రంగనాథాచార్యుల అభిప్రాయాలు
ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య విద్యార్థిగా సాహిత్య సంచారం చేసిన సాహితీవేత్త. సాహిత్య రంగంలో ఆయా దశల్లోని ప్రత్యేకతలను గుర్తిస్తూ, ప్రగతిశీల ధోరణులను సమర్థిస్తూ ముందుకు సాగిన సాహిత్య విమర్శకుడు. విరసం అభిమాని.
తెలుగు సాహిత్యం ` మరో చూపు, చారిత్రక భూమిక, నూరేళ్ల తెలుగునాడు, తెలుగులో తొలి సమాజ కవులు. తెలుగు జనసాహితి, ఆధునిక సాహిత్యం ` విభిన్న ధోరణులు, సామయిక వ్యాసాలు మొదలైన కె.కె.ఆర్. రచనల్నీ సాహిత్య విశ్లేషణ గ్రంథాలే. భాష పట్ల, భాషాశాస్త్రం పట్ల అవగాహన, అధ్యయనం ఉన్నా, ఒకటి రెండు వ్యాసాలు తప్ప భాష గురించి పెద్దగా రాయలేదు. ‘సామయిక వ్యాసాలు’ అనే వ్యాస సంపుటిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భాష, గిడుగు పితృపుత్రులు శీర్షికలతో భాష గురించి రెండు వ్యాసాలు కనిపిస్తున్నా. ‘గిడుగు పితృపుత్రులు’ అన్న వ్యాసంలో గిడుగు రామమూర్తి, ఆయన కుమారుడు గిడుగు సీతాపతి భాష విషయంలో చేసిన కృషిని రేఖామాత్రంగా వివరించాడు. ఇక ‘ఆధునిక తెలుగు కవిత్వంలో భాష’ అనే వ్యాసమే తెలుగు కవిత్వంలోని భాష గురించి రాసిన వ్యాసం. ఇందులో ఆధునిక తెలుగు కవిత్వంలోని భాష గురించి ఆయన గుర్తించిన అంశాలు, చేసిన నిర్ధారణలు కొన్ని భాషాభిమానులకు ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి.
మనిషికీ, జంతువుకూ ప్రధానమైన భేదం సృజనాత్మకత. అందుకే మనిషిని ఆలోచించే జంతువంటారు. ఆలోచన భాష ద్వారానే చేస్తాం. సృజనాత్మకతకు గానీ, ఆలోచనకు గానీ అవకాశమిచ్చేది భాష. భాషతో సంబంధం లేకుండా ఆలోచనలు విడిగా ఉండవు. భాష ఆలోచన యొక్క ప్రత్యక్ష వాస్తవిక రూపం అన్నాడు కారల్ మార్క్స్. భాష లేని దశలో మానవుడికి ఆలోచన లేదా? ఉంటుంది. జంతువులకుండే పరిమితమైన ఆలోచన లాంటిదే ఉండి ఉంటుంది. అయితే ఆ ఆలోచనకు సృజనాత్మకత ఉండదు. అంటే మనిషిని జంతువుల నుండి వేరు చేసేది ప్రధానంగా భాషే అన్న మాట. ఈ భాష వల్లనే మనిషి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, తన ఆలోచనలను మెరుగుపర్చుకుంటూ, అన్ని విధాలా అభివృద్ధిని సాధించగలుగుతున్నాడు. జంతువులకు భాష లేదు కాబట్టి వాటి ఆలోచనలో ఎదుగుదల లేదు, సృజనాత్మకత లేదు. భాష వల్లనే మానవుడు సామాజిక జీవి అయ్యాడు. కోటానుకోట్ల జీవరాసుల్లో మనిషికి మాత్రమే భాష ఉంది. అందువల్ల అన్ని జీవరాసులపైనా మనిషి ఆధిపత్యాన్ని సాధించగలిగాడు. అంతేగాదు, అన్ని జీవరాసుల్నీ ప్రేమించగలుగుతున్నాడు కూడా.
మనిషి భాష ద్వారా ఆలోచించడమే కాదు, భాష గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా భాషను నిరంతరం అభివృద్ధి పర్చుకోగలుగుతున్నాడు. భాషను శాస్త్రీయంగా విశ్లేషించుకోగలుగుతున్నాడు. అలా ఇతర శాస్త్రాల్లాగే భాషా శాస్త్రం కూడా ఉనికిలోకి వచ్చింది.
రంగనాథాచార్యులు ప్రముఖంగా సాహితీ విమర్శకుడే అయినా, భాషా శాస్త్రంలో కూడా పరిశీలన, అధ్యయనం ఉండడం వల్ల ఆధునిక తెలుగు కవిత్వంలోని భాషా స్వరూపం గురించి వ్యాసం రాయడానికి దోహదపడింది.
భాషలో మాట్లాడే భాష, రాసే భాష అని స్థూలంగా రెండు రకాలున్నాయి. భాషకు తొలి రూపం మాట్లాడే భాష. లిపి ఏర్పడిర తర్వాత వచ్చింది రాసే భాష. వీటిని మౌఖిక భాష, లిఖిత భాష అని కూడా అంటాం. ఈ రెండు రకాల భాషలను పోలికలు, తేడాలు రెండూ ఉన్నాయి. మరి మాట్లాడే భాషనే రాసినప్పుడు రెండూ ఒకటిగానే ఉంటాయి గదా? అలా ఉంటాయనుకోవడం మన భ్రమ మాత్రమే. ప్రపంచంలోని ఏ భాషలోనూ మాట్లాడినట్లే రాయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ భాషలోనైనా కొన్ని ముఖ్యమైన లిపి సంకేతాలు మాత్రమే ఉంటాయి. అంతేగాని మాట్లాడే భాషలో ఉండే అన్ని ధ్వనులకూ లిపి సంకేతాలుండవు. అందుకే ఒక్కో భాషలో లిపి సంకేతాల సంఖ్య ఒక్కో రకంగా ఉంటుంది. ఇంగ్లీషులో 26 లిపి సంకేతాలుంటే తెలుగులో 56 లిపి సంకేతాలున్నాయి.
రాసే భాష అసలు భాషే కాదని ‘లాంగ్వేజ్’ అనే గ్రంథంలో లియోనార్డ్ బ్లూమ్ ఫీల్డ్ ఒక సంచలన ప్రతిపాదన చేశాడు. రాత భాష కాదు. భాషను రికార్డు చెయ్యడానికి ఉపయోగించే దృశ్య చిహ్నాలు మాత్రమే అని ఆయన అన్నారు. ఈ మాటల్లోని లోతుపాతులకు మనం వెళ్ళనవసరం లేదు గాని, మాట్లాడేదే అసలైన భాష అని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. సాంకేతిక పరిభాషలో రాత భాష కాదని అనుకున్నా. మాట్లాడే భాష సాధించలేని సామాజిక పురోగతిని రాసే భాష సాధించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
రాసే భాష అంతా ఒక రకంగా లేదు. సాహిత్య భాష, సాహిత్యేతర భాష అని వర్గీకరించుకొంటే సాహిత్య భాష కూడా అంతా ఒకే రకంగా లేదు. అందులో ముఖ్యంగా కవిత్వంలోని భాష కొంత విలక్షణంగా ఉంటుంది. దీన్ని తెలియజేసేది మూడు పదబంధాలున్నాయి ` అవి కవిత్వంలో భాష, కావ్య భాష, కవిత్వ భాష. కె.కె.ఆర్. తన వ్యాసంలో పై మూడు అర్థాల్లో ఆరు రకాల పద ప్రయోగాలు చేశాడు. కవిత్వంలో భాష, కవితా భాష, కావ్య భాష, సాహిత్య భాష, గ్రాంథిక భాష, కవిత్వపు భాష. కవిత్వపు భాష అన్నా, కవిత్వ భాష అన్నా ఒకటే. అయితే ఆయన కవిత్వ భాష అన్న మాటను ఉపయోగించలేదు. పైన చెప్పిన మూడర్థాలలో ఉన్న ఆరు పద ప్రయోగాల్ని వాటి సమానార్థక రూపాలతో ఇలా చూపించవచ్చు:
1. కవిత్వంలో భాష, కవితా భాష.
2. కావ్య భాష, సాహిత్య భాష, గ్రాంథిక భాష.
3. కవిత్వ భాష, కవిత్వపు భాష.
కవితా భాష అనే దానికి కవిత్వ భాష అని కూడా అర్థం వస్తున్నా, కె.కె.ఆర్. పైన చెప్పిన అర్థంలోనే ప్రయోగించాడు. ముందుగా వీటి మధ్య ఉన్న అర్ధ భేదాల్ని తెలుసుకుందాం.
‘ఆధునిక తెలుగు కవిత్వంలో భాష’ అనే కె.కె.ఆర్. వ్యాసం శీర్షికలోనే ‘కవిత్వంలో భాష’ అని ఉంది. ఈ అర్థంలోనే ఆయన వాడిన మరో ప్రయోగం కవితా భాష అన్నది. అంటే కవిత్వంలో ఉన్న భాషా స్వరూపం అని అర్థం. ఇది ప్రాచీన కవిత్వంలో గ్రాంథిక భాషా రూపంలో ఉంది. ఆధునిక కవిత్వం తొలి దశలో గ్రాంథిక భాషలోనూ, వ్యావహారిక భాషలోనూ ఉంది. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వంలో వ్యావహారిక భాష ఉంది. విప్లవ కవిత్వంలో వ్యావహారిక భాషతో పాటు మాండలిక భాష కూడా ఉంది. అంటే కవిత్వంలో ఆయా దశల్లో గ్రాంథిక, వ్యావహారిక, మాండలిక భాషల రూపంలో భాష ఉందని అర్థం చేసుకోవాలి.
