చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాలన ఇది. దేశద్రోహుల, లొంగుబాటుదారుల వికృత , ప్రజావ్యతిరేక జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహనీయులని, త్యాగమూర్తులని, ఆదర్శనీయులని బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి. “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో, ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్రభుభక్తిని మించిన దేశభక్తి లేని కాలం ఇది.
ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని కన్న తల్లులను, వారికుటుంబాలను పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి స్మరణే నేరమైనప్పుడు ఈ పని మరింత గట్టిగా చేయాలి.
“అన్నీ వేదాలలో ఉన్నాయట” అంటూ, ఎలాంటి శాస్త్రీయ సమాచారం, రుజువులులేని, వేలఏండ్ల కిందటి సమాజాలను ఉన్నతీకరిస్తూ, ఆనాటి మనుధర్మాన్ని శ్లాఘిస్తున్న సో కాల్డ్ చరిత్రకారులకు పెద్దపీట వేస్తున్న పాలనలో,కేవలం దశాబ్దాల కిందట జరిగిన సంఘటనలను, నాడు దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తుల, వారి కుటుంబాలను,(వారి త్యాగాలకు ఇప్పటికీ ప్రత్యక్ష సాక్షాలున్నా), మననం ఈ పాలకుకులు చేసుకుంటారనీ ,నేటి యువతకు వారి విలువలనందిస్తారనుకోవడం మన భ్రమే. అయితే, ఇప్పటికీ ప్రజలనోళ్లలో నానుతూ, తమకు ఓట్లు సమకూర్చే కొందరు నాయకులను ప్రచారం చేస్తున్నారు. తమకు తాత్వికంగా,సైద్ధాంతికంగా వ్యతిరేకులైన అంబేద్కర్లను, చివరకు బద్ధ విరోధులను శత్రువులైన నాయకులను ఎన్నికల సమయంలోనైనా, తమవారిగా ప్రచారం చేసుకుంటారు. కొన్ని దశాబ్దాల కిందటివరకు, చంద్రశేఖర్ ఆజాద్ కు జంధ్యం వేసి, భగత్ సింగ్ తో పాటు తమ ఆదర్శమూర్తులుగా ప్రకటించుకున్న సంఘ్ పరివార్ విద్యార్థి సంఘం, ఆ విప్లవకారుల భావజాలం ప్రజలలో సమసమాజ భావజాలాన్నివ్యాపింపజేస్తుందని గ్రహించి, వారి ఊసే ఎత్తడం మానివేశారు.
వ్యాసకర్త కృష్ణప్రతాప్ సింగ్ మన ప్రజల చైతన్యరాహిత్యాన్ని, స్వామిభక్తిని ప్రస్పుటంజేస్తూ ఈ వ్యాసం (MOTERS AND REVOLUTIONARY SONS SHARE THE SAMA FATE – OBLIVION) లో, నరేంద్రమోడీ తన తల్లి హీరాబేన్ పాదాలకు మోకారిల్లితే, అతని అనునుయులు తామేదో మహత్తర ఘట్టాన్ని వీక్షిస్తున్నట్టుగా రోమాంచిత పులకితులై ఆనందాశ్రువులతొ కరతాళధ్వనులు మిన్నంటేలా చేస్తున్నారు. ఇక, కాంగెస్ పార్టీ అధ్యక్ష పదవిని తొలిసారి అధిష్టించిన రాహుల్ గాంధీ తన తల్లి సోనియా నుదిటిపై ముద్దాడటం దేశం లోని అన్నిపత్రికలో పతాక శీర్షిక అయింది.. మోడి తొలిసారిగా ప్రధానమంత్రి అయినపుడు పార్లమెంట్ భవనపు మెట్లను ముద్దాడితే, సగటు భారతీయుని ఉద్రేక, ఆనందాలకు అంతేలేదు.
అలాంటి సమాజంలో , దేశాన్ని వలసవాద సంకెళ్లనుండి విముక్తి కొరకే గాక, సకల పీడనల, అసమానతలు లేని సమసమాజంకోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగధనుల విషయంలో వారి కుటుంబాల విషయంలో ప్రజలు నిర్లిప్తతతో వుండటం ఒక విషాదం. ఆ అమరులు కోరిందేమిటి? ప్రతి సంవత్సరం ఒక తంతుగా ఓట్లను దృష్టి లో పెట్టుకొని కేంద్రం ప్రసాదించే బిరుదులుకావు. వారు కోరింది, తమ సమాధులపై తమదేశపు పిడికెడు మట్టిని. తాము ఏ విలువల కోసం , ఏ నూతన మానవుని ఆవిష్కరణ కోసం ప్రాణాలర్పించారో, అలాంటి ఆదర్శాలతో దేశ యువత పని జేయాలని, తమ జీవితాచారణ యువతను ఆ వైపుకు ఉత్తేజితులచేయాలనేదే వారి ఆకాంక్ష.
మరి నేడు వారి ఆశయాలమాటనటుంచి, వారి చరిత్రనే మరిచి, వారికుటుంబాలను బతికినంతకాలం విస్మరణకు గురిజేస్తూ , ఆ విప్లవమాతృమూర్తులు తామెందుకు యింకా బతికామా అనే దు స్థితికి దిగజార్చింది ఈ పాలకులు. వారి నాటకీయ విన్యాసాలతో, ప్రసంగాల మత్తులో ఆ అమరులను విస్మరించిన నేటి సమాజం.
ఎన్నికల ప్రజాస్వామ్యంకు ఓట్లు రాల్చే నినాదాలుగావాలి,ఆయా సామాజిక వర్గాల నాయకుల మాటలుగావాలి. ఏ ఆశయాలైతే తమ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితంచేస్తాయో, ఏ భావజాలం అయితే తమ అధిపత్యానికి ఎసరుపెడుతుందో, అలాంటి ఆశయాల, భావజాల ప్రతీకలను పాలకులు విస్మరించడం సహజమే. అలాంటప్పుడు, అలాంటి అమరుల చరిత్రను వెలికితీసి నేటి యువత ముందుంచాల్సిని భాద్యత నేడు, పురోగామిశక్తుల,ప్రజాస్వామ్యవాదులపై ఎంతయినా వుంది.
మొదట దేశం కోసం అమరులైన వీరుల మాతల గురించి చెప్పుకోవాలి. తమ కళ్ళ ముందే తాము పెంచి,పెద్దజేసిన నవ యవ్వన పుత్రులు చిరునవ్వుతో ఉరికంబమెక్కితే ఏ మాత్రం ధైర్యం సడలక, తాము వీరమాతలమంటూ సగర్వంగా శేష జీవితంలో ఆష్టకష్టాలు అనుభవించిన ఆ తల్లుల గురించి తెలుసుకుందాం.
అలాంటివారిలో, కాకోరి కుట్ర కేసులో ఉరితీయబడ్డ అమరుడు రాంప్రసాద్ బిస్మిల్ మాతృమూర్తి మూల్ రాణిది ప్రధాన స్థానం. ఆమె త్యాగశీలత, దేశభక్తి గురించి మొదట మనం మననం చేసుకోవాలి. బిస్మిల్ ఉరితీతకు ముందు ఆమె తన కుమారుడు రాంప్రసాద్ ను కలసినపుడు, ఆమెకు దేశంపట్ల గల అకుంఠిత దీక్ష, ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది. తల్లిని చూడగానే, రాంప్రసాద్ కళ్లలో నీళ్ళు. ఆ సహజ స్పందనకు ఆ మాతృమూర్తి ప్రతిస్పందన “నేను నా కుమారుడు ధైర్యశాలీ అనే భావనతో ఉన్నాను. అతని పేరు వింటేనే బ్రిటీష్ ప్రభుత్వం గడగడలాడుతుందనుకున్నా. అతడు మరణానికి భయపడుతాడని నాకు తెలియదు”. అని చెప్పింది. అంతే కాదు, “నీవు కన్నీళ్ళు పెట్టుకొనేటట్లయితే ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి?”అంటూ ప్రశ్నించిందని ఆమె వెంట ఆమె బంధువని చెప్పుకొని వెళ్ళిన మరో విప్లవకారుడు శివవర్మ తన జ్ఞాపకాలాలో రాస్తారు. తల్లి మాటలకు బిస్మిల్ సమాధానమిస్తూ తాను ఏ మాత్రం బాధపడటం లేదని తల్లిని చూడగానే అసంకల్పితంగా తన కళ్ళలో నీళ్ళు కదిలాయని జవాబిచ్చారు. అప్పుడామె, శివవర్మను ముందుకు తోస్తూ, అతడు రాంప్రసాద్ పార్టీకి చెందిన వాడని, ఏదైనా సందేశం పార్టీకి చెరవేయాలంటే శివవర్మ తో పంపమని సలహానిస్తుంది.
అంతటి క్లిష్టసమయం లో, కొడుకు మరణానికి చేరువులో వున్నాడని తెలిసీ, తనకూ ప్రమాదముందని తెలిసీ మరో విప్లవకారున్ని తనవెంట తీసుకెళ్లిన ఆ విప్లవ మాత, మూలారాణి సాహసానికి , దేశభక్తి కి కొలమానాలున్నాయా? ఆమెకు ఈ దేశం ఏమిచ్చింది? రాంప్రసాద్ బిస్మిల్ అమరత్వం తర్వాత, ఆమె జీవనం కోసం సహజాన్ పూర్ లోని స్వంత ఇల్లును అమ్ముకుంది. కొడుకు కొరకు ఆప్యాయంగా దాచివుంచిన బంగారు గుండీలను అమ్మాల్సి వచ్చింది. చివరకు రోజువారీ ఆహారం కోసం కొన్ని మతసంబంధ స్వచ్ఛంద సంస్థలు ఏకాదశి లాంటి రోజుల్లో పేదలకందించే ఆహారం పై ఆధారపడింది.
మరో విప్లవమాత కౌసల్య దేవి జీవిత చరిత్రను పరిశీలించినా, మన స్పందనలో తేడా కన్పించదు. ఈమె, కాకోరి కుట్రకేసులో ఉరితీయబడ్డ మరో విప్లవకారుడు రోషన్ సింగ్ మాతృమూర్తి. రోషన్ కూడా, రాంప్రసాద్ బిస్మిల్ ఉరితీయబడ్డ ఆగస్ట్ 9,1925 న నైనీ కేంద్రకర్మాగారం లో ఉరితీయబడ్డారు. అతని అమరత్వానికి మూల్యం, అతని తల్లే కాదు, అతని కూతుళ్ళు చెల్లించాల్సి రావడం ఒక విషాదం. అతని మరణాంతరం అతని కుటుంబం ఎదుర్కొన్నరాజకీయ ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ళు అన్నీ, ఇన్నీగావు. అతని కూతుళ్లకు వివాహసంబంధాలు వచ్చినప్పుడల్లా, పోలీసుల బెదిరింపులవల్ల వెనక్కి పోయేవి. అతని బంధువులెవ్యరూ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ఆ క్లిష్టసమయం ఆ కుటుంబాన్ని ఆదుకొనింది, మనం మరిచిన మరో స్వాతంత్రసమర యోధుడు , హిందీ దినపత్రిక “ప్రతాప్” సంపాదకులు గణేష్ శంకర్ విద్యార్థి.
ఇక అదే కుట్ర కేసులో అమరుడైన అసఫ్ ఖుల్లాఖాన్ పరిస్తితి మరో విధంగా వుంది. అతనిది కులీన కుటుంబమయినా అతని, అతని తల్లి తరపు కుటుంబాలు అతనికై చేసిన న్యాయపోరాట ఖర్చలకై వారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. బ్రిటీష్ ప్రభుత్వం వారి ఆస్తులను జప్తుజేసింది. అతని తల్లి మజూర్ ఉన్నీసా వారి బంధువుల చేత అనేక అవమానాలకు గురయ్యింది. ఆమెకు తోడుగా నిలిస్తే, బ్రిటీష్ ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే భయంతో అయినవాళ్ళంతా ఆమెకు దూరమౌతారు. ఆమె ఒంటరి జీవితం గడుపుతున్నప్పుడు, ఒకరోజు ఆమె ఇంటికి ఒక ఆగంతకుడొస్తాడు. అతడక్కడున్న వ్యక్తికి మాట్లాడే అవకాశమివ్వక ఆమెను ఒక బీడీ, మంచినీళ్లు అడుగుతాడు. అతడు లోనికి వెళ్ళి మంచినీరు తెచ్చేలోగా, ఆ ఆగంతకుడు అక్కడ ఒక సంచి వదిలి వెళ్ళాడు. తీరాచూస్తే, ఆ సంచినిండా డబ్బులున్నాయి. ఆవ్యక్తి ఎవరోకాదు , చంద్రశేఖర ఆజాద్. తనకు పొగ పీల్చడం అలవాటు లేదు. కేవలం తన గుర్తింపు దాచుకొనేందుకే అతడు బీడీని అడిగాడని తర్వాత తెలుస్తుంది.
