బీజేపీకి ఒక పద్ధతి ఉంది. అది ముందు జనంలోకి ఒక రాయి విసురుతుంది. ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూస్తుంది. పెద్దగా ఇబ్బంది లేకుండా వర్కవుట్ అవుతుందనుకుంటే విరుచుకపడుతుంది. ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి ఇంకో రూపంలో దాడి చేస్తుంది. దీనికి కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది. ఇదీ సంఘ్ ఫాసిస్టు వ్యూహం.
హిందుత్వ ఫాసిజం సమాజంతో భావజాల క్రీడ ఇది. ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం, వ్యక్తీకరణ ప్రధానంగా భావజాల కేంద్రంగానే ఉంటుంది.
ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల, కార్యకర్తల ఇండ్ల మీద ఎన్‌ఐఏ దాడులు, 28న ఆ సంస్థ నిషేధం వెనుక కూడా ఇలాంటి భావజాల వ్యూహం ఉంది. అది ఎంత పకడ్బందీగా అమలు చేసిందంటే.. బహుశా అంతంత మాత్రం ప్రగతిశీల వాదులు కూడా ముస్లింలు ఏదో ఒకటి చేయకుండా ఎందుకు ఉంటార్లే? అనుకున్నారా? అనేంతగా మౌనం పాటించారు. అన్నిటిలోని న్యాయా న్యాయాలు బేరీజు వేసే మేధావులు సహితం బీజేపీ వ్యూహాన్ని పట్టించుకోలేదంటే ఫాసిజ ఎంత విజయం సాధించినట్లు? అది ఒట్టి మౌనమే కాదు. అప్రమత్తత ఉంది. వేచి చూసి మాట్లాడదామనే వైఖరి ఉంది. ఇంత కంటే బీజేపీ కోరుకునేది ఏముంటుంది?
18వ తేదీ పౌర సమాజ ప్రతిస్పందన గమనించాక 19వ తేదీ కూడా ఎన్ ఐ ఏ, ఈడీ దాడులు ముస్లింల మీద జరిగాయి. చాలా మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకల్లా ఆ సంస్థ మీద దేశద్రోహ అభియోగాలు మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున మీడియా వాటిని ప్రచారం చేశాయి. దాన్ని వెన్నంటే నిషేధించబోతున్నట్లు వార్తలనూ వదిలేశారు. 28వ తేదీ ఎనిమిది సంస్థలతోపాటు పిఎఫ్‌ఐని నిషేధించారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక విలువల కోసం ఇటీవల దేశంలో ఆరాటం పెరిగింది. ఇదొక సానుకూల అంశం. అది మన పౌర సమాజ చైతన్యానికి నిదర్శనం. ఈ వాతావరణంలో నిశ్శబ్దంగా పి ఎఫ్ ఐ నాయకుల మీద దాడులు, సంస్థ నిషేధం జరిగిపోయాయి.
ఒకసారి ఈ క్రమం మొత్తాన్నీ తిరిగి చూడండి. 18వ తేదీ తెల్లవారుజాము నుంచి మొదలైన దాడులను కేంద్రం ట్రయల్‌గా ప్రారంభించింది. సమాజం కనీసంగా స్పందించలేదు. ముస్లింల విషయంలో మెజారిటీ సమాజాన్ని మౌనంగా ఉంచగలిగితే తన ప్రయోజనాలు సులభంగా తీర్చుకోవచ్చనుకోవడమే బీజేపీ వ్యూహం. ఫాసిస్టు వ్యతిరేక చైతన్యం ఎంతో కొంత కనిపిస్తున్న తరుణంలో కూడా బీజేపీ తన వ్యూహాన్ని సజావుగా అమలు చేయగదని ఈ ఘటనతో రుజువైంది. ముస్లింల మీద ఆర్ ఎస్ ఎస్ మూకలు దాడి చేసి ఉంటే తప్పక గొప్ప ప్రతిస్పందన వచ్చేది. అనుమానమే లేదు. దీనికి కర్నాటకలో హిజాబ్ వివాదమే ఉదాహరణ. కానీ ఇప్పడు *రాజ్యాంగబద్ధ* అధికారం ఉన్న ఎన్ ఐ ఏ దాడి చేసింది. పి ఎఫ్ ఐ మీద దేశ ద్రోహ ఆరోపణ చేసింది. ఇస్లాం భావజాలం ఉన్న సంస్థ కాబట్టి దాని మీద ఇప్పటికే టెర్రరిస్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ పని సులువైపోయింది.
