కామ్రేడ్‌ కోపా కాండె ఊసెండి ఆరు పదులు దాటిన మడిమతిప్పని విప్లవకారుడు. ఆయన విప్లవ ప్రస్థానం మూడు పదుల వసంతాలు. ఆయనకు ఇద్దరు భార్యలు. 9 మంది సంతానం. అయిదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. పుష్కలమైన బంధు వర్గం.

ఆయన స్వగ్రామం ఏటపల్లి తాలూకాలోని పర్సల్‌ గొంది. ఆయన తండ్రి పేరు  కాండే, తల్లి పేరు  బుంగిరి. అది ఆదివాసీ గూడాలలో ఓ మోస్తర్‌ పెద్ద ఊరు కిందే లెక్క. ఊళ్లో 200 కడప వుంటుంది. ఆ ఊరు జిల్లాలోనే గనుల తవ్వకానికి ఆరంగేట్రం చేసిన సుర్దాగఢ్‌ పర్వత సానువుల వద్ద వుంటుంది. మార్చ్‌ 14తో కా. కోపా కాండె ఊసెండికి వీటన్నింటితో బుణం తీరిపోయింది. ఇప్పటి వరకు గడిచిన నాలుగు దశాబ్దాలలో జిల్లాలో ఉద్యమబాటలో అసువులు బాసిన ఏ విప్లవకారుడి పార్థివ శరీరం కారణాలేమైనప్పటికీ నేరుగా పార్టీ నుండి కడసారి చూపు కోసం బంధు మిత్రుల వద్దకు చేరలేదు. కా. కోపా పార్థివ శరీరం మాత్రం పర్సల్‌ గొంది చేరడంతో విప్లవ పార్టీ ఒక కొత్త సంప్రదాయానికి, మంచి పరంపరకు తెరలేపింది. నూతన చరిత్రకు తెరలేపిన పార్టీకి ముందు కామ్రేడ్‌ కోపా మిత్ర బృందం ధన్యవాదాలు తెలుపుతున్నది. అయితే, 33 ఏండ్లు ఆయన నమ్మిన ఆశయాల సాధన కోసం ప్రజల మధ్య, ప్రజల కోసం పని చేసి అసువులు బాసిన ఆ ప్రజా నాయకుడి అంతిమ సంస్కారాలు విప్లవ సంప్రదాయాలతో జరుగకపోవడం ఓకింత బాధాకరంగానే వుంది.

మనం కామ్రేడ్‌ కోపా గురించి తెలుసుకునే ముందు 1980ల ప్రారంభంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల నుండి ప్రధానంగా కరీంనగర్‌ జిల్లా నుండి గడ్‌ చిరోలీ జిల్లాకు చేరిన తొలితరం విప్లవకారులను గుర్తు చేసుకోవాలి. గడ్‌ చిరోలీ అడవులలోని ఏటపల్లి తాలూకా ఆదివాసీ పల్లెలకు తమ నెత్తుటి ధారలతో ఉద్యమ రహదారులను వేసిన వారిలో ఉప్పుమడిగె ఎర్రన్న (గణపతి), మంథని సమీపంలోని రామయపల్లెకు చెందిన యం రమణారెడ్డి (చంద్రన్న) లను గుర్తుచేసుకోవాలి. అమరుడు గణపతి నాటిన విప్లవ బీజాలు, చంద్రన్న చెప్పిన విప్లవ రాజకీయాలు గడ్‌ చిరోలీలో 1980 ల యువతరాన్ని తీవ్రంగా ఆలోచింపచేశాయి. వారి త్యాగాలు యువతలో విప్లవ స్ఫూర్తిని నింపాయి. వారి విప్లవ కృషితో అనేక మంది యువకులు సర్వం వదలుకొని అత్యంత అంకితభావంతో విప్లవోద్యమంలో చేరిపోయారు. ఆ తరం వారిలో కామ్రేడ్‌ కోపా ఒకరు.

