1992 డిసెంబరు 6న భారతదేశంలోని వారసత్వ ప్రదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈ దాడి రాజ్యమూ దాని బలగాల సమక్షంలో జరిగింది. రాముడి విగ్రహాలను బయటకు తీసి తాత్కాలిక ఆలయంలో ఉంచారు. ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. కానీ అందులో మరో రాముడి విగ్రహం ఉంటుంది.

లౌకిక  దేశానికి చెందిన ప్రధాని ఆలయ ప్రారంభోత్సవం పేరుతో భారత్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లోనూ ఆసక్తిని పెంచుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున దీపావళిని జరుపుకోవాలని, తమ నగరం లేదా గ్రామంలోని దేవాలయాలలో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘ్ పరివార్ సభ్యులందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర ఎజెండాను సమర్థించే సంఘ్-బిజెపికి రాముడి గుడి చాలా లాభదాయకమైన బేరం అయింది. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి ఆలయ ప్రారంభోత్సవం వరకు – బిజెపి ప్రతి దశలోనూ ఎన్నికల్లో లాభపడింది. నేరపూరితమైన మసీదు కూల్చివేత, ఆ తర్వాత జరిగిన హింసాకాండ, ఆపై ఆలయ ప్రారంభోత్సవం – ఈ కాలమంతా మత ప్రాతిపదికన సమాజ ధ్రువీకరణ మరింతగా బలపడింది

ఇతర చోట్ల కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. బాబా బుధన్‌గిరి సమాధి కర్ణాటకలో చర్చనీయాంశమైంది. సూఫీ సన్యాసుల పుణ్యక్షేత్రాల మాదిరిగానే, హిందువులు-ముస్లింలు ఇద్దరూ అక్కడ పూజలు చేసేవారు. 1990లో మతతత్వ శక్తులు ప్రచారాన్ని ప్రారంభించాయి. నిజానికి ఈ మందిరం హిందువుల పవిత్ర స్థలమని, దీనిని ముస్లింలు స్వాధీనం చేసుకున్నారని అన్నాయి. “ప్రభుత్వ రికార్డులలో ఈ స్థలాన్ని శ్రీ గురు దత్తాత్రేయ బాబా బుధన్ స్వామి దర్గా అని పిలుస్తారు…దీనిని బాబా బుధన్‌గిరి, దత్తాత్రేయ పీఠ్ అని కూడా పిలుస్తారు. 1964కి ముందు, హిందువులకి, ముస్లింలకి ఈ యాత్రా స్థలంపై విశ్వాసం వుండేది. ఆ దర్గా సూఫీ సంస్కృతికి, హిందూ- ఇస్లామిక్ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా వుండింది. రెండు మతాల ఈ తీర్థయాత్ర ఇప్పుడు హిందువుల-ముస్లింల మధ్య వివాదంగా మారింది. ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది కానీ ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో మొదటిసారి కర్ణాటకలో బిజెపి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధించింది. ఈ అంశం కర్నాటకలో ధృవీకరణకు శాశ్వత కారణంగా మారింది.

అదే తరహాలో హైదరాబాద్‌లోని చార్మినార్ గోడకు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని క్రమంగా విస్తరిస్తూ వివాదాలకు బీజం వేసేలా చేస్తున్నారు. ఆలయ విస్తరణ వల్ల చారిత్రక కట్టడమైన చార్మినార్‌కు నష్టం వాటిల్లుతోంది. ఇది భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్‌ఐ) నిబంధనలను కూడా ఉల్లంఘించడమే. ఆలయంలో మరమ్మతులు, మెరుగుదలలు చార్మినార్‌కు నష్టం కలిగించే అవకాశం ఉందని ఏఎస్‌ఐ నిరంతరం చెబుతోంది. అయితే ఏఎస్ఐ మాట వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. చార్మినార్‌కు నష్టం జరగడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో చారిత్రక చార్మినార్ ప్రాంతం, పాత హైదరాబాద్‌లో నివసించే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై కొన్నిచోట్ల గొడవలు కూడా జరిగాయి.

ఈ విషయంలో మహారాష్ట్ర కూడా వెనుకబడిలేదు. ముంబై సమీపంలోని హాజీ మలాంగ్ దర్గాపై వివాదం సృష్టించారు. ఈ దర్గాను హిందూ ప్రార్థనా స్థలంగా ప్రకటించడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉద్యమాన్ని పునఃప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ ఉద్యమాన్ని 1982లో షిండే రాజకీయ గురువు ఆనంద్ డిఘే ప్రారంభించాడు. ” గతంలో నాథ్ పంత్ పవిత్ర స్థలం ఉన్న స్థలంలో దర్గాను నిర్మించారని అంటూ 1980లలో శివసేన నాయకుడు డిఘే ఉద్యమం ప్రారంభించినప్పుడు మహారాష్ట్ర మిశ్రమ సంస్కృతికి చిహ్నమైన స్థలంపై మతపరమైన ఉద్రిక్తత చెలరేగింది.” ది ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ ప్రకారం, 700 సంవత్సరాల క్రితం మచ్చేంద్రనాథ్ ఆలయం అక్కడ ఉన్నది కాబట్టి  పుణ్యక్షేత్రం భూమి హిందువులకు చెందినదని కూడా డిఘే పేర్కొన్నాడు. ఉర్స్ రోజున శివసేన నాయకులు అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ అంశం కూడా కోర్టులో ఉంది.

ముంబైలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సెక్యులరిజం అండ్ సొసైటీ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. దర్గా ట్రస్ట్ ట్రస్టీ కాశీనాథ్ గోపాల్ కేత్కర్‌తో మాట్లాడింది. “ఇది నాథ్ మతానికి చెందిన దేవాలయమని నిరూపించడానికి వారి వద్ద డాక్యుమెంటరీ లేదా ఇతర ఆధారాలు లేవు. ఈ వివాదం కారణంగా, ఉర్స్ రోజున దర్గాకు వచ్చే ముస్లింల సంఖ్య తగ్గింది – కానీ వారు ఇతర రోజులలో, ఏడాది పొడవునా వస్తారు” అని కేత్కర్ అన్నారు. దర్గాకు కొత్త నామకరణం చేయడం గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు, “ఇది ఏ మాత్రం సరైనదని నేను అనుకోను, కానీ అలాంటి వాటిని ప్రోత్సహించడం చూసి బాధగా ఉంది. ఈ స్థలం ముస్లిం సూఫీలకు చెందినదనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వారి భక్తులు అన్ని దేశాలలో కనిపిస్తారు. “ఈ కొండ చుట్టూ ఉన్న 40 గ్రామాల ప్రజలకు ఈ దర్గాపై లోతైన విశ్వాసం వుండడం వల్ల దీనిని హాజీ మలంగ్ అని పిలుస్తూనే ఉంటారు. కానీ దురుద్దేశాలు వున్న వారు తమకు ప్రయోజనకరమైన విషయాలను మాత్రమే చెబుతారు. ఈ వంశపారంపర్య ధర్మకర్త “బాబా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తమమైన సేవను అందించడమే మా లక్ష్యం” కూడా అని అన్నాడు.

ఈ దర్గాను దృష్టిలో ఉంచుకుని భారతదేశ ఉమ్మడి సంస్కృతిపై తన డాక్టరల్ థీసిస్‌ను సమర్పించిన రీసెర్చ్ స్కాలర్ రామ శ్యామ్, ‘ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో (2024 జనవరి 8) గత 360 సంవత్సరాలుగా దర్గాతో అనుబంధం ఉందని రుజువు చేసే పత్రాలు కేత్కర్ కుటుంబం వద్ద ఉన్నాయని చెప్పారు. హాజీ మలాంగ్ దర్గా పర్వత పాదాల నుండి కొండపై ఉన్న అనేక పవిత్ర స్థలాలకు సంబంధించినంతవరకు, వాటి గురించిన కథలు మౌఖిక సంప్రదాయం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి అందించబడ్డాయి. బాబా మలంగ్ మదీనా నుండి ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. ఆంగ్లో-మరాఠా యుద్ధం (1774) కాలం నుండి ఈ దర్గా ప్రస్తావన ఉంది. 1882 నాటి థానే గెజిటీర్ మలంగ్ గర్ కొండపై బాబా మలంగ్ జాతరను నిర్వహిస్తున్నట్లు చెబుతోంది.

వారసత్వ ప్రదేశాలపై బలవంతంగా వివాదాలు సృష్టించడం, వాటిని ముస్లింలు స్వాధీనం చేసుకున్న హిందూ స్థలాలుగా ముద్రవేయడం, వాటిని ముస్లింల నుంచి లాక్కోవడమే మతతత్వ శక్తుల పాత టెక్నిక్.

భారతదేశంలో అన్ని మతాల వారు సందర్శించే అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. శబరిమల ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ముందుగా సెయింట్ సెబాస్టియన్ చర్చికి వెళ్లి ఆ తర్వాత బవార్ మసీదుకు వెళ్లడం ఆసక్తికరమైన విషయం. ఇది భారతదేశ ఉమ్మడి సంస్కృతి. ఈ సంస్కృతి భారతదేశంలో శతాబ్దాలుగా వర్ధిల్లుతోంది.

ఇప్పుడు మతోన్మాద జాతీయవాదం ఎంత భయానక రూపాన్ని సంతరించుకుంది అంటే ట్రాఫిక్ జామ్ సాకుతో సున్‌హరీబాగ్ మసీదును కూడా టార్గెట్ చేస్తున్నారు. అన్ని మతాల ప్రజలు వచ్చే అటువంటి పవిత్ర స్థలాలు భారతదేశ మత సంప్రదాయానికి ఆధారం. మతతత్వ రాజకీయాలు పెరిగిపోవడంతో దర్గాలపై దాడులు చేసి, సూఫీలపై దౌర్జన్యం చేస్తున్నారు. మతాల సామరస్య సంప్రదాయాన్నే చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరం.

One thought on “ఉమ్మడి వారసత్వ ప్రదేశాలు – మతపరమైన ఎజెండాలు

Leave a Reply