(శాంతి చ‌ర్చ‌ల స‌మ‌యంలో చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్ ప‌త్రిక కా. ఆర్కేతో చేసిన ఇంట‌ర్వ్యూ ఇది. బులిటెన్‌6(న‌వంబ‌ర్ 10, 2004)లో అచ్చ‌యింది. ఇందులో  విప్ల‌వం, వ‌ర్గ‌పోరాటం, శాంతి, స్వావ‌లంబ‌న‌, రాజ్యాధికార స్వాధీనం, ప్రాంతీయ స‌మ‌స్య‌లు మొద‌లైన ఎన్నో అంశాల‌పై ఆలోచ‌నాత్మ‌క స‌మాధానాలు చెప్పాడు. ఇప్ప‌టికీ ఇందులో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌టిలంగా త‌యార‌య్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయ‌న డెమోక్ర‌టిక్ స్పేస్ ను ప్ర‌భుత్వం ఇవ్వ‌దు. అది అయాచితంగా రాదు. మ‌న‌లాంటి దేశాల్లో ప్ర‌జాస్వామికీక‌ర‌ణ పోరాటాల ద్వారా, విప్ల‌వాల ద్వారానే సాధ్యం.. అని అన్నాడు. ఈ రోజుకూ విప్ల‌వ‌, ప్ర‌జా పోరాటాల‌న్నిటికీ దారి చూసే భావ‌న‌లు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. – వ‌సంత‌మేఘం టీం)

1. ఈ చర్చల ప్రక్రియను వర్గపోరాటానికి నంబంధించిన తాత్విక అంశంగా, ఆచరణరూపంగా మీరు ఎలా విశ్లేషిన్తున్నారు?

చర్చలు కూడా పోరాటంలో భాగంగానే మేం గుర్తిస్తున్నాం. చరిత్ర పరిణామ క్రమాన్ని గమనించినప్పుడు దోపిడీ శక్తులను కూలదోయడానికి పీడిత ప్రజలు అనేక రూపాల్లో పోరాటాలు సాగించినట్లు అర్ధమవుతుంది. పీడిత, పీడక వర్గాలున్న సమాజంలో వాటి మధ్య ఘర్షణ అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా నేడు కొనసాగుతున్న అనేక ప్రజా ఉద్యమాలు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయుధ పోరాట రూపంలోనే కాకుండా మరెన్నో రూపాల్లో పోరాడుతున్నారు. ఇక్కడ మనదేశంలో సాగుతున్న నక్సల్బరీ ఉద్యమం కేవలం సాయుధపోరాటంతోనే కాకుండా

మరెన్నో రూపాల్లో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ సాగిపోతోంది. పలుదేశాల్లో విప్ల‌వాల‌న్నీ సాయుధపోరాటం ద్వారా మాత్రమే విజయవంతవమయ్యాయన్న విషయాన్ని మనం దృష్టిలో  వుంచుకోవాలి. మనదేశంలో కూడా ఈ అసమానతల వ్యవస్థ కుప్పకూలిపోయి కొత్తసమాజం ఆవిర్భవించాలంటే సాయుధ పోరాటమే మార్గం. దానికి దోహదంగా ఇతర పోరాటరూపాలను కూడా మేం స్వీకరిస్తాం. ఉత్పత్తి శక్తులపై, సాధనాలపై అల్పసంఖ్యాక వ్యక్తులు ఆధిపత్యం కలిగివుంటున్న నమాజంలో సహజంగానే వైరుధ్యాలుంటాయి. ఈ వైరుధ్యాల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ వ్యూహరచన చేసి, ప్రజలను సంఘటితపరుస్తూ ప్రజాశత్రువులను ఒంటరివాళ్ళను చేసి  అంతిమంగా  రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటుంది. అయితే. ఇది అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. పాలకవర్గాలకు కంచుకోటగా నిలుస్తున్న పోలీసు యంత్రాంగం, దాని అనేక వికృత రూపాలు, వాటితో ప్రజాసైన్యం ఘర్షిచే తీరు… వీటన్నింటిని దృష్టిలో వుంచుకున్నప్పుడు చర్చలను కూడా ఒక పోరాట రూపంగా మార్చుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అశేష పీడిత ప్రజానీకపు న్యాయమైన, సహజమైన ఆకాంక్షలకు అద్దంపడుతూ చర్చలను సాగించడం అర్ధవంతమైన ఆచరణగా, ప్రజాస్వామిక విలువగా, ఒక రాజకీయ తాత్విక అంశంగా గుర్తించాం కాబట్టే మేం చర్చలకు వచ్చాం. చర్చలకు మేం తలుపులు మూసుకోలేదని చెప్పడానికి, ప్రజలు తరుపున పార్టీ చర్చలు చేయడానికి ఎవ్వడైనా సిద్ధపడుతుందని పునరుద్దాటించడానికి ఈ చర్చలు చేస్తున్నాం.

2.  ఈ చర్చల్లో అత్యంత కీలకమైన భూమి సమస్యను  పరిష్కరించడానికి మీవైవు నుండి ఎలాంటి ఆచరణాత్మక ప్రతిపాదన వుంది? ఇన్నేళ్ళుగా సాగుతున్న భూనంస్కరణల వైఫల్యాన్ని దృష్టిలో వుంచుకొని చూసినప్పుడు ఈ చర్చల ద్వారా భూమి సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు?

