మా నాయన చెమటలు కార్చుకుంటా గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు.
ఊసురోమని ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు.
పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి “ జయమ్మక్కా… ఏo చేసేది ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు) వుంటాయి. ఆ మూడూ కలిపి ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు ఎప్పుడూ చూసిందే లేదు. మా నాయన రూపాయి రూపాయి కూడబెట్టి ఇదారేళ్ళకు అప్పుడు ఒకటి, అప్పుడు ఒకటి కష్టపడి చేపించిన సొత్తులు అవి.
మా ఇంట్లో ఏ గ్లాసు చూసినా, ఏ ప్లేట్ చూసినా, మంచం, టేబుల్ చూసినా, మేము చదువుకోవడాని రాసుకోవడానికి చేయించిన ఒకప్పుడు కరణాలు వాడే చెక్క డస్కులు చూసినా..ఎప్పుడూ మాకు మా నాయన చెమటా , రక్తమే.. గుర్తుకు వస్తాయి. మేము తినే ప్రతి అన్నంముద్ద పైనా అయన చెమట, రక్తం వుంటాయి అనేది మా అమ్మ. అందుకే ఇప్పటికి మేము తినే ప్రతి అన్నంముద్దకు ముందు మా అమ్మా నాయనా గుర్తుకు రాకుండా వుండరు.
మా యస్టీ కాలని లోనే అదెందుకో తెలియదు కానీ ఎవరికి ఏo కష్టం వచ్చినా ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది మా అమ్మే.. జయమ్మే..! అట్లా అని మేo ఏమీ బాగా వుండే వాళ్ళం కాదు. మా నాయన ఒక్కడే చిన్న జీతగాడు. ఇల్లు మొత్తానికి మా నాయన జీతమే ఆధారం. అందునా మా నాయనకు జీతం చాలా తక్కువ. లంచాలు , మామూల్లు తీసుకునే మనిషి కాదు . దానికి తోడు ఆయన వైద్యం కోసం చాలా ఊర్లు, ఆస్పత్రులు తిరగాల్సి రావటంతో చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. చాలా కష్టాలతోనే మా బాల్యం గడచింది.
సెలవుల్లో నన్ను మాయమ్మ కూలి పనులకు పంపేది.కూలి పనులంటే పెద్దగా కాయకష్టంతో కూడిన పనులు కావు, చింతపండు తొక్కు తీయడం గింజలు వేరుచేయడం , వేరుసెనగకాయలు వల్చడం లాంటి పనులు.ఒక్క రూపాయి ఎంత కష్టపడితే వస్తుందో పిల్లోల్లకి తెలియల్ల కదా చిన్నప్పటి నుంచే అనేది. ఆయమ్మ మాటకు మా ఇంట్లో అడ్డం చెప్పే వాళ్ళు ఎవురుoడారు? నన్ను మా తమ్ముడిని కొట్టినప్పుడు , దండిoచినప్పుడు మేము గట్టిగా ఏడిస్తే ఆయమ్మ శబ్దం రాకుండా మౌనంగా ఏడ్చేది. మా ఏడుపు కళ్ళతో ఆయమ్మను కోపంగా చూస్తామా ..ఆమె కళ్ళనిండా నీళ్ళు కనపడేవి. మమ్మల్ని కొట్టి ,ఆయమ్మ ఎందుకు ఏడ్చెదో అప్పట్లో మా అన్నతమ్ముల్లకి అర్థం అయ్యేది కాదు.
ఎవరైనా మా అత్తలో పిన్నమ్మలో, పెద్దమ్మలో పసికందలు కదమ్మా చింతబర్రతో నువ్వు కొట్టేది ఎందుకు? మళ్లిoకా నువ్వు ఏడ్చేది ఎందుకూ అని వ్యంగ్యంగా అంటే, ఆమె ముక్కు చీదుకుంటా, చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటా “ మొక్కగా వుండగానే వంచాలమ్మా మాను అయినాక వంగు అంటే వంగుతుందా యాడన్నా” అనేది. అదంతా అయిపోయాక, మాకు అన్నం కలిపి తినిపిస్తా బుద్ధి మాటలు, నీతి కథలు చెప్పేది.అట్లా ఎన్నిసార్లు ఆమె ఎన్నెన్ని మాటలు, నీతి కథలు చెప్పిందో లెక్కే లేదు.
