’అయ్యో నేను వస్తున్నా .. ఆమె నా బెహెన్ సార్ .. మా చాంద్ బాయి , ఆడనె ఉంచుండ్రి ఇగో ఐదు నిమిషాల్లో ఇప్పుడే వస్తున్న” భూక్యా ఖంగారుగా అంటూ .. భార్య పద్మ తో “చాంద్ బాయి జ్యోతి నగర్ లో ఒకల యింట్ల ఉన్నదంట నేన్ పోయి తొలుకొని వస్తా” అన్నాడు . “ నేను గూడ వస్తా పా “ అన్నది పద్మ . చాంద్ బాయి ., భూక్యా చెల్లెలు.
****
“ఆజో ., మ తోన బేటా దూన్చు”.,{ నాతో రా నీకో కొడుకుని ఇస్తా } .,గేట్ తెరుస్తున్న భూక్యాకి ఈ మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి . చాంద్ బాయి అరుస్తున్నది . ఎంత పాత మాటలు ఇవి.. యుగాల నుంచీ ఆ రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో., బంజారా స్రీల గొంతుల్లోంచి పాటలుగా .,తెగిన ధుఖపు తంత్రులుగా ముక్కలు ముక్కలై దేశమంతా, భూగోళమంతా విస్తరిస్తున్న మాటలు కావూ ఇవి? భూక్యా మనసు చిన్నబోయింది. గేట్ లోపల వాకిట్లో చాందీ బాయి మెట్ల మీద కూర్చుని ఉంది. ఆమె ముఖానికి ఉండాల్సిన ఘుమటో {తల మీది ముసుగు} పక్కకి తొలగి ఉంది. ఆమె కొచ్చుల పేటియా {లంగా} మోకాళ్ల దాకా పైకి పోయి ఉంది. “ నా మాటిను నీకు అందమైన, బలమైన కొడుకుని కనిస్తా దర్వాజ తియ్యు” అంటూ తల బాదుకుంటూ వల వల ఏడుస్తున్నధి .. జుట్టంతా రేగిపోయి, ముఖమంతా దుఖం తో ఎర్రబడిపోయి ఉంది. తల మీద కొట్టుకుంటుంటే ఆమె చేతుల కున్న వాంఖడీ కడియాలు ఒకదానికొకటి వొరుసుకుపోయి గల గల చప్పుడు చేస్తున్నాయి . ముక్కుకున్న భూరియా {ముక్కెర}చిన్నగా కంపిస్తూ మెరుస్తున్నది . ఆమె అద్దాల కాంచళీ{రవిక } మీది అద్ధాల్లో అక్కడి దృశ్యం ముక్కలు ముక్కలై తళుక్కు మంటుంది . చెవులకున్న ఝుంకాలు ఆమె ధు ఖానికి ఖంగారు ఖంగారుగా ఊగుతూ ఆమె చెంపల్ని కొడుతున్నాయి . భూక్యా ఖంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తి ఆమె భుజాలు పట్టి లేపుతూ “భెన్ .. ఛాల్’’ { చెల్లి పద } అన్నాడు ధుఖం తో . అన్న చేతులనుంచి గింజుకున్న చాంది బాయి లేవలేదు . “హే చాంది బాయి ఊట్ కాయి కర్రోచు.. ఊట్ .. ఊట్ ” అంటూ పద్మ కూడా చాంది బాయి భుజం పట్టుకుని లేపే ప్రయత్నం చేసింది. ఆమెని చూస్తూ “ భోజాయి” {వదినా } అంటూ భోరుమన్నది . ఇంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి . ఒక మగ మనిషి , వెనకాలో ఆడమనిషి ఒక ఐదేళ్ల పాప బయటకు వచ్చారు. అతన్ని చూడగానే చాంది బాయి దెబ్బతిన్న పులి లా లేచి., “మార్ ఘర్వాళో ’’ {నామొగుడు} అంటూ అతని వైపు ఉరకబోయింది కానీ భూక్యా బలంగా ఆమెను పట్టుకుని ఆపేశాడు . చాంది బాయి నిస్సహాయంగా పెనుగులాడుతూ ఆ మగ మనిషి భార్య వైపు కోపంగా చూస్తూ ఖాండ్రించి ఉమ్మింది . ఆమె కోపంతో అక్కడే ఉన్న కర్ర తీసి చాంది బాయి వైపు కోడతాన్నట్లు చూపించింది . “నా వెంట పడుకుంటా ఇంటి కాడికి వచ్చింది . నన్ను తన మొగడు అని అనుకుంటుంది. పాగల్ లెక్క ఉంది. ఈమెనెట్ల వదిలినరు దేశం మీదికి? నా భార్యను నా సవితి అని కొట్టనీకి మీద మీదకి వచ్చింది జుట్టు పట్టి గుంజింది.. ఎందుకు తీస్క పొండి” అంటున్నాడాయన కోపంగా భార్యను కర్ర దించమని సైగ చేస్తూ . “సార్ ఏమనుకోకున్ద్రి ., ఆమె మా చెల్లి . తన మొగనితోని జగడం అయినప్పటకెల్లి ఆమె పాగల్ అయింది సార్ ఇట్లా ఎవరన్నా మగోళ్ళు కనిపిస్తే తన మొగడనుకునే ఎంటపడతది ., ఆళ్ళ భార్యలను తన సవితి అనుకుని కోపం తోని కొట్టబోతది సార్ . లగ్గమయి పదేండ్లయినా పిల్లలు గాలే ఆమె బాధంత అదే., ఏమనుకోకుండ్రి సార్. . తీసుక బోత సర్ ఇప్పుడే” భూక్యా చేతులు జోడించి చాంది బాయి వైపు తిరిగి ‘ఛాల్’ అనుకుంటూ ఆమెని చెయ్యి పట్టి గుంజుతూ బలవంతంగా గేట్ వైపు తీస్కెళ్ల సాగాడు . “ఒక్క సారి నా తానకు రా.. నీకు కొడుకుని ఇస్తా” అని రాగయుక్తంగా అరుస్తున్నట్లే పాడుతూ ., వెనక్కి వెనక్కి చూస్తూ కళ్ళనిండా నీళ్ళతో ., తన పొత్తి కడుపు వైపు చూపిస్తూ ., పిడికిలితో పొత్తి కడుపుని గుద్దుతూ చాంది బాయి అన్నా వదినలతో తరలి పోయింది.
****.
“దవాఖానాకు తీస్క పోదాం భూక్యా..ఇంగో డాక్టరమ్మకు చూపిద్ధం కడపుల నొప్పని ఏడుస్తున్నధి నెలప్పుడు రక్తం శానా పోతున్నదిరా .. ” చాంది బాయి తల్లి నీల బాయి కళ్ళు తుడ్చుకుంటూ కొడుకు భూక్యా తో అంటున్నధి. “ ఇంకెంత మంది డాక్టరమ్మల తానకి తీస్క పోతమే యాడి? అందరూ కడుపుల బిడ్డ కాదు గడ్డ ఉందనే చెప్తున్నరు అయిన గని నువ్వడుగుతున్నవు కద తీస్క పొదమ్ . నువ్వు ఫికర్ చెయ్యకు . గని చెల్లి దిమాఖ్ గోలీలు ఏసుకుంట లేదు ఉమ్మేస్తున్నదంట .. పద్మ చెప్తున్నది . అవేసుకుంటే గిట్ల మంది ఎంట పడదే యాడి జర నువ్వన్నా వేయరాదే గోలీలు దానికి.. బట్టలిప్పి ‘మారో ఘర్వాలా’ అనుకుంట మొగోళ్ల ఎంట పడతా బాజార్ల ఇజ్జత్ తీస్తున్నది” అన్నాడు
‘అవునురా భూక్యా గదంత నేను జూస్కుంట గని నెలప్పుడు శానా రక్తం పోతున్నదిరా జల్ది పట్నం తీసుక పోదాంర ’’
వాకిట్లో నులక మంచం మీద ముడుచుకు పండుకున్న కూతురు చాంది బాయి వైపు కళ్ల నీళ్ళతో చూస్తూ నీలాబాయి.
మూడేళ్ల కింద వొంటి నిండా రక్తం కారుతున్న దెబ్బలతో తన వొళ్ళో కొచ్చి పడిపోయిన చాంది బాయి రూపం మళ్ళీ నీల బాయి కళ్ల ముందు నిలిచింది.
మొగడు సవితి కలిసి కొట్టిన దెబ్బలవి . చాంది బాయి తన మొగనికి ఖుద్ దగ్గరుండి లగ్గం చేసినంక ‘ఇగ చాలు బిడ్డా వచ్చేయి పుట్టింటికి’ అని ఎంత అడిగినా వినలేదు . ‘లేదు నేను కూడా కొడుకుని కని ఇస్తా నా మొగనికి’ అంటది., ఆడనె పడి చేరతది . లగ్గమయి ఎనిమిదేళ్లు అయినా చాంది బాయి కి పిల్లలు పుట్టలే . ఆమె గర్భసంచి బాగలేదన్నరు ..గడ్డలున్నయి ఆపరేషన్ చేసి గడ్డలు తీసినా పిల్లలు పుట్టరంట. పిల్లలు పుట్టే గొట్టాలు రెండూ సన్నమై నయంట చాంది బాయికి . పిల్లల సంచి తీయించు కొమ్మంటే వినదు . గడ్డ కాదు బిడ్డ ఉంది అంటది .. తీయించుకొను అంటది. నెలలు నిండుతున్నై అంటా తాండా ల చెప్పుకుంట మురుస్తది . మామిడి కాయలు.,చింత కాయలు తింటా ఉంటది . అల్లుడు తాగుడుకి , చాందిబాయి ని కొట్టనీకి అలవాటు పడ్డడు. అంతే కాదు నువ్వెళ్ళిపో నేను వేరే లగ్గం చేసుకుంటా అంటాడు వద్ధ ని చాంది బాయి ఏడిస్తే .,మరి నువ్వే నాకు లగ్గం చెయ్యి అప్పుడు నిన్ను ఎల్లగొట్ట రెండోది పిల్లల్ని కాంటది , నువ్వు పెంచు అంటా ఎంట బడ్డడు . ఇంకా ఇట్లా కాదని చాంద్ బాయే వెతికి, వెతికి మొగనికి రెండో లగ్గం చేసింది. లగ్గ మైన మూడు నెలలకే సవితికి గర్భం వచ్చింది ఇగ అప్పటికెల్లి చాంది బాయి కష్టాలు ఇంక ఎక్కువైనాయి. సవితి భార్య చాంది బాయిని వె ళ్ల గొట్టాలనని చేయని ప్రయత్నం లేదు. లూనావత్ గూడా ఎల్లి పొమ్మని అంటుండు ‘మనం కలిసి ఉండాలన్న మాట అనుకునే కదా నా మొగనికి నిన్ను ఇచ్చి లగ్గం చేసింది.,ఇప్పుడిట్ల ఎల్ల గొడుతున్నవు ఏంది’ అంట చాంది బాయి ఏడుస్తే ఆమె కోపంగ తిడుతది ., ‘ఎళ్లిపో ఇది నా ఇల్లు .. మొగనికి పిల్లల్ని కనివ్వలేని నువ్వు ఆడదాని వెట్ల అయితవు ఈ ఇంట్ల నీకు జాగ లేదు పుట్టింటికి ఎళ్లిపో’ అని కొట్టి ఇంట్ల కెళ్ళి ఎళ్ళగొడుతధి.. అన్నం గూడ సరిగ పెట్టది .,పాచిపోయిన రొట్టెలు ఇంత కారం రాసి పెడతది ఏం చేస్తది చాంద్ బాయి .. పగలు తండాల తిరుగుడు రాత్రుళ్లు మళ్ళా ఇంట్ల దూరుడు . సవితి తలుపు తియ్యక పోతే పెరండ్ల లేదా ఆకిట్ల చలికి. వానకి , ఎండకి ముడుసుకు పండుడు .