ఇక రెండవది కావ్య భాష. అంటే ప్రాచీన కావ్యాలలో ఉండే భాష అని అర్థం. ఈ అర్థంలోనే కె.కె.ఆర్. సాహిత్య భాష, గ్రాంథిక భాష అనే మాటల్ని కూడా ప్రయోగించాడు. ప్రాచీన కావ్యాలలో ఉండే సాహిత్య భాషే కావ్య భాష పేరుతో సాహితీపరుల వాడుకలోకి వచ్చింది. అప్పట్లో ఉన్నది కావ్యాలే కాబట్టి వాటిలోని భాషను కావ్య భాష అని పిలిచారు.
ఇక మూడోది కవిత్వ భాష. ఈ మాటనే కె.కె.ఆర్. కవిత్వపు భాష అన్నాడు. దీన్ని కాస్త వివరంగా చూడాలి. కవిత్వ భాష అంటే గ్రాంథిక భాషో, వ్యావహారిక భాషో, లేక మాండలిక భాషలో కాదు. కవిత్వ భాష అనేది ఈ మూడు రకాల భాషలకూ సంబంధం లేనిది. ఇంకో విధంగా చెబితే ఈ మూడు రకాల భాషల్లోనూ ఉండడానికి అవకాశం ఉన్నది. కేవలం భావ ప్రకటనకు మాత్రమే ఉపయోగించే భాష కాదిది. వాచ్యార్థం కంటే భిన్నమైనది. కవిత్వంలో ఉండే ధ్వని, వ్యంగ్యం, వక్రోక్తి మొదలైన వాటి స్ఫూర్తిని కలిగించేది. సాధారణ భాషలో భావ ప్రకటన మాత్రమే ఉంటుంది. కవిత్వ భాషలో ఆ భావ ప్రకటన ఒక రకమైన సౌందర్యంతో కూడుకొని ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వ భాష లేకపోతే అది కవిత్వమే అనిపించుకోదు. ‘‘ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ నిద్రపోతుందా?’’, ‘‘అతని కలానికి కవిత్వపు ఆకలి ఎక్కువ’’. ఈ వాక్యాల్లో ఉన్నది కవిత్వ భాష. అప్రాణి వాచకాలను ప్రాణి వాచకాలుగా చెప్పడం వల్ల అది కవిత్వ భాష అయింది. ఇక్కడ ప్రాణి వాచకాల స్వభావం అప్రాణి వాచకాలకు అన్వయింపబడిరది. భాషను కవిత్వ భాషగా మార్చడానికి ఇదొక పద్ధతి. ఇలా సాధారణ భాషను కవిత్వ భాషగా మార్చడానికి ఎన్నో పద్ధతులుంటాయి. ప్రతి కవీ తనదైన శైలిలో ఈ కవిత్వ భాషను తయారు చేస్తాడు. శ్రీశ్రీ ‘ఖడ్గ సృష్టి’లో `
‘‘స్వాతంత్య్రాన్ని బ్యాంకులో వేసుకుని
చక్రవడ్డీకి తిప్పే కామందులకు…’’
అంటాడు. ఇదొక రకమైన కవిత్వ భాష. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’లో `
‘‘అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును’’
అంటాడు. ఇది ఇంకో రకమైన కవిత్వ భాష. ఇలా కవిత్వ భాష అనంత రూపాల్లో ఉంటుంది. ఉన్న భాషనే కవిత్వ భాషగా మార్చగల మాంత్రికుడు కవి. ‘‘చక్కనమ్మ చిక్కినా అందం, సన్నగుడ్డ చినిగినా అందం’’ ` ఇదొక సామెత. దీన్ని సృష్టించిన మాంత్రికుడు సామాన్య మానవుడే. ఇందులోనూ కవిత్వ భాష ఉంది. సామాన్య ప్రజలు సైతం ఎన్నో సందర్భాల్లో తమకు తెలియకుండానే ఇలాంటి కవిత్వ భాషను ఉపయోగిస్తుంటారు. అయితే అది కవిత్వమన్న విషయం వాళ్ళకు తెలియదు. ఏదో ఒక సందర్భంలోనైనా కవిత్వ భాషను ఉపయోగించని మానవుడు బహుశా ఉండడేమో! కొంత కాలంగా వార్తా పత్రికలలో కూడా కవిత్వ భాష కనిపిస్తోంది. వార్త పత్రికల్ని ఎవరూ కవిత్వం కోసం చదవదు, సమాచారం కోసమే చదువుతారు. కాని పాఠకుల్ని ఆకట్టుకోడానికి జర్నలిస్టులు పోటీబడి కవుల అవతారం ఎత్తుతుంటారు. కరెంటు సబ్సిడీపై కాకి లెక్కలు, మేడిపండు బడ్జెట్, దొరికిన దుంగలు ` దొరకని దొంగలు ` ఇలాంటి శీర్షికలు దినపత్రికల్లో ప్రతి రోజూ తారసపడుతూనే ఉంటాయి. పదాల సృష్టిలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. ‘లంచం’ అనే మాటకు ముడుపు, దక్షిణ, తైలం, తడి, బరువు, గతుకు, దొంగకూడు, మామూలు, ఆమ్యామ్యా ` ఇలా ఎన్ని పదాలు లేవు! ఇది కూడా కవిత్వ భాషే. అంటే కవిత్వ భాషలో పాత మాటలే కొత్త అర్థాల్లో కనిపిస్తాయన్న మాట. కవిత్వ భాష విశ్వరూపం ఇలా ఉంటుంది.
ఒక సందర్భంలో చేకూరి రామారావు కవిత్వం లేని భాష ఉండొచ్చుగాని, భాష లేని కవిత్వం ఉండదన్నాడు. వెంటనే సర్దుకొని, మాట వరసకన్నాను గాని కవిత్వం లేని భాష కూడా ఎక్కడా ఉండదన్నాడు. ‘కవిత్వం లేని భాష’ అన్న మాటకు నాకు రెండర్థాలు స్ఫురిస్తున్నాయి. మొదటిది ` ప్రపంచంలో కవిత్వం లేని భాష ఒక్కటి కూడా లేదని. రెండోది ` ప్రతి భాషలోనూ కవిత్వం లేని భాగం చాలా ఎక్కువగానే ఉంటుందని. చేరా పై మాటల్ని ఈ రెండో అర్థంలో అని ఉంటాడు. వెంటనే ఇంకో అర్థం కూడా ఉందన్న విషయం గుర్తుకొచ్చి మాటవరసకన్నానని సర్దుకున్నాడు.
ఒక్కోసారి కవిత్వ భాష భిన్నార్థాలకూ, భిన్న వ్యాఖ్యానాలకూ అవకాశం కల్పిస్తుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో కవి ఉద్దేశించిన అర్థాలనే గాక, ఉద్దేశించని అర్థాలను కూడా విమర్శకులు లాగడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కవికి ఎక్కువ న్యాయం జరగొచ్చు, అన్యాయమూ జరగొచ్చు. భిన్న వ్యాఖ్యానాలకు, అర్థాలకు తావివ్వకుండా, తానుద్దేశించిన అర్థాన్నే బలంగా వ్యక్తం చెయ్యడానికి వీలుగా కవి తన కవిత్వ భాషను రూపొందించుకోవలసి ఉంటుంది. కవిత్వ భాష అంటూ ఒకటి రెడీమేడ్‌గా ఎక్కడా ఉండదు. ఉన్న భాషనే కవులు తమదైన కవిత్వ భాషగా మలుచుకోవాలి.
కవిత్వ భాష కొన్ని సందర్భాల్లో కవిత్వానికే పరిమితం గాకుండా, కథల్లోకి, నవలల్లోకి, చివరకు వ్యాసాల్లోకీ కూడా కవిత్వ భాషకు ఈ దురాక్రమణ స్వభావం ఎక్కువ. తన హద్దుల్లో తానుండదు.
భాష భౌతిక జీవితావసరం. కవిత్వం భౌతిక జీవితావసరం కాదు. అయినా కవిత్వం భాష ద్వారానే వ్యక్తమౌతుంది. భాష భౌతిక జీవితావసరం అంటే అర్థం భాష భౌతిక సంపదను సృష్టిస్తుందని కాదు. సమిష్టిగా జరిగే భౌతిక సంపద తయారీలో భాష ఎంతో సహకరిస్తుందని చెప్పడం. అంతేగాని ఉత్పత్తి సాధనాలు లేకుండా భాషను మాత్రమే కలిగిన మానవులు భౌతిక సంపదను సృష్టించడం సాధ్యం కాదు. భాష నిర్వర్తించే ఈ పాత్రను కవిత్వం నిర్వర్తించలేదు. ఈ దృష్టితోనే భాష భౌతిక జీవితావసరం అనడం. ఉత్పత్తి సాధనాలు లేకుండా భాష మాత్రమే భౌతిక సంపదను సృష్టించగలిగినట్లయితే ప్రపంచంలో వదరుబోతులే అందరి కంటే ధనవంతులయ్యే వారని స్టాలిన్ చమత్కారంగా అంటాడు.
