వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు  నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ   న్యాయ స్థానం,పోలీసులు ఒక  సాకు మాత్రమే.                                                   

2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ ఆదివాసి స్త్రీలు కనబడ్డారు. పదకొండు మంది మహిళలపై అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన వెనుక తాము వేసుకున్న దుస్తులు ,చేతిలో ఆయుధం ఈ దేశ ప్రజాస్వామ్యం ఉన్నాయనే ధీమా ఉన్నది.  ఈ దారుణమైన చర్యకు బాధ్యత కలిగిన పోలీసులు పాల్పడినారంటే తమను ఎవరు ఏమి చేయలేరనే భరోసా వారికి వుండి ఉంటుంది.  పదిహేనేళ్ల కాలంలో  ఈ దేశం చట్టాలు న్యాయ స్థానాలు ఎలా వ్యవహరించాయో మన ముందొక వాస్తవం వున్నది.   

వాకపల్లి కేవలం ఘటన కాదు ప్రతీకారం.   ఇలా దీన్ని అర్థం చేసుకోవాలి .ఆదివాసి మహిళలపై పోలీసులకు ప్రతీకారం ఎందుకని ప్రశ్న రావచ్చు. కేవలం పోలీసులు వాంఛ కోసం మాత్రమే ఈ ఘటన జరిగిందా లేదా ఈ అఘాయిత్యంవెనుక ఏమున్నది.  2007 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖ మన్యం ప్రాంతంలో నక్సలైట్లు ప్రభావమున్నది. బాక్సైటు గనులు తవ్వకమనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది .బాక్సైట్ తవ్వడం ద్వారా కొండలు అదృశ్యమై ఉత్తరాంధ్రలో ప్రవహించే నదులు తమ ఉనికిని కోల్పోతాయి . పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు ప్రజల సాగునీటికి ,తాగునీటికి ఇబ్బంది కలుగుతుంది.  బాక్సైట్ తవ్వకాన్ని విరమించుకోవాలని ఆ ప్రాంత ఆదివాసుల నుండి  నిరసన రూపం తీసుకున్నది. వాకపల్లి ఘటన వెనక ఈ ఆర్థిక కోణం ఉన్నది.  నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల దుందుడుకు చర్యలు ఎలా ఉంటాయో ఇది ఒక ఉదాహరణ.       

 రాజ్యపు కర్కశత్వానికి మూల్యం చెల్లించింది ఆదివాసీలు. ఈ ఘటన కేవలం పైశాచిక ఆనంద మాత్రమేనా! లేదా స్త్రీ పురుషున్ని ఎదురించలేని పురాతన సమాజపు భావ దారిద్ర్యానికి కొనసాగింపు అనుకుంటే పొరపాటే. ఇది ప్రేరేపిత చర్య. దీని వెనుక కేవలం రాజకీయ ఆధిపత్యం మాత్రమేనా అంతిమంగా ఆదివాసీ సమూహాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఫ్యాక్షన్ ఆలోచన ఉన్నది .దీనికి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి. ఉద్యమ తీవ్రతను అంచనావేసి విధ్వంసపు కుట్రను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించింది.ఆదివాసీ మహిళల పట్ల ఆనాటి ప్రభుత్వం కనబరిచిన నిర్లక్ష్య ధోరణి జ్ఞాపకం చేసుకుంటే కేవలం ఇది ఘటన మాత్రమే కాదు ఖాకీ ముసుగులో మొత్తంగా ఒక సమూహాన్ని బెదిరించడం లేదా అణిచివేతకు పూనుకోవడం.