పక్కింటి గమ్లి కి తరస్ వచ్చి తన ఇంట్లకి కొంటవోతది . గమ్లి గని., తాండాల మంది గని చెప్తే పరిగెత్తుకు పోయి ఎన్ని సార్లు తాను,భూక్యా పుట్టింటికి తిరిగి రమ్మని బ్రతిమీలాడిన రాదు ‘ఎప్పటికైనా నా మొగనికి పిల్లల్ని కని ఇస్తా . మీరు రాకున్రి’ .. అంట ఏడుస్తది . రెండో పెండ్లాం పెద్ద భార్యను కొడుతున్నా ఆ మొగడు ఏమనడు . రెండో భార్యకి గర్భం రాంగానే ఆమె దేవత అయిపోయింది చాంది బాయి దెయ్యం అయింది. ఆమె చాడీలు విని తాను గూడ కొట్టుడు షురూ చేసిండు బాడుకవ్ . సవితి కి ఆడపిల్ల పుట్టింది మగని యిజ్జత్ పోయింది చాంది బాయి ఆశ పెరిగింది. తనకింకా పిల్లలు పుడతారనే కలలు కంటుంది . సవితికి కొడుకుని కన చాత కాలేదు తాను కనీ ఇస్తా అనుకుంటుంది రాత్రుళ్లు మగని మంచం కింద దాక్కుని అర్థ రాత్రి బట్టలిప్పేసి అతని పక్కన పడుకుని గట్టిగా పట్టుకుని.. ‘ కొడుకునిస్తా నాతో కలువు ఇప్పుడు’ అంట జిద్ధు చేస్తది . ఇగ ఇద్దరు కలిసి కొడతరు చాంది బాయిని. దెబ్బలు తినడం నీళ్ళు తాగినంత మామూలుగా అలవాటు చేసుకుంది ఎంత అంటే దెబ్బల మలాములు.. మందులు ఎప్పుడూ ఆమె పాన్ సంచిల వక్క జర్దా ఉన్నంత మామూలుగ ఉంటయి. సవితి అన్నం పెట్టక పోతే తండాల అడుక్కుని తిని మందులేసుకుని మలాములు పూసుకొని.. చెట్టు కిందో .. గట్టు మీదో ముడుసుక పంటది కానీ ఆ మొగణ్ణి ., ఆ ఇంటినీ వదిలి మాత్రం రాదు . కానీ గని యాడాది కింద వచ్చింది . అదీ ఆమె సవితి.. కొడుకుని కన్నంక .
పోయినేడాది ఛందమామ తీరున్న కొడుకుని కన్నది చాంది బాయి సవితి సోనా బాయి . ఇంగ ఆమె మొగనికి ఆమె నిజంగనే సోనా అయిపోయింది . చాంది బాయి కి బతుకు ఇంకా చీకటైపోయింది . వాళ్ళ ఇద్ధరీ దెబ్బలు ఎక్కువైపోయినాయి . సోనాబాయికి కొడుకు పుట్టిన ఏడవరోజు.,పురుటి రోజు జలమాత.,దళియా దో కావేరొ పూజ చేశారు. ఇంటికి తూర్పు దిక్కులో గుంట తీసి నీళ్ళని నింపారు . మూడు ఇత్తడి చెంబులకి చాంద్ బాయి సున్నం,బొగ్గు,పసుపు బొట్లు పెడతా అన్నా సోనా బాయి పెట్ట నివ్వలేదు “ముందు నా లెక్క కొడుకుని కను .,దూరం జరుగు ముందు” అని పక్కకి తోసేసింది. చెంబులో పసుపు నీళ్ళు నింపి పక్కింటి ఇస్లావత్ మూడేళ్ల ఇద్దరు కొడుకులతో .. ఆమె అక్క కొడుకు, ఇద్దరు చిన్న ఆడపిల్లల్తో సోనా బాయి నెత్తి మీద పెట్టించడం చూస్తూ తానూ అట్లనే బాలింత పండుగ చేయించుకున్నట్లు పగటి కల కన్నది చాంది బాయి .. త్వల్జా భవానీ దేవతకు అమ్మవారి ప్రసాదం హాట్క పెడితే తానూ కళ్ల నీళ్ళతో తన వొడి కూడా నింపమని మూగగా వేడు కుంది త్వల్జా భవానీ మాతను . పుట్టిన పిల్ల , తల్లి ఆరోగ్యంగా ఉండాలనని మనసులోనే హింగళ దేవతకు కూడా మొక్కుకున్నది . ఎంత ఆనందం సంతోషం