ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇది ప్రజలకు అవసరమై చట్టమని,ప్రజల కోసమే తీసుకువస్తున్నట్లు బీజేపీ చెబుతోంది. ఉమ్మడి హిందువులకే ఒక చట్టం లేదు.. ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎందుకు? అనే ప్రశ్నకు బీజెపి వద్ద సమాధానం లేదు. అది మా ఎజండా అంశం.. ప్రజలందరికి అవసరం.. అందుకే తీసుకు వస్తున్నాం.. అంటోంది. ఏ లాభం లేనిదీ ఏ రాజకీయ పార్టీ ఏ చట్టాన్నీ తేవాలనుకోదు. ఇది ఎవరేమన్నా ఆర్ఎస్ఎస్ రహస్య ఎజండా! దాన్ని అమలు చేయటానికి బిజేపి ఎన్ని ఎత్తులు, పొత్తులు, కుట్రలకైనా వెనుకాడదు.
సూటిగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టం తీసుకు రాకుంటే జరిగే నష్టం ఏమీ లేదు. నూటికి 80% శాతంగా ఉన్న బహుజనులకు, ఆదివాసులకు, ముస్లింలకు మాత్రం నష్టమే! ఇప్పటికే బిజేపి తన మత ఏజండా ద్వారా దేశ ప్రజలు మతాలవారిగా విడగొడుతున్నది. నిన్న మొన్నటి వరకు అలాయి – బలాయిగా ఉన్న ప్రజలు నేడు ఒకరినొకరు అనుమానంతో చూసుకుంటున్నారు. ముస్లింలు, క్రైస్తవులు తమపై జరిగే దాడులను దేవుని ప్రార్ధనల ద్వారా ఆపివేయమని కోరుకుంటున్నారు.
ఇస్లాం, క్రైసవం ఇతర దేశాల నుండి దిగుమతి అయన మతాలని, ఇది హిందూదేశమని, ఇక్కడ ఏ మతస్తులైనా తొలుత హిందువులని సంఫ్‌ుపరివార్ బుకాయిస్తోంది. దీని కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారు. చరిత్ర తెలియని వారు ఇది నిజమేనేమో అనుకోవచ్చు. ఈ దేశంలో అర్యులు అడుగిడినప్పటి నుంచి మంత్ర తంత్రాల ద్వారా, యజ్ఞాల ద్వారా ఆక్రమించుకుంటూ వచ్చింది. సనాతన ధర్మం లేదా ఆర్యధర్మం ఇతర మతాలలాగే మన దేశంలోకి బైటి నుంచి వచ్చింది. ఈ సత్యం అందరికీ తెలియకుండా ఉండేందుకు బిజేపి, దాని అనుబంధ సంస్థలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి. పైగా చరిత్రకారులను వలసవాదుల చరిత్రపై ఆధారపడినవారని దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే ఘర్ వాపసీ వంటి పిలుపులనిస్తున్నారు. వీరు ప్రధానంగా మత విశ్వాసాల ఆధారంగా చరిత్రను మార్చాలని చూస్తున్నారు. ఇందులో భాగమే క్రైస్తవం, ఇస్లాం మతాల్లోకి వెళ్ళిన వారు తిరిగి హిందు మతంలోకి రావాలని పిలుపు ఇస్తున్నారు. దీని ప్రకారం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లిపోవాలి.
దీని వెనుక సంఫ్‌ుపరివార్ సామాజిక సాంస్కృతిక పథకం ఉంది. దాని నుంచే ఉమ్మడి పౌర స్మృతి. భారతదేశంలో మూలవాసులు ప్రకృతి ఆరాధికులుగా అనేక రకాల విశ్వాసాలతో జీవిస్తున్నారు. నిచ్చన మెట్ల కుల వ్యవస్థలో అనేక రకాల సాంఘిక జీవన పద్ధతులు అనుసరిస్తున్నారు. ముస్లింలకు తమదైన సాంస్కృతిక ప్రత్యేకతలు ఉన్నాయి. వివాహం, విడాకులు, ఆస్తుల పంపకాలు, దత్తత, వారసత్వపు హక్కులు, భరణం వంటివి మతాలతో సంబంధం లేకుండా ‘‘ఉమ్మడి పౌరసత్వ చట్టం’’ తీసుకురావాలనుకోవడం ఇండియాలో సాధ్యమేనా? ఈ చట్టానికి తగిన ముసాయిదా ఇవ్వకుండా 140 కోట్ల ప్రజానీకాన్ని అభిప్రాయాలు తెలపమనటంలో నిజాయితీ ఉందా? ఇప్పుడు క్రిమినల్ చట్టాలు ఉమ్మడిగా ఉన్నాయి. దీన్ని సివిల్ చట్టాలకు వర్తింప చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది.