భాష భౌతిక సంపదను ఉత్పత్తి చేయలేదనే గాని, మానవుని ఉత్పత్తికి సంబంధించిన కార్యాచరణలో భాషకు సంబంధం ఉండి తీరుతుంది. పునాది నుండి ఉపరితలం దాకా అన్ని చోట్లా భాష లేకుండా ఏదీ జరగదు. అంతే కాదు, మానవుని కార్యరంగాలన్నిటిలోనూ వ్యాపించి ఉన్న భాషా కార్యరంగం చాలా విశాలమైందీ, విశిష్టమైందీ. ‘మార్క్సిజం అండ్ ప్లాబ్లంమ్స్ అఫ్ లింగ్విస్టిక్స్’’ అనే గ్రంథంలో స్టాలిన్ ఏ పునాది కన్నా, ఉపరితలం కన్నా భాష ఎక్కువ కాలం జీవిస్తుందని అంటారు. బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్థలన్నిటిలోనూ ఎన్ని మార్చులకు లోనైనా భాష స్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచమంతా సోషలిజం ఏర్పడే దాకా విభిన్న భాషలుంటాయి గాని, అన్ని రకాల అసమానతల్నీ తొలగించుకుని కమ్యూనిస్టు సమాజం వైపు అడుగులు వేసే దశలో ఈ భాషలన్నీ అంతరించి వాటిలోని సారాన్నీ, మంచినీ గ్రహించి ఒక నూతన ప్రపంచ భాష ఏర్పడుతుందని స్టాలిన్ ఊహించాడు.
సృజన అనేది భాష ద్వారానే ప్రకటితమౌతుంది. అందువల్ల భాష భౌతిక జీవితావసరం మాత్రమే కాదు, అతని సృజనాత్మకతకూ, జీవన పురోగతికీ, సామాజికాభివృద్ధికీ అది మూలాధారం అవుతుంది. అంటే భాష వ్యవహార నిర్వహణకు ఒక సాధనం మాత్రమే కాదు, మానవ సమాజం ముందుకు సాగడానికి ఒక ముఖ్యమైన సాధనం కూడా అవుతుంది.
ఈ సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో అసలు విషయంలోకి వద్దాం. ‘‘ఆధునిక తెలుగు కవిత్వంలో భాష’’ పేరుతో రంగనాథాచార్యులు (కె.కె.ఆర్.) రాసిన వ్యాసంలో కొన్ని మంచి పరిశీలనలు ఉన్నాయి. వాటిలోని సామంజస్యాల్నీ, ఔచిత్యాల్నీ, పరిమితుల్నీ, పరిధుల్నీ చర్చించడమే ప్రస్తుత ఈ వ్యాసం పరిధి.
‘‘గ్రాంథిక భాషలో ఆనాటి నుంచి కొన్ని శతాబ్దాల వరకు మార్పులు లేకపోవటానికి కారణం అప్పటి సమాజంలోని ఉన్నత వర్గాలకు పనికి వచ్చే సాహిత్య సృష్టికీ, వారికున్న పరిమిత విజ్ఞానానికి ఆ భాష సరిపోవటమే.’’ కె.కె.ఆర్. అన్న మాటల్ని చూద్దాం. ఆయన చెప్పిన మొదటి కారణం ఉన్నత వర్గాలకు మాత్రమే పనికొచ్చే సాహిత్య సృష్టికి గ్రాంథిక భాష సరిపోవటం. అప్పట్లో విద్య ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియులకే పరిమితం. వారిలోనూ కొద్ది మంది బ్రాహ్మణ పండితులే కావ్య రచన చేసేవారు. అరుదుగా రాజులు కూడా కావ్యాలు రాశారు. కావ్యలు తాటాకుల్లో ఉండడం వల్ల చదువుకోడానికి అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వాటిని పండితులే చదివేవారు. రాసేదీ, చదివేదీ ఇద్దరూ పండితులే అయినపుడు ఆ కావ్యాలు సహజంగానే పండిత భాషలోనే రాయబడతాయి. కావ్య భాష అన్నా, గ్రాంథిక భాష అన్నా ఈ పండిత భాషే. పైగా తొలిదశలో సంస్కృతం నుండి అనువాదాలు కాబట్టి తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావం ఎక్కువ. సంస్కృత పదాలూ, సంస్కృత సమాసాలూ, నిరాటంకంగా తెలుగులోకి దిగుమతులు అయ్యాయి. సామాన్యులకు అర్థంగాని ఈ కావ్యాలలోని విషయాన్ని కొందరు పౌరాణికులు ప్రజలకు వివరించేవారు. అందువల్లనే పురాణ కథల్లోని విషయాలు సామాన్యులకు కూడా స్థూలంగా తెలిసేవి. ఈ పద్ధతి ఆధునిక కాలం ప్రారంభమయ్యే దాకా కొనసాగింది. అందువల్ల గ్రాంథిక భాష శతాబ్దాల తరబడి పెద్దగా మార్పులకు లోను కాలేదు.
ఇక ఆనాటి వారికున్న పరిమిత విజ్ఞానానికి ఆ గ్రాంథిక భాష సరిపోయిందనడం కె.కె.ఆర్. చెప్పిన రెండో కారణం. నిజమే. ఆనాడు ప్రధానమైన రచన కావ్య రచనే. ఈనాటి లాగా చరిత్ర, తత్వశాస్త్రం, అనేక సామాజిక సమస్యలు, న్యాయశాస్త్రం మొదలైన ఎన్నో విషయాలు రాయడానికి వారికున్న పరిజ్ఞానమూ తక్కువే. రాయడానికి తగిన సాధనాలూ లేవు. వీటికి సంబంధించి ఎప్పుడైనా కొన్ని విషయాలు చెప్పవలసి వస్తే పద్యాలలోనే రాసేవారు. లేదా మౌఖిక రూపంలోనైనా చెప్పేవారు. అయితే వారికున్న పరిమిత విజ్ఞానాన్ని చెప్పడానికి సంస్కృత పదభూయిష్టమైన గ్రాంథిక భాషే అవసరం లేదు. ఆనాడు వచనా రచనా సంప్రదాయం లేదు గనక ఏదయినా గ్రాంథిక భాషలోనే అందులోనూ పద్యాలలోనే రాయక తప్పలేదు.
‘‘ఏ భాషలోనైనా సాహిత్యం మొదలయినప్పుడు సాహిత్య భాషకీ, వ్యావహారిక భాషకీ భేదం ఉండి ఉండదు.’’ ‘‘జానపదులలో సాహిత్య భాషకు, వాడుక భాషకు లిఖిత సాహిత్యంలో ఉన్నంత భేదం కనిపించదు.’’ ఈ రెండు వాక్యాల మధ్య కొంత వైరుధ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇవి రెండూ వ్యాసం మొదటి పేరాలోనే ఉన్నాయి. సాహిత్యం ప్రారంభమైనప్పటి నుండీ అది లిఖిత రూపంలో లేదనీ, లిపి ఏర్పడక ముందు సాహిత్యం మౌఖిక రూపంలోనే ఉందనే విషయం నిర్వివాదాంశం. తొలి మౌఖిక సాహిత్యం జానపద సాహిత్యం అవుతుందా కాదా? కె.కె.ఆర్. దృష్టిలో తొలి మౌఖిక సాహిత్యం జానపద సాహిత్యం కాదనే అర్థం వచ్చేట్టుగా ఈ మొదటి పేరాలోనే మరో వాక్యం ఉంది ` ‘‘లిఖిత సాహిత్యంతో సమాంతరంగా జానపదుల సాహిత్యం అనేది ఆదిమ కాలం నుంచి ఈనాటి వరకూ కొనసాగుతూనే ఉన్నది’’ అని. ఇక్కడ ఆదిమ కాలం అంటే లిఖిత సాహిత్యం మొదలయిన కాలమా? కె.కె.ఆర్. ఈ అర్థాన్నే ఉద్దేశించినట్టు కనిపిస్తోంది. మరి లిఖిత సాహిత్యానికి ముందూ మౌఖిక సాహిత్యం లేదా జానపద సాహిత్యం ఉంది గదా? ఇది ఆదిమ కాలం కంటే ముందున్నదని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఆదిమ కాలం అనే మాట తొలి దశను సూచించే మాట. అంతకు ముందున్న దాన్ని ఏ కాలం అనాలి? లిఖిత సాహిత్యానికి పూర్వమే ఉన్నా, తర్వాత దానికి సమాంతరంగా జానపదుల సాహిత్యం కొనసాగుతూ వస్తున్నదనడం సముచితంగా ఉంటుందనిపిస్తోంది. ఒకే వాక్యంలో లిఖిత సాహిత్యం, ఆదిమ కాలం, జానపద సాహిత్యం అనే మాటలు ఉండడం వల్ల పై సందేహానికి తావిస్తోంది.