తోని తండా అంతా మిటాయి తిన్నరు . ఆ తరువాత జరగరానిది జరిగింది . ఒక రోజు సోనాబాయి స్నానం చేస్తున్నప్పుడు ఆమె కొడుకు ఏడుస్తుంటే ఎత్తుకుని బుజ్జగిస్తున్న చాంది బాయిని., స్నానం చేసుకుని వచ్చిన సోనాబాయి కొడుకుని చంపేస్తున్నదని అర్చుకుంట పెట్టిన లొల్లి కి ఆమె మొగడు లేసి చాంది బాయి ని గొడ్డుని కొట్టినట్లే కొట్టి దూలానికి ఊరేయబోయిండు అప్పుడే ఇంట్లకు పోయిన పక్కింటి గమ్లి ఉరుక్కుంట పోయి గట్ల చంపుతావ్ అనుకుంటా ఇడిపించింది .. దవాఖానకు తీసుకుపోయి సూది మందులిప్పించింది తన మొగడు వచ్చినాక తన తానకు తోల్కొని వచ్చింది ఆ హింగళ దేవత తీరు . ఇగ అప్పటికెళ్ళి చాంది బాయి పిచ్చి దాని తీరే అయిపోయింది . కనిపించిన ప్రతి మగాడి ఎంట బడుకుంటా తనతో రమ్మని కొడుకుని కనిస్తా అని ఎంట బడుతది . వాళ్ళని వాండ్ల ఇంటి దాంక ఎంబడిస్తది . ఆ మగాళ్ల ముందు బట్టలిప్పేసి ‘కలువు నన్ను కొడుకునిస్తా’ అంట వాళ్ళ మీద పడిపోయి గట్టిగ పట్టుకుంటది ఉడుము తీరు వదలనే వదలదు . వాండ్ల భార్యలను తన సవతులనుకొని కొట్టబోతది తానే తన్నులు తిని వస్తది ఆల్లు ఖబర్ చేస్తే తనో,పద్మనో , భూక్యా నో పోయి తెచ్చుకుంటారు ఎన్ని దెబ్బలు తింటదో .. రాళ్ళ తోని గూడ కొడతరు పాగల్ ల్ ది వచ్చిందని. దెబ్బలు తింటానే ఉంటది మళ్ళీ పోతానే ఉంటది బట్టల మూటలు చంటిపిల్లడి తీరు చుట్టి నా కొడుకంట గుండెల కదుముకుంట ఏడుస్తా వుంటది . పిల్లల సంచిల పెరుగుతున్న గడ్డ ను బిడ్డ అనుకుంటది . అందరు కలిసి కుట్ర చేస్త తన కొడుకుని కడుపులోనే చంపేయాలని చూస్తున్నట్లు అరుస్తా అందరిమీద రాళ్లు ఏస్తా ఉంటుంది రెండేళ్ల కెల్లీ ఇదే నడుస్తున్నది మొన్నఏడాది అయిందేమో కండ్లు తిరిగి పడిపోయింది రోడ్డు మీద . పేటియా [లహన్గా] అంతా రక్తం తోని తడిసిపోయింది . దవాఖానాల చూపిస్తే టీవి ఎక్స్ రే తీసి గర్భసంచిల గడ్డలన్నరు ఎప్పటి తీరే . గర్భ సంచి తీసేయాలన్నరు .వినదు ..’ పిల్లల సంచి ఉంటేనే కొడుకుని కనొచ్చు .. తీసేస్తే ఎట్లా కనాలనే యాడీ .. నాకు గర్భం ఉందే లోపల పిల్లడు ఉన్నడు పిచ్చి దానివే నువ్వు’ అని తననే కొట్టవస్తది . మళ్ళా తానే ‘నీకు కొడుకు కావాల కదా .. నీకు కొడుకునిస్తా’ అంట మగోళ్ల ఎంబడి పడతా ఉంటది . దిమాఖ్ డాక్టర్ కి చూపించిన మందులు వేసు కొదు .. ‘నాకేం పిచ్చి లేదు మీకే పిచ్చి మీరే మింగుండ్రే గోలీలు’ అని ఉమ్మేస్తది. ఇంక పాలల్లో కలిపి వేసుడే . అప్పుడు కొంచెం బాగానే ఉంటది.. నిద్ర కూడా పోతది . కొన్ని రోజులకి అర్థం అయ్యి పాలు తాగుడు బందు చేసింది. ఇగ మళ్ళీ మగాళ్లను ఎంబడిస్తా రోడ్ల మీద తిరుగుడు షురూ.. ఏం చేయాలే .. తండాల పంచాయితీల తండా పెద్ద నాయక్ చాంది బాయిని ఆమె మొగడె చూస్కోవాలని తీర్మానం చేసినా అల్లుడు వినలేదు. జుర్మాన అయిన కడతా గని గీ పిచ్చి దాన్ని తోలకపోను. ఈ పిచ్చిది నా కొడుకుని చంపేస్తది .,అయినా ఈమె నాకు వద్ధ ని ఎన్నడో చెప్పిన కదా విడుపు కాయితాలు పంపిస్తున్న’ అన్నడు .
