ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని తెలిపింది. ప్రత్యేక చర్యలు అమలు పరచని యెడల 2030 నాటికి 880 మిలియన్ల పేదలు ఉంటారని, ఆకలిని అంతం చేయడం అసాధ్యమని నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. 

పోషకాహార అభద్రత సంక్షోభం :

మన దేశంలో గ్రామీణ, పట్టణ పేదల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఉపాధి కరువై, వచ్చే ఆదాయం చాలక పలువురు ఆకలితో బాధపడుతున్నారు. రెక్కల కష్టంతో కడుపులోకి కాసింత గంజి పోసుకుందామన్నా పని కల్పించలేని ప్రభుత్వ విధానాల వల్ల లక్షలాది ప్రజలు విసిరేసిన విస్తరాకుల్లోని ఎంగిలి మెతుకులకోసం తగువులాడుకోవడం పట్టణాల్లో మనం చూస్తునే ఉన్నాం. లక్షలాది మంది కూడు లేక, గూడు లేక, చింపిరి బట్టలతో పుట్‌పాత్‌ల పైనా జీవచ్చవాల్లా బ్రతుకుతున్నారు. వీరిని పట్టించుకునే వారు లేరు. సరైన పోషకాహారం లేక కోట్లాది మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు, మధ్య వయస్సులు, వృద్ధులు, ప్రత్యేకంగా మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు 10 శాతం మంది సర్వభోగాలు అనుభవిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం కారకులు పాలకులేనని నిర్ద్వందంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 75శాతం మంది గ్రామీణ ప్రజలు, 50 శాతం మంది పట్టణ ప్రజలు పోషకాహార లేమితో పలు వ్యాధులకు గురి అవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 237 కోట్లకు పైగా (ప్రతి ముగ్గురిలో ఒకరు) ప్రజలకు అవసరమైనంత ఆహారం లభించడం లేదని నివేదిక తెలుపుతున్నది. లింగ వివక్ష కారణంగా పురుషుల కన్న మహిళల్లో 10 శాతం అధికంగా ఆహార అభద్రత అనుభవిస్తున్నారు. ఆహార ధాన్యాల అధిక ధరలు, ఆదాయం తగ్గడం వల్ల పేదలు పోషకాహారానికి దూరం అవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 22 శాతం(160 కోట్లు) ఐదేండ్ల లోపు పిల్లలు శరీర వృద్ధి నిలిచిపోవడం (స్టంటింగ్‌)తో, 6.7 శాతం (4.54 కోట్లు) అభివృద్ధి తగ్గడం (వేస్టింగ్‌)తో, 5.7 శాతం (3.89 కోట్లు) అధిక బరువు (ఓవర్‌ వేయిట్‌) సమస్యలతో బాధ పడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పిల్లల పోషకాహారలోపం అత్యధికంగా కనిపిస్తున్నది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 16-49 ఏండ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత(ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యూరోప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణీ మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, అండర్‌ వెయిట్‌ పిల్లలు, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల మధ్య 2030 నాటికి ఆకలిని అంతం చేయడం అసాధ్యమని నివేదిక తెలిపింది.

ప్రభుత్వ అనుచిత విధానాలు :

ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ విధానాలు పేద ప్రజల పొట్టకొడుతున్నాయి. పేదలు పట్టెడన్నమూ తినే పరిస్థితి లేకుండా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రచార్భాటం, ప్రగల్భాలు తప్ప ఆహార పదార్థాల సరఫరా విషయంలో చేతులెత్తేశారు. దేశ ప్రజల కడుపు నింపేందుకు అందుబాటు ధరల్లో, సరిపడా ఆహార ధాన్యాలు లభించేలా చూడటం లేదు. ఈ బాధ్యతను నెరవేర్చకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. ముందుచూపు లేని వైఖరి కారణంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతున్నది. ఫలితంగా వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ (ఓఎంఎస్‌ఎస్‌) ద్వారా ఎఫ్‌సిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం కొనకుండా షరతు విధించింది. గోధుమలు, బియ్యం కొరత కారణంగా వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలు, కందిపప్పు, చింతపండు సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగి పేదలు బతికే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆకలి తీర్చే బియ్యం, గోధుమల ధరలు పెరుగుతుండటం పేదలకు దెబ్బ మీద దెబ్బ కానుంది.

