సాహిత్యం ద్వారా సరికొత్త ప్రభావవంతమైన ఆలోచనల్ని పోగుచేసుకోవ‌డం ఇలాంటి  కథల ద్వారనే సాధ్యం అవుతుంది.
పాఠకులను ఎదురుగా కూర్చొబెట్టుకుని ఉపాధ్యాయుని మాదిరిగా అద్బుతమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా తీర్పులు, పంచాయతీలు, పరిష్కారాలు పాఠకుడికి అవసరం అనిపించడంలేదు. కథను చదువుతున్న పాఠకుడి మనో అంతరంగంలో ఒక చిన్న అలజడిని, అల్లకల్లోల్లాన్ని సృష్టించినా రచయిత లక్ష్యం నెరవేర్చినట్లుగానే భావించాలి. ఈ దృక్పథంలో పరిశీలించినపుడు పి. చిన్నయ్య గారి కథలు అదే బలమైన ప్రభావాలను పాఠకుడి మనుసుపై తనదైన ముద్రను వేయడంలో ‘ఊడలమర్రి’ కథలకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రచయిత, పాఠకుడికి ఏ మాత్రం విసుగు కల్పించకుండా వాక్యాల వెంట అలా అలా చేయి పట్టుకుని ముచ్చట చెప్పినట్లుగా నడిపించుకుంటూ ప్రజా సమూంలోకి తీసుకుని వెళ్తాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన పి. చిన్నయ్య కొన్నేళ్లుగా విరసం సభ్యునిగా క్రియాశీలకంగా   కథ రచయిత.  సుమారుగా ఇరవై ఎనిమిదేళ్లుగా విప్లవ సాహిత్య ఉద్యమంలో నడుస్తున్న చిన్నయ్య 2005లో “పైలం” పేరుతో పదమూడు కథల సంపుటిని ప్రచురించారు. మరో పదిహేనేళ్లుగా తాను రాసిన రెండో విడత కథల్ని చెప్పడానికి ‘ఊడలమర్రి’ కింద పదహారు కథలతో మనల్ని చదువుకోమని చెబుతున్నారు. పదిహేనేళ్ల కాలంలో జరిగిన సామాజిక, రాజకీయార్థిక పరిణామాలను పరిశీలించినట్లయితే తెలంగాణ సమాజంలో చిన్నభిన్నమైన మానవ జీవన విధ్వంసాన్ని మన కళ్ల ముందు దృశ్యరూపంగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ కథల్ని చదువుతున్న సందర్భంలో తెలంగాణ సమాజంలో విప్లవోద్యమాల స్ఫూర్తి ఏవిధంగా ప్రజల్ని చైతన్యం చేసిందనేది అంతరంగంలో రచయిత ఆవేదన కనిపిస్తుంది. పూర్వవు నల్గొండ జిల్లా, రాజధాని శివారు ప్రాంతాల నేపథ్యంలోని పరిస్థితులను, సామాజిక, రాజకీయ పరిణామాలను పాఠకుడి ముందు చర్చకు పెడుతాడు. కథకుడి దృక్పథాన్ని, అవగాహననీ, తాను నమ్ముకున్న విశ్వాసాలను ప్రతిభావంతంగా వ్యక్తీకరించిన కథలుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ సమాజంలో రుగుతున్న వనరుల విధ్వసం, ప్రాంతీయ, సామాజిక అసమానతలు, ప్లారోసిస్ సమస్య, కుల వివక్షత, కౌలు రైతు సమస్య తదితర వాస్తవికమైన ఇతివృత్తాలతో రాసిన కథలు కావడం వల్ల పాఠకులను ఆలోచనల్లో పడెస్తాయి. తన నిత్య జీవనయానంలో అనుభవంలోకి వచ్చిన సంఘటనల్లోని ప్రత్యేకతలను, విలక్షణతను ఎత్తిచూపడంలో కథలుగా సఫలమయ్యాయని భావించవచ్చు.


