1 
మల్లయోధులం

నాడు మా బలమైన భుజాలపై
ఈ దేశ మూడు రంగుల జెండాను 
గర్వంగా ఒలంపిక్స్ నుంచి 
ఢిల్లీ నడి వీధుల్లోకి మోసినప్పుడు 

మీ పొగడ్తలకు పొంగిపోయి
మేము గెలిచిన పతకాలను
చూసినప్పుడు మేము ఈ దేశంలో
భారతమాతలమైనాము

నేడు మాపై జరుగుతున్న
లైంగిక దాడులపై న్యాయపోరాటం చేస్తుంటే
మీలో రవ్వంతైనా చలనం కలగకపోవడం

కాషాయ నీడలు ఎంతలా కమ్ముకున్నాయో,
రాజకీయ మతోన్మాదం కాళ్ళ కింద 
నలుగుతున్న మీరే సాక్ష్యం

పార్లమెంటు ముందు పోలీసులు మమ్మల్ని
హింసాత్మకంగా ఈడ్చుకెళ్ళి జైల్లో బంధిస్తుంటే 
ఈ దేశ రక్షణ, గౌరవం ఎప్పుడో
బంధించబడ్డాయని మాలో ధైర్యం నిప్పంత నిబ్బరాన్ని రగుల్చుకుంది 

మా కన్నీళ్ళను కూడా
కాషాయంగా మార్చే కుట్ర 
రాబోయే యువ క్రీడాకారిణులకు 
హెచ్చరికను సూచిస్తుంది 

మహిళలపై మళ్ళీమళ్ళీ జరుగుతున్న 
ప్రతి మానభంగపు హత్యలు
భారతమాతను 
అత్యాచారానికి గురిచేస్తూ 
వేశ్యగా మారుస్తున్నాయి

తరతరాలుగా మీరు మోసుకొస్తున్న 
ఫాసిస్ట్ పురుషాధిక్య భావజాలాన్ని 
కూకటి వేళ్ళతో పెకలించడానికి
నిండు జాతి గౌరవాన్ని 
మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 
మేము ఎన్ని పోరాటాలైన చేస్తాము

గుర్తుంచుకోండి
మా వెనుక ఎవరు నిలబడకపోయినా 
మీ వీపులపై పురుషాధిక్య భావజాలాన్ని 
మీరు మోస్తున్నా
మా పోరాటాలను 
మీరు అడ్డుకున్నా
ఇక్కడ భయపడేవారు 
ఎవరూ లేరు
శిక్షార్హులకు శిక్ష పడకుంటే 
వెనుదిరిగిపోయే 
మధ్యములం కాదు మల్లయోధులం

2 
జీవితం

చూసి చూసి కండ్లు కాయలు కట్టడం లేదా?
ఎంతకాలమని ఎదురు చూస్తావ్?
రానివానికోసం! రాలేనివాడికోసం!!

ఒకవేళ ఇప్పుడు వాడు వచ్చినా
మళ్లీ మళ్లీ ఎంతకాలమని వస్తాడు
ఎంతకాలమని ఆదుకుంటాడు
గుండెలో గుప్పెడు ధైర్యాన్ని
నువ్వే చొప్పించి చూడు
శ్వాస విడిచే నిశ్శబ్ధంలో కూడా
తెగువ తన్నుకు వస్తుంది
మెదడును సానబెట్టే మూలసూత్రం
నీ నరనరాల్లో రక్తమును తాకుతాది

ఇప్పుడు
నీ ఎదురుగా ఉన్నది
నీ జీవితంలో సమస్య అయినా సరే
మానవ రూపంలో ఉన్న శత్రువైనా సరే
నిలబడి కలబడి పోరాడితేనే కదా
నీ శక్తి ఏంటో నీకు తెలిసేది
ఆత్మవిశ్వాసపు అంచుల మీద
నిన్ను వెలిగించుకునే సమయమిది
కాలాన్ని ఎదిరించే తొలి ప్రయత్నమిది
ఎండిన మనసుపై వడగాలులు మసలే
కొత్త గళానికి పదమై పుట్టే ధ్యేయమిది

ఇంతకాలం 
పిల్లి పిల్లలతో కలబడింది చాలు
ఇక పులులతో పోరాటం చెయ్
బ్రతికితే, వీరుడివి అవుతావ్
మరణిస్తే, వీరమరణం పొందుతావ్ 

ఈ పోరాటంలో గెలుపు, ఓటములు ఉండవ్
ఉన్నదల్లా జీవితం మాత్రమే
నీ జీవితం మాత్రమే.