మా ఉద్యమానికి ఆయువుపట్టు భూమి సమస్యే. 1947లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పాలకవర్గాలు, కాదు అది అధికార మార్చిడేనని మేము చెప్తూనే వున్నాం. అంటే యాభై యేళ్ళకు పైగా రాజ్యాంగ పరిధిలో సాగుతున్న భూసంస్కరణలు ఘోరమైన వైఫల్యాన్ని చవిచూడటానికి కారణం ఈ దేశంలో ఊడలు దిగిపోయిన భూస్వామ్య వ్యవస్థే. 1967లో రగిలిన నక్సల్బరీ ఉద్యమం, దానిపై కొనసాగిన ప్రభుత్వ దమనకాండను గుర్తుచేసుకుంటే 1973లో ఇందిరాగాంధీ తెచ్చిన భూసంస్కరణలు కూడా ఒక పోరాట నేపథ్యంలోంచి వచ్చినవే అని గుర్తు పెట్టుకోవాలి. ఈ భూసంస్కరణలు ఎంత బూటకమో చెప్పడానికి ఆ కాలంలో పంచిన నాసిరకం భూములనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ పంచిన భూములు కూడా అవసరమైన వారికి అందుబాటులోకి రాలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో దాదాపు ముప్పై లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని లెక్కలు వేసింది. కాని వాస్తవంగా పంపిణీ అయింది ఐదులక్షల ఎకరాలు మాత్రమే. అది కూడా చాలా నాసిరకం భూమి. మిగతా భూమిని భూస్వాములు తమ పట్టులోంచి జారిపోకుండా కాపాడుకున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి అని అనుకున్నప్పుడు మనలాంటి వ్యవసాయాధారిత సమాజాల్లో ‘దున్నేవారికే భూమి. అనే డిమాండు ప్రధానమైంది.


నూటికి 80 శాతం ప్రజలు వ్యవసాయరంగంపైనే ఆధారపడి వున్నారు. వాళ్ళందరికీ భూమి దొరికినప్పుడు సహజంగానే వారి ఉత్పాదకత పెరుగుతుంది. కొనుగోలుశక్తి పెరుగుతుంది. విద్య, వైద్యం, పారిశ్రామిక, కళా సాంస్కృతిక రంగాల్లో ప్రతి మనిషీ తమ శక్తులను సద్వినియోగం చేసుకోవడానికీ, అంతిమంగా సమాజం పురోగమించడానికీ సాధ్యమవుతుంది. ఇట్లా అన్నిరంగాల్లోని జరగాల్సిన అభివృద్ధికీ భూమి సమస్యకూ విడదీయరాని సంబంధముంది.

అందరికీ భూమి దక్కాలనే ఉద్యమానికీ ఈ దోపిడీశక్తులు అడ్డుగా నిలుస్తున్నాయి. దళారీ, బూర్జువా, అంతిమంగా సామ్రాజ్యవాదులు కూడా దున్నేవారికే భూమి అనే ఉద్యమానికి శత్రువులుగా తయారయ్యాయి. వారికి రక్షగా నిలుస్తున్న పోలీనులు మా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ సమస్యను సరిగ్గా అర్ధం చేసుకున్న ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు దున్నేవారికీ భూమి దక్కాలనే డిమాండు పట్ల స్పష్టమైన అవగాహన, మద్దతు ఉంది. ఒక ఉపాధి, జీవితాల్లో మెరుగైన, సహజమైన సౌకర్యాల కల్పన అనే ఆర్థిక విషయాలే కాకుండా ఈ భూమిసమస్యలో సాంఘిక సమస్య కూడా ఇమిడి వుంది. భూస్వాముల నుండి భూమి తీసుకోగలిగితే సహజంగానే వాళ్ళ ఆధిపత్యం తొలగిపోతుంది. ప్రజాస్వామ్యం అమలవుతోందని ఇంకే ఉద్యమాలూ అవసరంలేదని ఈ ప్రభుత్వాలు అంటున్నాయి.

అసలు మా దృష్టిలో ఈ దేశం ప్రజాస్వామికీకరణ చెందలేదు. అది జరగాలంటే ఈ భూమి సమస్య పరిష్కారం కావాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు చిత్తశుద్దితో వుంది, ఎలా పరిష్కరిస్తుందనేది తేలాలి. అందుకే చర్చల్లో ఈ భూమి సమస్యను కీలక అంశంగా చేరుస్తున్నాం. ఈ సమస్యను విసృతంగా ప్రచారం చేసి ప్రజల వక్షాన నిలబడే మేధావులను, భిన్నరాజకీయ ఉద్యమాలను కలుపుకుని ప్రభుత్వం మీద వొత్తిడి తీసుకొస్తాం. అలాగే ప్రభుత్వాన్ని ఈ భూసమస్య మీద ఒక కమిషన్‌ వేసి, ఎంత మిగులు భూమి వుందో లెక్కతేల్చాలని డిమాండు చేస్తాం. ఈ ప్రభుత్వమే కాదు గతంలో భూమి సమస్య మీద వేసిన కమీషన్ల పట్ల, వాటి నివేదికల పట్ల ప్రజలకు విశ్వాసం లేదు, వారు తీవ్రమైన నిరాశా నిస్పృహలతో వున్నారు. అయినా ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేశాయి. మళ్ళీ అవే వాటిని అతిక్రమిస్తున్నాయి. ఇవాళ అట్లాకాకుండా దీన్నొక రాజకీయ ఉద్యమంగా విస్తృత ప్రజానీకంలోకి వెళ్ళాలి. అప్పుడే ఈ ప్రభుత్వాలకు అసలు భూమిసమస్యపై ఎంత చిత్తశుద్ది వుందో తేలిపోతుంది. మేమందుకే భూవిసమస్యను ఇంత ప్రాధాన్యమైందిగా స్పష్టపరుస్తున్నాం. అసలు ఈ సమన్య ఎంత సంక్షిష్టమైందంటే – ముఖ్యంగా హైదరాబాదులాంటి పట్టణాల్లో భూబకాసురులు తయారయ్యారు. వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని ఎటువంటి చట్టమూ, చెల్లింపులూ లేకుండా స్వాధీనం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా రామోజీ, సంఘీ లాంటి వ్యాపారవేత్తల అక్రమాలను మేం  ఈ చర్చలో లేవనెత్తుతాం. ఈ భూవమిసమస్యకు  ఒక  పరిష్కారం వెతుక్కోకుండా ఈ చర్చలు అంత అర్ధవంతంగా ముగియవు.