మేం ఇంట్లో వున్నప్పుడు రోజంతా నిద్ర లేచిoదగ్గర నుంచి, మేo పడుకునేదాకా మాయమ్మ మాతో ఎన్నో మాటలు మాట్లాడేది,ఎప్పుడూ మంచి ఏమిటో , చెడు ఏమిటో చెపుతూనే ఉండేది.ఆయమ్మ బాగా పుస్తకాలు చదివేది కదా అందుకే అన్ని మాటలు, కథలు నేర్చి ఉంటుందని మేమంతా అనుకునే వాళ్ళం.
ఫారెస్ట్ డిపార్టుమెంటులో ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం టార్గెట్ వుంటుంది. అడవిలో మేతకు వెళ్ళే పశువులపైనా , కట్టెలు కొట్టే వాళ్ళ పైనా పన్నులు, అపరాధాలు వుంటాయి. అడవి నుండి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మే వాళ్ళ నుండి అపరాధరుసుం వసూలు చేసి గవర్నమెంట్ కు చలాన్ కట్టాలి. ఆ చలాన్ కట్టాల్సిన మార్చ్ నెల వచ్చిందటే చాలు మా అమ్మ మొహంలో కళ తప్పిపోయేది. ఎందుకంటే ఆ నెల మా నాయన జీతo తీసుకుని, ఆయనకు వాళ్ళ పై ఆఫీసర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారం తను వసూలు చేసి ఉండాల్సిన టార్గెట్ ఎంతో అంత మొత్తం అపరాధo కింద ఆయన జీతం మొత్తం ప్రభుత్వానికే కట్టేసే వాడు.చాలనిదానికి వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే ఎవరివద్ద అయినా వడ్డీకి అప్పు తీసుకునే వాడు.
“ మేయ్ జయా.. ఈనెల ఇంకా జీతం రాలేదు. లేట్ అవుతుంది, ఎట్లో నువ్వే ఈనెల సర్డుకోవల్ల ” అనే వాడు కుశాలగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ..ఆయనకి కానీ మా అమ్మకి కానీ అపద్దాలు చెప్పేది తెలియదు. ఏది ఎట్లున్నా మాకు ఎప్పుడూ వాళ్ళు అపద్దాలు చెప్పిందే లేదు.నిజాలే చెప్పేవాళ్ళు. మాకూ అపద్దాలు చెప్పే అలవాటూ అందుకే రాలేదు.
ఒక నెల జీతం రాకపోతే అప్పో సప్పో చేసి ఇల్లు గడుస్తుంది కానీ , ఆరునెలలు పడుతుంది ఆ అప్పు వడ్డీ అంతా తీరి సరిగ్గా కుదురుకోవడానికి. “ ఏం చేసేదమ్మా ఖర్మ..అందర్లాగా కాదు, మా ఆయన పదకొండు నెలల జీతగాడు” అని మాత్రం అనేది మా అమ్మ. మా నాయనకు మాయమ్మ చేతుల్లో జీతం డబ్బు పెట్టేయడమే తెలుసు. ఇంకేం తెలియదు.బీడిలు, టీలు తాక్కుంటా ఉండిపోతే సంసారం అంతా మాయమ్మే చూసుకునేది.
అయితే మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ఎప్పుడైనా సరే ఆయన వచ్చే సమయానికి ఇంట్లో మా అమ్మ ఉందంటేనే ఆయన ఇంట్లోపలకి వస్తాడు. మా అమ్మ ఇంట్లో లేదంటే, ఇంటి బయటే అరుగు పైన కూర్చునేస్తాడు. నేను, మా తమ్ముడు ఇద్దరం ట్యూషన్ కి వెళ్లి ఉంటే, ఇంటి బయట మా అమ్మ తలుపుకు చిలుకు(గొళ్ళెం) పెట్టి వెళ్లి ఉంటుంది. చుట్టూ పక్కల ఇండ్లకు వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి ఎప్పుడూ తాళం వెయ్యదు. ఆమెకు తాళంవేసి వెళ్లే అలవాటు లేదు.
ఎస్టీ కాలనీలో మా బంధువుల ఇండ్లన్నీ పక్క పక్క లోనే, కొంచెం ముందూ వెనకా ఉంటాయి. ఇంటికి అటూ ఇటూ ఉన్న వాళ్ల ఇళ్లకు వెళ్లి రావాలంటే తాళం వేసి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని మా అమ్మ అoటుంది.
మా నాయనకు ఆమె లేకుండా ఇంట్లోపలకి వచ్చే అలవాటు లేదు.ఇంటికి రాగానే మాయమ్మ ఇంట్లో లేదంటే ఆయమ్మ కోసం ఎదురుచుస్తా మా నాయన మా ఇంటి బయటే కూర్చునేస్తాడు. మూడో నాలుగో బీడీలు ఊది పారేస్తాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోయి ఉంటాడు. ఒళ్లంతా చెమటలు పట్టి ఉంటుంది. అడవి అంతా తిరిగి వచ్చినా, చెక్ పోస్టులో డ్యూటీ చేసి వచ్చినా , అటవీశాఖ ఉద్యోగిగా ఆయనకు శారీరక శ్రమ ఎక్కువ. అందునా డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా బస్సు ఎక్కి ఇంటికి చేరడు కదా .