పై విప్లవకారుల సహచరుడు రాజేంద్రనాథ్ లాహిరిని దక్షిణేశ్వర్ బాంబ్ కేసులో, కాకోరి కుట్ర కేసులో శిక్షవేసి గొండా జైలులో 17 డిసెంబర్, 1927 న ఉరితీశారు. నేటి బంగ్లాదేశ్ లోని పబ్నా జిల్లాలోని మోహన్ పూర్ లో లాహిరి 29 జూన్ 1901 లో జన్మించారు. MA పట్టబద్రుడయిన రాజేంద్రనాథ్, హిందూస్థాన్ రిపబ్లికన్ సోషియలిస్ట్ పార్టీలో సభ్యులు. విషాదమేమంటే, నేడు బాగా చదువుకున్న వారికీ రాజేంద్రనాథ్ గురించి, అతని కుటుంబం గురించి తెలియకపోవడం. మనకు వికీపీడియా లో కూడా అతనిగురించిన సమాచారం లభ్యం కావడం లేదు.
దేశ విముక్తికొసం కొద్ది కాలం లోనే ఇద్దరు పుత్రులను కోల్పోయిన వీరమాత సునయిన. ఆమె కుమారుడు మణీంద్రనాథ్ బెనర్జీ , తనమిత్రుడు రాజేంద్రనాథ్ ఉరిశిక్షకు కారకుడయిన జితేందర్ బెనర్జీ ని కాల్చి చంపారు. దానికి, అతడు ఫతేఘర్ జైలులో పదేళ్ళ కఠిన కరాగార శిక్ష వేశారు. అక్కడే, విప్లవకారులు యశపాల్. మహేంద్రనాథ్ గుప్త తో ఆమరణ నిరాహార దీక్షజేస్తూ అమరుడయ్యాడు. అంతకు ముందటి సం. లోనే ఆమె , తన మరో కుమారుడు, విప్లవకారుడు, భూపేంద్రనాథ్ బెనర్జీని కోల్పోయింది. ఆమె తన కుమారుడు మణీంద్రనాథ్ విడుదల కోసం చేసిన న్యాయపోరాటం లో ఆస్తినంతా కోల్పోయింది. అయితే, ఆమె ఏమాత్రం ధైర్యం వీడలేదు. జైలులో తనకుమారుడు మణీద్రనాథ్ సహచరుడు మన్మథనాథ్ 1937 లో విడుదలయినపుడు, అతనికి ఆ వీరమాత ఆశ్రయమిచ్చింది. ఆమె 23 ఫిబ్రవరి, 1962 లో మరణించినపుడు ఆమెను పట్టించుకొనేవారే లేదు.
