విప్లవ రచయితల సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెలల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది.
పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాలకులకు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్పని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది.
బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు నిషేధానికి గురైన సాహిత్య సంస్థ విప్లవ రచయిత ల సంఘమే కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వాల అంబుల పొదిలో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ దగ్గరి నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) దాకా చేరి ఉండవచ్చు. అనేక సామాజిక నిషేధాలున్న మన సమాజంలో నిషేధ అధికారాన్ని చట్టపరంగానే గాక భావజాల అధికారంగా కూడా రాజ్యం సంతరించుకొని ఉండవచ్చు.
కానీ పదిహేనేళ్ల కింద తొలిసారి నిషేధానికి గురైనప్పుడు కూడా విరసం దీన్ని చట్ట పరిధిలోనే చూడలేదు. ఇది రాజకీయ, పాలనాపరమైన నిషేధమే కాదని, సామాజిక సాంస్కృతిక నిషేధమని ప్రకటించింది. రాజ్యం తీవ్రమైన భావజాల సంఘర్షణకు దిగిందని, ఇక అనేక నిషేధాలను తేబోతోందని హెచ్చరించింది. సాహిత్యాన్ని, ఆలోచనలను చట్టపరిధిలోకి తేవడం వెనుక ఉన్న ఆంతర్యం గుర్తించమని తెలుగు రచయితలకు ముందుగానే చెప్పింది.
ఈ పదిహేనేళ్లలో ఎన్నెన్ని రకాల విధి నిషేధాలను చట్ట పరిధిలో, చట్టానికి బైటా ప్రభుత్వాలు అమలు చేశాయో గుర్తు చేసుకుంటే సాంస్కృతిక, భావజాల ఫాసిజం ఎదిగి వచ్చిన దారి కనిపిస్తుంది. అట్లని ఇదేదో కేవలం సంస్కృతికి సంబంధించిన విపత్తు అనుకుంటే పొరబడ్డట్లే. ఒక కచ్చితమైన రాజకీయార్థిక పునాది మీద వేయిపడగతో విస్తరిస్తున్న నియంతృత్వం . ఇది సంస్థలకు, పోరాటశక్తులకు సవాలు మాత్రమే కాదు. సమాజాన్నే తీవ్ర సంక్షోభంలోకి తోసి వేసే వ్యూహం ఇందులో ఉంది. అందుకే తన మీద వచ్చిన నిషేధాన్ని తక్షణ, న్యాయ, రాజకీయ అర్థంలోనే కాక విరసం చాలా లోతుగా పరిశీలించింది. దీని దీర్ఘకాలిక ప్రమాదాన్ని గుర్తించింది. అది విరసానికి ముంచుకొచ్చే ప్రమాదమనే అనుకోలేదు. మన సమాజమే ఒక తీవ్రమైన అపక్రమంలోకి, విధ్వంస క్రమంలోకి వెళ్లిపోతోందని చెప్పింది.
నిషేధానంతరం జూన్ 10, 11 తేదీల్లో ‘రచయిత ప్రజల మనిషి’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన 20 మహా సభల నాటికి భారతదేశంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సంస్థ చేతనా నాట్యమంచ్ను ప్రభుత్వం నిషేధించింది. తాను నిషేధాన్ని అధిగమించి వచ్చిన సంస్థగా చేతనా నాట్యమంచ్ మీది నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రచయిత ప్రజల మనిషిగా పరివర్తన చెందక తప్పని సంక్షుభిత క్రమాన్ని వివరించింది. ఆ సందర్భంగా కూడా సాహిత్యాన్ని, కళలను చట్టపరిధిలోకి తీసికెళ్లడంలోని కుట్రను వివరించింది. సమస్య నిషేధ ఉత్తర్వుల్లో లేదని, అట్లా అనుకుంటే ఇది రూపవాద చర్చగా మిగిలిపోతుందని చెప్పింది.
అందుకే ఇప్పుడు ఈ నిషేధాన్ని ఖండించమనో, నిషేధానికి గురైన 16 సంఘాలకు మద్దతు తెలపమనో విరసం కోరడం లేదు. ఆ పని చేయగలిగిన వాళ్లు చేస్తే మంచిదే. తక్షణంగా అంతకంటే కావాల్సిందేముంటుంది? కానీ అందరూ ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన సంకేతాలు ఈ నిషేధంలో ఉన్నాయి. అనేక అర్థాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలన్నదే ప్రశ్న. అసలు సాహిత్యమే ప్రతీకాత్మకం. వేర్వేరు అర్థఛాయలతో మానవ అంతరంగాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనమంతా సాహిత్యకారులం కాబట్టి ఈ నిషేధానికి ఉన్న అర్థాలన్నిటినీ వివరించుకోగలమా? అనేదే అసలు సమస్య.
