మే 10వ తేదీన బీజాపూర్ జిల్లా పిడియా అడవుల్లో జరిగినట్లు చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో 12 మంది మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ 12 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉండే అవకాశం ఉందని, ఈ ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్, దంతేవాడ, సుకుమా జిల్లాల ఎస్పిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీరితోపాటు ఐజి సుందర్రాజ్ నిరంతరం సంబంధంలో ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నాడని, ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో 10వ తేదీ
ఉదయానికి ఆరుగురు చనిపోయినట్లు తెలిసిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక టివి చానెల్ ఎంతో ఉద్యోగపూరితంగా ప్రసారం చేసింది. స్టూడియో నుంచి ఎన్‌కౌంటర్ స్థలంలో ఉన్న సచిన్ అనే రిపోర్టర్‌తో సంప్రదిస్తూ రోజంతా అవే విషయాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేసింది. వెయ్యి మంది సురక్షా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అడవి అంతా జల్లెడ పడుతున్నాయి. గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్ కూడా ఇంకా కొనసాగుతుందని కనుక ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటూ ఆ ప్రవాహ సదృశ్యమైన ఆవేశ పూర్వక ప్రసారంలో, రిపోర్టింగ్‌లో ఇటీవల, ఇప్పటి వరకు 40 మంది మావోయిస్టులు మరణించారని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు భీకరమై కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ధృవపడిన వాళ్లు ఆరుగురు అని, మే 10 నాటికి 40 మంది మావోయిస్టులు మరణించారని చెబుతూ ఉంటే ప్రేక్షకులు ఎంత గందరగోళపడే అవకాశం ఉందో చెప్పలేం. ఇటువంటి టి.వి. సెన్సేషన్ల సమాచారం తప్ప మరే సమాచారం లేని సాధారణ ప్రజల స్పందన, నైతికత ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
మరోవైపు ఎన్‌కౌంటర్ పూర్తై, 12 మంది శవాలను కూడా మూట కట్టి తెచ్చి, వాటిపై తెల్లబట్టలు కప్పి స్వయంగా పోలీసులే ఒక వీడియో రిపోర్టర్‌తో ఆ దృశ్యాలన్నీ చిత్రీకరింపచేసి ప్రసారం చేశారు. అతడు పోలీసులే నిర్దిష్టంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో ప్రవేశించి ఒక వీడియో కెమెరాతో మనకు శవాలను లెక్క పెట్టి చూపుతూ, జప్తు చేసుకున్న ఆయుధాలను (అన్ని బర్మార్‌లే) ఇతర సామాగ్రిని చూపుతూ, అక్కడ చుట్టలుగా కట్టిన వైరును, తూటాల వంటి వాటిని చూపుతూ పోలీసులు ఎంత విజయాన్ని సాధించారో మనలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్న స్థితి కూడా స్పష్టంగా కనిపించింది.
ఇంత వ్యత్యాసం ఉన్న ఈ రెండు ప్రసారాల తర్వాత ఆ ప్రాంతానికి మృతుల కుటుంబాలను కూడా తీసుకొని వెళ్లి, అదే సందర్భంలో అరెస్టు చేసిన 25 లేదా 30 మంది ఆదివాసులను విడిపించడానికి వారి కుటుంబాలను కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయిన సోనీ సోరీ వీడియో చూస్తే తప్ప ఇప్పటికి ఆఖరిదిగా భావించబడుతున్న బీజాపూర్ జిల్లా పిడియా ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది మరణించారో, వాళ్లెవరో తెలియదు. వాళ్లందరికందరు పోలీసులు గ్రామాల మీద దాడి చేసి, సమూహాలుగా నిర్బంధించి తీసుకుపోయిన వారిలో జైల్లో నిర్బంధించిన వారు పోగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపిన 12 మంది గ్రామస్తులు.
