ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న అగ్రరాజ్యాలు భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో తమకనుకూలమైన రీతిలో కూటములు ఏర్పరచుకుంటున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి అవమానకరమైన రీతిలో నిష్క్రమించిన అగ్రరాజ్యం అమెరికా పోయిన పరువును నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతుంది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములు కడుతున్నది. పులి మాంసం తినడం మానేసిందన్నట్లు ఇక యుద్ధం ముగిసింది అంటూనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త పన్నాగంతో సెప్టెంబర్ 15న బ్రిటీష్, ఆస్ట్రేలియాతో కలిసి చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి ఆ మూడు దేశాల పేర్లు గుది గుచ్చి ‘ఆకస్’గా వ్యవహరించబోతున్నారు. దీంతో అమెరికాకు యూరోపియన్ యూనియన్ తో ఇంతకాలం ఉన్న సత్సంబంధాలు బెడిసి కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య, చైనా-ఆస్ట్రేలియా మధ్య విబేధాలు పెరిగాయి. అంతేగాకుండా ఆకస్ ఏర్పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చిచ్చురేపనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు, శాంతికి తీవ్ర ముప్పు తెస్తుంది. ఇదంతా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేయడానికేనన్నది స్పష్టం. ప్రతి కూటమి వెనుక దాగి ఉండే అంశం భౌగోళిక రాజకీయ ఆధిపత్యం, వాణిజ్య ప్రయోజనం అన్నది స్పష్టం. మొత్తం మీద ఆఫ్ఘాన్  పరిణామాలు ప్రపంచ రాజకీయాలను బాగానే ప్రభావితం చేస్తోన్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐరాస జనరల్ అసెంబ్లీలో సెప్టెంబర్ 20న తొలిసారి ప్రసంగిస్తూ భిన్నమైన స్వరం వినిపించారు. “మేము కఠిన యుద్ధ కాలాన్ని ముగిస్తున్నాం. అవిరామ దౌత్యంతో కొత్త శకం ఆరంభిస్తున్నాం” అని ప్రకటించారు. ఇంకా “దౌత్యం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం” అన్నారు. ఇది ఆఫ్ఘానిస్తాన్ కు సంబంధించిన ప్రకటన మాత్రమే. అలాగే చైనా పేరు ప్రస్తావించకుండానే, “మేము కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని లేదా కఠినమైన శిబిరాలుగా విభజించబడిన ప్రపంచాన్ని కోరుకోవటం లేదు” అని కూడా ఆయన ప్రకటించారు. “మాకు ఇతర విషయాల్లో తీవ్రమైన విబేధం ఉన్నా, అందరి ప్రయోజనమున్న సవాళ్లకు శాంతియుత పరిష్కారం కొరకు ముందుకు వచ్చిన ఏ దేశంతోనైనా కలిసి పనిచేయటానికి అమెరికా సిద్ధంగా ఉంది” అన్నారు. ఇది వాస్తవానికి పద ప్రయోగాల్లో మార్పు తప్ప అమెరికా మౌలిక విదేశాంగ విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం ఎంత మాత్రం కాదు. ఆఫ్ఘానిస్తాన్ లో ఇరవై సంవత్సరాల దురాక్రమణ యుద్ధాన్ని ముగించినందుకు ప్రశంసలందుకోవాల్సిన బైడెన్ ఇంట- బయట విమర్శలకు గురైనారు. ఆఫ్ఘాన్ లో ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రభుత్వం, మహిళలు, మానవ హక్కుల విషయంలో హామీలు, ఒప్పందాలు లేకుండా తాలిబన్ ఛాందసులకు ఆఫ్ఘాన్ ను అప్పగించాడన్నది ఆయనపై విమర్శకుల అభియోగం.