ఇది ఏం తెలియజేస్తోందంటే ఎవరి మీదైనా టెర్రరిస్టు ఆరోపణ చేస్తే నిజా నిజాలేవైనా అందరి నోరు మూయించవచ్చని బీజేపీకి మరోసారి స్పష్టమైంది. ఎవరి మీదైనా దేశ ద్రోహ ఆరోపణ చేస్తే ఇక అంతా నల్లేరు మీద బండి నడకే. సగటు హిందూ మనస్తత్వం గురించిన చర్చ కాదిది. సగటు ప్రజాస్వామిక మనస్తత్వానికి, చైతన్యానికి సంబంధించిన సమస్య ఇది. బీజేపీ గెలుచుకుంటున్నది సగటు హిందూ మనస్తత్వాన్నే కావచ్చే గాని, అది లిట్మస్ టెస్ట్ చేసింది మాత్రం ప్రజాస్వామిక శిబిరానికి.
అందుకే ఎన్‌ఐఏ అధికారులు పిఎఫ్‌ఐ నాయకుల అరెస్టులకు కారణాలు చెప్పలేదు. ఆ సంస్థ స్వభావం, దాని పాత్ర మీదే ఆరోపణలు చేశారు. దేశద్రోహ, టెర్రరిస్టు సంస్థ అని దుమ్మెత్తిపోశారు. సిమి అనే సంస్థ నిషేధానికి గురయ్యాక అందులోని వ్యక్తులు పిఎఫ్‌ఐని ఏర్పాటు చేశారని అన్నారు. కాబట్టి ఇది కూడా నిషేధార్హమైన టెర్రరిస్టు సంస్థనే అన్నారు. సిరియాలోని టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని, అక్కడి నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. ఈ సంస్థ హత్యలకు పాల్పడిందని జాబితా విప్పారు. ఆ తర్వాత నిషేధం పెట్టారు.
నిషేధం మీద కాంగ్రెసు నుంచి ఎంఐఎం దాకా మొక్కుబడిగా ఖండించాయి. ఈపాటి ఖండనలను బీజేపీ ఊహించే ఉంటుంది. బహుశా తాను ఊహించినదానికన్నా ఎక్కువ మౌనాన్ని చూసి ప్రభుత్వం కూడా విస్తుపోయి ఉంటుంది.
ఒక వేళ పిఎఫ్‌ఐలోని వ్యక్తులెవరైనా నేరాలకు పాల్పడి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇది పిఎఫ్‌ఐ విషయంలోనే కాదు. ఏ సంస్థలో పని చేస్తున్న వ్యక్తులు నేరానికి పాల్పడ్డా ఇదే చేయాలి. పౌరులందరి విషయంలో చట్టం ఎలా స్పందిస్తుందో సంస్థల్లో ఉన్న వ్యక్తులపట్ల కూడా అట్లాగే వ్యవహరించాలి. ఆ పద్ధతులే పాటించాలి. దేనికంటే నేరాలు వ్యక్తులు మాత్రమే చేయగలరు. వ్యక్తులతో చట్టపరంగా, సంస్థలతో రాజకీయంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో కనీస సూత్రం. నచ్చని రాజకీయాలు ఉన్నాయనో, రాజకీయాల సాకుతోనో ఒక సంస్థను నిషేధించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదు. ఒక వేళ యుఏపీఏ అనే చట్టాన్ని అంబుల పొదిలో చేర్చుకున్నంత మాత్రాన సంస్థల నిషేధాన్ని రాజ్యాంగం అంగీకరించదు. అప్పుడు ఆ చట్టం, దాని ఆధారంగా సంస్థల నిషేధం రెండూ రాజ్యాంగ వ్యతిరేకమే అని చెప్పాల్సి వస్తుంది.
పిఎఫ్‌ఐని, మరి కొన్ని సంస్థలను నిషేధిస్తూ విడుదల చేసిన రెండు పేజీల పత్రంలో కేంద్రం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆరోపణలు చేసింది. ఆరోపణలే అయితే ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న పిఎఫ్‌ఐ మీద వస్తున్నవాటికంటే నూరేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల నేరాల మీద అనేక రెట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. నిజానికి పిఎఫ్‌ఐ నిషేధం తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. పిఎఫ్‌ఐ సందర్భంలో ఈ పోటీ చర్చ తేవడం వల్ల అర్హత లేని గౌరవాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇచ్చినట్లవుతుంది. దేనికంటే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ మనకు ముస్లింలు శతృవులు అని ప్రకటించాడు. ఆ సంస్థ ఆయన అడుగు జాడల్లో ముస్లిం వ్యతిరేకత, హిందూ మతోన్మాదం అనే రెండు పాయలుగా ఆధునిక భారత దేశ చరిత్రలో విస్తరించింది. కానీ ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న పిఎఫ్‌ఐ అట్లా హిందూ వ్యతిరేకతను, ముస్లిం మతతత్వాన్ని ప్రకటించుకోలేదని, ముస్లింల సంక్షేమం కేంద్రంగా పని చేస్తున్నదనే అభిప్రాయం బలంగా ఉన్నది. ఇస్లాం పునాదిగా ఉండటానికి, ముస్లిం మతతత్వాన్ని పెంచడానికి తేడా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ను చూస్తే ఎవరికైనా ఇది అర్థమయ్యేదే.
