‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’

ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే. 

ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి, ఆర్ధ్రతలే ఉంటాయి.  కవిత్వపు ఉద్యమాక్షరాలు విస్ఫోటనాలై తెలుగు దళిత కవిత్వానికి వెలుతురు దారులు పరిచాయి. అతడి కవిత్వాన్ని సృశించడమంటే, అతడి కవిత్వం గూర్చి మాట్లాడటమంటే దళితుల పక్షాన నిలబడి సమరం చేయడమే.

మానవ సమాజంలోని మూలాల్లో పునాదులై మనిషి జీవితాల్ని శాసిస్తున్న వర్ణవ్యవస్థపై సుధాకర్‌ కవిత్వం తిరగుబాటు జెండా ఎగరేసింది.   మతోన్మాదం కింద అణగారిన ప్రజల ఆర్తనాదాలు కవిత్వ వస్తువులయ్యాయి. నిత్యం తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలొక్కటే కవిత్వమవ్వలేదు. అతడి కవిత్వం సామాజిక అసమానతలపై ఎర్రని నిప్పుకణికలయ్యింది. అదేలాగంటే…

ఈ దేశం చెప్పును మింగేసింది

ఈ దేశం డప్పును కోసేసింది

ఇప్పుడు తిరగబడిన చెప్పులు

జెండాలై పైకి లేచాయి

కవిత్వం నా కులవృత్తిలోని 

చర్మతత్త్వ రహస్యం (కొత్తగబ్బిలం)

ఎండ్లూరి సుధాకర్‌ దళిత తాత్విక చింతనాపరుడు. ఆయన ఆలోచన కవిత్వపు అలజడి దళిత దృక్కోణమే. కవిత్వం నా చర్మతత్వరహస్యమని చెప్పడంలోనే మూలాల్లోకి వెళ్ళిపోయాడు. తన జీవితమంతా కవిత్వమై బతికినవాడు. ఏటికి ఎదురీదడం బాగా తెలిసిన వాడు. నిఖార్సుగా న్యాయమనిపించిన వర్గీకరణ ఉద్యమానికి  బాసటగా నిలిచి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న పోరుబాటకు వర్గీకరణీయం కవిత్వాన్ని ఆయుధంగా ఇచ్చిన వాడు. ఆ దీర్ఘకవితను ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న రోజుల్లో 03.12.2004 నుండి 6.12.2004 వరకు నాల్గురోజుల్లోని రాసి దళిత కవిత్వంలో సంచలనం సృష్టంచినవాడు. ఆ దీర్ఘ కవితలో లేవనెత్తిన సమన్యాయం, తరతరాలుగా మాదిగలు నష్టపోతున్న వైనాన్నే కాకుండా ఈ సమాజంలో అసమానతల వల్ల జరిగే నష్టాన్ని నిప్పుకణికల్లా చెప్పగలిగాడు. అదెలాగంటే..

ఆకాశం నుంచి ఆ త్రిమూర్తుల్ని

రప్పించండి

సుప్రీం న్యామూర్తుల్ని

జాంబపురాణం విప్పుతాం

జవాబు చెప్పమనండి

జగతికంటే ముందు పుట్టిన

జాంబవంతుడు 

కామధేనువుని కోసి

కువ్వలు పోసి

మనవడా కాప‌లా ఉండమని స్నానానికెళ్తె

వచ్చి చూసేసరికి 

వండిన మాంసం మాయం

మెత్తని చియ్యలు మీకు

ఎముకలు పోగులు మాకు మిగిలాయి (వర్గీకరణీయం)