అట్ల ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పిల్లల సంచి తీయాలనని చెప్పిన గని ఎన్నడూ ఒప్పుకోలేదు ‘ నా కడుపుల బిడ్డ ఉన్నడు ఎన్నడైన సరే బిడ్డను కంటా., నా తోని అయితది గీ డాక్టర్లు అందరూ పిచ్చోళ్ళు . ఏం తెల్వది వాళ్ళకు పైసల కోసం చేస్తమంటున్నరు’ అంటనే బాజార్ల పొంటి తిరుగుతానే ఉంటది అదేందో కనలేని కొడుకు బజార్లనే దొరుకుతడన్నట్లే . తను పోతే తన బిడ్డ గతేంది ., ఇన్ని సంగతులు యాది చేసుకుంటున్న నీల బాయికి దుఖం ఆగలేదు.
****
‘ఇది గర్భం కాదు గడ్డ బాగా పెరిగింది. పిల్లల సంచిలో చాలా డేంజర్ గడ్డలున్నాయి మీ చాందిబాయి కి కేన్సర్ అవుతుందని ముక్క పరీక్షల వచ్చింది పిల్లల సంచి తీసేయాల వెంటనే . అప్పుడే బతుకుతది లేకపోతే సచ్చి పోతది .. ఇంత మంది డాక్టర్లు ఈ సంగతి చెప్పిన గని ఇప్పని దాంక ఎందుకు చేపియ్యలేదు’ డాక్టరమ్మ అడుగుతున్నది కోపంగ. ‘నై., నా కడపుల నా కొడుకు పెరుగుతున్నడు . గడ్డ కాదు ఇది బిడ్డ. నీకేం తెల్వది నాకు నెలలు నిండినయి నేన్ కొడుకుని కంట నా పిల్లల సంచి ఎట్ల తీస్తవ్ ., నా ఘర్వాలా[ మగని దగ్గరికి] తానకు పోతా’ అరుస్తూ., ఏడుస్తూ రెండు అర చేతులతో తన గర్భసంచిని కాపాడుకుంటున్నట్లు పొట్టను వొత్తుకుంటూ వద్ధు ., వద్ధు అంటూ చాంద్ బాయి బయటకు ఉరికింది . కడుపులో రోజు రోజుకీ పెరుగుతున్న
****
‘మారో ఘర్వాలో .. తూ కాథో మన్ పసంద్ ..
తూ మారో దిల్.,
మా తో ధి బాంచాను ఉమర్ భరో
ఆజో మ తోన బేటా దూన్చు’’ చాంద్ బాయి గొంతులోంచి గరుకు గరుకు గా విరిగి పోతున్నది పాట.
{నా మొగడా., నువ్వంటే నాకు ఇష్టం. నువ్వే నా హృదయం., నేను నీతోనే జీవితాంతం కలిసి బతుకుత . . నాతో రా .. నీకో కొడుకుని ఇస్తాను} పెరట్లో నులక మంచం మీద పడుకుని.. ఆకాశానికి తనకి మధ్యన ఉన్న కాటుక లాంటి నల్లనైన చీకటి లోకి కళ్ళను కత్తు ల్లాగా మార్చి గుచ్చి గుచ్చి చూస్తూ రెండు చేతులతో ఒకసారి పొత్తి కడుపు మీద ., మరోసారి నుదుటిమీద తప తపా కొట్టుకుంటూ .,పొత్తి కడుపు కండరాల్ని రెండు చేతులతో పిసుక్కుంటూ .. ధారగా కన్నీళ్ళు కారుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ తన భర్త లూనావత్ ను తల్చుకుంటూంది . ‘బేటీ ఊట్., దళ్యా {జొన్న గటక లేదా జొన్న రవ్వ తో చేసిన అన్నం} ఖా’ అంటూ తల్లి నీలా బాయి ఆవేదనతో కుదుపుతున్నా కానీ అర్థం కానీ పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయింది .
****
చాంది బాయి ఇంటెనక పెరట్లో తిరుగుతున్నది . చేతులు పొట్ట మీద అదిమి పడుతూ అటు ఇటు ఖంగారుగా నడుస్తున్నది . ఆ డాక్టరమ్మ ఇంక తనకి పిల్లలు పుట్టరు అని ఖరాగా చెప్పేసింది పిచ్చా ఆమెకి .. ఇంత కడుపు, బిడ్డ కనిపిస్తాలేదా ఆమెకి? తను కంటది అంతే . వీళ్ళకి అది తెలువది. ఇంతల ఆమెకి అక్కడ తన పుట్టింటి తండా లో చూసిన మేరమ్మ దేవత కనపడింది చల్లంగ నవ్వింది ముక్కుకున్న భూరియా ఆ చీకట్లో చమక్ మని మెరిసింది . చాంద్ బాయి పోతున్న ఆమెని ఆపింది . “పెండ్లికి ముందు తీజ్ పండుగ తొమ్మిదో రోజు నేను నా నవ ధాన్యాల బుట్టల మొలకలు ఎంత బాగా వచ్చినాయి? అసలు పెండ్లికాని వొక్క పోరి కన్నా మన తండాల అంత మంచి మొలకలు రాలేదు నాకు మంచిగా పెండ్లి కావాలనని.. మంచి మొగడు దొరికి కాపురం సల్లంగుండాలని, సంతోషంతోని అత్తింటికి వెళ్లాలని పండంటి పిల్లల్ని కనాలని నీకు పూజలు చేసిన కదా మేరమ్మా .. నా జీవితం ఎందుకిట్ల చేసినవు .. చెప్పు ఇంగో చూడు నాకు గర్భం వచ్చింది నేను కొడుకుని కంట అంటే ఎవలు నమ్ముత లేరు నువ్వన్నా చెప్పు’’ అంట దీనంగా ఏడుస్తూ మేరమ్మని పట్టి పట్టి ఊపుతా అడిగింది . మేరమ్మ చేతి బలియా గాజులు ఒకదానికి ఒకటి వొరుసుకుని కణ కణ చప్పుడు చేశాయి. “ నాకేం తెలుసు చాంది బాయి ., మీ యాడి నువ్వు పుట్టినప్పుడు త్వల్జా భవానికి హాట్కా ప్రసాదం శుద్ధిగా పెట్టినదో లేదో .. జలమాత పూజ మంచిగా చేసిందో లేదో ఆ అమ్మవారినే అడుగు పో .,అగో వస్తుంది చూడు” అంటూ అక్కడికే వస్తున్న త్వల్ఝా భవానీని చూపించింది . “త్వల్ఝా భవానీ ఎటు పోతున్నావు ఇగో చాంది బాయి ఏమో అడుగుతున్నది” .. అని చిన్నగా రాగం తీస్తున్నట్లే పిలుస్తూ ఆమెని ఆపింది. . ‘’తండాల రూపా బాయి పురుడు ఉంది ఈ రోజు కూతురు పుట్టింది .. అక్కడికే పోతున్నా దళియా- దో- కావేరొ పూజ చేయించుకోనీకీ ఏందో చెప్పు జల్ది ‘’ అంది హడావుడి గా కాళ్ళ గజ్జెల శబ్ధం చేస్తుంటే తన గుమటొ సవరించుకుంటూ. చాంది బాయి తన పొట్ట చూపిస్తూ “భవానీ మాతా నాకు తొమ్మిదో నెల గర్భం నడుస్తున్నది రేపో ., మాపో కంట. కానీ ఎవలు నమ్ముత లేరు జర నువ్వన్నా చెప్పు మా వోళ్లందరికి . ఇక మా యాడిని మా బాపు తాగి నన్ను కన్న మూడో రోజే కొట్టి ఎల్ల గొట్టినడు .. మా యాడికి నా తీర్గ యాడి లేదు . ఇంక ఎవరు చేయాల పూజ నీకు., ఎవరు పోయాల పురుడు మా యాడికి .. హాట్క ప్రసాదం నీకు ఎవరు పెట్టాల త్వల్ఝా భవానీ ? అందుకు నాకా శిక్ష., నాదా తప్పు?” అని వెక్కి వెక్కి ఏడ్చింది చాంది బాయి. తుల్జా భవానీ చాంది బాయిని ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెల మీదికి హత్తుకుంది. కన్నీళ్ళు తుడుస్తూ “చుప్ కర్ రో మత్” అంటూ మెల్లిగా చాంది బాయి పొట్ట మీద తన చేతులతో నిమురుతూ “ చాంది బాయీ ., నా బిడ్డా నీ కడుపుల ఉన్నది బిడ్డ కాదు గడ్డ తీపించుకో’’ అన్నది ప్రేమగా . చాందీ బాయిదెబ్బ తిన్నట్లు తలెత్తి త్వ ల్ఝా భవానీ వైపు కి చూసింది వెంటనే “ నై., నా కడుపుల ఉన్నది బిడ్డనే ., గడ్డ కాదు. పురుటి దేవతవి నువ్వు గూడ అబద్ధం ఆడితే ఎట్లా ., నేనెవలి తానకు పోవాల ఇగో నా కడుపుల బిడ్డ ఎట్ల కదులుతుందో చూడు’’అంటూ ఆమె చేతిని తన పొట్ట మీద పెట్టి పుణుకుతూ ఆత్రంగ “ఇగో ఇగో ఇది బిడ్డ తల కదా” అంది . ఇంతలో అక్కడికి హింగళ మాత వచ్చింది మేరమ్మ దేవత చాంది బాయి కథంతా క్షణంలో చెప్పేసింది . ఆమె జాలి జాలిగా చూసింది చాంది బాయిని. ‘’ భవానీ మాత చెప్పింది సయి నే ఎంతమంది పుట్టిన పసి కూనలని నేను