గత కొన్నేళ్లుగా చైనా పోకడలతో స్థిమితం లేకుండా పోయిన అమెరికా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, సింపుల్ గా ‘క్వాడ్’…. భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలను కలుపుకుని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతల స్థాపనే లక్ష్యంగా క్వాడ్ ఏర్పడింది. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు సెప్టెంబర్ 24న వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం చైనాకు ఆగ్రహావేశాలను కల్పిస్తుంది. పుండు మీద కారం చల్లినట్లు సెప్టెంబర్ 15న అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు త్రైపాక్షిక సైనిక ఒప్పందం కుదుర్చున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఒకవైపు నాలుగు దేశాలతో కూడిన ‘క్వాడ్’ ఉండగానే భారత్ ను పక్కన పెట్టి మూడు దేశాలు సైనిక భద్రతా ఒప్పందం చేసుకోవడం భారత్ కు విస్మయం కలిగించింది. మొత్తంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఆకస్ ఏర్పాటు చాల మార్పులకు దారితీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తిరిగి చైనా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడ ఉంది.

ఆఫ్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాల పాటు తిష్టవేసి సాగించిన యుద్ధం ఆశించిన ఫలితం ఇవ్వకపోగా, తాలిబన్ల దాటికి కకావికలై అవమానకర రీతిలో నిష్క్రమించాల్సి వచ్చిన అమెరికాకు ఈ కొత్త కూటమి ఓదార్పునిచ్చే మాట వాస్తవమే. కానీ మూడు దేశాల అధినేతలూ కూటమి ఏర్పాటు గురించి ప్రకటించిన కాసేపటికే చైనా సంగతలావుంచి… మిత్ర పక్షాలైన ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)ల నుంచి వినబడిన అపస్వరాలు రాగల రోజుల్లో ఆసక్తికర పరిణామాలు సంభవించబోతున్నాయన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఏడు దశాబ్దాలపాటు పూర్వపు సోవియెట్ యూనియన్, అమెరికాల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం బెడద 90వ దశకం నుంచి తొలగిందని అందరూ అనుకుంటుండగా ఇప్పుడు ‘ఆకస్’ తెరపైకి రావడంతో పర్యావసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ఆకస్ ఏర్పాటు అమెరికా-చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో ఏర్పడిన కొత్త కూటమి వారి ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవటానికి, రక్షణ సామర్థ్యాలను పరస్పరం పంచుకోవడానికి త్రైపాక్షిక భద్రత ఒప్పందం చేసుకున్నాయి. అణు జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి ఆస్ట్రేలియాకు సహకరించడం ద్వారా చైనా దూకుడుకు బ్రేకులు వేయొచ్చని అమెరికా, బ్రిటన్ నిర్ణయించాయి. అమెరికా చర్య అణువ్యాప్తి నిరోధక ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. ఆస్ట్రేలియా వంటి అణుయేతర దేశంతో అమెరికా, బ్రిటన్ అణు సబ్ మెరైన్ టెక్నాలజీ పంచుకోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ పై ఆంక్షలతో విరుచుకుపడిన అమెరికా, ఏ ప్రయోజనం లేనిదే ఆస్ట్రేలియాకు ఈ అణు టెక్నాలజీ బదిలీ చేస్తుందని అనుకోలేము. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొత్త కూటమి ఆకస్(ఏయీకేయూఎస్) ల్యాండ్ మార్క్ గా ఉంటుందని భావిస్తున్నారు. కూటమిలో భాగంగా మూడు దేశాలు ఉమ్మడి సామర్థ్యం, సైనిక అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, సైన్స్ టెక్నాలజీ, సైనిక స్థావరాలు, భద్రత, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన గొలుసులను పెంపొందించడానికి అంగీకరించాయి.

