‘నానమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పందిరి మంచం తీస్కెళ్ళిపోతాను నువ్విక ఆపలేవు నన్ను. పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడిస్తావు నానమ్మా… నువ్వూ పడుకోవు, అమ్మనీ పడుకోనీవు. నాకూ ఇవ్వవు. స్టోర్‌ రూమ్‌లో ఆ నల్ల దుప్పటితో కప్పెట్టేస్తావు అదేదో పురావస్తు గ్నాపకంలా… షాజహాన్‌ ముంతాజ్‌ కోసం కట్టిన తాజ్‌మహల్లా… ఏంటది నానమ్మా అర్థం ఉండాలి. వస్తువులు, మనుషులు అందరికీ ఉపయోగపడాలి అంటావుగా నువ్వు. అంత పెద్ద అందమైన పందిరి మంచం, చూస్తేనే నిద్రొచ్చేలా ఉండే పందిరి మంచం, జోలపాడుతూ అమ్మ ఒడిలా కమ్మగా జోల పాడుతూ నిద్రపుచ్చే పందిరి మంచం… కమ్మటి కలల్నిచ్చే పందిరి మంచం ఎందుకు నానమ్మా దాన్నట్లా అవమానిస్తావు? తాతయ్యకి వాళ్ళ నాన్న బహుమతిచ్చింది.

వంశపారంపర్య సంపద కాదూ అది? నేను ఆగనే నానమ్మా… నువ్వేం చెప్పినా నేను వినను. నీకు తాతయ్య గుర్తుకు రాడూ, తాతయ్య ప్రేమ గుర్తుకు రాదూ, ఆ మంచం చూస్తే… అలా దానికి నల్ల ముసుగేసి సమాధిలా కప్పెయ్యటం తాతయ్యని అవమానించినట్లు కాదూ… నాకైతే అట్లానే అనిపిస్తుంది. నాకు తాతయ్యంటే ఇష్టం… గౌరవం రెండూ… నన్నెంత గారవం చేసాడు తాతయ్య… ఎన్ని బెడ్‌ టైం స్టోరీస్‌ చెప్పేవాడనీ ఆ మంచం మీద కూర్చోపెట్టుకుని? ఆ కథలు వింటూ కలలు కంటూ ఎంత కమ్మగా నిద్రపోయేదాన్ననీ… ఎంత బాధ్యతగా అన్పించేదనీ ఆ మంచం మీద నీకేం తెలుసు? ఆ మంచం నాకు నాన్న గ్నాపకం కూడా… నేనిక ఊర్కోను. మంచం మీది నల్లదుప్పటి తీసేసి నందివర్ధనమంత తెల్లటి, తాతయ్య మనసంతటి మెత్తటి దుప్పటి పరుస్తాను అదిక నాది. వంశపారంపర్యంగా కూడా నాకే వస్తుంది. ఇక నీ మాట వినను. నాకా మంచం కావాలి అంతే… ఏవిటీ నీ మంచం ఇస్తావా వద్దు. నాకు తాతయ్య పట్టె మంచమే కావాలి.

సంక్రాంతికి పాపాయిని తీస్కుని ఎప్పట్లానే ఊరొస్తున్నాను. ఈసారి మంచాన్ని నాతో తీస్కునే వెళతాను. ఎప్పట్లాగే నన్నాపకు చెబుతున్నా…  

ఉంటానే నానమ్మా గుడ్‌నైట్‌.. ఫోన్‌లో ఆద్య గొంతు గలగలా సాగిపోయి టక్కున ఆగిపోయింది. ‘కాదే ఆద్యా… నా మాట విను ఒక్కసారి. నీకేం తెలుసనీ’ అంటున్న వత్సల మాటలు కొట్టి పడేస్తూ ఫోన్‌ పెట్టేసింది. ‘ఏమంటుంది అత్తయ్యా ఆద్య మళ్ళీ అదే గోలా.. ఆ పందిరి అదే మీ పట్టె మంచం కావాలంటుందా?’ అంటూ అడిగింది కోడలు ప్రసూన. అవును ప్రసూనా అంటూ వత్సల భారంగా నిట్టూర్చింది. మనమరాలు ఆద్యతో సంభాషణ ఆమెలో అలజడిని రేపింది. నిద్ర దూరమైంది. ఏది మంచి గ్నాపకం… ఏది చెడు గ్నాపకం… ఈ గ్నాపకాలకీ ముద్రలు ఏమిటి… రంగూ రూపం ఏమిటి? భయం… ఆందోళన… సంతోషం… పులకరింత… దుఃఖం లాంటి భావోద్వేగాలేంటి… అవును వుండవా మరి? అన్నీ మన అనుభవాలని బట్టేగా, ఆ అనుభూతుల నుంచేగా ఈ ఆలోచనలూ… భావనలు ఒత్తిడీ, విరక్తీ, అసహ్యం, కోపం, ప్రేమ, ఇష్టాయిష్టాలు అన్నీ మొదలయ్యేవి? ఆద్య చిన్న పిల్ల దానికేం అర్థమవుతుందనీ? ఆ పట్టె మంచం చుట్టూ బోల్డంత ప్రేమ, ఇష్టం పెంచుకుంది చిన్నప్పట్నించీ. ఆద్యకి అది ఒఠ్ఠి చెక్క మాత్రమే కాదు. నానమ్మ, తాతయ్య, అమ్మ నాన్నల ప్రేమల్ని పందిరి తీగలా పంచిన ప్రాణమున్న పందిరి మంచం అది. ఆద్య జ్ఞాపకాల్లో పందిరి మంచానికి ఉన్న విలువ అది.

