భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే రాజకీయాల్లో ‘అచ్చేదిన్‌ ఆనే వాలేహై’ అనేది బిజెపి నినాదం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బిజెపి విడుదల చేసిన గంభీరమైన వాగ్దానాలను అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్ని వాగ్దానాల గాలి మాటలు గాలి మాటలుగానే మిగిలాయి. మోడీ అమలులోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) భారతదేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేశాయి. మోడీ మొదటి టర్మ్‌ పాలనలో దేశ ప్రజలు తమ జీవన పరిస్థితులు అంతకంతకూ దిగజారడమే చూశారు. ప్రభుత్వం అనుసరించిన కార్పొరేట్‌ అనుకూల విధానాల వలన అత్యంత నీచమైన ఆశ్రిత పెట్టుబడి ఒకవైపు పెరుగుతుతంటే, నానాటికి పెరుగుతున్న భారాలతో ప్రజల జీవనం అతలకుతలమైంది. మోడీ ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో మితవాద నిరంకుశ-మతతత్వ ఫాసిస్టు పాలనను అమలుచేస్తూ పార్లమెంటరీ ప్రాతినిధ్య పార్లమెంటరీ వ్యవస్థకు ప్రతిబంధకాలు కల్పించడం, రాజ్యాంగ సంస్థలను (ఇడి, సిబిఐ, ఎన్నికల కమీషన్‌, న్యాయ వ్యవస్థ) బలహీనపరచడం, ప్రజాతంత్ర, పౌర హక్కులను అణచివేయడం జరిగింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన పూర్తి మెజారిటీ ఇచ్చిన కిక్కుతో బిజెపి దీర్ఘకాలంగా సాధించ దలచుకున్న సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను ఉత్సాహంగా అమలు చేస్తున్నది. ఆర్థిక రంగంలో కార్పొరేట్‌ అనుకూల విధానాలు ఒకవైపు, హిందు రాష్ట్ర ఏర్పాటులోని ప్రమాదకరమైన అంశాలను మరోవైపు అమలు చేస్తున్నది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370, 35ఎ అధికరణలను రద్దు చేసింది. జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంత్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. బాబ్రీ మసీద్‌ స్థానంలో రామాలయ నిర్మాణం, ముస్లిం మైనారిటీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నది. దీని తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) చేసింది. భారత రిపబ్లిక్‌ స్వభావాన్ని మార్చి వేయడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు సాగుతున్నాయి. లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే నాలుగు రాజ్యాంగపు మూల స్తంభాలపై మోడీ ప్రభుత్వం నిరంతరంగా దాడి చేస్తున్నది. అన్ని రాజ్యాంగ సంస్థలను తన చెప్పుచేతుల్లో పెట్టుకుని నిరంకుశంగా ప్రజా ప్రతిఘటనను అణచివేస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి)లు రెండూ ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకొని పాలక పార్టీ రాజకీయ అంగాలుగా పనిచేస్తున్నాయి. 2024లో మూడవసారి అధికారం చేజిక్కించుకోవడానికి కలలుగంటూ కుతంత్రాలు పన్నుతున్నారు. 

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ప్రభుత్వం గత నవంబర్‌ 15న జార్ఖండ్‌లోని ఖుంటి నుంచి ‘వికసిత భారత్‌’ సంకల్ప యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన, సాధికారత, స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పం, నిబద్ధతను ప్రతిబింబిస్తూ, భవిష్యత్తు కోసం ఆకాంక్షలు, అంచనాలను వ్యక్తీికరించడానికి ఇది వేదికగా పనిచేస్తుందని బిజెపి చెబుతుంది. మోడీ పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లో గొప్పగా ప్రచారం చేస్తుంది. నిజానికి నేడు దేశం వికసిత భారత్‌గా కాక, అత్యధిక ప్రజానీకాన్ని అభివృద్ధి ఫలాల నుండి గెంటివేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా దేశం ఎలా ఉంటుందన్నది ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది. ప్రధాని మోదీ పదేళ్ళ పాలనలో అసమానతలు మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయన్నది వాస్తవం. భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతకాలం పబ్బం గడుపుకోగలరేమోగానీ, ఎల్లవేళలా అశేష ప్రజానీకాన్ని మోసపుచ్చలేరు.

