వయసు మీద పడ్డ వైస్ ఛాన్సలర్ కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళు పులుముకొని రెప్పలు ఆడించి చేతిలోని ఆర్డర్‌ని మరోసారి చూశారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి వచ్చిన లెటర్ అది. మళ్ళీ చదువుకున్నారు. క్షణకాలం అలానే వుండిపోయారు.
రిజిస్ట్రారూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరూ డీన్లూ డిపార్టుమెంటు హెడ్లూ సూపరింటెండెంట్లూ యింకా ప్రొఫెసర్లూ కొద్దిమంది స్టూడెంట్లూ వారి నాయకులూ అంతా అయన వంక చూశారు. ఒకరకంగా అది ఇంటర్నల్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెన్సియల్ మీటింగ్.
‘నేషనలిజమ్… జాతీయవాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యీ ప్రతిపాదనలు చేసింది…’ అన్నారు ఛాన్సలర్. ‘విద్యారంగం అందుకొక మార్గం… సో’ అని ఆగిపోయారు.
‘స్వదేశీ ఆవు శాస్త్రం మీద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి’ రిజిస్ట్రార్ అందరికీ విషయం తేట తెల్లం చేస్తున్నట్టుగా అన్నారు.
‘ఆవు శాస్త్రమా?’ అన్నట్టు ఆవు ముఖాలేసుకు చూశారు కొందరు స్టూడెంట్స్.
‘ఇది మన వొక్క యూనివర్సిటీయే కాదు, అన్ని యూనివర్సిటీలకీ. అన్ని అనుబంధ కాలేజీలకీ ఎగ్జామ్స్ పెట్టి ఎంకరేజ్ చెయ్యమని అఫీషియల్ ఆర్డర్’ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరు అన్నారు.
‘మీరు రాసేది యెలాగూ ఆవు వ్యాసమే కదా?’ నవ్వుని ఆపుకుంటూ స్టూడెంట్సుని వుద్దేశించి గుసగుసగా అన్నాడు వో డీన్.
‘ఆవు సాధు జంతువు. దీనికి రెండు కొమ్ములు వుండును. నాలుగు కాళ్ళు వుండును. ఒక తోక కూడా వుండును. రెండు చెవులు వుండును… బట్ యింతకంటే కొత్తగా రాస్తే అప్పుడది ఆవు అవదు కదా సార్… సో మన పరిశోధనల విధానమే అది’ వో స్టూడెంటు గొంతు తగ్గించాకుండానే అంది.
‘ఆవు గురించి అంత తేలికగా మాట్లాడొద్దు. ఆవు యెంతో పవిత్రమైన జంతువు. ప్రత్యేకించి హిందువులకి…’ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరు చెప్పడం పూర్తి కాలేదు, ‘మనది హిందూ రాజ్యంగా మారుతోంది, సో ఆవు కూడా వొక అవసరమైన సబ్జక్టే’ స్టూడెంటు నాయకుడొకడు అన్నాడు.
ఆ మాటల్ని పట్టించుకోకుండా ‘యెస్… వై నాట్? ఇది హిందూ దేశం. హిందువుల ఆరాధ్య దైవం ఆవు. ఆవులో సకల దేవతలు వుంటారని మన పురాణాలు చెపుతున్నాయి. అంతెందుకు మన పితృదేవతలు యెక్కడ వుంటారు?, ఆవు పాదాల్లో. అడుగుల్లో ఆకాశగంగ వుంటుంది. ఆవు పొదుగుకున్న నాలుగు శిరాలే చతుర్వేదాలు. పాలు పంచామృతాలు…’ ఆవేశంతో పాటు ఆయాసపడి కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరు ఆగగానే బొట్టు పెట్టుకున్న విద్యార్థి నాయకుడు శంకరాభరణం శంకరశాస్త్రి కుప్పకూలగానే పిల్ల తులసి అందుకున్నట్టు అందుకున్నాడు.
‘…పాలు పంచామృతాలు. కడుపు కైలాసం. అసలు వొక ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినంత ఫలితం. ఆవిచ్చే పాలూ పెరుగూ నెయ్యిలోనే కాదు, పేడలోనూ మూత్రంలోనూ యెన్నో ఔషధాల గనులు వున్నాయి…’
‘తవ్వొచ్చినట్టు చెపుతున్నాడు’ అందో స్టూడెంట్.
‘అలాగే, మా గవర్నమెంటు వుండగా యిది కంపలసరీ సబ్జెక్టు. పరీక్ష రాయడం మానేయండి. ఇంటికెలిపోండి’ బొట్టు స్టూడెంటు నాయకుడు ధైర్యంగా అన్నాడు.