ప్రాచీన సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా ఉన్న పద్య కావ్య రచన కొనసాగింపుగా ఆధునిక కవిత్వాన్ని, కవితా భాషను విశ్లేషించవలసి ఉంటుందని చెబుతూ కె.కె.ఆర్. ‘‘కావ్య భాష పేరిట స్థిరపడిన ప్రాచీన భాషా ప్రభావం ఆధునిక కవిత్వం ప్రారంభమైన దశలోనే కాదు, ఇటీవలి కాలం వరకూ కనిపిస్తుంది’’ అన్నాడు. ఇది కొంత వరకు వాస్తవమే. కె.కె.ఆర్. రాసిన వ్యాసం 1980లో మే`జూన్ నెలల ‘అభ్యుదయ’ సంచికలో అచ్చయింది. ఇటీవలి వరకు అంటే 1980 దాకా అనో లేదా నాలుగైదేళ్ళ ముందుకాలం వరకూ అనో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రాచీన కావ్య భాషా ప్రభావం భావ కవిత్వం పైనే గాక, అభ్యుదయ, దిగంబర, విప్లవ కవిత్వాలపై కూడా ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కె.కె.ఆర్. గురజాడ ‘డిసెంట్ పత్రం’లోని ఆ మాటల్ని ఉటంకించాడు ` ‘‘దీర్ఘంగా ఉండే వచన భాగాలు ఒక ఛందస్సు విషయంలో మాత్రమే పద్యాలకు దూరంగా ఉన్నాయి. భాషా, శైలీ రెండిరటికీ సమానమే’’. ఇక్కడ గురజాడ ప్రస్తావించిన ‘వచన భాగాలు’ ప్రాచీన కావ్యాలలో పద్యాల మధ్య అక్కడ కూడా ఉన్న వచనాలు. అవి పేరుకు వచనాలే అయినా, వాటిలో ఛందస్సు లేకపోయినా, ఆ వచనాలలోని భాషగానీ, శైలీగానీ పద్యాలకు భిన్నంగా లేదని గురజాడ అభిప్రాయం. ఆధునిక కవిత్వం గురజాడ, రాయప్రోలులతో మొదలైందనే విషయం తెలిసిందే. ప్రాచీన కావ్యాలలోని వచనానికీ, ఆధునిక కవిత్వంలోని వచనానికి మౌలికంగా పోలిక లేదు. ఆధునిక కవిత్వం పద్యాలలో, గేయాలలో, పాటలలో, వచన కవితలలో ఉంది. ఆధునిక పద్యాలలో కొంతవరకు ప్రాచీన కావ్య భాష ఉంది. గేయాలలో, వచన కవితలలో కావ్య భాష ప్రభావం ఆయా దశల్లో తరతమ భేదాలలో ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలలో ఈ ప్రభావం చాలా తక్కువ. ప్రాచీన కావ్య భాష అంటే క్లిష్టమైన పద్య రచనా రీతి. ఈ భాష స్వభావం 20వ శతాబ్దంలో చాలా వరకు మారిపోయింది. రంగనాథాచార్యులే అన్నట్టు విశ్వనాథ కిన్నెరసాని పాటల్లోనూ, నండూరి ఎంకి పాటల్లోనూ అయితే సరళమైన వ్యావహారిక శైలి ఉంది. కఠిన పదాలూ చాలా తక్కువే. కాకుంటే అభ్యుదయ, భావ కవిత్వాల ప్రభావం ఉన్న తిలక్ లాంటి కవులలో కొన్ని చోట్ల సుదీర్ఘ సంస్కృత సమాసాలు దొర్లాయి. అలాగే దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం రాసిన జ్వాలాముఖిలోనూ సంస్కృత సమాస, పదాడంబరం కొన్ని కవితల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదహరించడానికి ప్రస్తుతం నా దగ్గర లేవుగాని, 1970, 80 దశకాలలో ‘జమీన్ రైతు’ వారపత్రికలో శివారెడ్డి పద్యాలు వచ్చేవి. వాటిలో పద్య ఛందస్సు ఉందేగాని, అవి పూర్తిగా వ్యావహారిక భాషలోనే గాదు, వ్యావహారిక శైలిలోనూ ఉండేవి. నెల్లూరు ప్రాంతం యాస, నుడికారం పుష్కలంగా ఉండేవి. గ్రాంథిక భాషా వాసన లేఖమైనా ఉండేది కాదు. ఇది చాలా అరుదైన విషయం.
వచన రచనలలో వ్యావహారిక భాషను సమర్థవంతంగా ఉపయోగించిన గురజాడ ‘‘ముత్యాల సరాలలో కావ్య, ఆధునిక భాషా రూపాలు కలగా పులగమై కనిపిస్తాయి’’ అని కె.కె.ఆర్. అన్నాడు. గ్రాంథిక భాషా పదాలలోని చివరి ‘ము’ వర్ణం వ్యావహారిక భాషలో ‘ం’గా మారిపోయింది. అలాగే క్రియాపదాలలో గ్రాంథిక, వ్యావహారిక రూపాలలో తేడా ఉంటుంది. కె.కె.ఆర్. ఉదహరించిన ఈ ముత్యాల సరాన్ని చూద్దాం.
‘‘విరిగి పెరిగితి / పెరిగి విరిగితి
కష్ట సుఖముల / పార మెరిగితి’’
ఇందులో పెరిగితి, విరిగితి లాంటి క్రియా రూపాలు, ‘సుఖము’ అనే నామవాచక పదం గ్రాంథిక రూపంలో ఉన్నాయి. పెరిగాను, విరిగాను, సుఖం అనేవి వ్యావహారిక రూపాలు. గ్రాంథిక (కావ్య) భాష అంటే ఇంతవరకే కాదు. గురజాడ మాటల్లో అయితే అది ‘క్లిష్టమైన పద్య రచనా రీతి’. ఆధునిక కవిత్వంలో ఇటీవలి కాలం వరకూ కె.కె.ఆర్. కనిపిస్తుందన్న కావ్యభాష ‘‘కావ్యాల్లో ప్రయోగించిన పరిమితమైన ఛందస్సులకు అనుగుణంగా స్థిరపడిన భాష’’. ప్రాచీన కావ్య భాషలో ఉండే క్లిష్టత గురజాడ ముత్యాలసరాల్లో లేదు. ప్రాచీన కావ్య భాష అర్థం గాని చాలా మందికి గురజాడ ముత్యాల సరాలు సులభంగా అర్థమవుతాయి. గురజాడ ఉపయోగించిన సుఖము, పెరిగితి, విరిగిత లాంటి పదాలు రూపంలో గ్రాంథికమేగాని, వాటిలో క్లిష్టత ఏమాత్రం లేదు.
అభ్యుదయ కవిత్వానికి మొదటి వాడైన శ్రీశ్రీ కూడా గేయాల్లో కావ్య భాషా ప్రభావం నుండి తప్పుకోలేకపోయాడన్నది అందరికీ తెలిసిన సత్యమే. కె.కె.ఆర్. ఇచ్చిన శ్రీశ్రీ ఉదాహరణ ఇది `
‘‘చక్రవర్తి ఆశోకుడెచ్చట / జగద్గురు శంకరుండెచ్చట
ఏవి తల్లీ నిరుడు కురిసిన / హిమ సమూహములు
కాళిదాసు మహా కవీంద్రుని / కవనవాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా / ఉంది? చూపించు’’
ఇందులో ఎచ్చట, సమూహములు, శంకరుండు, కవనవాహిని ` ఇవి గ్రాంథిక స్వరూపం ఉన్న పదాలు. ఎక్కడ, సమూహాలు, శంకరుడు అంటే అవి వ్యావహారిక రూపాలైపోతాయి. గ్రాంథిక రూపంలో ఉన్నా క్లిష్టత లేదు. ‘కవన వాహిని’ అనే సమాసం ఒక్కటే కావ్య భాషలో ఉండదగిన రూపం. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు. కవనవాహిని అంటే కవితా ప్రవాహం అని. కావ్యభాషకు ఉదాహరణలుగా శ్రీశ్రీ కవితాచరణాలు ఇవ్వవలసి వస్తే ఈ కింది చరణాలు చూడండి `
‘‘ప్రాకారములు దాటి, ఆకాశములు తాకి,
లోకాలు ఘూకాల బాకాలతో నించి,
ఒకడు దీచికి!’’
(ఆశాదూతలు ` మహాప్రస్థానం)
‘‘స్వచ్ఛకౌముదుల శరన్నశీధినులు,
హిమానీ నిబిడ హేమంతములు’’
(శైశవగీతి ` మహా ప్రస్థానం)
‘‘ఉద్రేక తరంగాలే తరంగాలుగా / ఆగ్రహం కొరడాని చేబూని
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై / భారత కురుక్షేత్రంలో
నవయుగ భగవద్గీతా రaంరaని ప్రసరిస్తాను’’
(శ్రీశ్రీ ` మరో ప్రస్థానం)
శ్రీశ్రీ కవిత్వంలో కావ్య భాషా ప్రభావం అంటే ఇలాంటి కవితా పాదాలే. అయితే పై చరణాలున్న కవితా ఖండికల్లో మొత్తంగా ఇలాంటి కఠినమైన భాష లేదు. అక్కడక్కడా కొన్ని చరణాలు మాత్రమే ఇలా ఉన్నాయి. ‘మరో ప్రస్థానం’ లోని ‘రaంరa’ కవిత చాలా తేలికైన భాషలో
‘‘ఘోషించాను / మంచిగా ఉండండర్రా అంటూ
గోల పెట్టాను / అమాయకుల జోలికి పోకండర్రా అంటూ’’
అని మొదలవుతుంది. చివరికొచ్చే సరికి ఆవేశం ఎక్కువై తనకు మంచినీళ్ళ ప్రాయమైన కావ్యభాష వచ్చేసింది.