తన ఇంట్లో భార్య, అత్తమామలు, బామ్మర్ది,   బడిలో ఉపాధ్యాయులు ఎందుకు శత్రువులుగా కనిపిస్తున్నారో తెలియక మానసికంగా అంతరంగంలో ఘర్షణ పడుతున్న ఓ ఉపాధ్యాయుని ఆత్మగౌరవానికి చెందిన కథనే ‘మెట్టభూమోడు.. రెండో పంటకు నీళ్లొచ్చెటోనికి మూడో పంటకు నీరు కావాలి. ఒక పంటకు నీళ్లొచ్చెటోనికి రెండో పంటకు నీరు కావాలి. అసలె ఎపుడు నీళ్లురాని వాని సంగతి ఎంటని ? హిందీ టీచర్ సత్యం మనుసులో చెలరేగిన ఘర్షణ. వరిచేల గట్ల మీద పెరిగిన రెల్లిగడ్జిపూల వయ్యారాలను చూసి జొన్న చేల గట్ల మీద పూస్తున్న గునకపూలు ఆలోచనలు సత్యాన్ని తన ఊరివైపు ఆలోచనలు మళ్లించాయి. ‘బావా నీవెన్నన్నచెప్పు మీ ఏరియాలో బతకడం కష్టం, పోలీసులు, నక్సలైట్ల సంపుకోవటాలు, ఓ తాగే నీళ్లుండవు, అంతా ఫ్లోరైడు. పెండ్లి రోజు ఒక్కసారి మీ ఊర్ల ఉండేసరికి పాణం మీదకు వచ్చిందని బామ్మర్ది రమేష్ మాటలు ఆవేదనకు గరి చేస్తాయి. ఒకే జిల్లాలో ఉండే ఇరు ప్రాంతాల్లో ఉండే భౌగోళిక వైరుధ్యాలకు కారకులు ఎవరని ప్రశ్నిస్తాడు. కోదాడ, దేవరకొండ మధ్య ఉండే గునగుపూలకు, రెల్లుపూలకు మధ్య ఉండే అసమానతలు ఎపుడు పోతయని అక్రోశంతో నిలదీస్తాడు.


నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను చాలా దగ్గరి నుంచి చూసి, అనుభవం పొందిన కథకుడు మానవ సంబంధాలపై పడుతున్న ఘర్షణ ప్రభావాలను ఒక యువదంపతుల జీవితాన్ని ఇతివృత్తంగా నడిపిన కథ ‘జీవచ్ళవాలు”. ఫ్లోరోసిస్ సమస్య తీవ్రత రాజకీయ రూపం దాల్చినా కూడా పరిష్కారం లభించకపోవడం స్వార్ధరాజకీయాలే కారణం. నల్గొండ జిల్లాలోని కొన్ని ఊర్లలో యువకులకు పిల్లను ఇవ్వడానికే వెనకడుగు వేయాల్సిన దుస్థితిలో ఫ్లోరోసిస్ గ్రామాలు ఉన్నవి. కథ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కో పాత్రను ఫ్లోరోసిస్ ఏవిధంగా వెంటాడుతుందో పంచాయతీకి మూలమైన రమేష్స్ రేణుక దంపతుల నుంచి ఇరు గ్రామాల సర్పంచులు అవగాహన చేసుకుంటారు. రేణుక స్నేహితురాలు ప్రసూతి కావడంతో చూడటానికి వెళ్లిన తనకు పెద్దతల,కాళ్లు మాత్రమే ఉండి చేతులు లేని వింత శిశు వును చూసి భయం పట్టుకుంటుంది. రెండుసార్లు గర్భష్రావం అవుతుంది. ఇక ఆ ఊరులో ఉండనని మొండికేస్తుంది. తన సంసారాన్ని నిలుపుకోవడానికి పిల్లనిచ్చిన మామ ఊరులోనే బతకడానికి సిద్ధమవుతాడు రమేష్. ఉద్యమంలో పనిచేసే విప్లవకారుల మీద కూడా ఫ్లోరోసిస్ భయానకాన్ని వెల్లడిస్తాడు. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధిత ప్రజల పక్షాన నిలిచిన రచయితగా మనకు చిన్నయ్య కనిపిస్తాడు ఇక్కడ. సామాజిక న్యాయం కోసం ఒక వర్గం మరో వర్గాన్ని పీడిస్తే పీడితులకు అండగా నిలవాలి. ఒకే కులంలోని అదే కులపోడికి సమానమైన వాటాలివ్వడానికి సహించలేక అడ్డుపడుతున్న పీడక కులంలోని అంతర్గత ఆధిపత్యాలను ప్రశ్నించిన కథ ‘పంపకాలు’. సమానమైన పంపకాలు పొందే మరకు మన ప్రాంతం వాడయినా, మన కులపోడయినా పీడితులు తమ శత్రువు ఎవరో గుర్తించి కొట్లాడాల్సిందే. ఒక ప్రాంతం మీద మరొక ప్రాంత వలస పెట్టుబడిదారుల దోపిడిని వ్యతిరేకించినట్లుగానే స్వంతకులంలోని ఆధిపత్యాల మీద కూడా నిరంతరం సమరం చేస్తే తప్ప సమన్యాయం పొందలేమని సామాజిక ఉద్యమాల్లోని మిత్ర వైరుధ్యాలను చక్కగా చిత్రించారు.


తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ, బోనాలు, పీరీలు తెలంగాణ సాంస్పృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచాయి. అన్నికులాలు, మతాలు రాష్ట్ర సాధనకు ఉ మడిగా ఉద్యమించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సద్దుల బతుకమ్మరోజు శూద్రకులాలతో కలిసి బతకమ్మ ఆడబోయిన మాదిగ పద్మను ‘అంటరాని బతుకమ్మ’ చేసిన వైనం. రాజారెడ్డి విప్లవోద్యమంలో పనిచేసినపుడు తెలంగాణ ప్రాంతీయ సంస్కృతిని అధ్యయనం చేసి వివిధ జానపద కథల్లో దళితులకు ఏవిధంగా బతుకమ్మ తమకు ‘దూరమైపోయిందో చెబుతాడు. మరోఊరులో కూడా దళితుల బతుకమ్మకు జరిగిన అవమానాన్ని గౌస్మియా ద్వారా విన్న పద్మ మండిపడుతుంది. సమాజంలో సాంస్కృతిక చైతన్యం రాకుండా వ్యవస్థలో మార్పు సాధ్యం కాదని చెప్పిని అత్యుత్తమైన కథ. అంటరానికులాల సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని ప్రశ్నించిన కథ. సంప్రదాయాల ముసుగులో దళిత వర్గాల మీద జరుగుతున్న సాంస్కృతిక దాడిని తిప్పికొట్టనంతకాలం కొనసాగుతూనే వుంటుంది. ఆవు కన్న పంది గొప్పదని, పంది దేవుడి అవతారమని, దేవుళ్లు, బాపనోళ్లు అవు మాంసం తిన్నారని, రాముడు కూడ తిన్నడని స్కూలు పిల్లలకు పాఠం ‘స్టోరీ ఆఫ్ వరహ’ కథలో బహుజన దృక్పథం నేపథ్యంలో సాగుతుంది. మరోవైపు సంఘ్‌పరివార్ శక్తులు అసురులను జాతి ద్రోహులుగా ముద్ర వేస్తున్న తీరును కథకుడు బయటపెడుతాడు. ఉత్తమ పురుషలో చెప్పిన కథలో ఒక రకంగా రచయిత జీవితానుభవ నేపథ్యం కనిపిస్తుంది. కథలో వరహం ఉపకథను ప్రవేశపెట్టిన తీరు అద్భుతంగా వుంటుంది. సమాజంలో తప్పుడు చైతన్యం పీడిత అస్తిత్వాన్ని విస్మరించి పరాయి పీడక అస్తిత్వాన్ని ఏవిధంగా ఆశ్రయించి పీడితులు ఎంతగా నష్టపోతున్నారో తెలుపుతుంది.