సోనీ సోరీ మాట్లాడిన వీడియోలో ముఖ్యమైన విషయాలు, సారాంశం అంతా హిందీ, ఇంగ్లిష్, తెలుగులో కూడా టైపు చేసి పెట్టిన సామాజిక మాద్యమాల సమాచారం ఉంది. ఆమె చేసిన హిందీ ప్రసంగం విన్నవారికి, అక్కడ చూపబడిన ఆదివాసీ మహిళల సమూహాన్ని చూసినా వారికి ఏకకాలంలో రెండు భావాలు కలుగుతాయి. ఆమె చుట్టూ ఉన్న మహిళలు ముఖ్యంగా ఆమె బీజాపూర్ కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయిన గ్రామీణ మహిళలంతా 30 ఏళ్లకన్నా వయసు ఎక్కువ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రతి మహిళ చంకలో ఏడాది నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. వారిలో కనీసం ముగ్గురు నలుగురినయినా తాను వాళ్ల చంకల నుంచి తీసుకొని ఆమె ‘ఈ తల్లులను, పిల్లలను చూడండి. వీళ్లంతా మావోయిస్టు దళాల్లో పనిచేసే పురుషుల భార్యలుగా, పిల్లలుగా కనిపిస్తున్నారా? వీళ్లందరిని ఊళ్ల నుంచి, ఇళ్ల నుంచి అడవిలో పనికిపోతే, పని నుంచి పట్టుకుపోయి కాల్చేసిన వాళ్ల, నిర్బంధించబడిన వాళ్ల భార్యలు’ అని కలెక్టర్ ఇచ్చిన సమాధానాలను ఖండిస్తూ తీవ్రంగా మాట్లాడిరది.
ఆమె ప్రసంగపాఠం..
‘‘ఛత్తీస్‌గడ్‌లో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ పేరుతో అమాయక ఆదివాసీ హత్యలు కొనసాగుతున్నాయి. ఇంట్లో ఉన్న సరిగ్గా మాట్లాడలేని, నిలబడని ఓ బాలికను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, కాల్చి చంపి, మహిళా నక్సలైట్‌ను చంపేశాం అన్నారు. 14 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపి చంపేశారు. ఆకులు కోయడానికి వెళ్లిన ఆదివాసులను, ఇంట్లో పనిచేసిన ఆదివాసీలను, ఇంట్లో పనిచేసుకుంటున్న ఆదివాసులను ఈడ్చుకెళ్లి కాల్చి చంపి 12 మంది నక్సలైట్లను హతమార్చామన్నారు. మృతదేహాలను తీసుకెళ్లడానికి, అరెస్ట్ చేసిన తమ కుటుంబ సభ్యులను విడిపించేందుకు బీజాపూర్ కు వచ్చిన ఆదివాసీలు ఉండడానికి ఏర్పాట్లు చేయమని కలెక్టర్‌ను సామాజిక కార్యకర్త సోనిసోరీ అడిగితే.. ‘వీరంతా నక్సలైట్లు, వారికి సహాయం చేయను’ అన్నాడు. ‘‘సోనీసోరీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మీరు కూడా చూడండి’’ అని హిమాంశు కుమార్ తన ఫేస్‌బుక్‌లో రాశారు.
స్వయంగా గ్రామస్తులను తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్లిన సోనీసోరీ ప్రసంగం వినండి. హిందీ వచ్చిన వారితో తెలుగు చేయించుకొని చదవండి. సోనీ సోరీ గురించి, హిమాంశు కుమార్ గురించి ప్రజాస్వామ్య వాదులకు ప్రజాస్వామ్య లౌకిక విలువలు గౌరవించే వారికి లేదా ఆయా మత విశ్వాసాలు ఉండి కూడా మానవతావాదులైన వారికి నేను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. వాళ్లలో సోనీసోరీ ఆదివాసి టీచర్. ఆమెకు కార్పొరేట్లతో, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, కార్పొరేటు కంపెనీలు మావోయిస్టులకు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నాయని చెప్పించాలని పోలీసులు చాలా ఒత్తిడి చేశారు. ఎందుకంటే మావోయిస్టులు దాడిచేసి శిక్షించిన ఆదివాసీ ధనిక రైతు కూతురు ఆమె. ఆమె ఆ ఒత్తిడికి ప్రలోభాలకు లోను కాలేదు. దానితో ఆమెను మావోయిస్టు అని నిర్బంధించి యోనిలో రాళ్లు దూర్చి, తుపాకి బయనెట్లతో హింసించారు. జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు జోక్యంతో కలకత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పరీక్ష చేయించగా ఇది రుజువై ఆమె బెయిల్‌పై విడుదలైంది.
అప్పటినుంచి ఆ ఆదివాసీల నుంచే వచ్చిన ఒక ఆర్గానిక్ ఇంటలెక్చువల్‌గా ఆమె తన గ్రామంలోనే ఉంటోంది. ముఖ్యంగా బీజాపూర్, దంతేవాడ, సుకుమా జిల్లాల్లో అరెస్టులు, పోలీసు దాడులు, ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్న ప్రతి చోటకు వెళ్లి ఆదివాసీ మహిళలు, ప్రజల నుంచి నిజాలు తెలుసుకొని స్వయంగా వాళ్లతో చెప్పిస్తూ తాను బయటి ప్రపంచానికి తెలియజేస్తుంది. జిల్లా అధికారులకు, కోర్టులకు చెబుతున్నది.
