కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి దయనీయ స్థితిలో బతుకు పోరాటం సాగిస్తున్న జనానికి భవిష్యత్‌పై భరోసా కల్పించే రాజకీయ నాయకులే కరువయ్యారు.

క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ :

కొవిడ్ రెండవ దశ విజృంభణతో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షలకు మించి ఎగబాకుతున్న దేశంలో, భయానక కొవిడ్ వైరస్ దాటికి భిన్న రంగాలు చిన్నాభిన్నమై కునరిల్లుతున్నాయి. వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాలూ చతికిలపడి అసంఖ్యాక కుటుంబాలు తీవ్ర‌ దురవస్థల పాలవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు వివిధ వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారెందరో గత్యంతరం లేక చిన్నా చితకా పనుల్లో కుదురుకుంటున్న ఉదంతాలు, ఆకలి మంటల్ని ప్రజ్వ‌రిల్ల చేస్తున్న‌ మహా సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. దాదాపు ఏడాది క్రితం దేశంలో తీవ్ర రూపం దాల్చిన కరోనా వైరస్ మళ్లీ ఇప్పుడు అదే దారి పట్టడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితిపై వ్యాపార, వాణిజ్యవేత్తలు, ఆర్థికవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందనీ, అయితే మోడీ ప్రభుత్వం మాత్రం వీటి నుంచి పాఠాలు నేర్వడంలేదని అన్నారు. “ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యలు తప్పనిసరి” సెకండ్ వేవ్ కొత్త ఉప్పెనతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నదనీ, అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి తగిన రీతిలో సన్నాహాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

గత ఏడాది మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్  పెట్టాల్సిన పరిస్థితులు లేవు. ఏకపక్షంగా అనాలోచితంగా మోడీ సర్కార్ 2020, మార్చిలో లాక్డౌన్ విధించి.. దేశ ప్రజలందర్నీ కష్టాల్లోకి నెట్టింది. వైరస్ ఉధృతి అంతగా లేకపోయినా.. కఠిన నిర్ణయాలతో హడలెత్తించింది. ఫలితం… ఉపాధికి దూరమై పేదలు, సామాన్యులు,   మధ్యతరగతి రోడ్డునపడ్డారు. సరిగ్గా మళ్లీ ఏడాది తిరిగేసరికి… అవే పరిస్థితులు దేశ ప్రజల్ని వెంటాడుతున్నాయి. వైరస్ రెండో వేవ్తో దేశంలో  మళ్లీ లాక్ డౌన్  పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ప్రయివేటు రంగాలన్నీ కుదేలయ్యాయి. గత ఏడాదికన్నా తీవ్రస్థాయిలో కొవిడ్-19 వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యకాలాపాలన్నీ దాదాపు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. వర్తక వాణిజ్య కార్యకలాపాలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనధికారిక లాక్ డౌన్‌ను  విధిస్తున్నాయి. ప్రజల కదలికలపై స్థానికంగా అడ్డంకులు విధిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జిడిపిని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక రికవరీ చాలావరకు దెబ్బతిన్నదని, ఇప్పటికే 10 శాతం వృద్ధి  తగ్గిందని నిపుణులు అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి 13.5 శాతం వరకు క్షీణిస్తుందని నొమురా(గ్లోబల్ ఫైనాన్నియల్ సర్వీసెస్), 18 శాతం క్షీణిస్తుందని జేపీ మోర్గాన్, 10 శాతం క్షీణిస్తుందని యూబీఎస్, 11.5 శాతం క్షీణిస్తుందని సిటీ బ్యాంక్ అంచనాలు విడుదల చేశాయి. నిజానికి 2019 డిసెంబర్లో కరోనా దేశంలోకి ప్రవేశించేనాటికే, మనదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మనకు విదితమే. గత ఆరేండ్లుగా కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశాయని, ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయామని కూడ వైరస్ రాకముందు, 2018లో జిడిపి వృద్ధి 6.8 శాతం, 2019లో 6.5 శాతం, 2020లో 4 శాతం క్షీణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ ప్రభావం బయటపడ్డాక… 2020-21లో 8 శాతం వరకూ క్షీణించింది. ఇక వైరస్ వ్యాప్తిపై గత నెల రోజులుగా వస్తున్న వార్తలు దేశ ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.