బస్సు చార్జీలకోసం డబ్బు ఖర్చుపెట్టడం ఆయనకు నచ్చదు కదా, ఖర్చు లేకుండా ఫ్రీగా లారీలోనే ప్రయాణం చేసి వస్తాడు. ఆ మిగిలిన డబ్బులకి ఏ పండో , స్వీటో, జనరల్ నాలెడ్జ్ పుస్తకమో ఏదో ఒకటి మాకోసం తెస్తాడు కదా. ఖాకీ బట్టలు వేసుకుని ఫారెస్ట్ చెక్ పోస్టులో ఆయన చేయి ఊపితే చాలు, ఏ లారీ అయినా ఆగిపోవాల్సిందే. ఆయన లారీలో చాలా దూరం ప్రయాణించటం వల్ల, బస్టాండ్ వద్ద లారీ దిగిన తర్వాత ఆయన బరువైన బ్యాగ్ మోసుకుంటూ చాలా అలసిపోయి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వస్తాడు.అప్పటికే అయన బాగా అలసిపోయివుంటాడు. వయసు కూడా ఎక్కువ కాబట్టి, దగ్గు, ఆయాసం, ఉబ్బసం వల్ల అయన అప్పటికే గసపోస్తా ఉంటాడు.
అంత అలసిపోయి ఇంటి ముందుకు రాగానే, తలుపులు మూసి ఉండటం గొళ్ళెం పెట్టి ఉండటం చూడగానే ఆయనకు ప్రాణం ఉస్సురుమంటుంది. ఎక్కడలేని నీరసం ముంచుకు వస్తుంది. విపరీతంగా కోపం వస్తుంది. మా నాయనకు అట్లా ఇంటికి ఆమె తాళం వేయకుండా వెళ్లడం అస్సలు నచ్చదు.ఆయన వచ్చే సమయానికి మాయమ్మ ఇంట్లో లేకపోవడంతో ఎప్పుడూ పెద్ద గొడవ మొదలవుతుంది. తను ఇంటికి వచ్చే సమయానికి, మాయమ్మ ఇంట్లో లేకపోవడం, ఆయనకు కోపం వచ్చే సవాలక్ష కారణాలలో ముఖ్యమైoది.ఆయనకు అసలే కోపం ఎక్కువ. ముక్కు మీదే వుండి, పిలిచీ పిలవగానే గభాలున వచ్చేస్తుంది కోపం.
మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది..” నీ కేమబ్బా.. ఊరికే ఊరికేనే కోపం వచ్చేస్తుంది.అయినా చీమ చిటుక్కుమన్నా కోపం వచ్చే ఇలాంటి ఆగింతం మొగవాడ్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మొగుడు ఇంట్లో కూలి డబ్బులు అస్సలు ఇయ్యడమే లేదంటే , పిలకాయలు ఆయమ్మ పస్తులు ఉండారంటే ఆ కతేందో మాట్లాడదామని మా ఆడబిడ్డ పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయింటిని అది కూడా తప్పేనా..సామీ…” అని దీర్ఘాలు తీస్తుంది.
చాలాసార్లు నెమ్మదిగానే తన గైర్హాజరికి మెత్తగానే జవాబు చెపుతుంది కానీ ఒక్కోసారి మా అమ్మకు కూడా ఉన్నట్టుండి కోపం ముంచుకు వచ్చేస్తుంది.
“ఇప్పుడు ఏమైందని అంత ఆగింతం చేస్తా ఉండావు? ఇంట్లో లబ్బి ఏమైనా పెట్టిండావా? బంగారం ఉందా? వెండి ఉందా? దుడ్లు ఉండాయా? ముడ్డి చుట్టూరా ముప్ఫయిఆరు అప్పులు పెట్టుకొని బతకతా ఉంటే ఎవురో వస్తారంట..ఈడుండే సొత్తు కోసం సామాన్ల కోసం..”.
ఆమె కోపంగా చెప్పినా, ముక్కు చీదతా చెప్పినా, కరుగ్గా చెప్పినా, ఏడుపు గొంతుతో చెప్పినా మా నాయనకి ఆమె ఎప్పుడు ఏం చెప్పినా నచ్చేది కాదు.కానీ ఆమెకు బదులు చెప్పేవాడు కాదు.ఆయనకు ఎంత కోపం వున్నా సరే, ఆమెకు కోపం వచ్చినప్పుడు ఆయన పూర్తిగా తగ్గిపోయేవాడు. అట్లా ఆయన తగ్గిపోవడమే వాళ్లిద్దరి అన్యోన్యతకి కారణమేమో .
