యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక విలువలేవీ ఇక్కడ ఆవిష్కరించబడలేదు. చారిత్రికంగా ఎప్పటికప్పుడు పునరుత్పత్తి అవుతూ నూతన రూపంలో స్థిరపడుతున్న కులవ్యవస్థ ఆ ఆధునిక విలువలను అదిమిపట్టి ఉంచుతూ వస్తున్నది. అందుకే ఇక్కడి పాలకవర్గ పార్టీలు, ప్రత్యేకించి బిజెపి మెజారిటీ హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ రూపంలో ఆధునికతను, సారాంశంలో ప్రాచీనతను కలిగి ఉన్నది. అనివార్యంగా జరుగుతున్న అభివృద్ధికర సామాజిక మార్పుల్ని ప్రాచీన ప్రాశస్త్యంలోకి కుదించి వైభవీకరించే ప్రయత్నం చేస్తోంది. దీన్నే రాజకీయార్థిక పరిభాషలో చెప్పాలంటే- విదేశీ (సామ్రాజ్యవాద) పెట్టుబడికి దాసోహం అంటూ, దళారీ పాత్రను నిర్వహిస్తూ దేశీయంగా సనాతన హిందూ మతతత్వ సంస్కృతిని పునఃస్థాపించే ప్రయత్నం చేస్తున్నది. పెట్టుబడిదారీ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలను మరుగుపరచడానికే జాతి, జాతీయత, సంస్కృతి, దేశభక్తి లాంటి భావనలను బిజెపి ‘సమర్థంగా’ వాడుకుంటోంది. ఇందుకు ఆయా భావనల పట్ల ప్రజల్లో సహజంగా ఉండే నిస్వార్థ పూరిత సెంటిమెంట్ల వల్ల ఆ పని వారికి చాలా సులువవుతోంది.

ఆధునిక జాతి/జాతీయతా భావనకు మతాన్ని జోడించి.కుహనా జాతీయతను సృష్టించి మాయజేయడంలో పాలకవర్గాలన్నింటిలో బిజేపీదే పైచేయిగా ఉన్నది. కుల మత విశ్వాసాలతో కూడిన ప్రజల మానసిక ప్రపంచంలోకి చొరబడి వారి సున్నితమైన భావాలను తమ స్వప్రయోజనాలకోసం కుటిలంగా వాడుకోవడంలో ఆర్ఎస్ఎస్/ సంఘపరివార్ దే అందెవేసిన చేయి. అదే వారి సనాతన దృక్పథంలో దాగి ఉన్న ‘రాజనీతి’ రహస్యం.

అందుకే ఏడున్నర దశాబ్దాలుగా భారత పాలకుల ‘స్వతంత్ర’ పాలనా విధానంలో నిజమైన లౌకికత్వం, అంటే మతాన్ని ప్రజల ప్రైవేటు వ్యవహారంగా పరిగణించి, మతాతీతంగా రాజ్య నిర్వహణ చేయడం ఎన్నడూ లేదు. పైకి ‘అన్ని మతాలను సమానంగా చూడడమే’ లౌకికవాదమని ఇక్కడి పాలకులు చెబుతూ వస్తున్నప్పటికీ, మెజారిటీ హిందూమత ఆధిపత్యమే ‘భారతదేశపు లౌకికవాదం’ గా అమలవుతూ వస్తోంది.