3. భూపంపిణీకి నంబంధించిన గణాంక వివరాలు – అంటే భూపరిమితి, మిగులుభూమి, భూమిలోని రకాలు- వీటిని మీరు చర్చల్లో ఎట్లా భాగం చేయబోతున్నారు?

 భూపంపిణీ అంటే ఇప్పటికి 18 ఎకరాలు (అంటే రెండు పంటలు పండే భూమి అయితే) మెట్టభూమి అయితే 54 ఎకరాలుగా గతంలో సీలింగ్‌యాక్టులో వుంది. అయితే ఇవాళ వ్యవసాయరంగంలో వచ్చిన ఆధునిక పరికరాలు, ఉత్పత్తి పెరుగుదల వంటి వాటిని దృష్టిలో పెట్టుకున్నవ్వుడు ఆ పరివితిని కూడా ఇంకా తగ్గించితే మంచిదని మేం అనుకుంటున్నాం. ఎందుకంటే బెంగాల్‌ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఇటువంటి కొన్నింటిని పరిగణనలోకి తీసుకుంది. ఇతర ర్యాష్ట్రాల అనుభవాలను కూడా పరిశీలించి ఇక్కడున్న పరిస్థితుల్లోంచి భూపరిమితిని నిర్ణయించాలనుకున్నాం.

4.ఈ చర్చల్లో మీరు స్వావలంబన గురించి మాట్లాడతామంటున్నారు కదా! అసలు మీ దృష్టిలో ఈ స్వావలంబన అనే నినాదానికున్న రాజకీయ, ఆర్థిక, సాంఘిక ప్రాధాన్యత ఏమిటి? వర్గపోరాట భావజాలంలో ఈ స్వావలంబన అనే భావనను ఎట్లా విశ్లేషిస్తారు?

 ఈ చర్చల్లో స్వావలంబన అనే అంశాన్ని ప్రధాన అంశంగా ముందుకు తీసుకువస్తున్నందుకు కారణం- ఈ దేశంలోంచి సామ్రాజ్యవాద దోపిడీ శక్తులను తరిమి వేయడానికే. నూతన ఆర్థిక సంస్కరణలు  మొదలయినవ్పటినుండి ఈ దేశంలో సామ్రాజ్యవాదుల ఆధిపత్యం పెరిగిపోయింది. దేశీయమైన స్వావలంబన ప్రమాదస్థితికి చేరువయ్యింది. అన్నిరంగాల్లో స్వావలంబన ఏర్పడాలంటే ముందుగా మనం సామ్రాజ్యవాదుల జోక్యాన్ని అడ్డుకోవాలి. ఇక్కడి ప్రతి ఆర్థిక, రాజకీయ విధానాలను, సామ్రాజ్యవాదులే నిర్దేశించే దశకు చేరుకున్నాయి. ఇక్కడి సంపదనంతా వాళ్ళు దోచుకుపోతున్నారు. ఇక్కడి సంస్కృతినంతా వాళ్ళు ఛిద్రం చేస్తున్నారు.

సామ్రాజ్యవాదపు ప్రబల శక్తులైన బహుళజాతి సంస్థలను వాటి అర్థిక దోపిడీని కూలదోసేందుకే ఈ స్వావలంబన అనే అంశాన్ని చర్చల్లో ఒక ప్రధాన అంశంగా ప్రవేశపెడుతున్నాం.

 5. ఈ నాలుగు దశాబ్దాల ఉద్యమంలో స్వావలంబన దిశగా మీరెలాంటి విజయాలు సాధించారు?

వర్గపోరాటం ప్రారంభదశలో ఉన్న స్థితి ఇది. మా ప్రభావిత ప్రాంతాల్లో మేము వ్యవసాయరంగంలో స్వావలంబన వైపు దృష్టి సారించి కొన్నివిజయాలు సాధించాం. అలాగే రేపు విముక్తి ప్రాంతాలను ప్రకటించినప్పుడు పలురంగాల్లో స్వావలంబన కోసం కృషి చేస్తాం. ఇప్పటికే మా ప్రభావిత ప్రాంతాల్లో సమిష్టితో కూడిన వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం. దండకారణ్యంలో అక్కడి అదివాసీలకు వ్యవసాయరంగంలో కొత్తవిధానాలను పరిచయం చేయిస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో అసలు ఉత్పత్తి విధానంలోకి కూడా ప్రవేశించిన సమాజాల్లో మా పార్టీ నాయకత్వంలో వ్యవసాయం పనులను నేర్పుతూ, వారికి కావలసిన పరికరాలను అందజేన్తున్నాం.

