ఇంతకీ…ఈ ఆపదను తట్టుకోమనే ఓదార్పు మాటలు చెప్పడానికి ఆ తల్లికి అక్కడ ఎవరూ లేరు.
నీ సానుభూతంటావా.. ఆమెకి అవసరమే లేదు.
నీ మాటలంటే ఆమెకి లెక్కే లేదు.
అసలు ఆమె ఎవరనుకుంటున్నావు?
ఆమె అమరుని తల్లి !
ఒకటి,రెండు,మూడు,నాలుగు ,ఐదేసి చుక్కలు.. చుక్కలుగా కపటంతో రాలిపోయే నీ మొసలి కన్నీళ్లనే… ఆమె తన తెగువతో ఆశ్చర్య పరుస్తుంది..నిలవరిస్తుంది!
మూగ ప్రేక్షకుల దొంగ సానుభూతి ఆమెకెందుకు ?

కౄరంగా చంపబడిన తన కొడుకులు మిగిల్చిన ఖాళీని..నీ అల్పమైన సహనుభూతితో పూడ్చలేవు.
కొడుకుల మరణ దుఃఖాన్ని గుక్కిళ్లు గా మింగెయ్యమని.. మౌనంగా ఉండమని ఆమెకి చెప్పే అర్హత నీకు లేదు గాక లేదు !
ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..?
నీ కోసం ఆమె కూడా సంవత్సరాలుగా ఎదురు చూసింది !
ఆమె గొంతు వినడానికి..
తను ఇన్నాళ్లుగా దాచుకున్న మాటలను పంచుకోవడానికి..
త్యాగం చేసిన తన కొడుకుల రక్తానికి నివాళులు అర్పించడానికి.,
కోల్పోయిన తన కూతుళ్ళ గౌరవాన్ని దక్కించుకోవడానికి..
నీ శత్రు వ్యూహాలను చిత్తు చేయడానికి..
నిన్ను పూర్తిగా నిర్మూలించడానికి…
చివరికి నిన్ను లొంగదీసుకోవడానికి !
అవును.,ఆమె ఇన్నేళ్ళుగా ఎదురు చూసింది !
ఆమె ఎవరనుకున్నావు ?
ఆమె అమరుని తల్లి !
ఆమెను మౌనంగా ఉండమని అనకు !

★★★★మొహమ్మద్ యూనుస్ కౌల్~(కశ్మీరీ కవి) స్వేచ్చానువాదం ~గీతాంజలి.★★★★★

Leave a Reply