ముఖ్యంగా 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత పాలకుల అభివృద్ధి నినాదం మరింత జోరందుకుంది. కాని పాలకులు ఊదరగొట్టే అభివృద్ధి ఎండమావి వంటిదని మనం గ్రహించాలి. ఎండమావిలో నీళ్లు ఉన్నట్టుగా ఎలాగైతే భ్రమ కలుగుతుందో, వీళ్లు చెప్పే అభివృద్ధిలో స్వావలంబన,స్వతంత్రతలేవీ లేకున్నా, ఎటువంటి ప్రగతిశీల పరివర్తనా లేకున్నా, కేవలం రూపపరమైన మార్పుల్నే అభివృద్ధిగా భ్రమింపజేస్తారు. అంతేకాదు, ప్రజలను ప్రేమించని కుహనా దేశభక్తినే ‘నిజమైన దేశభక్తి’ గా, ప్రజల బాగు కోరని కుహనా జాతీయతనే ‘అసలైన జాతీయత’ గా భ్రమింపజేస్తున్నారు. సామ్రాజ్యవాద మార్కెట్ కోరలకు దేశాన్ని బలి ఇచ్చి, మొత్తం దేశ వనరులను కొల్లగొట్టే దేశ విదేశీ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నూతన చట్టాలను రూపొందిస్తూ, కార్మిక ,రైతాంగ ,ఆదివాసీ జనసమూహాలను మరింతగా విధ్వంసపు అంచులకు నెట్టివేసే ‘సంస్కరణల’ను ప్రవేశపెడుతున్నారు. ఒకవైపు భూస్వామిక సంబంధాలను, సనాతన బ్రాహ్మణీయ హిందూ మతతత్వ భావజాలాన్ని పరిరక్షించే ప్రాచీన సాంస్కృతిక పాలసీని అవలంభిస్తూనే, మరోవైపు దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘సూపర్ పవర్’ గా అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.

కాని ప్రజల అనుభవం ప్రాతిపదికగా చూసినపుడు ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న భారత పాలకవర్గాలన్నీ ప్రజల నిజమైన అభివృద్ధికి విముఖంగానే ఉన్నాయి. ఎందుకంటే మౌలికంగా అవి వాస్తవాలను స్వీకరించవు. ఒకవేళ స్వీకరించాల్సివచ్చినా పాక్షికంగానే స్వీకరిస్తాయి. తమ ప్రయోజనాల మేరకు వాస్తవాలను వక్రీకరిస్తాయి. కనుక చరిత్రను కూడా వక్రీకరిస్తాయి. అలా చేయడం వల్ల వాస్తవికతలోని చలానాన్ని అవి చూడలేవు. ఒకవేళ చూసినా ప్రగతిశీల మార్పు క్రమాన్ని నిరోధించి, తమకు నచ్చిన గత చరిత్ర పార్శ్వంలోకి ప్రయాణించి, దాన్ని వైభవీకరించో, పవిత్రీ కరించో పునరుద్ధరించాలని చూస్తాయి. గతాన్ని పునరుద్ధరించాలనుకునే వారెవరైనా చరిత్రలోని పరివర్తనా క్రమాన్ని చూడలేరు. కనుక నిర్మాణమవుతున్న చరిత్రనూ గమనించలేరు. అందుకే పాలకులు తమకున్న వర్తమాన అధికారాన్ని శాశ్వతమైనదిగా భావిస్తూ ఉండటంవల్ల అధికార మదంతో కూడిన ఫాసిజాన్నే అమలు పరుస్తారు.

అందుకు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత నుండి మొదలుకొని పౌరసత్వ సవరణ బిల్లు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల దాకా అనేక సంఘటనలు మనం రుజువులుగా పేర్కొనవచ్చు. అయితే 2013 నుండి 2016 వరకు మూడు నాలుగేళ్లలో జరిగిన సంఘటనలపై రచయిత్రి పి.వరలక్ష్మి రాసిన వ్యాసాలే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ నాలుగేళ్లలో ముస్లింలు, దళితులు, వివిధ సామాజిక కార్యకర్తలపై జరిగిన సంఘ్ పరివార్ దాడులను ఆమె సాంప్రదాయిక మార్క్సిస్టు వలె ముతకగా విశ్లేషించలేదు. ఎందుకంటే ఆమె మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అత్యంత సృజనాత్మకంగా అన్వయించడం వల్ల 2013లో ఉత్తరప్రదేశ్ లో ముజఫర్ నగర్ ప్రాంతంలో ముస్లింలపై జరిగిన దాడులపై, మహారాష్ట్రలో 2013లో శాస్త్రీయ భావాలను ప్రచారం చేసినందుకు హేతువాది అయిన డాక్టర్ నరేంద్ర దభో ల్కర్ హత్యపై, 2015లో వామపక్ష రాజకీయ కార్యకర్త ఆయన గోవిందు పన్సారే హత్యపై, కర్ణాటకలో 2015లో కన్నడ మేధావి, చరిత్రకారుడు ఎం.ఎం. కల్బుర్గి హత్యపై, తమిళనాడులో 2015లో రచయిత పెరుమాళ్ మురుగన్ సాహిత్యపరమైన ‘హత్య’పై, గుజరాత్ లో 2016 లో చచ్చిన ఆవు చర్మాన్ని ఒలిచినందుకు దళిత కుటుంబసభ్యులను చావబాదిన ఉనా సంఘటనపై, 2015 లోనే జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ‘ఆత్మ’హత్యపై, అఫ్జల్ గురు ఉరితీతానంతర కాశ్మీర్ పై చాలా సమర్థవంతమైన విశ్లేషణా వ్యాసాలు రాశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అన్వయించడం అంటే, కాలగమనంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న సామాజిక సంఘటనలను అర్థం చేసుకోవడానికి సిద్ధాంతాన్ని విస్తరించి, గతితార్కికంగా విశ్లేషించడం అని అర్థం. అలా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విస్తరించి, సృజనాత్మకంగా అన్వయించి, విశ్లేషణ చేసినందువల్లే ఈ వ్యాసాలు మౌలిక ఆలోచనలను రేకెత్తించే విధంగా, అత్యంత ప్రభావశీలంగా ఉన్నాయి.