కేంద్రం ప్రతి సీజన్‌లో ఆహారధాన్యాల దిగుబడులు ఎలా ఉండనున్నాయో శాస్త్రీయ అంచనాకు రావాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా దిగుబడులు ఉండవనుకుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలి. కానీ, ఈ ముందుచూపు కేంద్రానికి కొరవడిరది. దీని ఫలితంగానే గోధుమలు, బియ్యం కొరత ఏర్పడుతున్నది. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు గోధుమల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి విధిస్తున్నట్టు కేంద్రం జూన్‌ 12న ప్రకటించింది. హోల్‌సేల్‌ వ్యాపారులు గరిష్టంగా 3 వేల మెట్రిక్‌ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్‌ టన్నులు, ఫుడ్‌ ప్రాసెసర్లు మొత్తం సామర్థ్యంలో 75 శాతం మాత్రమే నిల్వ చేసుకోవాలని పరిమితి విధించింది. 2022 ఏప్రిల్‌లో ఎఫ్‌సిఐ వద్ద కేంద్రం కోటాలో 323.22 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉండగా, ఈ ఏప్రిల్‌లో 248.60 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నాయి. 2022 ఏప్రిల్‌లో 189.90 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు ఉండగా, ఈ ఏప్రిల్‌లో 83.45 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యం, గోధుమల కొరతకు ఈ లెక్కలే నిదర్శనం.

విపరీతంగా పెరిగిన ధరలు :

ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి పేదలకు పెనుభారంగా మారడం బిజెపి హయాంలో సాధారణ అంశంగా మారిపోయింది. ఇటీవల వంటనూనెలు, కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు గోధుమలు, బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారమే… గత నెల రోజుల్లో మార్కెట్‌లో గోధుమల ధరలు 8.13 శాతం పెరిగాయి. అధికార లెక్కల ప్రకారం ఏడాదిలో బియ్యం ధరలు 10 శాతం పెరిగాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఈ ధరలు మరింత ఎక్కువే పెరిగాయి. ఇవాళ దేశంలో 81 కోట్ల మంది ప్రభుత్వం ఆహార పదార్థాలు సరఫరా చేస్తే తప్ప పొట్ట నింపుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆకలి, ఆహార అభద్రత, పోషకాహార లోపం వంటి వాటిని అధిగమించే విధానాలు ఎంత మాత్రం అమలవడం లేదు.

ప్రభుత్వాలు, కొంతమేరకు సబ్సిడీ ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తేగలుగుతున్నాయిగాని పళ్ళు, గుడ్లు, పాలు, కూరగాయలు వంటి పోషకాలు అందించే ఆహార పదార్థాలు అందించడం లేదు. అల్పాదాయ వర్గాలకు, వీటి ధరలు అందుబాటులో లేకపోవడం వలస వినియోగం సాధ్యపడడం లేదు. దాంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం పెద్ద సవాలుగా ఉంది. ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో ఉండాలంటే, పోషకాహార ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల ఆదాయాలకు అనుగుణంగా ఉండాలి. ఆకలిని అదుపు చేయడంలో, ఆహార భద్రత కల్పించడంలో, పోషకాహారాలు అందించడంలో ప్రభుత్వాలు వెనుకడుగేస్తోన్నాయి.

ఓఎంఎస్‌ఎస్‌ పైనా షరతు :

ఎఫ్‌సిఐ నుంచి ఈ-వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్రం బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం (ఓఎంఎస్‌ఎస్‌) ద్వారా అవకాశం కల్పిస్తూ గత జనవరి 26న నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం జరిగి ఆరు నెలలు కూడా గడపక ముందే కేంద్రం మాట మార్చింది. ఇప్పుడు ఓఎంఎస్‌ఎస్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించాలని ఎఫ్‌సిఐను కేంద్రం ఆదేశించింది. చాలా రాష్ట్రాలు సొంతంగా పేదలకు ఆహారధాన్యాలు అందించే పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కోసం సరిపడా నిల్వలు లేని రాష్ట్రాలు ఎఫ్‌సిఐ నుంచి కొంటాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం :

అధికారుల లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏప్రిల్‌లో 5.23 లక్షల హెక్టార్లలో గోధుమ పంట నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గుతున్నందున ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం చేతులు ముడుచుకొని కూర్చున్నది. ఫలితంగా గోధుమల కొరత ముంచుకొస్తున్నది. ప్రస్తుతం గోధుమలపై దిగుమతి సుంకం 40 శాతం ఉన్నది. దీంతో వ్యాపారులు ఇతర దేశాల నుంచి గోధుమల దిగుమతికి వెనకాడుతున్నారు. నిజానికి ప్రభుత్వం బియ్యం, గోధుమలు, నూనెలు, పప్పులు వంటి ఆహార పదార్థాలకు అధిక సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది.