“మొగోడు అన్యంక చిలుకు తీసి తలుపు తోసి లోపలికి పోయి, బ్యాగు ఆ పక్కనేడో పడేసి, గుడ్డలు మార్చుకుని పంచ కట్టుకోవడం కూడా తెలీదా ఇంత పెద్ద మొగోనికి? నేనుండి ఏం చెయ్యాలంట? ప్యాంటు విప్పి పంచ కట్టించల్లనా?” అని ఆమె ఎదురుదాడి ప్రారంభిoచేస్తుంది.
మా అమ్మ గొంతు పెద్దదయ్యేకొద్దీ మా నాయన గొంతు మెత్తగా మారిపోతుంది. ఆమెకి నిజంగా కోపం వచ్చిన అన్ని సందర్భాలలో , ఆయన తప్పు వున్నా, లేక పోయినా ఆయన పూర్తిగా తగ్గిపోతాడు. ” మేయ్ జయా.. టీ పెట్టు..” అని మాట మార్చేస్తాడు, ఇంటి ముందుకు వెడుతూ మా నాయన అశోకా బీడీనో, గణేష్ బీడినో వెలిగించుకుంటా .
ఆ గొంతులో అన్నీ పలుకుతాయి. ఆ గొంతులో వినయం ఉంటుంది. ఆ గొంతులోనే బ్రతిమాలడం ఉంటుంది. ఆ గొంతులోనే ప్రాధేయ పడటం ఉంటుంది. ఆ గొంతులోనే అభ్యర్థన ఉంటుంది. ఎందుకో మాయమ్మ ముందు అయన ఎప్పుడూ చాలా అణకువగా ఉండిపోతాడు. ఎందుకట్లా అయన తగ్గి ఉంటాడో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. మా నాయన చదువు అంతంత మాత్రమే. మా అమ్మ బాగా చదువుకుంది కాబట్టి అది మా నాయన మా అమ్మ చదువుకి ఇచ్చే మర్యాద అని మాకు అర్ధం కావటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది.
ఒకోసారి మాయమ్మ చుట్టుపక్కల ఇండ్లలో కాకుండా కొంచెం దూరం వెళ్లి ఉంటుంది. ఎస్టీ కాలనీలో పందులు మేపే వాళ్ళు ఉన్నారు. బాతులు మేపే వాళ్ళూ ఉన్నారు. ఎర్రమన్ను ముగ్గుపిండి అమ్మే వాళ్ళు ఉన్నారు. వెదురు దబ్బలు చీల్చి చేటలు గంపలు తట్టలు బుట్టలు అల్లిక చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు.సోది చెప్పేవాళ్ళు వున్నారు.
మాయమ్మ వాళ్ళ నాయనేమో అటవీశాఖలో అధికారి. మా నాయన వాళ్ళ నాయనేమో గాడిదలు మేపే వాడు. అదీ తేడా.!అడవి నుండి ఎండుకట్టెలు గాడిదల పైన తీసుకొని వచ్చి, ఊర్లో అమ్మడం మా నాయన వాళ్ళ నాయనకు వృత్తిగా ఉండేది. ఆయనకు పందుల వ్యాపారం కూడా ఉండేది.అయన అస్సలు ఏమీ చదువుకోని వాడు. ఎట్లో ఒగట్లా కష్టపడి మా నాయన వాళ్ళమ్మ బాలమ్మ దగ్గిర తన్నులు తిని, అంతో ఇంతో ఆ కాలంలో చదువుకున్నాడు కాబట్టి అప్పట్లో ఫారెస్ట్ గార్డ్ గా ఉద్యోగంలో చేరిపోయాడు. దాంతో ఆయనకి గాడిదలు కాసే పని తప్పోయింది.
మామూలుగా స్కూల్లో సరిగ్గా చదవని పిల్లలని టీచర్లు తిడతా వుంటారు. “ఏమ్రా ..సరిగ్గా స్కూలుకు రాకపోతే చదువు ఎట్లా వస్తుంది మీకు ? సరిగ్గా సదువుకోక పోతే గాడిదలు, పందులు కాసే దానికి తప్ప ఇంక దేనికి మీరు పనికి రాకుండా పోతారు” అని .!