‘‘గేయాలలో వ్యావహారిక భాషను చక్కగా ఉపయోగించిన వారిలో అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు మొదలైన వాళ్లను చెప్పుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ కూడా తన ‘కిన్నెరసాని’ పాటలలో చాలా భాగం వ్యావహారిక భాషనే ఉపయోగించాడు.’’ (కె.కె.ఆర్.)
‘‘చేతులారా తాను / చేసుకున్నానని
ఇంతి కిన్నెరసాని ఏడ్చినా ఏడ్పులో
సుదతి కిన్నెరసాని చూపినా దు:ఖమూ
అవి కూడ జలములై ఆమెలో కలిసినై’’
విశ్వనాథ కవిత్వంలో అందరికీ అర్థమయ్యేవి ఈ కిన్నెరసాని పాటలే. ఇక్కడ యింతి, సుదతి లాంటి పదాలు, జలములై లాంటి మువర్ణాంత పదాలు గ్రాంథిక భాషలో కనిపించేవి. జలములై, కలిసినై అనడంలో ఒక రకమైన శబ్ద సౌందర్యం వచ్చింది. ఏడ్చినా ఏడ్పులో, చూపినా దు:ఖమూ అనే మాటలు గ్రాంథికమూ కాదు, వ్యావహారికమూ కాదు. ఏడ్చినా, చూపినా, దు:ఖమూ ` ఇలా దీర్ఘాలు అయ్యడం లయకోసమే. వ్యావహారికంలో అయితే ఏడ్చిన ఏడ్పులో, చూపిన దు:ఖం అని ఉండాలి. కానీ అలా దీర్ఘాలు తియ్యడం లయకు అవసరం. ముఖ్యంగా పాటలలో ఇలాంటి దీర్ఘాలు వస్తుంటాయి. ఈ దీర్ఘాలు కృత్రిమమే అయినా, పాటలలోని సంగీతానికి ఇవి చాలా అవసరం. పైగా పాడేటప్పుడు ఆ దీర్ఘాలు కృత్రిమంగా అనిపించవు.
ఎంకి పాటలు రాసిన నండూరి సుబ్బారావు పామర మాండలికంలోని కొన్ని పదాలు వాడినా, ‘‘ఎంకి పాటలలోని భాష ఒక మాండలిక భాషకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పటానికి వీల్లేదు’’ అన్న కె.కె.ఆర్. మాటలు పూర్తి సత్యాలు. ఎంకి పాటల్లో మాండలిక భాషగా భ్రమ కొల్పేది ఒక కృత్రిమ మాండలికం. అయినా ఆ పాటల భాషలో ఒక అందం, ఒక సున్నితత్వం, ఒక సొగసు అన్నీ కనిపిస్తాయి.
‘‘యెనక జన్మంలోన యెవరమోనంటి
సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి’’
ఇలా సాగే ఈ పాటలో నాయుడు బావ భాషలో మాట్లాడితే, ఎంకి నవ్వడం, తెల్ల తెలబోవడం, కంట నీరెట్టడం మొదలైన శారీరక చర్యల ద్వారా సమాధానం చెప్పడం వల్ల అదనపు కవితా సౌందర్యం వచ్చిందని ఒక వ్యాసంలో చేకూరి రామారావు అంటాడు. అంటే భాష ద్వారా చేసే భావ ప్రకటనతో బాటు భాషేతర భావ ప్రకటన కూడా ఉండడం వల్ల ఎంకి పాటలలోని కవిత్వపు విలువ పెరిగిందన్న మాట. అయితే ఏ రచయిత అయినా ప్రత్యేకమైన కృషి చేసి తనకు తెలియని మాండలికంలో కవిత్వం రాయడం కన్నా, గద్దర్ లాగా ఆ మాండలికం పైన ప్రత్యేకమైన అధికారం ఉన్నప్పుడే అలాంటి రచనలు చెయ్యడం మంచిదని కె.కె.ఆర్. ఖండితంగా ప్రకటించాడు. అంతేకాదు, ఎంకి పాటలలోని ఆలోచనలు, వ్యక్తీకరణలు పామర జనానికి దగ్గరగా వెళ్ళేవి కావనీ, చదువుకున్న వాళ్ళు సాహిత్యంలో మాత్రమే ఎంకి పాటలకు స్థానం ఉందనీ అన్నాడు.
‘‘వచన కవిత్వంలో కూడా గ్రాంథిక వాసనలను, పలుకుబడులను వదల్లేకపోవటం, అంత్యప్రాసల క్రీడలను వదులుకోలేకపోవటం కొందరు కవుల్లో కనిపిస్తుంది.’’ (కె.కె.ఆర్.)
వచన కవిత్వంలో గ్రాంథిక వాసనలు పూర్తిగా వదులుకోవడం మంచిదే. అంత్య ప్రాసల్ని కృత్రిమంగా అతికించినట్టు గాకుండా భావస్ఫోరకంగా సహజంగా ఉపయోగిస్తే నిరాకరించాల్సిన అవసరం లేదు. మరి పలుకుబడులను వచన కవిత్వంలో వాడకూడదనడం ఎందుకో మింగుడు పడడం లేదు. నిజానికి పలుకుబడులు, జాతీయాలు, సామెతలు, నానుడులు మొదలైనవి భాషకు ప్రాణంలాంటివి. పద్యాల్లో, గేయాల్లో కన్నా వీటిని వచన కవిత్వంలోనే సహజంగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కె.కె.ఆర్. ఉదహరించిన ఈ కాళోజీ కవితను చూడండి `
‘‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు / ఏ పాటి వాడో చూడు
ఎన్నుకుంటే వెలగబెట్టటం కాదు / ఇందాకా ఏం చేశాడో చూడు’’
(తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!)
ఇందులో ‘‘వెలగబెట్టటం’’ అనేది ఒక పలుకుబడి. ఈ మాటను తీసేసి వేరే ఏ మాట పెట్టినా కవి ఉద్దేశించిన భావస్ఫూర్తి రాదు. గ్రాంథిక వాసనలుండడం కావ్య భాషా ప్రభావమేగాని, పలుకుబడులు అనేవి గ్రాంథిక వాసన ఉన్నవి కావు. కాళోజీ ఒక సందర్భంలో భాషను రెండు రకాలని చెప్పాడు ` ఒకటి పలుకుబడుల భాష, రెండు బడి పలుకుల భాష అని. కాళోజీది పలుకుబడుల భాష అని వేరే చెప్పాల్సిన పని లేదు.
మూడు కాళ్ళ ముసలి, ఒళ్ళు మండుతోంది, కడుపుమంట, వెన్నతో పెట్టిన విద్య ` ఇలాంటి పలుకుబడులు తెలుగు భాషలో వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిని పద్యాలలో, గేయాలలో కన్నా వచన కవితలలో స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. పలుకుబడి అంటే రెండు మూడు పదాలు కలిసి ఒక పదబంధంగా ఏర్పడి, ఆ మాటాలతో సంబంధం లేని ఒక విశిష్టార్థాన్నిచ్చేది. సాంప్రదాయిక వ్యాకరణాల్లో వీటిని శబ్ద పల్లవాలన్నారు. ‘తెలుగు పలుకుబడులు’ అనే పేరుతో తాపీ ధర్మారావు ఒక పెద్ద వ్యాసమే రాశాడు. తెలుగులో మహాకవులు పద్యాల్లో వీటిని ఎలా ఉపయోగించుకున్నారో సోదాహరణంగా వివరించాడు. ‘‘జన సామాన్యమున ప్రచారంలో ఉన్న పలుకుబడులు శక్తిమంతములు. వాటికి ప్రసిద్ధమైన రూపు, నిర్దిష్టమైన జీవం ఉంటుంది. వాటిని ఉచితాజ్ఞతతో ప్రయోగించినపుడు రచన అర్థ గౌరవం గలిగి రసవంతంగా ఉంటుంది. వాటి సాయంతో సిద్ధహస్తులు చక్కని శ్లేషలనల్లి తలలూపించే రచనలు చేసి కీర్తినార్జించగలిగారు’’ ` అని ఆయనన్న మాటలు అక్షర సత్యాలు. మరి అలాంటప్పుడు గ్రాంథిక వాసనలతో బాటు పలుకుబడులను అదే గాటకట్టి వాటిని వదిలించుకోవాలనుకోవాలనడంలో కె.కె.ఆర్. ఆంతర్యం అర్థంగావటం లేదు.
