నువ్వు అలవోకగా నడుస్తున్నప్పుడో
బండి నడుపుతున్నప్పుడో
నీ వెనకాలో నీ పక్కనుండో
ఒక బుల్డోజర్ వచ్చి గుద్దితే
నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు
నువ్వు కుర్చీ వేసుకొని
ప్రశాంతంగా చదువుతున్నప్పుడో
పరధ్యానంగా పడుకున్నప్పుడో
నీపై ఎం ఐ ఏ దాడులు జరిగితే
నీవు బెదిరిపోనక్కర్లేదు
వాడు నిన్ను జైలుకు ఇడ్చికెళ్ళినప్పుడో
నాలుగు గోడల మధ్య
నిన్ను బందీ చేసినప్పుడో
ఉచ్ఛ్వాస నిశ్వాసలకి తావివ్వనప్పుడో
నీవు అలసిపొనక్కర్లేదు
కొన్ని పుస్తకాలలో
డార్విన్ సిద్ధాంతం తిసేసినప్పుడో
మత గ్రంథాలను ప్రబోధించినప్పుడో
రాయిని సైతం దేవుణ్ణి చేసి
నిన్ను మైలపరిచినప్పుడో
నువ్వు కృంగిపోనక్కర్లేదు
సలసలా కాగే నెత్తురు
నీ గుండెల్లో ఇంకా పచ్చిగానే పారుతుంది
నిజాల నీడలు ఎప్పటికీ కూలిపోవు
రేపటి ఘడియను మొలకెత్తించే సత్తువ
నిత్య కొలిమిలా ఊపిరి పోసుకుంటూ ఉంటుంది
పోరాట దారుల్లో సత్యాన్ని విప్లవించు
గళాలను, కలాలను కలుపుతూ
మరో ఉత్తేజపు విప్లవమై వికసించు.
Related
Good poem
TQ.. sir.
చాలా బాగుంది