బేలా సోనారీగా పేరు మార్చుకొని దశాబ్దాలుగా బస్తర్‌లో ఉంటున్న ఢల్లీి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ భేలబాటియా 13 మంది ఎన్‌కౌంటర్ అయిన సందర్భంగా అందులో ముగ్గురే మావోయిస్టులున్నారని, ఆమె స్వయంగా ఆ కుటుంబాలను కలిసి, ఆ గ్రామాలు తిరిగి మీడియాకు చెప్పిన విషయాలను కూడా విని ఉంటారు.
మరి మీరు మావోయిస్టులు పోలీసులను చంపినప్పుడు ఎందుకు మాట్లాడరు అన్నప్పుడు.. అటువంటి సందర్భంలో పోలీసుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటుంది కదా. ఇటువంటి స్పందన, చర్య మావోయిస్టుల విషయంలో, ఆదివాసుల విషయంలో కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది కదా. అదే నేను ప్రశ్నిస్తున్నాను అన్నది. బేలాభాటియా మావోయిస్టులతో ఏకీభవం ఉన్న మేధావి కాదు. సోనీ సోరీ గతంలో ఆప్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసింది. హిమాంవు కుమార్ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గాంధేయవాది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల పట్ల, ఆదివాసుల కోసం ఉన్న 5, 6వ షెడ్యూల్ మొదలు పెసా వరకు వచ్చిన చట్టాల పట్ల గౌరవం ఉంది. అవి అమలు కావాలని ఈ ముగ్గురు కోరుతున్నారు. అందుకోసం బేలాబాటియా పోలీసులు, మావోయిస్టు పార్టీ మధ్యన ఉండి పోరాడుతూ మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఖండిస్తుంది.
హిమాంశు కుమార్‌ను ఆదివాసుల మధ్య బస్తర్‌లో ఉండడానికి వీలు లేకుండా ఎన్నో రకాల నిర్బంధాలతో చివరకు ఆయన ఆశ్రమాన్ని తగలబెట్టి బయటికి తరిమేశారు. (చివరకు కాంగ్రెస్ భగేల్ ప్రభుత్వం వేసిన కమిషన్లు, దేశవ్యాప్తంగా ప్రచారమైన ఎన్‌కౌంటర్‌ల గురించి, అవి పోలీసుల ఏకపక్ష కాల్పులేనని తీర్పు చెబితే, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోతే అటువంటి కుటుంబాల నుంచి మృతుల రక్తసంబంధీకులతో పిటీిషన్ వేయించి సుప్రీంకోర్టుకు తీసుకుపోతే సుప్రీంకోర్టు హిమాంశు కుమార్‌కు రూ.5 లక్షల జరిమానా వేసింది. బ్రిటిష్ ప్రభుత్వంలో అప్పటి కోర్టులు వేసిన జరిమానా చెల్లించనని, జైలుకు పోతానని గాంధీ నిరాకరించినట్లే తాను కూడా జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటూ దేశమంతా తిరుగుతున్నాడు.
వాళ్లు ముగ్గురు (సోనీసోరీ, బేలాబాటియా, హిమాంశు కుమార్) మావోయిస్టులు కాదు. కానీ చాలా స్పష్టంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, కార్పొరేటీకరణను, సైనికీకరణను వ్యతిరేకిస్తూ ప్రతిఘటిస్తూ ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్‌ల కోసం చేస్తున్న పోరాటాలను పూర్తిగా సమర్థిస్తున్న వాళ్లు. మావోయిస్టులు కానక్కర్లేకుండానే, మావోయిస్టు పార్టీని సమర్థించనక్కర్లేకుండానే ఆదివాసుల పోరాటాలను సమర్థించే వాళ్లు. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పోరాడుతున్న ఆదివాసులపై జరుగుతున్న రాజ్య హింసను, ఎన్‌కౌంటర్ హత్యలను ఖండిరచ వచ్చుననడానికి బి.డి. శర్మ, రాహుల్ బర్మన్ వంటి ఎందరో ఆదివాసీ ప్రేమికుల ఉదాహరణలు ఉన్నాయి.