ఇంతకంటే గొప్పగా వర్గీక‌రణ ఉద్యమం ఉద్యమం మీద ఎవరు చెప్పగలరు.  సాహిత్యానికి మనిషి జీవితమే పునాది అంటారు, కాని ఎండ్లూరి కవిత్వానికి పునాది మాత్రం  తన జాతికి జరిగిన మోసమే. వర్గీక‘రణ’కవిత్వంగా అందించి ఎమ్మార్పీయస్‌ ఉద్యమానికి కవిత్వ శంఖారావం ఈ  దీర్ఘకవితను పూరించాడు. మనువు ఆడిన దొంగనాటకాన్ని మనుధర్మం చెప్పిన నీతిమాలిన సూత్రాల్ని తన కవిత్వపుమంటల్లో కాల్చేసిన వాడు ఎండ్లూరి సుధాకర్‌.  జరుగుతున్న అన్యాయాన్ని రావాల్సిన న్యాయమైన వాటా అడుగుతూనే ఐక్యత అవసరమన్న సందేశాన్నీ ఇస్తాడు.

వర్గీకరణ వ్యాకరణంలో

కొత్త సంధి కుదరాలి

వైరి సమాసంలేని

ఏకవాక్యం రాయాలి

ఉమ్మడి పోరాటాలకు

ఇదే వేదిక

ఇంతకు మించి ఐక్యత రాదిక.. అంటూ చెప్పుకొస్తాడు. 

ఈ వర్గీకరణ దీర్ఘ కవిత్వంలో చివరగా మహాకవి  శ్రీశ్రీ చెప్పిన మాట ‘‘మహాకావ్యానికి క్రైటీరియా సైజూ బరువూ కాదయా నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలే!’’ అంటూ ముక్తాయిస్తారు. మహాభారత కథ కల్పితమైతే ఈ కథ ఊరి చివర్న బతుకుతున్న వాస్తవజీవన ముఖచిత్ర గాథ. ఈ గాథను ‘‘రాయాల్సిన సమయంలో రాయకుండానే రాలిపోయిన జాతిరత్నాలు చండాల చాటింపు కవి డా.నాగప్పగారి సుందర్రాజుకు, గుండెపోటుకు గురైన గూటం దెబ్బ కవి గ్యార యాదయ్యకు, మాకు మద్దతు నిచ్చి మధ్యలోనే వెళ్ళిపోయిన మా సోదరకవులు మద్దెల యాదయ్యకూ, దళితకవితా దళనాయకుడు మద్దూరి నగేష్‌బాబుకూ ఎమ్మార్పీయస్‌ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకూ..’’ అంటూ అంకితం చేశాడు.

ఇక ఎండ్లూరి సుధాకర్‌ దీర్ఘకవితల్లో గోసంగి దళితసాహిత్యచరిత్రలో అజరామర కావ్యంగా నామటుకు నేను భావిస్తాను. ఒక్క కవిత చాలనిపించింది..అదేమంటే..

నీళ్ళు

మమ్మల్ని చూసినప్పుడల్లా

కన్నీళ్ళు పెట్టుకునేవి

మేము తమని 

తాకడం లేదని దిగులు పడేవి

తనివితీరా తాగడం లేదని

దిక్కులు చూసేవి

నీటికి మతమున్న దేశంలో

మేము పుట్టడం

నేటికీ గొప్ప విషాదం(గోసంగి)

ఈ కవిత చదువుతుంటే స్వీయ అనుభవాలన్నీ కళ్ళముందు పలకరించాయి. పల్లెలో ఈ అవమానాల్ని ప్రత్యక్షంగా అనుభవించిన చరిత్ర నాకు ఉండటం గమనార్హం. ఊళ్లో ఉన్న ఏకైకతాగునీటి బావికి వెళితే అగ్రవర్ణాల వారి నీళ్ళు తెచ్చి పై నుంచి ఎత్తి మా మట్టి బిందెల్లోకి పోయించుకుని తెచ్చి దాహార్తి తీర్చుకున్న అనుభవాలున్నాయి. అప్పుడునిపించేది మేమెందుకు ఈ ప్రపంచంలో బతుకుతున్నామని..ఎండ్లూరి సుధాకర్‌ అదే చెప్పాడు. ఆయన  దార్శనికుడనిపిస్తుంది. దార్శనికత కలిగిన కవిత్వ సృజనే ఆయనను బలంగా సాహిత్యలోకంలో నిలబెట్టిందనిపిస్తుంది. ఈ గోసంగి దీర్ఘకావ్యాన్ని 3.7.2010 సాయంత్రం నాలుగ్గంటలకు మొదలు పెట్టి రాత్రి ఎనిమిదికంతా పూర్తి చేసినట్లు రాసుకున్నాడు. భావావేశం కట్టలు తెచ్చికున్న కవిత్వ ఉప్పెనకు తార్కాణంగా ఈ గోసంగి.