1991 జులై 28నాడు మా అందరిని వదిలి ఊరికి వీడ్కోలు చెప్పి మా కోసం, మన కోసం ఉద్యమ బాట పట్టిన కామ్రేడ్‌ కోపాను జిల్లా ప్రజలంతా మనోజ్‌ అని పిలుచుకునేవారు. మనోజ్‌ 1984లో విప్లవ రాజకీయాలతో ప్రభావితుడైనాడు. అప్పటికే ఆయనకు భార్య శ్రీమతి చిమిరి ద్వార ఒక ఆడపిల్ల పుట్టింది. ఆయన ఊళ్లో మోతుబరి రైతు అనే చెప్పుకోవచ్చు. మంచి పంటలు, ఊళ్లో మంచి గుర్తింపు, పెద్ద ఇల్లు, మాటకారితనంతో నలుగురిని మెప్పించే స్వభావం ఆయన స్వంతం. అందుకే ఆయనను పార్టీలో సీనియర్‌ కేడర్లు “పండిత్‌ జీ” అని ప్రేమగా పిలుచుకునే వారు. విప్లవ రాజకీయాల పట్ల ఫిదా అయిన కోపా రెండేళ్ల కాలంలోనే ఆ ప్రాంతంలో ఏర్పడిన ఆదివాసీ రైతు కూలీ సంఘానికి నాయకుడైనాడు. ఆయనకు ప్రపంచాన్ని తెలుసుకోవాలనీ, అడవుల్లో అన్నిరకాల వత్తిళ్ల మధ్య, అణచివేతల మధ్య, ప్రభుత్వ ఫారెస్ట్‌, రెవెన్యూ విభాగాల వారి దబాయింపులు, దండుగల మధ్య నరకప్రాయమైన ఆదివాసీ జీవితాలలో మార్పు తీసుకురావాలనీ ఆయన బలంగా కోరుకునేవాడు. ఆదివాసీల గుర్తింపు, హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం బ్రిటిష్‌ సామాజ్యవాదులకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులను (కోయలో పడియోర్‌ అంటారు) వారి జీవిత చరిత్రలను అధ్యయనం చేయడంపై చాలా శ్రద్ధ పెట్టేవాడు. సామాజిక సమస్యల పట్ల మంచి అవగాహన వున్నవాడు. దానితో ఆయన కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూనే విప్లవ ప్రజాసంఘంలో చురుగ్గా పని చేయడమే కాకుండా తన ఈడు వాళ్లందరినీ వివిధ కార్యక్రమాలలో కదిలించేవాడు. 1990లో వరంగల్‌ లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం మూడవ మహాసభకు హాజరైనాడు. ఆయన ఉద్యమ కదలికలపై నిఘా పెంచిన పోలీసుల చర్యలను గమనించిన కోపా తను బయట వుండడం ఎంత మాత్రం సురక్షితం కాదని అర్థం చేసుకున్నాడు. అప్పటికే జిల్లాలో ప్రజాసంఘాల నాయకులను బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపడం మొదలైనంది. ఆయన సంఘ కార్యకలాపాలలో వుంటూ మరో మహిళతో ప్రేమ సంబంధాలు పెట్టుకొని ఆమెను కూడ తన ఇంటికే తెచ్చుకొని ఇద్దరు భార్యలతో కాపురం చేయసాగాడు. ఇద్దరికీ పిల్లలున్నారు. కానీ, అవేవీ ఆయన పూర్తికాలం విప్లవోద్యమానికే అంకితం కావాలనే నిర్ణయానికి అడ్డం కాలేదు.