వత్సల మెల్లగా లేచింది. తన గది పక్కనే ఉన్న మెట్లు ఎక్కి మేడపైన ఒకప్పటి తమ పడకటింట్లో ఆ రాత్రి పూట మెల్లిగా తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది. వత్సలకి ఒక్కసారి గుండె గుభిల్లుమంది. విశాలమైన గది. టేకుతో చేసిన దృఢమైన తలుపులు, కిటికీ రెక్కలు. గదంతా బూజు పట్టి ఉంది. చీకటి, చీకటి భయం పుట్టించేలా ఉంది. అలవాటున్న వైపుకి తిరిగి లైటు వేసింది. రకరకాల పాత ఇత్తడి, ఇనుప సామాన్లతో బిందెలు, పళ్ళాలు, ఇస్త్రీ పెట్టె, రోళ్ళు రోకళ్ళు, తిరగళ్ళు, నీళ్ళు కాచుకునే పెద్ద తాంబాళం, పాత కుర్చీలు ఉయ్యాల బల్లలు, ఏవో రేకు డబ్బాలు. నాగళ్ళు, పారలు, గడ్డపారలు గోడలకు వ్యవసాయ పనిముట్లు, ఆవులకీ బర్రెలకీ మెడలో వాడే పేను తాళ్ళు, పూసల దండలు… గోడకి వేలాడేసిన నులక, నవారు మంచాలు చిన్న పిల్లల ఆట వస్తువులు పాత బూరుగు పరుపులు, నేల మీద పర్చుకునే జంబుఖానలు, గదంతా వస్తువుల రూపంలో గ్నాపకాలు కుప్పబోసినట్లో ఆరబోసినట్లో, వేలాడదీసినట్లో గోడలకి వాలిపోయినట్లో ఉన్నాయి. వత్సల దృష్టి గది చివరలో ఒక మూల నిలువెత్తుగా నిలబడ్డ నల్ల దుప్పటిపై పడి భూతంలా భయపెట్టింది. అదీ తన భర్త విశ్వేశ్వరరావు అంతెత్తు… ఆరడుగుల పొడవు… కోర మీసాలు… మంటలు ఎగుస్తున్నట్లు ఎఱ్ఱగా మండే కళ్ళు తెల్లటి పంచా కుర్తా, మెళ్ళో పులిగోరుతో వేలాడే ఐదారు తులాల బంగారు గొలుసు, కుడిచేతికి బంగారు కడియం, వేళ్ళకి రంగురాళ్ళ బంగారు ఉంగరాలు, మందంగా ఉండి ముందు వైపు పైకి లేచి గుండ్రంగా తీగ చుట్టినట్లు ఉండే శ్రేష్టమైన తోలు చెప్పులు… చూస్తేనే భయం గొలిపే ఆకారం భర్తది. ఊరికి సర్పంచు… దొర. వందెకరాల ఆసామీ. పోయాడు కానీ ఇప్పటికీ భయపెడ్తున్నాడు. విరక్తి కలిగిస్తున్నాడు ఈ పట్టె మంచం రూపంలో వత్సల మెల్లగా పట్టె మంచం వైపుకి వెళ్లింది. నల్ల దుప్పటిని ఒణుకుతున్న చేతులతో లాగింది. దుప్పటి తొలగి చిక్కటి కాఫీ గింజల రంగులోని టేకుతో చేసిన పట్టె మంచం తళ తళలాడిరది. వత్సల గుండె ఝల్లుమంది. ఒక చివర చుట్టి పెట్టిన బూరుగు దూదితో చేసిన మెత్తటి పట్టు పరుపు. మెల్లగా దాని మీద చెయ్యి పెట్టింది వత్సల. ఒక్కసారిగా తన చేతిని భర్త పరుపు లోపలికి అదాటున గుంజుకున్నట్లు అన్పించి వెంఠనే భయంతో వెనక్కి తీస్కుంది. తన భర్తనా… ఈ పట్టె మంచమా తన జీవితాన్ని శాసించింది? వత్సల మంచాన్ని పరీక్షగా చూసింది. 

పందిరి మంచమైన పట్టె మంచాన్ని పట్టి పట్టి చూసింది. తన భర్త నుంచి కొడుకుకు చేరిన ఈ పట్టె మంచం కాస్తా వాడి అభిరుచికి తగ్గట్లుగా పందిరి మంచంగా మారింది.

ఇద్దరు మగవాళ్ల చేతులు మారిన ఈ పట్టె మంచం వాళ్లంత దృఢంగా, కఠినంగా అలాగే ఉంది నిశ్చలంగా. భయం వెరపు తనకేగా… తన ఎదురుగా ఉన్న మంచం… నల్లటి పాములా తళతళా మెర్సిపోతూ వేయి పడగలు విప్పి బుసలు కొడుతూ తన మీదకు దుంకుతున్న భ్రాంతి కలిగి ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేసింది వత్సల. ఈ మంచం ఇప్పుడు తననేమీ చేయలేదు. మంచం యజమానీ లేడు కానీ… ఈ మంచం అణువణువూ అతనిలాగే  ఉంది. ఈ మంచం తనను కిందికి తోడి పడేసింది, కొట్టింది, కొరికింది, రక్కింది. ఈ మంచం తనను రేప్‌ చేసింది. తన రక్తం తాగింది. ఈ మంచం తన ఆత్మాభిమానాన్ని చంపేసి అతగాడితో వ్యభిచారం చేయించింది. పరస్త్రీలతో కూడా తన భర్తను వ్యభిచారం చేయించిన మంచం ఇది. మామూలు మంచం కాదు ఇది. వత్సల మంచం తలవైపు ఉన్న కఠినంగా మెరుస్తున్న టేకు చెక్కలను తిరస్కారంగా… కోపంగా చూసింది. బయటి వైపు ఉన్న మంచం కర్రలు కత్తీ, డాలుతో భర్త కృారమైన చేతుల్లా కనిపించాయి. తనని నలిపేస్తూ, వత్తేస్తూ, తోసేస్తూ, కొట్టేస్తూ మామూలుగానా… ఒద్దంటే గుద్దులు… పిడిగుద్దులే తొడ పాశాలే. అవునీ  నల్లటి మంచం అణువణువూ అతనిలాగే ఉంది. అతనూ ఈ మంచంలానే ఉన్నాడు. కృార జంతువులు తిరిగే దట్టమైన కీకారణ్యంలో మాటు వేసి దాడి చేసే నల్లటి ఎలుగ్గొడ్డులా…