భారత్దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశం భిన్న జాతులు, బిన్న సంస్కృతుల కలయిక. ఇది ముస్లింలా లోఉన్న తలాక్నీ, వాటాల పంపిణిలో ఉన్న తేడాను అడ్డం పెట్టుకుని ఈ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వస్తున్నట్లు ఫోజు పెడుతోంది. దీనితో మెజారిటీ హిందూ ఓట్లతో తిరిగి గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీ అధికారదాహానికి దేశంలోని ప్రజల మధ్య నెలకొని ఉన్న వాతావరణం విచ్ఛిన్నం అవుతుంది. భిన్న జాతులకు, సంస్కృతులకు తీరని అవరోధం కలుగుతుంది. మనదేశంలో ఆదివాసులకు, మూలవాసులకు వారి వారి ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. షెడ్యూల్ ఏరియాలోని ప్రజల సంస్కృతి భిన్నమైనది. వారి పద్ధతుల ప్రకారం వివాహాలు, విడాకులు, భరణం, దత్తత, వారసత్యం సులభంగా ఉంటాయి. వీటన్నంటిని తమ ఆవాసాల మధ్య తేెల్చుకుంటారు. ఇప్పటి వరకు వాటిని మన రాజ్యాంగం, చట్టాలు గుర్తిస్తున్నాయి. ఆదివాసులు అనుభవిస్తున్న భూములకు 90% శాతం ప్రభుత్వ గుర్తింపులేదు అందుకు తగిన గణాంకాలు లేవు. ఉమ్మడిగా దేశంలోని భూమి వారి స్వాధీనంలోనే ఉంది. ఇటు వంటి వారందరి భూమి హక్కు రేపు ప్రశ్నర్ధకం అవుతుంది. ఉమ్మడి పౌరసత్వ చట్టం వస్తే వారి అనుభవం నుండి భూమి చేజారిపోతుంది. బిజెపి వారికి ముద్దుగా ‘వనవాసి’గా పేరు పెట్టి , వారూ హిందువులనే అంటోంది. మరి దేశంలో సుమారు 9% శాతంగా ఉన్న వాళ్ళ ఇప్పటి వరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం లేకుండా వున్నారు. కనీసం విద్యా, ఆరోగ్యం అందని స్థితిలో ఉన్నారు. సొంత ఆస్తి కలిగిన వాళ్ళను వెళ్ళ మీద లెక్కించవచ్చు. ఇంత వెనుక బడిన జాతులకు ఢల్లీి, గోవా నివశించే ఇతర పౌరులకు ఒక రకమైన చట్టం తీసుకు రావటం న్యాయ సమ్మతమా? అసమ సమాజంలో సమాన చట్టాలు అమలు సాధ్యమా! తద్వారా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం మతపరమైనది. ముస్లిం, క్రైసవ వివాహలు ఒడంబడికలు. అదే విధంగా ముస్లిం మతాచారాల ప్రకారం పురుషుడికి -2 వాటాలు, స్త్రీ-కి 1 వాట ఆస్తిలో కలిగి ఉంటారు. స్త్రీ వాటా తన ఇష్టానుసారం తన వాటాను అనుభవించే హక్కు కలిగి ఉంటుంది. పురుషుడు మాత్రం తనకు వచ్చిన వాటాలో కుటుంబాన్ని పరిరక్షించాలి. అందర్నీ చూడాలి. బాధ్యత పడాలి. ఇందులోని న్యాయ సూత్రాన్ని గమనించని వారు కేవలం వాటాల మధ్య తేడాలను మాత్రమే చూస్తారు. ముస్లిం యువకుడు వివాహ సమయంలో మొదటి భర్త చనిపోయిన స్త్రీ, భర్త వదలి వేసిన స్త్రీ, తదుపరి కన్య స్త్రీని ప్రాధాన్యత క్రమంలో వివాహం చేసుకోవాలి. ఆ విధంగా నలుగుర్ని వివాహం చేసుకోవచ్చు. ఇందులోని మంచి ఇతర మతస్తులు గమనించటం లేదు. కేవలం వారు నలుగుర్ని వివాహం చేసుకోమని ఉందని విమర్శిస్తాం. ఇందులో మంచిని మంచిగాను, చెడును చెడుగాను చూడాలి. వీటిలో ఉన్న లోపాలను ఆయా మతాల ప్రజలకు అర్థం చేయించాలి. మన భారత రాజ్యాంగ్యాన్ని 244(1) ఆర్టికల్ ప్రకారం.. 