‘‘సృజనాత్మక సాహిత్యంలో భాషా విషయకంగా నియమాలు, నిబంధనలు అనవసరం’’ అని కె.కె.ఆర్. చేసిన మరో ప్రతిపాదన కూడా సార్థకమైనదిగా కనిపించడం లేదు. భాషకు సంబంధించిన ఎటువంటి నియమాలు, నిబంధనలు అనవసరమైనవో ఆయన వివరించలేదు. ప్రాచీన కావ్య భాషలో ముఖ్యంగా పద్య స్వరూపం గురించిన నియమాలున్నాయి గాని, వ్యావహారిక భాషలోను, మాండలిక భాషలలోను అలాంటి కఠిన నియమాలు లేవు. అయితే అసలు ఏ భాషకు సంబంధించి అయినా మౌలిక నియమాలు కొన్ని ఉంటాయి. అవి ముఖ్యంగా వాక్య నిర్మాణానికి సంబంధించి, అవి లేకపోతే అది భాషే కాకుండా పోతుంది. ‘నేను రేపు వచ్చాను’ లాంటి వాక్యాలు కవిత్వంలో కూడా పనికి రావు గదా! కర్త లేని వాక్యాలు, క్రియ లేని వాక్యాలు ఉండొచ్చుగాని, ఒక వాక్యంలో కర్త, క్రియ రెండూ ఉన్నప్పుడు వాటి మధ్య ఉండవలసిన సంబంధం ఉండి తీరాలి ` అది గ్రాంథికంలో అయినా, వ్యావహారికంలో అయినా, మాండలికంలో అయినా. ‘‘జనం కోసం గేయ ప్రక్రియలను, జానపద బాణీలను చేపడుతున్న సమయంలో భాషా విషయకంగా మాండలికాలను స్వేచ్ఛగా ఉపయోగించగలిగిన అవకాశం ఉండాలి’’ అనే సందర్భంలో కె.కె.ఆర్. పై మాటన్నాడు. సాహిత్యంలో మాండలికాలను ఉపయోగించకూడదని ఆధునికులు అనడం లేదు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలం నుండే కథల్లో, నవలల్లో మాండలికాలను వాడుతున్నారు. ఆ తర్వాత కవిత్వాన్ని కూడా మాండలికంలో రాసిన వారు కొందరు లేకపోలేదు. అంతెందుకు? 1934లోనే వేదం వెంకటరాయ శాస్త్రి ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ్య భాషను సాహిత్యంలో ఉపయోగించొచ్చని చెబుతూ ‘‘గ్రామ్య త్యాగి రూపకమే గ్రామ్య రూపకము, అశాస్త్రీయము, కురూపకము, గ్రామ్య గ్రాహియే అగ్రామ్యము, శాస్త్రీయము, సురూపకము’’ అన్నాడు. అంటే గ్రామ్య భాషను అవసరమైన పాత్రలకు కూడా వాడకుండా వదిలేసిన నాటకమే నిజానికి గ్రామ్య నాటకమనీ, అశాస్త్రీయమైనదనీ, దుష్టనాటకమనీ అన్నాడు. గ్రామ్యాన్ని గ్రహించిన నాటకమే అగ్రామ్య నాటకమనీ, శాస్త్రీయమైందనీ, మంచి నాటకమనీ కూడా అన్నాడు. ఆ రోజుల్లో గ్రామ్యం అనే మాట నిందా వాచకంగా ఉంది. అందుకే గ్రామ్యాన్ని గ్రహించిందే మంచి నాటకం అన్నాడు. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని గిడుగు, గురజాడలు ప్రారంభించకముందు రచయితలకు వ్యావహారికాన్ని ఉపయోగించడానికే జంకేవారు. ఇక గ్రామ్య భాష సంగతి చెప్పనవసరం లేదు.
కె.కె.ఆర్. అన్నట్టు మాండలికాలలో రచనలు చేస్తే అవి అన్ని ప్రాంతాల వారికీ అర్థం కావన్న అభిప్రాయం ఒకటి అన్నట్టు కనిపిస్తుంది. ఈ అభిప్రాయం ఉన్నమాట నిజమే. ‘‘గద్దర్, వంగపండు ప్రసాదరావు మొదలైన వారి రచనలు ప్రాంతీయ మాండలికాల్లో ఉన్నా మొత్తం ఆంధ్రదేశంలో జనాన్ని ఆకర్షిస్తున్నాయి’’ అని కె.కె.ఆర్. అన్నాడు. అలాగే రావిశాస్త్రి, బీనాదేవి, దాశరథి రంగాచార్య వంటి వారి రచనలు కూడా దీనికి నిదర్శనాలన్నాడు. ఇక్కడ పాటకూ, వచన ప్రక్రియలైన కథలు నవలలకూ ఉన్న తేడాను గమనించాలి. గద్దర్, వంగపండు కేవలం పాటల రచయితలు కాదు, వాగ్గేయకారులు. తాము కట్టిన పాటను జనం ముందుకొచ్చి పాడి వినిపించిన వారు. వారి పాటకు ఆట కూడా తోడయ్యింది. వారు పాడుతుంటే అదొక అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉండేది. కాబట్టి వాళ్ళు మాండలికంలో పాడినా, ఇతర మాండలిక భాషల వారికి కొన్ని పదాలు తెలియకపోయినా, వాచకాభినయం, ఆంగికాభినయం వల్ల ఇట్టే భావం అర్థమైపోతుంది. పాట రచయిత రాతతో పూర్తి కాదు. ప్రజల ముందు పాడినప్పుడే దానికి సమగ్రత వచ్చినట్టు. ఒకసారి పాట విన్నాక, ఆ తర్వాత ఎవరికి వారు చదువుకున్న గద్దర్, వంగపండులు మనస్సులో ప్రత్యక్షమై వారే పాడి వినిపిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. అందువల్ల పాటల విషయంలో ఏ మాండలిక భాషా ఏ మాండిలికం వారికీ ఇబ్బంది కలిగించదు.
కానీ కథలు నవలల పరిస్థితి వేరు. రావిశాస్త్రి ఉత్తరాంధ్ర మాండలికంలో రాసిన అందరూ వాటిని చదవడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది ఆయన పూర్తిగా మాండలికంలో రాయలేదు. పాత్రలకు మాత్రమే మాండలికాన్ని వాడారు. రచయిత కథనం అందరికీ తెలిసిన వ్యావహారికంలో ఉంది. వచ్చేడు, చేసేడు లాంటి క్రియా రూపాలు మాత్రమే రచయిత కథనంలో ఉన్న మాండలిక రూపాలు. రెండోది ఉత్తరాంధ్ర మాండలికం తెలంగాణా మాండలికమంత కష్టంగా ఉండకపోవడం. ఉత్తరాంధ్ర కూడా కోస్తాలో ఒక భాగమే గనక, కోస్తా భాష మొదట్నిండీ పత్రికల ద్వారా అందరికీ పరిచయమే గనక అది అంత ఇబ్బంది పెట్టదు. తెలంగాణా నిజాం పాలకుల పాలనలో ఉండడం వల్ల కోస్తా రాయలసీమలకు, తెలంగాణకు అనేక విషయాల్లో తేడాలున్నాయి. భాష విషయంలో మరీ. పైగా కథలు, నవలలు ఎవరికి వారు చదువుకోవాలి. పాటలలాగా ఎవరూ చదివి వినిపించరు. రావిశాస్త్రి రచనలు అన్ని ప్రాంతాల వారు చదివినట్టుగా అల్లం రాజయ్య నవలల్ని అన్ని ప్రాంతాల వారు బహుశా చదవకపోవచ్చు. జీవితాన్ని వడబోసి రాయడంలో అల్లం రాజయ్య రావిశాస్త్రి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. ఏ మాండలికమయినా ఆ మాండలిక ప్రజలు మాట్లాడుతుంటే వినేటప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎవరికి వాళ్ళు చదువుకునేటప్పుడే కొంతమందికయినా కొంత ఇబ్బంది ఉండడం సహజం. మాండలిక పదాలలోని ఉచ్ఛారణ స్వరబేధాల్నీ, యాసనూ ఇతర మాండలికాల వారు పూర్తిగా తెలుసుకుని చదువుకోవడం సాధ్యం కాదు. పాట పాడేటప్పుడు అవన్నీ గాయకుడి కంఠస్వరంలో వినిపిస్తాయి. కాబట్టి మాండలికంలో పాటలు వినడానికీ, కథలు నవలలు చదువుకోడానికీ ఈ తేడాను గుర్తించాలి.
ఎప్పటికయినా మాండలికాలన్నీ పర్యాయ పదాల కింద చలామణీ అయ్యే రోజు రావచ్చునని కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటల్ని కె.కె.ఆర్. ప్రస్తావించడం బాగుంది. దూర ప్రాంతాల మధ్య రాకపోకలు పెరగడం, అందరూ అక్షరాస్యులు కావడం, సాహిత్య పఠనం అందరికీ అలవాటవ్వడం మొదలయినవి జరిగితే ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఏనాటికయినా మాండలికాల మధ్య ఈ అంతరాలు తొలగిపోవాలంటే అదే పరిష్కారం.
జ్వాలాముఖి లాంటి కవుల్లో కూడా కఠిన పద బంధాలపైనా, దీర్ఘ సంస్కృత సమాస కల్పనలపైనా మోజు ఉండడం ఆశ్చర్యకరమైనదే కాదు, ఏ మాత్రం పనికి రానిది. ‘‘శత సహస్ర కిరణారుణ జ్వాలాతోరణ తూర్యారవాలు’’, ‘‘నాగరికతా జిజీవిష వర్ష ప్రహారాల్లో మత జిఘాంస ప్రచండ పద ఘట్టనలో’’, సుందర హర్మ్యాంతర్గత సుప్రీం ధర్మదేవత ధర్మ దర్శన శూన్యాలు’’ వంటి పద విన్యాసాలకు ఈ కవులు తామే స్వయంగా.