మా కాలనీలో వుండే పిలకాయలకి భలే నవ్వు వస్తూ వుంటుంది.. ఆ మాటలు వింటా వుంటే .. అయినా అట్లా గాడిదలు కాసే పనో , పందుల్ని కాసే పనో హీనమైన పని అనో, నీచమైన పని అనో ఎందుకు పిల్లోల్లకి చిన్నప్పటి నుండే అయ్యవోర్లు అట్లా తప్పుగా చెపుతారో మాకు అర్థం అయ్యేది కాదు.మాకైతే మాకు గాడిదలు గొప్పే, పందులూ గొప్పే.మా ఇళ్ళల్లో మనుషులు ఎంతో ఆ జీవాలు కూడా అంతే.మా ఎరికిలోల్ల ఇండ్లల్లో పందులూ గాడిదలు మాతో బాటే కదా వుంటాయి.మాకు వాటిని తక్కువగా చూడటం అస్సలు తెలియదు . నిద్ర లేస్తానే కొంత మంది పిలకాయలు దేవుళ్ళ మొహాలనో వాళ్ళ అమ్మల మొహలనో చూస్తారంట, అందుకే ఆ రోజంతా వాళ్లకు అయ్యవార్ల చేతుల్లో బెత్తం దెబ్బలు పడవని స్కూల్లో చెప్పుకుంటా వుంటారు గొప్పగా.మేం నిద్ర లేస్తానే చూసేది పందుల మొహాలని గాడిదల మొహలనే కదా. మాకు అన్ని రోజులూ ఒకటే. అన్ని దినాలు మంచి దినాలే , ఎందుకంటే మేం నిద్ర లేస్తానే మా పనులు అయినా బతుకులు అయినా మొదలయ్యేది ఆ జీవాలతోనే. మాకు ఆ జీవాలే దేవుళ్ళు, దేవతలు.
ఎందుకంటే మాఎరికిలోల్లల్లో పందులు మేపినా, గాడిదలు కాసినా, ఉప్పు అమ్మినా, వెదురు బుట్టలు దబ్బలు, తడికలు అమ్మినా, అడివిలోకిపోయి ఎండుకట్టెలు తెచ్చి వూర్లో అమ్మినా, ఎండలో ఇల్లిల్లు తిరిగి ఎర్రమన్ను, ముగ్గు పిండి అమ్మినా , పెద్దోల్ల ఇండ్లల్లో ఇంటి పని చేసినా, కూలికి పోయినా, ఏం చేసినా మా కడుపాత్రం మా బ్రతుకేదో మేం బ్రతకడమే మాకు తెలుసు. కష్టపడి సంపాదించడమే తెలుసు.
అంతే కానీ, ఎవురి సొత్తుకు పోవడం కానీ, ఇంకొకళ్ళ సొత్తు వూరికే ఆశించడం కానీ మాకు తెలియదు. గాడిదలు కాసినా, పందులు మేపినా ఆ జీవాల్ని ఎంత గొప్పగా, గౌరవంగా, ఇష్టంగా మా ఇండ్లల్లో మనుషుల మాదిరే అన్నతమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళ మాదిరే చూస్తాం తప్ప, అవేవో జంతువులని కానీ , మనుషుల కంటే చాలా తక్కువని కానీ మాకు ఎప్పుడూ అనిపించదు.
ఎందుకంటే మాకు పంది పిల్లలతో ఆడుకోవడం తెలుసు. గాడిద పిల్లల్ని చాకడమూ తెలుసు. మా పెద్దోళ్ళు మమల్ని సాకినంత మురిపంగానే , ముద్దుగానే ఆ జీవాల్ని కూడా పెంచుతారు . వాళ్ళ దృష్టిలో పంది పిల్లలైనా, చిన్నపిల్లలైనా ఒకటే, తేడా ఏమి లేదు.
గొప్పగొప్పోల్లకు అని మాట వరసకి అంటా వుంటారు కానీ, ఎందులో ఎవురేం గొప్పో మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కులం అంటే తెలీదు, కానీ మా ఎరుకల కులం ఎందుకో చాల తక్కువైoదని మాత్రం బాగా తెలుసు.
