ఆ తండ్రి పోరాట వారసత్వం
ఆమె ముని వేళ్ళ గుండా
వారి దేహమంతా ప్రవహిస్తూ
ఈ దేశ భవిష్యత్ చిత్రపటాన్ని
దేదీప్యమానంగా చిత్రిస్తోంది
తను కన్నది వాళ్ళిద్దరినే
వారు నిర్మించింది
వేలాది విముక్తి సైన్యాన్ని
బిడ్డల కోసం
నెత్తుటి ధారలా
వర్షించిన తల్లి ప్రేమ
ఒకవైపు
నేల తల్లి విముక్తి
సాధనలో వారున్నారన్న
భరోసా మరోవైపు
తనను నిటారుగా
నిబ్బరంగా నిలబెడుతూ
వచ్చాయి
ఒకరు ఒరిగినా
తనందించిన
జెండా ఎత్తుకున్న
మరో బిడ్డ
చూపులకు కానరాకపోయినా
ఆ రెపరెపల వెచ్చని గాలి
తన నూరేళ్ళ శ్వాసయింది
అమ్మలెప్పుడూ అంతె
ఒక కంట్లో సూరీణ్ణి
మరో కంట వెన్నెలనీ
విరబూయిస్తారు
అమ్మలంతే
తమ పచ్చని కొంగుతో
దేశానికి తల్లులవుతారు
వీరుల గొంతులో
చనుబాలధారలవుతారు
అమ్మలకు మరోమారు
నమస్కరిద్దాం
(వీరమాత మల్లోజుల మధురమ్మకు వినమ్ర జోహార్లతో)
Very good tribute