విప్ల‌వోద్యమ ప్రభావాలు గ్రామాలు చైతన్య కేంద్రాలుగా నిలిచినవి. అట్టడుగు పీడితుకు అగ్రకుల, భూస్వాముల నుంచి ఎలాంటి అణచివేతకు గురైనా నాడు యువకులు నిలబడి ప్రశ్నించేవారు. మారిన పరిస్థితుల వల్ల సంఘటిత ఆలోచనకు దూరంగా అస్తిత్వశకలాలుగా మిగలిపోయారు. ఉద్యమం బలంగా ఉన్నకాలంలో కులాలకు అతీతంగా పెత్తందార్లకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమయ్యారు. శత్రువు పట్టణాలకు తరలిపోవడంతో కిందికులాల నుంచి పెత్తందార్లు అవతరించి ఆధిపత్యాలను సాగిస్తున్న తీరు వల్ల ‘ఆకాలం కోసం” చూడాకుండా విప్లవోద్యమం అందించిన జ్ఞానం వెలుగులో ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి నిరాశ, నిస్పృహలకు దూరంగా ఉండాలని పరువు హత్యలను చర్చించిన కథ. కరోనా కాలం అన్నిరంగాలను ప్రభావితం చేయడంతోపాటు మనుషుల మధ్య కనిపించని అంతరాలను, కులవివక్షతను బయటపెట్టిన ‘కానికాలం’. ప్రభుత్వ పాఠశాల విద్యలోని అట్టడుగు దళిత,గిరిజనుకు ఆన్‌లైన్ డిజిటల్ విద్య అందని ద్రాక్షగానే ఉంది. టీవీ పాఠాల కోసం పక్కింటికి వెళ్లిని ఎరుకల బాలరాజుకు, పాఠశాల హెచ్ఎం వద్ద సతీష్ సార్ కులవివక్ష గాయాన్ని చిత్రికపట్టాడు.


ఈ పుస్తకంలోని కథలకు ప్రధాన శీర్షికగా నిలిచిన ఊడలమర్రి’ నేటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పనిచేసిన యువకుల కలలు కల్లలుగా అవుతున్నవి. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లంతా తెలంగాణ పార్టీలో చేరి పెత్తనం చేస్తుంటారు. తారుమారైన పరిస్థితులను ఊడలమర్రి’ కింద కూర్చోని మాట్లాడుకుంటున్న సారమే నేటి తెలంగాణ రాజకీయ చిత్రం. ఉద్యమ వ్యతిరేకులంతా అధికార పక్షంలో చేరి గ్రామాల్లో పీడిత ‘ప్రజలవైపు నిలిచిన యువతను అణచివేతకు గురిచేస్తున్నారు. మావోయిస్టు ఎజెండానే అమలు చేస్తామన్న పాలకులు రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులను కాలరాస్తున్న పాలన తీరు తెలంగాణేతర పాలనకంటే ఏమీ భిన్నంగా లేదు. ఉద్యమ నిర్బంధంలో ముచ్చట్ల కేంద్రమైన ‘ఊడలమర్రి’ కింద చర్చోపచర్చలవుతున్న తీరును అద్భుతంగా చిత్రీకరించారు. సమ‌కాలీన తెలంగాణ యువత మానసిక సంఘర్షణను దృశ్యమానం చేసిన కథ. ప్రజాస్వామ్యంలోని ఎన్నికల రూసం, సారం విశేషాలను ఉస్మానియ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి నవీన్ క్షేత్ర పర్యటనలో *కొన్ని దృశ్యాల* నుంచి పొందిన అనుభవాల గాథ‌. పాలకులు మారిన పాలన విధానాల్లో మార్చురాకపోవడంతో అణచివేత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో కులం, మద్యం, డబ్బు, పోలీసుల అధికార దుర్వినియోగం వల్ల ప్రజాస్వామ్యం ఒక బూటకం, ఎన్నికల తంతు నాటకమనే వైచిత్రిని చూపుతాడు. సహజ వనరులు కాపాడుకోవాలని, స్థానిక అవసరాలమేరకు వినియోగించుకుంటేనే ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను తాము కాపాడుకోగలరని
విప్లవోద్యమం హెచ్చరిస్తుంది. ప్రజాప్రతినిధుల స్వార్ధం, నిర్లక్ష్యం వల్ల ఊరులో మంచినీళ్ల కరువు విలయతాండవం చేస్తున్న స్థితికి కారణం ‘అడిగేటోళ్లు లేకపోవడమే. కథకుడు చిన్నయ్య తాను నివసించే పరిసర గ్రామీణ ప్రాంతాల యధాతథ‌ స్థితిగతులను చక్కగా వర్ణించారు. మరో కథ ‘ఈత’ కూడా విప్లవోద్యమాలతో అనుబంధం ఉన్న ఉద్యోగుల జ్ఞాపకాలను, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని చక్కగా చర్చించారు.