అప్పుడు ఎప్పుడో ఏ కాలంలోనో ఎక్కడో మా కులంలో కొందరు దొంగలు వుంటే ఉండొచ్చు కానీ. అక్కడ ఎక్కడో ఆ స్టువర్టుపురంలో అందర్నీ తోలుకుపోయి కడాగా వుంచి దొంగతనాలు మానిపించి మంచోల్లని చేసినారని , దాన్ని సాకుగా పెట్టుకుని అప్పుడప్పుడూ పొలీసోళ్ళ దెబ్బలు మా కాలంలో తప్పేవి కావు అని మా రంగులు మామ అంటా వున్నేడు మా చిన్నప్పుడు. అప్పట్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పుడు అక్కడ వుండే వాళ్ళల్లో ఎవరైనా ఎరికిలోల్లు వుంటే మాత్రం పోలీసోల్లు ముందు ఎరికిలోల్లని ఎత్తి లోపలెయ్యండిరా అనే వాళ్ళంట. వాళ్ళతో మా రంగులుమామ ఎప్పుడూ గొడవపడే వాడంట. మా రంగులు మామ చాల చిత్రమైన మనిషి, చాల గొప్పాయన కూడా . అదొక పెద్ద కత. మరోసారి వివరంగా ఆ రంగులాయన కత చెపుతాను.నాటకాల్లో ఎంతో పేరు తెచ్చుకుని చుట్టుపక్కల జిల్లాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా అవార్డులు సన్మానాలు పొందిన మనిషి. ఆకలికి ఏ కులం అయితే ఏంది? ఏకులంలో దొంగలు లేరో చెప్పండి అంటా వున్నేడు మా రంగులు మామ .
మేం దడాలున ఎవరి ఇంట్లోపలికి పోకూడదని తెలుసు.అదేందో తెలియదు కానీ మా కాలనీ పిల్లోల్లని ఇంట్లో వుండే వాళ్ళు, స్కూల్లో అయివోర్లు, చిన్నా పెద్దా అందరూ కలసి ఎందుకు అంత భయపెడతారో అప్పట్లో తెలియదు. ఆఖరికి దొడ్డికి పోవల్లంటే కూడా మిగతా జనాలు పొయ్యే కాడికి మా కులం వాళ్ళు పోకూడదని అంటే, మా మల మూత్రాదులకి కూడా అంటూ, మైల అని ఉంటాయేమో మీకు నిజంగా తెలియదు.
*
దీనికంతా భయపడే కొంత మంది పిల్లోల్లు మా అసలు కులం ఏందో చెప్పకుండా దాచిపెట్టి వేరే ఏ కులం పేరో చెప్పుకుని తిరగతా వుంటారు. వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది.
ఇట్లా రోజూ భయాలతో , అడగడుగునా ఆంక్షలతో పెరిగే పిల్లలు యెట్లా చదువు కుంటారో, యెట్లా బాగుపడతారో చెప్పేవాళ్ళు ఎవరు ? ఇప్పటికీ కులం అడిగి , చెప్పి చెప్పంగానే మొహం చిట్లించే వాళ్ళని ఎంత మందిని చూడలేదు ? అయితే మాకు కులాన్ని దాచి పెట్టుకుని అపద్దం చెప్పడం తెలియదు. ఎవరు మొఖాలు మాడ్చుకున్నా సరే, మా కులం ఏమిటో బెరుకు లేకుండా చెప్పాలని మా నాయన చెప్పేవాడు. తప్పు చెయ్యనంత వరకూ ఎవరూ దేనికీ భయపడ కూడదని మాయమ్మ చెప్పేది.
మాయమ్మ ఎప్పుడూ ఒకమాట అంటా వుండేది.. సంపాల్సి వస్తే ముందు భయాన్ని సంపెయ్యల్ల,అప్పుడే ఎట్లాంటి మనిషైనా బాగుపడతాడు అని. చిన్నప్పటి నుండి నాకు ఆ మాటలు గట్టిగా గుర్తుoడి పోయాయి.
అందుకే నాకు ఎవురన్నా , ఏమైనా భయమే అనిపించదు.వుండేది వున్నేట్లుగా నిజాయితీగా ధైర్యంగా మాట్లాడతాను అంటే ఆ ధైర్యం అంతా మాయమ్మ మాటల్లోంచి వచ్చిందే !
ఎవరైనా ఏదైనా మాట సాయమో, చేతి సాయమో అడిగితే, మాయమ్మ వెనకాముందూ ఆలోచించేది కాదు. మనిషి సహాయం అవసరమైతే, ఇంట్లో కట్టెలపొయ్యి పైన బియ్యంపాత్రలో పొంగు వస్తా ఉంటే కూడా సరే, ఇంకోపక్క పప్పుచారు ఎనపాల్సి వుండినా సరే.. దాన్నట్లా చూసుకోండిరా అని చెప్పి ఆమె వెళ్ళిపోయేది. మేము లేకపోతే మండుతున్న కట్టెలపైన నీళ్ళు జల్లి ఉన్నఫలంగా వంట పనులు ఎక్కడికి అక్కడ అట్లాగే వదిలేసి ఇంటికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయేది.