అలాగే రాజకీయ అధికార పీఠాన్ని ఎక్కడానికి బిజేపీకి ఉపయోగపడిన బ్రాహ్మణీయ హిందూ మత సాంస్కృతిక భావజాల పునాదిని అర్థం చేసుకోవడానికి కూడా మనం మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విస్తరించి, సృజనాత్మకంగా అన్వయించి, గతితార్కికంగా విశ్లేషించాలి. అలా విశ్లేషించి చూసినపుడు- మరే దేశంలోని వర్గ సమాజాన్ని కన్నా భారతదేశంలో ఏర్పడ్డ వర్గ సమాజం అత్యంత ప్రత్యేకమైనది, సంక్లిష్టమైనది. ఎందుకంటే- ఆర్య తెగలు మన దేశానికి రావడానికి కన్నా ముందే ఇక్కడ విభిన్న సామాజిక సాంస్కృతిక వ్యవస్థలతో కూడిన వేర్వేరు తెగలు,జనసమూహాలు ఉండేవి. ఆర్యులు వచ్చిన తర్వాత ఆ విభజిత సామాజిక సమూహాలే క్రమంగా వర్ణ రూపం సంతరించుకున్నాయి. తదనంతర కాలంలో అవే ఘనీభవించి వర్గ విభజనలుగా రూపొందాయి. అంటే, ప్రాచీన భారత దేశంలో క్రీ.శ.6వ శతాబ్దం నాటికి రాజ్యం ఏర్పడి, అభివృద్ధి చెందడంలో, వర్ణరూపంలో తొలి వర్గసమాజం రూపొందడంలో బ్రాహ్మణవాదమే కీలక పాత్ర పోషించిందని అర్థమవుతుంది.

తర్వాతి కాలంలో ఆ వర్గ సమాజం స్పష్టమైన రూపు దాల్చి విస్తరించినప్పటికీ, దాంతో పాటు వర్ణవ్యవస్థ కూడా కొనసాగింది. అనేక కులాలతో కూడిన ఎన్నో ప్రజా సమూహాలు విస్తరిస్తున్న వర్గవిభజన వల్ల చీలిపోతూ,వాటిలో కొన్ని (భూ)ఆస్తిపర సమూహాలుగా మారి అగ్ర కులాలుగా అవతారం ఎత్తాయి. అంటే, ఉత్పత్తి సంబంధాలలో ఆర్థికకోణంలోని వర్గ విభజనలతో పాటు, ఆర్థికేతర సామాజిక విభజనలు కలగలిసి రెండూ జమిలిగా కొనసాగుతూ వస్తున్నాయి. గతంలో చాలాకాలం పాటు ఉత్పత్తి సంబంధాలు అంటే కేవలం ఆర్థిక పరమైనవేననే దురభిప్రాయం కమ్యూనిస్టు ల్లో ఉండడం వల్ల కులం వంటి ఆర్థికేతర/ఆస్తియేతర సాంఘిక సంబంధాలను అప్రధానమైనవిగా, ప్రభావితం చేయలేని ఉపరితల అంశాలుగా పరిగణించారు.దానికి తోడుగా పునాది,ఉపరితలాలను కృతకంగా విభజించడం వల్ల, వాటి మధ్య సహజంగా వుండే బహుముఖ సంబంధాలు, పరస్పర ప్రభావితమైన చర్యాప్రతిచర్యల స్థానంలో ఏకముఖ సంబంధమే ఉంటుందని తప్పుగా భావించడం వల్ల, సామాజిక పరివర్తనా క్రమంలో కులవ్యవస్థ నిర్వహించే పాత్రను సరిగ్గా అంచనా వేయడంలో విఫలం చెందారు.