ఒకప్పుడు పాడుబడి శిథిలావస్థకు చేరిన శివాలయం రంగురంగుల హంగు ఆర్భాటాలతో వెలిగిపోతోంది. కులానికో గుడి వెలుస్తూ ప్రజల్లో భక్తి వరదలై పారుతోంది. కానీ గ్రామీణ చీకటి బతుకుల్లో జ్ఞానదీపాలు వెలిగించి భక్తిని అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ‘కొడిగడుతున్న దీపాలు’గా శిధిలావస్థకు చేరుతున్న ధైన్యం కనిపిస్తుంది. భాషా సంస్కృతులు, ప్రాంతీయ అసమానతల ఉద్యమం అండతో అధికారం చేజిక్కించుకున్న పాలకులకు సోయిలేకుండా పోయిందని శేఖర్ ఆవేదన. అది అతని ఒక్కడిదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇపుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు రియల్ ఎస్టెట్ వ్యాపారం వల్ల సాగుభూమి దొరక్కపోవడమే కాదు, మట్టి నుంచి మల్లెపూల బువ్వను దీస్తున్న కౌలురైతుకు ప్రభుత్వ పథకాలు అందకుండాపోతున్న ‘సాగుదారు’ కష్టాలను చిత్రించారు. రియల్ ఎస్టెట్ వ్యాపారంతో పెరిగిపోతున్న కౌలురెట్లతో స్వంతసాగు భూమిలేని రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కళ్ల ముందుంచిన కథ. రైతు బంధు పథకం పట్టణాల్లో స్థిరపడ్డ రియల్ భూస్వాములకు అదనపు ఆర్థిక పరిపుష్టి అందిస్తూ, పద్మారెడ్డిలాంటి కౌలురైతులకు ఏ సాయం అందక అప్పులపాలవుతున్న పేదరైతు దీనగాథ.


మధ్యతరగతి కుటుంబం అదనపు మిగులును ఆన్ లైన్  స్టాక్ మార్కెట్ బిజినెస్‌లో  ఏవిధంగా నష్టపోయింది “దలాల్ స్ట్రీట్ చక్కగా చెప్పిన కథ. ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిగా చదివించే గుణం కలిగి వుంటుంది. స్టాక్ మార్కెట్ మాయాజాలాన్ని, బడా కంపెనీల దోపిడి వ్యూహ స్వభావాన్ని రవీంద‌ర్రెడ్డి, చంద్రయ్యసార్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మధ్యతరగతి కుటుంబం భూములు అమ్ముకోవడం ద్వారా లభించిన మిగులుతో అదనపు లాభాల మోజులో ఆన్‌లైన్  ట్రేడింగ్ మాయలో పడిపోతుంది. కుటుంబాన్ని, పిల్లల చదువులను చూసుకోలేనంత యాంత్రికంగా మారుతున్న జీవితాలను చిత్రించారు. ఇలాంటి కథను రాయడానికి రచయితలకు స్టాక్ మార్కెట్ వ్యవస్థపై విషయ అవగాహన చాలా అవసరం వుంటుంది. విస్తృత అధ్యయనం, అవగాహన చేసుకోవడం వల్లనే కథ విజయవంతంగా ముగించగలిగారు రచయిత. వేగంగా మారుతున్న ఆధునిక సాంకేతిక అభివృద్ధి సంప్రదాయ మానవ వనరుల శక్తిని ఏవిధంగా ధ్వంసం చేస్తుందో ‘నీలాంటోడు’ కథ చెబుతాడు. ముప్పయి ఏళ్లగా గుర్రపుటాంగా నడుపుతున్న మల్లయ్యకు గిరాకీ తగ్గినపుడు టాంగా మీద ఆశలు చల్లబడుతాయి. బతుకుదెరువు కోసం రకరకాల వృత్తుల్లోకి మారిన వెంకటచారిలాంటి వాళ్లను ప్రాణమున్న సంప్రదాయ మానవ వనరులు అర్థం చేసుకుంటాయి కానీ ఆటోలు, జీవులు మాత్రం ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తాయంటాడు.