వీళ్లందరూ రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్లే. రాజ్యాంగబద్ధంగా నడుచుకొని ఆదివాసుల కోసం పనిచేసిన వాళ్లే. పార్లమెంటు (లోక్‌సభలో) ఆదివాసీ ఎంపి బూరియ ప్రవేశపెట్టిన పెసా బిల్లును రచించిన వాడు బీడీ శర్మ అని లోకానికి అంతా తెలుసు. స్వయంగా ఆయనే చెప్పాడు కూడా.
ఇప్పుడు ఏడు జిల్లాలైన బస్తర్ ఒక జిల్లాగా ఉన్నప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్‌గా చేసి 1960 లలో బైలదిల్లాలో పోస్కో కంపెనీ వచ్చినప్పుడు బైలదిల్లా అక్కచెల్లెళ్ల కన్నీటి గాథలు అని రాసిన వాడు ఆయన. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కూడా ఏర్పడక పూర్వం మధ్యప్రదేశ్‌లో ఎమర్జెన్సీ తరువాత వచ్చిన బిజెపి ప్రభుత్వం హయాంలో బీడీ శర్మ ఆదివాసుల ప్రాంతానికి పోతే సంఘ పరివార్ వాళ్లు చెప్పుల దండ వేసి ఊరేగించారు. అయినా ఆయన జీవితకాలమంతా ఆదివాసుల కోసం పనిచేస్తూ, ఆయన అనుభవం నుంచి, అధ్యయనం నుంచి రెండు విషయాలు చెప్పాడు. ఆదివాసులకు సంబంధించినంత వరకు రాజ్యాంగం ఒక సంకెల అని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మొదలు చట్టాల వరకు అన్ని వాగ్దానాలు అవి రిపబ్లిక్ లో భంగమయ్యేవే కానీ అమలయ్యేవి కాదని బ్రోకెన్ రిపబ్లిక్ అని చాలా సోపపత్తికమైన ప్రామాణికమైన గ్రంథాన్ని రాశాడు.
2004లో మన్మోహన్ సింగ్ చిదంబరం ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన అంతర్గత శత్రువును ఎదుర్కోవడానికి గ్రీన్‌హంట్ ఆపరేషన్ చేపడితే దాని మూలాలు 1920లో అమెరికా అధ్యక్షుడిగా రూజ్వెల్ట్ నాలుగుసార్లు కొనసాగి అమలు చేసిన రెడ్‌హంట్‌లో ఉన్నాయని చెప్పాడు. అమెరికాలో రెడ్ ఇండియన్‌లు అపాచీలు పసుపు రంగు శ్వేత శ్వేతేతర రంగులు ఉన్న మూలవాసీ తెగలు ఉన్నాయి. ఇప్పుడు ఉండేవి అంటే బాగుంటుందేమో. ప్రపంచంలోని అడవులన్నీ పక్షుల గురించి కెన్యా వంటి మాస్‌మారా అడవుల్లోకి వన్య మృగాలను చూడడానికి మూడుసార్లు తిరిగివచ్చిన జీవశాస్త్ర అధ్యాపకులు సీతారత్నం, శ్రీనివాసరావు అమెరికాలో వీళ్లంతా ఇప్పుడు పర్యాటకులకు ప్రదర్శన వస్తువులని, అయితే వాళ్లలో అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యాలున్నాయని రాసారు.