వర్తక, వాణిజ్య కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయాయని “నోమురా ఇండియా బిజినెస్ రిజంప్పన్ ఇండెక్స్” తెలిపింది. గూగుల్ మొబిలిటీ, ఆపీల్స్ డ్రైవింగ్ మొబిలిటీ, పవర్ డిమాండ్ ఇన్ ఇండియా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ (కార్మిక శక్తిలో కార్మికుల ప్రాతినిధ్యాన్ని తెలుపుతుంది). వీటి ఆధారంగా ‘నోమురా’ నివేదిక తయారుచేసింది. వైరస్ కేసులు పెరగటం ప్రభుత్వ, ప్రయివేటు కార్యకలాపాల్ని తగ్గించిందని నివేదిక తెలిపింది. నోమురా బిజినెస్ ఇండెక్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 99.3 ఉంటే, ఏప్రిల్ 11 నాటికి 90.4కు పడిపోయింది. ఈ క్రమంలోనే భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తుందని చెప్పలేమని చాలామంది ఆర్థికవేత్తలు తమ అంచనాలను సవరించారు. రాష్ట్రాల వారీగా ఆంక్షలు పెరిగే కొద్దీ వీటిల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బార్మెస్ బ్యాంక్ పిఎల్సి తన అంచనాలను సవరిస్తూ 10 శాతం తగ్గించింది. భారత్లో పెరుగుతున్న కేసులు, మందగించినవ్యాక్సినేషన్, ఆక్సిజన్, మందుల కొరత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది.


‘పేదలుగా మారుతున్న మధ్యతరగతి :

మనదేశంలో రోజుకు కనీసం 10 డాలర్ల (దాదాపు రూ. 750) వరకు సంపాదించే వాళ్లు దిగువ మధ్య తరగతి పరిధిలోకి వస్తారు. ఎకానమీకి వీళ్లు పెట్టే ఖర్చు ఎంతో ముఖ్యం. మనదేశంలో కరోనాకు ముందు 9.9 కోట్ల మంది మిడిల్ క్లాస్‌లో  ఉంటే కరోనా తరువాత వీరి సంఖ్య 6.6 కోట్లకు తగ్గింది. కరోనా ఫస్ట్ వేవ్ వల్ల దాదాపు 3.2 కోట్ల మంది దిగువ మధ్యతరగతిపేదలుగా మారారు. సెకండ్ వేవ్‌తో చాలా మంది ఆదాయాలు, ఖర్చులు విపరీతంగా తగ్గాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సెకండ్వేవ్ కూడ కోట్లాది మధ్యతరగతి వారిని పేదరికంలోకి నెట్టేస్తుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ హెచ్చరించింది. ఉపాధి పోవడం, వేతనాలు తగ్గడం, వ్యాపారాల్లో నష్టాలు రావడం ఇందుకు కారణాలని అది వివరించింది. ఆదాయపరమైన తేడాలు, నిరుద్యోగం, ఆదాయాలు, ఖర్చుల తగ్గుదల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ది ఇండియన్ఎ కానమీ (సిఎమ్ఐఇ) సిఈఓ మహేశ్ వ్యాస్ విమర్శించారు. ముఖ్యంగా సెమీస్మిల్డ్ వాళ్లకు పనులు దొరకడం చాలా కష్టంగామారిందని అన్నారు. నిరుద్యోగాన్ని తగ్గించకుంటే మరోసారి లక్షల మంది పేదలుగా మారతారని ఆయన స్పష్టం చేశారు. ఏ రకంగా చూసినా ప్రస్తుత పరిస్థితుల వల్ల మధ్యతరగతి కుటుంబాలు నష్టపోవడం తప్పదని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్  ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. ఎకానమీ దెబ్బతింటుందని, అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు.కోల్పోతున్న ఉద్యోగాలు | నిరుటి లాక్ డౌన్‌తో  లావాదేవీలు చతికిలపడి, “ఆత్మ నిర్భర్ ప్యాకేజీపై పెట్టుకున్న గంపెడాశలు కొల్లబోయిన స్థితిలో 6 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎమ్ఎస్ఎమ్ఈ)లు మూడోవంతు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని ఆరోగ్యమౌలిక సదుపాయాలు కరోనా కేసుల వరదను తట్టుకోలేక పోవడంతో కర్ఫ్యూ, లాక్ డౌన్‌, ఇంకా ఇతర ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలనా యంత్రాంగాలు విధించాల్సి వస్తోంది. “కరోనా కేసులు, మరణాల సంఖ్య చుట్టూ అనిశ్చితి పెరుగుతోంది” అని ఆర్థికవేత్త రాహుల్ బజోరియా ఒక పరిశోధన నోట్లో రాశారు. “నెమ్మదిగా టీకాలు వేయడం కూడా భారతదేశ పునరుద్ధ‌రణ అవకాశాలను దెబ్బతీస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు తెగ్లోసుకుపోతున్న కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో7.13 శాతానికి, పట్టణాల్లో 9.78 శాతానికి నిరుద్యోగిత పెచ్చరిల్లినట్లు సిఎమ్ఐఈ(భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం) గణాంక నివేదిక స్పష్టీకరిస్తోంది.

