బీహార్‌లోని కైమూర్‌లో పులుల అభయారణ్యం  ఏర్పాటుచేయాలనే సాకుతో  ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ లో  ఆదివాసీ రైతుల భూమిలో చెట్లు నరికివేయడానికి, భూసేకరణకు, వ్యతిరేకంగా 2024 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 6 నెలల పసికందు హత్యకు వ్యతిరేకంగా 2024 జనవరి 10న, కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్‌ఎసిఎఎమ్), ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్ ఫ్యాకల్టీలో నిరసన సభను నిర్వహించింది. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కార్పొరేట్ దోపిడిని మరింత తీవ్రతరం చేయడం కోసం, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అనేక పారామిలిటరీ క్యాంపులను  ఏర్పాటు చేసి వేలాది బలగాలను మోహరించడం ద్వారా సైనికీకరణను మరింతగా పెంచిన ప్రభుత్వ ఆపరేషన్ సమాధానన్-ప్రహార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగ ప్రొఫెసర్లు డాక్టర్ జితేంద్ర మీనా, డాక్టర్ సరోజ్ గిరి, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రొఫెసర్  డాక్టర్ నందితా నారాయణ్ ప్రసంగించారు.

వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో బడా కార్పొరేట్లు మైనింగ్ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఆదివాసీలను వారి భూమి నుండి నిర్వాసితులను చేయడంపై డాక్టర్ జితేంద్ర మీనా మాట్లాడారు. హస్దేవ్ లో మానవ కార్యకలాపాలకు “నో-గో” జోన్‌గా ప్రకటితమైన అడవులు ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదానీ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రయోజనాల కోసం ఎలా నరికివేయబడుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణ కైమూర్‌లో పులుల అభయారణ్యం నిర్మించడం పేరుతో ప్రజలను తరలించడం, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ చట్టాలలో సవరణల ద్వారా ఆ చర్యను సమర్థించడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కైమూర్‌లోని 108 గ్రామాలకు, రాజస్థాన్‌లో, కుంభాల్‌ఘర్ ప్రాంతంలో 50 కంటే ఎక్కువ గ్రామాలకు, కరోలి, ధౌల్‌పూర్‌లో కూడా 50కి పైగా గ్రామాలను విడిచిపెట్టాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ ఆదివాసీ రైతులు ఎక్కడికి వెళతారు, వారి జీవితాలు ఏమైపోతాయి? ఎవరికీ తెలియదు. కానీ కైమూర్, హస్దియో, బస్తర్ లేదా రాజస్థాన్‌లో అయినా వారిని వారి భూముల నుండి తరలించే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

జియోనిస్ట్ ఇజ్రాయెల్ రాజ్యానికి వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనా ప్రజల పోరాటం, బస్తర్ దేశంలోని ఇతర ప్రాంతాలలో భూమి, వనరుల కోసం జరిగిన పోరాటంతో ఎలా ముడిపడి ఉందో డాక్టర్ సరోజ్ గిరి వివరించారు. భారతదేశంలోని ఆదివాసీ ప్రజలపై భారత రాజ్యం సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్‌లతో ప్రారంభించిన అప్రకటిత, నమోదుకాని యుద్ధం, ఇప్పుడు ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌గా తీవ్రరూపం దాల్చిందని ఆయన ఎత్తిచూపారు. సైనికీకరణ, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పోరాటం, వారి భూమితో ముడిపడి ఉన్న వారి ఉనికి కోసం పోరాటం. గతంలో గోంపాడ్, సర్కెగూడ, ఎడ్డెస్మెట్టలలో జరిగిన మారణకాండలకు బీజాపూర్‌లో 6 నెలల పసికందును భద్రతా బలగాలు హత్య చేయడం ఎలా భిన్నమైనదో వివరించారు. ఎడెస్మెట్ట, సర్కెగూడలో బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పారామిలటరీ సిబ్బందిని న్యాయ విచారణ నివేదికలు గుర్తించినప్పటికీ వారీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసారు.

సామ్రాజ్యవాదం వివిధ వ్యూహాత్మక ప్రాంతాలలో అవుట్‌పోస్ట్‌ లను ఏర్పాటు చేస్తున్నదని  మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ అటువంటి అవుట్‌పోస్ట్‌ల లో ఒకటి అని, సమస్య మూలాన్ని కనుగొనాలని డా. నందితా నారాయణ్అన్నారు.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ భారత రాజ్యానికి బస్తర్‌పై బాంబు దాడికి ఉపయోగించిన డ్రోన్‌లతో సహా ఆయుధాలను అందించిన జియోనిస్ట్  రాజ్యం పాత్రను ఎత్తి చూపిన ఆమె, భారతదేశం, ఇజ్రాయెల్‌ ల మధ్య ఈ సన్నిహిత సహకారం వెనుక, కార్పొరేట్ వనరుల దోపిడీ వెనుక సామ్రాజ్యవాద చోదక శక్తి ఎలా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ అనీ, మన దేశంలోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది అని అన్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా డాక్టర్ జిఎన్ సాయిబాబా నేతృత్వంలోని ప్రచారం గురించి ఆమె గుర్తుచేస్తూ, ఇది అతని నిర్బంధంలో పరాకాష్టకు చేరుకుంది, తద్వారా ఈ అప్రకటిత యుద్ధాన్ని ప్రశ్నించే ఏ స్వరాన్ని అయినా నిశ్శబ్దం చేసే రాజ్య ప్రయత్నాన్ని బహిర్గతం చేసింది అని అన్నారు.

ఎఫ్‌ఎసిఎఎమ్ సభ్య  సంఘాల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. ఏకపక్ష కాల్పుల్లో జరిగిన శిశువు హత్య, హస్దేవ్ విధ్వంసం, బీహార్‌లో కైమూర్ ముక్తి మోర్చా నేతృత్వంలోని నిర్వాసిత్వ వ్యతిరేక ఉద్యమ నాయకులపై రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా ఎఐఎస్‌ఎనుండి ఆదిత్య, బిఎస్‌సిఇఎమ్ నుండి ఉత్తర, డిఎస్‌యు నుండి సుజిత్, నజారియా పత్రిక నుండి వల్ మాట్లాడారు. ఆపరేషన్ సమాధానం-ప్రహార్‌ను నిలిపివేయాలని వారు ఏకీకృత పిలుపునిచ్చారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ మాదిరిగానే, ఆపరేషన్ సమాధాన్-ప్రహార్‌ను కూడా ఓడిస్తామని పునరుద్ఘాటించారు.

నిరసనకు ముగింపుగా వేదిక సభ్యుడు, సమన్వయకర్త ఎహ్త్మామ్ ఉల్ హక్ పెరుగుతున్న సైనికీకరణ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ మొదలైన గత 5 సంవత్సరాలలో 195 పారామిలటరీ క్యాంపులను ఏర్పాటు చేశార ని అన్నారు.  బీజాపూర్‌లో 6 నెలల పసికందును చంపడం 2023 డిసెంబర్‌లో సమీపంలోని పల్నార్, డుమ్రీ పరల్నార్, కవద్‌గావ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులకు సంబంధించిన ఘటన అని ఆయన ఎత్తి చూపారు.

Leave a Reply