ఈ విషయాలు ఆద్యకెలా చెప్పాలి? కనీసం వాళ్ళమ్మ ప్రసూన అయినా చెప్పి ఉంటుందా? ఎలా చెపుతుందీ. తనే చెప్పకోలేకపోతుంది. ఆద్యకీ మంచంతో అన్నీ మధురమైన అనుభవాలు తాతయ్యతో, నాన్నతో, తనతో, వాళ్ళమ్మతోనూ… మంచి గాఢమైన నిద్రపోయేది. బహుశ మధురమైన కలలు కూడా కని ఉంటుంది. బాల్యం కదా… చెంగున ఎగిరే కుందేటి పిల్లలు, గలగల పారే సెలయేళ్ళు… తాను తన జీవితాన్ని జార్చుకున్నట్లు చెప్పు జార్చుకున్న సిండ్రెల్లాలు, చందమామలు, అమ్మ నానమ్మ గోరుముద్దలు చెప్పిన బెడ్‌ టైం కథలూ… ఇవన్నీ కలలు కంటూనే నిద్రపోయేది ఈ మంచం మీద… ‘నానమ్మా రాత్రి ఏం కలొచ్చిందో తెలుసా?’ అంటూ కలల్ని కథల్లా చెప్పేది కాదూ? అంత ఎత్తు మంచం ఎక్కలేక అవస్థ పడేది. స్టూలేస్కుని తానే ఎక్కేది… ఎగిరి దుంకేది… కుందేలు పిల్లలా పొర్లుతూ గలగలా నవ్వేది. మంచం కింద దాక్కునేది ఎవరికీ తెలీకుండా. అచ్చం తనలా… అవును తనలాగే… తానూ దాక్కునేది కాదూ… ఆ మంచం కింద ఆ రాక్షసుడికి దొరక్కుండా. ఆటలో ఆద్య అలా దాక్కుంటే ‘‘నా బంగారు తల్లీ బయటకు రామ్మా అన్నం తిందువు, చూడూ బయటకొస్తే చాక్లెట్‌ ఇస్తాగా రాత్రి బజ్జునే ముందు కథ చెబుతాగా రా కన్నమ్మా?’’ అంటూ బ్రతిమి లాడేవాడా తన మనుమరాలిని? కానీ ఇదే మంచం కింద, అలాగే దాక్కుని భయంతో ఒణుకుతున్న తనను కర్రతో పొడుస్తూ, బూతులు తిడుతూ, అందిన జుట్టో, కాళ్ళో పట్టి ఈడుస్తూ అంది పుచ్చుకుని మంచెం మీద పడేసి చెంపలు వాయగొడ్తూ తన రాక్షస క్రీడ ముగించేవాడు కాదూ… నోట్లో గుడ్డలు కుక్కి మరీ… ఏడ్చేది అరిచేది ఒద్దని కాళ్ళమీద పడేది… అప్పుడు తనెంతదనీ…? పధ్నాలుగేళ్ళదే కాదూ… చిన్నది.. పసిదీ కాదూ! అదిగో ఆ రాక్షసకాండ ఫలితమే తన కొడుకు మహీధర్రావు. తండ్రి రూపమూ… బుద్దీ రాక ఎటుపోతాయి? అంతెత్తున నల్లగా తళతళ్ళాడిపోతూ తన ముందు నిలబడ్డ ఆ మంచాన్ని దీర్ఘంగా చూసింది వత్సల. మంచం తలవైపు మధ్యలో క్రూరమైన పులి బొమ్మ నోరు తెర్చి కోరలతో… అచ్చం తన భర్త విశ్వేశ్వరరావు మొఖంలా… విచ్చుకుని… గుండెక్కడో భయంతో లయ తప్పింది! నిట్టూర్చి మెల్లగా దుప్పటి కప్పేసింది… కృారమైన గాయం. చేసిన కత్తిని కవచంలోకి దించేస్తున్నట్లు. సడి కాకుండా తలుపు మూసి తన గదిలోకి వచ్చింది. తన మంచం వైపు ఎంతో ఆత్మీయంగా చూస్కుంది. తేనె రంగు చెక్కలతో చేసిన మంచం. ఏ గాయాల్నీ… పీడ కలల్ని… ఇవ్వని మంచం. కమ్మటి ప్రశాంతమైన నిద్రనిచ్చిన మంచం, తన మంచం… తనది మాత్రమే అయిన మంచం. అమ్మలాంటి మంచం, నాన్నలాంటి మంచం, నానమ్మలాంటి మంచం కూడా. భర్తపోయాక ఎంతో ఇష్టంగా చేయించుకున్న మంచం. వత్సల వెళ్ళి ఆ మంచంపై కూర్చుంది. ప్రేమగా పరుపుని నిమురుతూ ఆ స్పర్శ సుఖాన్ని అనుభూతి చెందుతూ మోర ఎత్తి కళ్ళు మూసుకుని, దీర్ఘశ్వాస తీసుకుంది. తన భర్త గదిలోని పట్టె మంచం ఇంత మెత్తగానూ ఉంటుంది కానీ కత్తిలా గుచ్చుతుంది. అచ్చం అతనిలా… అతని కర్కశమైన వేళ్ళకి ముళ్ళలాంటి గోర్లలా… పులికుండే కోర పళ్ళలా… అతని పళ్ళు. అతని రెండు కాళ్ళ మధ్య కృారంగా పొడుచుకు వచ్చే అతని మగాంగం, అచ్చం తోటలో మట్టిలో దిగబడిపోయిన గునపంలా. అసలు అన్నీ… గోళ్ళూ, పళ్ళేనా.. అతని దేహమంతా కలిసి ఓ కత్తిలా మారిపోయి తన దేహంలోకి దిగబడి పోయేది కాదూ? అతగాడికీ… అతని పట్టె మంచానికీ మంచానికీ… పరుపుకీ, తనదైన ఈ మంచానికి ఉన్న మృదుత్వం ఏదీ? తన మంచం ఇచ్చినంత శాంతీ… రక్షణా అతగాడి పట్టె మంచం ఎప్పుడిచ్చిందనీ… కత్తులతో, గునపాలతో, ముళ్ళతో తనని హింసించి సుఖపడి తనని గాయపరిస్తే కారిన రక్తపు మరకలతో, తనని హింసించి సుఖపడి అతడొదిలిన వీర్యపు మరకలతో నిండిన ఆ మంచం, అతను  తాగి, తాగి చేస్కున్న వాంతులతో భయపెట్టి దూరాలకి తరిమేసింది కానీ అక్కువెప్పుడు చేర్చుకుందనీ… వత్సల నీరసంగా మూల్గింది. మెల్లగా మంచంపై వాలి దుప్పటిని మెడదాకా కప్పుకుని కళ్ళు మూస్కుని దుప్పటి, కన్నీళ్ళ వెచ్చదనాన్ని కలసి అనుభవించింది.

భర్త కౌగిలీ అతగాడి మంచమూ ఇవ్వలేని శాంత్వనని, రక్షణనీ తన ఈ మంచం ఇవ్వడం ఏవిటీ… ఒక వస్తువైన కర్రముక్క భయాన్ని కలిగించడం… అదే ఇంకో రూపంలో రక్షణగా భద్రతగా అనిపించడం వింత గాకపోతే ఏవిటి మరి? వింతేముందిలే… అది అతని మంచం. తనని ఆ గదిలో తోడేలులా తరిమిన మంచం, పులిలా పంజా విసిరిన మంచం, అతని మంచం! తనని ఏమీ చేయని గాయపరచని మంచం… కన్న తల్లిలా అక్కున చేర్చుకుని నిద్రపుచ్చే మంచం… ఇది తన మంచం తనదైన మంచం… ఈ మంచం ఇస్తుంది ఆద్యకి… తాత పట్టె మంచం ఇవ్వదు గాక ఇవ్వదు. అంతే!

వత్సలకి ఒక్కసారిగా తన పుట్టింటి పట్టె మంచం గుర్తొచ్చింది. వెంఠనే ఆమె మనసు పరిమళం కమ్మిన తోటలా పరవశించిపోయింది. కళ్ళముందు పట్టె మంచం కదలాడిరది. ఎంతందమైన మంచం అదీ… అచ్చం పండగ పూట గుమ్మానికి కట్టెన మెరిసిపోయే ఆకుపచ్చని పచ్చి మామిడాకుల, పుప్పొడి సువాసనతో విరగబడిపోయే బంతిపూల తోరణంలా కళ్ళల్లో, ముఖ్యంగా అమ్మ మొఖంలో, చేష్టల్లో, చూపుల్లో ఆ మంచానికి సంబంధించిన గ్నాపకాలు అచ్చం పెరట్లోని మల్లె పందిరికున్నంత కళతో వెలిగిపోయేవి. నాన్న గ్నాపకాలు వర్షం కురిసి తడిసిన నందివర్ధనం పూలలా మెత్తగా అమ్మ కళ్ళను తడిపేవి. తన పట్టె మంచాన్ని మనిషిని తడిమినట్లే తడుముతూ నాన్నని ప్రియంగా తల్చుకునేది. ఎవర్నీ ఎక్కనిచ్చేది కాదు తనని తప్ప. పూజ గదిలో గంధపు చెక్కలా మంచాన్ని కాపాడుకునేది. అలా అమ్మ నాన్న గ్నాపకాల పరిమళాల్ని అస్వాదించేది కావచ్చు బహుశా. ‘‘అట్టా ఏడుస్తే ఎట్టాగే శాంభవీ… మనిషెట్టాగూ పోయాడు. అసలు ముందు ఆ మంచాన్ని వాడి బట్టల్ని, వస్తువుల్నీ పైన గదిలో పెట్టేసి తాళం వేసేస్తాను ఉండూ… ఏవిటే ఇది రాత్రింబగళ్ళూ వాడి ధ్యాసే ఉంటే ఎట్టాగా’’ అంటూ అమ్మను ప్రేమగా మందలించేది నానమ్మ. 

