(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో…)

అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు సాగే సరికి బలియాపుట్‌, పొడబద్ర గ్రామాలు వస్తున్నాయని తెలిసింది. ఇంకా హడావిడి పెరిగింది. చీకట్లో రోడ్డుపైనే వెళ్తుతున్నాం. ఒక దగ్గర కొద్ది మంది యువతీ యువకులు, రోడ్డు బ్లాక్‌ చేసి నాలీ (తుపాకీ)లతో కాపలా కాస్తున్నారు. అంటే బలియాపుట్‌కు దగ్గిర పడ్తున్నామనిపించింది. ఆ యువకులతో కొద్దిసేపు ముచ్చటించి ముందుకు సాగేసరికి బలియాపుట్‌ రానే వచ్చింది. గ్రామంలోకి వెళ్లే సరికి చిన్న సంస్థానంలా కనిపించింది. కొద్దిమంది ప్రజలు టీవీలో విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొంత మంది మా రాకను దృష్టిలో వుంచుకొని వంట కార్యక్రమంలో హడావిడిగా వున్నారు. నాకైతే అక్కడి ప్రజలను చూసినప్పుడు, యుద్ధం మధ్యలో సేద తీరుతున్న సైనికుల్లా కనిపించారు. ఇంత హడావిడిలోను మేము వెళ్లగానే అన్ని పనులు ఆపి బారు తీరి ఆప్యాయంగా చేతులు కలిపారు. వెంటనే కట్టెలి (మంచం) వేసి ఆతిథ్యం ఇచ్చారు.

అందరం మంచాల్లో కూలబడి పోయాం. మా బృందమంతా తీవ్ర నిర్బంధం అమలవుతున్న ప్రాంతం నుండి వచ్చినది కావడంతో, అక్కడి పరిస్థితి ఏదో తెలియని భరోసాను, ఆనందాన్ని ఇచ్చింది. నేనైతే నా నాలిని పక్కన పెట్టేసి వంటగది నుండి వస్తున్న కొయ్యు (కోడి) మాంసం ఘుమ ఘుమలను ఆఘ్రాణిస్తూ మొత్తం బరువు బాధ్యతలను మనసు నుండి దూరం చేసి ఒక్క క్షణం అలా సేదతీరాను. అంతలోనే నా సహచర కామ్రేడ్‌ ‘ఆయనే సింగన్న’ అంటూ తట్టాడు. అప్పటికే బద్ధకం ఆవహించిన మెదడు ఒక్కసారి ఉలిక్కిపడి చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. చీకట్లో రిక్కించి చూసాను. పొట్టిగా, సీదా సాదాగా వున్న ఒక వ్యక్తి అందరికి పనులు పురమాయిస్తూ అటు ఇటు తిరుగు తున్నాడు. ఆయనే సింగన్న అని తెలిసిన తరువాత కళ్లను మరింత రిక్కించాను. కొద్దిగా పిల్లిగడ్డం, ఎర్రగా, పొట్టిగా కాయకష్టం చేసిన శరీరంతో సీదా సాదాగా వున్నాడు. అయితేనేం మెరుపుతీగలాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆహార్యం (వేషధారణ) చూస్తే మాత్రం నవ్వు వచ్చింది. చిన్నప్పుడు ఎవరికైనా నిక్కరు కన్నా డ్రాయర్‌ (అండర్‌వేర్‌) పొడవుగా వుంటే ‘సండే ఈజ్‌ లాంగర్‌ దేన్‌ మండే’ అంటూ ఆటపట్టించే వాళ్లం. సింగన్నను చూడగానే ఆ సామెత గుర్తుకొచ్చి నవ్వచ్చింది. ఎందుకంటే ఆయన లుంగీని మడత చేసి పైకి కట్టుకోవడంతో డ్రాయర్‌ కిందికి కన్పిస్తున్నది. అయితే అదే డ్రాయర్‌ జేబులో నుండి మొబైల్‌ ఫోన్‌ తీసి ఎవరెవరికో, ఏవేవో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఈ పని కూడా తన కదలికలకు తగ్గట్టుగా అతి వేగంగా జరిగిపోతున్నది. నేను అప్పటికే ఆయన గురించి కొంత విని వుండడంతో, నా దృష్టిని ఆయన పైనుండి మరల్చ లేకపోయాను. ఆయనకు భయం తెలియదనీ, తూటాలు  తగలవనీ ప్రజల్లో ప్రచారం వుంది. ఈ నమ్మికతోనే అక్కడి యువతీ, యువకులు ఆయన వెంట ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతారట. ఆయనకు ఇంతటి ధైర్యం, సాహసం ఎక్కడి నుండి వచ్చాయో నాకు అంతు బట్టలేదు. ఈ లోపు వొండ, వొండ (అన్నం, అన్నం) అంటూ కేకలినబడే సరికి మా పళ్లాలతో ఒరుస కట్టాము. వరసలో వున్న నాకు వంటకాల ఘుమ ఘుమలతో ఆకలి మరింత కేకలెయ్యడం ప్రారంభించింది. నా వంతు రాగానే పళ్లెం నింపుకొని ఆతృతగా తినడం ప్రారంభించాను. వంట బాధ్యతలు చేపట్టిన రైతులు మా దగ్గిరకొచ్చి కొసరి కొసరి వడ్డిస్తున్నారు. ఇది మరింత సౌకర్యంగా వుండడంతో ఎప్పటికన్నా మరి రెండు ముద్దలు ఎక్కువ పట్టించేసాము. అప్పటికే గ్రామంలో చాలా సమయం గడిచి పోవడంతో, త్వరగా తెముల్చుకొని మకాంకు బయల్దేరాలని మా కమాండర్‌ నుండి కాషన్‌ వచ్చింది. అందరం కిట్లు వేసుకొని మకాంకు వెళ్లిపోయాము.