3
ప్రజాస్వామ్యదేశమా! పోరాటం చెయ్

పచ్చి నెత్తుటితో నగ్నంగా భారతమాతను
జుట్టు పట్టి నడిరోడ్లపై నడిపిస్తుంటే
సిగ్గులేని ప్రజాస్వామ్యదేశమా! సిగ్గుపడు

నిజానికి 
సినిమా హీరోల పైన 
రాజకీయ నాయకుల గోచీల కింద 
మీడియా ఎప్పుడో కబ్జాకి గురైంది
ఇప్పుడు వాళ్ళ కళ్ళకు
ఎలాంటి సంఘటనలు కనిపిస్తాయి

దేశంలో మత రాజకీయాలతో
కుల ఆధిపత్యాలతో
ఇంకా నీచపు కంపు కొడుతూనే ఉంది
మొన్నొక్కడు ముఖంపై ఉచ్చ పోసి పోతాడు
నిన్నొక్కడు గొడ్డును బాదినట్టు బాది 
నోటిలో ఉచ్చ పోసి పోతాడు
ఈరోజు ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగిస్తున్నారు
మరి రేపు.?

ఎవడ్రా స్వాతంత్ర్యం వచ్చిందన్నది
అది తెల్లవాడి నుండి 
నల్ల ఆధిపత్య కులాలకు 
మాత్రమే సంక్రమించింది

ఓ నా ప్రియమైన దేశ ప్రజలారా..
ఇంకా ఎన్నాళ్ళు? ఎన్నేళ్లు??
మౌనంగా ఉంటారు
ఎక్కడో జరిగిందని
చూసి ఊరుకుంటే ఎలా?
ఈరోజు ఎక్కడో...
రేపు మీ ఇంట్లో ...!
అప్పుడు ఏం చేస్తావ్ ?

రా పిడికిలెత్తి న్యాయం కోసం పోరాడు
వ్యవస్థల కండ్లలో
అహంకారాన్ని తరిమి చూడు 
ఓ జెండా రెపరెపలాడుతూ 
నీకోసం ఎదురు చూస్తుంది

అణచి వేయబడ్డ వారి కోసం 
అవమానించబడ్డ వారి కోసం 
చెర్చబడిన చెల్లెల్ల కోసం 
న్యాయం కోసం పోరాడే 
మార్గాన్ని ఎన్నుకొని
మరో ఫూలన్ దేవీలా ఉద్యమించు

చేతకాని ప్రభుత్వాన్ని నమ్ముకొని 
ఆత్మగౌరవాన్ని నగ్నంగా బలికానివ్వకు 
ఈ పోరాటం 
నీ కోసం..ఆడబిడ్డల కోసం..!

మానవత్వపు అడుగు జాడలకై
ధైర్యాన్నే పిడికిలి చేసి
వాళ్ల మస్తిష్కంలో నిండిన మతాన్ని,
కులాధిపత్యాలను
వాళ్ళ ఒళ్ళంతా నిండిన కామ క్రూరత్వాన్ని
విరిచి పారేయడానికి
మరో నూతన స్వేచ్ఛా ప్రపంచాన్ని 
ఆహ్వానించడానికి 
పోరాటం చెయ్

4

యుద్ధనౌక

నీకు గుర్తుందా కామ్రేడ్!
అదే గెరిల్లా లేఖలు
నువ్వు రాసిన గెరిల్లా లేఖలు
ఎన్నిసార్లు చదివినా తనివితీరదు ఎందుకో..!

పసిపాపలా నువ్వు ఎగరేసి
ఎత్తుకొని ముద్దాడిన ఆ ఎర్రగుడ్డను 
ఇప్పుడు! ఎవరు ఆడిస్తారు ఎవరు పాడిస్తారు?
చిన్నబోయిన ఆ కర్రకి గుడ్డపేలికలు కట్టి 
కర్ర సాము ఎవరు చేస్తారు కామ్రేడ్?

మీ పాట
అణిచివేయబడ్డ వారికి
అవమానింపబడ్డ వారికి
తిరుగుబాటుతనాన్ని నేర్పింది
మీ పాట ప్రజలకు చైతన్యాన్ని నేర్పింది
మీ పాట పెత్తందారుల గుండెల్లో తూటా అయింది

పొద్దుతిరుగుడు పువ్వును
ముద్దాడిన ఎర్ర సూర్యుడివి 
తిరుగుబాటుతనాన్ని గద్దర్ అని 
నీ పేరుగా మార్చుకున్న ఉద్యమానివి 
నీ వెన్నులో తూటను సైతం 
భద్రంగా దాచుకున్న యుద్ధనౌకవి కామ్రేడ్ 

ఇప్పుడు 
కన్నీటి సంద్రం అలలు అలలుగా ప్రవహిస్తుంది
అందులో ఆ యుద్ధనౌక
తన జ్ఞాపకాలను సజీవం చేసి
తన పాటలను ప్రజల నాలుకలపై తడుపుతూ
తిరిగిరాని గమ్యానికి ప్రయాణమై ప్రయాణిస్తుంది

సూర్యుడు అస్తమిస్తే
తిరుగుబాటుతనం ఆగిందని కాదు
మరో ఉదయాన మరో ఉద్యమం చిగురిస్తుందని....

Leave a Reply