అమెరికాలో ఆదివాసీలు, ఆదివాసీ పోరాట యోధులు చేసిన పోరాటాలు ఏ దేశం పోరాటాలతో కూడా తీసిపోయేవి కాదు. వాళ్ల పోరాట యోధుల గురించి, పోరాటాల గురించి అమెరికా విశ్వవిద్యాలయాలలో, మ్యూజియంలో ఇప్పటికీ ఎంతో సమాచారం నిక్షిప్తమై ఉన్నది. 2003 సెప్టెంబర్ 11న అమెరికాలో ప్రపంచ వాణిజ్య సంస్థపై దాడి జరిగినప్పుడు ఇమ్మాన్యుల్ ఆర్టేజ్ రాసిన ‘నేనీ కవిత ప్రారంభించడానికికన్నా ముందు’ అనే కవిత (వరవరరావు కవిత్వం 1957`2017 రెండవ సంపుటం` పే.769) చదవండి చాలు. అయితే అమెరికా యూరప్ ఆస్ట్రేలియాలతో పాటు మనదేశంలో కూడా నక్సల్బరీ కన్నా ముందు జరిగిన ఆదివాసీ పోరాటాలు అన్ని సామ్రాజ్యవాద, రాజ్య, కేంద్ర వ్యతిరేక పోరాటాలే. అద్భుతమైన ఆత్మగౌరవ పోరాటాలే. ఓడిపోయినవే కానీ రాజీపడినవో, లొంగిపోయినవో కాదు. కానీ నక్సల్బరీ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ పోరాట చరిత్ర చూసిన ఒక ప్రాపంచిక దృక్పథంతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాతో జనతన రాజ్య నిర్మాణం చేయగలిగిన ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను అమలు చేస్తూ చూపుతున్నది. అందుకే అది ఢల్లీి ప్రభుత్వానికి ‘అత్యంత ప్రమాదకరమైన అంతర్గత శత్రువు’. అందుకే దానిని కగార్ రూపంలో అంతం చేయడానికి ఆఖరి పోరాటం అనే భ్రమతో 2024 జూన్ 4 లోగా ఆ పగటి కల తీర్చుకోవడానికి మే 12 బీజాపూర్ నాటికే 103 మంది ఆదివాసులను హత్య చేశారు. వారిని నేను ఆదివాసులనే అంటాను. ఎందుకంటే ఆరు నెలల పసిపాప నుంచి 66 ఏళ్ల చీపురు నరసయ్య, జోగాలు దాకా ఆ మావోయిస్టుల జీవితాలు, పోరాటాలన్నీ ఆదివాసుల పోరాటమే. కార్మిక వర్గం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఉన్న అన్ని వర్గాలను విముక్తం చేస్తున్నట్లుగా మన అందరికీ మన ప్రకృతి సంపదనంతా, మానవశ్రమనంతా విముక్తం చేసే పోరాటం ఇవాళ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో బస్తర్‌లో ఆదివాసులు చేస్తున్న పోరాటం అందుకే ఢల్లీిలో యాన్‌మిర్డాల్, అరుంధతీరాయ్, మెదలయిన వారితో జి.ఎన్. సాయిబాబా కన్వీనర్‌గా ఏర్పడిన ‘మూవ్‌మెంట్ అగెయినిస్టు వార్ ఆన్ పీపుల్ గ్రీన్‌హంట్ వ్యతిరేక సంఫీుభావ పోరాటం గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు ఫాసిస్టు వ్యతిరేక శక్తులనన్నిటినీ విశాల ఐక్య సంఘటనలో సంఘటిత పరిచి పోరాడాలి.
మూడు రోజుల్లో ముగిసిన గుజరాత్‌లో ముస్లింల మరణకాండకు స్పందించినంతగా వరుసగా రోజులు నెలల తరబడి సాగిన ముజఫర్ నగర్ మారణకాండకు, బదాయూన్‌లో ముస్లిం యువతులపై అత్యాచారాలు, హత్యాచారాలకు స్పందించ లేదు. ఇక కశ్మీర్ విషయంలోనైతే ‘రోజూ చచ్చే వాళ్ల కోసం ఎవరు ఏడుస్తారు’ అన్నంతగా బండ బారిన ప్రేక్షకులము శ్రోతలము లేదా ఆలోచించడానికి కాదు తెలుసుకోవడానికి నిరాకరించే ‘చల్నేదో దునియా’ రొటీన్ జీవన వ్యాపారంలోకి వెళ్లిపోయాం.
మణిపూర్ పట్ల ఇవ్వాటకీ ప్రధాని మోడీ వహించిన మౌనం కానీ, స్థాన చలనమే కాదు. ఏ మానవీయ చలనంలేని ముఖ్యమంత్రి ప్రేలాపనలు కానీ ముగ్గురు అత్యాచారానికి గురయి ఊరేగింపబడిన మహిళల సందర్భంలో తప్ప అంత సజావుగానే తీసుకున్నాం.
