ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది.

మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు ఉంది అనేది వేరే అంశం. ఫేస్ బుక్కులూ వాట్సాప్‌లూ అందుకు వేదికలవుతున్నాయి. అదొక అవుట్ బరస్ట్.

మనిషన్నాక అవుట్ బరస్ట్ వుండాలి. అలా ఉండడం కోసం ఆలోచనాపరులూ బుద్ధ జీవులూ ఎంత దూరమైనా వెళతారు. ఎంత మూల్యమైనా చెల్లిస్తారు. వారి జీవితమే వొక అభిప్రాయ ప్రకటనగా మిగిలి ప్రజలకు చేరుతుంది కూడా.

రచయితలూ కవులూ కూడా తమ తమ ఆగ్రహావేశాలను సృజనాత్మకంగా వెల్లడిస్తారు. అందుకుగాను తాము ఎంచుకున్న ప్రక్రియలను ఆశ్రయిస్తారు. కథగానో కవిత్వంగానో మరొకటిగానో రూపుకడతారు.

అయితే మన భావాలకూ స్పందనలకూ రూపుకట్టే ప్రాసెస్‌లో మన అవుట్ బరస్ట్ ఏ విధంగా ఉండాలో ఉండకూడదో కారా మాస్టారుతో నాకున్న అనుభవం ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నది.

అప్పుడు నేను విశాఖపట్నంలో ఉండే రోజుల్లో ఒకవైపు కథలు రాస్తూనే మరో వేపు ప్రముఖ దినపత్రికల్లో అప్పుడప్పుడూ లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. అవినీతి గురించో ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం గురించో ముఖ్యంగా ఆంధ్రా యూనివర్శిటీని ఆక్రమించడం గురించో రాస్తూ ఉండేవాన్ని. కుచించుకు పోతున్న ఏయూ కాంపస్- అంటే ఒక విశ్వవిద్యాలయంలో అనేక శాస్త్ర విభాగాల విస్తృతికి అవకాశమివ్వకుండా- విద్యావరణ లోపల పోలీసులకూ రెవెన్యూ వాళ్ళకూ ఇరిగేషన్ వాళ్ళకూ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకూ చివరకు కలెక్టర్ బంగ్లా దాకా అన్నిటికీ అడ్డాలు దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వడం చూస్తుంటే పట్టరాని కోపం కలిగేది. మరో వైపు మద్దిలపాలెం వైపునుండి యూనివర్సిటీ ఆక్రమణలకు అడుగులు పడేవి. ఇన్ని ఎకరాల్లో అన్ని ఎకరాల్లో అని చెప్పుకోవడానికే గాని నిజానికి అవి అధికారిక ఆక్రమణలని ఎవ్వరూ గుర్తించలేని స్థితి.

కథలే కావు ఈ రాతలు కూడా కారా మాస్టారి దృష్టిలో పడ్డాయి. నా తక్షణ స్పందనల్ని చూసి నిట్టూర్చి అలాంటి పనులు చెయ్యకు అన్నారు. నాకర్థం కాలేదు. అప్పుడు చెప్పారు. ‘ఆ విషయాల్ని రాయి, కాని ఇలా కాదు. నువ్వు కథకుడివి. కథగా రాయి. అప్పుడు అది నిలుస్తుంది. తక్షణ స్పందనల్ని ఎప్పటికప్పుడు బయట పెట్టేసుకుంటే నువ్వు రాయలేవు. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు అవుట్ బరస్ట్ అయిపోతే నీలోపల నుంచి అది పోతుంది. నిలవదు. నిలవాలి కదా, అది నీలో నానాలి కదా, నువ్వు నలగాలి కదా, అప్పుడు కదా దాన్ని పరిపూర్ణంగా నువ్వు ఆవిష్కరించగలుగుతావు. తప్ప దినపత్రికల ఇరవై నాలుగ్గంటల జీవిత కాలంలోకి నీ  ఆవేశాన్ని కుదించకు. దాన్ని నాలుగు కాలాలు నిలబెట్టాలంటే కథ నీ ఆయుధం. దాన్ని రాయాల్సిన విధంగా రాస్తే నాలుగు కాలాలు వుంటుంది. నలుగురికీ చేరుతుంది. అది చెయ్యాల్సింది ఏదో చేస్తుంది’ అని చెప్పారు.

కథ కండగట్టాలంటే ఉగ్గబట్టుకోవాలి అని నాకూ అర్థమైంది.

అవుట్ బరస్ట్ అవసరమే, కాని కథకులు తాము బ్లో అవుట్ కావడానికి ముందు లీకుల్లా అవుట్ బరస్ట్ ఆ పని చేస్తే చెయ్యాల్సిన పెద్దపని చేజారే అవకాశమూ ఉంది.

తక్షణ స్పందనలూ అభిప్రాయాలూ అవసరమైనప్పుడు వెల్లడించడంలో తప్పు లేదు. కాని ఇవాళ ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లోకి కథకులు నిరంతరమూ జారిపోయినప్పుడు కథ చేజారుతుంది. కారా మాస్టారు చెప్పిన ఈ విషయాల్ని ఆలోచించి అక్షరయానం చెయ్యాలని కొత్త కథకులని కోరుతూవున్నాను.

Leave a Reply