6. 20,30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఆత్మహత్యలు చేనుకుంటున్నారు కదా! ఇప్పటి పరిస్థితుల్లో భూమిలేని వారికి భూమి పంచినా వ్యవసాయరంగంలో మీరు ఆశించిన స్వావలంబన, అభివృద్ధి సాధ్యమవుతుందా?

వ్యవసాయరంగంలో జరిగిపోతున్న విధ్వంసానికి ప్రధానకారణం – పాలకవర్గాలు అనుసరిన్తున్న వ్యవసాయ విధానాలేనని మేం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాం. అసలు భూమి, అనేదే దానంతట అదొక ఉత్పత్తి సంబంధమైన మౌలిక వనరు. దానిమీద ఆధారపడే సమస్త మానవులూ, సాంఘిక  కార్యకలాపాలూ, కళలూ సంస్కృతీ వికసిస్తున్నాయి. అలాంటి భూమిమీద ఆధారపడి సాగే వ్యవసాయ రంగంలోకి ఈ ప్రభుత్వాలు సామ్రాజ్యవాద దోపిడీశక్తులను ప్రవేశపెట్టాయి. విత్తనాలు మొదలుకొని ధాన్యం నిలువచేనుకునేందుకు వాడుకునే మందుల దాకా విదేశీ బహుళజాతి సంస్థలు  ఊత్పత్తిచేసిన వాటినే ఉపయోగించక తప్పని పరిస్ధితిని ఈ ప్రభుత్వాలు సృష్టించాయి. సామ్రాజ్యవాద దేశాల్లో ఆ దేశాల్లోని రైతులకు (రైతులు అనేకంటే కార్పొరేట్‌ ఫాం హౌజుల మేనేజర్లకు) విపరీతమైన సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు. ఇవి మనదేశంలో అమలు కావడంలేదు. అందుకు ప్రధానంగా నిందించాల్సింది ఈ ప్రభుత్వాలను కాదా? అంటే ఇక్కడి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కావాలనే ధ్వంసం చేస్తున్నారు. పంటలు పండక, అప్పులపాలై ఇక్కడి రైతులు భూములు చాలా తక్కువ ధరలకు అమ్ముకుని పోతే కూలీలుగా మారిపోతే ఆ భూముల్లో కార్పోరేట్‌ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడి సంపదను దోచుకోవాలనుకునే కార్పోరేట్‌, సామ్రాజ్యవాద దోపిడీశక్తులకు అప్పనంగా ఈ భూములను దఖలు చేయడానికి ఈ ప్రభుత్వాలు కుట్రపన్ని ఓ మేరకు విజయవంతమయ్యాయి. 

కాబట్టి వ్యవసాయం అనేది నష్టభూయిష్టమైన రంగం కాదు. అనుసరించే విధానాల్లోనే లోపాలున్నాయి. అవి నేడు తీవ్రరూపం. తీసుక రైతుల ఆత్మహత్యల రూపంలో బయటపడుతున్నాయి. సరైన విధానాలే గనుక అమల్లోకి వస్తే రైతులు ఈ మట్టిలో అద్భుతాలు సృష్టిస్తారు. కామ్రేడ్‌ మావో అన్నట్లు ఏ వ్యవన్థ అయినా ముందుకు పోవాలంటే రెండుకాళ్ళ మీద నడవాలి. ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందుతూ దానిమీద ఆధారపడి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందాలి. అరువు తెచ్చుకున్న విధానాలూ, మనకి సరిపడని నంస్కరణలూ మన వ్యవసాయరంగం మీద రుద్దితే మిగిలేది విధ్వంసమే తప్ప ఇంకోటి కాదు.

7. ప్రాంతీయ అనమానతల విషయంలో మీరు తెలంగాణా గురించి మాట్లాడినంతగా ఉత్తరాంధ్ర గురించో, రాయలసీమ గురించో మాట్లాడటం లేదనిపిస్తోంది. దీనికి ఏవైనా కారణాలున్నాయా?

ప్రాంతీయ అసమానతల గురించి అనుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు వాటి స్వార్ధపూరిత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే కొన్ని ప్రాంతాలను అభివృద్ధిపరిచి, కొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయనే నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మొత్తం దేశంలోని వివిధ నైసర్గిక, సహజ సంపదలు, అక్కడి ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలనే దృక్పథం లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వాలు చాలా అంశాలను విస్మరించాయి. కేవలం వాళ్ళకు లాభంగా తోచిన అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తూ కొన్ని ప్రాంతాలను అభివృద్ధిపరిచారు తప్ప నిజంగా అభివృద్ది పరచాలనే ఉద్దేశ్యంతో కాదు. ఇది వలనపాలకులు అనుసరించిన మార్గమే. రైల్వేలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఓడరేవు కేంద్రాలు కానివ్వండి పాలకవర్గాల, సామ్రాజ్యవాదుల స్వార్థవయోజనాలకే ఉపయోగపడ్డాయి తప్ప మరొకందుకు కాదు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఈనాడు అభివృద్ది చెందిన ప్రాంతాలుగా ప్రచారమవుతున్న ప్రాంతాల్లో కూడా తీవ్రస్థాయిలో  ఆర్థిక, సాంఘిక  అసమానతలున్నాయి. అదే సమయంలో కొన్నిప్రాంతాలు ఇంకా చాలా వెనుకబడి పోయాయి. అలాంటి ఒక తెలంగాణను తీసుకున్నప్పుడు 1947 తర్వాత పెద్దమనుషుల ఒప్పందమని, విశాలాంధ్ర అని అక్కడి ప్రజలను పాలకవర్గాలు మభ్యపెట్టి మోసపుచ్చాయి. తెలంగాణా ప్రజలు ఒక భయంతోటే ఆంధ్రరాష్ట్రంలో విలీనమయ్యారు. ఏ ఆధిపత్యమైతే తమమీద ఉండకూడదని వాళ్ళు కోరుకున్నారో అదే ఆధిపత్యం కింద వాళ్ళు నలిగిపోతున్నారు.

అందుకే తెలంగాణ ప్రజలు ఇక రోడ్లమీదకు రావడం తప్ప వొట్టి మాటలతో సమస్య  వరిష్కారమయ్యేది కాదని ఉద్యమంలోకి వన్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండుకు పీపుల్స్‌వార్‌ మద్దతిస్తున్నది. ఇప్పటికైతే వాళ్ళు భౌగోళిక తెలంగాణను కోరుకుంటున్నారు కానీ పార్టీ దృష్టిలో కేవలం భౌగోళిక తెలంగాణ ద్వారా అక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం కాదని, ప్రజాస్వామిక తెలంగాణ ద్వారా అంటే దున్నేవారికే భూమి అనే నినాదంతో సాగే ఉద్యమం ద్వారానే తెలంగాణా ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారం దొరుకుతుందని మేం అనుకుంటున్నాం. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం.

అయితే ఈ ప్రజాస్వామిక తెలంగాణా ఏవో పాలకవర్గాల పార్టీలు ఇస్తే వచ్చేది కాదు. ప్రజలు పోరాడి సాధించుకోవాల్సిన డిమాండు.భౌగోళిక తెలంగాణా కూడా పోరాడి సాధించుకోవాల్సిందే. అంతకంటే కూడా మరెంతో తీవ్రమైన పోరాటం ద్వారానే ప్రజాస్వామిక తెలంగాణా వస్తుంది.

అలాగే రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అన్నిరంగాల్లో వెనుకబడ్డాయి. సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగడంలేదనే ఆరోపణతో మేం ప్రత్యేకరాష్ట్రంగా విడిపోతామనే డిమాండ్లతో ముందుకొన్తున్నాయి. సాగునీటి కేటాయింపు, న్యాయం జరగలేదనే న్యాయమైన డిమాండుతో ఉద్యమిస్తున్న ప్రజలకు మేం మద్దతిస్తాం. ఈ ప్రాంతాలు ప్రత్యేకరాష్ట్రంగా విడిపోవాలనే డిమాండును పార్టీ ఇప్పటికిప్పుడు తీసుకోకపోయినా అంటే ప్రజల ఆకాంక్షగా ఒక డిమాండు ముందుకొచ్చినప్పుడు తీసుకోవడమనేది ఒక డిమాండుగా ముందుకు తీసుకెళ్ళడం మరో అంశం. ప్రాంతీయ అసమానతల సమస్యను జాతుల సమస్యగా, ప్రత్యేకరాష్ట్రాల డిమాండుగా అంతిమంగా నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగంగా సంలీనం చేయడానికి పార్టీ కృషి చేస్తోంది. ఇది పార్టీ తనంతట తానుగా తీనుకునే నిర్ణయంగా వుండదు. అక్కడి ప్రజల సాదకబాధకాలను, సంక్షోభాలను దృష్టిలో వుంచుకొని వాళ్ళ ఆకాంక్షలే పునాదిగా తీసుకునే నిర్ణయం.

8.నిషేధం తొలగించి మూడునెలలై పోయింది కదా! మీ ప్రజాసంఘాల పునరుద్ధరణ గురించి ఆలోచన ఏమైనా ఉన్నదా?

నిషేధం ఎత్తేసిన తర్వాత వెంటనే మా శక్తులను ఆయా సంఘాలపై ప్రత్యేక కార్యాచరణతో పునరుద్ధరించాలని మా పార్టీ ఆలోచిస్తున్నది. విద్యార్థి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని చాలామంది విద్యార్థులు మమ్మల్ని కోరుతున్నారు. గుత్తికొండబిలం బహిరంగసభలో మాకందిన వినతిపత్రాల్లో ఆర్‌ఎస్‌యును మా ప్రాంతాల్లో వునరుద్ధరించాలని, కొత్తగా ఏర్పాటుచేయాలని చాలామంది విద్యార్థులు తమ చిరునామాలతో సహా పత్రాలను అందజేశారు. వాళ్ళ ఉత్సాహాన్ని మేం ఆచరణ వైపు కదిలిస్తాం. ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించానని చెప్పుకుంటున్న ప్రభుత్వం సింగరేణిలో ఒక నభ పెట్టుకుంటే ఎన్నో ఆటంకాలను కల్పించి సభకు హాజరుకావాలనుకునే వాళ్ళపై పోలీసులను ఉసిగొల్పి భయభ్రాంతుల్ని చేసింది. మాపై నిషేధం ఎత్తివేసి మాతో నేరుగా చర్చలు జరువుతున్న ప్రభుత్వం మా ప్రజాసంఘాల కార్యకలాపాలను ఎందుకిలా అడ్డుకుంటుందో అర్థం చేసుకోవడానికి అంతగా కష్టపడనక్కర్లేదు. మా ప్రజాసంఘాలు ప్రజల సమన్యలమీద విసృతంగా ప్రచార ఆందోళనా కార్యక్రమాలు చేపడితే అది ప్రభుత్వం సహజంగానే జీర్ణించుకోలేదు. ఈ ప్రభుత్వానికి కార్మిక, పట్టణ, విద్యార్థి ఉద్యమాలు బలపడటం ఇష్టంలేదు. ఇటువంటి నేపథ్యంలో తిరిగి మా ప్రజాసంఘాలను పునరుద్ధరిస్తే వాటిని ఆటంకపరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగావున్నప్పుడు ఆచితూచి నిర్ణయించుకుంటాం. సికాస విషయంలో ఆ విషయం స్పష్టంగా అర్ధమయ్యింది. ఆర్.యస్‌యు విషయంలో అదే జరుగుతుందని మేమొక నిర్ణయానికి వచ్చినప్పటికీ దాన్ని పునరుద్ధరించాలనే అనుకుంటున్నాం.