ఈ అన్నింటి పరాకాష్ఠ ఈ ఐదు నెలలుగా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లు. ఇది కశ్మీర్‌లో వలే, మణిపూర్‌లో వలే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి మాత్రమే పరిమితమైంది కాదు. బ్రాహ్మణీయ ఫాసిజానికి ఎక్కడయినా సామ్రాజ్యవాద కార్పొరేట్ దళారీ ప్రయోజనమే ప్రాథామ్యం వహించేదైనా, తూర్పు మధ్య భారతాలలో ముఖ్యంగా బస్తర్‌లో కశ్మీర్‌లో ఉన్నట్లు ముస్లిం వ్యతిరేకత, మణిపూర్‌లో
ఉన్నట్లు క్రైస్తవ వ్యతిరేకత వంటి బలమైన కారణం కాదు. ఆదివాసులను చర్చిల ప్రభావంలోకి పోకుండా అడ్డుకునే సంఘటనలు జరుగుతున్నా ఆదివాసులను హిందువులుగానే భావించే సంఫీుయులకు అడవిలో ఉన్న స్వార్థ ప్రయోజనం ప్రకృతి సంపదను దోచుకోవడమే. మనం చంద్రబాబు కాలంలోనూ, మన్మోహన్ సింగ్ కాలంలోనూ ఈ కార్పొరేట్ దోపిడీ గురించి ప్రపంచ బ్యాంకు పెట్టే కాల పరిమితి గురించి మాట్లాడుకునే వాళ్లం. గ్రీన్‌హంట్ ఆపరేషన్ అనే ప్రజల మీద యుద్ధ కాలంలో ప్రహార్లు, సమాధాన్‌లు అటువంటి కాలపరిమితులే. 2023 ఏప్రిల్ ఛత్తీస్‌గడ్‌లో అమిత్‌షా ప్రకటించిన 2024 ఎన్నికలు మావోయిస్టు రహిత భారత్‌లో జరుగుతాయన్నది అటువంటి కార్పొరేట్ ఆదేశాలకు బిజెపి ప్రభుత్వం హామీ పడిన కగార్. అంతిమ యుద్ధం. అందుకే ఇప్పుడు గ్రీన్‌హంట్ హరిత విధ్వంసంతో పాటు రెడ్‌హంట్ ఆదివాసుల నెత్తుర్లు పారిస్తున్నారు. ఇంకా మూడు సంవత్సరాలు పడుతుందన్న సమీక్ష ఎన్నికల మూడు దశలు గడిచేవరకు మూడు నాళ్ల ముచ్చటయిపోయింది. దీపం (ఒకప్పటి బిజెపి ఎన్నికల గుర్తు కూడా) ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం బ్రాహ్మణీయ ఫాసిస్ట్ దళారుల విషయంలో అడవిని దోచుకోవడమే. అందుకే ఈ తొందర.
మావోయిస్టు నాయకత్వం నష్టం దృష్ట్యా చూసినప్పుడు ఇది రామన్న, (శ్రీనివాస్, దక్షిణ బస్తర్ కార్యదర్శి) హరిభూషణ్, ఆర్‌కె, ఆనంద్ అనారోగ్యంతో అమరులైనప్పటికన్నా ఎక్కువ నష్టం కాదు. ఎన్‌కౌంటర్‌లో ఎక్కువ నాయకత్వాన్ని కోల్పోయిన దృష్ట్యా చూసినా ఏఓబి లోని రామగూడా ఎన్‌కౌంటర్‌లో జరిగిన నష్టాన్ని మించింది కాదు. ఆదివాసుల నుంచి ఎదిగి వస్తున్న నాయకత్వం దృష్ట్యా చూసినా 2018 గడ్చిరోలి ఎన్‌కౌంటర్ వంటి భారీ నష్టం కాదు. అతి స్వల్ప కాలంలో అతి ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులతో పాటు అత్యధిక సంఖ్యలో మావోయిస్టులుగా ఆదివాసులను కోల్పోవడం ప్రజల మీద, పూర్తిగా ఆదివాసీ ప్రజల మీద ఆధారపడి నిర్మిస్తున్న జనతన రాజ్యానికి అత్యంత బాధాకరం. కేంద్ర నాయకత్వమే లక్ష్యంగా తమకు అప్పటిదాకా అదృశ్యం (అబూజ్) అయిన మాడ్‌లోకి చొచ్చుకపోయిన వేలకొలది అర్ధ సైనిక బలగాలు ఆదివాసులను అంటే మనుషులను దారుణంగా చంపారు. కంపెనీల రూపంలో, క్యాంపుల రూపంలో, సడక్ రూపంలో ద్రవ్య పెట్టుబడి అక్కడికి చొచ్చుకుపోయినా అక్కడ ఆదివాసీ మానవత్వం తన సమిష్టి జీవన సంస్కృతిని కాపాడుకుంటున్నది. మన కొరకు ప్రకృతి సంపదను, మానవ సారాన్ని కాపాడుతున్న మనుషుల కోసం స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం.
12 – 5 – 2024