గతేడాది ఫిబ్రవరి నాటికి దొరికిన పనేదో చేస్తూ బతుకుబండి నెట్టుకొచ్చిన నిత్య (శ్రామికుల్లో మూడొంతుల మంది కరోనా రెండవ వేవ్లో లాక్ డౌన్‌ విధింపుతో నడివీధి పాలయ్యారు. అందులో కొంతమంది తక్కువ వేతనాలకు తిరిగి కుదురుకున్నప్పటికీ, మరెందరో పస్తులతో గడిపే దురవస్థలో కుమిలిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా… పురుషులకంటే ఎక్కువ.. మహిళలు ఉపాధి అవకాశాలు కోల్పోయారు. లఘు పరిశ్రమలు, చిరు వ్యాపారాలు కుదేలై ఆ జాబితా ఇంకా విస్తరిస్తూ పోతోంది. నిర్మాణ, రవాణారంగాలు కూడ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఉన్నంతలో అన్నార్తులకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే నిమిత్తం పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం ప్రారంభించాలన్న సూచనల్ని మొన్నటి కేంద్ర బడ్జెట్లో ఏమాత్రం పట్టించుకోలేదు.

కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో నిరుద్యోగాన్ని విపరీతంగా పెంచుతోంది. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతం పెరిగి నాలుగు నెలల అత్యధికానికి చేరింది. భవిష్యత్తులో లాక్ డౌన్‌, ఆంక్షలు తీవ్రంగా మండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. మార్చిలో నిరుద్యోగ రేటు 6.5 శాతం ఉండగా, ఏప్రిల్లో అది 7.97 శాతానికి చేరింది. కిందటి నెలలోనే దాదాపు 75 లక్షల ఉద్యోగాలు పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) స సంస్థ పేర్కొంది. “ఉద్యోగాల లభ్యతలో కొరతనెలకొంది. ఇది లాక్ డౌన్  వల్ల కావచ్చు” అని సిఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ పేర్కొన్నారు. “వైరస్ ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది. వైద్య ఆరోగ్య సేవల విషయంలో ఇత్తిడికి గురవుతున్నాం. వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో మేలో కూడా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది” అని వివరించారు.
రెండో వేవ్ ప్రభావం ఆర్థిక రంగాన్ని తాకిందని అనేక వైపుల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. రైలు, రోడ్డు రవాణా నామమాత్రంగా నడుస్తోంది. మనదేశంలో పారిశ్రామిక సరుకుల్లో 80 శాతం రవాణా రైళ్ల ద్వారా జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తు డిమాండ్కు రైల్వే సరుకు రవాణా ప్రధాన సూచికగా తీసుకుంటారు. భారతీయ రైల్వే అధికారిక గణాంకాల ప్రకారం, రైల్వే సరుకు రవాణా ఏప్రిల్లో 11 శాతం పడిపోయింది. అలాగే రోడ్డు మార్గంలోనూ సరుకు రవాణా గణనీయంగా పడిపోయింది.మార్చిలో రోజువారీ సగటు ఈ-వే బిల్లులు 23 లక్షలుకాగా, ఏప్రిల్లో అది 20 లక్షలకు తగ్గింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వల్లే వలస కార్మికులు అక్కడి నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. శ్రమశక్తి రేటు ఏప్రిల్లో 40 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. సమస్య ఏమిటంటే, భారత ఆర్థిక వ్యవస్థ వారికి తగిన ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్లనే ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి అని సిఎమ్ఐఇ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ పేర్కొన్నారు.

పెరుగుతున్న పేదరికం :

కరోనా తొలిదశ గాయాలు మానకముందే రెండోదశ ముందుకొచ్చి అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. తొలిదశ కరోనా దాదాపు 28 కోట్ల మందిని దరిద్ర్యరేఖకు దిగువకు తీసుకొచ్చింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్టు 2021 ప్రకారం కరోనా మార్చి 2020 నుంచి ఏప్రియల్ 2021 కాలంలో… గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మంది. బిపిఎల్(దారిద్య రేఖకు దిగువ)కు వచ్చేశారు. తక్కువ ఆదాయం ప్రాతిపదికన ఈ లెక్క వేయడం జరిగింది. జాతీయ కనీస వేతనానికి దిగువన ఉన్న వ్యక్తుల సంఖ్య కరోనా మహమ్మారి సమయంలో 23 కోట్ల మందికి పెరిగింది. అనూప్ సత్బతి కమిటీసిఫార్సు మేరకు… కనీసం రోజుకు రూ.375 కూడా సంపాదించని వారందరూ… బిపిఎల్ కింద ఉన్నట్లు పరిగణించారు.