ఆ మంచం తాతయ్యనే నాన్న కోసం చేయించాడు. నిజమే… మంచి గంధం చెక్కలాంటి ఆ మంచం ఎంతందమైందసలు. తలవైపు, పాదాల వైపు పూలూ, లతలూ, చందమామలూ ఉండేవి గొప్ప నగిషీ పని ఉండేది. తాతల నాటి కాలం మంచం మరి. మంచానికి  సొరుగులుండేవి. వాటిలో ఏవో మందులు అమృతాంజనం, నొప్పి తగ్గించే చిక్కటి తైలాల చిన్ని సీసాలు, ఆకువక్కల ఇత్తడి డబ్బా ఉండేది. లోపల వక్క విరిచే ఇత్తడి కత్తెర, సున్నం, కాసు డబ్బాలు, తమలపాకులూ ఉండేవి. తాతయ్యకి కట్టిచ్చేది నానమ్మ తాంబూలం. అమ్మ కూడా నాన్నకి తాంబూలం కట్టిచ్చేది. తీరిగ్గా వసారాలోని చెక్క ఊయల్లో ఊగుతూ ఎంతో ఇష్టంగా తాంబూలం నములుతూండేవాడు నాన్న. కాకపోతే కొంచెం మంచం ఎత్తులో ఉండేది అచ్చం తన భర్త మంచంలా… చిన్న స్టూలు పెట్టుకొని ఎక్కేది అమ్మ. ఎక్కేప్పుడు ముద్దుగా విసుక్కునేది ‘ఏం మంచఁవో ఇది తనెత్తు చూస్కుంటే సరా మీ నాన్న.. నేనెక్కదేంటీ’ అని. 

మంచం కింద కొన్ని ఇత్తడి సామాన్లు మెరుస్తూ కనపడేవి. ఏవో మూటలు, తాళమేసిన అల్యూమినియం ట్రంకు పెట్టెలు ఉండేవి. అందులో తన పుట్టింటి వస్తువులేవో ఉండేవి. మా అమ్మమ్మ జరీ అంచు చీరలు… ఇత్తడి ముంతలు, సీతారాముల ఫోటోలు… వాళ్లు వాడిన రుద్రాక్ష మాలలు, రాములోరి వెండి పాదరక్షలు… తాతయ్య వాడిన కళ్ళద్దాలు, చదివిన భగవద్గీత, రామాయణ భాగవత పుస్తకాలు ఇలా ఎన్నో ఉండేవి. అన్నీ అపురూపమే అమ్మకు. ‘మీ తాతయ్య నాన్న కోసం చేయించిన మంచం’ అనేది. మంచం పైన సుతిమెత్తని బూరుగు దూది పరుపు. రంగు రంగుల నానమ్మ నేత చీరలతో కుట్టిన మృదువైన బొంత… తెల్లని సైను గుడ్డలతో నేసిన దుప్పటి ఉండేది. అసలు ఆ మంచం మీద పడుకుంటే చల్లని వెన్నల్లో ఆకాశం మెత్తని మేఘాల మీద తేలిపోతున్నట్లు ఉండేది కాదూ… నానమ్మ చీరలతో కుట్టిన బొంతలు కప్పుకుంటే వెచ్చగా నానమ్మను కౌగలించుకుని పడుకున్నట్లే ఉండేది. నానమ్మ ఆ మంచం మీద ఎన్ని కథలు చెప్పి నిద్ర పుచ్చేదనీ… తన కోసం బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర పుస్తకాలు చదివి మరీ చెప్పేది. తననొక అద్భుతమైన ఊహా ప్రపంచంలోకి తీస్కెళ్ళేవి ఆ కథలు. అందులో వడ్డాది పాపయ్య బొమ్మలు, పెద్ద పెద్ద కళ్ళున్న ఆడవాళ్ళ బొమ్మలు, పొడుగాటి జడలు, తల్లో పాపిట బిళ్ళలు, ముక్కు పుడకలు, ఎన్నో రంగు రంగుల చీరలు, అడవులు, రాజ మందిరాలు పచ్చటి పొలాలు బక్క చిక్కిన అమాయకమైన రైతుల బొమ్మలు అబ్బో అన్నీ ఎలా చూస్తూ ఉండిపోయేదని. ఎంత అపురూపమో ఆ బొమ్మల కథల పుస్తకాలు. తనకి ఆ కథలూ మరీ ముఖ్యం. నాన్నమ్మ కథలు చెప్పేటప్పటి ఆమె హావభావాలు అబ్బురంగా ఇష్టంగా చూస్తుండిపోయేది తను. కథలు వింటున్నప్పుడు దుఃఖం, నవ్వూ వచ్చిన తన ముఖాన్ని నాన్నమ్మ దగ్గరకు తీస్కుని ముద్దు పెట్టుకునేది. కథలు వింటూ కిలాకిలా నవ్వుతూ ఊఁకొడుతూ ఆ మంచం మీద ఎప్పుడు నిద్రపోయేదో తెలిసేది కాదు. 

ఆ పట్టె మంచం మీద నానమ్మ మెత్తని గుండెల మీద పడుకుని నిద్రపోయేది. గదిలోకి వచ్చిన అమ్మకి జాగ్రత్తగా… తనకు మెలకువ రాకుండా తననించి నన్ను విడదీసి పడుకోబట్టి, దుప్పటి కప్పి నుదుటి మీదో ముద్దు పెట్టి వెళ్ళిపోయేది. తర్వాత అమ్మ ఒడిలోకి తన దేహమూ, నిద్రా బదిలీ అయ్యేవి.  తనను తన గదిలోకి తీస్కెళ్ళేది కాదు అమ్మ. పడుకోవడానికి వచ్చిన నాన్నని చూస్తూ ‘‘పోదురూ చావిడీ గదిలో పడుకోండి వసు తల్లి నిద్రోతుంది’’ అనేది. ఆ మంచం మీద పడుకుంటే అమ్మ నాన్నల కౌగిట్లో ఉన్నట్లే ఉండేది. ఏవో మల్లెల పరిమళాల్లో తేలుతున్నట్లే ఉండేది. అమ్మ తన తలలో తరుముకున్న మల్లె దండను మరునాడు చీపురుతో ఉడ్చేది కాదు. తలవైపు మంచానికి వేలాడ దీసేది. చీపురుతో వూడిస్తే పూలని అవమానించడమట. వాడాక కూడా సువాసన వస్తాయే వసుతల్లీ అనేది. నిజమే ఆ మంచం పై మధ్యాహ్నం పూట పడుకుని కళ్ళు మూస్కుని గాఢంగా గాలి పీలిస్తే.. మంచానికి వేలాడే ఆ ఎండిన మల్లెమాల నుంచి అలా సువాసన గుండెల్లో నిండిపోయేది. ఎండిన మల్లెల వాసనకీ… తాజా మల్లెల వాసనకీ తేడా స్పష్టంగా తెలిసేది. అసలు అమ్మ గది అంటేనే అందం. కిటికీ తెరిస్తే చందమామ, నక్షత్రాలు, వెన్నలా వర్షాల్లో వాన చినుకుల వెండి ధారలు… గదిలోకి చొచ్చుకొచ్చే సూర్యకాంతీ డాబా మీదకి కిటికీ పక్కల్నించి ఎగబాకిన మల్లె, మాలతీ, సన్న, విరజాజి తీగలు… వాటి నుంచి కిటికీలోకి ప్రవహించే సువాసనలు, వెన్నల చల్లదనాలతో కలిసి మత్తెక్కించి నేను పడుకునే పట్టె మంచానికి ఎంతందాన్నిచ్చేవని? నా బాల్యాన్నే కాదు, నా యవ్వన దినాల్ని కూడా వెలిగించిన పట్టె మంచపు గది అది. గదిలో ఓ పక్క గోడకి వాల్చిన మడత, నవారు మంచాలు.. వచ్చీ పోయే బంధువుల కోసం… అయినా అందం చెడేదా… ఊహూ!

