఉండడమనేది చారిత్రక వాస్తవం.కాబట్టి వలసవాదంతో గాని,ఏ అధికారిక వాదాలతో గాని నిమిత్తం లేకుండా దేశీయమైన భౌతికవాద వికాస క్రమాల గురించి, హేతువు, ఆధునికతల వికాస క్రమంలోని శాస్త్ర విజ్ఞానాల గురించి లోతైన అధ్యయనం,దాని వెలుగులో నూతన అన్వయాలు ఇంకా విస్తృతంగా జరగాల్సి ఉందనే చెప్పాలి.                                                                      

ఏదేమైనా గత శతాబ్దాలలో జరిగిన తీవ్రాతితీవ్రమైన తాత్విక సంఘర్షణలు,పలు విజ్ఞాన శాస్త్రాల ఆవిష్కరణలు కలిసి ప్రపంచం మీదికి ఆధునికతను తీసుకొచ్చాయి. తత్ఫలితంగా మానవజాతి తొలిసారిగా గత చరిత్రతో తెగదెంపులు చేసుకొని  నూతన చరిత్ర కోసం ముందుకు సాగింది. ఆధునికతలో సారభూతమైన అంశాలుగా హేతు చింతన,స్వేచ్చామానవుడి ఆవిర్భావం,సాంఘిక అస్తిత్వ వ్యవస్థల విముక్తి అనేవి ముందుకొచ్చాయి.అవే మానవ జాతి సాధించాల్సిన లక్ష్యాలుగా ఇప్పుడు మన ముందున్నాయి.

ఆధునికతపై ఇలాంటి స్పష్టతతోనే రచయిత అస్తిత్వాల గురించి ఆలోచించాడు.కులంతో సహా ఏ అస్తిత్వాన్నైనా దాని భౌతిక వాస్తవం నుంచే అర్థం చేసుకోవాలని చెప్తాడు.కనుక సమాజాన్ని కూడా ఉత్పత్తితో ముడిపడిన వర్గ సంబంధాలు,ఉత్పత్తే(వర్గే)తర సంబంధాలు,వాటినుండి పుట్టే సాంఘిక వ్యవస్థలు,క్రమాలన్నింటి సమాహారంగా నిర్వచిస్తాడు.అవే సమాజానికి భౌతిక అస్తిత్వంగా ఉన్నాయని చెప్తాడు.అందుకే కులాన్ని ఉత్పత్తేతర సంబంధాల నుంచి పుట్టిన సాంఘిక వ్యవస్థగా భావించాలని పేర్కొంటాడు.అలా భావించినప్పుడే కాలక్రమంలో ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, కులం కూడా పరిణామం చెందుతూ నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఇంకా భౌతిక వాస్తవంగా నిలిచి ఉండడాన్ని వివరించి, విశ్లేషణ చేయడానికి వీలవుతుందని అంటాడు.

అంతేకాదు,ఏ అస్తిత్వానికైనా తనదైన భౌతికపునాది ఉంటుంది.తనదైన చలనం ఉంటుంది. ఇలా పలు అస్తిత్వాలు పరస్పరం సంబంధాల్లో ఉంటూ ప్రభావితం చేసుకుంటాయి. అదే సమయంలో అవి ఉత్పత్తి సంబంధాలతో సంపర్కంలో ఉంటూ వాటిని ప్రభావితం చేస్తూ,వాటి మార్పులతో కూడా ప్రభావితమవుతాయి.ఈ అన్నిమార్పులలోని చలనాలు ఒక క్రమబద్ధమైన సమన్వయంలో ఉండి కీలకమైన ఉత్పత్తి సంబంధాలు సమూలంగా మారినప్పుడే అస్తిత్వాల సంపూర్ణ విముక్తి, సర్వతోముఖమైన సామాజిక ప్రగతి సాధించడానికి వీలవుతుంది.అందుకు మార్క్సిజం వెలుగులో సమిష్టి మానవ కర్తృత్వాచరణే సరైన మార్గం.ఈ పుస్తకమిచ్చే అవగాహన ఇదే!

Leave a Reply