ఆకస్ కూటమి మొదటి ప్రయత్నంలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత స్థిరత్వాన్ని సాధించే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ సహాయంతో ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములను ఏర్పాటు చేస్తుంది. భౌగోళికంగా విడిపోయినప్పటికీ, మేము సహజ మిత్రులం. ఆసక్తులు, విలువలు పంచుకున్నాం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసస్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే నాటో డిఫెన్స్ కూటమిలో సభ్యులుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇవాళ మన ప్రపంచం మరింత సంక్లిష్టంగా మారుతోంది, ఇండో-పసిఫిక్ ప్రాంతం మనందరినీ ప్రభావితం చేస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసస్ అన్నారు. ఆకస్ కూటమి ఏర్పాటు ఓ చారిత్రాత్మక ముందుగు అని బైడెన్ అంతగా సంబరపడడానికి, బ్రిటన్ వ్యూహంలో ‘ఇదొక నూతన స్తంభం’ వంటిదని బోరిస్ జాన్సన్ ఉబ్బితబ్బిబ్బవడానికి చైనా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా సాధిస్తున్న ఎదుగుదలను అడ్డుకోగల మన్న అతి విశ్వాసమే కారణంగా చెప్పవచ్చు.

నిజానికి గత జూన్ లో కార్నివాలిస్(లండన్)లో జరిగిన జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో జో బైడెన్, బోరిస్ జాన్సన్ల మధ్య జరిగిన రహాస్య చర్చలో ఆకస్ ఏర్పాటుకు బీజం పడింది. గత కొన్నేళ్లుగా అమెరికా-బ్రిటన్లు శాస్త్ర-సాంకేతిక పరిశోధనలలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి (బ్రెక్సిట్) బయటికి రావడంతో దానికి మరింత స్వేచ్చ దొరికింది. ఆకస్ ఒప్పందంలో కృత్రిమ మేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, జలాంతర్గాముల సామర్థ్యం, ఇతర అధునాతన రక్షణ వ్యవస్థల్లో సహకారం పెంపొందించుకోవడమే ఎజెండాగా ఉంటుందని కూటమి నేతలు బయటకు చెబుతున్నప్పటికీ దీని అసలు లక్ష్యం చైనాకు వ్యతిరేకంగా అణు యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయడమేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. అమెరికా కట్టే ఏ కూటమి అయినా, అది కుదుర్చుకునే ఏ ఒప్పందం అయినా తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. చివరికి తన మిత్రులను వంచించేందుకు సైతం వెనుకాడదని చరిత్ర చెబుతున్న సత్యం.

ఆస్ట్రేలియాకు చైనా హెచ్చరిక :

గతంలో క్వాడ్ ఏర్పాటు పట్ల కొంత ‘నాగరికంగా’ స్పందించిన చైనా… ఈసారి మాత్రం అన్ని మొహమాటాలనూ, దౌత్య మర్యాదలను వదిలి ఆస్ట్రేలియానుద్దేశించి బెదిరింపులకు దిగింది. కొత్తగా ఏర్పడిన ‘ఆకస్’ ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చాలని నిర్ణయించింది. అదే చైనాకు ఆగ్రహం కలిగిస్తున్న అంశం. ఇది కేవలం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించిందేనని ఆ దేశం రగిలిపోతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయం ద్వారా గట్టి హెచ్చరికలే పంపింది. భౌగోళికంగా చూస్తే చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఏ రకమైన పొరపొచ్చాలూ లేవు, కానీ ఆస్ట్రేలియా తనంత తానుగా చైనా-అమెరికాల వైరంలో తలదూర్చి కొరివితో తలగోక్కుంటున్నదని దాని సారాంశం.

