అనాదిగా మన పుర్రెల నిండా
నింపుకున్న నగ్నత్వం
వాడికిప్పుడొక అస్త్రం అయింది
ఆ తల్లుల దేహ మాన ప్రాణాలను
నగ్నంగా ఊరేగించి
భయపెట్ట చూస్తున్నాడు
వాడి వికృత చూపుల వెనక
దాగి వున్నది మణిపూర్
ఒక్కటేనా
కాదు కాదు కాదు
దండకారణ్యం నుండి
మలబారు వరకూ
దేశ శిఖరంపైనున్న కాశ్మీరు దాకా
ఎన్నెన్ని దేహాలను
మృత కళేబరాలను నగ్నంగా
ఊరేగించాడు వారి కాలికింద నేలలోని
మణుల కోసం గనుల కోసం
బుల్డోజర్తో ఊరేగుతూ
బరితెగించి పెళ్లగిస్తూ వస్తున్నాడు
వాడు నవ్వుతూనే వుంటున్నాడు
దేశం ఏడుస్తూ వున్నప్పుడు
దేహం రక్తమోడుతున్నప్పుడు
పసిపాపల దేహాలు
నలిపివేయబడుతున్నప్పుడు
స్రీత్వం వాడికో ఆయుధం
దానిని పిండుతూ నెత్తురుతో
ఈ దేశం ముఖంలో భయాన్ని ఒంపుతూ
ఏలుబడి చేయ చూస్తున్నాడు
భయాన్ని ఊరేగించి
ఈ దేశాన్ని వెయ్యేళ్ళ వెనక్కి
పరిగెత్తించ చూస్తున్నాడు
సత్యమేంటో ఇప్పుడు
నగ్నంగా అందరి కళ్ళలోకి
హృదయంలోకి చేరువయిన వేళ
పిడికిలి ఎత్తి పట్టాల్సిన సమయమిదే
తరిమి తరిమి కొట్టి
దేశ అభిమానాన్ని కాపాడాల్సిన సమయమిదే
Related