9. దేశంలో ఫాసిజం పెరిగిపోవడానికి, మధ్యతరగతి పూర్తి నిష్క్రియాపరంగా తయారుకావడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మధ్యతరగతిని గొప్పగా కదిలించిన నక్సల్బరీ ఉద్యమం ఒక పక్క పురోగమిస్తూ  వుంటే, ఇంకోపక్క మధ్యతరగతి ప్రజలు మీ ఉద్యమానికే కాక అన్నిరకాల ఉద్యమాలకూ దూరమైపోయారు కదా? దీన్ని మీరెట్లా విశ్లేషిస్తారు? ఆ తరగతిని మీతో కలుపుకుని రావడానికి ఎలాంటి కార్యక్రమాన్ని చేపడతారు?

 వాస్తవంగా మీరన్నట్టు నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు మధ్యతరగతిని ఎలా కదిలించాయో జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాలూ అంతకంటే ఎక్కువగానే కదిలించాయి. జగిత్యాల సిరిసిల్ల పోరాటం ఒక రైతాంగపోరాటంగా ఉద్యమరూపంగా తీసుకుంది, అలానే విద్యార్థి ఉద్యమంగా, యువజన ఉద్యమంగా మారి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపింది. ఆ తర్వాత ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పురోగతి కానరావడం మొత్తంగా మానవీయ విలువల్లో సహజమైన స్పందనలు కోల్పోయి కేవలం ఆర్థిక సంబంధాలే మిగిలి పోవడంతో మద్యతరగతి ప్రజలు స్థబ్దులై పోయారు. కెరీరిజం, సిద్ధాంతపరంగా మార్క్సిజం పై భిన్నవాదాల రూపంలో దాడులు ప్రారంభం కావడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

 రాజ్యం రెండురకాలుగా మధ్యతరగతిని ప్రభావితం చేసింది. పట్టణాల్లో క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించడం ఒకవైపు అలాగే ప్రజారాజకీయాలవైవు వారు ఆకర్షితులు కాకుండా సామ్రాజ్యవాదుల అండదండలతో ఒక విషసంస్కృతికి వాళ్ళను బానిసల్ని చేయడం మరొకవైపు కొనసాగిస్తూ మధ్యతరగతిని ఉద్యమానికి దూరం చేసినా మా పార్టీని ఇంకా మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ నిషేధం తర్వాత సభలకొచ్చిన, మమ్మల్ని కలవడానికొచ్చిన ప్రజలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మానుండి మధ్యతరగతిని దూరం చేయగలిగానని రాజ్యం సంబరపడొచ్చు కాని ఇవాళ పెట్టుబడిదారీ విధానంలో భాగమైన ఎలక్ట్రానిక్‌ రంగంలో తలెత్తిన సంక్షోభం, కంప్యూటర్‌ నిష్ణాతులు కూడా ఉద్యోగాలు దొరక్క రోడ్డుమీదకు రావడం మరొక పరిణామాన్ని సూచిస్తోందని చెప్పొచ్చు.

 ఇవాళ మళ్ళీ ప్రజాయుద్ధ ప్రభావం పట్టణాల మీద, మైదాన పాంతాలమీద కనివిస్తోంది. ఇపుడు మమ్మల్ని కలిసిన మధ్యతరగతి ప్రజలు మమ్మల్ని చూసి, మా మాటలు విని ఎంతగా ఉత్సాహవంతులవుతున్నారంటే ఆ విషయం మాటల్లో చెప్పలేం.

 “ఇంతవరకూ మీరు మాకు కనిపించడం లేదు. మీరు మా ఊళ్ళలోకి రండి, మా వీధుల్లోకి రండి మీ వెంట మేముంటాం. మీతో కలిని నడుస్తాం” అంటున్నారు. వారి ఆకాంక్షలకు ఒక రూపమివ్వడానికి పార్టీ ప్రయత్నిస్తుంది.

10.  గుత్తికొండ సభలో ‘ప్రాంతాలవారీగా రాజ్యాధికారం” అనే నినాదమిచ్చారు కదా దాని ఆచరణరూవం ఏమిటి?

