ఈ ఖాళీ ఇప్పట్లో భర్తీ అయ్యేదేనా?

ఒక మత సమూహం మీద ఉగ్రవాదులని ముద్రవేసి, హీనపరిచి అభద్రతకు గురి చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచే వచ్చిన లౌకిక ప్రజాస్వామికవాది జహీర్‌ అలీఖాన్‌ అకాల మరణం తీరని లోటు. కాలం అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందనే భరోసా పెట్టుకోగలం కాని, జహీర్‌ అలీఖాన్‌లాంటి పాత్రికేయుడు, బుద్ధిజీవి, లౌకికవాది ఇప్పుడప్పుడే వస్తారని అనుకోగలమా? గతం కంటే ఎక్కువ వత్తిడితో జీవిస్తున్న ముస్లింలకు అండగా నిలవగలవాళ్లు రాగలరా? హిందూ ముస్లిం భాయీ భాయీ అనే జీవన సందేశాన్ని ఆచరణలో బతికించగల జహీర్‌ అలీఖాన్‌ వంటి వ్యక్తులు అన్ని వైపుల నుంచి అత్యవసరమైన కాలం ఇది. భారతదేశపు ప్రజా జీవితంలోని సహజీవన సంస్కృతిని పుణికిపుచ్చుకొని, దాన్ని కాపాడటానికి జీవితమంతా కృషి చేస్తూ వచ్చారు. సంఫ్‌ుపరివార్‌ ఫాసిస్టు చర్యలను విమర్శించగల సునిశిత బుద్ధి, నైతికత వల్ల ఆయన ఆయన లౌకిక విలువలకు దోహదం చేస్తూ వచ్చారు. మతతత్వం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించే తన అవగాహన వల్ల విశాల ప్రజాస్వామిక శక్తులకు ఆయన సన్నిహిత మిత్రుడయ్యారు.

1990ల ఆరంభం నుంచి దేశమంతా పెరిగిపోయిన హిందుత్వ శక్తుల దాడుల నేపథ్యంలో ఆయన కృషిని, సియాసత్‌ పత్రిక పాత్రను కూడా చూడాలి. గుజరాత్‌ మారణకాండ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భాల్లో జహీర్‌ అలీఖాన్‌ ముస్లిమేతర ప్రగతిశీల శిబిరంలో భాగమయ్యాడు. ముస్లింలలో, మిగతా సమాజమంతటా పెరగవలసిన సెక్యులర్‌ భావనల కోసం ఆయన జీవితాంతం పని చేశాడు. మనుషుల మధ్య, మత సమూహాల మధ్య ద్వేషమే అధికార విధానంగా మారిన ఈ సందర్భంలో ముస్లిం, హిందూ మతాల మధ్య లౌకిక వంతెన అర్థాంతరంగా కుప్పకూలిపోవడం తీరని విషాదం. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాదులో విరసం సహా ప్రగతిశీల శక్తులన్నిటినీ అండగా, సహచరుడిగా ఆయన తోడ్పాటు సామాన్యమైనది కాదు.

ఈనెల 7వ తేదీ గద్దర్‌ అంతిమయాత్ర జనం రద్దీలో పోలీసుల దౌర్జన్యకాండలో ఆయన ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారు. గద్దర్‌కు నివాళి ప్రకటించడానికి సీఎం కేసీఆర్‌ రావడమనే సాకుతో, శాంతిభద్రతల పేరుతో పోలీసులు ప్రవర్తించిన తీరు జహీర్‌ అలీఖాన్‌ మరణానికి కారణం అయింది. మరెంతో కాలం తన ఆలోచనలతో, ఆచరణతో ప్రజాస్వామిక ఉద్యమాలకు దోహదం చేయగల ఈ అత్యుత్తమ లౌకికవాది గుండె అర్థాంతరంగా ఆగిపోయింది. ఫాసిజాన్ని ఓడిరచడానికి హిందూ ముస్లిం ఐక్యత అతి ముఖ్యమైన సాధనం అనే జహీర్‌ జీవన సందేశాన్ని ఎత్తిపడదాం. అప్పుడు మాత్రమే ఆయన లేని లోటు భర్తీ చేయగలం. హిందుత్వ శక్తులు హిందూ ముస్లింలను చీల్చి ఫాసిస్టు రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన ఆశయ సాధనకు అంకితం కావడమే నివాళి

One thought on “జహీర్‌ అలీఖాన్‌కు విరసం నివాళి

  1. మా సత్యం
    జహీర్‌ అలీఖాన్‌ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యుద్ధ ప్రతిపాదికన స్పందించి పోలీసుల దౌర్జన్యకాండపై న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జి గారితో న్యాయ విచారణ జరిపించాలి, రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
    “గద్దర్‌కు నివాళి ప్రకటించడానికి సీఎం కేసీఆర్‌ రావడమనే సాకుతో, శాంతిభద్రతల పేరుతో పోలీసులు ప్రవర్తించిన తీరు జహీర్‌ అలీఖాన్‌ మరణానికి కారణం అయింది.”

Leave a Reply