ఇంతవరకూ అమెరికా-చైనాలకు సమాన దూరాన్ని పాటిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా ఇప్పుడు అమెరికా వైపు మొగ్గడంతో చైనా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆస్ట్రేలియా-చైనాకు ప్రధాన వాణిజ్య భాగస్వామి. ఇక ఇరుదేశాల మధ్య సామరస్యం కుదిరే అవకాశాలు కన్పించడం లేదు. తైవాన్ లో కానీ, దక్షిణ చైనా సముద్రంలో కానీ యుద్ధం వస్తే చైనా దాడుల లక్ష్యాలు మొదట ఆస్ట్రేలియా పైననే ఉంటాయని గ్లోబల్ టైమ్స్ పత్రిక హెచ్చరించింది. అమెరికా అండ చూసుకుని సైనిక దుస్సాహసానికి పాల్పడితే చైనా ‘నిర్దాక్షిణ్యం’గా బదులు తీర్చుకోవడం ఖాయమని బెదిరించింది. బహుశా దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాణాలను వృధా చేసుకునే పాశ్చాత్య సైనిక పటాలంలో తొలి వంతు ఆస్ట్రేలియాదే కావొచ్చని కూడా విస్తృతంగా సంకేతాలు పంపింది. అదే సమయంలో అమెరికా ఆకస్ గురించి ‘ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వంతో సైద్ధాంతిక పక్షపాత బుద్ధిని బైటపెట్టుకుందని’ చైనా వ్యాఖ్యానించింది.

చైనా ఆగ్రాహావేశాల మాట అటుంచి ఆస్ట్రేలియా ఈ కూటమికి సై అనడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి అమెరికా ప్రమేయం ఉన్న కూటముల్లో ఆస్ట్రేలియాకు సభ్యత్వం ఉండటం కొత్తేమీ కాదు. 1941లో సోవియట్ రష్యా వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్లతో పాటు ‘ఫైవ్ ఐస్'(అయిదు నేత్రాల) కూటమిలో అదికూడా భాగస్వామి. అది ప్రపంచంలోనే అతి పెద్ద నిఘా కూటమి. సెప్టెంబర్ 1, 1951 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో సైనిక విషయాలపై సహకరించుకోవడానికి ఏర్పడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ట్రిటీ ‘అంజుస్’లోనూ అది కొనసాగుతోంది. క్వాలో సరేసరి. అందులో అమెరికా, భారత్, జపాన్లతో పాటు అది కూడా ఉంది. అయితే ఈ మూడు కూటముల తీరుతెన్నులూ వేరు. ఫైవ్ ఐస్ అప్పటి సోవియెట్ యూనియన్ పై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ఉద్దేశంతో ఏర్పాటు కాగ, అంజుస్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపానకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోసం ఏర్పడింది. క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన కూటమి.

ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆక్రోశం :

ఫ్రాన్సకు సైతం అమెరికా, ఆస్ట్రేలియాల పోకడలు ఏమాత్రం నచ్చడం లేదు. మరోవైపు ఐరోపా యూనియన్- అమెరికాల మధ్య ఇటీవల పెరుగుతున్న పొరపొచ్చాలు, అగాధాన్ని ఆకస్ ఏర్పాటు మరింత పెంచాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ పరిస్థితి మామూలుగా లేదు. ఆకస్ ఏర్పాటుకు, జలాంతర్గాముల సరఫరా ఒప్పందం రద్దుకు నిరసనగా ఫ్రాన్స్ తన రాయబారులను ఆస్ట్రేలియా, అమెరికాల నుండి వెనుకకు రప్పించింది. యూకే – ఫ్రాన్స్ ల మధ్య జరగబోవు రక్షణ మంత్రిత్వశాఖ చర్చలను ఫ్రాన్స్ రద్దు చేసుకొంది. దీనికి బలమైన కారణమేమంటే ఇప్పుడిప్పుడే ఆయుధ అమ్మకాలను, రఫెల్ యుద్ధ విమానాల పేరిట, జలాంతర్గాముల పేరిట ప్రపంచ మార్కెట్లకు విస్తరిస్తున్న తరుణంలో అమెరికా-యూకేలు ఆస్ట్రేలియాను తన వైపు తిప్పుకోవటంతో ఫ్రాన్స్ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతినడమే.