అయితే నిరంతరం కొనసాగుతున్న రాజీలేని రాజ్యవ్యతిరేక వర్గపోరాటాల ఫలితంగా వివిధ పీడిత అస్తిత్వ ప్రజా సమూహాలు చైతన్యీకరణ పొంది,అవి వేర్వేరుగా తమ తమ విముక్తి కోసం ఉద్యమించాయి. అనేక ప్రశ్నల్ని సంధించాయి.కొనసాగుతున్న వర్గ పోరాటాలపై, పోరాటకారుల చిత్తశుద్ధిపై అనుమానాలను వ్యక్తం చేశాయి.అవన్నీ సైద్ధాంతిక శాస్త్రీయతను ప్రశ్నార్ధకం చేసేలా కూడా కనిపించాయి. ఇటువంటి గందరగోళమంతటికీ కారణం మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సిద్ధాన్నం లాగా భావించడమే.ఒకసారి వండిన వంటనే ప్రతిరోజూ మనం తినలేం.ఎందుకంటే అది మర్నాటికి పాచి పోతుంది. కాబట్టి ఏ రోజుకారోజు తాజాగా వంట వండుకుంటేనే మనం తినగలం. అలాగే కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నిత్యం సిద్ధాంతాన్ని తాజాగా,సృజనాత్మకంగా అన్వయించాలి. ఆ క్రమంలో సిద్ధాంతాన్ని విస్తరిస్తూ,సంపద్వంతం చేసుకోవాలి.అలా చేయనట్లయితే, నిరంతరం అనేక రూపాల్లో జరుగుతున్న వర్గపోరాటాలను మనం సరిగ్గా అర్థం చేసుకోలేం.కనుక వాటిని శాస్త్రీయ సైద్ధాంతిక పునాదిపై సంఘటితపరచి రాజ్యవ్యతిరేక పోరాటాలుగా మలచలేం. అందువల్ల రాజీలేని వర్గపోరాటాలే మనందరికీ ‘గురువులు’.అవే ఎవరికైనా సరైన పాఠాలు నేర్పుతాయి.అవే సరైన జ్ఞానాన్ని అందిస్తాయి.

మొత్తానికి ఈ పుస్తకం నిజాల్ని పాతరేసి అబద్దాల పునాదులపై అమానవీయ సిద్దాంతాలనల్లుతూ రాజకీయాధికార పీఠాన్నెక్కి మనిషి మానవతాసారం పైనే యుద్ధం చేస్తున్న సామ్రాజ్యవాదంతో జతగడుతున్న బిజెపి ఫాసిస్టు పాలనలో పెల్లుబికి వస్తోన్న ఆజాదీ కీ ఆవాజ్ . విప్లవ రచయిత్రి పి.వరలక్ష్మితో పాటు ఈ ఆవాజ్ మనందరి,జనమందరి ఆవాజ్ గా మారి,ఐక్యంగా చేసే ప్రజా పోరాటాల ద్వారానే పాలక వర్గాల హిందూ మతోన్మాద ఫాసిస్టు పాలనకు మనం చరమగీతం పాడగలం.

జన జీవితానికి మడి వేసిన ముళ్లన్నీ విప్పేద్దాం..
జన జీవితం చుట్టూ మడి పాతిన దడులనన్నింటినీ ఛేదిద్దాం.
ప్రఖ్యాత కెన్యా రచయిత గూగీ చెప్పినట్టుగా, ’మన మెదళ్ళను నిర్ వలసీకరించుకోవడమే’ కాదు, నిర్ బ్రాహ్మణీకరించుకోవాలి. అదే నేటి చారిత్రక ఆవశ్యకత.

Leave a Reply