ఈ పని విరసం కోసం కానే కాదు. విరసం కష్టాల్లో ఉన్నదని పెద్ద మనసుతో ఆదుకోడానికి ముందుకు రానవసరం లేదు. ఈ పని ఎంత జరిగినా, జరగకపోయినా ఫర్వాలేదు. రెండో సారి నిషేధపు ఉత్తర్వులు తెచ్చినంత మాత్రాన అబద్ధాల ఆరోపణలు నిబడతాయా? ఒకటికి రెండుసార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? చట్టం చట్రంలోకి ఇరికిచ్చినంత మాత్రాన ఆలోచనలే నేరమవుతాయా?
కాకపోతే పదే పదే నిరాధార ఆరోపణలు చేయడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. అదే ఒక భావజాలంగా తయారవుతుంది. విరసంతో ఏ విషయంలోనో పేచీ ఉన్న వాళ్లు .. ఒకసారి నిషేధం నుంచి బైట పడినా ఆలోచనలు మార్చుకోలేదని అనవచ్చు. ఆలోచనలు మంచివేగాని పని పద్ధతులే మారాలని అనుకోవచ్చు. అసలు విప్లవాన్ని, సాహిత్యాన్ని, మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడంలోని పెడ ధోరణే దీనికంతా కారణమని కొందరు హితబోధ చేయవచ్చు. మౌనంగా ఉండటం కంటే ఏదో ఒకటి చెప్పడమే మంచిది. విరసం యాభై ఏళ్ల చరిత్రను పక్కన పెడదాం. కనీసం గత నిషేధం తర్వాతి చరిత్రను పరిశీలించినా సరిపోతుంది. ఈ సమాజం గురించి విరసం ఎన్నెన్ని సృజనాత్మకమైన పనులు చేసిందీ తేలుతుంది. లేదా ఎన్ని చట్ట రాహిత్య పనులు చేసిందీ తేలుతుంది. ఆ రకంగా నిషేధం విధించడమేగాక దానికి తగిన భావజాల చర్చను కూడా రాజ్యం ప్రేరేపించవచ్చు. అవే ఆరోపణలు మళ్లీ చేయడం వల్ల ఇంతకంటే సాధించగలిగేది ఏమీ ఉండదు.
కానీ అసలు విషయమేమంటే ఈ పదిహేనేళ్లలో రాజ్యం గతం కంటే ఫాసిస్టుగా మారింది. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజంగా విజృంభిస్తోంది. ఈ నిషేధం దానిలోని రాజ్య నిరంకుశత్వానికి వ్యక్తీకరణ. ఈ రెండు నిషేధ అనుభవాల మధ్య ఫాసిజం వచ్చి చేరింది. ఫాసిజాన్ని కేంద్రంగా చూడవలసిన విషయం ఇది. అందుకే ఇది నిషేధానికి గురైన సంఘాల సమస్య కాదు. కాకపోతే మన పాలనా, న్యాయ ప్రక్రియల్లోని వికృత, పతన స్వభావాన్ని ఈ జీవో మరోసారి బట్టబయలు చేసింది.
బహుశా ఈసారి ప్రభుత్వం మరింత బరితెగిస్తే న్యాయ విచారణ ప్రక్రియకే అవకాశం లేకుండా చేయవచ్చు. ఒక వేళ అవకాశమే ఇచ్చినా.. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల ఫాసిస్టు తీర్పులే అక్కడా ఎదురు కావచ్చు. అఖి భారత స్థాయిలో పని చేస్తుండిన విప్లవ ప్రజాస్వామ్య వేదిక(ఆర్డీఎఫ్)ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించినప్పుడు న్యాయ విచారణ కమిటీ పాలకులకే వంతపాడినట్లు విరసం సహా పదహారు సంఘాల మీది నిషేధాన్ని సమర్థించవచ్చు. ఏమైనా జరగవచ్చు. సమస్యను చట్ట పరిధిలోకి తీసికెళ్లాక సాక్ష్యాలు, తీర్పులు ఎలాగైనా ఉండవచ్చు. దానికి విరసం సిద్ధంగానే ఉన్నది. ఆ న్యాయ ప్రక్రియలో తన సాహిత్య, సాంస్కృతిక ఆచరణను, తాత్విక విశ్వాసాలను హేతుబద్ధంగానే సమర్థించుకుంటుంది. ప్రభుత్వ అబద్ధ ఆరోపణలను తిప్పికొట్టే ప్రతి వాదనను సత్యం మీద ఆధారపడి నిర్మిస్తుంది. అంతిమంగా తన నైతికతను నిరూపించుకుంటుంది.