ఈ క్రమంలోనే ఇండియా టుడే మాగజైన్‌కు ప్రధాని మోడీ డిసెంబర్‌ 26న ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగల్భాలకు పోయారు. పదేండ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు అన్ని రంగాలు మెరుగైన పని తీరు కనపరుస్తున్నాయని ఉద్ఘాటించారు. వాజ్‌పాయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ‘వెలిగిపోతున్న భారత్‌’. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ‘అచ్ఛేదిన్‌’, తాజగా ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్‌ రెండవ వారంలో ‘వికసిత భారత్‌’ ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. 2024లో ఎన్నికల్లోపు ఎలాంటి అనూహ్య ఉదంతాలు జరగక లేదా జరపకపోతే దాన్నే బిజెపి స్వీకరించి ఎన్నికల గోదాలోకి దిగనుంది. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోంది అన్నారు. రెండవది కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్ఛేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని ఆశ చూపారు. పదేండ్ల తరువాత వాటి జాడ కనిపించడం లేదు, దీంతో మరో పాతికేండ్లలో 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని ప్రజలను మరోమారు దగా చేయడానికి నమ్మబలుకుతున్నారు.

వికసిత భారత్‌ 2047 రోడ్‌ మ్యాప్‌ ప్రకారం ఆ సంవత్సరానికి మన దేశం అభివృద్ధి చెందిన జాబితాలో చేరుతుందని చెబుతున్న దాన్ని జనం నమ్మేదెలా? అభివృద్ధి లక్షణాలలో అధిక తలసరి రాబడి ఒకటి. దానిలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రపంచ బ్యాంకు రూపొందించిన అట్లాస్‌ పద్దతి ప్రకారం 2022 సంవత్సర వివరాల మేరకు 190 దేశాల జాబితాలో జిఎన్‌ఐ తలసరి ఆదాయంలో ముందున్న తొలి 59 దేశాల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకే చోటు లేదు. ఎగువ, మధ్యతరగతి ఆదాయ జాబితాలో రెండవదిగా, మొత్తం దేశాలలో 61వ స్థానంలో ఉంది. మనదేశం దిగువ మధ్యతరగతి జాబితాలో 26వ స్థానంలో మొత్తం దేశాల్లో 140వదిగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం వెనుకబడిరదని మోడీ అన్నారు. జనానికి సమాచారం అందుబాటులో ఉన్నా చూసే ఓపిక, ఆసక్తి కూడా లేని బలహీనతను పాలకులు సొమ్ము చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వ ఉన్న 2004లో భారత జిఎన్‌ఐ 600 డాలర్లు 2013 నాటికి 1,500కు చేరింది. వార్షిక సగటు వృద్ధిరేటు 11.48 శాతం. కాగా స్థిరమైన, స్పష్టమైన విధానాలు అమలు జరిపినట్లు చెప్పుకున్న నరేంద్ర మోడీ పాలనలో 2022 నాటికి అది 2,380 డాలర్లకు, వార్షిక వృద్ధి రేటు 5.44 శాతమే పెరిగింది. సంతోష సూచికలో 146 దేశాలకు గాను మన దేశం 137వ స్థానంలో ఉంది. కొంతమంది అంగీకరించినా లేకున్నా మన కంటే ఎగువన చైనా 82, నేపాల్‌ 85, బంగ్లాదేశ్‌ 99, పాకిస్థాన్‌ 103, శ్రీలంక 126వ స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌ను వికసింప చేస్తామని గొప్పలు చెప్పడం నరేంద్ర మోడీకే చెల్లింది.

భారత్‌ అప్పుల పాలు కానుందని సరిగ్గా వికసిత భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రూపొందించిన నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలో మనదేశ స్థానం గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న సూచికలను అధికార బిజెపి ప్రభుత్వం అంగీకరించదు, తప్పుల తడకలని, వారికి లెక్కలు వేయడం రాదని బుకాయించడం తెలిసిందే. పోనీ వారు నమ్మే వేద గణితం ప్రకారం మనం నిజంగా ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు ఐఎంఎఫ్‌ చెప్పిందాన్ని కూడా తాము అంగీకరినిచడం లేదని, అవన్నీ ఉహాగానాలు తప్ప వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం గింజుకుంది. నెరవేరని ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కబుర్లు కూడా ఊహాగానమే. వర్తమాన వికసిత భారత్‌ కూడా అదే, వాస్తవం కాదు. వికసిత భారత్‌, తమ విజయం నల్లేరు మీద బండిలా సాగుతుందని చెప్పుకుంటున్న పూర్వరంగంలో ఐఎంఎఫ్‌ విశ్లేషణ గొంతులో పచ్చి వెలక్కాయ వంటిదే. ఇంతకీ అదేమి చెప్పింది? ప్రతికూల దెబ్బలు తగిలితే 2028 నాటికి జిడిపి ఎంత ఉంటుందో ప్రభుత్వ అప్పు అంతకు (వంద శాతం) చేరుతుందని హెచ్చరించింది. అయితే మోడీ అనుయాయులు తమ నేత విదేశీ అప్పులేమి చేయడం లేదని ప్రచారం చేస్తున్న భక్తులను సంతుష్టీకరించలేము.

మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990 నాటికి 83 బిలియన్లకి చేరింది. తరువాత పదేండ్లకు 2000 నాటికి 101 బిలియన్లు, 2010 నాటికి 290 బిలియన్లు,  నరేంద్ర మోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడు దిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినప్పుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదేకాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణాభారం 58.6 లక్షల కోట్ల నుంచి 156.6 లక్షల కోట్లకు 174 శాతం పెరిగింది. కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వ్యాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్న దాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రూ. 164 లక్షల కోట్లు, విదేశీ అప్పు 5 లక్షల కోట్లు మొత్తం కలిపితే రూ.169 లక్షల కోట్లకు చేరనుంది.

ఐఎంఎఫ్‌ ఒక్క రుణం గురించి మాత్రమే చెప్పలేదు. 2023 నవంబర్‌ 20 నాటికి మనదేశ ఆర్థిక అంశాల గురించి రూపొందించిన 142 పేజీల నివేదికను డిసెంబర్‌ మూడవ వారంలో బహిర్గతం చేశారు. దానిలో గత పది సంవత్సరాల పాలన డొల్లతనం, వైఫల్యాల గురించి పేర్కొన్నారు. నివేదిక పదజాలంలో ఆ మాటలు లేకపోవచ్చు గానీ అచ్ఛేదిన్‌ పాలనలో అంకెలు చెబుతున్న అంశాల సారమిదే. వస్తు ఎగుమతులు 2019-20లో 320 బిలియన్‌ డాలర్లు ఉంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 296, 429 బిలియన్‌ డాలర్లుగా ఖరారు చేసిన లెక్కలు చెబుతున్నాయి. తరువాత 2022-23లో 456, వర్తమాన సంవత్సరంలో 436, వచ్చే ఏడాది 460 బిలియన్‌ డాలర్ల అంచనాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. ఎగుమతుల ప్రోత్సాహకం పేరుతో పక్కన పెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల వలన అదనంగా పెరిగిందేముంది? మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ? ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి) 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4 కాగా, 2021-22లో 13.3 శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78 శాతం ఉంది. వస్తువులు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నునిచి 21.4 శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5 శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.

దేశ ప్రతిష్ఠను, మార్కెట్లను పెంచేందుకు నరేంద్ర మోడీ విదేశాలు తిరిగినట్లు, విశ్వగురువుగా మారినట్లు ఎంతగా చెప్పుకున్నా మోడీ లావూ పొడుగూ చూసి ఎవరూ ఇబ్బడి ముబ్బడిగా మనదేశం నుండి దిగుమతులు చేసుకోవడం లేదు. యుపిఎ హయాంలో దేశ ఎగుమతులు జిడిపిలో వార్షిక సగటు 26.4 శాతం ఉంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత తొమ్మిది సంవత్సరాలలో సగటున 22.9 శాతం చొప్పున ఉన్నాయి. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే తాము చేసిన ఆర్థిక వృద్ధి కారణంగా జనంలో కొనుగోలు శక్తి పెరిగి దిగుమతులకు గిరాకీ ఏర్పడిరదంటారు బిజెపి నేతలు. ఒకవేళ అదే వాస్తవమైతే జిడిపిలో దిగుమతుల శాతం యుపిఎ హయాంలోనే ఎక్కువ ఉంది. అంటే బిజెపి కంటే మెరుగైన పాలన అందించినట్లుగా భావించాలి. విదేశీ వాణిజ్య లోటు యుపిఎ పాలనా కాలంలో సగటున ఏటా జిడిపిలో 2.26 శాతం ఉంది. 2004లో 0.3 శాతం నుంచి మధ్యలో 4.8 శాతానికి పెరిగి 2013 నాటికి 1.7 శాతానికి తగ్గింది. నరేంద్ర మోడీ ఏలుబడిలో ఎనిమిది సంవత్సరాలలో వార్షిక సగటు 1.45 శాతం ఉండగా మధ్యలో ఒక ఏడాది 0.9 శాతం మిగులు ఉంది. 2014లో 1.3 శాతంగా ఉన్న లోటు 2022లో 2.6 శాతానికి పెరిగింది. సూచిక పైకి చూస్తున్నది తప్ప కిందికి రావడం లేదు. మొత్తంగా చూసినప్పుడు వికసిత భారత్‌ కనుచూపులో కనిపించకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపిన మాదిరి చెబుతున్నారు. ఒకసారి చెప్పినదాన్ని మరొకసారి మాట్లాడకుండా కొత్త పాట అందుకుంటున్నారు, అదే బిజెపి, నరేంద్ర మోడీ ప్రత్యేకత!

ఒక ప్రముఖ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి జ్ఞాన్‌ (జివైఎఎన్‌, … జి- పేదలు, వై- యువత, ఏ- అన్నదాతలు, ఎన్‌-మహిళా శక్తి) అనే విజన్‌ ఉందని తెలిపారు. ఏ ప్రభుత్వానికైన విజన్‌ ఉండటం అవసరమే. దానిని కాదని ఎవరూ అనలేరు. కానీ, అదే సందర్భంలో గతంలో ఇదే ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతి కూడా చెప్పాలి. అది ఆయన బాధ్యత. ప్రజాస్వామ్య దేశంలో పాలకుల మనసులో మాటలు ప్రజలు వినడమే కాదు. ప్రజల  మనసులో మాటలు కూడా పాలకులు వినగలగాలి. కానీ, మన ప్రధానమంత్రి మోడీ గారిదంతా ‘వన్‌ వే ట్రాఫికే’ తప్ప ఎన్నడూ ప్రజా సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు. ప్రజల ప్రస్తావనలేని, వారికి జవాబులు దొరకని కార్యక్రమం ఏదైనా ఎంత గొప్పదైనా ప్రజల మన్నన పొందజాలదు. ఇలా చెప్పుకుంటూపోతే వీరి నేతృత్వంలో దేశంలో మతోన్మాదుల దురాగతాలకు అంతే లేదు. హిందూత్వ ఎజెండాతో రక్తపుటేరులు పారిస్తున్న మోడీ, నిత్యం కార్పొరేట్ల సేవలో తరించడమే తప్ప సామాన్యులకు చేసిందేమిటి? అందుకే ప్రజలారా…! తస్మాత్‌ జాగ్రత్త…!

తాజాగా 2022-23 సంవత్సర కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక అంశాలపై అధ్యయనం చేసి, ర్యాంకులు ప్రకటించారు. ‘ఆకలి సూచీ’లో 111వ స్థానంలో భారత్‌ నిలుచుట బాధాకరమైన విషయం. మూడు పూటలూ తిండిలేని వారు దేశంలో కోకొల్లలు. నేటి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో పౌరహక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ‘‘ఆమ్నెస్టీ’’ వంటి అంతర్జాతీయ సంస్థలు తరచూ పేర్కొంటున్నాయి. ‘పౌర స్వేచ్ఛ సూచీ’లో నేడు 150వ స్థానంలో ఉండటం గమనార్హం. కనీసం భారత రాజ్యాంగం ప్రకారం మన హక్కులను, సాధక బాధకాలు ప్రభుత్వాలకు చెప్పుకునే ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా నేటి ప్రభుత్వాలు ఉండటం శోచనీయం ‘లింగ సమానత్వం సూచీ’లో 135వ స్థానంలో, ‘ఆరోగ్యం, మనుగడ’ సూచీలో 146వ స్థానంలో ఉన్నాం. ఇక ప్రపంచంలో సుమారు ఐదు కోట్ల మంది బానిసత్వంలో మగ్గిపోతున్నారు అని సర్వేలు చెబుతుండగా, వీరిలో సుమారు 1.1 కోట్ల మంది భారతదేశంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి అంటే కంటికి కనపడే నాలుగు విమానాశ్రయాలు, ఆరు జాతీయ రహదారులు, వందేభారత్‌ రైళ్లు కాదని, ప్రతీ ఒక్కరికీ ‘కూడు, గుడ్డ, నివాసం, విద్య, వైద్యం’ అందించుటయే అని ఇకనైనా పాలకులు గ్రహించాలి. నేటికీ కనీసం తాగేందుకు మంచినీరులేని ఆవాసాలెన్నో ఉన్నాయి. అవి మన దారిద్య్రాన్ని పదేపదే గుర్తుచేస్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వారధిగా ఉన్న పత్రికలు కూడా నేడు సమాజంలో స్వేచ్ఛగా లేవు. ‘పత్రికా స్వేచ్ఛ’ సూచీలో 161వ స్థానంలో దేశం నిలిచింది.

విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని అధికారంలోకి వచ్చిన నేటి కేంద్ర పాలకులు, ఆ దిశగా ఏ చర్యలు తీసుకున్నారో దేశానికి తెలపాలి. అవినీతిని నిర్మూలించి స్వచ్ఛ పాలన అందిస్తామని చెప్పి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఎదురు ప్రశ్నించేవారిని, ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై తమ ఆధీనంలో ఉన్న ఈడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయడం జరుగుతుంది. అందుచేతనే ‘అవినీతి సూచీ’లో దేశం 85వ స్థానం, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ‘దయనీయ సూచీ’లో 103వ స్థానంలో ఉండుట గమనార్హం. సైన్యానికి కేటాయించే నిధుల్లోనూ కోత విధిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగ స్థానంలో కాంట్రాక్టు (ఫిక్స్‌ టైం) ఉద్యోగ నియామకాలు ‘అగ్నివీర్‌’ ప్రవేశపెట్టారు. సైన్యానికి అవసరమైన బూట్లు, వస్త్రాలు కూడా అందరికీ అందటం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుచేతనే 33వ స్థానంలో నిలిచింది.

దేశం అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు పెరగాలి. పరిశ్రమలు స్థాపించాలి. దీనికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను దశల వారీగా మూసేస్తూ, కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయటం యథేచ్ఛగా కొనసాగుతోంది. మానవ వికాసం, నైపుణ్యాలు అంశాలు ఆధారంగా ఇచ్చే ‘మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)’లో 132వ స్థానంలో మన భారత్‌ నిలిచింది. ఇదే అంశంలో దాదాపు మనదేశ జనాభా కలిగిన చైనా 79వ స్థానంలో ఉండటం గమనార్హం. పనిచేయగల సామర్థ్యం, ఉత్సాహం ఉన్న మన యువతికి, తగినన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల, ప్రస్తుతం 10 శాతం నిరుద్యోగ రేటుతో ‘ప్రపంచ నిరుద్యోగిత’ సూచీలో 117 వస్థానంలో నిలిచింది. అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఈ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో ఎంత మందికి రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చారో  వాస్తవాలు తెలియజేస్తే మంచిదే కదా!  భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద 3 లేదా 4వ ఆర్థిక వ్యవస్థగా, 500 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందుతుందని నోరూరించే మాటలు ఎంతవరకూ సాధ్యమో వేచి చూడాలి…!? ‘ఎగుమతుల సూచీ’లో బలహీనంగా ఉండటం వల్ల భారత్‌ 15వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశ జిడిపి 277 లక్షల కోట్ల రూపాయలని అంచనా. అయినా తలసరి జిడిపి రూ.6 లక్షలు దాటకపోవడంతో ‘తలసరి జిడిపి సూచీ’లో భారత్‌ 127వ స్థానంలో నిలిచింది. 142 కోట్ల పైబడి జనాభా ఉన్న నేటి భారతదేశంలో సుమారు 40 కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వాలు ఓట్లు దండుకునే క్రమంలో అనేక హామీలు గుప్పిస్తున్నారు తప్పా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే విధానాలకు పునాదులు వేయడం లేదు. అందరికీ విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వాల కృషి నామమాత్రంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృష్టి పాలకుల్లో కొరబడిరది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి సముచిత ప్రాధాన్యత లభించడం లేదు. ఫలితంగా భారత్‌ పేదరికం సూచీలో 79వ స్థానంలో నిలిచింది.

ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసినా చాలీచాలని వేతనాలతో బతుకు భారమైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తోడవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. విలాసాల మాట అటుంచి కనీస అవసరాలు సైతం తీర్చుకోలేని దుస్థితిలో మగ్గిపోతున్నారు. దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. కొవిడ్‌ నుండి దేశం పూర్తిగా కోలుకోలేదని చెప్పడానికి అనేక కోణాలు కన్పిస్తాయి. కొవిడ్‌ అనంతరం స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట పట్టింది. అయితే ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతోంది. కొద్ది మంది మాత్రం స్టాక్‌ మార్కెట్‌లోనూ, బాండ్లలోనూ పెట్టుబడి పెట్టి లాభపడ్డారు. ఇక రెండో కోణం… లిస్టెడ్‌ కంపెనీల లాభాలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. మరోకవైపు వేతనాలు తగ్గిపోయాయి. ఉద్యోగాల కల్పన కూడా పడిపోయింది. మూడో కోణం… సంఘటిత రంగం, ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు కొద్ది కాలం మినహా మంచి పనితీరు కనబరిచాయి. మరి అసంఘటిత రంగం? వరుస దెబ్బలతో సతమతమై పోయింది. ఒక దాని తర్వాత మరొకటిగా ప్రభుత్వం అవలంభించిన విధానపరమైన తప్పిదాలు ఆ రంగం పాలిట శాపంగా మారాయి.

పెద్దనోట్ల రద్దు, 2017 జూలైలో వస్తువులు-సేవలపై పన్ను యోచన, దేశవ్యాప్తంగా 600 కంటే తక్కువ కొవిడ్‌ కేసులు నమోదైన సమయంలో కేవలం నాలుగు గంటల సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ విధింపు వంటి తప్పుడు విధానపరమైన నిర్ణయాలతో అసంఘటిత రంగం కుదేలైంది. వరుస దెబ్బలతో ఈ రంగంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగాలు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అందుకే నిరుద్యోగం 50  సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. 2020లో దేశంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగంలో చేరారు. ఉత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగలేదు. అవి స్థిరంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే 2004-2014 మధ్య సంవత్సరానికి 8 శాతం వృద్ధి నమోదు చేసిన ఆర్థిక రంగం ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఆర్థిక వృద్ధి పెరగకపోగా అది వెనకపట్టు పట్టింది.

నిరుద్యోగం పెరగడంతో వినియోగ డిమాండ్‌ పడిపోయింది. ఆదాయాలు స్థిరంగా ఉండడంతో ఇటీవలి సంవత్సరాలలో జిడిపిలో కుటుంబ పొదుపు తగ్గిపోయింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గ్రహించాల్సి ఉంది. ఎగువ మధ్య తరగతి ప్రజలు, సంపన్నులు కొవిడ్‌ సమయంలో కూడబెట్టిన సొమ్మును విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జనాభాలో అత్యధికులు కొవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయి ఇప్పటికీ అష్టకష్టాలు పడుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, పెట్రోల్‌, డిజిల్‌, వంటగ్యాస్‌పై ప్రభుత్వ పన్నుల కారణంగా వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఈ స్థితిలో 2027 నాటికి భారం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తోందని డాంబికాలు పలుకుతోంది. అయితే ప్రభుత్వంతో సంబంధం లేని ఆర్థికవేత్తలు మాత్రం ఈ వాదనలో నిజం లేదంటున్నారు.

బిజెపి ప్రభుత్వం నిత్యం దేశభక్తి, భారతీయ సంస్కృతి అంటూ ఊదరగొడుతూ విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నది. ఫలితంగా ఆర్థిక అసమానతలు భయంకరమైన రీతిలో పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం 50 సంవత్సరాల గరిష్టానికి చేరింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దారిద్య్రం పైపైకి పోతున్నది. ప్రజాస్వామ్యం అడుక్కి పోయి నియంతృత్వం పెరిగిపోతోంది. ఆకలితో జనం విలవిలలాడుతుంటే అదానీ, అంబానీల ఆదాయాలు పెరిగిపోతున్నాయి. గత శీతాకాల సమావేశాల్లో అనూహ్యంగా 146 మంది ఎంపిలను సస్పెండ్‌ చేసి ప్రజావ్యతిరేక నియంతృత్వ 17 బిల్లులను పార్లమెంట్‌లో మెరుపువేగంతో ఆమోదం పొందడం విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటుకాలం దాపురించిందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు, మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ప్రభుత్వం అంటేనే మతతత్వ-కార్పొరేట్‌ రాజకీయాల కాక్‌టైల్‌ పాలన. అందువల్ల సంఫ్‌ు పరివార్‌ రాజకీయాలను కేవలం మతతత్వ కోణం నుండే గాకుండా ఆర్థిక కోణం నుండి కూడ అర్థం చేసుకోవాలి. ఈ నియంతృత్వ మనువాద ఫాసిస్టు పాలనను రెండు పార్శ్వాల్లో అంటే సైద్ధాంతికతంగా , రాజకీయంగా ఎదుర్కొవడం ద్వారా మాత్రమే తిప్పికొట్టగలం.

Leave a Reply