గ్రామీణ ప్రాంతాల్లో రాజ్య నిర్బంధం నుంచి రక్షించుకోవడానికి వచ్చే యువకులకు పట్టణం ‘శివారులల్లా పడే కష్టాలను చిత్రిక పట్టిన కథ. గ్రామీణ జిల్లాలో విప్ల‌వోద్యమం బలహీనపడటంతో రాజకీయ చైతన్యం లోపించి వలసొచ్చిన సానుభూతిపరులకు పరిస్థితులు దినదిగండంగా మారుతాయి. ప్రత్యర్థుల నుంచి కాపాడుకోవడానికి ఫ్యాక్షనిస్టు నాయకులు గ్రామాలు వదిలి శివార్ల అద్దె ఇండ్లకు చేరుతరు. చాలీచాలని కూలీ బతుకుల ఆర్థిక ఇబ్బందులు, కిరాయిదారుల కష్టాలు. ఫ్యాక్షన్ నాయకుణ్ని ఓసారి పోలీసులు అరెస్టు చేస్తే మరుసటి రోజు వాళ్ల ఎమ్మెల్యే వచ్చి విడిపించుకునిపోతాడని ధీమా కలిగివుంటారు. ప్రభాకర్ సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. తమ్ముడి ఆచూకీ చెప్పాలని పోలీసులు వత్తిడి పెడతారు.


విరసం కథకుడిగా చిన్నయ్య చిత్రించిన కథలకు కేంద్రబిందువు సమకాలీన తెలంగాణ సమాజమే. పదహారు కథల్లో వాస్తవికమైన ప్రజల జీవితాలను కేంద్రంగా చేసుకొని రచించిన ఇతివృత్తాలకు సజీవత  ఉంది. మన చుట్టు సమాజంలో మన కళ్లకు కనిపించనీ, వినిపించనీ గుండె గొంతుకలోని ఆర్త‌నాదాలను వేయి క‌న్నులతో సూక్ష్మంగా పరిశీలించే స్వభావం కలిగిన రచయిత చిన్న‌య్య‌.  ఊడలమర్రి కథలు కేవలం కథలు మాత్రమే కాదు.   ప్ర‌జా వ్య‌తిరేక‌ పాలకులను నిలదీస్తాయి. ఈ కథల్లోని వస్తు వైవిద్యం, పాత్రల చిత్రణ పాఠకుడిని వెంటాడి ఆలోచింప చేస్తాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చదవి సామాజిక, రాజకీయ వైతన్యం పొందాల్సిన కథలు.

2 thoughts on “*ఊడలమర్రి*లో విధ్వంస మూలాలు

  1. *ప్రముఖ కథకులు పి.చెన్నయ్య గారి ఊడలమర్రి కథల పుస్తకం పై అధ్బుతమైన విశ్లేషణ మరియు సమీక్ష రాసిన కవి, రచయిత,జర్నలిస్ట్ మిత్రుడు కోడం కుమారస్వామి గారికి విప్లవాభినందనలు.*

    కోడం గారి సమీక్ష చదివి న వెంటనే కథకులు చెన్నయ్య గారితో మాట్లాడాలని, అంతేగాక ఆ పుస్తకం కొని చదవాలని అనిపించింది.
    సత్వరమే ఆ కథలు నేనూ తప్పకుండా చదువుతాను.
    జీవిత అనుభవాల నుండి రాసిన కథలని, వస్తువైవిధ్యం పాత్రల చిత్రణ అద్భుతంగా వుందంటూ,సమకాలీన తెలంగాణ సమాజంలో నెలకొనివున్న దయనీయ పరిస్థితులపై రాసిన కథల పుస్తకాన్ని పరిచయం చేసిన *కోకు* గారికి ధన్యవాదాలు.

    -మేడబోయిన లింగయ్య
    ZPHS టీచర్,
    రీసెర్చ్ స్కాలర్ ,UCE OU.

Leave a Reply