ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ముత్వెండి గ్రామంలో 2024 జనవరి 1న మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 6 నెలల పసికందు మృతి చెందిందని మూల్‌వాసి బచావో మంచ్ (బస్తర్) చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లోనే మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్‌ అంటుంటే, మావోయిస్టులతో ఎలాంటి ఎన్‌కౌంటర్‌ ఘటన జరగలేదని మృతి చెందిన చిన్నారి తండ్రి సోది ఆరోపించారు. ఓ హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన బిడ్డకు ఆహారం పెడుతున్న మస్సీ వడ్డెపై అడవి నుంచి వచ్చిన భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. బుల్లెట్ ఆమె చేతికి దూరి పసికందును చంపేసింది. సంఘటన జరిగిన సమయంలో మావోయిస్టులతో ఎలాంటి ఎన్‌కౌంటర్ జరగలేదని గ్రామస్థులు కూడా పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో మూడు కొత్త పారామిలటరీ క్యాంపులు కూడా ఏర్పాటయ్యాయని వారు నొక్కి చెప్పారు. ప్రజలు కార్పొరేట్ భూ కబ్జా నుండి రక్షించడానికి పోరాడుతున్నఆ మట్టిలోనే ఈరోజు, జనవరి 5వ తేదీన 6 నెలల పసికందును పాతిపెట్టారు. నక్సలైట్ల వ్యతిరేక కలాపాలలో జరిపే ఘాతుకాలకు రాజ్యం చేత ఎలాంటి శిక్షకు గురికామనే మత్తులో ఉన్న, తుపాకీ పేల్చి ఆనందం పొందే సెక్యూరిటీ సిబ్బంది పసికందును నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు.

2023 డిసెంబరు లో పైన పేర్కొన్న మూడు పారామిలటరీ శిబిరాలను పల్నార్, డుమ్రిపరల్నార్, కవాడ్‌గావ్‌లలో రాజ్యం ఏర్పాటు చేసిందని పేర్కొనడం యిక్కడ సముచితంగా వుంటుంది. గ్రామసభలనుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన  అనుమతి లేకుండా నిర్మిస్తున్న అనేక  పారామిలటరీ క్యాంపుల ద్వారా చేస్తున్న  ప్రబలమైన సైనికీకరణను స్థానికులు ప్రతిఘతించడంతో ఈ రకమైన బూటకపు ఎన్‌కౌంటర్లు, లైంగిక హింస, నక్సలైట్ అనే సాకుతో ఆదివాసీ రైతుల అరెస్టులు తీవ్రతరం అయ్యాయి. క్యాంపులు, పెద్ద రోడ్లు, బూటకపు ఎన్‌కౌంటర్లు మొదలైన వాటికి వ్యతిరేకంగా దాదాపు 35 ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మూల్‌వాసి బచావో మంచ్ అనే సంస్థ రాజ్య అణచివేతను ఎదుర్కొంటోంది. భూ ఆక్రమణ, జల్-జంగిల్-జమీన్ విధ్వంసానికి వ్యతిరేకంగా జరుగుతున్న వారి ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణిచివేసేందుకు నక్సలైట్‌లు అనే నెపంతో ఇటువంటి వివిధ ఉద్యమాలకు చెందిన పలువురు నాయకులను అరెస్టు చేశారు.

అదానీ-అంబానీ, విదేశీ కార్పొరేట్ల ఖజానాను నింపడానికి ప్రజల వనరులను మరింతగా కార్పొరేట్‌లు దోచుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి నేతృత్వంలోని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌లో భాగంగానే ఈ పారామిలటరీ క్యాంపుల ఏర్పాటు, భూ కబ్జాకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల నాయకత్వంపై సమన్వయంతో దాడులు చేయడం అనేది అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.

దేశంలోని ప్రజాస్వామిక శక్తుల చురుకైన సంఘీభావంతో పోరాడుతున్న ఈ ప్రాంతాల ప్రజలు ఖనిజ సంపన్న ప్రాంతాలలో పెరుగుతున్న సైనికీకరణను ప్రతిఘటించకపోతే, కార్పొరేట్ దోపిడీని ఎదుర్కోకపోతే, ఈ రైతు ఆదివాసీ వర్గాల విధ్వంసం మరింత హింసాత్మకంగా, క్రూరంగా కొనసాగుతుంది.

చివరగా, మావోయిస్టులతో  జరుగుతున్నాయని చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో కూడా, పసిపాపను మాత్రమే కాదు నిరాయుధ పౌరులను కూడా రాజ్యం  చంపడం ఏ మాత్రం  సమర్థనీయం కాదని మేము పునరుద్ఘాటిస్తున్నాము. నిరాయుధులైన స్థానికుల సమక్షంలో గెరిల్లాలపై సైనిక చర్యను ప్రారంభించడం  అంటే    పౌర జీవితాన్ని రాజ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తప్ప మరొకటి కాదు; వారి భద్రత చాలా ముఖ్యమైనదిగా ఉండాలి.

పసికందును చంపి, ఆమె తల్లిని గాయపరిచిన భద్రతా దళాల నీచమైన చర్యను ఖండిస్తున్నాం. ఈ ఘటనపై స్వతంత్ర విచారణను ఏర్పాటు చేయాలని, దీనికి బాధ్యులైన భద్రతా సిబ్బంది, కమాండర్‌లను కఠినంగా శిక్షించాలని పిలుపునిస్తున్నాం. ఈ అమానవీయ చర్యను నిర్ద్వంద్వంగా ఖండించాలని, ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను వ్యతిరేకించాలని మేము ప్రజాస్వామిక, న్యాయాన్ని, శాంతిని ప్రేమించే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

5 జనవరి 2023

Leave a Reply