ఈ పందులు మేపే వాళ్ళు, కాలనీలో కొంచెం దూరంగా ఉంటారని చెప్పినా కదా, అక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఆమె అటు వెళ్లిందంటే రావడానికి చాలా సమయమే పట్టేది.మేము ట్యూషన్ నుంచి వచ్చి అప్పటికే ఆకలితో, ఏడుపు ముఖాలతో నిలబడితే మా నాయనకు మా అమ్మ పైన విపరీతంగా కోపం వచ్చేసేది.
” చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళకి తిండీ నీళ్ళు పెట్టకుండా యాడికి పోయినావు మే.. బుద్ధుందా నీకు? అట్లా చూడు ఆ పిలకాయల మొహాలు ఆకలికి ఎట్లా వాడిపోయిండాయో..” అని కసిరే వాడు.
” నా బతుక్కి నేను యాడికిబా పోతాను, డిల్లీకి ఏమైనా పోయినానా.. ఆ పక్క కాంతమ్మని వాళ్ళ ఇంటాయన కొట్టి చంపేస్తా ఉంటే ఆడికి పోయినా. ఆ నా బట్ట కి ఎన్నిసార్లు చెప్పేది ఆడదాన్ని కొట్టద్దురా..అని. మిడిమాళం పట్టినోడు.. ఆ పాప ఓ..అని ఏడస్తావుంటే యాడ వాని చేతుల్లో చచ్చిపోతుందో అని పరిగెత్తి పోయినా.. అది కూడా తప్పేనాబా.. ” ఇంకేo అంటాడు మా నాయన !?
ఆయన నోట్లోంచి వచ్చే ఆ మాటలకు, ఆయన కోపానికి ఆమె ఒక్క మాటతోనే, కంటి చూపుతోనే అడ్డుకట్ట వేసేస్తుంది .ఆయన కోపం మొత్తం ఆ క్షణం లోనే మాయమైపోతుంది.
“ అయ్యో పోనీలే పాపం. నువ్వు సరిగ్గా టయానికి పోయినావు కాబట్టే ఆయమ్మకి దెబ్బలు తప్పోయి వుంటాయి లేదా దెబ్బలు తగ్గి వుంటాయి. ఏదైనా ఆయమ్మకి నీ వల్లా మంచే జరిగిందిలేమ్మే. ఈ రోజు మనం చేసే మంచే కదా రేపు మన బిడ్డలకి మంచి చేస్తుంది, సరేసరేలే… ముందు ఈ పిల్లోల్ల కత చూడు ఇప్పుడైనా పాపం ” మాయమ్మ వైపు చూడకుండా తల తిప్పుకుని, మా వైపు తిరిగి, మా వైపే చూస్తూ మెల్లగా అనేవాడు బీడీ ముట్టిoచుకుంటా . ఆ మాట అంటూ ఇంట్లోంచి బయటకు కదిలే వాడు. ఇంట్లో బీడిలు తాగకూడదని నాలుగో తరగతి చదివేటప్పుడు నేను గొడవ చేసినాను కదా .అది మొదలు ఆయన ఇంట్లో బీడిలు తాగింది లేదు.జరో అని వాన పడతావుండేటప్పుడు కూడా అయన ఇంటి ముందు వసారాలో నిలబడుక్కునే బీడి తాగేసే వస్తాడే కానీ , ఇంట్లోపల బీడి తాగింది లేదు .
మాయమ్మకు ఆడబిడ్డలు అంటే చాలా ఇష్టం. అందుకే మాయమ్మ తమ్ముడి కూతుర్ని, అన్న కూతుర్లని, చెల్లెలు కూతుర్ని మాకంటే ఎక్కువ ముదిగారంగా చూసుకునేది. అయితే మా అమ్మకు ఇద్దరూ మొగ బిడ్డలే కాబట్టి నాకు జడలు వేసేది. నేను స్కూలుకు రెండు జడలతో వెళ్ళే వాడిని. మునిదేవర జరగటం, మునీశ్వరుడికి తల వెంట్రుకలు ఇవ్వడం ఇంట్లో డబ్బు లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాలవల్ల చాలా ఆలస్యం అయింది.అది వేరే కథ. ఎరుకల కుటుంబాల్లో డబ్బు వున్నా లేక పోయినా అప్పో సప్పో చేసి అయినా ఆడంబరంగా జరిపించే వేడుకల్లో మునిదేవర ఎంతో ముఖ్యమైoది కదా.