కొరబడిన ఆహార భద్రత :

కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సమయంలో కార్పొరేట్లకు లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం అయిష్టంగానే పేదలకు ఉచితంగా ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించింది. ప్రజలకు అంతకుముందున్న రేషన్‌ పథకాన్ని ఎత్తివేసింది. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌) ద్వారా సరఫరా చేసేందుకు ఆహార ధాన్యాలను సేకరించి, నిలువ చేయడం, ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేయడం, రైతులకు సరైన మద్దతు ధర కల్పించడం ఎఫ్‌సిఐ బాధ్యత. ప్రజలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజన మేమిటి?

నిజానికి భారతదేశం సమృద్ధిగా భూవనరులు, జలవనరులు, శ్రామికులను కలిగి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆహార పదార్థాల ఉత్పత్తిలో ఒకటిగా ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం 300 మిలియన్‌ టన్నుల ఆహార పదార్థాల ఉత్పత్తిలో దేశం తన స్వంత జనాభాను పోషించడానికి స్వయం సమృద్ధి స్థాయిని అధిగమించింది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని, ధాన్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినప్పటికి పేదరికం, ఆహార అభద్రత, పోషకాహార లోపం కొనసాగుతూనే ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అయినా కనీస ఆహారం తీసుకోవడం తగ్గింది. 300 మిలియన్‌ టన్నుల ఆహార పదార్థాల ఉత్పత్తిలో ఉన్నా, ఇప్పటికీ ఆకలిని, పోషకాహార లోపాన్ని అధిగమించలేకపోవడం ఆశ్చర్యకరం.

మోడీ ఏలుబడిలో ఏటా ఆకలి సూచీలో దిగువకు పడిపోతూనే ఉంది. గత ఏడాది మరీ ఘోరంగా 121 దేశాలున్న సూచీలో 107వ స్థానానికి దిగజారింది. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌ సైతం మనకంటే మెరుగ్గా ఉన్నాయంటే… మన పరిస్థితిని అంచనా వేయొచ్చు. తిండి గలిగితే కండగలదోయి.. కండ గలవాడే మనిషోయి… అన్న స్ఫూర్తితో పేదలందరికీ ఆహారధాన్యాలు అందేలా చర్యలు తీసుకుని, దేశాభివృద్ధికి నడుంకట్టాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఆలోచించడం క్షంతవ్యం కాదు. వివిధ కారణాల వల్ల 2023లో ఆహార ధరలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరించింది, విపరీతమైన వాతావరణ సంఘటనలు మరియు ఎల్‌నినో మొత్తం పంటలపై ప్రభావం చూపే ప్రధాన కారకాలు.

ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉంచడమా? ఇథనాల్‌ తయారు చేసి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నామని ప్రచారం చేసుకోవడమా? అన్న ప్రశ్న వస్తే, ప్రజాస్వామ్య పాలకులెవరైనా పేదలకు ఆహారం అందుబాటులో ఉంచేందుకే మొగ్గుచూపుతారు. కానీ మోడీ సర్కారు రెండో అంశంవైపే మొగ్గుచూపింది. 2013 ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో 81.3 కోట్ల మంది లబ్ధిదారుల కోసం ఆరుకోట్ల టన్నుల బియ్యం, గోధుమలను కేంద్రం పంపిణీ చేయాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌ 1 నాటికి కేంద్రం వద్ద 41.4 మెట్రిక్‌ టన్నుల బియ్యం 31.4 మెట్రిక్‌ టన్నుల గోధుమలు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలతో ఆహార సంక్షోభాన్ని రూపుమాపి, నిరుపేదలందరికీ ఆహార ధాన్యాలను అందించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా సమాఖ్య స్ఫూర్తిని సైతం తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయవద్దని ఎఫ్‌సిఐని ఆదేశించడం దారుణం.

పెట్రో ఉత్పత్తుల్లో 20 శాతం ఇథనాల్‌ను 2030 నాటికి కలపాలని మనదేశం లక్ష్యం కాగా, 2025-26 నాటికే ఆ లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2020-21లో, 1.06 మెట్రిక్‌ టన్నులు, ఈ ఏడాది 1.5 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తి కోసం కేటాయించింది. చెరకు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, బియ్యం నూకలు, గోధుమల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తారు. పేదలకు అందించేందుకు రాష్ట్రాలకు క్వింటాకు రూ.3,400 చొప్పున, ఇథనాల్‌కు క్వింటా రూ.2000 చొప్పున ఆహారధాన్యాలను గతంలో ఎఫ్‌సిఐ విక్రయించేది.