1991కి మన దేశ చరిత్రలో సంపదలను తాకట్టు పెట్టిన సంవత్సరంగా, ప్రపంచ ద్రవ్య సంస్థల ఆదేశాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ప్రారంభించిన కాలంగా, ప్రజల జీవితాలలో పెను మార్పులకు, అపరిష్కృత సంక్షోభాలకు వీజాలు వేసిన సమయంగా ఎలా నిలిచిపోయిందో, కామ్రేడ్‌ కోపా జీవితంలోనూ మరువలేని సంఘటనలను లిఖించింది.

కామ్రేడ్‌ మనోజ్‌ గా సాయుధమైన కోపా, తన ఊరును, తన ప్రాంతాన్ని, తన అడవులను, అంతకన్నా తాము ఆరాధ్యదైవంగా పూజించే సుర్జాగఢ్‌ కొండలను కాపాడుకోవడం తక్షణ ఎజండాగా ముందుకు వచ్చింది. దేశంలో ముందుకు వచ్చిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల ఫలితంగా, సుర్దాగఢ్‌ కొండలను ప్రపంచ కుబేరులలో ఒకడైన, బడా పెట్టుబడిదారుడు లాయిడ్‌ కు మహారాష్ట్ర లోని అప్పటి శరద్‌ పవార్‌ నాయకత్వంలోని మిశ్రమ ప్రభుత్వం లీజ్‌ కు ఇవ్వడంతో ప్రజలను సంఘటితం చేసి వాటిని కాపాడుకోవడం అనివార్యంగా విప్లవోద్యమ ఎజెండాలోకి వచ్చింది. అప్పటికే జిల్లాలో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అండగా నిలిచిన అహెరీ రాజ కుటుంబం, గ్రామాలలోని ఆయన యంత్రాంగం పోలీసుల మార్గదర్శకత్వంలో విప్లవ కార్యక్రమాలను అడ్దుకోసాగింది. దానితో ఆ దుష్ట ఆదివాసీ పెత్తందార్లను శిక్షించడంలో భాగంగా ప్రజా మిలీషియా కార్యకర్తలు వీరవర్సె అనే తెగ పెద్ద అడ్డు తొలగించుకున్నారు. అయినప్పటికీ, సుర్దాగఢ్‌ కొండల సర్వే ప్రారంభమైంది. దానితో ఆ ప్రాంత ప్రజలంతా కొండలను కాపాడుకోకుండా తమ ఉనికే వుండదనీ గ్రహించి కార్పొరేట్‌ శక్తులతో, వారికి అండగా నిలిచిన ప్రభుత్వం, దాని భద్రతా బలగాలతో, స్థానికంగా దళారీలుగా నిలిచిన దుష్ట ఆదివాసీ శక్తులతో పోరాడ నిశ్చయించుకున్నారు. ఆ కార్పొరేట్‌ వ్యతిరేక ఉద్యమం ఈనాటి వరకు సాగుతునే వుంది. ఆనాడు ముందుకు వచ్చిన కామ్రేడ్‌ మనోజ్‌ లాంటి వాళ్లు చేసిన పోరాట కృషి ఫలితంగా, 2014లో తొలిసారి మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడేవరకు సుర్దాగఢ్‌ లో గనుల తవ్వకాలను ప్రజలు గట్టిగా అడ్డుకుంటూ వచ్చారు. కానీ, హిందుత్వ శక్తుల కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వం జిల్లాను పోలీసుమయం చేసేసి పెసా చట్టాన్ని చట్టుబండలు చేసి తవ్వకాలకు పూనుకుంది.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో, గనుల తవ్వకాల పనులు కేవలం సుర్దాగఢ్‌ లోనే కాకుండా, ఆ కొండల వరుసలోని దంకోడివాహి, పూస్‌ కోఠి సహ ఇంకా అనేక చోట్ల తవ్వకాల కోసం, ఒక్క లాయిడే కాకుండా ఇంకా అనేక మంది బడా కార్పొరేట్‌ శక్తులు ముందుకు వచ్చాయి. మరోవైపు బాధిత ప్రజలు సమరశీల పోరాటాలతో ముందుకు వచ్చారు. వారు జల్‌, జంగల్‌, జమీన్‌ పై ఆదివాసులకే సర్వాధికారాలు అనే నినాదాన్ని ప్రాణంగా భావించి, చట్టపరంగా గ్రామసభ ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. 1996లో ప్రభుత్వం రాజ్యాంగ సవరణతో పెసాను రూపొందించడంతో రెండు దశాబ్దాల ఆలస్యంగానే అయినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు చట్టం అమలులో జరిగిన ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ గ్రామసభల ఏర్పాటుకు పోరాటాలు ప్రారంభించారు. ఆ పోరాటాలలో కామ్రేడ్‌ మనోజ్‌ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ, నిరంతరం వాటి గురించి తెలుసుకుంటూ, తన పరిధిలో తాను తనకు సంబంధించిన వాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మరోవైపు భీమాకోరేగాంకేసులో తలోజా జైలులో విచారణలో వున్న మిత్రుడు మహేశ్‌ రావుత్‌ జిల్లా వ్యాప్తంగా కాలుకు బలపం కట్టుకొని ఆదివాసీ గూడాలన్నీ తిరిగి గ్రామసభల నిర్మాణానికి కృషిచేశాడు.