ఇక ,చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్ తో పాటు దేశప్రజలకందరికి సు పరిచుతుడే. ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఉండగా ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం తో పోలీసులు చుట్టుముట్టి అతనిపై కాల్పులు జరిపారు. అతడు కాల్పులు జరుపుతూ అతని సహచరుడి్న సుఖ్ దేవరాజ్ ను తప్పించగలిగాడు. చివరకు తాను పోలీసులచేతిలో బందీకావడం ఇష్టం లేక, తానే కాల్చుకొని అమరుడ య్యాడు. అతని మరణానంతరం, అతని తల్లి జగ్రన్ దేవి అత్యంత పేదరికాన్ని అనుభవించింది. ఆకలి తీర్చుకునేందుకు ఆమెకు ఆరికెల గింజలు తప్ప మరేవి లభ్యమయ్యేవి కావు. ఆమె దుస్థితి తెలిసిన జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి ఆమెకు రూ.500 అందజేశాడట.అయితే, ఆమెకు చివరిదాకా అండగా నిలిచింది ఆజాద్ అనుయాయి సదాశివ మల్కా పుర్కార్ మాత్రమే. ఆమె కొరకు పుర్కార్ స్వంత విశ్వాసాలను పక్కనబెట్టి జాగ్రన్ దేవిని తీర్థయాత్రలకు పిలుచుక వెళ్ళాడు. ఆమె పుర్కార్ సేవలను కొనియాడుతూ, ఆజాద్ జీవించివున్నా , సదాశివుని కన్నా ఎక్కువ ఏమిచ్చేవాడని ఇరుగుపొరుగు వారితో అనేవారట. సదాశివ కూడా భూసవాల్ బాంబ్ కేసులో 14 సంవత్సరాలు అండమాన్ జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. అలాంటి వీరమాత స్మృతి చిహ్నాన్ని ఝాన్సీలో నేడు పట్టించుకొనేవారెవరు లేకపోవడం విషాదమే కదా.
అత్యంత ప్రజాదరణ పొందిన భగత్ సింగ్ కుటుంబం గురించి తెలుసుకుందాం. అతని తండ్రి సర్దార్ కిషన్ సింగ్, చిన్నాన్నలు సర్దార్ అజిత్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్ విప్లవకార్యకలాపాల్లో పాల్గొన్నందుకు జైలుశిక్షణనుభవిస్తున్నారు.యాదృచ్చికమేనయినా ,భగత్ సింగ్ పుట్టినరోజే 28 సెప్టంబర్,1907 నాడే విడుదలయ్యారు. అందుకే అతని పేరు భగత్,(పంజాబీలో, అదృష్టం )అని పేరు పెట్టారు.అతని తల్లి విద్యావతి అతన్ని భగతా (మంచి భవిష్యత్తు గలవాడు)అని పిలిచేది. భగత్ లాహోర్ కుట్ర కేసులో (డిసెంబర్ 20,1928)పార్లమెంట్ లో బాంబ్ వేసిన (ఏప్రిల్ 8,1929) కేసులో ముద్దాయిగా ఉరిశిక్ష వేశారు. అయితే , అదేదో భగత్ సింగ్ తన ప్రాణాన్ని కేవలం పంజాబ్ ప్రాంత విముక్తి కోసమే చేసినట్టు, అమరులకే అమరుడైన భగత్ సింగ్ మాతృమూర్తి విద్యావతి దక్కిన బిరుదు,”పంజాబ్ మాత”.ఇది, భగత్ సింగ్, అతని కుటంబం చేసిన త్యాగాన్నికించపరచడమే గాక మరేమిటి?
సమాజ నిర్లక్ష్యానికి గురయిన మరో విప్లవకారుడు సుఖ్ దేవ్ అతని కుటుంబ సభ్యులూనూ. సుఖ్ దేవ్ తల్లి రాల్లి దేవి, తండ్రి రాంలాల్. వారి జీవితమంతా పేదరికం ల్లోనే గడిచింది. చివరకు ,వారి స్మృతి చిహ్నంగా మిగిలిన లూధియానా నౌగర్ లోని వారి ఇల్లు శిధి లమయినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొంతమంది ఒక ట్రస్ట్ గా ఏర్పడి, ఆ స్థలాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితి.భగత్ సింగ్ మరో సహచరుడు శివరాం హరి రాజ్ గురు. అతని స్మరణార్థం రాజాగురు పట్టిన ఊరు కేదా (పూణే జిల్లా) అతని పేరు పెట్టినా అతని తల్లిదండ్రులు పార్వతీ బాయి,హరినారాయణ్ పూర్తిగా విస్మరణకు గురయ్యారు.