ఇటీవల కాలంలో ఒక అద్భుతమైన దళితకథను అక్రమసంతానం పేరుతో అనువదించారు. దాని మూలకథ మరాఠీ దళితరచయిత శరణ్‌కుమార్‌ లింబాలే రాసిన ప్రసిద్ధ మరాఠీ కథ అక్రమాషీ. అనేకమంది అనువాదాలు చేసినా ఎండ్లూరి సుధాకర్‌ అక్రమ సంతానంలో మూలకథ స్వభావమేమాత్రం భంగం కలగకుండా సహజంగా అనువదించగలిగాడు. మరాఠీ సాహిత్యంలోనే సంచలనమైన రచయిత శరణ్‌కుమార్‌ లింబాలే.

అందులోని ఒక పాత్రకు చెప్పిన మాట ఒక్క మాటలో తన అనువాద ప్రతిభ చూస్తే..

‘‘నేను పుట్టడం తోటే జమిందారుల కుటుంబగౌరవపు కోటలన్నీ తల్లడిల్లి ఉంటాయి. నా తొలి శ్వాసతో ప్రపంచంలోని నీతి తడబడిపోయి వుంటుంది. నా ఆక్రందనతో మొత్తం ఆడకుక్కల పొట్టల్లోంచి పాలన్నీ ఒలికిపోయి ఉంటాయి.’’ కవి అనువాదకుడైతే ఏ మాటైనా ఏ పాత్రైనా దానికి ప్రాణప్రతిష్టపోసినట్లుంటుంది.

ఎండ్లూరి సుధాకర్‌ బహుముఖీయ ప్రజ్ఞ కలిగినవాడు. బహుభాషల ద్వారా దళిత బతుకుల్ని తెలుగు సాహిత్యానికి అందించిన బాహుబాషావేత్త. అనేకభాషలపై పట్టున్న లబ్ధప్రతిష్డుడు. ఇప్పటికీ తన అనువాదం  చేసిన ఒక హిందీగీతం చదివాక అతడెంత గొప్ప సాహిత్య సృజనాకారుడో అర్థమౌతుంది..అదేమంటే..

లగ్‌ జా గలే కి ఫిర్‌

యే హసీరాత్‌ హో న హో

షాయద్‌ ఫిర్‌ ఇస్‌ జనమ్‌ మే

ములాకాత్‌  హో న హో

“““

హమ్‌ కో మిలీ హై ఆజ్‌ యే

ఘడియా నసీబ్‌ సే

జీ భర్‌ దేఖ్‌ లీ జియే

హమ్‌ కో కరీబ్‌ సే 

ఫిర్‌ ఆజ్‌ కే నసీబ్‌ మే

యే బాత్‌ హో న హో

“““`

పాస్‌ ఆయి యే కి

హమ్‌ నహీ ఆయేంగే బార్‌ బార్‌

బాహో గలే మే డాల్‌ కే

హమ్‌ రోలే జార్‌ జార్‌

ఆంఖోసే ఫిర్‌ యే ప్యార్‌ కి

బర్‌ సాత్‌ హో న హో

““`

(తెలుగు అనువాదం)

హృదయానికి హత్తుకు పో

ఈ అందమైన రాత్రి ఉంటుందో లేదో

బహుశా ఈ జన్మలో

ఈ కలయిక ఉంటుందో లేదో

నా అదృష్టం కొద్దీ

ఈ ఘడియలు దొరికాయి

మనసార దగ్గరి నుంచి చూసుకో

తర్వాత నీ అదృష్టంలో

ఈ అవకాశం ఉంటుందో లేదో

నా చెంతకు రా

నేను మళ్లీ మళ్లీ రాలేను

చేతులు మెడలో వేసి

ఏడ్చుకుంటాను ఎడతెగక

కళ్ళలో నుంచి మరలా

ప్రేమ వర్షం ఉంటుందో లేదో..

ఇంతటి గొప్ప కవి ఆకస్మికంగా పెన్నుమూసేశాడు. కవిత్వ ఉద్యమ శంఖారావం పూరించాల్సిన గొంతుమూగబోయింది. దళిత ఉద్యమకారులందరికి అంబేడ్కరుడి చూపుడు వేలు సాక్షిగా నల్లనికిరణాల దారుల్లో నడిచివెళ్ళి కనుమరుగయ్యాడు. అతడు నల్లద్రాక్షా పందిరి క్రింద శాశ్వతంగా నిద్రబోతున్నాడు. నిద్రలేపాలనుకుంటే అతడి ఆశయాల దారుల్లో నడుస్తామని మాటిచ్చి మరీ లేపండి. ఆయన అక్షరాల్లో జీవాయువుతో ఉంటాడు.  

3 thoughts on “అస్తిత్వ కవితా ప‌తాక  

 1. మా సత్యం
  కెంగార.మోహన్ గారు రాసిన
  ‘ అస్తిత్వ కవితా పతాక’ ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వం జీవితం గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా వివరించారు.
  మోహన్ గారు తన వ్యాసంలో “ఆధునిక కవిత్వం మల్లెమొగ్గలగొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో
  తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించిన
  వాడు.” తొలి
  అని పేర్కొనడం సమంజసంగాలేదు
  చారిత్రాత్మకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
  మంగిపూడి వెంకట శర్మ గారు1915 లో
  జాషువా కంటే ముందుగా సాక్షాలతో ప్రమాణాలతో ప్రశ్నలు సంధించి, మూలాలను అన్వేషించి, హేతుబద్ధతతో వివరించి 1915 లో మంగిపూడి వెంకట శర్మ గారు ‘నిరుద్ద భారతం’ లో రామాయణ, పురాణాల మూలాల్లోకి వెళ్లి తీవ్ర స్వరంతో, ధిక్కార స్వరంతో సనాతనులపై, బ్రాహ్మణులపై, ఆచార్య వంతుల పై ప్రశ్నల వర్షం కురిపించారు. కుసుమ ధర్మాన గానీ, జాషువగానీ ఈ విషయంలో మూలాలలోకి వెళ్ళలేదు ఇన్ని ప్రశ్నలు స్పందించలేదు. వేదాలు ఇతిహాసాలనే, పురాణాలనే ధిక్కరించలేదు.
  ఇదంతా చేసింది ఒకే ఒక్కడు మంగిపూడి వెంకట శర్మ.
  రహస్యాలను బయట పెట్టాడు. అస్పృశ్యత నివారణ అని ప్రతిపాదించిన ప్రధమ పద్య కావ్యం
  ‘నిరుద్ద భారతం’. దళితేతర వ్యక్తి కావడం గమనార్హం.

 2. మానవీయ కవి, వర్తమానం కవి ఎండ్లూరి సుధాకర్ గారి గురించి లోతైన విశ్లేషణతో సాగిన ఈ వ్యాసం నాకెంతో నచ్చింది.
  మాట్లాడాల్సినప్పుడు మాట్లాడిన వాడు, రాయాల్సినపుడు రాయగలిగిన వాడు, నిలబడాల్సినప్పుడు నిలబడిన వాడు సుధాకర్ సార్!

  అభినందనలు అన్నా!

Leave a Reply