తన యవ్వన దినాలన్నీ ఆ కిటికీ వైపు చూస్తూ చదువుకుంటూ రాస్కుంటూ గడిపేది. అమ్మ నానమ్మా వంటింట్లో, నాన్న పొలం పనుల్లో వ్యవహారాలు చక్కబెట్టుకుంటుంటే తను ఎంచక్కా అమ్మ పట్టె మంచం ఆక్రమించుకునేది. మత్తైన మధ్యాహ్నపు నిద్రలన్నీ ఆ మంచం మీదే. అమ్మ వచ్చి ‘‘లే వసూ నాన్నారు వచ్చారు నీ గదిలోకి పో’’ అంటూ లేపేది. ‘‘మరి నాకూ ఇలాంటి పట్టె మంచం కావాలి నా గదిలోకి’’ అని మారాం చేస్తే ‘‘నీ అత్తారింట్లో ఉంటుంది లేవే మన వంశంలో అందరిళ్లలోనూ పట్టె మంచాలున్నాయి  కదా మరి నీ అత్తారింట్లోనూ ఉంటుంది లేకపోతే మీ ఆయన్నడిగి చేయించుకో’’ అనేది. తను తన కాబోయే అత్తారింట్లో తన పుట్టింటి పట్టె మంచం కన్నా అందమైన పట్టె మంచం ఊహించుకుంది. అవే పూల తీగలూ.. చందమామతో. అదే పరిమళాల పూల తీగెల్ని, చందమామల్ని నక్షత్రాల్ని వెన్నలనూ మోసే విశాలమైన కిటికీతో సహా. అమ్మ ప్రేమించినంతగా ప్రేమించాలి తను ఆ మంచాన్ని. అమ్మ తన్నూ…  అన్నయ్యనూ కన్నాక ఆ మంచం అమ్మ దేహపు పచ్చి బాలింత వాసన్ని… సుకుమారమైన తమ పసిపాపల దేహ పరిమళాలలో ఘుమాయించి పోయి ఉంటుంది. అమ్మకి ఆ పట్టె మంచం అంటే ఒక్క నాన్న గ్నాపకలేనా… తమ ఇద్దరి పిల్లల శైశవ, బాల్య గ్నాపకాలు కూడా కదా… తన అత్తారింట్లో పట్టె మంచం కూడా తన పిల్లల గ్నాపకాలని గుర్తు చేసేది. కానీ తాను దాన్ని ఆస్వాదించలేకపోయేది. తనకి ఆ గర్భాల, ప్రసవాల ముందర తన సున్నితమైన దేహం మీద తన భర్త చేసిన రాక్షస కాండే ఎక్కువగా గ్నాపకం వచ్చేది. కానీ అమ్మకలా కాదు. అమ్మకెప్పుడూ పట్టె మంచం అంటే సువాసనతో ఘుమఘుమలాడిపోయే మంచి గంధపు చెక్కనే. లేకపోతే నాన్న తెచ్చి అమ్మ తల్లో తురిమే మల్లె పూల చెండు!

ఇదిలా ఉంటే… నా టెంత్‌ పరీక్షలు కాంగానే అన్నయ్య పెళ్ళి అయిపోయింది.

నాన్న అన్నయ్య కోసం కూడా విశాలమైన పట్టె మంచం చేయించాడు. వదినెప్పుడూ దిగాలు మొఖంతో తిరిగేది. అమ్మ ‘ఏవైంది కుసుమా’ అని ఎంతడిగినా చెప్పేది కాదు. ‘కోడలెందుకురా అలా చిన్నబోయి ఉందీ.. శాంభవీ కనుకో’’ అనేవారు నాన్న. ఖంగారుగా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా మొఖం తిప్పుకునే అన్నయ్యను అనుమానంగా చూస్తూ. తనడిగినా చెప్పేది కాదు వదిన. ఒకరోజు స్నానం చేసి చీర కట్టుకుంటున్న వదిన గదిలోకి వెళ్ళింది తను. వదిన కొంగు ఇంకా కప్పుకోలేదు ఆమె ఛాతీ మీద ఎర్రగా పళ్ళతో కొరికిన గాట్లు కనపడ్డాయి. ‘వదినా ఏంటివి’ అని భయంగా అరిచింది తను. ఖంగారుగా ‘అబ్బే ఏం లేదు’ అంటూ  కొంగు కప్పేస్కుంది. తనకి వెంఠనే అర్థమయ్యింది. అన్నయ్య మీద కోపం వచ్చేసింది. వాడెపుడూ దూకుడు వెధవే! చిన్నప్పుడు తననీ, తన స్నేహితులను, ఇంట్లో పశువులను కొడుతూండేవాడు. అమ్మా నాన్న ఎంతో కష్టపడి మాన్పించారు ఆ అలవాటు వాడికి. కానీ అదంతా అప్పుడు అణిగిపోయి భార్య కదా నిస్సహాయ, ఆధార జీవి… వదిన దొరికే సరికి ఆమె మీద తీర్చుకుంటున్నాడు. తను అమ్మకి చెప్పగానే అమ్మ పరిగెత్తింది ఒదిన గదిలోకి.

‘‘వాడు రాక్షసుడండీ… ఒక్క ఛాతీ మీదే కాదు చాలా చోట్ల ఉన్నాయి గాయాలు’’ అంటూ ఏడ్చింది అమ్మ. నాన్న ఆగ్రహోదగ్థుడై పోయాడు. అన్నయ్యని గదిలోకి పిల్చి చెంప ఛెళ్ళుమన్పించాడు. అలా కొడుతూనే ఉన్నాడు చెంపలు ఎర్రబారేదాకా. ముంచేతి వేళ్ళ గోర్లతో అన్నయ్య భుజం కింద రక్కులు పడేంతగా గిల్లుతూ నొప్పితో విలవిల్లాడ్తూన్న అన్నయ్యను ‘‘ఏం కమ్మగా ఉందీ ఇలా చేస్తుంటే… నువ్వే మనిషినా… నీకే నొప్పి తెలుస్తుందా… నీ భార్య మనిషి కాదూ’’ అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇదంతా జరిగింది వదిన ముందే. ‘‘యాఁవనుకుంటున్నావురా భార్య అంటే.. రోజూ దీపం పెట్టే తులసీ మొక్కంత పవిత్రంగా… అన్నం పెట్టే అమ్మంత మమకారంగా చూస్కోవాలిరా… ఏవిట్రా ఆ హింస కుసుమ మీద నీకేం హక్కుందీ? మనిషివా లేక కృార జంతువ్వారా… నా కడుపున ఎట్టా పుట్టావురా ఛీ నా కంట కనబడమాకు… ఇక కుసుమను ముట్టుకుంటే ఊర్కోను ఫో ఇక్కడ్నించి’’ అని అరిచేసాడు.

‘‘మమ్మల్ని క్షమించమ్మా…’’ అంటూ కుసుమను కన్నీళ్ళతో వేడుకున్నాడు. వదినకి కొన్ని రోజులు అమ్మే అన్నీ చూస్కుంది. వదిన గాయాలకి మందు రాసింది. తర్వాత ‘నువ్వు కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళిరా తల్లీ వాడికి బుద్దొచ్చి నువ్వు క్షమించేంత వరకు ఇటు రాబాకు’ అంటూ తనే తీస్కెళ్ళి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు నాన్న. తను భయపడిపోయింది. అమ్మను కందకుండా అపురూపంగా దేవతలా చూస్కునే నాన్నెక్కడ… అన్నయ్యెక్కడ? రేపు తన భర్త కూడా అన్నయ్యలాగా తన ఒంటి మీద గాయాలు చేస్తాడా? అసలెందుకు మగాడట్లా గాయాలు చేస్తాడు అదే శృంగారమా? అమ్మో… తనకైతే అన్నయ్యలాంటి వాడు కాదు నాన్నలా ప్రేమగా చూస్కునే భర్త ఇవ్వు దేవుడా అని మనసులోనే వేడుకుంది తను.