సుర్దాగఢ్‌ వ్యతిరేక ఉద్యమంలో పోలీసుల వేధింపులకు, తప్పుడు కేసులకు బలవుతున్న ఆదివాసులను ఆదుకోవడానికి ప్రజాహిత వకీళ్లు, మేధావులు ముందుకు వచ్చారు. వారిలో కూడ పలువురిని పోలీసులు కక్ష కట్టి తలోజా జైలు కటకటాల వెనుక్కి తోశారు. వారిలో ఇంకా మిత్రులు సామాజిక కార్యకర్త మహేశ్‌ రావుత్‌, ప్రజా న్యాయవాది సురేంద్ర గడ్డింగ్‌ జైలులోనే వున్నారు. మరోవైపు సుర్దాగఢ్‌ సహ అనేక తప్పుడు కేసులలో నిందితులుగా నాగ్‌ పుర్‌ జైలులో, మళ్లీ అందులో అండా సెల్‌ లో దశాబ్దకాలం బతుకు పోరు చేసి ఇటీవలే ప్రా. సాయిబాబా సహ ఆరుగురు, నాగ్‌ పుర్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నిర్జోషులని విడుదలయ్యారు. కానీ, వారిలో మా పాండు నొరోటి మాత్రం రాజ్య హింసకు బలై రెండేళ్ల క్రితమే జైలులో అమరుడైనాడు. ఆయన నిర్జోషి. ఆ తీర్పు ఆయన మరణం తరువాత వెలువడింది. ఆయన కుటుంబాన్ని పదేళ్లు హింసించిన ప్రభుత్వానికి శిక్షేంటి? ఆయనా సుర్జాగఢ్‌ తవ్వకాలను వ్యతిరేకించిన ధీశాలి. ఈ కోర్టు తీర్పులతో తవ్వకాలు ఆగేవి కావనీ ప్రజల పోరాటాలే తవ్వకాలను అడ్డుకోవాలనీ, అడవులను కాపాడుకోవాలనీ దృఢంగా తుదివరకు విశ్వసించి సాయుధమై సుర్దాగఢ్‌ తవ్వకాలను జీవితాంతం వ్యతిరేకించిన మన మనోజ్‌ మాత్రం తీవ్ర వ్యాధిగ్రస్తుడై 60వ పడిలో మార్చ్‌ 14 నాడు అమరుడైనాడు.

