అర్బన్ నక్సల్ అంటే ఎవరు? అటువంటి వారున్నారా ? భారత ప్రభుత్వపు పార్లమెంట్ రికార్డ్ ల ప్రకారం అయితే లేరు. ఈ సంగ‌తి   కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి మాత్రం ప్రతి సభలో, సమావేశంలో అర్బన్ నక్సల్స్ గుర్తుకువస్తారు. ఈ నెల 23 న గుజరాత్ లో పర్యావరణం పై రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  దేశప్రగతిని అర్బన్ నక్సలైట్లు  అడ్డుకుంటున్నారని  మోదీ అన్నాడు. దేశంలో 6000కు పైగా అప్లికేషన్ లు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయని తెగ బాధ‌పడ్డాడు.  వీటివల్ల పెట్టుబడి పెట్టిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా అన్నాడు.  ఆయన అసలు బాధ అది. పెట్టుబడి దారులు నష్టపోతున్నారనేదే ఆయన అసలు సమస్య.

ఇప్పటికే కార్పొరేట్ అనుకూల చట్టాలు చేసి ప్రజల సంపదను అమ్మడం మోడీ ప్రభుత్వం ప్రారంబించింది. ఇందు కోసం ఇప్పటికే పర్యావరణ చట్టం 2002 లో కూడా అనేక మార్పులు చేశారు.  ఇవి జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి  కాకుండా వనరులను వాణిజ్య కోసం సులువుగా కట్టబెట్టే విధంగా ఉందని పర్యావరణవాదులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వనరుల నిక్షిప్తమై ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న జాతుల సంరక్షణను ఈ చట్టం దెబ్బ‌తీస్తుంది.  అంతే కాక ఇప్పటిదాకా పర్యావరణ పర్యవేక్షణ కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో మూడు అంచెలుగా ఉంది. ఈ నిర్మాణాలను ఇప్పుడు మోడీ ప్రభుత్వం పలుచున చేసి వాటి స్థానాన్ని జాతీయ బయో డైవర్సిటీ అథారిటీ ప్రాతినిధ్యం వహించే జీవవైవిధ్య నిర్వహణ కమిటీకి  కట్టబెట్టింది. ఇది వాటి పాత్రను తగ్గిస్తుంది అనటంలో సందేహం లేదు. ఇది  ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి వంటి పరిశ్రమలలో ఉన్న కార్పొరేట్ వర్గాల అనుకూల నిర్ణయాల్లో ఒక భాగం అని పర్యావరణ వాదులు వాదిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకునే క్రమంలో ఇది ఒక భాగం. ఇప్పటికే అనేక సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది.   

ఇదే కార్యక్రమంలో మోదీ  మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ ఇంకా క్రియాశీలంగా ఉన్నారని అన్నాడు.  వాళ్ళు నాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని కూడా ఆందోళన పడ్డాడు.  వాళ్ళకు వివిధ సంస్థలు మద్దతిస్తున్నాయని అని కూడా అన్నాడు. బీజపి ప్రభుత్వం ఒక వైపు తాము అధికారంలో లేని చోట రాష్ట్రాలలో అక్కడ  ప్రభుత్వాలను కూలదోసి అధికారంలోకి వచ్చింది. లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రాంతీయ పార్టీలను తన గుప్పెట్లో ఉంచుకుంది.  అదే న్యాయస్థానాలను  తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వీటన్నిటిని మేనేజ్ చేసి తనకు అవసరమయిన అనుకూల  నిర్ణయాలు వచ్చేటట్టు చేయగలిగింది. ఈ సంగ‌తి లోకం మొత్తానికి తెలుసు.   కానీ ప్రజలు  రోడ్డు మీదికి వ‌చ్చి  తమ సమస్యల పరిష్కరం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. వీరికి  దేశంలో ఇంకా మిగిలి ఉన్న ప్రజస్వామిక వాదులు, మేధావులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం అన్ని  వ్యవస్థలను మేనేజ్ చేయగలగింది కానీ పోరాడే ప్రజలను చేయలేకపోయింది. అందుకే వారిని అర్బన్ నక్సల్స్ అని, దేశ అబివృద్ధ‌కి  ఆటంకం సృష్టించే వార‌నీ  ప్రచారం చేస్తున్న‌ది.     

మోడీ అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడటానికి వారం ముందు దేశ వ్యాప్తంగా ముస్లిం లపై దాడులు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 16 రాష్ట్రాలలో దాడులు చేసింది. కేంద్రం PFI సంస్థను నిషేధించింది.  దీనికి వారు చెప్పిన కారణం..  ఆ సంస్థలోని కొంతమంది దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంద‌ని  చెప్పారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లోని ప్రముఖుల    హత్యకు కుట్ర చేశారన్న అభియోగం మోపారు. ఇప్పటికే ఇదే తరహా కేసులో భీమా కోరేగాం  అనే  కుట్ర కేసు ఒక దానిని సృష్టించి 16 మందిని జైలుపాలు చేశారు. తాజాగా తెలంగాణలోను బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నాయకుల హత్యకు  కుట్ర ప‌న్నిన‌ట్లు ఆరోపిస్తూ   మ‌రో ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తల్లో  వచ్చింది.   

  డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికలు రానున్నాయి. ఆ తరువాత తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికల మాట విన్పిస్తున్న‌ది. అవి అయిన ఏడాదిలో లోక్ సభకి ఎన్నికలు రానున్నాయి. ఈ వాతావరణంలో మోడీ మాటలను గమనించాల్సి ఉంటుంది. మరో వైపు దేశంలో ఏదో ఒక చోట ప్రజలు తమ అసమ్మతిని వినిపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా బీజపి ని ఇబ్బంది పెడుతున్న అంశాలే. ఎలక్షన్ల వ్యవధి ముంచుకువస్తున్న సమయంలో బీజేపీ, హిందుత్వ శక్తులు గెలవడం కోసం ముస్లింల మీద‌, అర్బన్ నక్సల్ పేరుతో సమాజంలో మాట్లాడే ప్రజాస్వామ్య వాదుల మీద దాడులు చేస్తోంది.  ఎన్నికలలో గెలవడానికి బీజపి మరోసారి వీటినే నమ్ముకుంది.  

ఎన్నికలు రావడం అంటేనే మనుషుల మీద, విశ్వాసాల మీద దాడులు జరగడం. ఇది  సాధారణ విషయంగా మారిన సంద‌ర్భంలో   ప్రతిఘట‌నే  మనముందున్న ఏకైక లక్ష్యం.  

Leave a Reply