మునిదేవర జరిగి గుండు కొట్టిన తర్వాతనే నాకు క్రాఫు కట్టింగ్ కు అనుమతి వచ్చింది.ఆ రోజు గొడవ కూడా మా అత్తవాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లోడికి మునిదేవర యెట్లా చేయల్ల అనే దాని గురించే అంట. డబ్బు లేదని, అప్పు పుట్టలేదని మా మామ అంటే మా అత్త ఒప్పుకోలేదంట. పిల్లోడికి టయానికి మునిదేవర కూడా చెయ్యలేక పోతే నువ్వు ఏం మొగోడివి అని అనిందంట. దాంతో మా మామకి కోపం వచ్చి మా అత్తను ఇష్టం వచ్చినట్లు కొట్టేసినాడంట. సరిగ్గా టయానికి మా అత్త వచ్చి అమ్మను తీసుకు పోయింది కాబట్టి ఆయమ్మకి దెబ్బలు తప్పోయిన మాట వాస్తవమే అని అన్నం తినేటప్పుడు మాయమ్మే మా నాయనకు మాటల మధ్యలో చెప్పింది.
నవ్వుతా నవ్వుతానే మా నాయన ఒక మాట అడిగినాడు మా అమ్మ కళ్ళా చూస్తా “ ..జయా ఉద్యోగం చేస్తా వుండే నాకే మునిదేవర చెయ్యాలంటే యెట్లా అని ఇంకా ఆలోచిస్తా ఉండా. ఆ రమనయ్యకి యెట్లా కుదురుతుందిమే”. అప్పుడైనా అసలు కథ చేపుతుందేమో అని ఒక్క క్షణం ఎదురు చూసాడు కానీ, మాయమ్మ తల పైకి ఎత్తకుండానే తెలివిగా బదులు చెప్పేసింది. “ ఏముండాదబ్బా ఎవురో ఒకరు మనసుపెట్టి ఆదుకుంటే అంతా అయిపోతుంది.” తల వంచుకునే వడ్డించింది, తల వంచుకునే తినింది .
తల వంచుకునే మాట్లాడుతుంటే చిన్నపిల్లోల్లం మాకే అర్థం అయిపోయింది, ఇంక మా నాయనకు అర్థం కాకుండా ఉంటుందా ? ఉండబట్టలేక అడగనే అడిగేసాడు. “ఏమ్మే జయా.. కొత్త పెండ్లికూతురు మాదిరి అట్లా తల వంచుకునే వుండావు. నా మొహంకల్లా చూడకుండా సిగ్గుపడతా ఉండావు కదమ్మే ఏమైందిమే నీకీ పొద్దు ”
ఆమె అప్పటికీ తల పైకి ఎత్తదు.మా నాయన మొహం కల్లా చూడదు.మాయమ్మ అపద్దం చెప్పదు కదా, నిజమే చెపుతుంది.
“ వాళ్ళు పందులు అమ్మేదానికి ఇంకా టైం పడుతుంది కదబ్బా. అందుకే..నా కమ్మలు ఇచ్చేసి వచ్చినా. కుదవపెట్టి మునిదేవర చేపించేయమంటి. ఏమిప్పుడు నీకు ? ” క్షణం ఆగి, “ ఊ…చెప్పుబా నేను కమ్మలు ఏసుకుని అర్జెంటుగా ఏ ఊరికి పోవల్లంట. ” అంటుంది కోపంగా మొహం పెట్టి . అప్పుడు మా నాయనకు కోపం రాదు.బాధ కలగదు. నాకు చెప్పకుండా చేసినావే అని కానీ, నాకు ముందుగా చెప్పల్ల కదా అని కానీ, నన్ను అడగల్ల కదా అనే మాటలు ఏవీ ఆయన నోట్లోoచి రావు .
ఎదురు మాట్లాడకుండా “ మీయమ్మ అంతే ఈ కాలనీకి ఒక మదర్ తెరిస్సా.. లే ” అని మా వైపు ఒక చూపు చూసి నవ్వుతా గణేష్ బీడీకట్ట, రాట్నం అగ్గిపెట్టె ఎత్తుకుని, మా ఇంటి ముందు వుండే నెల్లికాయ చెట్టు దగ్గరకి వెళ్ళిపోతాడు. అదిగో కరెక్టుగా మా నాయన అట్లా ఇంట్లోంచి బయటకు పోయిన క్షణo తర్వాత మా అమ్మ తల పైకి ఎత్తి మా వైపు చూస్తుంది.
ఎందుకో తెలియదు కానీ అప్పుడు మాయమ్మ మొహం లోకి ఏదో వెలుతురు వచ్చి వుంటుంది. అంతకు ముందుకన్నా అప్పుడు మా కళ్ళకి మాయమ్మ చాలా అందంగా కనిపించేది .
అప్పుడు మాయమ్మ మాకు కొత్తగా అనిపించేది.