ఈ ధరలో వ్యత్యాసమే కేంద్రం కార్పొరేట్‌ ప్రాధాన్యతను, సంపన్న దేశాల ఆదేశాలకు మడుగులొత్తుతున్న విధానాన్ని తెలుపుతోంది. తాజాగా, ఇథనాల్‌కే ఆహారధాన్యాలు విక్రయించాలని ఆదేశించడం ఈ ప్రభుత్వానికి పరిశ్రమ, పారిశ్రామికాధిపతులు తప్ప ప్రజలు, వారి ఆకలి ఏమాత్రం పట్టడం లేదని తేటతెల్లం చేస్తోంది.

ప్రతికూల వాతావరణ మార్పుల ప్రభావం :

ఆహార అభద్రత, పోషకాహారలోపం పెరగడానికి కారణాలుగా వాతావరణ అసాధారణ ప్రతికూల మార్పులు, ఆర్థిక మందగమనం, ఆర్థిక అసమానతలు, లాక్‌డౌన్‌/కర్ఫ్యూలు లాంటి అంశాలు పేర్కొనబడినవి. ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం, మార్కెటింగ్‌ శృంఖలంలో లొసుగులు (ఉత్పత్తి, పంట కోత, ప్రాసెసింగ్‌, రవాణ, మార్కెటింగ్‌, సరైన ధర పలకడం), ఆదాయాలు తగ్గడంతో పోషకాహారానికి పేదలు దూరం అవుతున్నారు. పోషకాహార ఆహార లభ్యత పెరగడానికి వాతావరణ ఒడుదుడుకులను తట్టుకోగల ఆహార వ్యవస్థలు, ఆర్థిక కష్టాలను అధిగమించడం. ఆహార సరఫరా శృంఖలంలో నాణ్యతను పరిరక్షించడం, పేదరికంతో పాటు అసమానతలు తొలగించడం, ఆర్థిక అసమానతలు పెరిగితే ప్రకృతి సహజ వనరులైన సారవంతమైన నేలలు, మత్స్యసంపద, అటవీ సంపద, నీటి వనరుల కోసం సంఘర్షణలు తలెత్తుతాయి. సమాజంలో ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, ఆస్తులు, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో అసమానతలు పెరిగితే వాటి దుష్ప్రభావం అధికంగా మహిళలు, పిల్లలపై నేరుగా పడుతుంది.

ముగింపు :

ఏ ప్రభుత్వమైన తమ ప్రజలకు తగినంత ఆహారం, విద్య, వైద్యం, వసతి, ఉపాధి కల్పించవల్సిన నైతిక బాధ్యత ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న వ్యవసాయక దేశంలో ఇప్పటికీ ఒక వ్యవసాయ విధానం ప్రభుత్వాలకు లేకపోవడం దారుణం. సామ్రాజ్యవాద అనుకూల విధానాలు అమలు చేయడం వల్ల ప్రజల కనీస ఆహార భద్రతను విస్మరించి ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. పర్యవసానంగా ఎగుమతులకు అనుకూలమైన పత్తి, పొగాకు, మిర్చి వంటి వాణిజ్య పంటల సాగుకు క్రమంగా మారడం వల్ల ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో క్రమంగా దాదాపు 30 శాతం తగ్గింది. మరోవైపు అభివృద్ధి సాకుతో వ్యవసాయ యోగ్యమైన 2 కోట్ల ఎకరాల భూమిని వ్యవసాయేతర రంగాలకు అప్పగించింది. ఇక రిఅల్టర్లు, ఎన్‌ఆర్‌ఐలు పంట భూములను అధిక ధర చూపి రైతుల నుండి కొనేస్తున్నారు. ఫలితంగా మానవాభివృద్ధి సూచీల్లో వెనుకబడుతూ, ఆకలి సూచీలో ముందుకెళ్తున్న దుస్థితిలో సంక్షేమ పథకాలకు మోకాలడడ్డం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం అమ్మరాదని ఎఫ్‌సిఐని మోడీ ప్రభుత్వం ఆదేశించిన తీరు అత్యంత నిరంకుశమైనది, అప్రజాస్వామికమైనది. ఉపశమనం కలిగించేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం కుల, మత ఉద్రేకాలను పెంచి ప్రజల్లో విభజన తెచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు.

Leave a Reply