2016 సంవత్సరంలో ఫ్రాన్స్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఆయుధాల ఒప్పందం ప్రకారం డీజిల్ తో నడిచే 12 జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు రానున్న 10 సంవత్సరాల్లో ఎగుమతి చేయాలి. ఇప్పుడు గతంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ఏకపక్షంగా రద్దు చేసుకొని, అమెరికాకు ఆ కాంట్రాక్టు ఇవ్వడం ఫ్రాన్స్ కు మింగుపడటం లేదు. మిత్రదేశమైన ఫ్రాన్స్ నెత్తికొట్టి ఈ కొత్త కాంట్రాక్టును దక్కించుకోవడానికి అమెరికా సంకోచించలేదు. ఆస్ట్రేలియా కూడా ఫ్రాన్సి కు మాట మాత్రంగానైనా చెప్పలేదు. అంతర్జాతీయ సంబంధాలలో చోటుచేసుకుంటున్న మార్పును ఈ ఉదంతం సూచిస్తున్నది. ఇక ఆకస్ ఒప్పందంతో ఫ్రాన్స్-ఆస్ట్రేలియా ఒప్పందం అటకెక్కినట్లే. ఇప్పటికే ఫ్రాన్స్ ఆ ప్రాజెక్టుపై దాదాపు 1,800 కోట్ల డాలర్లు వ్యయం చేశాక ఏకపక్షంగా దాని నుంచి తప్పుకోవటం ఫ్రాన్స్ ఆగ్రహావేశాలకు కారణం.

9000 డాలర్ల విలువగల డీజిల్ తో నడిచే 12 ఫ్రెంచి జలాంతర్గాములకు బదులుగా 6600 డాలర్ల విలువ గల 8 జలాంతర్గాములను బ్రిటన్ అందచేసే పరిజ్ఞానంతో నిర్మితమయ్యే ఎనిమిది అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సమకూర్చాలని నిర్ణయించారు. ఆహారం, మంచినీరు ఉన్నంతకాలం సముద్ర జలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సంచరించడానికి వెసులుబాటుండే అణుశక్తి జలాంతర్గాముల ముందు… అక్సిజెన్ కోసం పదే పదే ఉపరితలానికి రాకతప్పని స్థితిలో ఉండే డీజిల్-విద్యుత్ జలాంతర్గాములు సురక్షితమైనవి కావని ఆస్ట్రేలియా అభిప్రాయపడుతోంది. అటు వేల కోట్ల డాలర్ల కాంట్రాక్టును మిత్ర దేశమన్న మర్యాద కూడా లేకుండా అమెరికా సొంతం చేసుకుందన్న బాధ ఫ్రాన్స్ ను పీడిస్తోంది. ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భౌగోళికంగా దూరంగా ఉంటుంది.

అమెరికా వైఖరి పట్ల ఈయూ అసంతృప్తి :

నిజానికి సెప్టెంబర్ 16న ఈయూ దేశాలు ఇండో-పసిఫిక్ భద్రత గురించి చర్చించడానికి సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. సమావేశానికి ఒక్కరోజు ముందు ఆకస్ ఏర్పాటు ప్రకటన బైడెన్ చేయడంతో ఈయూ దేశాలు దిగ్ర్భాంతికి గురయ్యాయి. ఫ్రాన్సు యూరోపియన్ యూనియన్ బాసటగా నిలిచింది. ఆకస్ కూటమికి దూరంగా ఉంటామని, అవసరమైతే నాటో కూటమి నుంచి వైదొలగుతానని ఫ్రాన్స్ చేసిన హెచ్చరిక మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. క్వాడ్ ఉండగా ఆకస్ పేరుతో మరో త్రైపాక్షిక కూటమిని ముందుకు తేవడం ద్వారా బైడెన్ ప్రభుత్వం తన ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్, జపాన్ల కన్నా ఆస్ట్రేలియాకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నది. అణు జలాంతర్గాముల కోసం మోడీ ప్రభుత్వం బైడెన్ ముందు ఎంతగా లొంగుబాటు ప్రదర్శించినా ఉపయోగం లేకపోయింది. అయితే ఈయూ అభ్యంతరం వేరు. ఇన్ని దశాబ్దాలుగా నాటో కూటమి ద్వారా ప్రయోజనం పొందిన అమెరికా మాట మాత్రమైనా చెప్పకుండా భిన్నమైన బాట పట్టడం ఈయూ సహించలేకపోతోంది.

డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఈయూ దేశాలను క్రమేపీ అమెరికాకు దూరం చేశాయి. అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, మిలిటరీ మీద ఆధారపడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో ఐరోపా యూనియన్ వ్యవహరించాలని ఫ్రాన్స్ జర్మనీలు చెబుతున్నాయి. ఐరోపా యూనియన్-అమెరికా సంబంధాల విషయానికి వస్తే గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా గుర్రుగా ఉంది. చైనాతో గత సంవత్సరం జర్మనీ, ఫ్రాన్స్ పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ట్రంప్ కాలంలో అమెరికాను కాదని అవి రష్యాతో గ్యాస్ పైప్ లైన్ పై ఒప్పందానికొచ్చాయి. ఈ పరిణామంతో మున్ముందు పునరేకీకరణలు ఎలా ఉంటాయో, ఎవరు ఏ శిబిరంలో చేరతారో… వాటి పర్యవసానాలేమిటో వేచి చూడాల్సి ఉంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మిలిటరీ పోటీతత్వం ఇక్కడ బట్టబయలైంది. ఇది ఫ్రాన్స్ కు వెన్నుపోటని అధ్యక్షుడు మాక్రాన్ వర్ణించాడు. దీనితో యూరపులోని మిలిటరీ కూటమి నాటోలో కూడా లుకలుకలు ప్రారంభమైనట్టే. ఇప్పటికే నాటోకు వ్యతిరేకంగా ‘యూరప్ ఆర్మీ’ ఏర్పాటు చేసుకోవాలని జర్మనీ, ఫ్రాన్స్ లు పట్టుపడుతున్నాయి. అయితే ‘ఆకస్’ పూర్తి స్థాయిలో అమలైతే రాజుకునే ఘర్షణలు ఆసియా ఖండ దేశాలన్నిటినీ చుట్టుముట్టడం ఖాయం.

ముగింపు:

ఈయూ నుంచి బయటికొచ్చాక (బ్రెగ్జిట్) బ్రిటన్ తీసుకున్న అతిపెద్ద వ్యూహాత్మక నిర్ణయం ఈ ‘ఆకస్’ ఏర్పాటు. ఆస్ట్రేలియాకు సరఫరా చేయాల్సిన జలాంతర్గాముల నిర్మాణం అమెరికా సాంకేతికతతో తమ దేశంలోనే జరుగుతుంది గనుక దానికిది లాభసాటి బేరం కూడా. అయితే ఒకటి మాత్రం నిజం. పోఖ్రాన్ లో మనం అణుపరీక్ష జరిపినప్పుడు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించామని ఆరోపిస్తూ తమ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారత శాస్త్రవేత్తలను గంటల్లో దేశం వదిలిపోవాలని గెంటేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ ‘చాదస్తం’ ఎందుకు వదిలి పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది. ఆయుధ వ్యాపారుల ఆకాంక్షల పర్యవసానమే ఇప్పుడు ఆసియాలో పెరుగుతున్న ఆయుధపోటీ అని చెప్పవచ్చు. బైడెన్ హయాంలో ఇవి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. వాణిజ్యవేత్త అయిన కాంప్ బెల్ అధ్యక్ష భవన సమన్వయకర్తగా, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్, నలుగురికీ ఆయుధ వ్యాపారులతో దీర్ఘకాలికంగా ఆర్థిక సంబంధాలున్నాయి.