కానీ తెలుగు సాహిత్య, మేధో రంగా ముందున్న సమస్య దీనితో తీరిపోయేది కాదు. ఆ రకంగా పరిష్కారమయ్యేదీ కాదు.
మనమంతా రచయితలం కదా. మన సమస్త సాహిత్యమూ కేవలం జీవిత వర్ణనే కాదని మనకు తెలుసు. మానవ చైతన్యపు మారుమూలల నుంచి, అంతరాంతరాల నుంచి, భిన్న తలాల వ్యక్తీకరణల నుంచి మానవ సారమే సాహిత్య రూపం ధరిస్తుందని మనకంటే ఇంకెవరికి తెలుసు? మానవులు తమను తాము ఉన్నతీకరించుకోడానికి ఆనాదిగా కొండగుహల నుంచి, బీడు మైదానాల నుంచి, నదీ తీరాల నుంచి, సముద్రపు ఇసుక తిన్నెల మీద నిర్మాణమైన మహా మానవ జీవితం నుంచి కళను, సాహిత్యాన్ని ఊతంగా తీసుకొని సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. సాహిత్యం ద్వారా మాత్రమే సాధ్యం కాగల పనులేమిటో, పరిణామాలేమిటో, సాహిత్యమే చెప్పగల జీవితార్థాలేమిటో తెలుసుంటున్న తుదిలేని ప్రయాణం కదా ఇది.
ఈ పనులను నేరమని అన్నప్పుడు మనకేం అనిపించాలి? దీన్నంతా మావోయిస్టు సంబంధాల్లోకి కుదించినప్పుడు మనకేం అనిపించాలి? విరసం కోసమే అయితే ఏమీ అనిపించనవసరం లేదు. ఏమీ చేయనవసరం లేదు. నిశ్చింతగా ఉండవచ్చు. కానీ కళా సాహిత్యాలను బోను ఎక్కించడమేమిటి? నిషిద్ధమని ప్రకటించడమేమిటి? ఫలానా తాత్విక విశ్వాసాలున్నంత మాత్రాన ఒకసారి ఆ సాహిత్యాన్ని నిషేధిస్తే అది అక్కడే ఆగుతుందా? ఆ తాత్విక విశ్వాసాలతో రాజ్యానికే కాదు, ఇతరులకూ ఏకీభావం ఉండనవసరం లేదు. కానీ అక్కడ సాహిత్యమున్నది. ఒక వేళ అందరూ అంగీకరించే వైనం ఆ సాహిత్యానికి లేదనే అనుకుందాం. అసలు దేన్నయినా ఎందుకు అందరూ అంగీకరించాలి? అలాంటి ప్రమాణాలపట్ల అర్థరహితమైన వ్యామోహం దేనికి ? అయినా సరే అది సాహిత్యం. ఆ సంస్థను నిషేధించడం సబబా కాదా? అనే ప్రశ్న దగ్గరికి కూడా వెళ్లనవసరం లేదు. దాన్ని ఆ సంస్థే చూసుకుంటుంది. కానీ నిషేధాస్త్రం సంధించింది సాహిత్యం మీద. కళా వ్యక్తీకరణ మీద, ఆలోచనా రీతుల మీద. అంటే అంతిమంగా మానవుల సాంస్కృతిక ఆచరణ మీద. ప్రజలు తమ రక్తమాంసాలతో, సకల సృజనాత్మక శక్తులతో నిర్మించుకున్న సాంస్కృతిక జగత్తు మీద. రాజ్యం అక్కడి దాకా తన కబంధ హస్తాలను చాచిందంటే, ఇక అది విరసం, మావోయిస్టు వ్యూహం- ఎత్తుగడల విషయమే అవుతుందా?