భగత్ సింగ్ మరో సహచరుడు బటుకేశ్వర్ దత్. అతని తల్లిదండ్రులిరువురూ అతడు బతికి ఉండగానే మరణించిన అదృష్టవంతులు.లేకపోతే, స్వతంత్ర భారతం లో దత్ పడిన కష్టాలు చూస్తూ నిత్యం మరణించేవారు. పార్లమెంట్ బాంబ్ కేసులో జీవిత ఖైదు అనుభవించిన దత్ క్షయ వ్యాధితో జీవితాంతం బాధపడ్డాడు. అండమాన్ జైలు నుండి విడుదలయ్యాక దత్ క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని 4 సంవత్సరాలు జైలుశిక్ష ననుభవించాడు కూడా. బతుకుతెరువు కోసం అతడు ఒక బీడీ కంపెనీ లో పని చేయాల్సి వచ్చింది కూడా. స్వతంత్ర భారతం లో అతనికి గుర్తింపులేక చివరకు 1965 లో క్షయ వ్యాధితో మరణించడం మనదేశ ఔన్నత్యాన్ని చాటుతుంది.
మరో ఇరువురు విప్లవసోదరుల పెద్దవాడు రాజ్ కుమార్ సిన్హా ,అతని తమ్ముడు విజయకుమార్ . ఒకరు కాకోరి కుట్ర కేసులో, మరొకరొకరు లాహోరె కుట్రకేసులో జైలు శిక్షణనభవించారు. పోలీసుల వేధింపులు భరించలేనివారి సోదరి పిచ్చిదయింది. అలాంటి పరిస్థితులలో కూడా వారి తల్లి, శరత్ కుమారి ధైర్యం కోల్పోలేదు.
ఒకమారు, ఆ సోదరులిద్దరూ జైలులో వుండగా శరత్ కుమారిని ఓదార్చేందుకై ఒక పేరుపొందిన విప్లవకారుడు వచ్చారు. ఆమె దుస్థితిని చూసి బాధ పడ్డారట. దానికి ఆమె,”నన్ను చూడు. పులుల తల్లి కన్నీరు కార్చదని తెలియదా? నేను, ఒకటి కాదు,రెండు పులుల తల్లిని. నేనే బాధపడకపోతే, నాపైన జాలి చూపిస్తూ, నా పరిస్థితిపై కన్నీరు కారిస్తే నేనెలా సహించగలం” అని అందట.
అలాంటి వీరమాతలను, వారి కుటుంబాలను ఒకవైపు విస్మరిస్తూ ,మరో వైపు జననీ,జన్మభూమ స్వర్గానికన్నా మిన్నా అనే సమాజాన్ని ఏమనాలి?
అంతో, ఇంతో పేరుపొందిన విప్లవకారుల, వారి కుటుంబాలే ఇలాంటి జీవితం గడిపాయంటే ఇక వారి అనునాయులుగా అశేష త్యాగాలుచేసి,అమరత్వం పొందిన వేలాది విప్లవకారుల గురించి ఏమి మాట్లాడగలం? పాలకుల చరిత్రే ప్రజల చరిత్ర గా ప్రచారం జరుగుతుందని చరిత్ర చెబుతున్న వాస్తవం. మనదేశస్వాతంత్ర్య పోరాట క్రెడిట్ మొత్తం గాంధీ-నెహ్రూ ఖాతాలో వేసిన చరిత్ర మనది. అంతకన్నా ఘోరంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్నేవ్యతిరేకించి, బ్రిటీష్ వలసపాలకులకు తొత్తులుగా వ్యవహరించిన సంఘ్ పరివార్,నేడు ఆ పోరాట ఫలాలను స్వంతం జేసుకొనే ప్రయత్నం లో ఉంది. స్వాతంత్ర్యం అంటే దేశం లోని పిడికెడు కులీనవర్గాలు దేశాన్ని దోచుకొనేందుకు పొందే స్వాతంత్ర్యం కాదని, దేశం లోని అత్యంత పీడిత వర్గాలు సామాజిక, ఆర్థిక స్వేచ్ఛా, సమానత్వం పొందినపుడే నిజమైన స్వాతంత్య్రమని, అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కో సం అమరులైన విప్లకారుల ఆశయాలను,ఆదర్శాలను నేటి యువత ఆచరించేలా ప్రచారం చేయడమే వారికి నిజమైన నివాళి.
MOTERS AND REVOLUTIONARY SONS SHARE
THE SAMA FATE – OBLIVION- Krishna Pratap Sing వ్యాసం ఆధారంగా