ఓ గొంతు మూగబోతే 
ఆ గజ్జె నీది కానేకాదు
ఓ స్వరంలో అలలు ఎగిసిపడటం ఆగిపోతే
కొన్ని అలల్లో కొన్ని కాంతులు మాయమవుతే
ఆ సముద్రం నీది కానేకాదు
కటకటాల వెనుక కాంతిరెక్కవు నువ్వు
నీ సముద్రం, నువ్వైన సముద్రం
ఎప్పటికీ ఆవిరి కాదు, ఎన్నటికీ మూగబోదు

ప్రజాద్రోహం చేయకూడదని పాఠాలు చెప్పినవాడివి
నీ కంఠం ఆదివాసుల పేగుల్లో కవిత్వం పలుకుతున్నది
నీ కంఠం అన్నం మెతుకులకు కవాతు నేర్పుతున్నది
మనిషి అమరుడైతే
ఓ కంటిని తడి చేసుకున్న వాడివి
మరో కంట్లో కత్తులకు బట్ట చుట్టని వాడివి
అమరుల కనురెప్పల కవాతులో 
ఓ రెప్పవైన వాడిని 

నవ్వులో వెన్నెలను నింపుకున్నవాడివి
నడకలో కాళోజీని నింపుకున్న వాడివి 
రేపటిపైన నిరాశ లేనివాడివి
విత్తనమైనవాడివి
విల్లంబులు అవసరమని వెయ్యిసార్లు పలికిన వాడిని 
నింగికెప్పుడు చూసినా
నీ పిడికిలే మాట్లాడుతుంది కామ్రేడ్!

గుర్తు తెలియని నక్సలైట్ల శవాలకు
ఆకుపచ్చని అమ్మవి నువ్వు
ఇంకా దొరకని నక్సలైట్ల శవాల కోసం
వెతుకులాట ముగించని భూమిగుండెవి నువ్వు
భూగర్భ జలానికి
పాట నేర్పిన భూస్వరానివి నువ్వు
నింగిలో నక్షత్రాలకు, భూమిలో విత్తనాలకు
ప్రియమైన నేస్తానివి నువ్వు

విశ్వగురువును భయపెట్టిన వెదురు గొంతువి
నీరో లాంటి వాడిని
నిలువునా నిలదీసిన నెత్తుటి కలానివి 
విరచబడ్డ రెక్కలను
ఏరుకొచ్చి ఎవుసం చేసే రైతన్నవు
స్థూపాలను కూల్చితే కొడవలై నిలబడ్డావు
కోకిల గొంతులో నీ పిడికిలున్నది నిజం నిజం 
పారే ఎరుపురంగులో నీ అక్షరం నాటి వున్నది నిజం నిజం 
భూమిపై ఓ కంఠనరం తెగిపోతే
నీ కన్నులో
మాట్లాడే వెదురు వనాలు పుట్టుకొస్తాయని
కొత్తగా చెప్పడానికేముంది
 
ఎన్ని గుండెలున్నాయని అడుగుతున్నాడు వొకడు
ఆదివాసుల గుండెలన్నీ
నీ కంఠంలో లేవని అబద్దమెలా చెప్పగలను

వెన్నెముకను విల్లంబు చేసిన ప్రజాకవి నువ్వు 
నీ తరానికి నాయకుడివి నువ్వు 
భవిష్యత్తరానికి భూస్వరం లాంటి విద్యుత్తువి నువ్వు
రేపటి ఊరిపిపై ఆశ నింపిన తల్లిపాల చుక్కవి నువ్వు 
నీ విప్లవ కవిత్వానికి నక్సల్బరి అమ్మలాంటిదా
నీ పోరాట యాత్రకు శ్రీకాకుళం జగిత్యాలలు దిక్సూచి లాంటివా
ఆలీవ్ గ్రీన్ బట్టలను, ఆకుల బూడిదను
సముద్ర గాలిలాగ ఇంకా ముద్దాడుతూనే ఉన్నావు 
ఆకుపచ్చని అమ్మలాగ 
అమరులను నిరంతరం తలుచుకుంటూనే ఉన్నావు
ఏమిటి నీ దైర్యం 
నువ్వు నమ్మే మార్క్సిజమేనా
స్పార్టకస్ చెప్పిన బహిరంగ రహస్యమేనా 
సముద్రమై పదేపదే రాజ్యాన్ని బయపెడుతూనే ఉన్నావు 
మట్టివై పదేపదే వసంతాన్ని పలుకుతూనే ఉన్నావు
ఇనుప చువ్వలు చిన్నబోతున్నాయి 
కోర్టు బోనులు కందిపోతున్నాయి 
ఇంకా ఏమిటి నీ దైర్యమని నేనడగబోను
ఇంకా ఏమిటి నీ రహస్యమని ఆరా తీయను. 

2 thoughts on “ఆకుపచ్చని అమ్మ 

  1. మా సత్యం
    గాడమైన అనుభూతితో కవితా విజృంభనతో వస్తున్న నవ కవి యువ కవి దొంతం చరణ్
    గో హెడ్

  2. మా సత్యం
    దొంతం చరణ్ రాసిన
    ‘ఆకుపచ్చని అమ్మ ‘
    “వెన్నెముకను విల్లంబు చేసిన ప్రజాకవి నువ్వు
    నీ తరానికి నాయకుడివి నువ్వు
    భవిష్యత్తరానికి భూస్వరం లాంటి విద్యుత్తువి నువ్వు”. బాగ వున్నది.

    గాడమైన అనుభూతితో కవితా విజృంభనతో వస్తున్న నవ కవి యువ కవి దొంతం చరణ్ వున్నది.
    గో హెడ్

Leave a Reply