నిజమే!
నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు
అది ఇంకొక దాని గురించి కూడా అనిపిస్తోంది!
ఇది విచిత్రంగా అనిపించినా ఇదే వాస్తవం!
అలాగే ఒక విషయం గురించి చెబుతూ
మరొక విషయాన్ని చెప్పకుండా దాటవేయడం చాలా కష్టం!
***
పినోచెట్ గురించి రాయడం అంటే
సుహార్తో, మార్కోస్, హిట్లర్ గురించి కూడా రాయడం లాంటిదన్నమాట!
చిలీలో అదృశ్యమైన వ్యక్తి చెమ్మానిలో కూడా పాతి పెట్టబడి ఉన్నాడు మరి!
మెరిసివిలి, సూర్య కందలోని సామూహిక సమాధులు ఒకే పెద్ద గుంటగా తవ్వి ఉన్నాయి!
***
బాబ్రీ మసీదును కూల్చిన గునపాలు
జాఫ్నా లైబ్రరీని దహించిన మంటలనుంచే పుట్టాయి!
ఆ మంటల వేడికే ఆఫ్గనిస్తాన్‌లోని బుద్ధుని విగ్రహాలు పేలిపోయాయి.
సూర్యకందలో పిల్లలని పూడ్చిపెట్టిన చేతులే
చెమ్మని లో యువకులను కూడా పూడ్చిపెట్టాయి.
కీలన్వెన్మణిపై ఆవరించిన నిశ్శబ్దం
బెల్చీని కూడా ఆక్రమించింది!
***
బీహార్ లో దళిత రక్తాన్ని తాగిన భూమే
ఉత్తర ఫ్రావిన్సులో తమిళ రక్తాన్ని కూడా పీల్చుకుంది !
***
చూడండి!
ఒకే గునపం! ఒకే మంట! ఒకే గుంత!
వాటి ఆకారాల్లో, చేసే పనిలో, స్థలాల్లో ఏం తేడా ఉందో చెప్పండి ఇక్కడ?
అందుకే, నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు
మరొక దాని గురించి కూడా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది!
ఒకే సంఘటన అచ్చంగా మరో చోట కూడా జరిగినట్లు తోస్తుంది!
ఎంతాశ్చర్యమో కదా?
***
చిలీలో కళ్ళముందు నుండి ఉన్నట్లుండి మాయమైన వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు
సరిగ్గా జాఫ్నాలో అదృశ్యమైన మనిషి గురించి కూడా చెబుతున్నట్టు అనిపించడం వింత కాదేమో? రెండు చోట్లా తగలబడిన లైబ్రరీ గురించి చెప్పడం కూడా ఇలాంటిదే మరి!
***
అయోధ్యలో ధ్వంసం కాబడిన మస్జిద్ గురించి మాట్లాడుతున్న సమయంలోనే
జాఫ్నాలో కాల్చివేయబడ్డ లైబ్రరి గురించి చెబుతున్నట్లు అనిపిస్తుంది!
బమ్యాన్ లో పేల్చివేసిన బుద్ధ విగ్రహాల గురించి చెబుతున్నప్పుడు
మెరిసివిల్లి లో చిధ్రమైన ఆత్మ గురించి కూడా చెబుతున్నట్లు లేదూ?
***
అసలు విషయం ఏంటంటే
ఇక్కడ వేరే విషయం అంటూ ఏదీ లేదు!
ఉన్నదంతా ఒకటే విషయం!
అవును!!
ఇప్పుడు మొత్తం భూగోళం అంతటా ఒకే విషయం ఉంది!
ఒకటే జరుగుతున్నది!
(ధ్వంసం అవడం, మాయం అవడం, కాల్చ బడటం, పూడ్చివేయబడడం, అన్యాయం చేయడం!)
తమిళ మూలం - ఎస్.శివశేఖరం
స్వేచ్ఛానువాదం - గీతాంజలి.
Related