తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.

కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు. కొన్నిటికి నాయకత్వం వహించారు. పర్యావరణ పరిరక్షణకు, ఓపెన్‌ కాస్ట్‌ విధానానికి వ్యతిరేకంగా పని చేశారు. రచయితల మీద, సామాజిక కార్యకర్తల మీద నిర్బంధానికి, ఫాసిస్టు అణచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రముఖ విప్లవ రచయితలు జిఎన్‌ సాయిబాబా యావజ్జీవ జైలు శిక్షకు, భీమాకొరేగావ్‌ కేసులో వరవరరావు అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా వరంగల్‌లో జరిగిన అన్ని నిరసన కార్యక్రమాల్లో రాజయ్య పాల్గొన్నారు. రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛను మొత్తంగా సమాజంలోని రాజకీయ స్వేచ్ఛలో భాగంగా గుర్తించి ఆందోళనల్లో పాల్గొన్నారు. విప్లవ రచయితల సంఘానికి సుదీర్ఘకాలంగా రాజయ్య సన్నిహిత మిత్రుడు. ప్రగతిశీల విప్లవ భావజాల ప్రచారానికి రచన చేయాలనే నిబద్ధతతో విప్లవ సాహిత్యోద్యమంతో కలిసి నడిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విరసం సభలు జరిగినా, ప్రజా సంఘాల ఆందోళనలు జరిగినా రాజయ్య తప్పని సరిగా పాల్గొనేవారు.  విప్లవ సాహిత్యం చదివి చర్చించేవారు. ఇటీవల జనవరి 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సభల్లో జరిగిన కవి గాయక సభలో కవిత్వం చదివారు.

వరంగల్‌లో జరిగే ప్రగతిశీల కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక, వాటి నిర్వహణకు కూడా రాజయ్య కృషి చేసేవారు. విప్లవోద్యమానికి, విప్లవ సాహిత్యోమానికి సన్నిహిత మిత్రుడైన రాజయ్య మృతికి విరసం నివాళి అర్పిస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది.

Leave a Reply