ఆధునిక తెలుగు కవిత్వంలో రూపభేదం భాషా భేదానికి ఒక ప్రధాన కారణం. పద్యం, గేయం, పాట, వచన కవిత ` ఈ నాలుగు రూప భేదాలు ఆధునిక కవిత్వంలో ఉన్నాయి. ఈ రూపాలకనుగుణంగా భాష అనివార్యంగా మారవలసిన పరిస్థితి ఉంది. ప్రాచీనకాలపు కావ్యాలలోని భాష ఆనాటి వ్యవహారంలోని భాష నుంచి ఏర్పడిరది కాదు. కావ్య రచన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కృత్రిమ భాష. కాని ఆధునిక రచనా భాష అలా కాదు. ప్రాచీన కాలం నుంచి ఉన్న రచనా సంప్రదాయం కంటే భిన్నంగా ఆధునిక వ్యవహారం నుంచి ఏర్పడిరది. అందువల్ల ఆధునిక కవిత్వంలో ప్రాచీన కావ్యభాష అవసరం లేనే లేదు. అయితే గేయాలలో, పాటలలో లయ ఉంటుంది కాబట్టి, లయకోసం ఎక్కడయినా గ్రాంథిక రూపాలు వాడవలసి రావచ్చు. వరవరరావు ఎన్నికల గురించి రాసిన పాటలో `
‘‘ఎన్నికలు ఎన్నికలు / ఎన్నిసార్లెన్నికలు
ఏండ్లు మారెను తప్ప ఏమి మారిందని’’
అంటాడు. ఇక్కడ ఒకే పాదంలో ‘మారెను’ అనే గ్రాంథిక రూపమూ, ‘మారింది’ అనే వ్యావహారిక రూపమూ ఉన్నాయి. కె.కె.ఆర్. అన్నట్టు ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కావచ్చు. ఇది లయబద్ధంగా ఉన్న పాట కాబట్టి లయ దెబ్బ తినకూడదు. ‘‘ఏండ్లు మారాయ్ తప్ప ఏమి మారిందని’’ అంటే పూర్తి వ్యావహారికం అవుతుంది. లయ కూడా సరిపోతుంది. కొంచెం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కొన్ని గ్రాంథిక రూపాల్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అదే వచన కవితలో అయితే కవికి పదాల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నిజానికి పూర్తి వ్యావహారికంలోనో, మాండలికంలోనో రాయడానికి గేయం కన్నా పాటలో ఎక్కువ అవకాశం ఉంది. అయినా కొన్ని పాటలలో ` ముఖ్యంగా సినిమా పాటలలో గ్రాంథిక రూపాలు తరచుగా కనిపిస్తుంటాయి. సంగీతానికనుగుణంగా ఉండడం కోసం అలా వచ్చి ఉండొచ్చు. లేదా గ్రాంథిక భాషా ప్రభావం వల్లనైనా వచ్చి ఉండొచ్చు. ‘‘సిరి సంపదలు’’ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘‘ఎందుకో సిగ్గెందుకో’’ అనా పాట మొత్తం మీద తీరెనని, మురిపించెను అనే రెండు మాటలే గ్రాంథిక రూపాలు. వ్యావహారికం ప్రకారం అయితే తీరాయని, మురిపించాయి అని ఉండాలి. అలా రాస్తే రాగం దెబ్బ తినే అవకాశం ఉండొచ్చు. సినిమా పాటలలో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చూపించకపోవచ్చు. తామే రాసి స్వయంగా పాడి వినిపించే గద్దర్, వంగపండు లాంటి వాగ్గేయకారులైతే వారి పాటల్లో గ్రాంథిక రూపాలు వచ్చే అవకాశమే లేదు. పాటల రచయితల్లో వాగ్గేయకారులకూ, కేవలం పాటల రచయితలకూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
‘‘కేవలం మానవతా దృష్టీ, అనుభూతి ప్రాధాన్యం, రొమాంటిసిజమ్ ఇవి కనిపించిన చోట్ల ఇలాంటి శైలి తిలక్‌లో కనిపిస్తుంది’’ (కె.కె.ఆర్.) ఇలాంటి శైలి అంటే ఆయన మాటల్లోనే దీర్ఘ సంస్కృత సమాసాలు, కృత్రిమ పదబంధాలు, ప్రబంధ వాసనలు. తిలక్ ‘ఆర్తగీతి’ని ఇందుకు ఉదాహరణగా ఇచ్చాడు.
‘‘నేను / చూశాను నిజంగా మూర్తీభవద్దైన్యాన్ని
హైన్యాన్ని / క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని
గచ్ఛచ్ఛవాకార వికారుల్ని’’
ఇలా సాగుతుంది ఈ కవిత. ఇది గేయం కూడా కాదు, వచన కవిత. ఈ వచన కవితలో మానవతా దృష్టీ, అనుభూతి ప్రాధాన్యం ఉన్న మాట నిజమే కాని, అవి ఉన్నంత మాత్రాన దీర్ఘ సంస్కృత సమాసాలు ఉండనక్కర లేదు. వాటికీ, వీటికీ అవినాభావ సంబంధం ఏమీ లేదు. సరళమైన భాషలో మానవతా దృష్టీ. అనుభూతి ప్రాధాన్యం ఎన్ని వచన గీతాల్లో లేవు? అయితే కె.కె.ఆర్. అన్నట్టుగా ఈ భాషలో ప్రబంధ వాసనలు ఉన్నాయనుకోవచ్చు. తిలక్ పూర్తిగా అభ్యుదయ కవీ కాదు, పూర్తిగా భావకవీ కాదు. పద్యాలూ, గేయాలూ రాసినా, ప్రధానంగా వచన కవిగానే కనిపిస్తాడు. భాష విషయంలో కేవలం ప్రబంధ శైలిపైన తిలక్‌కున్న అనురాగమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ‘‘గేయ కవిత్వంలోని నియమాల కనుగుణంగా ప్రాచీన భాష, నవీన భాష అనే భేదం లేకుండా గేయంలో ఇమిడే పద రూపాల్ని కవులు గ్రహించవలసి వచ్చింది’’ అని రంగనాథాచార్యులే ఈ వ్యాసంలోనే ఒక సందర్భంలో అన్నాడు గాని, వచన కవితలలో ఈ అవసరం ఉంటుందని ఆయనా భావించలేదు.
రంగనాథాచార్యులు గుర్తించిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కవిత్వంలోని వస్తు భేదం కూడా కొంత వరకు భాషా భేదానికి కారణం అవుతుండడం. వస్తువు పూర్తిగా ఆధునికం అయితే ` అందులోనూ ఇంకా విప్లవ కవితా వస్తువైతే దానికి తగిన భాషను ఎంచుకోవడం కవికి తప్పనిసరి. విప్లవోద్యమం కవితా వస్తువైతే ప్రబంధ భాష ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ‘‘భావకవితా యుగం నాటి గేయాలలో గ్రాంథిక భాష అధికారం చేసింది. విప్లవ గేయాలలో మాండలిక భాషా ప్రయోగం కనిపిస్తుంది. భావ కవితాయుగం గేయకవులు కావ్య భాషలో రూప వైవిధ్యాన్ని ఛందస్సుకనుకూలంగా వాడుకుంటే విప్లవ రచయితలు మాండలిక రూప భేదాల్ని గేయ ఛందస్సుకనుకూలంగా వాడుకుంటున్నారు. ఈ రెండు రకాల గేయ రచనలలోని భాషా భేదానికి వస్తువు కూడా కారణమే.’’ (కె.కె.ఆర్.)
నిజానికి వస్తువే తనకు అవసరమైన భాషను, రూపాన్ని, శిల్పాన్ని ఎంచుకుంటుంది. అప్పడే వస్తువు శిల్పాల మధ్య మధ్య ఐక్యత ఉంటుంది. అలా ఉంటేనే ఆ కవిత్వం ఉత్తమ స్తాయికి చెందినది అవుతుంది. మహాప్రస్థాన గీతాల్ని పద్యాల్లో రాస్తే చదవగలమా? ఎంకి పాటల్ని వచన కవితల్లోకి మారిస్తే బోధించగలమా?
కెకెఆర్ గేయాలకు అన్వయించి చెప్పిన ఈ భాషా భేదం పద్యం, పాట, వచన కవిత మొదలైన అన్ని కవితా ప్రక్రియలకు అన్వయించదగినదే.
ప్రతిభావంతులైన కవుల్లో కూడా భాష విషయకంగా ఏక రూపత కనిపించదని భాషా రూపాల మిశ్రమం వారి రచనల్లో కనిపిస్తుందని కెకెఆర్ అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. శివసాగర్ * కుట్రదారు వాగ్మూలం* అనే కవితలో..
*న్యాయ మూర్తులుంగారూ \సూర్యోదయం కాదు
నిండు చూలాలి ప్రసవ వేదన కుట్రేనంటారా?
చరిత్ర రథ గమనాన్ని ఏమంటారు?*
అని చక్కని వ్యవహారికాన్ని ఉపయోగించాడు. అయితే ఆయనే రాసిన *రుతు సంగీతం* అనే కవితలో..
*ఓల్గా ఘనీభవించెను\ యాంగ్సీ నది పొందెను
హోరు హోరు హోరుగా\ హొయలు హొయలు హొయలుగా
బిగియించిన పిడికిట్లో\ సూర్యుడు ఉదయించెను*
అని గ్రాంథిక రూపాలను ఉపయోగించాడు. అయితే దీనికి ఒక కారణం లేకపోలేదు. ఇది ఇంతక ముందు ఉదహరించిన కవితలాగా పూర్తిగా వచన కవిత కాదు. కొన్ని చరణాలు వచనంలో ఉన్నట్లు కనిపించినా, మొత్తం మీద గేయ రూపాన్ని సంతరించుకుంది. గేయం అనేసరికి లయ ఉంటుంది. అంటే మాత్రా ఛందస్సు అనివార్యం అవుతుంది. అందు కోసం కొన్ని గ్రాంథిక రూపాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. పై గేయాన్ని ఈ కింది విధంగా వ్యవహారికంలోకి మార్చి చూద్దాం.