కుసుమ వదిన వచ్చింది. కానీ అన్నయ్య వదినకు సారీ చెప్పే దాకా నాన్న ఊర్కుంటేగా? అన్నయ్య కూడా సిగ్గు పడ్డాడు… వదిన కోసం తపించిపోయాడు. ‘అమ్మా నాన్నకి చెప్పు కుసుమని పిలిపియ్యమని కొట్టను… బాగా చూస్కుంటాను. నీ మీద ఒట్టే అమ్మా’ అంటూ అమ్మని ఒకటే బ్రతిమిలాడితే… అమ్మే నాన్నకి చెప్పింది. ‘చూద్దామండీ, కోడల్ని తీసుకురండి’ అని.

నాన్నే అన్నయ్యని వాడి అత్తారింటికి తీస్కెళ్ళి వదినకి, వాళ్ళ అమ్మ నాన్నలకి ఇంకెప్పుడూ ఇలా జరగదని క్షమాపణ చెప్పించి మరీ కుసుమ వదిన్ని ఇంటికి తీస్కొచ్చాడు. అటెమ్మట అన్నయ్య మీద ఒదినెప్పుడూ కంప్లైంట్‌ ఇవ్వలేదు. అమ్మ నాన్నల నిఘా సరేసరి. అన్నయ్య మీద, వదిన మీద ఈగ వాలనిచ్చే వారు కాదు. ఇక అన్నయ్య మనిషిగా మారటం ఎంత సేపని?

‘ఇట్టాంటి మనుసున్న అత్తా మామా, ఆడబిడ్డా దొరకడం నా అదృష్టం’ అని కుసుమ వదినెంతగా మురిసిపోయేదనీ?

ఇక తన పెళ్ళి చేసారు టెంత్‌ అయ్యాక. పట్నం వెళ్ళి చదువుతానన్నా వినలేదు.

అత్తారింటికి ఎన్నో కలలతో… మరెన్నో భయాలతో అడుగుపెట్టింది. భయాలే నిజాలయ్యాయి. విశాలమైన పులిలాంటి పట్టె మంచం సాక్షిగా. తొలి రాత్రి ఎత్తైన పట్టె మంచం, పూలతో మూర్ఛపోయిందా అన్నట్లుంది. దానిమీద పుట్టింటి కొత్త పరుపులు పట్టు దుప్పటు. పక్కనే చెక్క బెంచీ మీద సారె లడ్డు, జిలేబీలు, పండ్లు, వెండి గ్లాసులో పాలు, పొడవాటి ఇత్తడి గ్లాసులో ఇసుక పోసి గుచ్చిన అగరవొత్తులు. ఆ రోజూ, ఆ తరువాత ఆ పట్టె మంచం ఎంత మాట్లాడిరదనీ… ఎన్ని రంగులు మార్చిందనీ… ఎన్ని కథలు చెప్పిందనీ. అసలు ఈ మంచానికెన్ని దుఃఖాలు.. కన్నీళ్ళు. పరుపంతా తడిసి చిత్తడిపోయేంత కన్నీటి సముద్రాలు. తనతో పాటు మంచమూ ఏడ్చిందా అన్నట్లు. ఈ మంచానికెన్ని కేకలూ, ఆర్తనాదాలు తానే అంత హింస పడ్తున్నంత.. తానే అరుస్తున్నంతగా ఎన్ని నొప్పి ఆపుకోలేని… ఆపుకునే మూల్గులనీ? అతను తోసేస్తే కింద పడిపోయి తలకి బొప్పి దెబ్బలు తగిలించుకోడాల్ని… తట్టుకోలేక తెచ్చుకున్న జ్వరాలనీ… స్పృహ తప్పడాల్ని… స్పృహ తెచ్చుకోడాల్ని భరించిందనీ… ఈ మంచం ఒక రక్తపు వాసనేనా.. తన దేహపు బాలింత వాసనని… తన పిల్లల లేత శరీరాల పసి వాసననీ విరజిమ్మింది కాదూ… అలాగే మెడబట్టి తనను గది బయటకు నెట్టేసి, తన భర్త తెచ్చిన పరాయి స్త్రీల ఒంటి అత్తరు వాసనను, వాళ్ళ నుంచి అతగాడు అంటించుకున్న సుఖ వ్యాధుల వాసనని… అసలా మంచం మీద తమ పడుకుంటేగా? బలవంతాన అతను తీస్కెళ్ళితే తప్ప? అతని పని కాగానే గది చివర్లో నవారు మంచం మీదే తన పడక.

ఆ సుఖ రోగాలతో కుళ్ళి కుళ్ళి సచ్చేపోయాడు తన భర్త. చివరి రోజుల్లోనే కింద చావిడీలో నులక మంచం వేసారతనికి. తీస్కుని, తీస్కునీ పోయాడు బీపీతో తలలో నరాలు చిట్లిపోయి. తర్వాత తను విశాలమైన తేనె రంగు చెక్కతో మంచి మంచం చేయించుకుంది. భర్త పట్టె మంచంతో సహా తన పడక గదికి తాళం వేసేసింది. అది కాస్తా పాత సామాన్లు దాచుకునే గదిలా మారిపోయింది. కానీ తన కొడుకు మహీధరరావు పట్టుబట్టి ఆ మంచం తన గదిలో వేయించుకున్నాడు. ‘ఒద్దురా ఒద్దు’ అని తనెంతో బతిమిలాడిరది. ఎందుకో ఒణికిపోయింది. ‘నాన్నగారి తర్వాత నాకేగా అమ్మా ఎందుకంత భయపడ్తావు’ ఈ మంచం ఏవన్నా పులా… సింహవా’’ అంటూ తన గదిలోకి మార్పించుకున్నాడు. ‘పులీ, సింహం కన్నా కృారమైందిరా మీ నాన్న మంచం’ అనుకున్నది తను తన మనసులో. ఎందుకో వాడి పెళ్ళి అయ్యాక శోభనం ఆ మంచం మీదే అంటే శుభంగా అన్పించలేదు. తన అన్నయ్య గుర్తొచ్చాడు. నాన్నా, అమ్మా ఎన్నో సార్లు ‘‘ఏమ్మా వత్సలా కాపురం ఎట్టా ఉందీ… అల్లుడేవైనా బాధ పెడ్తుంటే చెప్పు తల్లీ దాచుకోకు పుట్టింటుకొచ్చేయి’’ అని ఎన్నిసార్లడిగినా తానెందుకో చెప్పలేదు. పట్టె మంచం తన నుంచి కొడుక్కి  అంటే కోడలు ప్రసూనకి మారింది. కొడుకు దాన్ని కాస్తా కొంచెం పందిరి మంచంగా మార్చాడు. ‘ఆ పులి బొమ్మ తీసేసి ఎంచక్కా చందమామ బొమ్మ పెట్టుకోకూడదటరా మహీ’ అంటే ‘వద్దమ్మా అట్టాగే ఉండనీ పులి లాంటి నాన్నది కాదూ మరీ ఈ మంచం’ అంటూ గర్వంగా కొట్టి పడేశాడు వాడు. అనుకున్నంతా అయ్యింది. కుసుమ వదినకి చూసినట్లే కోడలు ప్రసూన పెదవి మీద, ఒంటిమీద రక్తపు గాయాలు చూసాక ఆ పట్టె మంచవూ, తన కొడుకూ రెండూ కోడల్ని కాటేస్తున్నాయనీ అర్థం అయ్యింది. ఒక రాత్రి ప్రసూన ఏడుస్తూ పడగ్గది నించి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి తన ఒళ్ళో ఒణికిపోతూ మూర్ఛపోయిన రోజు చూసిందా గాయాల్ని. అంతే తన తండ్రి అన్నయ్యని కొట్టినట్లే కొట్టింది కొడుకుని ఆగ్రహంతో… కట్టె విరిగే దాకా.