సరిగ్గా పదిహేనేళ్ల కింద తొలి సారి నిషేధమప్పుడు విరసం ఇదే చెప్పింది. భావ వ్యక్తీకరణ హక్కు రాజ్యాంగంలో ఉంది కాబట్టి మనం వాడుకోవడం కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమైన తాత్విక విశ్వాసాలను ప్రకటించుకోవడం లేదు. కథలు, కవిత్వాలు రాయడం లేదు. మానవ వికాసంలోనే భావ ప్రకటన మహాద్భుతమైన శక్తి. బహుశా ప్రకృతిలోంచి మానవ సమాజం రూపొందడం, జంతుజాలం నుంచి మానవులు వేరుపడటం వెనుక భావ ప్రకటన ఉన్నది. నిజానికి అది సాహిత్యానికి సంబంధించిందే కాదు. మానవుల ఉనికిలో, అస్తిత్వంలో, ప్రగతిదాయక పరివర్తనలోంచి వేరు చేయలేనిది. అందువల్ల ఆధునిక, నాగరిక రాజ్యాంగాలు భావ ప్రకటనా స్వేచ్ఛను తమలో భాగం చేసుకున్నాయి. మనుషులు ఆనాదిగా ఏ ఒక్కపనీ విడిగా చేయలేదు. ఆహారం వెతుక్కోవడం దగ్గరి నుంచి కళా సాహిత్య సృజన చేయడం దాకా. ఇంకో ఉదాహరణే అక్కర్లేదు. అయితే ఆధునిక మానవులు చైతన్యయుతంగా, ఉద్దేశపూరితంగా సంఘటితం కావాలనుకుంటారు. అది మానవ కార్యాచరణలోని అంతర్నిహిత వాస్తవం. దాన్ని మనుషుల నుంచి వేరు చేయలేరు. అందుకే రాజ్యాంగం సంఘం పెట్టుకొనే, నిర్వహించుకొనే హక్కును గుర్తించింది. రాజ్యాంగాలు సంఘం పెట్టుకొనే హక్కు ఇచ్చాయి కాబట్టి భూమ్మీద ఎవ్వరూ సంఘం పెట్టుకొని ఉండరు.
అలాంటి భావ ప్రకటన హక్కు అంటే విప్లవోద్యమాన్ని తాత్వికంగా అంగీకరించడమే అనుకుందామా? సంఘం పెట్టుకొనే హక్కంటే దాన్ని ఆచరించడం కోసమే అనుకుందామా? అంతకంటే లోతైన అర్థాలు వాటికి ఉన్నాయా? అవి కేవలం విరసానికి సంబంధించినవేనా? లేదా అలాంటి మరో 15 సంఘాల గొడవేనా? అంతకంటే విస్తారమైన భావనలు కావా? వాటి మీద దాడి చేయడమంటే కేవలం యాభై ఏళ్లుగా సాగుతున్న ఒక సాంస్కృతిక ఆచరణ స్రవంతిని నిషేధించడంగానే చూద్దామా? లేక ఈ నేల మీది కష్టజీవులు, దోపిడీకి గురవుతున్నవారు, నిషిద్ధ మానవులు, వెలివేతలే జీవితమైనవారు తమ శ్రమశక్తితో, సృజనశక్తితో నిర్మించుకున్న సంస్కృతి మీద చట్టం తీర్పు ప్రకటించడమని మనకేమైనా అనిపిస్తున్నదా? అదే జరిగితే, పాలకులకు ఆ ఆవకాశమే ఇస్తే, రాబోయే రోజుల్లో మనమంతా ఎక్కడ ఉంటాం? ఏ నిషిద్ధ తీరాల్లోకి విసిరేయబడతాం? విరసానిది ఏముంది? చాలా చిన్న సంస్థ, అది ఎదుర్కొంటున్న సమస్య కూడా చాలా చిన్నదే. చరిత్ర దానితోనే మొదలు కాలేదు. దానితోనే ముగిసిపోదు. చరిత్రలో అదొక క్రమం. కానీ మన ప్రజలు నిర్మించుకుంటున్న సజీవ చరిత్ర ఎంత సుదీర్ఘ గత వర్తమానాల మీదుగా భవిష్యత్తులోకి విస్తరించేది! దాన్ని చట్టం పరిధిలోకి కుదిస్తానంటే చూస్తూ ఊరుకుందామా?
అలా ఊరుకున్నాక మనకు మనం చెప్పుకొనే భరోసా ఏదైనా ఉంటుందా?