నెలసరి వేతన కార్మికుల్లో సగం మంది.. దినసరి వేతన కార్మికులు పనిలోకి మారినట్టు అజీం (ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంలో స్పష్టమైంది. అధికారిక వేతన కార్మికుల్లో… స్వయం ఉపాధి(30 శాతం), సాధారణ వేతనం (10 శాతం), లేదా అనధికారిక వేతన (9 శాతం) కార్మికులుగా ఉన్న వీరు.. 2019 నుంచి 2020 చివరి వరకు.. అనధికారిక పనిలోకి మారిపోయినట్టు అధ్యయనంలో తేలింది. వారి ఆదాయంలో భారీ క్షీణత నమోదైంది. ఏప్రిల్, మేలో 20 శాతం కుటుంబాలు.. తమ కనీస ఆదాయాన్ని కోల్పోయాయి. ఇక ధనిక కుటుంబాలు… కొవిడ్‌కు ముందు ఆదాయంతో పోలిస్తే.. నాలుగింట ఒకవంతు కంటే తక్కువ.. నష్టాలను చవిచూశాయని నివేదిక ద్వారా స్పష్టమైంది. దాదాపు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ..పేద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి ఎంతైనా ఉందని నివేదిక అభిప్రాయపడింది.

అధికారిక జీతంతో కూడిన శ్రామిక శక్తిలో సగం మంది.. అనధికారిక పనిలోకి ఎలా వెళ్లిపోయారు…? లాక్ డౌన్  కాలంలో పేద కుటుంబాలు అధిక ఆదాయ నష్టాలను ఎలా ఎదుర్శొన్నారు..? అనేది మరింత స్పష్టంగా తెలియజేసింది.లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయి ఆదాయం పొందడం కోల్పోయారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధిస్తే. మరింత ఆదాయం కోల్పోయి… దారిద్య్ర రేఖకు దిగువకు  మరికొంత మంది వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్ ఫలితంగా, ఆర్థికంగా ప్రభావితమైన వర్గాలను ఆదుకునేందుకు, కేంద్రం రూ.8 లక్షల కోట్లు విలువ చేసే ప్యాకేజీని రూపొందించాల్సిన అవసరం ఉందని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బృందం అభిప్రాయ పడింది. అజీం ప్రేమ్జీ ఫొందేషన్, కన్ద్యూమర్ పిరమిడ్స్ హౌస్హోల్డ్ సర్వేతో పాటు ఇతర సామాజిక సంస్థల ఇన్పుట్ ఆధారంగా తుది నివేదికను రూపొందించడం జరిగింది. మూడు నెలల పాటు రూ.5000 నగదు బదిలీని అధ్యయన బృందం సిఫార్సు చేసింది. ఉపాధి హామీ పథకం కింద 150రోజుల పనిదినాలు కల్పించాలి. కనీస కూలిని సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీని కోసం ప్రభుత్వం కనీసం రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేయాలని కోరింది.

ముగింపు :


కరోనా వ్యాధి, ఆర్థిక సంక్షోభం… కారణాలేమైనా దేశంలో శ్రామిక ప్రజల బతుకు ఆగమైంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కోట్లాదిమంది ఉపాధికి దూరమై గిలగిల కొట్టుకుంటున్నారు. ఈ దుస్థితి నుండి ప్రజలను కాపడడానికి ఆదాయపన్ను చెల్లింపు పరిధిలోకి రాని కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతుల కల్చనపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడం ద్వారా కోట్లాది మందికి ఉపాధి కల్పించవచ్చునని పలువురు ఆర్థిక, సామాజిక నిపుణులు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఇకనైనా తన విధానాలను ప్రజానుకూలంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసంఖ్యాకుల ఆకలిమంటలు చల్లారాలన్నాా జీవన దీపాలు మలిగిపోరాదన్నా శాయశక్తులా నిరుద్యోగితను నియంత్రించి, ఉపాధి అవకాశాలు విస్తరింపజేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం లక్ష్యంగా సర్మారీ కార్యాచరణ పదును తేలాలి! 

Leave a Reply