వాకపల్లి మహిళలు తమకు జరిగిన అవమానాన్ని కడుపులో దాచుకుని రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చైతన్యవంతమైన భూమిక నిర్వహించారు .సాంప్రదాయ, సాంస్కృతిక నేపథ్యం ఒకవైపు తమవైన ఆచారాలు పురుషుని ఆధిపత్యం ఈ గోడల మధ్య పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. ఈఅనుభవం నుండి తమకు జరిగిన అవమానాన్ని తమదిగా భావించలేదు. రేప్ గురైంది తాము మాత్రమే కాదు, భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యాచారానికి లోనయింది అనేది వారి భావన. ఈ భావన ఎలా రూపొందుతుంది నాలుగు గోడల మధ్య దుఃఖితులుగా  , మౌనంగా వుండాలని రాజ్యం భావించింది. ఇది దుఃఖం అవమానంకు సంబంధించిన అంశం కాదు .రాజ్య నీతికి వ్యతిరేకంగా  శారీరక సంప్రదాయాలకు భిన్నంగా దేహం చుట్టూ అల్లుకున్న   అపవిత్రతనే సంప్రదాయ భావజాలం నుండి బయట పడి  ఆందోళనా మార్గాన్ని ఎంచుకున్నారు.  ‌తరతరాలుగా స్త్రీలపై కొనసాగుతున్న అణిచివేతల పరంపర నుండి తమ దేహాన్ని, హృదయాన్ని నిత్య ఆందోళనలో భాగం చేసుకున్నారు‌.

వాకపల్లి  భారతీయ గ్రామాలతో అనుసంధానమైంది . అత్యాచారం అనేది తమకి మాత్రమే సంబంధించిన చర్య కాదు‌ ఒక మానవీయ సమాజం ,దాని నిర్మాణం, స్త్రీ పురుషుల సమానత్వం వీటన్నిటి మధ్య నిర్మితమైన భారతీయ  విలువలు.ఇదే సమయాన ఇది పుణ్య భూమి ప్రపంచానికి వెలుగునిచ్చింది. నాగరికత నేర్పింది‌ ఇదంతా భ్రమ. కోట్లాదిమంది ప్రజలు తమ రోజువారి జీవితం కోసం బతుకు యుద్ధం చేస్తున్నారు . ఇంకా రెండవ తరగతి పౌరులుగా స్త్రీలు ఉన్నారు‌ .రాజ్యం చెబుతున్నదంతా సారాంశంలో డొల్ల. పురాణ ఇతిహాసాల చరిత్ర గొప్ప నాగరిక తలంపై నిర్మితమైన దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడి మరీ ముఖ్యంగా ముస్లింలు, దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న మొత్తం అణిచివేత చర్యలు ఏ  ప్రజా స్వామ్య భావన కిందకు వస్తాయి ‌దేశం, మానవీకరణ ,విలువలు ఇవన్నీ నిర్మితం కావడానికి ఈ దేశ ప్రజాస్వామ్యం చేసింది ఏమిటి? వాకపల్లి బాధిత మహిళలు మాత్రమే కాదు మొత్తంగా బాధితులు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేదు‌.         

 అందరూ ఊహించిన తీర్పు. విచారణ అధికారులు సరిగ్గా వ్యవహరించలేదు‌  వాకపల్లి బాధిత మహిళలకు న్యాయం జరగడంలో కేవలం విచారణ అధికారులపై  నెట్టి వేయడంతో సరి పెట్టకుండా న్యాయస్థానం బాధిత మహిళలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించడం  పాక్షిక విజయం ‌. ఎంతో కొంతమేర న్యాయస్థానం సమాధానం పడింది. పరీక్షంగా న్యాయం జరిగిందని బాధిత సమాజం అనుకుంటుంది. ‌నేరం జరిగినప్పుడు ఒక నేరంతో పోలీసులు పాల్గొన్నప్పుడు శిక్షకు తగిన నేరం కనబడుతున్నప్పుడు న్యాయ స్థానం తీరు ఇలా ఉండవలసిందా ?ఆలోచించాల్సిన మెళిక కదా. విచారణాధికారుల అలసత్వం,స్పష్టంగా కనబడుతున్నప్పుడు ఈ విషయం  న్యాయ  స్థానం దృష్టికి వచ్చినపుడు ఈ తీర్పు  వాకపల్లి  ఘటనకు   న్యాయం జరిగే దిశగా వుండేది.  న్యాయం చేయడం లో ఫెయిలయిన వ్యవస్థలను తప్పుపట్టవలసిన అవసరం లేదా .       

