చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు.
ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాలని అధికారమార్పిడి అనంతరం మన పాలకులు ప్రకటించారు. ఆ పని చేయడానికి వాళ్లకు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు. సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాటలు రాజ్యాంగంలో రాశారేగాని, ఆ దిశగా మన దేశాన్ని అభివృద్ధి చేయలేదు.
పైగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో, పంచవర్ష ప్రణాళికల పేరుతో, రకరకాల పథకాల పేరుతో అమలు చేసిన రాజకీయ ఆర్థిక విధానాలన్నీ క్రమంగా మన దేశాన్ని సామ్రాజ్యవాద పెట్టుబడికి పరాధీనంలోకి తీసికెళ్లాయి. పాలకుల విధానాల వల్ల ఇక్కడొక స్వయం సమృద్ధ మైన, స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ సృష్టించబడలేదు. నూట పాతికకు పైగా రాజ్యాంగ సవరణలన్నీ పాలక వర్గ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల మౌలిక ప్రయోజనాల కోసం జరగలేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏర్పడిన ప్రభుత్వాలకు తమ అధికార బలాన్ని ఉపయోగించైనా రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా మన దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉం(డిం)ది. కానీ ఓట్ల ద్వారా ప్రజలు ఇచ్చిన అధికారాన్నిఅడ్డంపెట్టుకొని ఆ ప్రజల పైననే నిరంకుశత్వాన్ని, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.
ఇటువంటి సందర్భంలో రాజ్యాంగంలోని ప్రజానుకూల చట్టాలను అమలు పరచాలని ఉద్యమించడం, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కాపాడాలని పోరాడడం రాజ్యాంగపరమైన ప్రజాస్వామిక బాధ్యత. పౌరులందరూ దీనికి పూనుకోవాల్సిందే. ఇది ఎంత మాత్రం రాజ్యాంగ వ్యతిరేకం కానే కాదు. సకల అధికారాలు కలిగి ఉండి కూడా ప్రజానుకూల చట్టాలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల గొంతు నొక్కి అణిచివేసే అప్రజాస్వామిక చట్టాలను, నిషేధాలను ఖండించడం పౌరుల ప్రజాస్వామిక బాధ్యతే తప్ప నేరం కానేకాదు.
ఆ బాధ్యతతోనే విరసంతో సహా 16 ప్రజా సంఘాలపై విధించిన ప్రభుత్వ నిషేధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రత్యేకించి విరసం పైన విధించిన నిషేధం అయితే అర్థం పర్థం లేని పనే అని చెబుతున్నాం. ఎందుకంటే- విప్లవ రచయితలకు కళ్ళముందు కనబడే వాస్తవ జీవితమే పరమ ప్రమాణం. వారు ఆ వాస్తవ జీవితాన్ని పరిశీలించి, సహేతుకంగా విమర్శించి, శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. మెరుగైన, ప్రగతిశీల మానవ జీవితాన్ని ఆకాంక్షిస్తారు. అందుకోసం భావజాల, సాంస్కృతిక రంగాల్లో ‘అక్షర’ పోరాటం చేస్తారు.సకల అధికారాలు కలిగి ఉండి కూడా కళ్ళముందరి వాస్తవ సమాజాన్ని మార్చ(ఏమీ చేయ)కుండా ప్రభుత్వం విప్లవ రచయితల సంఘంపై నిషేధం విధించడం అర్థంలేని పని గాక మరి ఏమవుతుందో ఆలోచించమని ప్రజలను,బుద్ధిజీవులను కోరుతున్నాం. విరసంతో సహా 16 ప్రజా సంఘాల పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం.