అర్ధరాత్రి అమాస
చీకట్లో ఓ జెండా దిగింది
ఓ జెండా ఎగిరింది

అలసిన మేనులు
ఆదమరచి గాఢ నిద్ర లో
అధికార మార్పిడి చిమ్మ చీకట్లో

ఏళ్ళు గడుస్తున్నా
ఆ అధికారం కిందికి దిగలేదు
కిందోడు పైకెక్క లేదు

ఊరిస్తూ ఉడికిస్తూ
ఫలాలు అందీ అందిస్తున్నట్లు
నటిస్తూ అధికారం అక్కడే బహు చక్కగా

రాచరికం పోలేదు
రాజ్యాంగం పుటల్లోనే
దోబూచులాడుతుంది
వర్గ వైషమ్యాల సృష్ఠి లో ఆరితేరి
గద్దె పై రాబందుల వికట్టహాసం

సమానత్వం ఓ పగటి కల
అది తీరని దాహం
పదిహేను వస్తుంది
వీధి వీధి న ఓ జెండా
రెప రెప లాడుతుంది
సాయంకాలం దించబడుతుంది

సూరీడు మౌనంగా కొండల మాటున దిగుతుండు
ఇంకెన్ని ఉదయాలు ఉదయిస్తే
నిజమైన స్వరాజ్యం ఉదయిస్తుందని మథన పడుతూ
చాల్లే పో పో అంటూ
చందమామ కసిరింది
వెన్నెల కురిపిస్తుందేమో చూద్దాం

Leave a Reply