మేం ఎం.ఏ చదువుతున్నరోజుల్లో మా ప్రొఫెసర్ ఒకాయన తరచుగా “There is nothing to choose between two fools” అనేవారు. ఎవరిని గురించో ఇప్పుడు జ్ఞాపకం లేదనుకోండి. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు “There is nothing to choose among these cheaters” అని జగన్, పవన్, బాబు, బిజెపి ల గురించి అనాల్సిరావడం ఒక విషాదమoదామా? లేక ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయాలు లేవని సరిపుచ్చుకుందామా?
మొన్నటివరకు జగన్ ప్రత్యక్ష మద్దతు తీసుకుంటూ, అతనికి పరోక్ష మద్దతునిస్తూ, అతన్ని అరెస్టుల నుండి కాపాడుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశంతో జత కట్టడాన్ని కేవలం ఈ ఎన్నికల ఎత్తుగడగా భావిస్తే మనం వారిని తక్కువుగా అంచనా వేసిన వాళ్ళమవుతాం. తనకు లక్ష్యమయిన అఖండ భారత్ సాధనకై, తాను తప్ప మరో పార్టీ, తొలుత ప్రాంతీయ పార్టీల, ఉనికిలో లేకుండా చేసే ప్రక్రియలో భాగమే ఈ జతకట్టడం. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో – పంజాబ్, బీహార్, మహారాష్ట్ర లాంటి వాటిల్లో ప్రాంతీయ పార్టీల పునాదులు కుదిపివేస్తూ, ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది. ఇటీవలే తెలంగాణలో టిఆర్ ఎస్/బిఆర్ ఎస్ పార్టీని చావు దెబ్బ తీసి తాను ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే క్రమం మొదలయ్యింది. అరబ్ గుడారంలో తలదూర్చడానికి అవకాశమిస్తే మొత్తం గుడారాన్ని ఆక్రమించిన ఒంటె లాంటిది బిజెపి.
మొన్నటివరకు రెండు ప్రాంతీయ పార్టీలూ, తెలుగుదేశo, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రంలో మోదీకి అంటకాగుతూ, అన్ని ప్రజావ్యతిరేక- విద్యుత్, కార్మిక, వ్యవసాయ చట్టాలకు, ముఖ్యంగా రాజ్యసభలో తమ మద్దతు నిచ్చి తమ రాజభక్తిని చాటుకున్నాయి. జగన్ కు, తన వ్యక్తిగత ప్రయోజనాలకై, మోదీ అవసరం వుంది. మరి, గతంలో బిజెపిని తీవ్రంగా దుయ్యబట్టి ఎన్ డి ఏ కూటమి నుండి బయటకువచ్చిన బాబుకు? తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతి, పోలవరం విషయంలో (మిగతా విభజన చట్టపు హామీలు- సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కడప ఉక్కు కర్మాగారం, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు లాంటి వాటిని అన్నిరాజకీయ పార్టీలు గాలికి వదిలేసాయనుకోండి!) సహకరించారనా? విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విధానాన్ని విడనాడారనా?? బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీల బహిరంగ సభలో మోదీ కంటితుడుపుగా నైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు లాంటి విభజన చట్టపు హామీల గురించి ప్రస్తావన కూడా చేయకపోవడం గమనార్హం. ఎన్నికల బాండ్ల అవినీతి బయటపడ్డా, తానేదో పవిత్రుడినని , రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేందుకు తమను ఎన్నుకోవాలని కోరడం ప్రజల చెవుల్లో కమలాలు పెట్టడమే. అయినా, జగన్ & కో కు మోడీని నేరుగా విమర్శించే ధైర్యం లేదుగా. ఏమైనా నోటా కంటే తక్కువ ఓట్లు గల బిజెపి ఈ సారి కనీసం ఒకటి, రెండు పార్లమెంటరీ సీట్లు గెలిచినా ఆశ్చర్యపడాల్సినవసరం లేదు.