భారతదేశ విముక్తికి ప్రాంతాలవారీగా రాజ్యాధికారమనేదే ఒక సరైన వ్యూహంగా పార్టీ తీసుకున్న నిర్ణయం. భౌగోళికంగా చూస్తే ఇది చాలా పెద్ద దేశం. క్యూబా, వియత్నాం, కొరియా లాంటి అనేకదేశాల్లో సాగే విజయవంతమైన విప్లవాలను పరిశిలిస్తే అలాంటి దేశాలకంటే ఇంకా ఎక్కువ భౌగోళిక ప్రాంతం కలిగిన విప్లవోద్యమం ప్రభావిత ప్రాంతాలు మనదేశంలో వున్నాయి. సాయుధ పోరాటం ద్వారానే ప్రజావిముక్తి సాధ్యమవుతుందని మేం మొదటి నుండి చెప్తున్నాం. జీవితంలో దాని అవసరమేమిటో గుర్తించిన పీడిత ప్రజలు మాతో చేతులు కలిపి నడుస్తున్నారు. అనేక ప్రాంతాల్లో అలాంటి ప్రజలు సాయుధులై వారి ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. అందుకు మా పార్టీ నాయకత్వం వహిస్తోంది. వహించబోతోంది. ప్రభుత్వం బలహీనంగా వుండే కొన్ని ప్రాంతాలను మా పార్టీ ఎంపిక చేసుకొని అక్కడే ప్రజాసైన్యాన్ని నిర్మించుకొని అక్కడ ఈ దోపిడీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పాలనా యంత్రాంగాలను (రెవెన్యూ, పోలీసు, సైన్యం) నిర్మూలించి, లేకుండా చేసి ఆ ప్రాంతాన్ని విముక్తం చేయడమే ప్రాంతాల వారీగా రాజ్యాధికారం.

అట్లాగే పట్టణ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవాలనే లక్ష్యం కూడా. ఒక క్రమంలో అలా కొన్ని విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేసుకుంటూ అంతిమంగా రాజ్యాధికారాన్ని ప్రజలచేతికి అందించడమే ఈ నినాద లక్ష్యం. అదిప్పటికే ఆచరణలో వుంది. అది గెరిల్లా యుద్ధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణరూపం తీసుకుంది. ఈ ఘర్షణలో మా సైన్యం పైచేయి సాధించినప్పుడు దాన్ని విముక్తి ప్రాంతం అంటాం. అలాంటి విముక్తిప్రాంతాల మీద ఆధారపడి దేశవ్యాప్తంగా సాగే సాయుధపోరాటమే ఈ దేశ ప్రజలకు దోపిడీనుండి విముక్తిని కలగజేస్తుంది. ఇవి దీర్ఘకాలిక యుద్ధమంటే ఎన్నో పదుల, వందల యేళ్ళు సాగుతుందని కాదు. ఇవాళ మారుతున్న రాజకీయ పరిస్థితులు, పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభం, చితికిపోతున్న ఆర్థికవ్యవస్థలు ఈ దేశంలో విప్లవవిజయాన్ని మరింత దగ్గరగా చేస్తున్నాయని అంటున్నాం. దీన్నే మరోమాటలో వివ్లవపరిస్థితి అద్భుతంగా ఉందని అంటున్నాం.

12. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టుల సమన్య గురించి మీరు సాగించబోయే చర్చల్లో మీవైవు నుండి చేయబోతున్న నిర్దిష్ట ప్రతిపాదన ఏమిటి?

 భూమిసమస్యకు అనుబంధంగానే వ్యవసాయాభివృద్ధి అనే అంశాన్ని చేర్చాం. సాగునీరు, ప్రాజెక్టులు, నీటివనరుల మరమ్మత్తులు మొదలైన అంశాలమీద చర్చించబోతున్నాం, పులిచింతల లాంటి ప్రాజెక్టులను మేం వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి అటువంటి విషయాలను పార్టీ తక్షణమే మాట్లాడుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో వున్న రాయలసీమ, తెలంగాణల్లోని ప్రాజెక్టుల గురించి, పార్టీ వాటిని వెంటనే నిర్మించాలని డిమాండు చేస్తోంది. నదీజలాల వునఃపంవిణీ విషయంలో మా పార్టీ ఇప్పటికైతే స్పష్టమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఏదేమైనా ఈ పునః పంపిణీ జరిగినప్పుడు ఆ ప్రాంత విస్తీర్ణం, అక్కడి ప్రజానీకపు సంఖ్య, వారి అభివృద్ధిలో తేడాలు అనే విషయాలను దృష్టిలో వుంచుకొన్నవుడు చాలా వెనుకబడిన రాయలసీమ, తెలంగాణాలకు సహజంగానే ఎక్కువనీటిని ఇవ్వాల్సి వుంటుంది.

13. రంగనాయకమ్మ గారి వ్యాసం చూసే వుంటారు. మీ ప్రతిస్పందన ఏమిటి?

ఆమె రాసిన వ్యాసం చూస్తే- చర్చల గురించి ఆమె అధ్యయనం చేయలేదని అనలేం గాని చరిత్రని సరిగ్గా అధ్యయనం చేయలేదని అనిపిస్తోంది. చైనాలో, రష్యాలో చర్చలు జరిగిన దానికీ ఇప్పటి ఈ చర్చలకూ సంబంధం లేదని ఆమె అనొచ్చు కానీ ఆ రెండు దేశాల్లో జరిగిన చర్చలు కూడా కొన్ని పట్టవిడుపులు వదులుకున్నాకే జరిగాయని వాటిని బాగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఈ చర్చలు, రాజీలు అక్కడున్న కార్మికవర్గ, రైతాంగ నాయకత్వం ఆ దేశాల్లో విప్లవాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించుకుంది. ఇలాంటి అనేక విలువైన అనుభవాలు కమ్యూనిస్టు పార్టీలకున్నాయి. కానీ ఆమె, ఇవేమీ పట్టించుకోకుండా స్వీయమానసికంగా, అధ్యయనరాహిత్యంగా మాట్లాడుతున్నారు.

