ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు..
దేహామంతా పరిమళాల చెట్టు అయిపోక మరింకేమి అవుతుంది?
ఈ పూల కెన్ని పేర్లూ -ఊర్లూ
అందాలూ – బంధాలూ
రంగులూ – పరిమళాలు.
ఈ పూలకెన్ని షాయారీలూ – గజళ్ళు.
కథలూ -కవితలు .
ముచ్చట్లు – మౌనాలూ
ఈ పూలకెన్ని ఊర్లూ – దేశాలు- భూములు
ఇళ్ళూ – ఖబరిస్తాన్లు .
ఈ పూలకెన్ని తోటలూ – ఎన్ని ఎడారులు


అవన్నీ సరే .. ఇది చూడండి
ఈ పూలకెంత సమానత్వం., ఎంత లౌకికత్వం !
కులమూ లేదు.. మతమూ లేదు
కదిలే మనుషుల దేహాల మీద.. కదలని శవాల మీద
అందరి శ్మశానాల్లో సమాధుల మీద
మందిరాల్లో .. మసీదుల్లో.. చర్చీల్లో
ఐక్యంగా ఒక్క మాలై ఊగుతాయి కదా !
ఒక్కలాగే సువాసనలు అద్దుతాయి.
రాముడు .. ఖుదా.. .. జీసస్
ఎవరినైనా ఒక్కలాగే పలకరిస్తాయి
నీరు పోసిన తోట మాలిని .. మాలలు అల్లే చేతులను
మీ వర్ణం .. వర్గం ఏమని అడుగుతాయా అసలు ?


ఈ పూలకెంత పసితనం !
ఈ పూలకెంత పరిపక్వమయిన వృద్ధాప్య సౌందర్యం!
ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే మొఖం దానికదే అందమైపోతుంది .
కళ్ళలో పున్నమి కాంతిని నింపే మహిమ ఈ పూలదేగా !
ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు..
హృదయం ఇలా సౌరభాలతో నిండిపోక ఏమవుతుంది ఇక ?
అసలు ఈ పూలకు ఇంత క్షమ ఎక్కడిది ?
వాడిన పూలను చీపురుతో ఎత్తి పోస్తామా ధూర్తులం ..!
నేల మీది తమ వాడిన పూల శవాలను చూసి దుఃఖించకుండా
మరుసటి క్షణమే తాజా మాలలై .. నీ చేతులలోనో.. జడలోనో.. నీ ఇంటి వాకిలి తోరణంలోనో
ఊయలలూగుతూ ఆనందంతో కిలకిలా నవ్వుతాయి కదా !
అచ్చం అమ్మ దయాగుణంలా !
ఈ పూలకెంత ఔదార్యమో !
ఏ బంధమూ లేని మనుషుల మృత శయ్యపై వాలిపోయి.,
మృత్యువుకి కూడా అత్తరులు అద్దుతాయి.
నీ దు:ఖమై అవి కూడా దిగులుగా ముకుళించుకు పోతాయి.
ఈ పూలకెంత వినమ్రత !
అహంతో ఎగిరిపడే మనిషి ముందు కూడా వినయంగా తలవంచుతాయి.


ఈ పూలు ఒక్క సౌకుమార్యాన్నే కాదు
కఠినమైన ముళ్లయి గుచ్చుతూ నిన్ను దారి తప్పకుండా హెచ్చరిస్తాయి
పూలు అందుకే నేల మీద పూసే చుక్కానీలు .
పూలు పలుచటి రేకుల్లా ఏమీ ఉండవు సుమా .,
ఎడారి పూలలాగా రౌద్రంగా కూడా ఉంటాయి
నీకు ఎడారి దాహాన్ని తీర్చుకునే జీవన సారాన్ని బోధిస్తాయి
పూలు అందుకే పాఠం చెప్పే గురువులు!
ఇంతకీ పూలు రాత్రికల్లా వాడి రాలిపోతాయి అనుకునేవు
అవి నిశబ్దంగా భూమిలోకి రేపటి విత్తనాలను నాటే కర్షకులు అవుతాయి .


క్రూరమైన మనుషుల చావుని కూడా సాదరంగా సాగనంపుతాయి
ఇంత కారుణ్యం నిండిన పూలను ప్రేమించకుండా ఉండడం ఎలా సాధ్యం?
చెట్టు నుంచి తుంపిన కొద్దీ విరగ బూసే ఈ పూలు..
నువ్వు రోజూ చంపేసే ఫూలే కదా !
నీ పెదవుల మీదకి .. నీ కళ్ళలోకి.. నీ శ్వాసల్లోకి జీవన లాలసను నింపేది ?
నీ ఇంటినీ .. నీ తోటనీ
నీ ఆకాశంలోని చీకటినీ – మేఘాలని
సూర్య- చంద్రుళ్లని
ఎడతెగని విసుగుతో నిండిన నీ పగళ్లని.. నిద్ర పట్టని రాత్రుళ్ళని
నీ కల్లోల అసంపూర్ణ స్వప్నాలను
మార్మికమైన సందేశాలతో గుబాళింపచేసేది ?
నీ ఏకాంత దుఃఖాలను
దాచుకోలేని .. మోయలేని భారమై పోయిన నీ రహస్య ప్రేమను వోదార్చేది
ఈ పూలనిలా చేతుల్లో పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు ?
నీకు కొద్ది ఆశనిస్తూ .. కొద్దిగా తోడుగా అయినా ఉంటాయి కదా .
వర్షాల్లో .. ఎండల్లో
వెన్నెల్లో .. నిశీధిలో
చలిలో .. గాలిలో .. సమస్త ఋతువులలో నీ కోసం వికసించే పూలు.
మట్టి పరిమళానికి జుగల్బందీ పాడే పూలు
ప్రేమలో ఉన్నప్పటి నీ హృదయంలా నాట్యమాడే పూలు.,
ప్రేయసిని చూసినప్పటి వెన్నెల తాగిన నక్షత్రాలలా వెలిగిపోయే నీ కళ్ల లాంటి పూలు .,
ఆమె నవ్వుల్లాంటి పూలు కదా !
ఈ పూలకెంత మాధుర్యమని ?
తీయని తేనె నిండుకునే పూలు
జీవితమంతా నీతో నడిచే పూలు
మరణించాక కూడా పరిమళించి పోయే పూలు
నిన్నేమి చేశాయని అర క్షణంలో తెంపేస్తావు
పూలకంటే నీవేమీ గొప్పని చెప్పు పోనీ
ఇన్నిన్ని భిన్నమైన రంగుల పూలని సహించలేవేమో ?
కాషాయ రంగు వొక్కటి చాలేమో నీకు .,
కాల్చేస్తావా తోటలను ?
నరికేస్తావా పూల మొక్కలను ?
పూల తోటల్లో త్రిశూలాలు గుచ్చుతావు ?
పశువులకి మల్లె .,
పూవుకొక్క కులాన్ని .,తావికొక్క మతాన్ని ప్రకటించబోతావా ఇక?
ఏం చేయబోతావో చెప్పు ?
మనుషులు సరే .. ఈ పూలేం నేరం చేసాయో చెప్పు !

Leave a Reply