బాబును నిత్యం సమర్థించే పత్రికాధిపతులకు, మేధావులకూ బాబు యు టర్న్ అంతగా మింగుడు పడడం లేదు. బాబు మోదీ కౌగిలిలో చేరేందుకు అందరికీ కనిపిస్తున్న ఏకైక కారణం-ఎన్నికల సమయంలో జగన్ అక్రమాలకు పాల్పడకుండా కేంద్రం నిలువరిస్తుందనే ఆశ. జగన్, రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి గల అన్ని సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు గానే, మోదీ కూడా ఎన్నికల సంఘం, కొంతమేరకు న్యాయవ్యవస్థతో పాటు, అనేక సంస్థలను తన అధీనంలో వుంచుకొనడంతో బాబు మోడీని ఆశ్రయించక తప్పలేదంటారు. అయితే, ఇది పులి పంజా నుండి తప్పిoచుకొనేందుకు సింహం నోట్లో దూరడమేనని, గొప్ప రాజకీయవేత్తగా, దార్శినికునిగా పేరొందిన బాబుకు అర్థంగాకపోవడం విచిత్రం. అయినా అవకాశావాద, జిత్తులమారి రాజకీయాలలో ఎవరి ఎత్తుగడలు వారివి. అంతిమంగా పాలనాధికారం పొందడమే అన్ని పార్టీల అంతిమ లక్ష్యం. ఇక కొసమెరుపుగా, తానింకా ఉన్నానంటూ ఇంతవరకు పత్తాలేని, సత్తాలేని లోక్ సత్తా పార్టీ అధినేత మహామేధావి జయప్రకాష్ నారాయణ ఎన్ డి ఏ కూటమికి మద్దతు ప్రకటించాడు. తన ఓటు తప్ప మరొక ఓటు పొందలేని ఈ మేధావి మద్దతువల్ల ఎన్ డి ఏ కు ఏం లబ్ది చేకూరుతుందో? ఇక అంతటితో ఆగక తనకేవరైనా ”కులం” అoటిస్తారని ముందుగానే వాపోయాడు. అయినా ఆయనకు, దట్టంగా ఇప్పటికే అంటకున్న కులం మరొకరు ఆపాదిoచాలా?
ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరు గెలిచినా మోదీ గెలిచినట్లే (కాంగ్రెస్, రెండు కమ్యూనిస్టు పార్టీల గెలుపు అవకాశాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు). పొతే జగన్, బాబు పార్టీలలో ఎవ్వరు అధికారంలో రాకపోయినా, వారి అస్తిత్వమే, తెలంగాణలో బిఆర్ ఎస్ ఉనికి మాదిరి, ప్రశ్నార్థకమవుతుంది. ఇంతవరకు బిజెపితో చేతులు కలిపిన ఏ రాజకీయ పార్టీ ఏమాత్రం ఎదగకపోగా, పంజాబ్ లో అకాలిదల్, బిహార్ లో పాశ్వాన్ పార్టీల లాగా కనుమరుగు గాక తప్పదు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పార్టీ, ఒకే నాయకుడు లక్ష్యంగా పెట్టుకున్న మోదీ మర్రిచెట్టుకింద మరో మొక్క ఎదిగే అవకాశం ఉంటుందా?
చంద్రబాబనే చేపను పట్టడానికి మోదీకి పవన్ ఒక గాలం. ఎక్కడా నిలకడ లేని పవన్, చేగువేరా రాజకీయాలతో ప్రారంభమయి, తర్వాత గద్దర్, పార్లమెంటరీ కమ్యూనిస్టుల చేరి చివరకు మతతత్వ పార్టీ బిజెపిని కౌగిలించుకున్నాడు. What a fall Mr.Pavan. జాన్ మిల్టన్ తన పేరడైజ్ లాస్ట్ కావ్యంలో సాతాన్ గురించి రాసినట్టుగా, పవన్ ది సైద్ధాంతికంగా “From the heights of glory/ to the depths of Degradation” ఇక మనభాషలో చెప్పాలంటే ఏనుగ లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకం లోని ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది.“ఆకాశంబున నుండి, శoభుని శిరం…పవనాంథోలోకముoజే రె” అంటూ గంగానది ప్రయాణాన్ని వర్ణిస్తూ “పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్” అని జాలిపడ్డారు. సరిగ్గా ఆ వర్ణన పవన్ కు సరిపోతుంది.
పవన్ కు ప్రాముఖ్యత మోదీ ఇవ్వడానికి అతనికున్న ఓటర్ల బలం మాత్రం కాదు. కేవలం కాపు కులంలో, ఓట్లు, అదీ ఉభయగోదావరి జిల్లాలలోనే అతని ప్రభావం అంతో, ఇంతో వుందని మోదీకి తెలియనిది కాదు. పొతే, తమకేమాత్రం చోటు లేని రాష్ట్రంలో అడుగుపెట్టడానికి పవన్ కేవలం తొలిమెట్టు(stepping stone)మాత్రమే. ఈ ఎన్నికల్లో కొన్నిసీట్లు, తన బలంతో కాదనుకోoడి, గెలుచుకున్నా మొదట కనుమరుగయ్యేది జనసేన. ఆతర్వాత, వైఎసార్పి లేక తెలుగు దేశం. ఒక విధంగా చెప్పాలంటే ఆరెండు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యనే.
పైవాతావరణంలో ముస్లింలు, క్రైస్తవులు గంపగుత్తగా జగన్ కు ఓటేసే అవకాశముంది. అదే జరిగి జగన్ మళ్ళీ ఎన్నికయితే, రాయలసీమ ప్రజలు తమ డిమాండ్లను మరిచిపోవాల్సిందే. అంటే తెలుగుదేశం ఏదో ఒరగబెడుతుoదని మాత్రం కాదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే, సీమలో బలమైన సామాజిక వర్గం, రెడ్లు ప్రజల మద్దతు పొందేoదుకైనా, గతంలో రాజశేఖరెడ్డి, మైసూరా రెడ్డి , ఎం.వి.రమణా రెడ్ల తరహా, రాయలసీమ డిమాండ్లను నెత్తికెత్తుకొనే అవకాశం వుంది. ప్రజలూ వారివెంట ఉద్యమంలో పాల్గొనే అవకాశమూ వుంటుంది. తెలుగు దేశం ప్రతిపక్షంగా (ఇతర పార్టీలు ఉభయ కమ్యూనిస్టులతో సహా) ఒక్క రాయలసీమ డిమాండ్ పై చిత్తశుద్ధిగా ఉద్యమం చేపట్ట లేదు. దానికి(వాటికి) అమరావతి, పోలవరం తప్ప రాష్ట్రంలో ఇతర ప్రాంతాల సమస్యలేవీ కన్పించలేదు. రాయలసీమ ప్రజల్లో భూస్వామ్య భావజాలం బలంగా ఉండటం, సమిష్టితత్వం లోపించడం, కేవలం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశిస్తూకాలం గడపడంతో సీమలో ఈ దుస్థితి నెలకొంది. అందువల్ల మోదీ మోచేతి నీళ్ళు తాగుతున్న తెలుగుదేశం గెలిస్తే వైఎస్సార్ సీపీ శ్రేణులు చేపట్టే ఉద్యమాల ద్వారా సీమకు ఏమైనా ఒరుగుతుందనే ఆశ. గత ఐదు సంవత్సరాల తెలుగు దేశం పార్టీతో సీమ ప్రజల అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. ఇదొక విరోధాభాస (paradox).
రాయలసీమ పార్టీల మాటటుoచితే, మొత్తం రాష్ట్ర ప్రజలకు దిక్కుతోచని స్థితి. మరీ ముఖ్యంగా మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవుల పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, పాలన మాత్రం కమలనాథులదే (ఇండియా కూటమి అధికారం లోకి వస్తే తప్ప). ఇప్పటికే రాష్ట్రంలో ముస్లిo వ్యతిరేక పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తప్ప, ఒక్కటీ లేదు. ప్రజలకు ఏ రాయి అయితేనేం తల పగలడానికి- అనే ఎంపికనే వుంది. పరిస్థితి ఎలా ఉందoటే Select a Lesser Evil. కానీ ఆ తక్కువ స్థాయి దుర్మార్గులెవరో?