మకాంలో నిద్రకుపక్రమించే ముందు మళ్లీ ఒకసారి సింగన్న గురించి స్థానిక కామ్రేడ్స్‌ను  అడిగి తెలుసుకున్నాను. గతంలో ఆయన కూడా సాధారణ ఆదివాసీ రైతేనట. వాళ్ల గ్రామంలో వున్న సొండి భూస్వాముల దోపిడీ, పీడనలకు విపరీతంగా గురి అయ్యాడట. ఆ ప్రాంతానికి ఆదివాసీ ఛసి మూలియా సంఘం రావడంతో తమ బాధలకు మూలాలతో పాటు పరిష్కారాలు కూడా తెలుసుకున్నాడట. అది సుత కాడు (సారా) నుండి భూమి వరకు అనేక పోరాటాలను, ప్రజలకు ముందుండి నడిపాడట. ఈ పోరాటాల్లో ఆయన శత్రువుపై ప్రదర్శించిన కసి, సాహసం, ఆయన్ని ప్రజలకు తిరుగులేని నాయకుడ్ని చేసాయట. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలోకి సిపిఐ (మావోయిస్టు) రాజకీయాలు ప్రవేశించడంతో పాటు, ప్రజా గెరిల్లా విముక్తి సైన్యం చారిత్రాత్మకమైన కోరాపుట్‌, నాల్కో దాడులను నిర్వహించిందట. ఈ చర్యలు స్థానిక ఆదివాసీ రైతాంగాన్ని గొప్పగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా సింగన్న ఈ ప్రభావంతో సాయుధ పోరాట రాజకీయాలను సంపూర్ణంగా స్వీకరించాడట, ఇలా ఆయన విప్లవకారుడిగా మారిన క్రమాన్నీ, ఆయన సాహస చర్యలనూ, ఆయన మొలకు ఎప్పుడూ వేలాడే పెద్ద కత్తిని గురించి మిత్రుడు వివరిస్తుంటే నాకు సింగన్నపై ఎనలేని గౌరవం ఏర్పడిరది. ఒక సాధారణ ఆదివాసీ రైతు విప్లవ రాజకీయాలతో అసమాన సాహసుడిగా ఎదిగిన క్రమాన్ని తలచుకుంటూ, క్రమంగా నిద్రలోకి జారుకున్నాను.