ఓల్గా ఘనీభవించింది\ యాంగ్సీ నది పొంగింది
హొరు హోరు హోరుగా \ హొయలు హొయలు హొయలుగా
బిగించిన పిడికిట్లో\ సూర్యుడు ఉదయించాడు
ఇందులో గ్రాంథిక రూపాలేవీ లేవు. అయితే *బిగించిన* అనే సరికి లయ దెబ్బతిన్నది. *బిగియించిన* అంటేనే లయ సరిపోతుంది. అందువల్ల గేయానికి ఉండే మాత్రా ఛందస్సు లేదా లయ అనివార్యంగా కొన్ని గ్రాంథిక రూపాలను ఆశ్రయిస్తుంది. అయితే అసలు గ్రాంథిక రూపాలే లేని కొన్ని గేయాలు లేకపోలేదు. 1990లో పాతికేళ్ల వయసులో కోలపూడి ప్రసాద్ (కోప్ర) రాసిన *ఉరితీస్తే.. ఉరికొస్తాం* అనే ఈ గేయం చూడండి.
*మా ఊపిరి సంద్రం అల\ఆపటం నీ పగటి కల
ఉరితీస్తే ఉరికొస్తాం\బలి చేస్తే బతికొస్తాం
పాతేస్తే మొలకొస్తాం\పారే నీట తేలి వస్తాం
అణచివేత అనాదిగా\ ప్రతిఘటనకు పునాది
సలామన్న బతుకుల్ని\
పల్లె నడుగు తల్లి నడుగు\ తిరగబడ్డ గల్లీ నడుగు
కొండ నడుగు కోననడుగు\ కమ్ముకున్న తండ నడుగు
యతలు యతలు\ బతుకు యతలు
యతలు పోవు\పోరు కదులు
ఇది పూర్తి గేయం. మాత్రా ఛందస్సును పాటించాడు కవి. గ్రాంథిక రూపాలు లేకుండా, లయ తప్పకుండా రాసినట్లు కనిపించే ఈ గేయంలో కూడా రెండు మూడు చిన్న పొరబాట్లు ఉన్నాయి. అన్ని చరణాల్లోనూ 12 లెక్కన మాత్రలు సరిపోయాయి కాని, *ప్రతిఘటనకు పునాది* అన్న పాదంలో 10 మాత్రలే ఉన్నాయి. *ఆపడం మీ పగటి కల* అన్న పాదంలో 12 మాత్రలు ఉన్నాయి. కానీ లయ కుదరలేదు. *వెతలు పోవు పోరు కదులు* అన్నచోట పోవు అనేది వ్యవహారికం కాదు. గ్రాంథికం. వ్యవహారంలో పోయే అని ఉండాలి. అలా ఉంటే ఒక మాత్ర పెరిగి లయ దెబ్బతింటుంది. ఈ చిన్న లోపాలు అంతగా పట్టించుకోదగినవి కాదు.
1992లో ఉదయ్ రాసిన ముంపు పాట. ఇది గేయం కాదు పాట. బాగా రాసిన పాట అనే విషయంలో సందేహం లేదు. అయితే కవికి తెలియకుండానే కొన్ని గ్రాంథిక రూపాలు దొర్లాయి- , చిట్లెనే (చిట్లెను+ఏ), పోసిరే(పోసిరి+ఏ), కడిగిరే(కడిగిరి+ఏ), పొడుచునే(పొడుచును+ఏ) పాడేటప్పడు లయ దెబ్బతినకుండా వీటిని వ్యవహారికంలోకో, మాండలికంలోకో సులభంగా మార్చవచ్చు.
ఉన్నది
మార్చింది
నీ శిరసు చిట్లనే సిలకా నీ శిరసు చిట్లిండే సిలకా
మన్నెవరు బోసిరే సిలకా మన్నెవరు బోసిండ్రే సిలకా
మాయెవరు కడిగిరే సిలకా మాయెవరు కడిగిండ్రే సిలకా
ఆనాడు పొడుసునే సిలకా ఆనాడే పొడుసుద్దె సిలకా
దీన్నిబట్టి పాటలు రాసేటప్పడు కాస్త జాగ్రత్త తీసుకుంటే గ్రాంథిక రూపాలు దొర్లకుండా ప్రయత్నించవచ్చని అర్థమవుతుంది.
ఇక హ్రస్వాచ్చుల్ని దీర్ఘాచ్చులుగా, దీర్ఘాచ్చుల్ని హ్రస్వాచ్చులుగా పాడటాన్ని అందరూ అంగీకరించిందే. అది పాడేటప్పడు రాగంలో కలిసిపోతాయి.
భాషా శాస్త్రం ప్రకారంగా అచ్చుల హ్రస్వాలకు, దీర్ఘాలకు సాపేక్షిక విలువలేగాని నిర్దిష్టంగా నిర్ణీతమైన ప్రమాణాలేవీ లేవని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. రచయితలకు, పాఠకులకు అర్థమయ్యే విధంగా హ్రస్వ దీర్ఘాల విలువల్ని నిరూపిస్తూ భాషాశాస్త్రవేత్తలెవరూ రాసినట్లు లేదు. చేకూరి రామారావు మాత్రం ఒక వ్యాసంలో ఈ విషయాన్నిస్పృశించి వదిలేశాడు. కొన్ని చోట్ల హ్రస్వం అనుకున్నది దీర్ఘం అనుకొనే వాటికన్నా దీర్ఘంగా ఉండవచ్చని, దీర్ఘస్వరం(పిచ్)తో కూడా కలిసి రావచ్చని ఆయన అంటాడు. తెలుగు వ్యాకరణాల్లో హ్రస్వ దీర్ఘాలు రెండిటినీ చెప్పారు గాని సంస్కృత వ్యాకరణంలో *ప్లుతం* అనే మూడో బేధాన్ని కూడా చెప్పారు. ఒక క్షణ కాలంలో పలికేది హ్రస్వం అని, రెండు క్షణాల కాలంలో పలికేది దీర్ఘం అని, మూడు లేదా అంతకంటే ఎక్కువ క్షణాల్లో పలికేది ప్లుతం అని అన్నారు. అంటే దీర్ఘం కంటే పైన ఎంత సేపు దీర్ఘంగా పలికినా అదంతా ప్లుతమే అన్నారు. సంబోధనలో పేరుకు ముందు *ఓ* అనే దీర్ఘాచ్చును పలుకుతాం. దాన్ని దీర్ఘాన్ని నిర్దిష్టంగా కొలవలేం. పిలవబడే వ్యక్తి ఉండే దూరాన్ని బట్టి సంబోధనలోని దీర్ఘాన్ని రెండు క్షణాల నుంచి ఎంత దీర్ఘంగా అయినా ఉండవచ్చు. పద్యాలు పాడేవారు పది నిమిషాల సేపైనా సుదీర్ఘంగా రాగం తీయడం మనకు తెలిసిందే. పద్యం పాడటం ఒక ఎత్తయితే ఆ రాగం తీయడం ఒకెత్తుగా భావించి పద్యంలోని చివరి స్వరాన్ని దీర్ఘంగా సాగదీసి చప్పట్లు కొట్టిచ్చుకున్న ప్రసిద్ధ పద్య గాయకులు ఉన్నారు. పద్యం కన్నా పద్యంలోని భావం కన్నా చివరికి తీసే రాగాన్నే ఆనందించే పద్య నాటక ప్రేక్షకులు ఉన్నారు. అచ్చుల హ్రస్వ దీర్ఘాలతోపాటు స్వరం(పిచ్), యాస మొదలైనవాటి గురించి చెప్పడం కష్టం. అందుకే కాబోలు కెకెఆర్ అచ్చుల ఉచ్చారణలోని ఈ వైవిధ్యం జోలికి వెళ్లలేదు. వెళ్లే అవకాశం కూడా లేదు. భాషా శాస్త్రం దీని గురించి వివరంగా చర్చించి నిగ్గుదేల్చేదాకా(ఆ అవకాశం ఉందో లేదో తెలియదు) సాహిత్య విమర్శకులు పాటల, పద్యాలలోని స్వరోచ్చారణ గురించి మాట్లాడటం సాధ్యం కాదు.
రంగనాథాచార్యుల సాహిత్య విమర్శ విశ్వరూపం అందరికీ తెలిసిందే. కవిత్వంలోని భాష గురించి ఒక్క వ్యాసంతో ఎన్నో కొత్త ఆలోచనలు రేకెత్తించిన ఆయన పరిశీలనలను చర్చించి పాఠకుల ముందు ఉంచడమే నా ఈ ప్రయత్నం.
(రంగానాథాచార్యుల పేరుకు ముందు రెండు కె లు ఉన్నాయి. ఆయన పూర్తి పేరు కోయిల్ కొందాడై రంగనాథాచార్యులని ఇటీవల పిల్లల మర్రి రాములు రాసిన వ్యాసం ద్వారా తెలిసింది. )