కామ్రేడ్‌ మనోజ్‌ జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డాడు. ఆయన పోరాట దీక్షను కుటుంబం నీరు కార్చలేదు. ఆయన సంకల్పాన్ని నిర్బంధాలు దెబ్బతీయలేదు. ఆయన స్థితిమంతుడు. ఆయన సమాజంలో గుర్తింపు వున్నవాడు. ఆయన స్వార్థానికి లొంగలేదు. ఆయన ప్రజలకోసం పని చేశాడు. కుటుంబాన్ని, ఆస్తులను త్యజించి , స్వార్థాన్ని జయించి ప్రజల కోసం 33 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి జిల్లా వ్యాప్తంగా వేలాది ప్రజల గుండెలలో మనోజ్‌ దాదా గా నిలిచి నేటి తరానికి పోరాట మార్గాన్ని చూపిన కోపా కాండే ఊసండీకి మరణం లేదు. ఆయన భౌతికంగా మన మధ్య లేడు. ఆయన అంత్యక్రియలు బంధు మిత్రుల మద్య ఆయన ప్రజా సేవలను కొనియాడుతూ, ఆయన నిస్వార్థ జీవితాన్ని ప్రశంసిస్తూ పర్సల్‌ గొంది ఊరికి పేరుతెచ్చిన వీరుడని స్మరించుకుంటూ జరుపుకున్నారు. ఇక ఆయన, ఆదివాసీ ప్రజా సంప్రదాయాల ప్రకారం ఆనల్‌. ఆయన స్మృతిలో ఒక రాయి నిలుపుతారు. కానీ, అమరుల స్మృతిలో ప్రజలు నిలుపుకుంటున్న స్టూపాలను పోలీసులు బుల్‌ డోజర్లతో కూలుస్తున్న ఈ పాశవిక రోజులలో ఆ రాతినైనా ఉండనిస్తారా! అది ప్రజలకే వదిలేద్దాం. పోలీసులు స్థూపాలను కూలుస్తారేమో, రాళ్లను పెళ్లగిస్తారు కాబోలు, కానీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన తమ భూమి పుత్రుల, పుత్రికల జ్ఞాపకాలను ఏ ఖాకీలు తుడిచేయగలరు? చెరిపి వేయగలరు? ఇకపై కామ్రేడ్‌ మనోజ్‌ పోరాటకారులకు పడియోర్‌. సమాజానికి ఆయన మార్గదర్శి.

దేశం అన్ని రంగాలలో కార్పొరేటీకరణ చెందుతున్నది. గడ్‌ చిరోలీ జిల్లాను రానున్న ఆరేళ్లలో పారిశ్రామిక జిల్లా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాడు. జిల్లాలో అడుగడుగున గనులు, ఖనిజాలు, నీటి వనరులు, వన సంపద పుష్కలంగా వున్నాయి. వాటిని కార్పొరేట్‌ వర్గాలు కాజేయడానికి పోటీపడుతున్నాయి. వారి సేవకే అహెరీ రాజకుటుంబం అంకితమైంది. ఆ కుటుంబ చరిత్రంతా ప్రజా వ్యతిరేకమైన, దేశద్రోహకర విద్రోహపూరితమైనదే. జిల్లా పారిశ్రామికం అయితే నిరుద్యోగ సమస్య తీరుతుందనీ స్థానిక యం.ఎల్‌.ఏ, రాష్ట్ర మంత్రి ధర్మారావు ఆత్రం కార్పొరేట్‌ వర్గాలకు వకాలత్‌ చేస్తున్నాడు. కానీ, అడవులు, ఆదివాసీలు, వారి సంప్రదాయాలు, వారి జీవితాలు ఛిద్రమై, విధ్వంసం విలయతాండవం చేస్తుందనీ ధర్మారావులు, ఏక్నాథ్‌ సింధేలు, దేవేంద్ర ఫడ్నవీస్‌ లతో పాటు వారి మొనగాడైన మోదీతో పోరాడి జిల్లాను కాపాడుకోవడానికి యువత కామ్రేడ్‌ మనోజ్‌ మార్గంలో ముందుకు వస్తారు.

Leave a Reply