తిరిగి సింగన్న పొద్దున్నే మకాంకు వచ్చాడు. ఈ సారి భార్యా, పిల్లోడితో సహా వచ్చాడు. ఆ పిల్లోడికి ఇంకా మాటలు కూడా రాలేదు. వాడిని పట్టుకొచ్చి మాకు చూపుతూ, ‘నేను యుద్ధంలో చచ్చిపోతే నా వారసుడు వీడే దాద’ అన్నాడు. నాకు వెంటనే తమ పిల్లల్ని విదేశాలకు పంపుతున్న ‘వామ పక్ష మేధావులు’ గుర్తుకొచ్చారు. ఇది గుర్తుకు రాగానే వెంటనే సింగన్నను కౌగిలించుకొని గుండెకు హత్తుకోవాలనిపించింది. కానీ ఎందుకో ఆ పని చేయలేకపోయాను. ఈ సారి కలిస్తే నాకు ఆయనపై వున్న గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నా. కానీ తరువాత నాకు అందనంత ఎత్తులకు ఎదిగిపోతాడని ఊహించలేకపోయాను.

నారాయణ పట్నా బ్లాక్‌లో మేము పొందిన అపురూపమైన అనుభూతుల్ని నెమరువేసుకుంటూ మా గమ్యం వైపు ప్రయాణం సాగించాము. గమ్యం చేరుకోగానే ముఖ్యమైన విషయాలపై సమావేశమయ్యాము. మేము తీసుకున్న నిర్ణయాలలో సంఘాన్ని పార్టీకి అనుబంధంగా చేసుకోవడం, కామ్రేడ్‌ సింగన్న తదితరులకు పార్టీ సభ్యత్వం ఇవ్వడం మొదలైన ముఖ్యమైనవి వున్నాయి. ఈ నిర్ణయాలు కల్గించిన ఉత్సాహంతో తిరుగు ప్రయాణం కట్టాము. తిరుగు ప్రయాణంలో నారాయణ పట్నా రైతాంగ ఉద్యమ భవిష్యత్తుపై రకరకాల పథకాలు రచిస్తూ, సింగన్న తదితర కామ్రేడ్స్‌ కలయిక కోసం రోజులు లెక్కిస్తూ వచ్చాము. అంతలోనే నవంబర్‌ 20 సంఘటన మాకు ఆశనిపాతంలా తాకింది. నరహంతక పోలీసు మూకలు గ్రామాలపై పడి మహిళలను అత్యాచారం చేస్తే, సింగన్న తన సేనతో పోలీసుల్ని నిలేసేందుకు ఠాణాకు వెళ్లాడట. పోలీసులు గేట్లు వేసి అడ్డుకుంటే సింగన్నతో పాటు అనేక మంది యువతీ యువకులు గేట్లు దూకారట. ఇదే అదనుగా పోలీసులు కాల్పులు జరిపి దొంగ దెబ్బతీసారట. కామ్రేడ్‌ సింగన్న, కామ్రేడ్‌ ఆంధ్రులు అమరులైనారట. ఈ వార్త వినడంతో మా బృందంలో విషాదం అలుముకుంది. నాకైతే ఆ వీరుడ్ని ఆప్యాయంగా గుండెకు హత్తుకొని గౌరవించలేకపోయాననే అసంతృప్తి, బాధ, దుఃఖం మనసునంతా కలియబెట్టాయి. ఈ విషాదంతోటే నారాయణపట్నా ప్రాంతంలోకి తిరిగి ప్రవేశించాము. అక్కడ ఆయన జాడ లేకపోయినప్పటికీ ప్రజలకు ఆయన వదిలి వెళ్లిన గుర్తులూ, జ్ఞాపకాలు పదిలంగా వుండడం చూసాము. ఆ రైతాంగ యోధుడు చూపిన తోవలో నడవడానికి వేలాది ఆదివాసీ రైతాంగం సిద్ధంగా వుండడం గమనించాము. ఈ పరిస్థితి,  దుఃఖాన్ని దిగమింగి కార్యరంగంలోకి దూకమని మాకు కర్తవ్యబోధ చేసినట్టు అనిపించింది.

(దేవ్‌మాలి పేరుతో అమరుడు కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) రచన)

Leave a Reply