వాషింగ్టన్, డిసి లోని అమెరికన్ యూనివర్సిటీలో రాజకీయ మానవశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ డేవిడ్ వైన్స్ అధ్యయనం ప్రకారం యుధోన్మాది అమెరికాకు 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలున్నాయి. మొత్తం 159 దేశాలలో 1,73,000 మంది అమెరికా సైన్యం ఉంది. సిరియాలో 4 స్థావరాలు, ఈజిప్టులో 1, కువైట్లో 10, బహ్రైన్ లో 12, ఎమిరేట్స్ లో 3, జోర్డాన్ లో 2, ఓమలో 6, సౌదీ అరేబియాలో 10 స్థావరాలున్నాయి. పశ్చిమాసియాలో అతి పెద్ద ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయం కతార్ లోనూ, అతి పెద్ద నౌకాస్థావరం బహ్రైన్ లోనూ ఉంది. ఇంకా దిగ్బెటి వంటి అనేక చోట్ల మిలిటరీ స్థావరాల్ని కలిగి పశ్చిమాసియాలోని చమురును దోచుకొంటుంది. పసిఫిక్ ప్రాంతంలో 120 స్థావరాల్లో 55,713 మంది అమెరికా సైనికులున్నారు. కనీసం 60 వేల మంది సైనికులు యూరప్ లో ఉన్నారు. హాండూరాస్, క్యూబా, గ్యాంటానామోలో, పోర్టోరికో, పనామా, కొలంబో, వెనుజులా చుట్టూ ఉన్న దీవుల్లో ఒక దేశమని కాదు లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. వీటికి తోడు వేలాది యుద్ధ విమానాలు, 11 యుద్ధ నౌకలు (అతి పెద్దవి), ఒక్కొక్క నౌక కనీసం 100 యుద్ధ విమానాలతో, చుట్టూ జలాంతర్గాములతో పయనిస్తాయి. వందలాది మానవరహిత డ్రోన్లు, సుమారు 8000 అణ్వస్త్రాలు కల్గి ఉంది.

అమెరికా సైనిక స్థావరాలను రెండు వర్గాలుగా విభజిస్తారు. మొదటి వర్గంలో పది ఎకరాల కంటే ఎక్కువ భూమి, పది మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సైనిక పరికరాలు, 200 మంది కంటే ఎక్కువ సైనిక సిబ్బంది ఉంటారు. రెండవ వర్గంలో(లిల్లీ ప్యాడ్స్) 10 ఎకరాల కంటే తక్కువ భూమి, 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన సైనిక పరికరాలు ఉంటాయి. వీటిలో సహకార భద్రతా స్థానాలు, ఫార్వర్డ్ ఆపరేటింగ్ సైట్లు ఉంటాయి. అమెరికా సైనిక స్థావరాల్లో 40 శాతం ఈ వర్గం కిందకే వస్తాయి. ఇంత సైనిక శక్తి గల అమెరికా నిత్యం ఏదో ఒక దేశం మీద యుద్ధం చేస్తూ లక్షలాది మందిని హతమార్చింది. కోట్లాది రూపాయల విలువ గల సంపదను ఆ దేశాల నుండి కొల్లగొట్టింది. అదేసమయంలో కోట్లాది డాలర్ల విలువ గల ఆయుధాలను అమ్ముకుంది. ప్రపంచ ఆయుధాల విక్రయంలో అమెరికా వాటా 37 శాతం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఆసియా సంస్కృతిని పశ్చిమాసియాలో విచ్చిన్నం చేసింది. ఇప్పుడు దక్షిణాసియాలో అదే పనిని అమెరికా చేయాలనుకుంటోంది. తన మార్కెట్ల కోసం మానవ నాగరికతను మట్టుబెట్టి, పైశాచిక ఆనందం కోసం కొత్త కూటములను మిలిటరీ రంగంలో అమెరికా ప్రోత్సహిస్తూ నూతన పేర్లు, నూతన ఆయుధాలతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకొనే అమెరికా అంబులపోది నుండి ఆవిర్భవించిన మిలిటరీ కూటమే ఆకస్, క్వాడ్ తదితరాలు.

Leave a Reply