‘గవర్నమెంటు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది, మనం మంచి చెడుల చర్చ చేసి లాభం లేదు. జ్యోతిష్యశాస్త్రాన్ని వ్యతిరేకించారు. ఏమయ్యింది? కోర్సు రన్నవుతోంది. భూతవైద్యం కోర్సు పెడతారని నవ్వుతాలుగా ఎఫ్బీలల్లో కామెంట్లు పెట్టినా అదే నిజం కావచ్చు. యధా రాజా తధా ప్రజా’ అన్నాడో డిపార్టుమెంటు హెడ్డు.
‘అడిషనల్‌గా కొత్త డిపార్టుమెంట్లూ రిక్రూట్మెంట్లూ మంచిదేగా?’ నవ్వాడు రిజిస్ట్రార్.
‘స్టడీ మెటీరియల్‌ని నిర్ణయించేది మనం కాదు, యూజీసీ. వారిచ్చిన మనకొచ్చిన సిలబస్ యేమిటో చెప్పండి సర్’ అన్నాడు సూపరింటెండెంటు, త్వరగా మీటింగ్ అయిపోతే వెళ్లిపోవచ్చు అన్నట్టు.
వైస్ ఛాన్సలర్ తన ముందున్న ఫైల్ని ముందుకు తోశాడు. రిజిస్ట్రార్ అందుకున్నాడు. తిప్పి తిరగేసి తెరిచి చూశాడు.
కొందరు ఆసక్తిగా మరికొందరు ఆందోళనగా చూస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్.
‘సిలబస్ డీటైల్గానే వుంది…’ రిజిస్ట్రార్ సీరియస్‌గానే అన్నారు. అని చందివింది చెప్పడం మొదలు పెట్టారు.
‘స్టడీ మెటీరియల్లోని కొన్ని వివరాలు: భారత్, రష్యాల్లో రేడియేషన్ నివారించేందుకు రక్షణకు ఆవు పేడ వినియోగించిన వివరాలు… యింకా మన దేశంలో జరిగిన భూపాల్ గ్యాసు లీకు దుర్ఘటనలో స్థానికులు ఆవు పేడవల్లే రక్షించబడ్డారన్న అంశాలు… ఊ… పర్యావరణ పరిరక్షణలో పిడకల పాత్ర… ఆవు వధకూ భూకంపాలకూ వుండే సంబంధ బాంధవ్యాలు… ఆవుల్లో రకాలు… జెర్సీ ఆవులు పాలను బాగా యిచ్చినా వాటిలో సోమరితనం లక్షణాలు… ఊ… స్వదేశీ ఆవు పాలలో బంగారపు అణువులు వుండడం వల్లే అవి పసుపు రంగులో వుంటాయి…’
‘సబ్జెక్ట్ యీజీగానే వుంది, మీకేం లోడ్ కాదు…’ అన్నాడు వో డిపార్టుమెంటు హెడ్డు.
‘వీటి వల్ల యేమి లాభం?’ అన్నారు గొంతు పెంచి కొందరు విద్యార్థులు.
‘సైలెన్స్ మెంటైన్ చేయండి, అదర్వైజ్ గెటవుట్’ సున్నితంగా అన్నాడు వైస్ ఛాన్సలర్.
‘వాటీజ్ దిస్ నాన్సెన్స్?’
‘మేక్ యిన్ యిండియా!’
విద్యార్థుల మాటల మధ్య వైస్ ఛాన్సలర్ లేచి వెళ్ళిపోయాడు.
‘మా చేతుల్లో యేమీ లేదు. వుయార్ ఫాలోవర్స్… ఆలార్ ఫాలోవర్స్…’ నమస్కారం పెడుతూ అన్నాడు రిజిస్ట్రార్.
‘దేశంలోని పబ్లిక్ సెక్టార్స్ అన్నీ అమ్మేస్తున్నారు, మీకు జాబులు యెలానూ రావు. లేవు. సో మరక మంచిదే’ అంటూ నవ్వుతూ సూపరింటెండెంటు లేచి వెళ్ళిపోయాడు.
మీటింగ్ ముగిసింది.
తిట్టుకుంటూ అయినా ప్రభుత్వం తెచ్చిన కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు రాశారు స్టూడెంట్స్. ఆవు శాస్త్రంలో చదవకుండానే మంచి మార్కులే తెచ్చుకున్నారు.
ఫలితాలు వచ్చాయి.
పట్టభద్రులు అయ్యారు.
స్నాతకోత్సవంలో స్టూడెంట్సు నల్లని కోటుకు బదులుగా నల్లని కంబళ్ళు కప్పుకు వెళ్ళారు. నెత్తిన నల్లని కేప్లకు బదులుగా యెర్రని తలపాగాలు చుట్టుకున్నారు. గవర్నరుగారు కూడా స్టూడెంట్సు చేతుల్లో చుట్టివున్న సర్టిఫికెట్సుకు బదులుగా చేతుల్లో కర్రలు పెట్టారు.
వాళ్ళకి ఆవుశాస్త్రం తెలుసనీ వాళ్ళు ఆవులు కాస్తారనీ అంతా అమాయకంగా అనుకున్నారు.
కానీ అలా జరగలేదు?!