దీవించలేదు చెప్పు ? మీ యాడి నాకు, తుల్ఝా భవానికి పూజ చేయక పోయినా.,నువ్వు పుట్టినప్పుడు నిన్ను నేను దీవించిన నీ బతుకు మంచిగా ఉండాలనని . కానీ ఇప్పుడైతే నీకు గర్భం లేదు అది మాత్రం ఖరా ’’ అంది ఆమె కూడా చాంది బాయి పొట్టని పట్టి పట్టి పరీక్షగా నిమురుతూ . ఇంతట్ల అక్కడికి సీత్ల , మంతరల్ , ఢ్వాల్ ఆంగళ్ , కంకాళ్ దేవతలు బిర బిర మంటూ వచ్చేశారు . హింగళ మాత పక్కనే నేల మీద పడి పొట్ట మీద నిమురుకుంటూ “నేన్ కొడుకుని కంటా ., నన్ను నా ఘర్వాలా దగ్గరికి తీస్కొని పొండి” అంటూ గీర గొంతు తో ఏడుస్తున్న చాంది బాయిని చూశారు . అయ్యో ., అంటూ చాంది బాయిని దగ్గరికి తీసుకుని కన్నీరు కారుస్తూనే ఆమని వోదార్చారు . దేవతలందరూ ఆ చీకటి రాత్రి చెట్టు కింద చాంది బాయి పడుకున్న నులక మంచం చుట్టూ సమావేశం అయ్యారు . ఆ చుక్కల కింది భూమ్మీద గుండె పగిలేలా ఏడుస్తున్న చాంది బాయి కోసం దిక్కులు పిక్కటిల్లేలా బంజారా నృత్యం చేశారు . వాళ్ళ కాంచిలీల మీది అద్ధాలు విరిగిపోయాయి.. కాళ్లకున్న వాంఖడీ కడియాలు విడిపోయాయి. ముక్కుల కుండే భూరియాలు రాలి నేల మీద తప్పిపోయాయి. ముఖాల మీద ఘుమటోలు పక్కకి తొలగి పోయి కన్నీటి తో తడిచిపోయిన చెంపలు ఆ వెన్నెల్లో మెరిసిపోయాయి . చేతులకున్న బలియా గాజులు కణ కణ లాడుతూ పాట పాడాయి. గాలి వాళ్ళ గొంతులలోనుంచి ఆర్త నాదం చేసింది. వాళ్ళ చమట సముద్రం అయిపోయి.. చుట్టూ ఉన్న తండాలనన్నిటిని ముంచేసింది. ఆకాశంలో మేఘాలు ఒక దాన్ని ఒకటి ఒరుసుకుని గాండ్రించాయి నక్షత్రాలు ముక్కలై నేల రాలిపడ్డాయి వాళ్ళ నృత్యం ఆగింది .”ఈ బిడ్డ కోసం మనం ఏమైనా చేయాలే.. మేరమ్మా ఈమెకి మళ్ళీ యవ్వనాన్ని ఇచ్చి .. తీజ్ పండుగ చేపిచ్చి పెండ్లి చెయ్యి. మంచి ఘర్వాలాని ఇవ్వు. తుల్ఝా భవానీ నువ్వు మంచిగా కాపురం చేపిచ్చి ., మంచి బిడ్డని ఇవ్వు , హింగళ మాతా నువ్వు పుట్టే బిడ్డను కాపాడు ,” మనుషుల్ని పశువుల్ని ఎటువంటి శత్రువులు దాడి చేయకుండా ప్రతిక్షణం కాపాడే కంకాళ మాత మోర ఎత్తి భీకరమైన గొంతు తో .. దేవతలకి ఆదేశించింది . గాలి వొణికి ఆగింది .. నృత్యం ఆపిన ఏడుగురు దేవతలు కిల కిల నవ్వుతూ చాంది బాయి చుట్టూ చేరి మళ్లీ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యం చేశారు . “అమ్మలారా నన్ను మళ్ళీ యవ్వనవతిని చేస్తే చేశారు కానీ ఈ సారి నా గర్భం నిలవకపోయినా నన్ను నా ఘర్వాలా ఎల్లగొట్టకుండా చూడున్రి ., నా లునావత్ నే మంచోడ్నిచేసి ఇవ్వండి ఇంకొడు వద్దు నా కడుపుల లూనావత్ బిడ్డనే ఉన్నడు. ” చాంది బాయి రెండు చేతులూ జోడించి దుఖ పడుతూ దీనంగా వేడుకుంది దేవతల్ని . వింటున్న కంకాళ మాత దిక్కులు పిక్కటిల్లేలా నవ్వింది . నవ్వుతూనే ఉంది అలా కొంచెం సేపు నవ్వాక “పిచ్చిచాంది బాయి అది మా చేతుల్లో లేదు .ఈ భూమ్మీద పడ్డాక మీ మనుషులకి ఇక మా బుద్ధ్ధులు ఉండవు’’ అంది కొంచెం జాలిగా చూస్తూ . ఇంతలో అక్కడ ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలింది కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ ఆ ఏడుగురు దేవతల ముందు మానవాకారం తీసుకుంది . ఎవరు నువ్వు.,? కంకాళ మాత అడిగింది . “ఎనిమిదో దేవతని భూమ్మీద నుంచి వచ్చాను” అంది ఆమె శాంతంగా చిరు నవ్వుతో . “చాంది బాయి కి ఇప్పుడు పేట్ ల బిడ్డ లేదు . గడ్డని బిడ్డ అన్న భ్రమల ఉందీమె . ఈ గడ్డని తీసేయాల . ఆ తర్వాత నే ఈమెకి మళ్ళీ యవ్వనం ఇచ్చి ఆమె తండాకు .. యాడి .. బాపుల దగ్గరికి పంపి మళ్ళీ పెండ్లి చేయాలే . చేయండి కానీ ముందు ఈమె పేట్ ల గడ్డ తీయాలి లేక పోతే ఈమె బతుకదు” .. ఎనిమిదో దేవత అన్నది . అంటుంటే .,ఈ పని మాకూ రాదని అంటూ పక్కకెళ్లిపోతున్నారు ఆరుగురు దేవతలు. తుల్ఝా భవానీ అమ్మవారు కూడా ఆలోచనల పడ్డది. ప్రాణం పోయడమే కానీ ఇట్లా రక్త పాతాలు రావే తమకు ., ఏం చేయాలి అని. మళ్ళీ దేవతలు అంతా సమావేశం అయ్యారు.