ఆ పట్టె మంచం తీసి మళ్ళీ పైకెక్కించేసింది. కొడుకు గదిలో మంచమే లేకుండా చేసేసింది. కోడల్ని తన దగ్గరే పడుకోపెట్టింది. అట్లా తన మంచం తనతో పాటు తనలాగే గాయపడ్డ తన కోడల్నీ అక్కువ చేర్చుకుంది. అసలు ఏంటిదంతా… ఈ పట్టె మంచాల మీదకి ఈ కృార మృగాల్లాంటి మగాళ్ళని రానిచ్చిందెవరసలు? అసలీ పట్టె మంచాల మీదకి తాతల్ని, తండ్రుల్ని, అన్నలని, బావల్ని, మొగుళ్ళనీ ఎక్కించే ముందు ఆ మంచాల మీదకి వచ్చే భార్యలతో ఎంత సున్నితంగా ఉండాలో చెప్పరెందుకు? తమ దరిద్రపు రసికత్వాలతో ఆడవాళ్ళని హింసించి లొంగ దీసుకునే వీరగాథలు తప్ప… వత్సలకు చిన్నప్పటి పాట గుర్తుకు వచ్చింది. 

బావా బావా పన్నీరు ` బావను పట్టుకు తన్నేరు.

వీధీ వీధీ తిప్పేరు ` వీసెడు గంధం పూసేరు.

చావిడి గుంజెకు కట్టేరు ` చప్పిడి గుద్దులు గుద్దేరు. 

కాళ్ళ పీటవేసేరు ` కడుపుల గుద్దులు గుద్దేరు.

పట్టె మంచం వేసేరు ` పాతిక గుద్దులు గుద్దేరు.

నులక మంచం వేసేరు ` నూరు గుద్దులు గుద్దేరు.

అసలు నిజంగానే పట్టె మంచాల మీదనో, నులక మంచాల మీదనో ఆడాళ్ళని హింసించే భర్తలకి నూరు కాదు కదా కోటి గుద్దులు పడినా మారతారా వాళ్ళు? ఈ పాట కూడా మరీ విచిత్రం… అసలు పట్టె మంచాల మీద ఎవరికి పడుతున్నాయి గుద్దులు, దెబ్బలు? ఎవరు అనుభవిస్తున్నారు. అంతులేని హింసలు? ఆడవాళ్ళు కాదూ? ఇప్పుడు తన భర్త బతికి ఉంటే రానిస్తుందీ… ఈ మంచం మీదకి? తన్ని తగలెయ్యదూ… కొడుకుని తన్నినట్లు? తన కొడుకు విషయంలో వచ్చిన తెగువ భర్తని కొట్టి పడెయ్యాలనో… పుట్టింటికి పారిపోవాలనో తన భర్త విషయంలో ఎందుకు రాలేదు తనకి? గుండెల్లో పెట్టుకుని చూసుకునే అమ్మ నాన్నలున్నా కానీ… ఎక్కడివీ కనిపించని ఇనుప సంకెళ్ళు? కానీ చాలాసార్లు మంచాన పడి నీలుక్కు పోతూ కూడా తన మీద పెత్తనం చేసే భర్తని చితక్కొట్టే యాలన్నంత కోపం వచ్చేది. అతను పిలిస్తే చాలా సార్లు పలికేది కాదు.

కానీ… తన భర్త వేరే ఆడాళ్ళను ఇంటికి తెచ్చుకోడం మొదలెట్టాక తనసలా గదిలోకే వెళ్ళడం మానేసింది దాదాపు. పైగా అతనెప్పుడూ బయటే ఉండేవాడు. కొడుక్కోసం ఆ విషాన్ని భరించింది. కొడుకు అలా కాకూడదని చాలా జాగ్రత్తగా పెంచింది. కొడుకు కూడా పట్టె మంచపు పామై కోడల్ని కాటేస్తుంటే, వాడి కోరలు విరిచి కోడల్ని కాపాడుకుని కొడుక్కి బుద్ధి చెప్పింది. అచ్చం నాన్నలా… కానీ.. కానీ ఆ రోజు ‘నా కడుపున ఎట్టా పుట్టావురా నువ్వు’ అని నాన్న అన్నయ్యని కొట్టినప్పుడు నానమ్మ ‘‘వీడివన్నీ వాళ్ళ తాతయ్య బుద్దులు రా గోపాలం ఎటు పోతాయి లక్షణాలు?’’ అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే… అమ్మా… తనూ నిర్ఘాంతపోయి, ఖంగారుగా దిక్కులు చూస్తూ పట్టుబడిన చెమ్మబారిన నానమ్మ కళ్ళవైపు చూసాం. చాలాసార్లు ‘నానమ్మా ఏమయ్యింది… తాతయ్య బాగా చూస్కోలేదా నిన్ను… చెప్పు నానమ్మా’ అని తను అడుగుతుంటే ‘‘ఎందుకే వత్సలా… పెళ్ళి కావల్సిన పిల్లవు ఎందుకా పాడు కబుర్లన్నీ వద్దు… నాకు బంగారం లాంటి కొడుకు దొరికాడు. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. నీకూ అట్టాంటి మొగుడే దొరుకుతాడు చూడు’’ అనేది విషాదంగా నవ్వుతూ.. గాజు కళ్ళతో ఎటో చూస్తూ. నానమ్మ నవ్వులోని విషాదం అప్పుడు తనని భయపెట్టింది.

ఇప్పుడు ఆద్య వంతు వచ్చింది. పిచ్చి పిల్ల ఆ పట్టె మంచం చూసినప్పటి నుంచీ కావాలని మొండి పట్టు పట్టేస్తోంది. దాంతర్వాత అది తన కొడుక్కి ఇస్తుందట. తనకా మంచం శుభకరం కాదు గాక కాదు తన కోడలు ప్రసూనకి కూడా. తండ్రి పట్టె మంచం పాత సామాన్ల గదిలో పడేసాక కొడుకు క్షమాపణ చెప్పాక మారాడని నమ్మకం కుదిరాక తానే చక్కటి మంచం పూల తీగలు, చంద్ర వంకల డిజైన్లతో చేయించింది వాడికి.

ఆద్యకి ఖచ్చితంగా చెప్పాలి ఆ పట్టె మంచం ఇవ్వను గాక ఇవ్వనని.