14. రైతులను ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు కదా. ఆయా ప్రాంతాల్లో తిరిగే దళాలను కలిస్తే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పడం వెనుక మీకేదైనా ప్రోగ్రాం వుందా? ఇప్పటికే ఆత్మహత్యలు చేనుకున్న రైతుకుటుంబాలకు మీరు ఎలాంటి ఉపశవమనం కలుగజేస్తారు?

రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ప్రపంచబ్యాంకు. మా ఉద్యమ ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే పరిష్కారమైందని అనుకుంటున్నాం. తక్షణం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య – అప్పులు. వాటిని మా ఉద్యమ ప్రాంతంలో మాఫీ చేశాం. అప్పులు రద్దుచేయడమొక్కటే కాదు. భవిష్యత్తుపై వాళ్ళలో ఆశలేకపోతే కూడా ప్రయోజనం లేదు. అందుకే మేమూ ప్రత్యామ్నాయంగా వాళ్ళకు కావల్సిన కొన్ని పరికరాలను సమకూర్చి, వాళ్ళే సమష్టిగా ఒకరికొకరు తోడ్పాటునందించుకునేలా కార్యక్రమాలు చేపట్టాం. బెల్లంకొండ ప్రాంతంలో ఒక కోటి రూపాయల అప్పును రద్దుచేశాం. నల్లమల, రాయలసీమ ఉత్తరతెలంగాణ ప్రాంతాల్లో కూడా అలాగే చేశాం. అనంతపురం జిల్లాలో రైతులకు వేరుశెనగ విత్తనాలు అందించాం. వారికెన్నివిదాల సాయపడాలో అన్నివిధాలా సాయపడుతున్నాం. ఒకపక్క రాజ్యం ప్రయోగించే అణచివేతను ఎదుర్కొంటూనే మాకు ప్రియమైన, ప్రాణమైన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందో సూచించామని అందర్నీ కోరుతున్నాం. రైతులకు మేం  చెపుతున్నదేమంటే “రైతులారా మీరు తప్పు చేయలేదు. తప్పుచేయనివాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవనరంలేదు. ధైర్యాన్ని కూడగట్టుకోండి. మనకళ్ళకు ప్రత్యక్షంగా కనిపించని ప్రపంచబ్యాంకు మనల్ని ఆత్మహత్యల వైవు నెడుతోంది. పోరాటాల్లోకి రండి”. దీన్ని రాజకీయ ఉద్యమంగా మార్చడానికి మేం కృషిచేస్తున్నాం.

15. ‘డెమొక్రటిక్‌ స్పేన్‌’ కోసం మేం ఈ ‘చర్చ’ పత్రికను ‘నడిపిస్తున్నాం. మీ దృష్టిలో డెమొక్రటిక్‌ స్పేస్‌ అనే దానికి మీ వద్దనున్న విశ్లేషణ ఏమిటి? ఈ చర్చలు డెమొక్రటిక్‌ స్పేన్‌కు ఎలా దోహదవడతాయి?

 అసలు రాజ్యం స్వభావంలోనే డెమొక్రటిక్‌ స్పేస్‌ వుండదు. మరి అది పాలిస్తున్న ప్రాంతంలో దాన్ని ఆశించడం నేతిబీరలో నెయ్యి చందమే.

ఇది భూస్వామ్య, దళారీ నిరంకుశ ప్రభుత్వమని మేం పదేపదే చెబుతున్నది ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను వ్యక్తం చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ప్రతిఘటించి తమకు భావవ్రకటన స్వేచ్చ కావాలన్నా ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోదు. డెమొక్రటిక్  స్పేస్‌ను ఈ ప్రభుత్వాలు కల్పించవు. అది ప్రజలు పోరాడి సాధించుకోవాల్సిందే.

సాయుధ పోరాటమనే విషయం దాకా ఎందుకు విద్యుత్ ఛార్జీల ఉద్యమం, జూనియర్‌డాక్టర్ల సమ్మె, అంగన్‌వాడీ మహిళల ఉద్యమం – ఇంకా ఇలాంటి మరెన్నో రాజ్యాంగ పరిధిలో సాగిన అనేక ఉద్యమాలనే ఈ ప్రభుత్వం పాశవికంగా కాలరాసింది. ఇప్పుడు ఈ మూడునెలల కాలంలో కొంచెంగానయినా ఏర్పడిన డెమొక్రటిక్ స్పేస్ ఎన్నాళ్ళు ఉంటుందనేది ప్రభుత్వం మీదనే ఆధారపడి వుంది. ఎందుకంటే మేమెప్పుడూ డెమొక్రటిక్‌ స్పేస్‌కు ఆటంకం కల్గించలేదు. గత ప్రభుత్వం తోనూ మేం చర్చలకు సిద్ధపడ్డాం. కాని అది అవలంబించిన పూర్తి ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగానే మేం చర్చలు వద్దన్నాం. ఈ ప్రభుత్వం చర్చల పట్ల అనుసరిస్తున్న వైఖరి బట్టి మా నిర్ణయం ఉంటుంది. డెమొక్రటిక్‌ స్పేన్‌ అనేది పోరాటం ద్వారానే ఏర్పడుతుంది తప్ప కాగితాల మీద రాసుకుంటేనో, అయాచితంగా ఎవరైనా ఇస్తేనో వచ్చేది కాదు.

Leave a Reply