ఎనిమిదో దేవతను కూడా వాళ్ళతో రమ్మన్నారు . “ఈమె గర్భం లోని గడ్డని నేను తీసేస్తాను భూమ్మీద నేను చేసేదే ఈ పని నన్ను నమ్మండి” అంది ఈ మాటలు విన్న చాంది బాయి భయం తో బిగుసుకు పోయింది . తనకు ఈ బిడ్డ కావాలి అంతే. మెల్లిగా అక్కడి నుంచి లేచింది ., పరుగులు పెట్టింది పరుగెడుతూనే ఉంది దేవతల్నితప్పించుకుంటూ., వొగరుస్తూ కడుపుని పట్టుకొని.. ముల్లు గుచ్చుతున్నా.,రాళ్లు కొట్టుకుంటున్నా వాగులు వంకలు.,లోయలు, నదులు, సముద్రాలు,పర్వతాలు ,అడవులు ,జంతువులు ,మనుషులు , రైళ్లు ,బస్సులు ,కార్లు ,విమానాలు,బిల్డింగులూ దాటుకుంటూ., చెమటలు కక్కుతూ వొళ్లంతా రక్త కాసారం అయిపోతున్నా పరుగు పెడుతూనే ఉంది. ఈ లోపల ఆమెకు ఒక గుహ కనపడింది రక్త మాంసాల గుహ., తన యాడి గర్భం లాంటి మెత్తని మాంసం,వెచ్చని రక్తం ఉన్న గుహ., అంతే అందులో దూరి పోయింది . “వచ్చినవా బిడ్డా రా పండుకో .. దా ఇగో గీ బొడ్డు తాడుతో నిన్ను కట్టేసుకుంట దా” ప్రేమతో పిలుస్తున్న యాడి గొంతు వింటూ చాంది బాయి., గుహలో పడిపోయింది. . దగ్గరలో వాంఖిడి కడియాల చప్పుడు వినపడుతుంటే.,కళ్ళు మూసుకుపోయాయి . “ఆజో మ తోనా బేటా దూన్చు.. మారే ఘర్వాలా..ఆజో ”{ నా పెనిమిటీ ., రా నాతో .,నీకు కొడుకుని కని ఇస్తా } సన్నగా పాడుతూ తన యాడి గర్భంలో కళ్ళు మూసుకొని మెల్లిగా .,మెత్తగా ఈద సాగింది చాందిబాయి . కానీ ఇంతలోనే ఏడుగురు దేవతలు ఆమెను కమ్ముకున్నారు ఆమెను గుహలోనుంచి బయటకు లాగారు . ఆమె గర్భం విచ్చుకు పోతున్నది., పగిలి పోతున్నది. గడ్డ బయటకు ఉబుకుబికి వస్తున్నది . ఏడుగురు దేవతలు మెల్లిగా ఆమెని మంచానికి కట్టేశారు ఎనిమిదో దేవత.. చాందీ బాయి మీదకు వొంగింది . ఆమె చేతిలో తళ తళ లాడే కత్తి ఉంది . “నా బిడ్డ .. నా బిడ్డను చంపకుండ్రీ ., నా ఘర్వాల బిడ్డ” అంటూ గిల గిల లాడుతూ మెలికలు తిరుగుతున్నది చాంది బాయి అంత మైకం లోనూ . భోరుమని ఏడుస్తూ అరుస్తూ రెండు చేతులతో బయటకు ఉబుకుతున్న గడ్డను ఆపుకుంటూ., పొట్టలోకి తిరిగి తోసుకుంటున్నది నా కొడుకు,. నా కొడుకు అంటూ. .
****
ఆసుపత్రిలో మంచం మీద నుంచి పులిలా గాండ్రించి లేచింది చాంది బాయి .. ఆమె పొత్తి కడుపు రక్త సిక్తం అయిపోయి వుంది. ఆమె చేతి వేళ్ళు ఆమె పొట్టని చీల్చినట్లు రక్తం తో తడిసి ఉన్నాయి . నొప్పితో పెద్దగా ఘూర్ణిల్లుతూ గాయపడ్డ పక్షిలా విల విల్లాడుతూ “ యాడియే .., వో యాడియే కాయి కరోచి .. { అమ్మా., వొ అమ్మా ఏం చేస్తున్నావు?} యాడియే..” అంటూ అరుస్తూ మంచం మీద నుంచి లేచింది. కడుపు మీద కుట్లు విచ్చుకుని . ,గాయం తెరుచుకుని.. పెద్ధ రంధ్రం తో.. ఖాళీ అయిపోయిన పొట్ట తో “ఆజో మా తోనా బేటా దూన్చు లూనావత్ మారో ఘర్వాలా నాతో పండుకో రా ” అంటూ పళ్ల బిగువన పాడుతూ ., పాడలేక మూల్గుతూ తనవైపుకి పాక్కుంటూ వస్తున్న చాంది బాయిని చూసిన కాంపౌండర్ మనూదాస్ చేతిలో ఉన్న గ్లూకోజ్ సీసాని కింద పడేసి గావు కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు.. లోపలికి వస్తున్న నీలాబాయి,భూక్యాలను గుద్దు కొంటూ.. (26.4.2023)
ఆద్యంతం విషాదభరితం. ఒళ్ళు గగుర్పొడిచింది.
Thanks vanaja garu