వత్సల భారంగా కళ్ళు మూస్కుంది కానీ అప్పటికే తెల్లారిపోయింది. ఇంకో వారంలో సంక్రాంతి. భోగి పండక్కి రెండ్రోజుల ముందు దిగింది ఆద్య తన కొడుకు, భర్తతో. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. వచ్చాక ఎన్నిసార్లు గుర్తు  చేసిందో పట్టె మంచం గురించి.. భర్తకీ చెప్పింది. ఆ మంచం అందచందాల గురించి. ‘మనమింక ఆ పట్టె మంచం వెళ్ళేప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌లో వేసేద్దాం’ అంటూ ‘నానమ్మా తాళం చెవి ఇవ్వు చూస్తాను’ అని ఒకటే వెంటపడిరది. ‘నువ్వు నానమ్మను సతాయించకు ఆద్యా…’ అంటూ కోడలు ప్రసూన కోప్పడిరది కూడా. మహీధరరావు మౌనంగా ఉండిపోయాడు కూతురికేం చెప్పాలో తోచక.

ఆ రోజు భోగి పండగ. వీధిలో పిల్లలంతా వత్సల ఇంటి ముందు చేరారు. వత్సల ఇంటి ముందే వీధిలో అందరి కంటే పెద్ద భోగి మంట వెలుగుతుంది ప్రతి యాడాదీ.

నాలుగేళ్ళ ఆద్య కొడుకు అర్విన్‌ కూడా నిద్ర లేచాడు. ఆద్య కూడా భర్తతో ఇంటి ముందుకు వచ్చింది. అంతా భోగి మంట చుట్టూ చేరారు. వత్సలా, ప్రసూనా కూడా. భోగి మంటలు పసుపు, ఎర్రని రంగుల్లో వాళ్ళందరి మొఖాల్ని వెలిగిస్తున్నాయి. జీతగాడు సాయిలు ఒక్కో దుంగా మేడ మీద నుంచి తెచ్చి  చేస్తున్నాడు. ఎక్కడ్నించో గాల్లో ఏ రైతు పాడుతున్నాడో… పాటొకటి తేలుతోంది. కుక్కలు, కోళ్ళు వాటి వాటి భాషలో అరుస్తున్నాయి. రోజూ తాగి పెళ్ళాన్ని కొట్టే పక్కింటి కిషన్‌ రెడ్డి తాగుతున్న సిగరెట్టు పొగ గుప్పుమని గాల్లోకి ఊదుతూ భోగిమంట వైపు నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. ఆ భగ భగ మండుతున్న భోగి మంటలు వత్సల గుండెలే మండుతున్నాయా అన్నంతగా ఆమె మొఖంలో రంగుల్ని మారుస్తున్నాయి. వత్సల మొఖం కసితో రౌద్రంగా మారిపోయుంది. పక్కనే ఉన్న ప్రసూన అత్తవైపు ఒంగి, ‘ఆద్య మంచం విషయంలో మొండి తనం చేస్తే దాని కథేంటో మీరెందుకివ్వదల్చుకోలేదో చెప్పెయ్యండత్తయ్యా. లేకపోతే అది వినేలా లేదు. మీరు చెప్పలేకపోతే నేను చెపుతాను. ఎర్రగా భగభగ మండుతూ వెలిగిపోతున్న భోగి మంటల్ని చూస్తూ.. అంది ప్రసూన. ‘లేదు ప్రసూ నేనే చెబుతాను’ అంది వత్సల ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. ఒక సంతృప్తి, సంతోషం, బాధ, దుఃఖం వెచ్చని కన్నీరై కారింది వత్సల చెంపల మీద. ‘అత్తయ్యా ఊర్కోండి’ అంది వత్సలను తన కళ్ళు తుడుచుకుంటూ, దగ్గరగా పొదువుకుంటూ ప్రసూన. ప్రసూన కళ్లల్లోనూ వత్సల కన్నీళ్లే కారుతున్నాయి. మొఖంలో అదే సంతృప్తి. ఇద్దర్ని చూస్తున్న మహీధరరావు చటుక్కున లేచి కొంచెం పక్కకెళ్ళిపోయాడు. చివర్లో భోగి మంటల్లో వేసిన పట్టె మంచపు పులి బొమ్మ ఫ్రేమ్‌ని చూసి ఆద్య ఆర్తనాదం చేసింది. ‘నానమ్మా ఏంటిది ఇది పట్టె మంచెం కదూ… ఎందుకిలా విరిచేసావ్‌… కాలుస్తున్నావు నేనడిగాను కదా…’ అంటూ వత్సలను ఆవేశంగా… కోపంగా ఊపేస్తూ అరిచేసింది.

పులి బొమ్మ ఫ్రేము ముక్క కాలిపోతుంటే… అందులో తన భర్త మొఖం కనపడిరది వత్సలకి. గుండె చల్లబడ్డట్టు అనిపించింది. వత్సల మెల్లగా లేచింది ప్రసూనని పట్టుకుని. ఆద్యకి సమాధానం చెప్పలేదు. తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. ఆద్య భర్త ప్రవీణ్‌ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు.

‘ఎందుకమ్మా నువ్వైనా చెప్పలేదా ఒద్దని…’ తల్లిని పట్కొని అడిగింది ఆద్య కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఆద్యకి భర్త ముందు అవమానంగా ఉంది.

‘ఇద్దరం కలిసే చేసామీ పని’ అంది ప్రసూన మెల్లగా కాఫీ కలుపుతూ. ఏం ఎందుకని నేను తీస్కెళతాన్నా కదా… పిచ్చెక్కిందా మీ ఇద్దరికీ’ ఆద్య కోపంగా అంది. ‘నువ్వు ముందు మొఖం కడుక్కో నిదానంగా అన్నీ తెలుస్తాయి’ కూతుర్ని సముదాయిస్తూ పెరట్లోకి పంపింది ప్రసూన.

ఆ రాత్రి డాబాపైన వెన్నల్లో నులక మంచం మీద ఏకాంతంగా కూర్చుంది వత్సల. ఆమెకి చాలా ప్రశాంతంగా ఉంది. ఆద్య వచ్చి నానమ్మ ఎదురుగా నిల్చుంది. ‘పట్టె మంచాన్ని కాల్చేసి ఇక్కడ వెన్నెల్లో చల్లగా కూర్చున్నావా నానమ్మా’ అంది. కళ్ళెత్తి ఆద్యని చూసింది వత్సల. నానమ్మ ముసలి కళ్ళల్లో నిఘూఢంగా దాగి ఉన్న రహస్యపు రంగుని ఆ వెన్నల్లో నల్లగా చూసి ఆద్య వణికింది. ఒక్క క్షణం ఆద్యని చేతులు చాపి అందుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది వత్సల. ఆద్య కళ్ళల్లో కోటి ప్రశ్నలకు సమాధానంగా ఆద్యకి పట్టె మంచం చెప్పని కథని చెప్పడం మొదలెట్టింది. చిన్నప్పుడు ఆద్య నిద్రకు ముందు కథలు చెప్పమని బ్రతిమిలాడినప్పుడు చెప్పే కథలా… ‘అనగనగనగా ఒక ఊర్లో పట్టె మంచం ఉండేది…’ అంటూ ఆద్యతో పాటూ చందమామా, నక్షత్రాలూ, వెన్నలా, మల్లె పందిరీ చెవులు రిక్కించాయి.

5 thoughts on “అనగనగనగా… ఒక మంచం!

  1. Excellent story. Gitanjali garu had depicted the terrible story of a mam in true colours with the help of a cot .

  2. కథ ఎంతో బాగుంది మ్యామ్.
    పెట్టె మంచాలు, పందిరి మంచాలు వారసత్వంగా వస్తూండటం, ఆ మంచాల వెనకున్న విషాదాలు…
    ఎప్పటిలాగే ఎంతో చక్కగా, అందంగా చెప్పారు.

    Congratulations Mam 💐

Leave a Reply