 నిజానికి వాకపల్లి బాధిత మహిళలు ఈ తీర్పును స్వాగతించారు. ఏదో స్థాయిలో న్యాయం లభించినదని భావిస్తున్నారు. ఇది మాత్రమే చాలదు ‌. ఈ ఘటన మానవ స్వభావాన్ని ‌,ప్రవృత్తిని ,నిర్లజ్జగా బహిర్గతం చేసింది. రక్షకుడే రేప్ కు పాల్పడితే ఎవరు ఇంకా చట్ట పరిధిలో పనిచేస్తారు.ఇది ఎంత  సున్నితమో అంత గంభీరమైనది .ఇవన్నీ ప్రశ్నలు గానే మిగిలి ఉన్నాయి. కేవలం ఈ ఘటన వెనక  ప్రభావిత అంశాలను వారిని న్యాయానికి దూరం చేసిందా. లేదు తమ రాజ్య అంగాలను కాపాడుకునేందుకు భారత ప్రజాస్వామ్యం మొత్తంగా తన వ్యవస్థలను రక్షించుకునేందుకు వాకపల్లిమహిళల న్యాయాన్ని బలి పెట్టిందా . నేరం జరిగింది అని తెలిసినప్పుడు దానికి తగిన ఆధారాలు ఉన్నప్పుడు ఆదివాసి స్త్రీలు బహిరంగంగా తమ బాధితులం అంటున్నప్పుడు దీని వెనుక ఈ మొత్తం వ్యవహారాన్ని   న్యాయ స్థానం పరిశీలించవలసింది.

ఇది కథ కాదు కథ కాదు వాస్తవం. భారత ప్రజాస్వామ్యం  అపజయం.ఇది ఇంతటితో ఆగుతుందా వాకపల్లి   తీర్పును పక్కన పెడితే తమిళనాడు జిల్లాలోని మధురై జిల్లాలో వాచతి గ్రామంలో ఇలాంటి ఘటన 1992లో జరిగింది. వాచతి గ్రామంలోకి వెళ్లి పోలీసులు గ్రామీణ స్త్రీలపై అత్యాచారం చేశారు‌‌ . దీనిపై తీర్పు న్యాయ స్థానం వెలువరించాలి. మొత్తం ఈ ఘటన వెనుక దాగిన అధికారం , కౌర్యం  మాత్రమే పైకి కనిపించే అంశాలు.  స్త్రీ ,పురుషుల సమానత్వం లేదా భారతీయ కుటుంబపు  సంప్రదాయ క ప్రాముఖ్యత ఏ మూల మలుపు లో దాగి వున్నాయి. సామాజిక కార్యకర్తలు, బుద్ధి జీవులు అత్యాచార  ఘటనల వెనుక కొన్ని కారణాలు చెబుతాయి .సినిమా, మీడియా , ఇటీవల అదనంగా చేరిన సోషల్ మీడియా ప్రభావాలు ‌మళ్ళీ ఇక్కడ స్త్రీకి కేంద్ర బిందువు, మార్కెట్ అవుతుంది.  ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.     

 భారతీయ విద్యావ్యవస్థ తరగతి గది ఎంత విధ్వంసం చేసిందో మన దగ్గరి కాలం రుజువు చేసింది. మొత్తం సమాజాన్ని ఒంటి చేత్తో మోస్తున్నామని భావన‌ తమకేది కాదన్న ధీమా ఉన్నది ‌అనేక లొసుగులు ఉన్నాయి. వారి దృష్టిలో వాకపల్లి ఘటనకు  ప్రాముఖ్యత లేదు.

 ‌           

 ఇలా ఉంటే భవిష్యత్తు భారతదేశం ఎలా నిర్మితమవుతుంది .మానవ స్వభావంలో కరడు గట్టిన  నేర స్వభావం  వున్నప్పుడు చట్టాలు న్యాయ స్థానాలు సమ్మతి తెలుపుతున్నప్పుడు కనీసం న్యాయం జరిగిందని భావన ఉండాలి కదా‌ న్యాయం అంటే ఎన్కౌంటర్ పరిష్కారం కాదు. తడి భూమిలో విత్తనం ఎలా విచ్చుకుంటుందో ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో సమాజం అలాంటి నొప్పులకు సమాయత్తం కావాలి. ఎక్కడ పరిష్కారం ఉంది .ఆ పరిష్కారాన్ని ఎక్కడ వెతకాలో  వాకపల్లి మరోసారి చెబుతుంది.

Leave a Reply