5వ షెడ్యూలలో షెడ్యూలు ప్రాంతాలు, తెగలు, పరిపాలన నియంత్రణల గురించి రాసుకున్నాం. అదే విధంగా 244 (2), 275(4 ) అస్సాం, మేఘాలయ, త్రిపుర, రాష్ట్రాల ఆదివాసి ప్రజల పాలన నిబంధనల్లో గణనీయమైన మార్పులను ఈ ఉమ్మడి పౌరసత్వ చట్టం తీసుకొస్తుంది. ప్రత్యేక గిరిజన చట్టాలన్నీ కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. మన రాజ్యాంగంలోని మత స్వాతంత్య్రపు కార్యక్రమాల నిర్వహణ 26, 27, 28, ఆర్టికల్ 29, 30 విద్య, సంస్కృతలపై హక్కులపై వీటి ప్రభావం పరోక్ష ప్రభావం చూపుతాయి.
మన భారత దేశం పూర్తి సమాఖ్య కాదు, అదేవిధంగా పూర్తిగా సంఘం కాదు. పై రెండు లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇప్పటికి ఉన్న ఆ స్వభావం కాస్త ఉమ్మడి పౌరసత్వ కష్టం ద్వారా మరింత కుచించుకు పోతుంది. వ్యవసాయ, విద్యుత్ చట్టాల ద్వారా, ప్రత్యేక శాంతి భద్రతల చట్టాల ద్వారా ఇప్పటి కేంద్రం తన అజమాయిషినీ చాటుకుంది. రేపటి నుండి కుటుంబం వ్యవస్థలోని వివాహం, విడాకులు, ఆస్తుల పంపకం, వారసత్వం కూడా ఈ చట్టం ద్వారా రాష్టాల నుండి అధికారాలను గుంజుకుంటుంది. మన రాజ్యాంగం ద్వారా మనం సమానత్వం దిశగా సాధించాల్సిన లక్ష్యాలు పూర్తయ్యే క్రమంలోనే ఈ ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అంతిమంగా తీసుకరావవాలి. అప్పుడే ఈ చట్టం మనగలుగుతుంది, ఒకే మతంలోనే నిచ్చెన మెట్ల కులాలు ఉన్న చోట, ఆ అంతరాలను రద్దు చేయకుండా ఈ చట్టం తీసుకు రావడం కేవలం రాజకీయ పార్టీల ఎన్నికల అవసరాలు తీరుస్తుందేగాని ప్రజల అవసరం తీర్చదు. రాజ్యాంగంలోని అదేశిక సూత్రాలలో ఆర్టికల్ 38 నుంచి 51 వరకు ముందు సాధించాలి. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని మాత్రమే ముందుకు తీసుకురావటంలో అవసరం ఏమిటో ప్రజలు గుర్తించాలి. మిగతా అన్నీ వదిలేసి దీన్ని అమలు పరుస్తావనటంతో ప్రజలకు అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. ‘రాష్ట్రీయ స్వయం సేవక్’ ఆలోచనల అమలుకే కేంద్ర ప్రభుత్వం పూనుకుందని దీని వల్ల అర్థమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రాలుగాని, కేంద్ర పాలిత ప్రాంతాలుగాని ఈ చట్టం తీసుకు రమ్మని కోరడం లేదు. మరి దేనికి తీసుకొస్తున్నారు? బీజేపీ తన హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికే ఈ చట్టం తేవాలనుకుంటోందని స్పష్టం.