అయినా సరే పిఎఫ్‌ఐ చరిత్రలో నేరపూరిత ఘటనలు ఉంటే వాటిని విమర్శించాల్సిందే. అలాంటి నేరాలను పురస్కరించుకొనే ఈ నిషేధం తీసుకొచ్చారా? అప్పుడు ఆ *నేరాల*ను దేశ ద్రోహమని, టెర్రరిజమని అని నిర్ధారించవచ్చునా? నిజానికి ఈ నిషేధం పి ఎఫ్ ఐ మీదేనా? అనే సందేహం ప్రజాస్వామికవాదులకైనా రావాలి. ఆంత కంటే ఇది ఎక్కువగా ఇది ముస్లిం సమాజం మీదే అని అర్థం కావడం లేదా? ఈ పేరుతో ముస్లింలను మరింత ఒంటరి వాళ్లను చేసే పథకం ఉన్నది. ముస్లింలు ఆర్గనైజ్ అయ్యేకొద్దీ ఒంటరి వాళ్లను చేస్తామనే హెచ్చరిక ఇందులో వినిపించడం లేదా? ఒంటరి కాకుండా వాళ్లేం చేస్తారనేది పూర్తిగా వేరే చర్చ. అది ఇంతక ముందైనా చేసి ఉండవచ్చు. రేపైనా చేయవచ్చు. కానీ ఎల్లవేళలా ముస్లింలు తాము టెర్రరిస్టులం కాదని చెప్పుకోవలసి స్థితి ఉన్నది కదా. దీని పట్ల ఎవరికీ బాధ్యత లేదా? అసలు అలా చెప్పుకోడానికైనా వాళ్లకు అవకాశం ఉందా? ఆ స్పేస్ శాశ్వతంగా లేకుండా చేయడానికే పి ఎఫ్ ఐ ని నిషేధించారని ఎందుకు అనుకోకూడదు. పిఎఫ్ ఐతోనే ముస్లింలందరూ లేకపోవచ్చు. కానీ ఈ దేశంలో ఎక్కడ ఒక బాంబు పేలుడు ఘటన జరిగినా ముస్లింలు ఒంటరివాళ్లయిపోవడం, సమాజానికి-రాజ్యానికి టార్గెట్ కావడం మనకు తెలిసిందే కదా. ఇప్పడు ఏకంగా తొమ్మిది సంస్థలపై నిషేధం ముస్లిం సమాజాన్ని ఏం చేయబోతోంది? అందుకే ఇది ఆ సంఘాల సమస్యే అనుకుందామా? ఈ వైపు నుంచి చూస్తే పి ఎఫ్ ఐ నిషేధ సందర్భంలో ప్రజాస్వామిక వాదుల తటపటాయింపు ముస్లింలను *మెజారిటీ* సమాజానికి పూర్తి దూరం చేస్తుందని ఎందుకు అనుమానించకూడదు? ముస్లింలపట్ల అనుమానం, ఉదాసీనం ఎంత పెరిగితే అంతగా ఈ సమాజం ఫాసిస్టుల గుప్పిట్లోకి పోయినట్లు కదా? అది మెజారిటీ ప్రజలకు కూడా ఎంత ప్రమాదం!
పిఎఫ్ ఐ *నేర* పూరిత చరిత్రను ఎలాగూ ఎన్ ఐ ఏ చూసుకుంటుంది. కానీ ఆ సంస్థ సిఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమంలో దేశవ్యాప్తంగా అత్యంత శాంతియుతంగా పోరాడిందని అభిప్రాయపడేవాళ్లు ఉన్నారు. ఈ దేశ లౌకిక జీవనాన్ని కాపాడే లక్ష్యంతో పెద్ద ఎత్తున పని చేసిందనడానికి ఆధారాలు చూపేవాళ్లున్నారు. అంత భారీ ఉద్యమంలో కూడా ఆ సంస్థ ముస్లిం మతతత్వాన్ని ప్రదర్శించలేదని, ఈ దేశ పౌరులుగా ముస్లింల అస్తిత్వానికి సీఏఏ భంగకరమని మాత్రమే మాట్లాడిందని వివరించేందుకు రుజువులు ఉన్నాయి. అంతక ముందు నుంచే ఆ సంస్థ భారత రాజ్యాంగంలోని లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడాలని దేశ వ్యాప్తంగా ఎన్నో విడతల ప్రచారం చేసిందని చెప్పే వాళ్లు ఉన్నారు.
ఈ వాస్తవాలను కూడా కలిపి చూస్తే పి ఎఫ్ ఐని కేంద్రం ఎందుకు నిషేధించిందో కాస్త అర్థం కావచ్చు. ముస్లిం సంస్థ కాబట్టి పైన చెప్పిందంతా కేవలం ముసుగు వ్యవహారమే అని అనుమానిస్తే.. అప్పుడు కూడా ఈ నిషేధం ఘనత వహించిన రాజ్యాంగం ప్రకారం సబనేనా? అని ఆలోచించాల్సి ఉంటుందేమో.